ఆన్‌లైన్‌లో అటవీ ఉత్పత్తుల వేలం
- తడోబా తరహాలో రాష్ట్రంలోనూ ఎకో టూరిజం: మంత్రి జోగు రామన్న
సాక్షి, హైదరాబాద్: నీలగిరి (యూకలిప్టస్), వెదురు చెట్లకు ఆన్‌లైన్ విధానంలో టెండర్లు ఆహ్వానించి వేలం వేయాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఆదేశించారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్ ఎఫ్‌డీసీ)పై మంగళవారం సచివాలయంలో అటవీశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 5,410 హెక్టార్లలో వున్న నీలగిరి చెట్ల వేలం ద్వారా రూ.150 కోట్లు ఆదాయం సమకూరే అవకాశం వుందని అధికారులు తెలిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ వాటా కింద రూ. 45 కోట్లు వచ్చినట్లు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఏపీ ఎఫ్‌డీసీ నుంచి మరో రూ.97.19 కోట్లు బకాయి రావాల్సి వుందన్నారు.
ఇందుకోసం ప్రయత్నించాలని అధికారులకు మంత్రి సూచించారు. తాను కూడా ఏపీ అటవీశాఖ మంత్రికి లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు. మహారాష్ట్రలోని తడోబా తరహాలో ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ పులుల అభయారణ్యంతోపాటు ఇతర అటవీ ప్రాంతాల్లో ఎకో టూరిజం (పర్యావరణ పర్యాటకం) అభివృద్ధి చే స్తామని మంత్రి అన్నారు. త్వరలో తడోబా ఎకో టూరిజం ప్రాంతాన్ని సందర్శించనున్నట్లు వెల్లడించారు.
అటవీ అభివృద్ధి సంస్థ, అటవీశాఖ సంయుక్తంగా హరితహారం కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ శివార్లలోని శామీర్‌పేట, వనస్థలిపురం, నారపల్లి డీర్‌పార్కుల్లోని ఎకో టూరిజం ప్రాజెక్టుల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. టీఎస్‌ఎఫ్‌డీసీలో ఖాళీగా వున్న 154 ఉద్యోగ ఖాళీల భర్తీకి తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి జోగు రామన్న ఆదేశించారు. సమావేశంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, పీసీసీఎఫ్, అటవీ అభివృద్ధి సంస్థ ఇన్‌చార్జ్ ఎండీ పీకే శర్మ, జీఎం జయానంద కుమార్ పాల్గొన్నారు.