Bamboo trees
-
వెదురు నుంచి జీవ ఇంధనాలు!
ఆధునిక యుగంలో ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల వినియోగం నానాటికీ పెరిగిపోతోంది. సరైన ప్రత్యామ్నాయ ఇంధనాలు విరివిగా అందుబాటులో లేకపోవడంతో పెట్రోల్, డీజిల్, బొగ్గు వంటి వాటిపై అనివార్యంగా ఆధారపడాల్సి వస్తోంది. వీటివల్ల వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయని, పర్యావరణానికి, భూగోళంపై మానవళి మనుగడకు ముప్పు ఏర్పడుతోందని తెలిసినప్పటికీ మరో దారిలేక ప్రమాదకరమైన ఇంధనాలపైనే అధికంగా ఆధారపడాల్సి వస్తోంది. మరోవైపు పునరుత్పాదక ఇంధనాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి ఆశించిన స్థాయిలో ఊపందుకోవడం లేదు. జల విద్యుత్ ఉత్పత్తికి కొన్ని పరిమితులున్నాయి. ఇలాంటి తరుణంలో హంగేరీలోని ‘హంగేరియన్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ సైన్సెస్’ పరిశోధకులు తీపి కబురు అందించారు. అడవుల్లో సహజసిద్ధంగా, విస్తృతంగా పెరిగే వెదురు(బ్యాంబూ)తో బయో ఇథనాల్, బయో గ్యాస్ వంటి జీవ ఇంధన ఉత్పత్తులు తయారు చేయవచ్చని తమ అధ్యయనంలో తేల్చారు. సమీప భవిష్యత్తులో పునరుత్పాదక ఇంధన రంగంలో వెదురు ఒక విప్లవమే సృష్టించబోతోందని చెబుతున్నారు. శిలాజ ఇంధనాలకు కాలుష్యానికి తావులేని ఇలాంటి ఇంధనాలే సరైన ప్రత్యామ్నాయం అవుతాయని అంటున్నారు. ఈ అధ్యయనం వివరాలను ‘జీసీబీ బయో ఎనర్జీ’ జర్నల్‌లో ప్రచురించారు. ► ఇతర చెట్లతో పోలిస్తే వెదురు చాలా వేగంగా పెరుగుతుంది. ఇదొక విలువైన సహజ వనరు. కాలుష్యాన్ని కట్టడి చేసే విషయంలో వెదురును ‘సూపర్ స్పాంజ్’గా పరిగణిస్తుంటారు. కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటుంది. వాతావరణంలోకి ప్రాణవాయువు(ఆక్సిజన్) ను అధికంగా విడుదల చేస్తుంది. ► ప్రమాదకరమైన గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాన్ని అరికట్టడంలో వెదురు పాత్ర చాలా కీలకం. భూమిపై వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. ► ప్రకృతిలో వెదురు ప్రాధాన్యతను గుర్తించిన పరిశోధకులు దాని నుంచి పునరుత్పాదక ఇంధనాల తయారీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ► కిణ్వ ప్రక్రియ(ఫెర్మెంటేషన్), అధిక ఉష్ణోగ్రతల వద్ద కుళ్లిపోయేలా చేయడం(పైరోలిసిస్)తోపాటు హైడ్రోథర్మల్ లిక్విఫాక్షన్, అనెయిరోబిక్ డైజేషన్ వంటి ప్రక్రియల ద్వారా ముడి వెదురు నుంచి బయో ఇథనాల్, బయోగ్యాస్ ఉత్పత్తి చేయవచ్చని కనిపెట్టారు. ► పరిశుద్ధమైన, స్థిరమైన ఇంధన వనరులను అందించగల సామర్థ్యం వెదురుకు ఉందని గుర్తించారు. ► కొన్ని జాతుల వెదురు నుంచి అధికంగా బయో ఇంధనం ఉత్పత్తి అవుతుందని చెబుతున్నారు. వేర్వేరు జాతులు వేర్వేరుగా రసాయన చర్య జరపడమే ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. ► వెదురులో సెల్యూలోజ్లు, హెమిసెల్యూలోజ్ లో అధిక మోతాదులో ఉంటాయి. వీటి నుంచి బయో ఇథనాల్, బయోగ్యాస్తోపాటు బయోచర్ అనే ఎరువు కూడా ఉత్పత్తి అవుతుంది. ► వెదురు నుంచి ప్రత్యామ్నాయ ఇంధనాలను తయారు చేసుకుంటే శిలాజ ఇంధనాలపై ఆధారపడాల్సిన అవసరం గణనీయంగా తగ్గిపోతుందని, తద్వారా కాలుష్యాన్ని, వాతావరణ మార్పులను నియంత్రించవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. వెదురు నుంచి జీవ ఇంధనాల ఉత్పత్తి ప్లాంట్లకు పెద్దగా పెట్టుబడి అవసరం లేదని చెబుతున్నారు. ఇది పూర్తిగా సురక్షితమైన ప్రక్రియ అని పేర్కొంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వెదురు.. పోషకాల సిరులు
సాక్షి, అమరావతి: పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదం చేసే వెదురు నిలువెల్లా పోషకాలతో మానవాళికి ఆరోగ్య సిరులనూ అందిస్తోందని పరిశోధనల్లో తేలింది. ఇతర వృక్ష జాతుల కంటే 35 శాతం అధికంగా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ఈ పచ్చ బంగారం దీర్ఘకాలిక రోగుల పాలిట ఆరోగ్య ప్రదాయినిగా మారుతోందని వెల్లడైంది. అరుదుగా దొరికే వెదురు బియ్యంతో పాటు టీ పౌడర్ వంటి ఉత్పత్తులు ఆన్లైన్ మార్కెట్లో అందుబాటులో ఉండగా.. ఇతర ఉత్పత్తులు అటవీ ప్రాంతాల్లో విరివిగా లభిస్తున్నాయి. 50 ఏళ్లకు వెదురు బియ్యం వెదురు మొక్కకు 50 ఏళ్లు నిండాక కంకులు వేసి (పుష్పించి).. వాటిలోంచి ధాన్యం మాదిరిగా వెదురు వడ్లు కాస్తాయి. వాటి నుంచి వెదురు బియ్యాన్ని సేకరిస్తారు. అంటే.. ఒక్కో వెదురు చెట్టు 50 ఏళ్ల వయసులో ఒకసారి మాత్రమే 1–2 కిలోల బియ్యం వరకు ఇస్తుంది. ఈ బియ్యంతో అన్నం, పాయసం, పొంగలి వంటి వంటకాలు చేసుకోవచ్చు. వీటిని వినియోగించడం వల్ల వెన్నునొప్పి, కీళ్ల నొప్పులతో పాటు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుందని అధ్యయనాల్లో వెల్లడైంది. వీటిలో తక్కువగా ఉండే గ్‌లెసైమిక్ ఇండెక్స్ మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అధికంగా ఉండే ఐరన్, ఫాస్ఫరస్ వంటి మూలకాలు గుండెకు మేలు చేస్తాయి. రక్తపోటును నియంత్రిస్తాయి. ఈ బియ్యంలో కాల్షియం, భాస్వరం, ఇనుము, వీటిలో మాంసకృత్తులు, విటమిన్ బీ–6, పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల్ని దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి. మన రాష్ట్రంలో బుట్టాయగూడెం, పోలవరం, అరకు, పాడేరు, సీలేరు, నల్లమల అటవీ ప్రాంతాల్లో వెదురు బియ్యం దొరుకుతుంటాయి. ఆదివాసీల నుంచి సేకరించే వెదురు బియ్యాన్ని ఆన్లైన్ ద్వారా ఈ–కామర్స్ సంస్థలు వినియోగదారులకు విక్రయిస్తున్నాయి. రెమ్మ రెమ్మకో రోగం దూరం వెదురు రెమ్మలు ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందాయి. వెదురు మొలకలు (వెదురు దుంప నుంచి మొలకెత్తేవి), రెమ్మలు, చిటారు కొమ్మన కనిపించే చిగుళ్లతో వివిధ వంటకాలను తయారు చేసుకోవచ్చు. వీటిని నేరుగానూ తినేయొచ్చు. ఇటీవల కాలంలో సూప్‌లలో వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. తాజా పిలకలు, చిగుళ్లతో ఊరగాయలు తయారు చేస్తున్నారు. వెదురు రెమ్మల్ని తింటే గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చని కార్డియాలజిస్టులు సైతం సిఫార్సు చేస్తున్నారు. వీటిలో క్యాన్సర్ నిరోధక, యాంటీ బయాటిక్, యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ధమనులను శుభ్రం చేయడం, చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో సహాయపడతాయి. వీటి పిలకలతో ఊబకాయం దూరం వెదురు పిలకలు, చిగుళ్లతో చేసిన వంటకాలను తినడం ద్వారా ఊబకాయానికి దూరంగా ఉండొచ్చని చెబుతున్నారు. వర్షకాలంలో ప్రతి మొక్కకు 4 నుంచి 10 పిలకల వరకు వస్తాయి. వెదురు పిలకలను ఉడికించి వంటల్లో ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో 2–3 రోజుల పాటు నానబెట్టి పచ్చడి చేస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో ఊరగాయగా వాడుతుంటారు. పిలకల్లో పిండి పదార్థాలు, ప్రోటీన్లతో పాటు కాపర్, ఐరన్, పాస్ఫరస్, పొటాషియం వంటి మూలకాలు, రిబోప్లేవిన్, విటిమిన్ ఏ, కే, ఈ, బీ–6 పుష్కలంగా ఉంటాయి. వీటిలో లభించే పైటోప్టెరాల్స్, పైటో న్యూట్రియంట్స్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెకు ఆరోగ్యాన్నిస్తాయి. వెదురు బియ్యం చాలా రుచి వెదురు బియ్యం చాలా అరుదుగా లభిస్తాయి. మా ఇంట్లో అప్పుడప్పుడూ ఈ బియ్యం వాడుతుంటాం. ఆన్లైన్ మార్కెట్లో లభిస్తున్నాయి. రుచికరంగా ఉంటాయి. మధుమేహ రోగులకు ఎంతో మేలు చేస్తాయి. మైదాన ప్రాంతాల్లో వెదురు విస్తరణను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నందున భవిష్యత్‌లో వెదురు ఉత్పత్తులు విరివిగా దొరికే అవకాశం ఉంది. – తమ్మినేని రాఘవేంద్ర, డైరెక్టర్, ఏపీ మేదరి కార్పొరేషన్ 20 హెక్టార్లలో వెదురు సాగు చేస్తున్నా నేను ఏజెన్సీ ప్రాంతంలో 20 హెక్టార్లలో వెదురు సాగు చేస్తున్నా. ఏజెన్సీ సంతల్లో వెదురు బియ్యం దొరుకు తాయి. వెదురు పిలకలు, చిగుళ్లు, రెమ్మలతో చేసే వంటకాలు చాలా రుచికరంగా ఉంటాయి. – నారాయణ, రైతు, పాడేరు వెదురు ఉప్పు.. బహుప్రియం సుమీ! వెదురు ఉప్పు కొరియాలో ఎక్కువగా వాడతారు. అందుకే దీన్ని కొరియన్ సాల్ట్ అని పిలుస్తారు. మూడేళ్ల వయసున్న వెదురును సేకరించి.. వాటిని సమానంగా కత్తిరించి.. అందులో సముద్రపు ఉప్పు నింపి బాగా కాలుస్తారు. ఈ క్రమంలో వెదురు నుంచి వెలువడిన ద్రవాలు ఉప్పుతో కలుస్తాయి. ఇలా తొమ్మిదిసార్లు చేస్తే ఉప్పు ఊదా రంగులోకి మారుతుంది. అందుకే దీన్ని ‘పర్పుల్ సాల్ట్’ అని కూడా పిలుస్తుంటారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన లవణాలలో ఇదొకటి. దీని ధర పావు కిలో రూ.8 వేలపై మాటే. వంటంతా అయ్యాక.. చివరగా ఫినిషింగ్ సాల్ట్‌గా వాడే వెదురు ఉప్పులో క్యాన్సర్‌ను నిరోధించే గుణాలూ ఉన్నాయంటారు. చర్మ, దంత సౌందర్యానికి ఉపకరిస్తుంది. వెదురు(లేత) కొమ్ములను పౌడర్ రూపంలో మార్చి వంటకాల్లో వాడుతుంటారు. -
Veduru Kanji: వెదురు కంజి.. టేస్టు అదుర్స్.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!
ప్రకృతి అందాల సమాహారం విశాఖ మన్యం. ఎన్నో వింతలు, విశేషాలతో పాటు గిరిజన సంప్రదాయం అందరికీ కట్టిపడేస్తుంది. అడవిలో లభించే ఆకుకూరలు, కాయలతో చేసే వంటకాలు నోరూరిస్తాయి. ఇదే కోవకు చెందుతుంది వెదురు కంజి. వెదురు నుంచి తీసిన చిగుళ్లను కూర వండుకొని తింటారు. ఈ కూర టేస్టే వేరు. - సాక్షి,పాడేరు/ముంచంగిపుట్టు వెదురు కొమ్ముల సీజన్ ఇది గిరిజన ప్రాంతాల్లో వెదురు కొమ్ముల సీజన్ ప్రారంభమైంది. వెదురు చెట్లకు మొదల్లో చిగుళ్లను గిరిజనులంతా వెదురు కొమ్ములుగా పిలుస్తుంటారు. ఈ చిగుళ్లను సేకరించి వాటిని మంచి శాఖాహార వంటగా గిరిజనులతో పాటు మైదాన ప్రాంత ప్రజలు కూడా అధికంగా తింటారు. వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో వెదురు చెట్ల మొదళ్లకు చిగుళ్లు వచ్చాయి. అడవులతో పాటు గిరిజనులు సొంతంగా వేసుకున్న వెదురు చెట్ల వద్ద ఈ చిగుళ్లను సేకరించి ఇళ్లకు తీసుకువస్తున్నారు. వేపుడు, ఇగురు కూరలుగా ఈ సీజన్లో దొరికే వెదురు కొమ్ముల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయని, అవి తినడం ద్వారా ఆరోగ్యానికి దోహదం చేస్తుందని గిరిజనుల నమ్మకం. ఈ వెదురు కొమ్ములను వేపుడు, ఇగురు కూరలుగా వండుకుని తింటారు. కొంత మంది ఈ చిగుళ్లను పొడవుగా కోసి ఉడకబెట్టిన తర్వాత బాగా ఆరబెట్టి వరుగులుగా తయారు చేసుకుంటారు. ఆ వరుగులను సుమారు ఆరు నెలల వరకు ఇళ్లల్లో దాచుకుని ఎప్పుడు తినాలనుకున్న వాటిని నానబెట్టి కూరలుగా వండుకుంటారు. వారపు సంతలు, మండల కేంద్రాల్లో ప్రస్తుతం వెదురు కొమ్ములను గిరిజనులు విక్రయిస్తున్నారు. రూ.20 నుంచి రూ.80 ధరతో వాటా అమ్ముడవుతోంది. పాడేరు డివిజన్‌తో పాటు రంపచోడవరం డివిజన్లోని మారెడుమిల్లి, చింతూరు, అడ్డతీగల, రాజవొమ్మంగి, వై.రామవరం ప్రాంతాల్లో ఈ సీజన్లో వెదురు కొమ్ములకు మంచి డిమాండ్ ఉంటుంది. అనంతగిరి, లంబసింగి, పాడేరు, సీలేరు, మారెడుమిల్లి, మోతుగూడెం ఘాట్ రోడ్ల వెంబడి కూడా వెదురు వనాలు అధికంగా ఉన్నాయి. పర్యాటకులు, పలు వర్గాల ప్రజలు కూడా వెదురు కొమ్ముల వంటకాలకు అలవాటుపడ్డారు. ఈ సీజన్లో కొనుగోలు చేస్తుంటారు. వెదురు కంజి- ఉపయోగాలు ఇవీ ►వెదురు కంజి కూర తయారు చేసే ముందు రెండు మూడు సార్లు బాగా కడగాలి. అప్పుడే వెదురు కంజిలో ఉండే చేదు పోతుంది. వెదురు కంజిని బాగా ఉడకబెట్టి దాని కషాయాన్ని తాగితే శరీరానికి తక్షణమే వేడి చేస్తుంది. ►సుగర్, కపం, మూల వ్యాధి నివారణకు ఆయుర్వేద పరంగా దీనిని వాడతారు. ►రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ►జీర్ణశక్తి పెంచుతుంది. ►కడుపులో నులి పురుగును తొలగిస్తుంది. ►గాయాలైనప్పుడు వెదురు కంజిని పేస్ట్‌గా చేసి గాయంపై రాస్తారు. ►మారుమూల గిరిజనులు పాము, తేలు కాటుకు ఔషధంగా సైతం వినియోగిస్తున్నారు. తక్షణమే వేడి చేస్తుంది వెదురు కొమ్ములను గర్భిణులకు ఎక్కువగా వండి పెడతాం. ఇందులో ఉన్న గుణాలు గర్భిణులకు ఎంతో మేలు చేస్తాయి. గిరిజన ప్రాంతంలో వాతావరణం చల్లగా ఉండడం వల్ల శరీరానికి వెంటనే వేడి చేసే గుణం ఇందులో ఉంది. వెదురు కొమ్ముల కూర కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది. ఈ నాలుగు నెలలు మాత్రమే వెదురు కొమ్ములు లభ్యమవుతాయి. – ఎస్.భాగ్యవతి, గృహిణి, నర్సిపుట్టు అమ్మకాలు బాగున్నాయి వారపు సంతల్లో వెదురు కొమ్ముల అమ్మకాలు బాగున్నాయి. కొమ్ముల వాటా రూ.50 చొప్పున విక్రయిస్తున్నాం. గతంలో గిరిజన ప్రాంతానికి చెందిన వారే కొనుగోలు చేసేవారు. ఇప్పుడు మైదాన ప్రాంతం నుంచి వచ్చి కూడా వెదురు కొమ్ములను కొనుగోలు చేస్తున్నారు. కొమ్ములను పచ్చిగా, ఉడక బెట్టి అమ్ముతున్నాం. శనివారం ముంచంగిపుట్టు వారపు సంతలో కొమ్ములు తెచ్చిన గంటల వ్యవధిలోనే అమ్ముడైపోయాయి. – కె.సుబ్బరావు, కూరగాయల వ్యాపారి, తల్లాబుతోట. చదవండి: Health Tips: ఖాళీ కడుపుతో ఇవి తింటే చాలా డేంజర్..! అవి కూడా అతిగా వద్దు! -
వెదురు.. రాబడికి ఉండదు బెదురు
సాక్షి, అమరావతి: వెదురు.. సహజసిద్ధమైన ప్రకృతి వనరు. పేదవాడి కలపగా, పచ్చబంగారంగా పిలుచుకునే సిరుల పంట. ఇతర మొక్కలతో పోలిస్తే 35 శాతం అధికంగా ఆక్సిజన్ ఉత్పత్తి చేయగలిగే సత్తా దీని సొంతం. ప్రస్తుతం అటవీ ప్రాంతానికే పరిమితమైన వెదురు పంటను మైదాన ప్రాంతాల్లోనూ సాగు చేయించే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 70 ఏళ్ల వరకు దిగుబడి వెదురు అన్ని నేలలకు అనువైనది. నీటి సౌకర్యం ఎక్కువగా ఉండాలి. ఒకసారి నాటితే 70 ఏళ్లపాటు నిరంతరాయంగా దిగుబడి లభిస్తుంది. 50 నుంచి 60 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. రకాలను బట్టి నాటిన మూడు, నాలుగేళ్ల నుంచి ఏటా 25–30 టన్నుల వరకు దిగుబడి ఇస్తుంది. తొలి ఏడాది ఎకరాకు రూ.60 వేల వరకు పెట్టుబడి అవసరం అవుతుంది. ఆ తర్వాత ఏటా ఎకరాకు రూ.10 వేల ఖర్చు చేస్తే చాలు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు ఆదాయం వస్తుంది. వెదురులో 140కు పైగా రకాలున్నప్పటికీ మన ప్రాంతానికి అనువైనవి, మార్కెట్లో డిమాండ్ ఉన్నవి 14 రకాలే. వెదురు సాగును ప్రోత్సహిస్తే భూమి సారవంతమవుతుంది. సాగులో ఎలాంటి రసాయనాలు ఉపయోగించాల్సిన అవసరం లేదు. లంక, బీడు భూములతో పాటు పొలం గట్లు, పండ్ల తోటల చుట్టూ కంచె రూపంలో సాగు చేస్తే పంటలకు రక్షణతో పాటు రాబడికి ఢోకా ఉండదు. యాక్షన్ ప్లాన్ ఇలా.. అటవీ శాఖ అధీనంలో ఉండే వెదురు మిషన్‌ను ప్రభుత్వం ఇటీవలే ఉద్యాన శాఖ పరిధిలోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీలో వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్, వ్యవసాయ, ఉద్యాన శాఖ కమిషనర్లు, అటవీ, పర్యావరణ, పరిశ్రమల విభాగాల కార్యదర్శులు, ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ సభ్యులుగా ఉంటారు. వెదురు కార్పొరేషన్ చైర్మన్, వెదురు సాగుచేసే రైతులను కమిటీలో ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. ఆర్బీకేల ద్వారా జిల్లాల వారీగా వెదురు సాగుకు అనువైన ప్రాంతాలను గుర్తించారు. కనీసం మూడేళ్ల పాటు సాగు విస్తరణను ప్రోత్సహిస్తారు. తొలి ఏడాది 500 హెక్టార్లు ఆత ర్వాత ఏటా 1,500 నుంచి 2వేల హెక్టార్ల చొప్పున విస్తరించాలని సంకల్పించారు. సబ్సిడీ ఇలా.. నాటిన తర్వాత ఒక్కో మొక్కకు మూడేళ్లపాటు రూ.240 వరకు ఖర్చవుతుంది. ప్రైవేటు భూముల్లో సాగు చేసే వారికి 50 శాతం, ప్రభుత్వ భూముల్లో నాటితే 100 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు. సబ్సిడీ మొత్తంలో తొలి ఏడాది 50 శాతం, రెండో ఏడాది 30 శాతం, మూడో ఏడాది 20 శాతం చొప్పున అందిస్తారు. పంట పొలాలు, పండ్ల తోటలు, ఆక్వా చెరువుల చుట్టూ కంచె రూపంలో వెదురు మొక్కలు వేసినా పరిగణనలోకి తీసుకుని నిర్దేశించిన సబ్సిడీని అందిస్తారు. రూ.7.5 లక్షలతో చిన్న నర్సరీలు, రూ.15 లక్షలతో పెద్ద నర్సరీలు ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి 40 శాతం సబ్సిడీ అందిస్తారు. ఇక ప్రాసెసింగ్ యూనిట్లకు 50 శాతం సబ్సిడీ ఇస్తారు. ఫర్నిచర్, వెదురు ఉప ఉత్పత్తులను అమ్ముకునే వారికి సైతం 50 శాతం సబ్సిడీతో చేయూత ఇస్తారు. ఇలా విత్తు నుంచి విక్రయం వరకు చేయూత అందించేలా రూ.10కోట్ల అంచనాతో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. జూలై నుంచి అమలుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎరువు అవసరం లేదు రెండేళ్ల క్రితం హోసూరు నుంచి టిష్యూకల్చర్ భీమ వెదురు మొక్కలు తెచ్చి పెదకూరపాడు మండలం గారపాడులోని రెండెకరాల్లో నాటాను. ఎరువు వేయలేదు. డ్రిప్‌తో నీరందిస్తున్నా. ప్రస్తుతం గెడలు 15 అడుగులు పెరిగాయి. మూడేళ్ల తర్వాత మంచి దిగుబడి వస్తుంది. – వి.వెంకటేశ్వర్లు, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా యాక్షన్ ప్లాన్ సిద్ధం రాష్ట్రంలో వెదురు సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. జూలై నుంచే అమలులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. లంక భూముల కోతను వెదురు సాగుతో కట్టడి చేయొచ్చు. – ఎంవీఎస్ నాగిరెడ్డి, వైస్ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్ -
Photo Feature: బొంగులో చికెన్ తెలుసు కానీ.. బొంగులో కల్లు పేరు విన్నారా?
ఇప్పటివరకు బొంగులో చికెన్ విన్నాం. కానీ బొంగులో కల్లు పేరు విన్నారా?! సాధారణంగా తాటిచెట్టుకు మట్టి కుండలు కట్టి కల్లు నిండాక కిందకు దించుతారు. కానీ ఇక్కడ మాత్రం ఒక్కో చెట్టుకు పదుల సంఖ్యలో వెదురు బొంగులు పెట్టారు. చెట్టు నుంచి వచ్చే కల్లు ఈ బొంగుల్లోకి చేరాక కిందకు దించుతారు. మట్టి కుండలతో పోలిస్తే వెదురు బొంగుల్లోని కల్లు రుచి విభిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామంలో ఇలా బొంగులు కట్టిన తాటి చెట్టు కనిపించింది. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఖమ్మం చదవండి👉 కరక్కాయ’ రిజర్వ్ ధర తగ్గింది! ∙ -
‘వెదురు’తో విద్యుత్! 50 ఏళ్లపాటు ఎకరాకు రూ.2 లక్షల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: అసలే కొన్నేళ్లుగా తీవ్రంగా బొగ్గు కొరత.. ధరలు కూడా చుక్కలను తాకుతూ విద్యుదుత్పత్తి వ్యయం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గుతోపాటు వెదురునూ కలిపి విద్యుదుత్పత్తి చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు రాష్ట్ర ఉద్యానశాఖ వినూత్న ప్రతిపాదనలను తెర పైకి తెచ్చింది. వెదురును నేరుగా కాకుండా పెల్లెట్ల రూపంలోకి మార్చి వినియోగిస్తారు. ఇప్పటికే చైనా, జర్మనీ, బ్రిటన్, అమెరికా సహా పలు దేశాల్లో వెదురు, బయోమాస్ పెల్లెట్లను థర్మల్ కేంద్రాల్లో ఇంధనంగా వినియోగిస్తున్నారు. మన దేశంలో తొలిసారిగా మన రాష్ట్రంలోనే దీనిని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. కేంద్రం ఆదేశాల నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో తొలి రెండేళ్లపాటు 5శాతం, ఆ తర్వాత 7 శాతం బయోమాస్ పెల్లెట్లను బొగ్గుతో కలిసి ఇంధనంగా వినియోగించాలని కేంద్రం ఇటీవలే అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో వెదురుతో పెల్లెట్లను రూపొందించి థర్మల్ కేంద్రాల్లో వినియోగించేందుకు ఉద్యానశాఖ రంగం సిద్ధం చేసింది. పైలెట్ ప్రాజెక్టు కింద భైంసా వద్ద 15 ఎకరాల్లో వెదురుసాగును చేపట్టింది. వెదురును పెల్లెట్స్‌గా మార్చే యంత్రాలనూ సిద్ధం చేసింది. కొంతమేర పెల్లెట్స్‌ను తయారుచేసి ఎన్టీపీసీకి పరిశీలన నిమిత్తం పంపించింది. మొత్తంగా రాష్ట్రంలో 2.80 లక్షల ఎకరాల్లో వెదురు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. 67 లక్షల టన్నుల పెల్లెట్స్ అవసరం.. రాష్ట్రంలో 8,703 మెగావాట్ల ఐదు జెన్కో ప్లాంట్లు, 1,200 మెగావాట్ల సింగరేణి ప్లాంట్, ఎన్టీపీసీకి చెందిన 4,200 మెగావాట్ల ప్లాంట్లు కలిపి మొత్తం 14,102 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి 870 కిలోల బొగ్గును వినియోగిస్తారు. కేంద్రం నిర్దేశించినట్టుగా ఏడు శాతం బయోమాస్ పెల్లెట్లు వినియోగించాలంటే.. రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తికి 67 లక్షల టన్నుల పెల్లెట్లు అవసరమని ఉద్యానశాఖ వర్గాలు తెలిపాయి. ఎకరానికి 30 టన్నుల వెదురు వస్తే.. దాని నుంచి 20 టన్నుల పెల్లెట్స్ వస్తాయని వెల్లడించాయి. ఎకరాకు రూ. 2 లక్షల ఆదాయం రాష్ట్రంలో సాధారణ వెదురు కాకుండా భీమా రకం వెదురుతో పెల్లెట్స్ తయారు చేయాలని నిర్ణయించారు. ఈ రకం వెదురు ఎలాంటి నేలల్లోనైనా, సరిగా నీళ్లు లేకున్నా పెరుగుతుందని.. దానిని రెండేళ్లలోనే నరికి పెల్లెట్స్ తయారు చేయవచ్చని ఉద్యానశాఖ వర్గాలు చెప్తున్నాయి. చేలల్లో, గట్లమీద, బీడు భూముల్లో ఎక్కడైనా వేయొచ్చని అంటున్నాయి. మొదట్లో ఎకరాకు రూ.50 వేలు ఖర్చు చేసి నాటితే.. తర్వాత దాదాపు 50 ఏళ్లపాటు ఏటా ఆదాయం వస్తుందని అంటున్నాయి. వేసిన రెండేళ్ల నుంచే ఏటా ఎకరాకు రూ.2 లక్షల ఆదాయం సమకూరుతుందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం హరితహారం కింద కోట్ల మొక్కలు నాటుతున్నారని.. ఆ స్థానంలో వెదురు వేస్తే అన్నివిధాలా ఉపయోగమని అంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని చెప్తున్నారు. భవిష్యత్తులో మరింత డిమాండ్.. ప్రస్తుతం ఏడు శాతం పెల్లెట్స్‌ను బొగ్గుతో కలిపి వినియోగించాలని కేంద్రం ఆదేశించినా.. 2030 నాటికి 20 శాతం కలపాలన్నది లక్ష్యమని అధికారులు చెప్తున్నారు. అంటే భవిష్యత్తులో వీటికి డిమాండ్ మరింతగా పెరుగుతుందని అంటున్నారు. పైగా వెదురు పెల్లెట్స్‌తో విద్యుత్ ధర కాస్త తగ్గుతుందని, కాలుష్యాన్నీ కొంత నివారించవచ్చని పేర్కొంటున్నారు. వెదురు చెట్లతో సాధారణ చెట్ల కంటే 33 శాతం మేర ఎక్కువ ఆక్సిజన్ వస్తుందని చెప్తున్నారు. రైతులకు అదనపు ఆదాయం దేశంలోనే మొదటిసారిగా వెదురు పెల్లెట్స్ పైలెట్ ప్రాజెక్టును చేపట్టాం. ఇప్పటికే పెల్లెట్స్‌ను తయారుచేసి ఎన్టీపీసీ పరిశీలనకు పంపాం. వెదురు సాగుతో రైతుకు నిర్వహణ భారం లేకుండా ఏటా ఎకరానికి రూ. 2 లక్షల దాకా అదనపు ఆదాయం సమకూరుతుంది. రాష్ట్రంలో భవిష్యత్తులో ఒకవైపు ఆయిల్‌పాం, మరోవైపు వెదురు సాగు చేపట్టేలా ప్రోత్సహిస్తాం. – వెంకట్రామ్రెడ్డి, ఉద్యానశాఖ సంచాలకుడు ఏమిటీ పెల్లెట్లు? వృక్ష, జంతు పదార్థాలనే బయో మాస్‌గా పరిగణిస్తారు. జంతువుల అవశేషాలు, చెట్లు, మొక్కల భాగాలు, పంట వ్యర్థాలు వంటివాటిని ఒక్కచోట చేర్చి ఎండబెడతారు. వాటన్నిం టిని పొడిచేసి.. మండే రసాయనాలు కలుపుతారు. తర్వాత అత్యంత వేడి, ఒత్తిడిని కలిగించే యంత్రాల సాయంతో స్థూపాకార (చిన్న గొట్టం వంటి) గుళికలుగా రూపొందిస్తారు. వాటినే బయోమాస్ పెల్లెట్స్ అంటారు. రకరకాల వ్యర్థాలతో రూపొందిన బయోమాస్ పెల్లెట్లను వివిధ ఇంధనాలుగా వినియోగించవచ్చు. అయితే రాష్ట్రంలో పూర్తి వెదురుతో పెల్లెట్లను తయారు చేయాలని ఉద్యాన శాఖ నిర్ణయించింది. -
వెదురులో విరిసిన బతుకులు
సుచిత్ర సిన్హా విశ్రాంత ఐఏఎస్ అధికారి. ఆమె ఉద్యోగ జీవితం ఆదివాసీల కుటుంబాల జీవనస్థాయిని మెరుగుపరచడం, సమాజంలో వారికి గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించడంలోనే మునిగిపోయింది. ‘గడచిన యాభై ఏళ్లుగా ఏ ప్రభుత్వ అధికారి కానీ మంత్రి కానీ ఇక్కడ అడుగుపెట్టిన దాఖలా లేదు’ అంటున్నారు బురుడీహ్ గ్రామస్థులు. బురిడీహ్ గ్రామం జార్ఖండ్ రాష్ట్రంలో రాజధాని జమ్షెడ్పూర్ నగరానికి అరవై కిలోమీటర్ల దూరాన ఉంది. బురుడీహ్తోపాటు చుట్టుపక్కల పాతిక గ్రామాల్లో ఆదివాసీ జాతులు... అవి కూడా అంతరించిపోవడానికి దగ్గరగా జాతులు నివసిస్తున్నాయి. అందులో శబర కూడా ఒకటి. భూమి ఉంది కానీ! అడవి మధ్యలో ఊరు. ఊరి చుట్టూ భూమి ఉంది. కానీ సాగు చేసుకోవడానికి అది సొంత భూమి కాదు. తలదాచుకోవడానికి పక్కా ఇల్లు లేదు. అడవి మీద ఆధారపడి బతుకు సాగించే జీవితాలవి. కాలదోషం పట్టిన మన అటవీచట్టాలు అడవిబిడ్డల జీవితాల మీద కొరడా ఝళిపిస్తున్నాయి. ఇల్లు కట్టుకోవాలంటే వాళ్లకు ఏకైక ఆధారం అడవే. అటవీ చట్టాల ప్రకారం ఆకలి తీర్చుకోవడానికి పండ్లు, కాయలనే కాదు... ఓ పూరిల్లు వేసుకోవడానికి అడవిలో చెట్టు నుంచి కలప కూడా సేకరించరాదు. అటవీ ఉద్యోగుల కళ్లు కప్పి కొమ్మలను నరికి పూరి పాక వేసుకోవడమే వాళ్లకు మిగిలిన మార్గం. అలాగే ఇల్లు కట్టుకుంటారు. దాంతో అటవీసంపదను దొంగలించిన నేరానికి అందరి మీద కేసులు నమోదై ఉంటాయి. అలాంటి జీవితాలను సుచిత్ర సిన్హా సమూలంగా మార్చేసింది. దశాబ్దాలు గడిచాయి కానీ! సుచిత్రా సిన్హా 1988లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పూర్తి చేసింది. ఆమె ఇదే ప్రాంతానికి చెందిన మహిళ కావడంతో చిన్నప్పటి నుంచి ఆదివాసీల జీవితాలను దగ్గరగా చూసిన అనుభవం ఆమెది. తీవ్రవాద కార్యకలాపాలు జరుగుతుంటాయనే అభిప్రాయంతో కూడిన ప్రాణభయంతో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అటువైపు చూసేవాళ్లు కాదు. ఆ నేపథ్యం నుంచి బయటకు వచ్చిన సుచిత్ర 1996లో జమ్షెడ్పూర్కి డిప్యూటీ కలెక్టర్‌గా వచ్చింది. ఆ రావడం ఆమె జీవన గమనాన్ని మార్చేసిందనే చెప్పాలి. ‘‘నేను చిన్నప్పుడు చూసిన పరిస్థితికి ఇక్కడికి అధికారిగా వచ్చిన నాటికి మధ్య రెండు దశాబ్దాలకు పైగా కాలం గడిచింది. కానీ ఏ మాత్రం మార్పు లేదు. పిల్లలు సరైన దుస్తులు లేకుండా, పోషకాహారం లోపంతో, పూరిళ్లలో బతుకీడుస్తున్నారు. ఆధునిక ప్రపంచంతో సంబంధం లేనట్లు వాళ్ల లోకంలో వాళ్లు జీవిస్తున్నారు. ప్రభుత్వంలో ట్రై బల్ స్కీమ్‌లున్నాయి, నిధులు సమృద్ధిగా ఉన్నాయి. వాటిని వాళ్ల దగ్గరకు చేర్చే ప్రయత్నం ఎవరూ చేయకపోవడంతోనే వాళ్ల జీవితాలు అలాగే ఉండిపోయాయి. అందుకే వాళ్ల కోసం ఏదైనా చేయాలనిపించింది. కొత్తగా ఏం నేర్పిద్దామన్నా, వాళ్లు ఒంటపట్టించుకునేటట్లు కనిపించలేదు. వాళ్లకు వచ్చిన పనినే మరింత మెరుగ్గా చేయడం నేర్పించడం, వాళ్లు తయారు చేసిన వస్తువులకు మార్కెట్ కల్పించడం మీద దృష్టి పెట్టాను. వెదురు వంద రకాలుగా ఆదివాసీలకు వెదురును కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెదురు బుట్టలు అల్లడం అందరికీ వచ్చి ఉంటుంది. వాళ్లకు మామూలు బుట్టలతోపాటు ల్యాంప్షేడ్లు, పెన్ హోల్డర్లు, బాస్కెట్లు చేయడం నేర్పించాం. ఢిల్లీ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ ప్రతినిధులను ఆదివాసీల గ్రామాల్లో పర్యటించమని కోరాను. వాళ్లు వచ్చి శబరులు తయారు చేస్తున్న వెదురు వస్తువులను కళాత్మకంగా చేయడంలో శిక్షణనిచ్చారు. మొత్తం కుటుంబాలు మూడు వందలకు పైగానే. ఒక్కో బృందంలో పదిమంది చొప్పున అందరినీ గ్రూప్‌లు చేశాం. ఒక్కొక్కరికి ఒక్కో కళాకృతుల తయారీలో శిక్షణ ఇచ్చాం. మొదటి నెల ఒకరి భాష మరొకరు అర్థం చేసుకోవడంలోనే గడిచిపోయింది. కానీ నేర్చుకోవడం మొదలు పెట్టిన తర్వాత చాలా త్వరగా నేర్చుకున్నారు. ఇప్పుడు శబర ఆదివాసీల చేతుల్లో నూటనాలుగు రకాల హస్తకళాకృతులు తయారవుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే... మోడరన్ హౌస్‌లో కొలువుదీరుతున్న అనేక కళాకృతులు ఆదివాసీల చేతుల్లో రూపుదిద్దుకున్నవే. వారి ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఢిల్లీలోని హస్తకళల ప్రదర్శన విక్రయకేంద్రం ‘ప్రగతి మైదాన్ ఢిల్లీ హట్’లో స్టాల్ ఏర్పాటు చేయించగలిగాను. ప్రతి ఒక్కరూ నెలకు ఏడెనిమిది వేలు సంపాదించుకుంటున్నారు. ఆదివాసీల కోసం 2002లో స్థాపించిన అంబాలిక ఎన్జీవో సేవలను మరింత విస్తరించి అంతర్జాతీయ వేదికల మీద కూడా ప్రదర్శించాం. బ్రిక్స్ సమావేశాలకు అవసరమైన ఫైల్ ఫోల్డర్లను తయారు చేసింది ఈ ఆదివాసీలేనంటే నమ్ముతారా? అప్పటి వరకు ముందుండి వాళ్లను నడిపించాను. ఇప్పుడు అన్నీ వాళ్లే నిర్వహించుకోగలుగుతున్నారు. నేను వెనక ఉండి వాళ్లు నడుస్తున్న తీరును చూస్తూ సంతోషిస్తున్నాను. సర్వీస్‌లో ఉండగా నాటిన మొక్క ఇది. నేను నాటిన మొక్క శాఖోపశాఖలుగా విస్తరించింది. నేను 2019లో రిటైర్ అయ్యాను. అడవిలో చెట్ల నీడన హాయిగా సాగాల్సిన వారి జీవితాలను చట్టాలు భయం నీడలోకి నెట్టేశాయి. పోలీసుకు ఫారెస్ట్ ఉద్యోగికి తేడా తెలియని అమాయకత్వంలో ఖాకీ డ్రస్ కనిపిస్తే వణికిపోతుండేవాళ్లు. చట్టాల కోరల్లో భయం నీడలో బతుకీడుస్తున్న వాళ్లు ఇప్పుడు ధైర్యంగా జీవిస్తున్నారు. నాగరక ప్రపంచం అంటేనే భయపడే స్థితి నుంచి నాగరికులకు తమ ఉత్పత్తులను వివరించి చెప్పగలుగుతున్నారు. వారిలో ఇనుమడించిన ఆత్మవిశ్వాసాన్ని కళ్లారా చూస్తున్నారు. చాలా సంతృప్తిగా ఉంది’’ అన్నారు విశ్రాంత ఐఏఎస్ అధికారి సుచిత్ర సిన్హా. -
ఆకుపచ్చ బంగారం.. బిలియన్ల వర్షం
World Bamboo Day 2021: ప్రకృతి సంపదలో పర్యావరణానికి మేలు చేయడంతో పాటు కోట్ల మందికి జీవనోపాధిని అందించేదిగా వెదురు చెట్లకు ఓ ప్రత్యేకత ఉంది. అంతేకాదు అంతర్జాతీయ మార్కెట్లో అది చేసే వ్యాపారం బిలియన్ల డాలర్లను కుమ్మరిస్తుంటుంది. అందుకే వెదురు గొప్పదనం గురించి చెప్పడానికి, వెదురు పెంపకంపై అవగాహన కల్పించే దిశగా ఒక రోజును కేటాయించారు. సెప్టెంబర్ 18న ప్రపంచ వెదురు దినోత్సవం. ►ప్రపంచ వెదురు(పెంపక-పరిరక్షణ నిర్వాహణ) సంస్థ.. ప్రతీ ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ► 2009లో బ్యాంకాక్‌లో జరిగిన వరల్డ్ బాంబూ కాంగ్రెస్‌లో ఈ డేను నిర్వహించాలని తీర్మానించారు. ► వెదురు పెంపకం, సంప్రదాయ పద్ధతుల్లో వాడకం గురించి, వెదురు వాడకం పెంపొందించేలా చర్యల గురించి.. అన్నింటికి మించి అర్థిక పురోగతికి వెదురు ఉత్పత్తులను ఎలా నిర్వహించుకోవాలో అనే విషయాలపై ఇవాళ ప్రధానంగా చర్చిస్తారు. ► అటవీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన ఆదాయ వనరు.. వెదురు ► గిరిజనుల జీవనంలో ఇదొక భాగం ► గిరిజనులకు జీవనోపాధిగానే కాకుండా.. వాళ్ల సంప్రదాయాల్లోనూ పవిత్రతను సంతరించుకుంది వెదురు. ► #plantbamboo.. ‘వెదురు నాటండి’ నినాదంతో ఈసారి Bomboo Day 2021ని నిర్వహిస్తున్నారు. ► చైనా, భారత్ లాంటి ఆసియా దేశాల్లో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు సాధించడంలో వెదురు గణనీయమైన పాత్ర పోషిస్తోంది. ► 65 శాతం సాగుదల ఆసియా ఖండాల్లోనే సాగుతోంది. అమెరికా(ద్వయం), ఆఫ్రికా ఖండాలు ఆ తర్వాతి ప్లేస్‌లో ఉన్నాయి. ► గ్లోబల్ బాంబూ మార్కెట్ విలువ 2019 నాటికి 72 బిలియన్ల డాలర్లుగా ఉంది. 2015 నాటికి అది 98 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది. ► చైనా ఈ విషయంలో 70 శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. వెదురు విస్తీర్ణంలో రెండో స్థానంలో ఉన్న భారత్ మాత్రం 4 శాతంతో సరిపెట్టుకుంది. ► వియత్నం, థాయ్‌లాండ, కాంబోడియాలు మార్కెట్ షేర్ మనకంటే ఎక్కువే. ► మన దగ్గర వెదురు విస్తీర్ణంగా పెరుగుతుంది. ఇంకా పెరిగే పరిస్థితులు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, స్పెషల్ బాంబూ ఎకనమిక్ జోన్లను ఏర్పాటు చేసి ఆర్థిక వృద్ధిని సాధించొచ్చు. ► వెదురు వ్యర్థాలతో అద్భుతం చేయొచ్చు. ఆ దిశగా ప్రభుత్వాలు, వ్యవసాయ శాఖ, జాతీయ వెదురు మిషన్లు ప్రయత్నిస్తే.. మన మార్కెట్ సైతం తారా స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయి. ► పోవాషియే కుటుంబానికి చెందిన వెదురులో.. 115 జాతులు, 1,400 ఉపజాతుల మొక్కలు ఉన్నాయి. ► కొన్ని జాతులు రోజుకి 30 సెంటీమీటర్ల చొప్పున పెరుగుతాయి. ఎటు నుంచి నరికినా.. వేగంగా పెరుగుతుంది కూడా. ► ఈశాన్య ప్రపంచంలో వెదురును పేదవాడి కలపగా చెప్తుంటారు. అంతేకాదు ఆకుపచ్చ బంగారంగా వెదురుకు పేరుంది ► ఆహారంతో పాటు కట్టడాలు, నిర్మాణ మెటీరియాల్‌గా, పేపర్, హస్తకళల్లోనూ వెదురును ఉపయోగిస్తారు ► వెదురు చెట్లను పెంపకానికి రసాయనాలు, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ఏవీ అక్కర్లేదు. వేస్ట్ ల్యాండ్‌లో సైతం పెరిగి.. పర్యావరణాన్ని కాపాడుతుంది వెదురు. అంతేకాదు అధిక వర్షలప్పుడు మట్టి కొట్టుకుపోకుండా అడ్డుకుని అడవుల క్షీణతను అడ్డుకుంటుంది ► పోషక విలువలు సైతం ఉంటాయి ► వెదురు ఆకులు పశుగ్రాసంగా ఉపయోగపడతాయి ► సిలికాను మందుల తయారీలో ఉపయోగిస్తారు ► వెదురు సామాన్లకు, ఫర్నీచర్‌కు, పరికరాలకు, షోకేజ్ వస్తువులకు గ్లోబల్ మార్కెట్లో ఫుల్ గిరాకీ ఉంది - సాక్షి, వెబ్‌డెస్క్ స్పెషల్ -
వెదురు కొమ్ముల కూర.. ఎర్రచీమల గుడ్లతో చేసే చారు!
బుట్టాయగూడెం/పశ్చిమ గోదావరి: భిన్నమైన సంసృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు గిరిపుత్రులు. ప్రకృతితో మమేకమై జీవిస్తూ ఆ అడవి నుంచే అన్నీ పొందుతుంటారు. అలాగే వారి ఆహారపు అలవాట్లు కూడా భిన్నంగా ఉంటాయి. అడవిలో దొరికే వాటితో వంటకాలు చేసుకుని ఆ రుచుల్ని ఆస్వాదిస్తుంటారు. తొలకరి అనంతరం కొండ కోనల్లో అడుగడుగునా కన్పించే వెదురు చెట్ల నుంచి మొలిచే కొమ్ముల్ని వండుకుని ఆనందిస్తుంటారు. అలాగే ఎర్రచీమల గుడ్లతో చేసే చారు ప్రత్యేకం. సంప్రదాయ వంటకం కొమ్ముల కూర ఎంతో రుచికరమైన వెదురు కొమ్ముల కూర అడవి పుత్రుల సంప్రదాయ వంట. మారుమూల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న కొండరెడ్డి గిరిజనులు ఎక్కువగా వండుకుని తింటారు. అడవిలో వెదురు మొక్కల పక్కన మొలకెత్తే లేత పిలకల్ని కొమ్ములుగా పిలుస్తారు. వర్షాకాలంలో గిరిజన మహిళలు అడవికి వెళ్లి వాటిని సేకరిస్తారు. వెదురు కొమ్ముల తొక్కలు తీసి సన్నగా తరగాలి. అనంతరం నీళ్లలో తరుగును ఉడకపెట్టాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ వేయాలి. ఉప్పు వేసి కొంతసేపు ఉడికించాక.. ఎండు మిరపకాయలతో తాలింపు పెట్టి కూరను సిద్ధం చేస్తారు. వెదురు కొమ్ముల కూరలో ఇంకా రుచి రావాలంటే అందులో చింతచిగురు లేదా గోంగూర వేస్తుంటారు. ఈ కొమ్ముల కూరలో కారం వేస్తే కూర చేదు వస్తుంది. వర్షాకాలంలో ప్రత్యేకం వర్షాకాలంలో కొమ్ములు దొరికినంత కాలం గిరిజనులు ఈ కూరే తింటారు. ప్రతి ఇంట గ్రామాల్లో వెదురు కొమ్ముల కూర ఘుమఘుమలు అదిరిపోతుంటాయి. జూన్‌లో తొలకరి వర్షాలతో వెదురు చెట్లు చిగురిస్తాయి. జూలై, ఆగస్టు నెలల్లో వెదురు కొమ్ములు దొరుకుతాయి. ఆ సమయంలో ప్రతి ఇంటా కొమ్ముల కూర ఉండాల్సిందే. వెదురు కొమ్ముల సేకరణ అంత సులువేం కాదు. వాటి కోసం గిరిజన మహిళలకు అనేక ఇబ్బందులు తప్పవు. వెదురు కూపులో పిలకలు (కొమ్ములు) కోసే సమయంలో పొదల్లో విష సర్పాలు ఎక్కువగా తిరుగుతుంటాయి. వెదురు ముళ్లు విపరీతంగా గుచ్చుకుంటాయి. అయినా వాటి కోసం వెదుకులాట మానరు. 1. వెదురులో రెండు రకాలు ఉన్నాయి. కొండ వెదురు, ములస వెదురు. 2. వీటిలో కొండ వెదురు కొమ్ములను గిరిజనులు ఎక్కువగా తింటారు. ►వెదురు కొమ్ముల కూర ఎంతో ఇష్టం కావడంతో కష్టమైనా జాగ్రత్తగా సేకరిస్తామని గిరిజన మహిళలు చెబుతున్నారు. గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నా.. అటవీప్రాంతానికి వెళ్ళి సేకరిస్తున్నారు. ఎన్నో ఏళ్లకు ఒకసారి దొరికే వెదురు బియ్యంతోనూ ప్రత్యేక వంటకాలు చేసుకుంటారు. ఎర్ర చీమలతో చారు... అడవుల్లో ఉండే పెద్ద పెద్ద చెట్లకు చీమలు గూళ్ళు ఏర్పాటు చేసుకుంటాయి. ఆ గూళ్ళను దులిపి దొరికే గుడ్లను నూరి ఆ చూర్ణంతో చారు కాసుకుంటారు. ఈ వర్షాకాలంలో ఈ చారు గిరిజనులు ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. ఇది మా సంప్రదాయ వంటకం అడవి వెదురు కొమ్ముల కూర ఎంతో రుచిగా ఉంటుంది. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయ వంటకం. కొమ్ముల కూరలో ఎండు చేపలు వేసుకుంటే చాలా బాగుంటుంది. చెట్లకు పట్టే ఎర్ర చీమల పుట్టను తెచ్చుకుని దాని గుడ్లతో చారుగా చేసుకుంటే చాలా బాగుంటుంది. – మాల్చి కోటంరెడ్డి, చింతలగూడెం, బుట్టాయగూడెం మండలం వెదురు కూరలో ఎన్నో పోషకాలు వానలు కురిసే సమయంలో ఎక్కువగా పప్పు కొమ్ముల కూరం తింటాం. దీనిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ కూర తినేవారు మంచి ఆరోగ్యం ఉంటారు. – మాల్చి పాపాయమ్మ, చింతలగూడెం, బుట్టాయగూడెం మండలం -
ఎదురు లేని వెదురు వనం!
చిరకాలంగా వర్థిల్లుతున్న సంప్రదాయ వెదురు క్షేత్రాలు అవి. వందా రెండొందలు కాదు.. ఏకంగా వెయ్యేళ్లుగా పుడమిపై పచ్చని సంతకంలా పరుచుకొని ఉన్నాయి. సుసంపన్నమైన దక్షిణ కొరియా సంప్రదాయ వ్యవసాయ వారసత్వానికి సజీవ సాక్ష్యాలు ఆ వెదురు క్షేత్రాలు. దామ్యంగ్ లోయ ప్రాంతంలో గ్రామాల మధ్య పచ్చగా అలరారుతున్న వెదురు వనాలే అక్కడి రైతులు, ప్రజానీకానికి జీవనాధారాలుగా నిలుస్తున్నాయి. అంతేకాదు, అతి శీతల గాలుల నుంచి తీవ్ర వడగాడ్పుల నుంచి పల్లెవాసులను పెట్టని కోటలై రక్షిస్తున్నాయి. వెదురు జీవవైవిధ్యం వెదురులో అనేక రకాలు ఉంటాయి. ముళ్లు లేని వెదురు రకాలు సాగుకు అనువుగా ఉంటాయి. ఒక్కో రకం వెదురు ఒక్కో పనికి అంటే.. కలపకు, కళాకృతులు, ఫర్నిచర్ తయారీ వంటి పనులకు ఉపయోగపడుతాయి. ఆ ప్రాంతంలోని ప్రతి గ్రామానికి చెందిన రైతులు తమ అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల వెదురు జాతులను సాగు చేస్తూ.. తమ జీవనోపాధి చూసుకుంటూనే వెదురు జీవైవిధ్యాన్ని పదిలంగా కాపాడుకుంటున్నారు. వెదురు తోటల చుట్టుపక్కల్లో వరి, క్యాబేజి, బఠాణీలు, ఇతర కూరగాయలు, స్ట్రాబెర్రీలు, ఆపిల్స్ వంటి పండ్లు సాగు చేస్తున్నారు. కొండవాలులో వెదురు తోపుల మధ్య విశిష్టమైన ‘జుక్రో’ రకం తేయాకు, కొన్ని రకాల అరుదైన ఔషధ మొక్కలను సాగు చేస్తున్నారు. సహజ నీటి చక్రం ఏడాది పొడవునా కొన్ని మీటర్ల ఎత్తున, కొన్ని కిలో మీటర్ల పరిధిలో పచ్చని గుమ్మటంలా పరచుకొని ఉండే వెదురు వనాలు విశిష్టమైన పర్యావరణ సేవలు అందిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి నిపుణులు గుర్తించారు. కనీసం రెండు కిలో మీటర్ల పరిధిలో ఏడాది పొడవునా ఇటువంటి దట్టమైన పచ్చదనం అలముకొని ఉంటే గణనీయమైన రీతిలో పర్యావరణ సేవలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సేవల వల్ల ఆ ప్రాంతంలో సహజ నీటి వనరుల లభ్యతకు కొదువ లేకుండా ఉంది. వెదురు చెట్ల వేరు వ్యవస్థకు మట్టిని, తద్వారా నీటిని పుష్కలంగా పట్టి ఉంచి నెమ్మదిగా విడుదల చేసే లక్షణం ఉండటం వల్ల పంటలకు నిరంతరం నీటి కొరత ఉండటం లేదు. దామ్యాంగ్ రైతులు తరతరాలుగా పర్యావరణ హితమైన సంప్రదాయ సాగు పద్ధతులను అనుసరిస్తున్నారు. పంటల సాగులో పశు వ్యర్థాలను తప్ప రసాయనాలు వేసిన దాఖలాలు లేవు. భూసార పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధచూపుతున్నారు. వెదురు పిలకలతో వంటకాలు వెదురు పిలకలు పోషక విలువలతో కూడిన చక్కని సంప్రదాయ ఆహారం. సేంద్రియ వెదురు పిలకలతో రుచికరమైన ప్రత్యేక వంటకాలను సందర్శకులకు వడ్డిస్తారు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి కొన్ని ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. అందులో ఒకటి.. వెదురు పిలకలతో ముఖ సౌందర్యాన్ని ఇనుమడింపజేసే ఫేస్ క్రీం తయారీ కూడా. వెదురును ఎన్నెన్ని రకాలుగా ఉపయోగించవచ్చో దామ్యంగ్ వాసులు ప్రపంచానికి చాటి చెబుతూ మంచి ఆదాయం పొందుతున్నారు. వ్యవసాయ పర్యాటకం ప్రకృతి మాత ఒడిలో సుందర దృశ్యంగా ఆవిష్కృతమైన వెదురు వనాలు చూపరులను మంత్రముగ్ధులను చేస్తాయి. అందువల్లనే దామ్యంగ్ వెదురు వనాలను చక్కటి ‘వ్యవసాయక పర్యాటక కేంద్రం’గా మలచిన తీరు ముచ్చటగొలుపుతుంది. బాంబూ ఫారెస్ట్‌లో రెండు కిలోమీటర్ల నడక, వెదురు ఉత్పత్తుల మ్యూజియం, థీమ్ పార్క్ పర్యాటకుల మనసులు దోచుకుంటున్నాయి. ప్రతి ఏటా జరిగే ‘దామ్యంగ్ బాంబూ ఫెస్టివల్’ పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తూ రైతులు, స్థానికులు, వెదురు ఉత్పత్తుల తయారీ కళాకారులకు కాసులు కురిపిస్తోంది. బొంగులతో బుట్టలు, వివిధ ఆకృతుల్లో వస్తువుల తయారు చేసి పర్యాటకులకు విక్రయించి మంచి ఆదాయం గడిస్తున్నారు. దామ్యంగ్ వెదురు రైతుల విశేష కృషికి ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) ఫిదా అయిపోయింది. ‘అంతర్జాతీయంగా ముఖ్యమైన వ్యవసాయ వారసత్వ వ్యవస్థ’ (జి.ఐ.ఎ.హెచ్.ఎస్.)గా దామ్యంగ్ వెదురు వనాలకు ఇటీవలే విశిష్ట గుర్తింపునిచ్చింది. దక్షిణ కొరియాలో ఈ గుర్తింపు పొందిన ఐదో ప్రాంతం దామ్యాంగ్. ఇప్పటి వరకు 22 దేశాల్లో 62 అబ్బుర పరిచే సంప్రదాయ వ్యవసాయ ప్రదేశాలకు ఎఫ్.ఎ.ఓ. ఇటువంటి విశిష్ట గుర్తింపును ప్రకటించింది. మొత్తానికి వెదురుతో ఆదాయం కోసం వనాలనే కాకుండా అమూల్యమైన ప్రకృతి వారసత్వ సంపదను కూడా అక్కడి రైతులు కలసికట్టుగా సృష్టించుకోవడం ప్రపంచం మెచ్చదగిన మంచి సంగతి. -
ఈ బాటిళ్లలో నీళ్లు ఎంతో చల్లన..
వేసవి కాలం వస్తోంది. ఈ కాలం తాగడానికి చల్లని నీళ్లు తప్పనిసరి అవసరం. రోజులో ఎక్కువ సేపు చల్లగా ఉండే బాటిళ్లు కొన్ని అందుబాటులోకి వచ్చేశాయి. అయితే, అవి బోలెడంత ఖరీదైనవి. పైగా వాటిలో ప్లాస్టిక్ బాటిళ్లే ఎక్కువ. పర్యావరణానికి హానికారకంగా ఉన్న ప్లాస్టిక్‌ను దూరం చేయాలంటే సహజసిద్ధమైన ఉత్పాదనల ద్వారా మన నిత్యావసరాలు తీరాలి. ఆ ఆలోచనలోంచి పుట్టిందే వెదురు బొంగుతో తయారు చేసిన నీళ్ల బాటిళ్లు. ‘జార్ నాయి బాన్హ్, తార్ నాయి ఖాహ్’ అని అస్సామీలో ఓ సామెత ఉంది. అంటే ‘వెదురు లేని వ్యక్తికి ధైర్యం లేదు’ అని దీనర్ధం. నిత్యం వెదురుతోనే దోస్తీ చేస్తూ ప్లాస్టిక్‌కు వీడ్కోలు పలికి ప్రకృతివైపు వెళ్లడానికి ఎక్కువ మందిని ప్రభావితం చేసిన వ్యక్తి దృతిమాన్ బోరా. అస్సాంలో వెదురు వస్తువుల తయారీ సంస్థ వ్యవస్థాపకుడు. వెదురు నుండి పర్యావరణ అనుకూల వస్తువులను తయారుచేస్తున్న బోరా ఈ బయో–డిగ్రేడబుల్ బాటిళ్లను నీళ్లు లీక్ కానివిధంగా తయారు చేశాడు. సీసా మూత కార్క్ అంటే వెదరుముక్కతో తయారుచేసి బిరడాలా బిగించడంతో ఇది నీళ్లను బయటకు రానివ్వదు. ఈ వెదురుబొంగు బాటిళ్లను పరిచయం చేయడానికి ధృతిమాన్‌కి 17 ఏళ్ళకు పైగానే పట్టింది. సుమారు 20 ఏళ్ల క్రితం ధృతిమాన్ బోరా పన్నెండవ తరగతితో చదువును ఆపేస్తానని తల్లిదండ్రికి ధైర్యంగా చెప్పేశాడు. జీవితంలో ఎలా నిలదొక్కుకుంటాడో అని భయపడిన తల్లి దండ్రులకు పై చదువులకు బదులుగా వెదురుతో రకరకాల ఫర్నీచర్‌ను తయారుచేసే వ్యాపారాన్ని ప్రారంభించి వారికి వెన్నుదన్నుగా నిలిచాడు. పెరటి తోట నుంచి స్ఫూర్తి అస్సాం ప్రధాన నగరమైన గౌహతికి ఈశాన్యంగా 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటి పెరటిలోనే వెదురు తోటలు ఉండేవి. వీటి నుంచే తన కలలకు వారధి కట్టుకున్నాడు బోరా. దృఢమైన, మన్నికైనా వెదురును కనుక్కొని డిబి ఇండస్ట్రీస్‌ను 20 ఏళ్ల వయసులోనే నెలకొల్పాడు. అతని సంస్థ ద్వారా వెదురు వస్తువులు విక్రయిస్తుంటాడు. కొనుగోలుదారులను తన ఉత్పత్తులవైపు ఆకర్షించడానికి ఏదైనా ప్రత్యేకమైన వస్తువును కనుక్కోవాలని నిర్ణయించుకున్నాడు. రకరకాల పనులు చేస్తూనే వెదురు నీటిబాటిల్ తయారీలో నిమగ్నమయ్యేవాడు. ఇప్పుడు ఏడాదిలోగా ఒక్క అస్సాంలోనే కాకుండా దేశంలోని చాలా ప్రాంతాల నుంచి వెదురు బాటిళ్లలో నీళ్లు తాగాలనుకునేవిధంగా ఇవి ఆకర్షించాయి. ఈ బాటిళ్లు వేర్వేరు పరిమాణాలలో రూ.400 నుంచి రూ.600 మధ్య లభిస్తున్నాయి. అవరోధాలను అధిగమిస్తూ.. ‘సహజమైన ఉత్పత్తి కావడంతో ఈ బాటిళ్లలో పోసిన నీళ్లు చల్లగా, శుభ్రంగా ఉంటాయి. ఇది గట్టిగా ఉండటంతో సులువుగా పగిలిపోదు. బొంగు కాబట్టి తేలికగానూ ఉంటుంది. దీనిని ఎక్కడికైనా తీసుకుపోవచ్చు’ అని చెబుతాడు బోరా. ‘మా సెంటర్లో పతి నెలా 1500 వరకు వెదురు బాటిళ్లను ఉత్పత్తిచేస్తాం. డిమాండ్‌కు తగ్గట్టు మిషనరీ తెప్పించుకోవడం, తయారు చేసిన సరుకును మార్కెట్‌కు చేర్చడం ఒక సవాల్..’ అంటాడు బోరా. బోరా వెదురు బాటిల్‌కు పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, ఈ బాటిళ్ల తయారీదారుల్లో కొంతమంది చైనీయులు ఉన్నారు. వీరు గ్లాస్, స్టీల్ క్యాప్స్‌తో ఉన్న బాటిల్స్ అమ్ముతున్నారు. అవి పూర్తిగా సేంద్రీయమైనవి కాదు. ఇవన్నింటి దృష్ట్యా బోరా బాటిల్స్‌కు పేటెంట్ రాలేదు. ప్లాస్టిక్ బాటిల్స్‌కు ప్రత్యామ్నాయం గురించి ఇప్పటికీ చాలా మందికి తెలియదు. అందువల్ల వారు ఎదుర్కొంటున్న అవరోధాలను అధిగమిస్తూ ఈ బాంబూ బాటిల్స్ ద్వారా ఒక అవగాహన కల్పించవచ్చు. – ఆరెన్నార్ -
‘వెదురు’ లేని అక్రమాలు
సాక్షి, రుద్రవరం(కర్నూలు) : నల్లమల అటవీ ప్రాంతంలో వెదురు సేకరణ ప్రక్రియ సెప్టెంబరులో మొదలయ్యింది. లాగింగ్ (కలప డిపో) సిబ్బంది రుద్రవరం, చెలిమ అటవీ రేంజ్ పరిధిలోని ఎనిమిది కూపుల్లో శ్యాంపిల్ ప్లాట్లు వేయించారు. ఆ నివేదికల ఆధారంగా నంద్యాలలో డీఎఫ్ఓ శివశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో టెండర్లు నిర్వహించారు. ఒక్కో కూపు నుంచి వెదురు సేకరణ, ట్రాన్స్‌పోర్టు (కలప డిపోకు తరలించడం), గ్రేడింగ్ అనే మూడు అంశాలకు సంబంధించి మొత్తం ఎనిమిది కూపులకు గాను 24 టెండర్లు చేపట్టారు. అయితే కాంట్రాక్టర్లు సిండికేట్‌గా మారి టెండర్లను ఏకపక్షంగా దక్కించుకున్నారు. వీరిలో ఎక్కువగా టీడీపీ మద్దతుదారులు ఉన్నారు. గత ఐదేళ్లూ వెదురు సేకరణలో అక్రమాలకు పాల్పడిన వీరు..ఈసారి కూడా రంగంలోకి దిగడం గమనార్హం. నిబంధనలు గాలికి.. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు కూలీలతో వెదురు సేకరించి డిపోలకు తరలించాలి. ఉదాహరణకు రుద్రవరం అటవీ రేంజ్ పరిధిలోని అహోబిలం కూపులో వెదురు సేకరణ టెండరును శంకర్ అనే కాంట్రాక్టర్ దక్కించుకున్నారు. నిబంధనల ప్రకారం ఆ కాంట్రాక్టరే సదరు కూపులో వెదురు సేకరించాలి. అక్కడ సేకరించిన వెదుర్లను చెన్నయ్య అనే రవాణా కాంట్రాక్టర్ తన వాహనంలో రుద్రవరం కలప డిపోకు తరలించాలి. ఈ రెండు పనులకు సంబంధించి ఒక్కో వెదురుపై ప్రభుత్వం రూ.5 చొప్పున చెల్లిస్తుంది. అయితే క్షేత్రస్థాయిలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. నేరుగా వ్యాపారులు ఎవరికి వారుగా కూలీలతో వెదుర్లను సేకరించుకుంటున్నారు. వెదురు గ్రేడింగ్‌ను బట్టి ఒక్కో దానిపై రూ.4.50 నుంచి రూ.11.50 వరకు కూలి చెల్లిస్తున్నారు. అనంతరం ఒక్కో వెదురుకు రూ.2 చొప్పున బాడుగ ఇచ్చి డిపోకు తరలిస్తున్నారు. అక్కడా కొంత సొమ్ము చెల్లించి గ్రేడింగ్ చేయించి లాట్లుగా పేర్చి వేలానికి సిద్ధం చేసుకుంటున్నారు. డివిజన్ పరిధిలోని అన్ని కూపుల్లోనూ ఇదేవిధంగా జరుగుతోంది. వాస్తవానికి ఇందులో ఓ మతలబు ఉంది. వెదురు సేకరణ, ట్రాన్స్‌పోర్టు, గ్రేడింగ్ కాంట్రాక్టర్లు...వెదుర్లను వేలం పాడే వ్యాపారులు అందరూ ఒక్కరే. రుద్రవరం కలప డిపో పరిధిలో పది మంది, గాజులపల్లి (చెలిమ అటవీ రేంజ్) డిపో పరిధిలో మరో పది మంది దాకా వ్యాపారులు సిండికేట్ అయ్యి గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. వెదురు సేకరణ, వేలం పాటల్లో అంతా తామై వ్యవహరిస్తూ భారీఎత్తున అక్రమాలకు ఒడిగడుతున్నారు. వీరికి అధికారుల సహకారం కూడా ఉంటోంది. కొత్త వారిని దరిదాపుల్లోకి రానివ్వడం లేదు. ప్రభుత్వం చెల్లిస్తున్న ధర కంటే అధికంగా కూలీలకు ఇస్తూ సొంతంగా వెదుర్లను సేకరించుకుంటున్నారంటేనే అక్రమాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. కనుమరుగవుతున్న వెదుర్లు వేలానికి ముందు అటవీ అధికారులు అడవిలోకి వెళ్లే కూలీలకు వెదురు నరకడంపై శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటిదేమీ ఇవ్వకపోవడంతో కూలీలు వెదుర్లను అడ్డదిడ్డంగా నరికి వేస్తున్నారు. ఒక పొద నుంచి వెదురు సేకరించాలంటే భూమికి అడుగు ఎత్తు ఉంచి నరకాలి. అలాగే ఆ పొదలో ముదురు వెదుర్లు కనీసం ఐదు మిగిల్చాలి. అలా ఉంచక పోవడంతో ఆ వెదురు పొద పట్టు కోల్పోయి కూలిపోతోంది. ఇలా అడవిలో ఎక్కడ చూసినా కూలిన వెదురుపొదలే దర్శనమిస్తున్నాయి. ఫలితంగా దినదినానికి వెదురు ఉత్పత్తి తరిగి పోతోంది. కొరవడిన అధికారుల పర్యవేక్షణ వెదురు వేలం మొదలుపెట్టే ముందు కలప డిపో అధికారులు శ్యాంపిల్ ప్లాట్లు మేస్త్రీలతో వేయించి నివేదికలను ఉన్నతాధికారులకు పంపిస్తున్నారు. టెండర్లు పూర్తయ్యి వెదురు సేకరణ ప్రారంభం కాగానే.. కూలీల వెంట ఉండి నిబంధనల మేరకు పనులు జరిగేలా చూడాల్సిన బాధ్యత కూడా వారిదే. కూపుల్లో వెదుర్లను సేకరించిన తర్వాత వాటిని వాహనంలోకి చేర్చే సమయంలో సదరు ఫారెస్టర్ వెదుర్ల సంఖ్యను లెక్కించి వాటికి అనుమతి పత్రం అక్కడే ఇవ్వాలి. అయితే వారు ఇళ్ల వద్ద ఉంటూ మేస్త్రీలను అడవికి పంపిస్తున్నారు. మేస్త్రీలు అడవి లోపలి నుంచి వాహనాలు బయటకు వచ్చే సమయానికి రోడ్లపైకి చేరుకుని.. కూలీలు చెప్పినన్ని వెదుర్లకు అనుమతి పత్రాలు ఇస్తున్నారు. -
కొమ్ముకూర భలే రుచి
పశ్చిమ గోదావరి, కొయ్యలగూడెం : వర్షాకాలం ప్రారంభం కావడంతోనే గిరిజనులు ఆతృతగా ఎదురుచూసే వంటకం కొమ్ములు (వెదురు) కూర. వెదురు పిడాల నుంచి మొలిచే గెడల చివరి భాగాన్ని కోసి చిన్న ముక్కలుగా తరిగి వెదురు వంటకం తయారు చేస్తారు. ప్రస్తుతం ఏ గిరిజన గ్రామాల్లో చూసినా ప్రతి ఇంటా కొమ్ములు కూర వండుతుంటారు. ముక్కలుగా తరిగిన వెదురుకు శాఖాహారంగా, మాంసంతో కలిపి వండుతారు. అడవుల్లోకి వంట చెరకు కోసం వెళ్లే మహిళలు వస్తూ తప్పనిసరిగా వెదురు కొమ్ములను వెంట తెచ్చుకుంటారు. తంగెళ్లగూడెం, బిల్లిమిల్లి, వంకాబొతప్పగూడెం, కిచ్చప్పగూడెం, మర్రి గూడెం గ్రామాల్లోని మహిళలు ప్రస్తుతం కొమ్ము కూరల వంటకంపైనే దృష్టిసారిస్తున్నారు. రుచిగా ఉండే కొమ్ము కూర శరీరంలోని కొవ్వును వేగంగా తగ్గిస్తుందని వంకా బొతప్పగూడెం మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ పేర్కొన్నారు. కేవలం వర్షాకాలం మూడు నెలల్లో ఇవి విరివిగా లభిస్తాయని తెలిపారు. ఆవు కొమ్ములు మాదిరిగా అడుగున్నర పొడవున వెదురు పిడాల్లో ఇవి మొలుస్తుంటాయని ఆయన చెప్పారు. -
వెదురు మిషన్‌కు రూ.1,290 కోట్లు
న్యూఢిల్లీ: రెండేళ్ల పాటు అమలు చేయనున్న పునర్వ్యవస్థీకృత జాతీయ వెదురు మిషన్(ఎన్‌బీఎం)కు కేంద్ర కేబినెట్ బుధవారం పచ్చజెండా ఊపింది. ఈ పథకానికి రూ.1,290 కోట్లు కేటాయించారు. ఇందులో కేంద్రమే రూ.950 కోట్లు భరిస్తుంది. ఈశాన్య రాష్ట్రాలు, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, గుజరాత్, బిహార్, జార్ఖండ్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో వెదురు చెట్ల పెంపకానికి ఇది ప్రోత్సాహకంగా నిలుస్తుందని భావిస్తున్నారు.ముడి జనపనార కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.200 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో క్వింటాల్ ముడి జనపనార ధర రూ.3,700కు చేరింది. ► ఔషధ మొక్కల పెంపకంలో సహకారానికి ఆఫ్రికా దేశం సావో టోమ్‌తో కుదిరిన అవగాహన ఒప్పందానికి పచ్చజెండా. ► రాజస్తాన్‌లో గిరిజన ప్రాబల్య జిల్లాలను రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్లో చేర్చారు. -
వెదురు.. చెట్టు కాదు గడ్డే!
అటవీయేతర ప్రాంతాల్లో గిరిజనులు వెదురును అమ్ముకునేందుకు వీలుగా పార్లమెంట్ 1926 నాటి అటవీ చట్టాన్ని సవరిస్తూ బిల్లును ఆమోదించింది. రిజర్వ్ ఫారెస్టు మినహా మిగిలిన చోట్ల వెదురును చెట్టుగా పిలవరాదని పేర్కొంది. దానిని గడ్డిగానే పరిగణించాలి. రిజర్వ్ ఫారెస్టులో చెట్టుగా వెదురును పిలవాలని దానిలో తెలిపింది. తాజా సవరణ ప్రకారం గిరిజనులు లేదా మైదాన ప్రాంతంలో వెదురును పెంచుకుని విక్రయించుకోవచ్చు. లాభాలను ఆర్జించవచ్చు. కొయ్యూరు (పాడేరు) : మహారాష్ట్రలో మాదిరిగా రాష్ట్రంలో కూడా వెదురును నేరుగా గిరిజనులు అమ్ముకునేందుకు వీలుగా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం 2011లో అనుమతి ఇచ్చింది. అప్పట్లో ఆయన నాతవరం మండలంలో దానిని ప్రారంభించారు. తరువాత అది అలానే ఉండిపోయింది తప్ప గిరిజనులకు వెదురుపై అధికారం రాలేదు. గిరిజనుల నుంచి మావోయిస్టులను వేరు చేయాలన్న లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. అయితే తరువాత గిరిజనులకు ఎలాంటి హక్కులు ఇవ్వలేదు. తాజాగా కేంద్రం వెదురును అటవీయేతర ప్రాంతాల్లో కూడా అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చింది. దీని మూలంగా కొన్నిచోట్ల గిరిజనులు నేరుగా వెదురును అమ్ముకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. జిల్లాకు సంబంధించి నర్సీపట్నం అటవీ డివిజన్‌లోనే ఎక్కువగా వెదురు కూపీలున్నాయి. వాటి నుంచి యేడాదికి 40–50 లక్షల వెదుర్లను తీస్తారు. మన్యం వెదురుపై హక్కుకు నోచని గిరిజనం ప్రభుత్వం 2011లో ఇచ్చిన సడలింపు ప్రకారం గిరిజన మహిళలు గ్రూపులుగా ఏర్పడి వెదురును నరికి వ్యాపారులకు విక్రయించవచ్చు. అలా విక్రయించగా వచ్చిన ఆదాయాన్ని పంచుకోవాలి. దీని మూలంగా గిరిజనుల ఆదాయం పెరిగి మావోయిస్టులకు దూరంగా ఉంటారని నాడు భావించారు. కానీ అది నేటికీ కార్యరూపం దాల్చలేదు. నర్సీపట్నం అటవీ డివిజన్లో వెదురు ద్వారా అటవీ శాఖ యేడాదికి రూ.రెండు నుంచి రెండున్నర కోట్ల ఆదాయాన్ని అర్జిస్తుంది. మొత్తం వెదురు ఉత్పత్తిలో అటవీ శాఖ తీస్తున్నది 40 శాతం మాత్రమే. మిగిలినదంతా తీసేందుకు వీలు లేక వదిలిపెడుతున్నారు. అదంతా వృథా అవుతుంది. కొండలపై నుంచి వెదురును తీసుకురావడం కూడా కష్టంగా మారింది. వెదురు సైజ్‌ను అనుసరించి అటవీ శాఖ గిరిజనులకు కూలి చెల్లిస్తుంది. తరువాత దానిని రవాణా చేసి నిల్వ కేంద్రాల వద్ద ఉంచుతుంది. నెలకు ఒకసారి వ్యాపారులకు వేలం నిర్వహిస్తుంది. ప్రస్తుతానికి వెదురును ఎక్కడ నుంచి తీసుకువచ్చినా దానిని అటవీ శాఖ పట్టుకుంటుంది. తాజాగా పార్లమెంట్ సవరించిన 1926 నాటి చట్టం çప్రకారం గిరిజనులు లేదా మైదాన ప్రాంతంలో వెదురును పెంచుకుని విక్రయించుకోవచ్చు. లాభాలను ఆర్జించవచ్చు. రూ.60–75 మధ్యలో వెదురు ఒకప్పుడు రాజమండ్రి పేపర్మిల్లుకు మన్యంలో వెదురును సరఫరా చేసేవారు. అయితే మైదాన ప్రాంతంలో సుబాబుల్ పెంపకంతో పేపర్‌మిల్లు వెదురును వదిలిపెట్టింది. నాటి నుంచి అటవీ శాఖ వ్యాపారులకు వేలంలో విక్రయిస్తుంది. ప్రస్తుతం ఒక్కో వెదురు ధర రూ.60–75 మధ్య పలుకుతుంది. ఎక్కువగా హైదరాబాద్‌కు చెందిన వ్యాపారులు వేలంలో పాల్గొని వీటిని కొనుగోలు చేస్తున్నారు. వెదురుతో అందమైన వస్తువులను తయారు చేసి విక్రయిస్తున్నారు. మర్రిపాకల రేంజ్‌కు సంబంధించి వై రామవరం మండలం వెదురునగరం వద్ద, గొలుగొండ, నర్సీపట్నం, చింతపల్లి, సీలేరులో డిపోలను ఏర్పాటు చేసింది. నెలకోసారి అక్కడ వేలం నిర్వహిస్తారు. -
వెదురులా కాదు.. వేణువులా...
ఆత్మీయం అడవిలో ఎన్నో వెదురు చెట్లు ఉంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే వేణువులవుతాయి. అన్ని వెదురు చెట్లకూ వేణువు అయ్యే అర్హత ఉంది. కానీ వాటిలో కొన్నే సహకరిస్తాయి వేణువు కావడానికి. ఏది గాయాలు భరించి గాలితో కలిసేందుకు ద్వారాలు తెరచుకుంటుందో అది సత్ఫలితాన్ని ఇస్తుంది. ఏది మూసుకుంటుందో అది ఫలితాన్ని ఇవ్వదు. మనుషులలో కొందరు వెదురు చెట్లలా ఉన్నారు. వారిలో కొందరు వేణువులవుతున్నారు. గాయపడి పాడేందుకు సహకరించే వారు కొందరే. జీవితం గుప్పెట్లో వారు వేణువు అవుతారు. వారి నుంచి మంచి సంగీతం పుడుతుంది. కానీ చాలామంది తమ హృదయ కవాటాలను మూసే ఉంచుతున్నారు. వారు తమను తెరవని పుస్తకంగానే ఉంచుకుంటారు. అటువంటి వారికి వాకిలి ఉన్నా లేనట్లే. కిటికీలు ఉన్నా లేనట్లే. కనుక వారి నుంచి సంగీతం పుట్టడం అసాధ్యం. జీవన సంగీతం ఓ వరం. అందుకు పెట్టి పుట్టాలి. గాయాలు పడిన వెదురు వేణు గానమవుతుంది. మనుషులూ అంతే. గాయపడి నలిగినా, వారు ఆ బాధలో నుంచి పాటలు కడతారు. ఆలపిస్తారు. మనసుల్ని ఆకట్టుకుంటారు. ఊరట చెందుతారు. రంధ్రాలు వేయించుకోవడానికి గాయాలు భరిస్తూ సహకరించిన వెదురు అందాన్ని కోల్పోవచ్చు. కానీ ఫలితాన్ని ఇస్తుంది. -
ఆన్లైన్లో అటవీ ఉత్పత్తుల వేలం
- తడోబా తరహాలో రాష్ట్రంలోనూ ఎకో టూరిజం: మంత్రి జోగు రామన్న సాక్షి, హైదరాబాద్: నీలగిరి (యూకలిప్టస్), వెదురు చెట్లకు ఆన్లైన్ విధానంలో టెండర్లు ఆహ్వానించి వేలం వేయాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఆదేశించారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్ ఎఫ్డీసీ)పై మంగళవారం సచివాలయంలో అటవీశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 5,410 హెక్టార్లలో వున్న నీలగిరి చెట్ల వేలం ద్వారా రూ.150 కోట్లు ఆదాయం సమకూరే అవకాశం వుందని అధికారులు తెలిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ వాటా కింద రూ. 45 కోట్లు వచ్చినట్లు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఏపీ ఎఫ్డీసీ నుంచి మరో రూ.97.19 కోట్లు బకాయి రావాల్సి వుందన్నారు. ఇందుకోసం ప్రయత్నించాలని అధికారులకు మంత్రి సూచించారు. తాను కూడా ఏపీ అటవీశాఖ మంత్రికి లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు. మహారాష్ట్రలోని తడోబా తరహాలో ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ పులుల అభయారణ్యంతోపాటు ఇతర అటవీ ప్రాంతాల్లో ఎకో టూరిజం (పర్యావరణ పర్యాటకం) అభివృద్ధి చే స్తామని మంత్రి అన్నారు. త్వరలో తడోబా ఎకో టూరిజం ప్రాంతాన్ని సందర్శించనున్నట్లు వెల్లడించారు. అటవీ అభివృద్ధి సంస్థ, అటవీశాఖ సంయుక్తంగా హరితహారం కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ శివార్లలోని శామీర్‌పేట, వనస్థలిపురం, నారపల్లి డీర్పార్కుల్లోని ఎకో టూరిజం ప్రాజెక్టుల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. టీఎస్ఎఫ్డీసీలో ఖాళీగా వున్న 154 ఉద్యోగ ఖాళీల భర్తీకి తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి జోగు రామన్న ఆదేశించారు. సమావేశంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, పీసీసీఎఫ్, అటవీ అభివృద్ధి సంస్థ ఇన్చార్జ్ ఎండీ పీకే శర్మ, జీఎం జయానంద కుమార్ పాల్గొన్నారు.