వెదురులా కాదు.. వేణువులా...
ఆత్మీయం
అడవిలో ఎన్నో వెదురు చెట్లు ఉంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే వేణువులవుతాయి. అన్ని వెదురు చెట్లకూ వేణువు అయ్యే అర్హత ఉంది. కానీ వాటిలో కొన్నే సహకరిస్తాయి వేణువు కావడానికి. ఏది గాయాలు భరించి గాలితో కలిసేందుకు ద్వారాలు తెరచుకుంటుందో అది సత్ఫలితాన్ని ఇస్తుంది. ఏది మూసుకుంటుందో అది ఫలితాన్ని ఇవ్వదు. మనుషులలో కొందరు వెదురు చెట్లలా ఉన్నారు. వారిలో కొందరు వేణువులవుతున్నారు. గాయపడి పాడేందుకు సహకరించే వారు కొందరే. జీవితం గుప్పెట్లో వారు వేణువు అవుతారు. వారి నుంచి మంచి సంగీతం పుడుతుంది. కానీ చాలామంది తమ హృదయ కవాటాలను మూసే ఉంచుతున్నారు.
వారు తమను తెరవని పుస్తకంగానే ఉంచుకుంటారు. అటువంటి వారికి వాకిలి ఉన్నా లేనట్లే. కిటికీలు ఉన్నా లేనట్లే. కనుక వారి నుంచి సంగీతం పుట్టడం అసాధ్యం. జీవన సంగీతం ఓ వరం. అందుకు పెట్టి పుట్టాలి. గాయాలు పడిన వెదురు వేణు గానమవుతుంది. మనుషులూ అంతే. గాయపడి నలిగినా, వారు ఆ బాధలో నుంచి పాటలు కడతారు. ఆలపిస్తారు. మనసుల్ని ఆకట్టుకుంటారు. ఊరట చెందుతారు. రంధ్రాలు వేయించుకోవడానికి గాయాలు భరిస్తూ సహకరించిన వెదురు అందాన్ని కోల్పోవచ్చు. కానీ ఫలితాన్ని ఇస్తుంది.