ఆధునిక యుగంలో ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల వినియోగం నానాటికీ పెరిగిపోతోంది. సరైన ప్రత్యామ్నాయ ఇంధనాలు విరివిగా అందుబాటులో లేకపోవడంతో పెట్రోల్, డీజిల్, బొగ్గు వంటి వాటిపై అనివార్యంగా ఆధారపడాల్సి వస్తోంది. వీటివల్ల వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయని, పర్యావరణానికి, భూగోళంపై మానవళి మనుగడకు ముప్పు ఏర్పడుతోందని తెలిసినప్పటికీ మరో దారిలేక ప్రమాదకరమైన ఇంధనాలపైనే అధికంగా ఆధారపడాల్సి వస్తోంది. మరోవైపు పునరుత్పాదక ఇంధనాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి ఆశించిన స్థాయిలో ఊపందుకోవడం లేదు.
జల విద్యుత్ ఉత్పత్తికి కొన్ని పరిమితులున్నాయి. ఇలాంటి తరుణంలో హంగేరీలోని ‘హంగేరియన్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ సైన్సెస్’ పరిశోధకులు తీపి కబురు అందించారు. అడవుల్లో సహజసిద్ధంగా, విస్తృతంగా పెరిగే వెదురు(బ్యాంబూ)తో బయో ఇథనాల్, బయో గ్యాస్ వంటి జీవ ఇంధన ఉత్పత్తులు తయారు చేయవచ్చని తమ అధ్యయనంలో తేల్చారు. సమీప భవిష్యత్తులో పునరుత్పాదక ఇంధన రంగంలో వెదురు ఒక విప్లవమే సృష్టించబోతోందని చెబుతున్నారు. శిలాజ ఇంధనాలకు కాలుష్యానికి తావులేని ఇలాంటి ఇంధనాలే సరైన ప్రత్యామ్నాయం అవుతాయని అంటున్నారు. ఈ అధ్యయనం వివరాలను ‘జీసీబీ బయో ఎనర్జీ’ జర్నల్‌లో ప్రచురించారు.
► ఇతర చెట్లతో పోలిస్తే వెదురు చాలా వేగంగా పెరుగుతుంది. ఇదొక విలువైన సహజ వనరు. కాలుష్యాన్ని కట్టడి చేసే విషయంలో వెదురును ‘సూపర్ స్పాంజ్’గా పరిగణిస్తుంటారు. కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకుంటుంది. వాతావరణంలోకి ప్రాణవాయువు(ఆక్సిజన్) ను అధికంగా విడుదల చేస్తుంది.
► ప్రమాదకరమైన గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాన్ని అరికట్టడంలో వెదురు పాత్ర చాలా కీలకం. భూమిపై వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది.
► ప్రకృతిలో వెదురు ప్రాధాన్యతను గుర్తించిన పరిశోధకులు దాని నుంచి పునరుత్పాదక ఇంధనాల తయారీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
► కిణ్వ ప్రక్రియ(ఫెర్మెంటేషన్), అధిక ఉష్ణోగ్రతల వద్ద కుళ్లిపోయేలా చేయడం(పైరోలిసిస్)తోపాటు హైడ్రోథర్మల్ లిక్విఫాక్షన్, అనెయిరోబిక్ డైజేషన్ వంటి ప్రక్రియల ద్వారా ముడి వెదురు నుంచి బయో ఇథనాల్, బయోగ్యాస్ ఉత్పత్తి చేయవచ్చని కనిపెట్టారు.
► పరిశుద్ధమైన, స్థిరమైన ఇంధన వనరులను అందించగల సామర్థ్యం వెదురుకు ఉందని గుర్తించారు.
► కొన్ని జాతుల వెదురు నుంచి అధికంగా బయో ఇంధనం ఉత్పత్తి అవుతుందని చెబుతున్నారు. వేర్వేరు జాతులు వేర్వేరుగా రసాయన చర్య జరపడమే ఇందుకు కారణమని పేర్కొంటున్నారు.
► వెదురులో సెల్యూలోజ్‌లు, హెమిసెల్యూలోజ్ లో అధిక మోతాదులో ఉంటాయి. వీటి నుంచి బయో ఇథనాల్, బయోగ్యాస్‌తోపాటు బయోచర్ అనే ఎరువు కూడా ఉత్పత్తి అవుతుంది.
► వెదురు నుంచి ప్రత్యామ్నాయ ఇంధనాలను తయారు చేసుకుంటే శిలాజ ఇంధనాలపై ఆధారపడాల్సిన అవసరం గణనీయంగా తగ్గిపోతుందని, తద్వారా కాలుష్యాన్ని, వాతావరణ మార్పులను నియంత్రించవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. వెదురు నుంచి జీవ ఇంధనాల ఉత్పత్తి ప్లాంట్లకు పెద్దగా పెట్టుబడి అవసరం లేదని చెబుతున్నారు. ఇది పూర్తిగా సురక్షితమైన ప్రక్రియ అని పేర్కొంటున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment