
బార్సిలోనా నగర వీధుల్లో డ్రైవర్‌రహిత బస్సు సందడి
బార్సిలోనా: స్పెయిన్‌లోని బార్సిలోనా నగర వీధుల్లో ఒక కొత్త బస్సు సందడిచేస్తోంది. అందులో ఎక్కే ప్రయాణికుల నుంచి ఒక వారంరోజులపాటు ఎలాంటి రుసుము వసూలుచేయట్లేరు. ఈ బస్సుకు ప్రత్యేకత ఉంది. అదేంటంటే బస్సుకు డ్రైవర్ అంటూ ఎవరూ ఉండరు. ఈ డ్రైవర్‌లెస్ విద్యుత్ బస్సు ఇప్పుడు బార్సిలోనా సిటీ వీధుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డ్రైవర్‌లేకున్నా ధైర్యంచేసి బస్సులో దూరిపోయే ప్రయాణికులూ ఎక్కువైపోయారు. గంటకు 40కిలోమీటర్ల వేగంతో ఈ బస్సు దూసుకుపోతుంది. ఒక్కసారి చార్జ్‌చేస్తే 120 కిలోమీటర్లదాకా ప్రయాణించవచ్చు. చుట్టూతా 10 అత్యాధునిక కెమెరాలు, సెన్సార్‌లతో పనిచేసే ఎనిమిది లిడార్‌లను అమర్చారు.
అతి చిన్న రూట్
సుదూరాలకు ప్రయాణించకుండా తొలి దఫాలో ఈ మినీ బస్సును కేవలం 2.2 కిలోమీటర్ల వృత్తాకార పరిధిలోనే తిప్పుతున్నారు. ప్రయాణంలో ఇది మొత్తం నాలుగు చోట్ల మాత్రమే ఆగుతుంది. స్వయంచాలిత వాహనాల తయారీలో ప్రత్యేకత సాధించిన వీరైడ్ అనే సంస్థతో ఫ్రెంచ్ కార్ల తయారీ దిగ్గజ సంస్థ రెనాల్ట్ చేతులు కలిపి ఈ అధునాతన బస్సును రూపొందించింది. తొలిసారిగా ఈ బస్సు నమూనాను గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఇప్పుడు బస్సు బార్సిలోనా నగర వీధుల్లో సేవలందిస్తోంది.
ఇలాంటి ప్రయోగ ప్రాజెక్టులను ఫ్రాన్స్‌లోని వాలెన్స్ సిటీ, జ్యురిచ్ ఎయిర్‌పోర్ట్‌లోనూ ప్రారంభించారు. ‘‘సాధారణ ఇంజన్‌తో నడిచే బస్సును ఎక్కి బోర్ కొట్టింది. అందుకే ఈ రోజు డ్రైవర్‌లెస్ బస్సెక్కా’’అని 18 ఏళ్ల పావూ కగాట్ చెప్పారు. ‘‘శాన్‌ఫ్రాన్సిస్కో మొదలు టోక్యో దాకా ఇప్పటికే పలు నగరాల్లో డ్రైవర్‌లెస్ బస్సును పరీక్షించినా యూరప్‌లో మాత్రం వీటి సందడి ఇంకా మొదలుకాలేదు. అందుకే ఈ పంథాను ఇక్కడ మేం మొదలెట్టాం’’అని రేనాల్ట్ అటానమస్ మొబిలిటీ ప్రాజెక్ట్స్ హెడ్ ప్యాట్రిక్ వర్గిలాస్ చెప్పారు.
బస్సు సిగ్నళ్ల వద్ద ఆగుతూ, పాదచారులు రోడ్డు దాటేటప్పుడు ఆగి వెళ్తూ ట్రాఫిక్ నిబంధనలనూ చక్కగా అనుసరిస్తోంది. ఇప్పటిదాకా ఎలాంటి రోడ్డు ప్రమాదాలకు ఇది కారణం కాలేదని బార్సిలోనా సిటీ అధికారులు చెప్పారు. ఇప్పుడీ బస్సులో ఎక్కిన వాళ్లు లోపల కూర్చొని, బయట నిలబడి సెల్ఫీలు దిగుతూ తెగ షేర్‌లు చేసుకుంటున్నారు. దీంతో బుల్లి బస్సుకు భలే గిరాకీ ఉందే అని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment