రాయచూర్ వెళ్లే నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్ బస్సు ఇమ్లీబన్‌లో బయలుదేరింది.. బస్సు కిక్కిరిసిపోయి ఉంది.. బహదూర్‌పుర రాగానే తాము దిగుతామని, బస్సు ఆపాలంటూ ముగ్గురు మహిళలు డ్రైవర్ వద్దకు వచ్చి నిలబడ్డారు. అలా మరికొంత దూరం వెళ్లాక, మరో ఇద్దరు మహిళలు బస్సు ఆపాలంటూ అడిగారు. వాస్తవానికి ఆ బస్సు ఎక్కడా ఆగకుండా రాయచూరుకు వెళ్లాల్సి ఉండగా, ఇలా మహిళల వాదనలు, డిమాండ్లతో పదిహేను చోట్ల ఆపాల్సి వచ్చింది.
సాక్షి, హైదరాబాద్: మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి అందుబాటులోకి వచ్చాక, ఆర్టీసీకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి.
తాము ఎక్కడ ఆపమంటే బస్సును అక్కడ ఆపాలంటూ ఒత్తిడి చేసు్తన్నారు. ఆ బస్సులకు స్టాప్ లేని చోట్ల, సాధారణ పాయింట్ల వద్ద ఆపాలంటూ డ్రైవర్, కండక్టర్‌తో వాగ్వాదానికి దిగుతున్నారు. ఫలితంగా ఎక్స్‌ప్రెస్ బస్సులు ఆర్డినరీ బస్సుల్లాగా చాలా చోట్ల ఆగుతూ వెళ్లాల్సి వస్తోంది. ఈ పథకం ప్రారంభమైన కొత్తలో, ఓ మహిళ నుంచి టికెట్ రుసుము వసూలు చేశారంటూ ఆ మహిళ తాలూకు వ్యక్తి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
సదరు మహిళ తరపున పురుష వ్యక్తి టికెట్ తీసుకోవటంతో, మహిళ కూడా ఉందన్న విషయం తెలియక కండక్టర్ జీరో టికెట్‌కు బదులు సాధారణ టికెట్ ఇచ్చాడు. ఫిర్యాదు నేపథ్యంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించి ఆ కండక్టర్‌పై చర్యలకు ఉపక్రమించారు. దీంతో ఇప్పుడు కొందరు మహిళలు తాము కోరిన చోట బస్సు ఆపకుంటే ఫిర్యాదు చేస్తామని డ్రైవర్, కండక్టర్లను బెదిరిస్తున్నారు. దీంతో బస్సులను వారు ఆపుతున్నారు.
మరోవైపు ఇతర ప్రయాణికుల అభ్యంతరం
ఎక్కడపడితే అక్కడ బస్సులను ఆపేస్తుండటంతో ఇతర ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురై కండక్టర్లు, డ్రైవర్లతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఇలా రెండు వైపుల నుంచి ఒత్తిళ్లు వస్తుండటంతో భరించలేక సిబ్బంది శుక్రవారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఆయన నిర్వహించిన గూగుల్‌మీట్‌లో ఈమేరకు మొర పెట్టుకున్నారు. దీనికి సజ్జనార్ స్పందించారు.
ఎవరు ఒత్తిడి చేసినా ఆపొద్దు: సజ్జనార్
ఇకపై ఎక్స్‌ప్రెస్ బస్సులను నిర్ధారిత స్టాపుల్లో మాత్రమే ఆపాల ని, తక్కువ దూరం వెళ్లాల్సిన మహిళా ప్రయాణికులు పల్లె వెలుగు, ఆర్డినరీ బస్సుల్లోనే వెళ్లాలని సజ్జనార్ సూచించారు. స్టాపు లేనిచోట ఎవరు ఒత్తిడి చేసినా ఆపొద్దని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment