Bio fuels
-
వెదురు నుంచి జీవ ఇంధనాలు!
ఆధునిక యుగంలో ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల వినియోగం నానాటికీ పెరిగిపోతోంది. సరైన ప్రత్యామ్నాయ ఇంధనాలు విరివిగా అందుబాటులో లేకపోవడంతో పెట్రోల్, డీజిల్, బొగ్గు వంటి వాటిపై అనివార్యంగా ఆధారపడాల్సి వస్తోంది. వీటివల్ల వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయని, పర్యావరణానికి, భూగోళంపై మానవళి మనుగడకు ముప్పు ఏర్పడుతోందని తెలిసినప్పటికీ మరో దారిలేక ప్రమాదకరమైన ఇంధనాలపైనే అధికంగా ఆధారపడాల్సి వస్తోంది. మరోవైపు పునరుత్పాదక ఇంధనాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి ఆశించిన స్థాయిలో ఊపందుకోవడం లేదు. జల విద్యుత్ ఉత్పత్తికి కొన్ని పరిమితులున్నాయి. ఇలాంటి తరుణంలో హంగేరీలోని ‘హంగేరియన్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ సైన్సెస్’ పరిశోధకులు తీపి కబురు అందించారు. అడవుల్లో సహజసిద్ధంగా, విస్తృతంగా పెరిగే వెదురు(బ్యాంబూ)తో బయో ఇథనాల్, బయో గ్యాస్ వంటి జీవ ఇంధన ఉత్పత్తులు తయారు చేయవచ్చని తమ అధ్యయనంలో తేల్చారు. సమీప భవిష్యత్తులో పునరుత్పాదక ఇంధన రంగంలో వెదురు ఒక విప్లవమే సృష్టించబోతోందని చెబుతున్నారు. శిలాజ ఇంధనాలకు కాలుష్యానికి తావులేని ఇలాంటి ఇంధనాలే సరైన ప్రత్యామ్నాయం అవుతాయని అంటున్నారు. ఈ అధ్యయనం వివరాలను ‘జీసీబీ బయో ఎనర్జీ’ జర్నల్‌లో ప్రచురించారు. ► ఇతర చెట్లతో పోలిస్తే వెదురు చాలా వేగంగా పెరుగుతుంది. ఇదొక విలువైన సహజ వనరు. కాలుష్యాన్ని కట్టడి చేసే విషయంలో వెదురును ‘సూపర్ స్పాంజ్’గా పరిగణిస్తుంటారు. కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటుంది. వాతావరణంలోకి ప్రాణవాయువు(ఆక్సిజన్) ను అధికంగా విడుదల చేస్తుంది. ► ప్రమాదకరమైన గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాన్ని అరికట్టడంలో వెదురు పాత్ర చాలా కీలకం. భూమిపై వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. ► ప్రకృతిలో వెదురు ప్రాధాన్యతను గుర్తించిన పరిశోధకులు దాని నుంచి పునరుత్పాదక ఇంధనాల తయారీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ► కిణ్వ ప్రక్రియ(ఫెర్మెంటేషన్), అధిక ఉష్ణోగ్రతల వద్ద కుళ్లిపోయేలా చేయడం(పైరోలిసిస్)తోపాటు హైడ్రోథర్మల్ లిక్విఫాక్షన్, అనెయిరోబిక్ డైజేషన్ వంటి ప్రక్రియల ద్వారా ముడి వెదురు నుంచి బయో ఇథనాల్, బయోగ్యాస్ ఉత్పత్తి చేయవచ్చని కనిపెట్టారు. ► పరిశుద్ధమైన, స్థిరమైన ఇంధన వనరులను అందించగల సామర్థ్యం వెదురుకు ఉందని గుర్తించారు. ► కొన్ని జాతుల వెదురు నుంచి అధికంగా బయో ఇంధనం ఉత్పత్తి అవుతుందని చెబుతున్నారు. వేర్వేరు జాతులు వేర్వేరుగా రసాయన చర్య జరపడమే ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. ► వెదురులో సెల్యూలోజ్లు, హెమిసెల్యూలోజ్ లో అధిక మోతాదులో ఉంటాయి. వీటి నుంచి బయో ఇథనాల్, బయోగ్యాస్తోపాటు బయోచర్ అనే ఎరువు కూడా ఉత్పత్తి అవుతుంది. ► వెదురు నుంచి ప్రత్యామ్నాయ ఇంధనాలను తయారు చేసుకుంటే శిలాజ ఇంధనాలపై ఆధారపడాల్సిన అవసరం గణనీయంగా తగ్గిపోతుందని, తద్వారా కాలుష్యాన్ని, వాతావరణ మార్పులను నియంత్రించవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. వెదురు నుంచి జీవ ఇంధనాల ఉత్పత్తి ప్లాంట్లకు పెద్దగా పెట్టుబడి అవసరం లేదని చెబుతున్నారు. ఇది పూర్తిగా సురక్షితమైన ప్రక్రియ అని పేర్కొంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బయో ఇంధనంగా వంట నూనెలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా బయో ఇంధనాలకు డిమాండ్ పెరిగిపోయింది. దీని ఫలితంగా వంట నూనెలకు కొరత ఏర్పడుతోంది. ట్రక్కులు, విమానాలకు కూడా బయో ఫ్యూయల్స్ వాడకంపై దృష్టి సారించడంతో.. ఆహారమా/ఇంధనమా అన్న చర్చ మొదలైంది. అమెరికా, బ్రెజిల్, ఇండోనేషియా తదితర ప్రభుత్వాలు సోయాబీన్స్ లేదా కనోలా లేదా జంతు కొవ్వుల నుంచి తీసిన నూనెను ఇంధనాలకు వినియోగించడాన్ని ప్రోత్సహిస్తున్నాయి. సంప్రదాయ శిలాజ ఇంధనాలకు (పర్యావరణ కాలుష్యానికి దారితీసే) బదులు బయో ఇంధనాల వినియోగంతో కాలుష్యాన్ని తగ్గించుకోవాలన్న లక్ష్యంతో కొన్ని దేశాలు పనిచేస్తున్నాయి. దీంతో పామాయిల్ తదితర నూనెలకు డిమాండ్ పెరుగుతోంది. డిమాండ్ చాలా అధికంగా ఉండడంతో వాడిన వంట నూనె, పామాయిల్ తయారీలో విడుదలయ్యే స్లడ్స్ అనే ఉత్పత్తి కోసం కంపెనీలు వేటను మొదలు పెట్టినట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పామాయిల్ తయారీ పరిశ్రమల్లో విడుదలయ్యే స్లడ్స్ బయో ఇంధనాల తయారీకి ముడి పదార్థంగా వినియోగిస్తున్నారు. అవరోధాలు.. బయో ఇంధనాలకు ఏర్పడిన అనూహ్య డిమాండ్ తీరే సానుకూలతలు ప్రస్తుతం కనిపించడం లేదు. ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధం, తీవ్ర వాతావరణ పరిస్థితులు అనేవి నూనెల సరఫరాను పరిమితం చేస్తున్నాయి. అర్జెంటీనాలో తీవ్ర కరువుతో ఉత్పత్తిపై ప్రభావం పడింది. సోయాబీన్ ఆయిల్ ఉత్పత్తిలో ఈ దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండడం గమనించొచ్చు. ఇక యూరప్‌లో హానికారక రసాయాల వినియోగంపై నియంత్రణలు నెలకొన్నాయి. ఇది అక్కడ రేప్‌సీడ్ ఉత్పత్తిపై ప్రభావం పడేలా చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణతో పొద్దు తిరుగుడు నూనె ఉత్పత్తిపై ఒత్తిడి నెలకొంది. ఈ ప్రతికూలతల వల్ల వంట నూనెల తయారీ తగ్గొచ్చన్న అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ ఏడాది ద్వితీయ భాగంలో అంతర్జాతీయ మార్కెట్లో బయో ఇంధనాలకు కొరత ఏర్పడుతుందని ఆయిల్ వరల్డ్ అనే సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ థామస్ మిల్కే తెలిపారు. వెజిటబుల్ నూనె మార్కెట్లో బయో ఇంధనాలు అధిక భాగాన్ని ఆక్రమిస్తున్నాయని.. ప్రపంచంలో డిమాండ్ కంటే సరఫరా తక్కువే ఉన్నట్టు చెప్పారు. అమెరికా, యూరప్, బ్రెజిల్, ఇండోనేషియా బయోడీజిల్, రెన్యువబుల్ డీజిల్, బయోజెట్ ఇంధనం వినియోగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అమెరికా అయితే సోయాబీన్ ఆయిల్, రేప్‌సీడ్ ఆయిల్, వాడిన వంట నూనె, జంతు కొవ్వులను వినియోగిస్తోంది. యూరప్‌లో వ్యర్థాలు, రేప్‌సీడ్ ఆయిల్‌ను వినియోగిస్తున్నారు. బ్రెజిల్ అయితే సోయాబీన్ ఆయిల్‌ను బయో ఇంధనాల తయారికి వాడుతోంది. పామాయిల్‌కు అనుకూలతలు.. బయో ఇంధనాలకు పెరుగుతున్న డిమాండ్‌తో పామాయిల్ ఉత్పత్తిదారులు, కంపెనీలు లాభపడనున్నాయి. అలాగే, ఇతర నూనె గింజలు, వెజిటబు ల్ నూనెల వినియోగం కూడా బయో ఇంధనాల తయారీలో పెరుగుతోంది. ఈ డిమాండ్ పామాయిల్‌కు కలిసొస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కానీ, డిమాండ్ పెరిగితే అప్పుడు పామాయిల్‌కు సైతం కొరత ఏర్పడే ప్రమాదం లేకపోలేదు. ఎందు కంటే ఇండోనేషియా, మలేషియా ప్రపంచ పామాయిల్ ఉత్పత్తిలో 85 శాతం వాటా ఆక్రమిస్తున్నా యి. కానీ ఈ దేశాల్లో ప్లాంటేషన్ నిదానంగా సాగడం, ఉన్న పంటల వయసు పెరిగిపోవడం, ఉత్పత్తి లేని చెట్ల సంఖ్య పెరగడం, అటవీ భూముల వినియోగంపై ఆంక్షలు విస్తరణకు అడ్డుగా ఉన్నాయి. బయో ఇంధనాలకు డిమాండ్ పెరిగిపోతే అది ముడి సరుకు సరఫరా కొరతకు దారితీయవచ్చని.. అదే జరిగితే అంతర్జాతీయంగా కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించాలన్న లక్ష్యాలకు విఘాతం కలుగుతుందని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ హెచ్చరించడం గమనార్హం. -
ఆటోమేకర్స్‌కి సర్కార్ షాక్ ! మంత్రి నితిన్ గడ్కారీ కీలక ప్రకటన
చిప్ సెట్ల కొరతతో సతమతం అవుతున్న అటోమొబైల్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. కార్ల తయారీకి సంబంధించి అత్యంతక కీలకమైన విభాగంలో మార్పులు చేర్పులు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీ కీలక ప్రకటన చేశారు. ప్రతికూల పరిస్థితులు కరోనా సంక్షోభం తర్వాత కార్ల అమ్మకాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. అయితే అంతర్జాతీయంగా కార్ల తయారీలో కీలకమైన చిప్సెట్ల కొరత నెలకొంది. దీంతో కార్ల తయారీ సంస్థల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోయే పరిస్థితులు ఎదురయ్యాయి. మరోవైపు ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి డిమాండ్ పెరుగుతోంది. ఇలా అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య ఉన్న ఆటో మొబైల్ మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌కి మరో షాక్ ఇచ్చేందుకు కేంద్రం రెడీ అయ్యింది. ఫ్లెక్స్ ఇంజన్లు తయారు చేయండి పెట్రోలు ధరలు కంట్రోల్ కాకపోవడంతో ప్రత్యామ్నాయంగా బయో ఇథనాల్‌తో నడిచే ఇంజన్లతో నడిచే కార్లను మార్కెట్లోకి తేవాలంటూ కార్ల తయారీ సంస్థలను కేంద్రం ఇప్పటి వరకు కోరుతూ వస్తోంది. ఇటు పెట్రోలో/డీజిల్‌తో పాటు బయో ఇథనాల్‌తో నడిచే విధంగా ఫ్లెక్స్ ఇంజన్లు తయారు చేయాలని చెబుతోంది. అయితే కేంద్రం సూచనలకు తగ్గట్టుగా ఫ్లెక్స్ ఇంజన్లు తయారు చేయడంపై కంపెనీలు ఆసక్తి చూపించడం లేదు. ఈవీ మార్కెట్‌పై కొద్దొగొప్పో ఫోకస్ చేస్తున్నాయి. తప్పనిసరి చేస్తాం చెరుకు, వరి ఇతర పంట ఉత్పత్తుల నుంచి బయో ఇథనాల్ భారీ ఎత్తున తయారు చేసే అవకాశం ఉందని, కాబట్టి బయో ఇథనాల్‌కి మార్కెట్ కల్పించాలంటే ఫ్లెక్సీ ఇంజన్లతో నడిచే వాహనాలు ఉండాలి. దీంతో ఫ్లెక్సీ ఇంజన్ల తయారీని తప్పని సరి చేస్తూ త్వరలో ఆదేశాలు ఇస్తామని, ఇందుకు ఆర్నెళ్లకు మించి సమయం పట్టబోదంటూ కేంద్ర రవాణాశాఖ మంత్రి ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కుండ బద్దలు కొట్టారు. అయోమయంలో కంపెనీలు ఓ వైపు కర్భణ ఉద్గారాలు తగ్గించాలని చెబుతూ... ఈవీ మార్కెట్‌కి అనుకూలంగా ప్రభుత్వ విధానాలు రూపొందుతున్నాయని ఇప్పుడు కొత్తగా ఫ్లెక్సీ ఇంజన్లు అంటూ ఒత్తిడి చేస్తే ఎలాగంటూ ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర విధానం రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. చదవండి: BH-Series Tag: రాష్ట్రాల మధ్య వాహనాల తరలింపు సులభతరం -
లాక్డౌన్: కేంద్రం వివాదాస్పద ప్రకటన
న్యూఢిల్లీ: గోదాముల్లో అవసరానికి మించి ఉన్న బియ్యాన్ని ఇథనాల్‌గా మార్చి, శానిటైజర్ల తయారీకి, కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు పెట్రోల్‌లో కలిపేందుకు ఉపయోగిస్తామని కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది. జీవ ఇంధనాలపై జాతీయ విధానంలో భాగంగా.. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షతన జరిగిన ‘నేషనల్ బయో ఫ్యూయల్ కోఆర్డినేషన్’ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ కారణంగా లక్షలాదిగా వలస కూలీలు, ఇతర పేదలు ఆకలితో బాధపడుతున్న తరుణంలో కేంద్రం చేసిన ఈ ప్రకటన వివాదాస్పదమైంది. లాక్డౌన్ సమయంలో.. దేశంలోని 80 కోట్ల మంది పేదలకు రానున్న మూడు నెలల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం గతంలో చెప్పింది. అధికారిక సమాచారం ప్రకారం ఎఫ్‌సీఐ గోడౌన్లలో 58.49 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయి. ఇందులో 30.97 మిలియన్ టన్నుల బియ్యం, 27.52 మిలియన్ టన్నుల గోధుమలు ఉన్నాయి. నిర్దేశించిన ఆహార నిల్వల కంటే ఏప్రిల్ 1 నాటికి 21 మిలియన్ టన్నులు ఎక్కువగా ఉన్నాయి. కాగా, ఇథనాల్‌తో హాండ్ శానిటైజర్ల తయారీకి ఇటీవల కేంద్ర ప్రభుత్వ షూగర్ కంపెనీలు, డిస్టిలరీస్‌కు అనుమతి ఇచ్చింది. సాధారణంగా పెట్రోల్‌లో కలిపేందుకు ఇథనాల్‌ను చమురు సంస్థలకు షూగర్ కంపెనీలు సరఫరా చేస్తుంటాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున శానిటైజర్లు తయారుచేసి ఆస్పత్రులు, సంస్థలకు సరఫరా చేయాలని నిర్ణయించినట్టు షూగర్ కంపెనీల సంఘం(ఐఎస్ఎంఏ) వెల్లడించింది. వీటిని తయారు చేసిన ధరకు లేదా ఉచితంగా అందించనున్నట్టు ప్రకటించింది. చదవండి: కరోనాపై అంతుచిక్కని అంశాలు -
పెట్రోల్ ధర రూ 50కి దిగిరావాలంటే..
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్ ధరలు లీటర్‌కు రూ 55, డీజిల్ రూ 50కి దిగిరావాలంటే బయో ఇంధనానికి మళ్లాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వరి, గోధుమ, చెరకు వ్యర్థాలతో పాటు మున్సిపల్ వ్యర్థాలతో ఇంధనాన్ని తయారుచేసే ఐదు ఇథనాల్ ప్లాంట్లను పెట్రోలియం మంత్రిత్వ శాఖ నెలకొల్పుతుందని వీటి ఉత్పత్తులు బయటికి వస్తే పెట్రో ధరలు గణనీయంగా దిగివస్తాయని మంత్రి చెప్పుకొచ్చారు. ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకంతో పెట్రోల్, డీజిల్‌పై ఆధారపడటం తగ్గుతుందని అన్నారు. చత్తీస్‌గఢ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి బయో ఇంధనాల ప్రాధాన్యత గురించి నొక్కిచెప్పారు. చత్తీస్‌గఢ్‌లోని జత్రోపా ప్లాంట్‌లో తయారైన బయో ఇంధనాన్ని ఉపయోగించి తొలి బయో ఇంధన విమానం ఇటీవల డెహ్రాడూన్ నుంచి ఢిల్లీలో ల్యాండయిందన్నారు. బయో ఇంధన ఉత్పత్తి ద్వారా రైతులు, గిరిజనులు, యువతకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. -
ఇండియాలో జీవ ఇంధనంతో తొలి ఫ్లయిట్
-
బయో ఫ్యూయల్ విమానం- కీలక మైలురాయి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో జీవ ఇంధనంతో నడిచే తొలి విమానం గాల్లోకి ఎగరడంతో రికార్డ్ నమోదైంది. బయో ఫ్యూయల్ ఆధారిత మొదటి విమానం దేశంలో టెస్ట్ ఫ్లైని విజయవంతంగా పూర్తి చేసింది. ప్రైవేట్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ విమానం (బాంబార్డియర్ క్యూ400 టర్బోప్రోప్) సోమవారం డెహ్రాడూన్ నుంచి ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఢిల్లీలోని టెర్మినల్2లో బయో ఫ్యూయల్ విమానాన్ని రిసీవ్ చేసుకున్నామని పెట్రోలియం శాఖామంత్రి ధరేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు. ఇందుకు స్పైస్‌జెట్, ఏవియేషన్ అధారిటితోపాటు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, డెహ్రాడూన్, ఛత్తీస్‌గఢ్ బయో ఫ్యూయెల్ డెవలప్మెంట్ అథారిటీ ( సిబిడిఎ) డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్టీ) తదితరులకు అభినందనలు తెలిపారు. ఈ బయో మిషన్‌ను మరింత ముందుకు తీసుకుపోయే ప్రక్రియలో భాగంగా త్వరలోనే పెట్రోలియం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఒక కొత్త బయో-ఏటీఎఫ్‌పాలసీ తీసుకురానున్నామని వెల్లడించారు. కార్బన్ ఉద్గారాలను నియంత్రించే ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యంలో భాగంగా చారిత్రాత్మక మైలురాయిని అధిగమించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు నితిన్‌గడ్కరీ, సురేష్ ప్రభు, హర్హవర్దన్, జయంత్ సిన్హా తదితరులు హాజరయ్యారు. జీవ ఇంధనంతో నడిచేవిమాన సర్వీసులను మన దేశంలో లాంచ్ చేయడం ఇదే ప్రథమం. కాగా అమెరికా, ఆస్ట్రేలియాలాంటిఅభివృద్ధి చెందిన దేశాలే వీటిని నిర్వహిస్తున్నాయి. పునర్వినియోగ వనరుల నుంచి ఉత్పత్తి చేసిన ఇంధనాన్ని డీజిల్ లేదా పెట్రోల్‌కు స్థానంలో ఉపయోగించడం లేదా వాటితో కలిపి మిశ్రమంగా వాడే దాన్ని జీవ ఇంధనం అంటారు. అంటే ఎథనాల్ వంటివి. దీన్ని చెరకు, మొక్కజొన్న వంటి వాటి నుంచి తయారుచేస్తారు. Taking our Biofuel mission forward @PetroleumMin will be bringing a new Bio- ATF Policy soon. pic.twitter.com/eJ6jjyCNoq — Dharmendra Pradhan (@dpradhanbjp) August 27, 2018 -
బయో ఇంధనంతో తొలి విమానం..
సాక్షి, న్యూఢిల్లీ : భారత్ నుంచి తొలిసారిగా బయో ఇంధనం ఉపయోగించి సోమవారం డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి విమానం చేరుకోనుంది. ఈ ఇంధనం ఉపయోగిస్తూ డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి టర్బోప్రాప్, క్యూ-400 ఆపరేట్ చేయాలని స్పైస్‌జెట్ సన్నాహాలు చేస్తోంది. అమెరికా, ఆస్ర్టేలియాలు ఇప్పటికే బయో ఇంధనంతో కమర్షియల్ విమానాలను విజయంవతంగా నడుపుతున్నాయి. ఈ తరహా బయోఇంధనంతో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విమానాలను నడిపే తొలిదేశంగా భారత్ గుర్తింపుపొందనుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం డెహ్రాడూన్‌లో బయో ఇంధనంతో బాంబార్డియర్ క్యూ-400 పదినిమిషాల పాటు నగరంలో చక్కర్లు కొట్టి తిరిగి టేకాఫ్ అయిన ప్రాంతానికి చేరుకుంటుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే విమానం మరోసారి టేకాఫ్ తీసుకుని ఈసారి ఢిల్లీకి బయలుదేరుతుంది. ఈ విమానం ఎగిరే తీరు, ప్రయాణ తీరుతెన్నులను పర్యవేక్షించేందుకు డీజీసీఏ సహా పలు రెగ్యులేటరీ ఏజెన్సీల అధికారులు విమానంలో ప్రయాణించనున్నారు. -
జీవ ఇంధన వాహనాలకు ప్రోత్సాహం: గడ్కారీ
న్యూఢిల్లీ: దేశంలో జీవఇంధనాల(బయో ఫ్యూయల్)తో నడిచే వాహనాలను ప్రోత్సహించడానికి మోటారు వాహనాల చట్టానికి మార్పులు చేయనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కారీ వెల్లడించారు. దీంతోపాటు అంతర్జాతీయ స్థాయికి అనుగుణంగా ప్రమాణాలు ఉండేలా నిబంధనలను రూపొందించనున్నామని, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో సంబంధిత బిల్లును ప్రవేశపెడతామన్నారు. సోమవారం ఢిల్లీలోని బీజేపీ ఆఫీసులో ఒక సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘వాహనాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేందుకు మోటారు వాహనాల చట్టానికి సవరణలు చేయాల్సి ఉంది. సాంప్రదాయేతర ఇంధనాలు వినియోగించేలా చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.