న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా బయో ఇంధనాలకు డిమాండ్ పెరిగిపోయింది. దీని ఫలితంగా వంట నూనెలకు కొరత ఏర్పడుతోంది. ట్రక్కులు, విమానాలకు కూడా బయో ఫ్యూయల్స్ వాడకంపై దృష్టి సారించడంతో.. ఆహారమా/ఇంధనమా అన్న చర్చ మొదలైంది. అమెరికా, బ్రెజిల్, ఇండోనేషియా తదితర ప్రభుత్వాలు సోయాబీన్స్ లేదా కనోలా లేదా జంతు కొవ్వుల నుంచి తీసిన నూనెను ఇంధనాలకు వినియోగించడాన్ని ప్రోత్సహిస్తున్నాయి.
సంప్రదాయ శిలాజ ఇంధనాలకు (పర్యావరణ కాలుష్యానికి దారితీసే) బదులు బయో ఇంధనాల వినియోగంతో కాలుష్యాన్ని తగ్గించుకోవాలన్న లక్ష్యంతో కొన్ని దేశాలు పనిచేస్తున్నాయి. దీంతో పామాయిల్ తదితర నూనెలకు డిమాండ్ పెరుగుతోంది. డిమాండ్ చాలా అధికంగా ఉండడంతో వాడిన వంట నూనె, పామాయిల్ తయారీలో విడుదలయ్యే స్లడ్స్ అనే ఉత్పత్తి కోసం కంపెనీలు వేటను మొదలు పెట్టినట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పామాయిల్ తయారీ పరిశ్రమల్లో విడుదలయ్యే స్లడ్స్ బయో ఇంధనాల తయారీకి ముడి పదార్థంగా వినియోగిస్తున్నారు.
అవరోధాలు..
బయో ఇంధనాలకు ఏర్పడిన అనూహ్య డిమాండ్ తీరే సానుకూలతలు ప్రస్తుతం కనిపించడం లేదు. ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధం, తీవ్ర వాతావరణ పరిస్థితులు అనేవి నూనెల సరఫరాను పరిమితం చేస్తున్నాయి. అర్జెంటీనాలో తీవ్ర కరువుతో ఉత్పత్తిపై ప్రభావం పడింది. సోయాబీన్ ఆయిల్ ఉత్పత్తిలో ఈ దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండడం గమనించొచ్చు. ఇక యూరప్‌లో హానికారక రసాయాల వినియోగంపై నియంత్రణలు నెలకొన్నాయి. ఇది అక్కడ రేప్‌సీడ్ ఉత్పత్తిపై ప్రభావం పడేలా చేసింది.
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణతో పొద్దు తిరుగుడు నూనె ఉత్పత్తిపై ఒత్తిడి నెలకొంది. ఈ ప్రతికూలతల వల్ల వంట నూనెల తయారీ తగ్గొచ్చన్న అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ ఏడాది ద్వితీయ భాగంలో అంతర్జాతీయ మార్కెట్లో బయో ఇంధనాలకు కొరత ఏర్పడుతుందని ఆయిల్ వరల్డ్ అనే సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ థామస్ మిల్కే తెలిపారు. వెజిటబుల్ నూనె మార్కెట్‌లో బయో ఇంధనాలు అధిక భాగాన్ని ఆక్రమిస్తున్నాయని.. ప్రపంచంలో డిమాండ్ కంటే సరఫరా తక్కువే ఉన్నట్టు చెప్పారు.
అమెరికా, యూరప్, బ్రెజిల్, ఇండోనేషియా బయోడీజిల్, రెన్యువబుల్ డీజిల్, బయోజెట్ ఇంధనం వినియోగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అమెరికా అయితే సోయాబీన్ ఆయిల్, రేప్‌సీడ్ ఆయిల్, వాడిన వంట నూనె, జంతు కొవ్వులను వినియోగిస్తోంది. యూరప్‌లో వ్యర్థాలు, రేప్‌సీడ్ ఆయిల్‌ను వినియోగిస్తున్నారు. బ్రెజిల్ అయితే సోయాబీన్ ఆయిల్‌ను బయో ఇంధనాల తయారికి వాడుతోంది.
పామాయిల్‌కు అనుకూలతలు..
బయో ఇంధనాలకు పెరుగుతున్న డిమాండ్‌తో పామాయిల్ ఉత్పత్తిదారులు, కంపెనీలు లాభపడనున్నాయి. అలాగే, ఇతర నూనె గింజలు, వెజిటబు ల్ నూనెల వినియోగం కూడా బయో ఇంధనాల తయారీలో పెరుగుతోంది. ఈ డిమాండ్ పామాయిల్‌కు కలిసొస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కానీ, డిమాండ్ పెరిగితే అప్పుడు పామాయిల్‌కు సైతం కొరత ఏర్పడే ప్రమాదం లేకపోలేదు.
ఎందు కంటే ఇండోనేషియా, మలేషియా ప్రపంచ పామాయిల్ ఉత్పత్తిలో 85 శాతం వాటా ఆక్రమిస్తున్నా యి. కానీ ఈ దేశాల్లో ప్లాంటేషన్ నిదానంగా సాగడం, ఉన్న పంటల వయసు పెరిగిపోవడం, ఉత్పత్తి లేని చెట్ల సంఖ్య పెరగడం, అటవీ భూముల వినియోగంపై ఆంక్షలు విస్తరణకు అడ్డుగా ఉన్నాయి. బయో ఇంధనాలకు డిమాండ్ పెరిగిపోతే అది ముడి సరుకు సరఫరా కొరతకు దారితీయవచ్చని.. అదే జరిగితే అంతర్జాతీయంగా కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించాలన్న లక్ష్యాలకు విఘాతం కలుగుతుందని అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ హెచ్చరించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment