చిప్ సెట్ల కొరతతో సతమతం అవుతున్న అటోమొబైల్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. కార్ల తయారీకి సంబంధించి అత్యంతక కీలకమైన విభాగంలో మార్పులు చేర్పులు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీ కీలక ప్రకటన చేశారు.
ప్రతికూల పరిస్థితులు
కరోనా సంక్షోభం తర్వాత కార్ల అమ్మకాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. అయితే అంతర్జాతీయంగా కార్ల తయారీలో కీలకమైన చిప్‌సెట్ల కొరత నెలకొంది. దీంతో కార్ల తయారీ సంస్థల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోయే పరిస్థితులు ఎదురయ్యాయి. మరోవైపు ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి డిమాండ్ పెరుగుతోంది. ఇలా అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య ఉన్న ఆటో మొబైల్ మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌కి మరో షాక్ ఇచ్చేందుకు కేంద్రం రెడీ అయ్యింది.
ఫ్లెక్స్ ఇంజన్లు తయారు చేయండి
పెట్రోలు ధరలు కంట్రోల్ కాకపోవడంతో ప్రత్యామ్నాయంగా బయో ఇథనాల్‌తో నడిచే ఇంజన్లతో నడిచే కార్లను మార్కెట్‌లోకి తేవాలంటూ కార్ల తయారీ సంస్థలను కేంద్రం ఇప్పటి వరకు కోరుతూ వస్తోంది. ఇటు పెట్రోలో/డీజిల్‌తో పాటు బయో ఇథనాల్‌తో నడిచే విధంగా ఫ్లెక్స్ ఇంజన్లు తయారు చేయాలని చెబుతోంది. అయితే కేంద్రం సూచనలకు తగ్గట్టుగా ఫ్లెక్స్ ఇంజన్లు తయారు చేయడంపై కంపెనీలు ఆసక్తి చూపించడం లేదు. ఈవీ మార్కెట్‌పై కొద్దొగొప్పో ఫోకస్ చేస్తున్నాయి.
తప్పనిసరి చేస్తాం
చెరుకు, వరి ఇతర పంట ఉత్పత్తుల నుంచి బయో ఇథనాల్ భారీ ఎత్తున తయారు చేసే అవకాశం ఉందని, కాబట్టి బయో ఇథనాల్‌కి మార్కెట్ కల్పించాలంటే ఫ్లెక్సీ ఇంజన్లతో నడిచే వాహనాలు ఉండాలి. దీంతో ఫ్లెక్సీ ఇంజన్ల తయారీని తప్పని సరి చేస్తూ త్వరలో ఆదేశాలు ఇస్తామని, ఇందుకు ఆర్నెళ్లకు మించి సమయం పట్టబోదంటూ కేంద్ర రవాణాశాఖ మంత్రి ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కుండ బద్దలు కొట్టారు.
అయోమయంలో కంపెనీలు
ఓ వైపు కర్భణ ఉద్గారాలు తగ్గించాలని చెబుతూ... ఈవీ మార్కెట్‌కి అనుకూలంగా ప్రభుత్వ విధానాలు రూపొందుతున్నాయని ఇప్పుడు కొత్తగా ఫ్లెక్సీ ఇంజన్లు అంటూ ఒత్తిడి చేస్తే ఎలాగంటూ ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. దేశ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర విధానం రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
చదవండి: BH-Series Tag: రాష్ట్రాల మధ్య వాహనాల తరలింపు సులభతరం
Comments
Please login to add a commentAdd a comment