పన్నాలాల్ ఘోష్.. ఆధునిక వేణుగాన పితామహునిగా పేరొందారు. వేణువును అటు జానపద వాయిద్యాలకు, ఇటు శాస్త్రీయ వాయిద్యాలకు సరితూగేలా మలచారు. పన్నాలాల్ ఘోష్ కృషి కారణంగానే నేటి ఫ్యూజన్ సంగీతంలో వేణువుకు ప్రముఖ స్థానం దక్కింది. పన్నాలాల్ ఘోష్ అనేక సినిమాలకు వాయిద్య సహకారాన్ని కూడా అందించారు.
పన్నాలాల్ ఘోష్ బంగ్లాదేశ్‌లోని బరిసాల్‌లో జన్మించారు. అతని అసలు పేరు అమల్ జ్యోతి ఘోష్. అతని తాత హరి కుమార్ ఘోష్, తండ్రి అక్షయ్ కుమార్ ఘోష్ నిష్ణాతులైన సంగీత విద్వాంసులు. పన్నాలాల్ ఘోష్ తల్లి సుకుమారి ప్రముఖ గాయని. పన్నాలాల్ ఘోష్ ప్రారంభ విద్య ప్రసిద్ధ సితార్ వాద్యకారుడైన అతని తండ్రి అక్షయ్ కుమార్ ఘోష్ ఆధ్వర్యంలో మొదలయ్యింది. పన్నాలాల్ ఘోష్ సితార్ వాయించడం ద్వారా తన సంగీత విద్యను ప్రారంభించారు.
తరువాతి కాలంలో పన్నాలాల్ ఘోష్ వేణువు వైపు ఆకర్షితులయ్యారు. ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ దగ్గర వేణువు పాఠాలు నేర్చుకున్నారు. ప్రఖ్యాత హార్మోనియం వాద్యకారుడు ఉస్తాద్ ఖుషీ మహమ్మద్ ఖాన్ వద్ద రెండేళ్లపాటు సంగీత శిక్షణ తీసుకున్నారు. పన్నాలాల్ ఘోష్ ఆ కాలంలోని గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్, కాజీ నజ్రుల్ ఇస్లాంలకు అమితంగా ప్రభావితులయ్యారు. ఆ సమయంలో పన్నాలాల్ ఘోష్ స్వాతంత్ర్య ఉద్యమానికి సహకరించడమే కాకుండా, బెంగాల్ సమకాలీన సంగీతం, కవిత్వంలో పునరుజ్జీవానికి కూడా విశేష కృషి చేశారు.
పన్నాలాల్ ఘోష్ వేణువును అటు జానపద సంగీతం నుండి ఇటు శాస్త్రీయ సంగీతం వరకు వాయించడానికి అనువుగా ఉండేలా సవరించారు. వేణువు పొడవు, పరిమాణం (7 రంధ్రాలతో 32 అంగుళాలు) నిర్థిష్ట రీతిలో ఉండేలా తీర్చిదిద్దారు. ఆయన అనేక కొత్త రాగాలను స్వరపరిచారు. పన్నాలాల్ ఘోష్ శిష్యులలో హరిప్రసాద్ చౌరాసియా, అమీనూర్ రెహమాన్, ఫకీరచంద్ర సామంత్, సుధాంశు చౌదరి, పండిట్ రాష్‌బెహారీ దేశాయ్, బి.జి.కర్నాడ్, చంద్రకాంత్ జోషి, మోహన్ నాద్‌కర్ణి, నిరంజన్ హల్దీపూర్ తదితరులు ఉన్నారు. అతను తన సంగీత ప్రతిభను మరింత ముందుకు తీసుకెళ్లడానికి 1940లో ముంబైకి చేరుకున్నారు. ముందుగా ‘స్నేహ బంధన్’ (1940) చిత్రానికి స్వర్తకర్తగా వ్యవహరించారు.
పన్నాలాల్ ఘోష్ 1952లో ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్, పండిట్ రవిశంకర్‌లతో కలిసి ‘ఆంధియాన్’ చిత్రానికి బ్యాగ్రౌండ్ స్కోర్‌ను రూపొందించారు. ఏడు రంధ్రాల వేణువును పన్నాలాల్ ఘోష్ తొలిసారిగా పరిచయం చేశాడు. ఈ కొత్త రంధ్రాన్ని మధ్య రంధ్రం అని పిలుస్తారు. చిటికెన వేలు ఈ రంధ్రంలోకి చేరుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. ఇదేవిధంగా పన్నాలాల్ ఘోష్ 42 అంగుళాల పొడవున్న కేవలం నాలుగు రంధ్రాలతో కూడిన మరో వెదురు వేణువును కనిపెట్టాడు. ఈ వేణువు భారతీయ ఫ్లూట్ పాశ్చాత్య సంగీతాన్ని కూడా ప్లే చేయగలుగుతుంది.పన్నాలాల్ ఘోష్ రూపొందించిన పొడవాటి వెదురు వేణువును హిందుస్థానీ శాస్త్రీయ సంగీతకారులు వాయిస్తుంటారు.
ఇది కూడా చదవండి: ఆసియాలో అతిపెద్ద కూరగాయల మార్కెట్ ఏది? ఏ స్థాయిలో వ్యాపారం జరుగుతుంది?
Comments
Please login to add a commentAdd a comment