Flute
-
కన్నయ్య..రామయ్య ఒక్కడేగా: రామ్ లల్లాకు ముస్లిం మహిళ అద్భుత కానుక
అయోధ్య శ్రీరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో అనేక విశేషాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఒక ముస్లిం మహిళ శ్రీరాముడి పట్ల తన భక్తిని చాటుకోవడం విశేషంగా నిలిచింది.అయోధ్య బాలరామునికి 21.6 అడుగుల భారీ వేణువును రూపొందించింది.ప్రపంచంలోనే అత్యంత పొడవైన వేణువును తయారు చేసింది . కన్నయ్య అయినా రామయ్య అయినా ఒకటేగా అంటోంది భక్తి పారవశ్యంతో. అద్వితీయమైన భక్తితో దీన్ని తానే తయారు చేశానని పిలిభిత్ నగరానికి చెందిన ప్రముఖ శిల్పకారుడు, దివంగత నవాబ్ అహ్మద్ భార్య హీనా పర్వీన్ పేర్కొంది. ఇంతకు ముందు పిలిభిత్‌లో 16 అడుగుల వేణువు రికార్డు ఉండేది. తాజాగా రామయ్యకోసం ఈ రికార్డును బ్రేక్ చేసింది. కుమారుడు అర్మాన్ నబీ,సమీప బంధువు షంషాద్ సాయంతో అతి పెద్ద వేణువును తయారు చేసింది. జనవరి 22న రామ జన్మభూమి కాంప్లెక్స్‌లో పిలిభిత్ వేణు నాదం ప్రతిధ్వనించనుంది. అంతేకాదు పర్వీన్ కుటుంబం మూడు తరాలుగా కన్నయ్య వేణువును తయారు చేస్తోంది. Muslim artisan Hina Parveen has made a 21 feet long Bansuri for Bhagawan Ram in Pilibhit This world's largest playable flute has been sent to Ayodhya Dham#RamMandir #RamMandirPranPratishtha pic.twitter.com/xLlOugj4Y5 — Organiser Weekly (@eOrganiser) January 20, 2024 ఈ వేణువును స్థానిక్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌కు అప్పగించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన వేణువుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుందట. ఈ వేణువు తయారీకి వినియోగించిన వెదరును అస్సాం నుండి సుమారు 20 సంవత్సరాల క్రితం తీసుకువచ్చామని పర్వీన్ కుటుంబం తెలిపింది. రెండు వైపుల నుంచి వాయించ గలిగే ఈ వేణువు తయారీకి 10 రోజులు పట్టిందని అలాగే తయారీకి దాదాపు రూ.70-80 వేలు ఖర్చయిందని వెల్లడించింది. -
వేణువుకు నిర్దిష్ట రూపం ఇచ్చిందెవరు? పాశ్చాత్య సంగీతానికీ అనువుగా మలచినదెవరు?
పన్నాలాల్ ఘోష్.. ఆధునిక వేణుగాన పితామహునిగా పేరొందారు. వేణువును అటు జానపద వాయిద్యాలకు, ఇటు శాస్త్రీయ వాయిద్యాలకు సరితూగేలా మలచారు. పన్నాలాల్ ఘోష్ కృషి కారణంగానే నేటి ఫ్యూజన్ సంగీతంలో వేణువుకు ప్రముఖ స్థానం దక్కింది. పన్నాలాల్ ఘోష్ అనేక సినిమాలకు వాయిద్య సహకారాన్ని కూడా అందించారు. పన్నాలాల్ ఘోష్ బంగ్లాదేశ్‌లోని బరిసాల్‌లో జన్మించారు. అతని అసలు పేరు అమల్ జ్యోతి ఘోష్. అతని తాత హరి కుమార్ ఘోష్, తండ్రి అక్షయ్ కుమార్ ఘోష్ నిష్ణాతులైన సంగీత విద్వాంసులు. పన్నాలాల్ ఘోష్ తల్లి సుకుమారి ప్రముఖ గాయని. పన్నాలాల్ ఘోష్ ప్రారంభ విద్య ప్రసిద్ధ సితార్ వాద్యకారుడైన అతని తండ్రి అక్షయ్ కుమార్ ఘోష్ ఆధ్వర్యంలో మొదలయ్యింది. పన్నాలాల్ ఘోష్ సితార్ వాయించడం ద్వారా తన సంగీత విద్యను ప్రారంభించారు. తరువాతి కాలంలో పన్నాలాల్ ఘోష్ వేణువు వైపు ఆకర్షితులయ్యారు. ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ దగ్గర వేణువు పాఠాలు నేర్చుకున్నారు. ప్రఖ్యాత హార్మోనియం వాద్యకారుడు ఉస్తాద్ ఖుషీ మహమ్మద్ ఖాన్ వద్ద రెండేళ్లపాటు సంగీత శిక్షణ తీసుకున్నారు. పన్నాలాల్ ఘోష్ ఆ కాలంలోని గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్, కాజీ నజ్రుల్ ఇస్లాంలకు అమితంగా ప్రభావితులయ్యారు. ఆ సమయంలో పన్నాలాల్ ఘోష్ స్వాతంత్ర్య ఉద్యమానికి సహకరించడమే కాకుండా, బెంగాల్ సమకాలీన సంగీతం, కవిత్వంలో పునరుజ్జీవానికి కూడా విశేష కృషి చేశారు. పన్నాలాల్ ఘోష్ వేణువును అటు జానపద సంగీతం నుండి ఇటు శాస్త్రీయ సంగీతం వరకు వాయించడానికి అనువుగా ఉండేలా సవరించారు. వేణువు పొడవు, పరిమాణం (7 రంధ్రాలతో 32 అంగుళాలు) నిర్థిష్ట రీతిలో ఉండేలా తీర్చిదిద్దారు. ఆయన అనేక కొత్త రాగాలను స్వరపరిచారు. పన్నాలాల్ ఘోష్ శిష్యులలో హరిప్రసాద్ చౌరాసియా, అమీనూర్ రెహమాన్, ఫకీరచంద్ర సామంత్, సుధాంశు చౌదరి, పండిట్ రాష్‌బెహారీ దేశాయ్, బి.జి.కర్నాడ్, చంద్రకాంత్ జోషి, మోహన్ నాద్కర్ణి, నిరంజన్ హల్దీపూర్ తదితరులు ఉన్నారు. అతను తన సంగీత ప్రతిభను మరింత ముందుకు తీసుకెళ్లడానికి 1940లో ముంబైకి చేరుకున్నారు. ముందుగా ‘స్నేహ బంధన్’ (1940) చిత్రానికి స్వర్తకర్తగా వ్యవహరించారు. పన్నాలాల్ ఘోష్ 1952లో ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్, పండిట్ రవిశంకర్‌లతో కలిసి ‘ఆంధియాన్’ చిత్రానికి బ్యాగ్రౌండ్ స్కోర్‌ను రూపొందించారు. ఏడు రంధ్రాల వేణువును పన్నాలాల్ ఘోష్ తొలిసారిగా పరిచయం చేశాడు. ఈ కొత్త రంధ్రాన్ని మధ్య రంధ్రం అని పిలుస్తారు. చిటికెన వేలు ఈ రంధ్రంలోకి చేరుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. ఇదేవిధంగా పన్నాలాల్ ఘోష్ 42 అంగుళాల పొడవున్న కేవలం నాలుగు రంధ్రాలతో కూడిన మరో వెదురు వేణువును కనిపెట్టాడు. ఈ వేణువు భారతీయ ఫ్లూట్ పాశ్చాత్య సంగీతాన్ని కూడా ప్లే చేయగలుగుతుంది.పన్నాలాల్ ఘోష్ రూపొందించిన పొడవాటి వెదురు వేణువును హిందుస్థానీ శాస్త్రీయ సంగీతకారులు వాయిస్తుంటారు. ఇది కూడా చదవండి: ఆసియాలో అతిపెద్ద కూరగాయల మార్కెట్ ఏది? ఏ స్థాయిలో వ్యాపారం జరుగుతుంది? -
అమృత వేణువు
‘లోకంలో ఇన్ని చెట్లు, లతలు, తీవెలు ఉన్నాయి. కొన్నింటికి పండ్లు, కొన్నింటికి పూలు, కొన్నింటి పత్రాలు వర్ణభరితం... కాని ఈ వెదురు పొదను చూడండి. నిరాడంబరమైన ఈ వెదురులోని ప్రతి చిన్న భాగానికి అమృతమయమైన నాదాన్ని వెలువరించే శక్తి ఉంది... వేణుగానాన్ని వినిపించే జీవం ఉంది’ అంటాడు హరిప్రసాద్ చౌరాసియా. ‘మా నాన్న అలహాబాద్‌లో పహిల్వాన్. ఆరేళ్ల వయసులో నేను తల్లిని కోల్పోతే ఆయన తిరిగి పెళ్లి చేసుకోలేదు. తల్లి లేని పిల్లాడు క్రమశిక్షణలో ఉండాలంటే అఖాడాలో దించి కుస్తీ లడాయిస్తూ ఉండాలని భావించాడాయన. నాకేమో చెవిన సరిగమలు పడితే ఆత్మ ఆగదు. గాత్రం నేర్చుకోవాలనుకున్నాను. తొలి రోజుల్లో పాఠాలు చెప్పిన గురువు... హరిప్రసాద్... నీకు పైస్వరం పలకదు. కాని దమ్ము చాలాసేపు నిలబెట్టగలవు. దమ్ము నిలిపే వాద్యం నేర్చుకో పైకి వస్తావు అన్నాడు. నాకు వేణువు గుర్తుకు వచ్చింది. అది ఖరీదైన వాద్యం కాదు. తీగలు ఉండవు. చర్మ వాద్యం కాదు పాడవడానికి. ఏ సంతలోనైనా దొరుకుతుంది. ఎక్కడికైనా తీసుకెళ్లడం సులభం. పెదాలతో గాలి నింపితే శబ్దాన్ని వెలువరిస్తుంది. అందుకని వేణువును ఎంచుకున్నాను’ అంటాడాయన. ఇక్కడ మీరు చదవడం ఆపి తలత్ మెహమూద్ ప్రఖ్యాత గీతం ‘ఫిర్ వహీ షామ్...’ వినండి. అందులో ఎంతో మృదువైన తలత్ గొంతును అనుసరిస్తూ మరింత మృదువైన వేణుగానం వినిపిస్తుంది. అది హరిప్రసాద్ చౌరాసియా తొలి సినీ పాట వాద్యకారుడిగా. ఇంకా అర్థం కావాలంటే ‘విధాత తలపున ప్రభవించినది’ వినండి... అందులో పాటంతా కొనసాగే వేణువును అంత అద్భుతంగా ఎవరు పలికిస్తారు చౌరాసియా తప్ప. ‘సిరివెన్నెల’లో హీరో పాత్ర పేరు అదే– హరిప్రసాద్. ఇప్పుడు దేశంలో రెండు గురుకులాలను వేణుగాన ఉపాసకుల కోసం నిర్వహిస్తున్నాడు హరిప్రసాద్ చౌరాసియా. ఒకటి భువనేశ్వర్‌లో ఉంది. ఒకటి ముంబైలో. ‘పిల్లలకు వేణువు నేర్పిస్తాను’ అని చౌరాసియా అడిగిందే తడవు నాటి ఒరిస్సా ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ స్థలం కేటాయించాడు. ముంబైలో కూడా ప్రభుత్వమే స్థలం ఇచ్చింది. ‘ముంబైలో గురుకులం కట్టడానికి డబ్బు లేదు. రతన్ టాటాను వెళ్లి అడిగాను. సంగీతం కోసం ఇబ్బందులా... అని రెండు కోట్లు ఇచ్చాడు. రెండు చోట్లా పిల్లలకు ఉచితంగానే నేర్పిస్తాను. నిజానికి వాళ్ల నుంచి నేను నేర్చుకుంటాను... నా నుంచి వాళ్లు... తుది శ్వాస వరకూ నేర్చుకుంటూ ఉండటమే నాకు ఇష్టం’ అంటాడు చౌరాసియా. నేర్చుకోవడాన్ని ఒక దశలో కొందరు మానేస్తారు. ఒక దశ నుంచి కొందరు అక్కర్లేదనుకుంటారు. వేణువులో పాండిత్యం గడించాక, కటక్ రేడియో స్టేషన్ లో ఆ తర్వాత ముంబై రేడియో స్టేషన్లో పని చేశాక, వందల సినిమా పాటలకు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్లకు వేణువు పలికించాక, విపరీతంగా డబ్బు గడించాక ‘నేనింకా నేర్చుకోవాలి’ అనుకున్నాడు తప్ప చాలు అనుకోలేదు చౌరాసియా. ‘సినిమాలో వాయించే ఆ కాసేపుతో నా ఆత్మ ఆకలి తీరడం లేదు... నేను శాస్త్రీయ సంగీతపు కెరటాలలో మునకలు వేయాలి..’ అనుకున్నాడు చౌరాసియా. కాని గురువు ఎవరు? శిష్యుల్ని ఎంచుకోవడంలో అతి కఠినంగా, అతి పరిమితంగా ఉండే అన్నపూర్ణా దేవి దగ్గర నేర్చుకోవాలని సంకల్పించాడు. అన్నపూర్ణా దేవి మహామహుడైన ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ కుమార్తె. సితార్ మేస్ట్రో పండిట్ రవిశంకర్ భార్య. కాని ఆమె ఇతడికి కనీసం తలుపు కూడా తీయలేదు. ఒకటి కాదు.. రెండు కాదు... మూడేళ్లు ఆమె ఇంటి చుట్టూ తిరిగి చివరకు శిష్యుడిగా స్వీకరించబడ్డాడు. ‘నువ్వు నేర్చుకున్నదంతా మర్చిపోవాలి’ అనేది ఆమె చెప్పిన మొదటి పాఠం. అంతవరకూ చౌరాసియా అందరిలా కుడివైపు వేణువు ధరించేవాడు. ఇప్పుడు ఎడమవైపున. నవ శిశువుగా మళ్లీ జన్మించాడు. ఒకప్పుడు ఆల్ ఇండియా రేడియోలో బి గ్రేడ్ అర్టిస్ట్‌గా సెలెక్ట్ అయిన హరిప్రసాద్ చౌరాసియా ఇవాళ ప్రపంచానికి వేణునాద గురువు. ఒక నెల నెదర్లాండ్స్‌లో పాఠాలు చెప్తాడు. ఒక నెల కెనడాలో చెప్తాడు. ఒక రోజు అచట కచ్చేరి. మరోరోజు ఏదో దేశ ఔన్నత్య పురస్కార స్వీకరణ. అలహాబాద్‌లో రణగొణ ధ్వనుల మధ్య ఏకాంత సాధన కోసం స్థలాన్ని వెతుక్కుంటూ తిరిగిన హరిప్రసాద్ చౌరాసియాకు ఇవాళ ప్రపంచ దేశాలన్నీ స్వాగతం చెప్పి తమ దగ్గర ఉండిపొమ్మంటాయి. ఆ గౌరవం అతనిలోని కళకా? దాని పట్ల అతని అర్పణకా? నిరంతర అభ్యాసం, వినమ్రత, లోపలి ఎదుగుదలపట్ల తపన, పంచేగుణం, స్వీకరించే తత్త్వం, స్థిరాభిప్రాయాలను త్యజించగలిగే నిరహంభావం, ఎదుటి వారిని గుర్తించి ప్రోత్సహించే గుణం.. ఇవి లేకుంటే మనిషి మహనీయుడు ఎలా అవుతాడు? మహనీయుడే కానక్కర్లేదు... ప్రేమాస్పదుడు ఎలా అవుతాడు? ఇవాళ సంఘంలో ప్రతి రంగంలో ఎందరో పెద్దలు. కాని కొందరే గౌరవనీయులు. అతికొద్దిమందే ప్రేమాస్పదులు. చౌరాసియా నుంచి నేర్చుకోవచ్చా మనం ఏదైనా? తాజాగా వెలువడ్డ హరిప్రసాద్ చౌరాసియా అఫిషియల్ బయోగ్రఫీ ‘బ్రెత్ ఆఫ్ గోల్డ్’ చదువుతున్నప్పుడు వెదురు పొదల మధ్య తిరుగాడినట్టు ఉంటుంది. త్రివేణీ సంగమంలో దేహాన్ని కడిగినట్టు ఉంటుంది. ముంబైలో మదన్ మోహన్ పాట రికార్డింగ్‌ను చూస్తున్నట్టు ఉంటుంది. శివ్‌తో కలిసి హరి చేస్తున్న జుగల్బందీకి ముందు వరుస సీటు దొరికినట్టు ఉంటుంది. మన జీవిత పాఠాలు మనల్ని చేరే దరులు, దారులు పరిమితం. ఇదిగో ఇలాంటి మహనీయులే చరిత్రలే మున్ముందుకు నడిపే ప్రభాత నాదం. -
ముక్కుతో ఫ్లూటు వాయిస్తూ..
-
ముక్కుతో ఫ్లూటు వాయిస్తూ.. అలరిస్తోన్న వ్యక్తి
సాక్షి, మహబూబ్‌నగర్: ప్రతి ఒక్కరిలో ఏదో ఓ కళ ఉంటుంది. దాన్ని గుర్తించి సాధన చేస్తే అందులో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. నోటితో వేణుగానం చేయటం సహజమే.. కాని మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించి పిల్లనగ్రోవిని ముక్కుతో వాయించి ఆశ్చర్య పరుస్తున్నాడు. ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామానికి చెందిన గట్టు కురుమన్న కుటుంబ పోషణ కోసం గడచిన 30 ఏళ్లుగా పశువుల కాపరిగా పనిచేస్తున్నాడు. వాటిని మేపే క్రమంలో ఖాళీ సమయాన్ని వృధా చేయటం ఎందుకని భావించిన ఆయన కురుమూర్తి స్వామి జాతరలో ఓ ప్లూట్ కొనుగోలు చేసి సినిమా పాటలు, జానపద గేయాలు ఆలపించటం మొదలు పెట్టాడు. ఇలా అందరు చేస్తారు... కానీ తాను ప్రత్యేక ఉండాలని భావించి ముక్కుతో ప్లూట్ వాయించటం సాధన చేశాడు కురుమన్న. సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం కురుమన్న ముక్కుతో ఫ్లూట్ వాయిస్తూ మధుర గీతాలు ఆలపిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాడు. చుట్టుపక్కల గ్రామాల్లో తనకుంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. ముక్కుతో గానం చేస్తున్న తనకు గ్రామస్తుల నుంచేకాక ఇతర ప్రాంతాల వారిని నుంచి ఆదరణ లభిస్తుందని అంటున్నాడు కురుమన్న. ఎవరికైనా ఆసక్తి ఉంటే తాను వారికి ముక్కుతో ఫ్లూట్ వాయించటం నేర్పుతానని అంటున్నాడు. -
శంకరప్పా.. శభాష్!
కర్నూలు, మహానంది: సాధారణంగా నోటితో పిల్లనగ్రోవితో పాటలు పాడుతుండడం చూస్తుంటాం. కానీ ఓ వ్యక్తి తన నాసికారంధ్రాలతో పిల్లనగ్రోవిని ఊదుతూ సంగీత స్వరాలను పలికిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. కర్ణాటక రాష్ట్రం బూరగమాడకు చెందిన శంకరప్ప మేకలు కాస్తూ జీవనం సాగిస్తుంటాడు. కర్ణాటకలో ఓ ఉత్సవానికి వెళ్లిన ఆయన పిల్లనగ్రోవిని కొనుక్కుని మేకలు కాసేందుకు వెళ్లినప్పుడు సరదాగా ఊదుతూ కొన్నేళ్లకు పాటలు పాడే స్థాయికి వెళ్లాడు. అయితే ఏదో ఒక కొత్తదనం ఉండాలన్న కాంక్షతో ముక్కురంధ్రాలతో ఊదడం ప్రాక్టీస్ చేశాడు. నోరు మూసుకుని ముక్కురంధ్రంతో పిల్లనగ్రోవిని ఊదుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. మూడేళ్ల నుంచి ఇలా చేస్తున్నానని, ఎక్కడైనా ఉత్సవాలు జరిగితే అక్కడికి వెళ్లి భక్తుల ముందు ప్రదర్శిస్తూ వారు ఇచ్చిన పదో ఇరవయ్యో తీసుకుంటూ ఉంటానని శంకరప్ప ‘సాక్షి’తో తెలిపారు. మహానందీశ్వర దర్శనానికి వచ్చిన తన ప్లూట్ ప్రదర్శనతో భక్తులను ఆకట్టుకున్నారు. -
శిఖర్ ధావన్ వేణుగానం
-
మధురస్వరా‘లాఠీ’
యశవంతపుర: కొత్తగా ఆలోచిస్తేనే కొత్త అంశాలు పుట్టుకొస్తాయి. ఒక కానిస్టేబుల్ తన ప్లాస్టిక్ లాఠీనే వేణువుగా రాగాలు పలికించారు. హుబ్లీ రూరల్ పోలీసుస్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ చంద్రకాంత్ హుటగి ఈ విన్యాసాన్ని ప్రదర్శించారు. ఈ వీడియోను రిజర్వ్ బెటాలియన్ ఏడిజీపీ భాస్కర్‌రావ్ ఫేస్బుక్లో అప్లోడ్ చేయడంతో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రిజర్వు విభాగం డిజీపీ చంద్రకాంత్ నాదం వాయిస్తున్న సమయంలో కానిస్టేబుల్ వెంట ఉన్నారు. చట్ట పరిరక్షణకు అవసరమైన లాఠీని నాదస్వరంలా వాయిస్తే ఒక సంగీత కళకారుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నికల సందర్భంగా చిక్కమగళూరుకు విధులకు కెటాయించారు. రోజు నాలుగైదు గంటల విరామంగా ఉండటంతో తన వద్దనున్న ఫైబర్ లాఠీకి రంధ్రాలు పెట్టి సుమధురస్వరాలను పలికించడం నేర్చుకున్నట్లు చెప్పారు. Chandrakant Hutgi, Head Constable from Hubli Rural Police station has converted his Deadly Fiber Lathi into a Musical Instrument... we are proud of him... pic.twitter.com/gyZWhk1lkb — Bhaskar Rao IPS (@deepolice12) May 28, 2019 -
బూడిదలో పోసిన పన్నీరే
ఓ మత బోధకుడి దగ్గర ఓ వేణువు ఉంది. దాన్ని వాయించడానికి అతను కొన్నిసార్లు ఓ పర్వతం మీదకు వెళ్లేవారు. అప్పుడా దార్లో వెళ్ళేవారందరూ ఆ వేణునాదాన్ని విని మైమరచిపోతారు. అంతెందుకు ఆ వేణునాదానికి జింకలు ఆగిపోతాయి. ఎగురుతున్న పక్షులు ఆయన దగ్గరకు వచ్చి వాలుతాయి. కొన్నేళ్ళకు అతను చనిపోయారు. ఆ వేణువును చెట్టుకింద ఉంచి దాన్ని పూజించడం మొదలుపెట్టారు. ఒకటి రెండు తరాల తర్వాత ప్రజలు ఈ వెదురు వేణువులో ఏముంది దీన్ని ఇలాగే ఓ కొయ్యలాగా ఆరాధించడమేంటీ... దీన్ని మరింత గొప్పగా ఆరాధించాలి అనుకుని దాన్ని బంగారంతో అలంకరించారు. కొన్నేళ్ళు గడిచాయి. ఒకసారి కొందరు సంగీత కళాకారులు ఆ దారిలో వచ్చారు. ఆ వేణువు గురించి ఆ నోటా ఈనోటా విన్నారు. దాన్ని చూడడం కోసమే అక్కడికి వచ్చారు. బంగారంతోనూ వజ్రాలతోనూ అలంకరించిన ఆ వేణువును చూశారు. ఆ వేణువును ఆ సంగీత బృంద నాయకుడు తీసి చూశారు. ఆ తర్వాత దానిని వాయించి చూసారు. కానీ రవ్వంత నాదం కూడా రావడం లేదు. వేణువు రంధ్రాలన్నీ కప్పేసి ఉన్నాయి. దాన్నో అలంకారప్రాయమైన వస్తువుగా మార్చడం బాధాకరమని నొచ్చుకున్నారు. అంతెందుకు మహావీరుడి మాటలను, బుద్ధుడి మాటలను, ఏసు ప్రభువు మాటలనూ ఇలాగే కొందరు ఓ అలంకారప్రాయ వస్తువులుగా మార్చేసి ఫ్రేము కట్టి చూస్తున్నారే తప్ప వాటిలోని మంచిని నలుగురికీ చెప్పి ఉపయోగపడేలా చేయడం లేదన్నదే వాస్తవం. మహాత్ముల మాటలను ఆచరించడానికే తప్ప వొట్టినే పూజించడానికి కాదు అని తెలుసుకునే వరకూ ఎవరెన్ని ఆణిముత్యాలు చెప్పినా బూడిదలో పోసిన పన్నీరే... – యామిజాల జగదీశ్ -
వెదురులా కాదు.. వేణువులా...
ఆత్మీయం అడవిలో ఎన్నో వెదురు చెట్లు ఉంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే వేణువులవుతాయి. అన్ని వెదురు చెట్లకూ వేణువు అయ్యే అర్హత ఉంది. కానీ వాటిలో కొన్నే సహకరిస్తాయి వేణువు కావడానికి. ఏది గాయాలు భరించి గాలితో కలిసేందుకు ద్వారాలు తెరచుకుంటుందో అది సత్ఫలితాన్ని ఇస్తుంది. ఏది మూసుకుంటుందో అది ఫలితాన్ని ఇవ్వదు. మనుషులలో కొందరు వెదురు చెట్లలా ఉన్నారు. వారిలో కొందరు వేణువులవుతున్నారు. గాయపడి పాడేందుకు సహకరించే వారు కొందరే. జీవితం గుప్పెట్లో వారు వేణువు అవుతారు. వారి నుంచి మంచి సంగీతం పుడుతుంది. కానీ చాలామంది తమ హృదయ కవాటాలను మూసే ఉంచుతున్నారు. వారు తమను తెరవని పుస్తకంగానే ఉంచుకుంటారు. అటువంటి వారికి వాకిలి ఉన్నా లేనట్లే. కిటికీలు ఉన్నా లేనట్లే. కనుక వారి నుంచి సంగీతం పుట్టడం అసాధ్యం. జీవన సంగీతం ఓ వరం. అందుకు పెట్టి పుట్టాలి. గాయాలు పడిన వెదురు వేణు గానమవుతుంది. మనుషులూ అంతే. గాయపడి నలిగినా, వారు ఆ బాధలో నుంచి పాటలు కడతారు. ఆలపిస్తారు. మనసుల్ని ఆకట్టుకుంటారు. ఊరట చెందుతారు. రంధ్రాలు వేయించుకోవడానికి గాయాలు భరిస్తూ సహకరించిన వెదురు అందాన్ని కోల్పోవచ్చు. కానీ ఫలితాన్ని ఇస్తుంది. -
13 ఏళ్లకే ఫ్లూట్ తో ఇరగదీశాడు!
-
13 ఏళ్లకే ఫ్లూట్ తో ఇరగదీశాడు!
అమృతసర్ కు చెందిన పదమూడేళ్ల బాలుడు సులేమాన్ ఫ్లూట్ తో చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఫ్లూట్ భక్తులు సులేమాన్ ట్యూన్ ని ఫాలో అయిపోతున్నారు. 'ఇండియాస్ గాట్ టాలెంట్ 7' షోలో ప్రేక్షకుల ఓటింగ్ తో శనివారం రాత్రి విజేతగా అవతరించాడు. ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన ఇండియాస్ గాట్ టాలెంట్ సీజన్ 7 ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్, నటుడు కిరణ్ ఖేర్, నటి మలైకా అరోరా ఖాన్ లు ఈ షోకు జడ్జిలు గా వ్యవహరించారు. ఈ నెల 9న జరిగిన గ్రాండ్ ఫైనల్లో నలుగురితో పోటీ పడిన సల్మాన్ వీక్షకుల ఆశీర్వాదంతో సీజన్7 విన్నర్ గా అవతరించాడు. సులేమాన్ తల్లిదండ్రులు కూడా మ్యూజిషియన్స్ కావడంతో చిన్ననాటి నుంచే అతనికి ఫ్లూట్ ను నేర్పించినట్లు చెప్పారు. మూడేళ్ల వయసులో సులేమాన్ సాధనను ప్రారంభించాడని, ఆ తర్వాత అతన్ని పీటీ హరిప్రసాద్ చౌరాసియా వద్ద శిక్షణకు పంపుతున్నట్లు తెలిపారు. చదువు పూర్తయ్యాక సంగీత ప్రపంచంలోకి అడుగుపెడతానని సులేమాన్ చెప్పారు. -
ఎరక్కపోయి వచ్చి.. ఇరుక్కుపోయి..
ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోని ఓ ఇంట్లో గురువారం రాత్రి ఈ ఎలుక పిల్ల అటూ ఇటూ తిరుగుతూ వేణువులో దూరింది. అనంతరం దాని రంధ్రంలో నుంచి తల పెకైత్తి చూసింది. అంతే ఇలా ఇరుక్కుపోయింది. తల వెనక్కు ఎలా తీసుకోవాలో తెలియక రాత్రంతా ఇలాగే ఉండిపోయింది. శుక్రవారం ఉదయం ఆ ఇంట్లోని వ్యక్తులు ఈ మూషికాన్ని గమనించి ఇలా ఫొటో తీశారు. - న్యూస్‌లైన్, కురిచేడు (ప్రకాశం జిల్లా)