
కర్నూలు, మహానంది: సాధారణంగా నోటితో పిల్లనగ్రోవితో పాటలు పాడుతుండడం చూస్తుంటాం. కానీ ఓ వ్యక్తి తన నాసికారంధ్రాలతో పిల్లనగ్రోవిని ఊదుతూ సంగీత స్వరాలను పలికిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. కర్ణాటక రాష్ట్రం బూరగమాడకు చెందిన శంకరప్ప మేకలు కాస్తూ జీవనం సాగిస్తుంటాడు. కర్ణాటకలో ఓ ఉత్సవానికి వెళ్లిన ఆయన పిల్లనగ్రోవిని కొనుక్కుని మేకలు కాసేందుకు వెళ్లినప్పుడు సరదాగా ఊదుతూ కొన్నేళ్లకు పాటలు పాడే స్థాయికి వెళ్లాడు. అయితే ఏదో ఒక కొత్తదనం ఉండాలన్న కాంక్షతో ముక్కురంధ్రాలతో ఊదడం ప్రాక్టీస్ చేశాడు. నోరు మూసుకుని ముక్కురంధ్రంతో పిల్లనగ్రోవిని ఊదుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. మూడేళ్ల నుంచి ఇలా చేస్తున్నానని, ఎక్కడైనా ఉత్సవాలు జరిగితే అక్కడికి వెళ్లి భక్తుల ముందు ప్రదర్శిస్తూ వారు ఇచ్చిన పదో ఇరవయ్యో తీసుకుంటూ ఉంటానని శంకరప్ప ‘సాక్షి’తో తెలిపారు. మహానందీశ్వర దర్శనానికి వచ్చిన తన ప్లూట్ ప్రదర్శనతో భక్తులను ఆకట్టుకున్నారు.