Songs Singing
-
‘మీరెవరండీ బాబూ’.. ఇదెలా ఎలా సాధ్యం?
‘ఎన్ని పాటలు పాడగలరు?’ అని అడిగితే ‘ఎన్నయినా సరే’ అంటారు పాటలను ప్రేమించే గాయకులు. ‘ఒకే ఒక్క నిమిషంలో ఎన్ని పాడగలరు?’ అని అడిగితే మాత్రం– ‘మీరెవరండీ బాబూ’ అంటారు. అయితే సాత్ కొరియాకు చెందిన ఒక యువ జంట ఇండోనేషియా నుంచి ఇండియా (బాలీవుడ్ సినిమా సుఖూన్లోని దిల్ కో ఖరార్ ఆయా.. పాట) వరకు తొమ్మిది భాషలలో 13 పాటలు పాడారు. ఈ వీడియో 2.1 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకొని దూసుకుపోతోంది. ‘ఇది సరేగానీ.. ఒక్క నిమిషంలో 13 పాటలు ఎలా సాధ్యం?’ అనే సందేహం అందరికీ వస్తుంది. 13 పాటలలోని ఒక్కో చరణాన్ని తీసుకొని ఒకే పాటలా చాలా స్పీడ్‌గా పాడారు. చదవండి: ఈమె దెయ్యమా.. మనిషా..? అనుమానం వస్తే తప్పులేదు.. ఎందుకంటే? -
Jasmine Telugu Songs: పాటతో సేద తీరండి
సెకండ్ వేవ్ అట. మల్లెలు పూసె వెన్నెల కాసే... హాస్పిటల్స్‌లో బెడ్స్ లేవట. నాగమల్లివో తీగమల్లివో నీవే రాజకుమారి... వాక్సిన్ నో స్టాక్. మల్లెపందిరి నీడలోనా జాబిల్లి... రాత్రిళ్లు కర్ఫ్యూ. మల్లెతీగకు పందిరివోలే.... మసక చీకటిలో ఎన్నెలవోలే... ఏం వింటాం చుట్టూ వార్తలు. హాయిగా పాటలు విందాం. మల్లెలు పూచే కాలం ఇది. ఈ ఆదివారం సినీ మల్లెలకు అర్పితం చేద్దాం. ‘మనసున మల్లెల మాలలూగెనే’... అని రాశారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ‘మల్లీశ్వరి’ కోసం. అసలు మల్లెల మాలలను చూడటమే మనోహరం. మరి అవి మనసున ఊగితే? ప్రేమికులకు అలా ఉంటుందట. భానుమతి, ఎన్.టి.ఆర్‌లకు అలా ఉందో లేదో కాని మనకు ఉంటుంది విన్న ప్రతిసారీ. మనసు ఊగినట్టు. కాసింత మైమరిచినట్టు. చాలదూ. పాట ఇంతకు మించి ఏం చేయాలి? సుశీలమ్మ గొంతు మరుమల్లెల గుత్తి. పలికిన చాలు పరిమళమే. ‘ఇది మల్లెల వేళయనీ... ఇది వెన్నెల మాసమనీ’... ‘సుఖదుఃఖాలు’లో ఆమె పాడుతుంటే ఏదో ఒక తెలియని వేదన కూడా పరిమళభరితమే అనిపిస్తుంది. ఏం మాటాడబుద్ధి కాదు. కూచున్నచోట నుంచి లేవబుద్ధి కాదు. మనమూ పాటా.. అవి మాత్రమే ఉంటాయి. మరి సి.నారాయణరెడ్డి గారు రాకుండా ఉంటారా? మల్లెల అత్తరును కలంలో పోసుకోకుండా ఉంటారా? ‘అడుగుజాడలు’ సినిమాలో ఎన్.టి.ఆర్, జమునలకు మంచి డ్యూయెట్ రాయలేదూ? దానిని ఘంటసాలతో కలిసి జానకమ్మ పలకలేదూ? ‘మల్లెలు కురిసే చల్లని వేళలో మనసే పలికెను నేడేలనో’... వాహ్. ఎంత హాయి. ఈ సినారేనే ఆ తర్వాత కలర్ సినిమాలు వచ్చాక ‘ఇంటింటి రామాయణం’ కోసం ‘మల్లెలు పూసె వెన్నెల కాసే ఈ రేయి హాయిగా’ అన్నారు. ఆ ఒక్కపాటలో ఉన్నందుకు రంగనాథ్, ప్రభల సినిమా సౌందర్యం శాశ్వతం అయ్యింది. రొమాంటిక్ హీరో అక్కినేని ‘తెల్లచీర కట్టుకున్నదెవరి కోసము... మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసమూ’ అని తరచి అడుగుతారు కృష్ణకుమారిని ‘అంతస్తులు’ సినిమాలో. ఆయనకు తెలియదా.. ఆయన కోసమేనని. అక్కినేనే ‘అమరజీవి’లో ‘మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి’ పాడారు. జయప్రద ఆ పాటలో అచ్చు మల్లెపూవులానే ఉంటుంది. అసలు అక్కినేనికి మంచి హిట్టునిచ్చింది ఆ తర్వాత మల్లెలే ‘అనుబంధం’లో. ఆయన అందులో రాధికతో కలిసి ‘మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన’ పాటను అదరగొట్టేశారు. వేటూరి మల్లెల సుగంధాన్ని తన పాటల్లో వదిలిపెట్టలేదు. ‘పదహారేళ్ల వయసు’లో ‘సిరిమల్లె పువ్వా’ ఆయన పదాలకు పరికిణీ కట్టి గెంతించింది. ‘జ్యోతి’లో ఆయన రాసిన ‘సిరిమల్లెపువ్వల్లే నవ్వు’ నిత్యహాసితం. సూపర్‌స్టార్ కృష్ణకు సూపర్ మల్లెలు దక్కాయి. ‘మాయదారి మల్లిగాడు’లో కృష్ణకు, మంజులకు పెళ్లయినప్పుడు జయంతి పాడే ‘మల్లెపందిరి నీడలోన జాబిల్లి’ నేటికీ హిట్. ‘బంగారుబావ’లో కృష్ణ స్టేజీ ఎక్కి ‘మల్లికా నవ మల్లికా’ పాడతారు. బాలూ సూపర్బ్ ఆలాపన. ‘అల్లరి బుల్లోడు’లో ‘చుక్కలతోటలో ఎక్కడున్నావో పక్కకు రావే సిరిమల్లె పువ్వా’ పాట ఎంత బాగుంటుంది. ఇక ఆయనకు మాస్ హిట్ ఇచ్చిన ‘ఊరికి మొనగాడు’ పాట అందరికీ తెలిసిందే. ‘ఇదిగో తెల్లచీర... ఇవిగో మల్లెపూలు’. మల్లెలే కాదు మల్లెతీగ కూడా పాటల్లో తన వాటా తీసుకుంది. ‘మల్లెతీగ వాడిపోగ మరల పూలు పూయునా’ పాట ‘పూజ’లో హిట్. ‘మీనా’లో ‘మల్లెతీగ వంటిది మగువ జీవితం’ పాట కూడా హిట్టే. ‘ఒరేయ్ రిక్షా’లో ‘మల్లెతీగకు పందిరివోలే’ అని చెల్లెలి సెంటిమెంట్ పాట ఊరువాడ మోగిపోయింది. ఆ తర్వాతి రోజుల్లో కొత్త సినీ సంగీకారులు, గేయకర్తలు కూడా తెలుగు సినిమాల్లో మల్లెపూలకు చోటిచ్చారు. ‘తీగనై మల్లెలు పూచిన వేళ’ (చిరంజీవి– ఆరాధన), ‘మల్లెల వాన మల్లెల వాన’ (రాజా), ‘మల్లెపూల వాన’ (వినోదం)... ఇక ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ టైటిల్ సాంగ్ ఉండనే ఉంది. డబ్బింగ్ పాటల్లో కూడా ‘మౌనరాగం’లో ‘మల్లెపూల చల్లగాలి మంట రేపె సందెవేళలో’, ‘అమృత’లో ‘మరుమల్లెల్లో ఈ జగమంతా విరియగా’... ఇవన్నీ పరిమళం చిందినవే. పాట ఎప్పుడూ ఒక స్ట్రెస్ బస్టరే. పాటను వినగలిగే ఆస్వాదించే హృదయం కాపాడుకుంటే ఆందోళనలను దూరం పెట్టినవారమవుతాము. పాట ఆహ్లాదం. పాట ఆరోగ్యం. పాట... ఈ కరోనా కాలాన ఒక అవసరమైన ఆస్వాదన. ఆస్వాదించండి. – సాక్షి ఫ్యామిలీ -
శంకరప్పా.. శభాష్!
కర్నూలు, మహానంది: సాధారణంగా నోటితో పిల్లనగ్రోవితో పాటలు పాడుతుండడం చూస్తుంటాం. కానీ ఓ వ్యక్తి తన నాసికారంధ్రాలతో పిల్లనగ్రోవిని ఊదుతూ సంగీత స్వరాలను పలికిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. కర్ణాటక రాష్ట్రం బూరగమాడకు చెందిన శంకరప్ప మేకలు కాస్తూ జీవనం సాగిస్తుంటాడు. కర్ణాటకలో ఓ ఉత్సవానికి వెళ్లిన ఆయన పిల్లనగ్రోవిని కొనుక్కుని మేకలు కాసేందుకు వెళ్లినప్పుడు సరదాగా ఊదుతూ కొన్నేళ్లకు పాటలు పాడే స్థాయికి వెళ్లాడు. అయితే ఏదో ఒక కొత్తదనం ఉండాలన్న కాంక్షతో ముక్కురంధ్రాలతో ఊదడం ప్రాక్టీస్ చేశాడు. నోరు మూసుకుని ముక్కురంధ్రంతో పిల్లనగ్రోవిని ఊదుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. మూడేళ్ల నుంచి ఇలా చేస్తున్నానని, ఎక్కడైనా ఉత్సవాలు జరిగితే అక్కడికి వెళ్లి భక్తుల ముందు ప్రదర్శిస్తూ వారు ఇచ్చిన పదో ఇరవయ్యో తీసుకుంటూ ఉంటానని శంకరప్ప ‘సాక్షి’తో తెలిపారు. మహానందీశ్వర దర్శనానికి వచ్చిన తన ప్లూట్ ప్రదర్శనతో భక్తులను ఆకట్టుకున్నారు. -
స్టార్లు పాడితే... లోకమే ఆడదా..!
సినిమా ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంది. ప్రెజెంట్ ట్రెండ్ ఏమిటంటే... హీరోలూ, హీరోయిన్లూ గొంతు విప్పి పాటలు పాడడం. తెలుగు చిత్రసీమలోనూ, హిందీ చిత్రసీమలోనూ ఈ కల్చర్ ఎక్కువైపోయింది. లేటెస్ట్గా ఈ వారంలో... సింగర్స్ అవతారమెత్తిన ఓ ముగ్గురు స్టార్స్ గురించి డీటైల్స్... గొంతు సవరించిన బన్నీ అల్లు అర్జున్ డ్యాన్సులు బాగా చేస్తారు. ఫైట్లు ఇరగదీస్తారు. మరి... ఆయన సాంగ్ సింగితే ఎలా ఉంటుంది? నిజంగానే మరికొన్ని రోజుల్లో ఆయన పాడిన పాటను మనం వినబోతున్నాం. యస్.. ఈ స్టయిలిష్ స్టార్ పాట పాడేశారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ‘సరైనోడు’ చిత్రం రూపొందు తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఎస్. ఎస్. తమన్ స్వరాలందిస్తున్నారు. మామూలుగా తాను ఏ సినిమాకి పాటలందించినా ఆ సినిమాలో నటించే హీరోతోనో, హీరోయిన్తోనో పాట పాడించడానికి ట్రై చేస్తారు తమన్. చిన్న ఎన్టీఆర్, రవితేజ, శ్రుతీహాసన్ వంటి తారలు తమన్ ట్యూన్స్‌కు పాడారు. ఇప్పుడు అల్లు అర్జున్‌తో పాడించడంలో కూడా ఆయన సక్సెస్ అయ్యారు. ‘‘బన్నీ లాంటి బెస్ట్ డ్యాన్సర్‌కి ట్యూన్స్ తయారు చేయడం సవాల్‌గా అనిపించింది’’ అని ఈ సందర్భంగా తమన్ పేర్కొన్నారు. చెన్నైలోని రికార్డింగ్ థియేటర్లో అల్లు అర్జున్ పాడగా ఓ పాటను రికార్డ్ చేశారు. బన్నీ భలేగా పాడారట. మార్చిలో ఆడియోను విడుదల చేయాలనుకుంటున్నారు. సో... సింగర్‌గా బన్నీ గొంతు వినడానికి మరెన్నో రోజులు లేదన్నమాట. పరిణీతి పాడుతుందోచ్! బాలీవుడ్లో సింగర్స్‌గా ఆకట్టుకున్న కథానాయికలు చాలామందే ఉన్నారు. సోనాక్షీ సిన్హా, శ్రద్ధాకపూర్, ఆలియా భట్‌లతో పాటు మన దక్షిణాది బ్యూటీ శ్రుతి కూడా హిందీలో పాడి, భేష్ అనిపించుకున్నారు. ప్రియాంకా చోప్రా ఏకంగా ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఆల్బమ్స్‌తో గాయనిగా ఫేమస్ అయిపోయారు. సింగర్స్ అవతారమెత్తిన కథానాయికల జాబితాలో ఇప్పుడు పరిణీతి చోప్రా చేరిపోయారు. ప్రస్తుతం ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘మేరీ ప్యారీ బిందు’. సంగీత దర్శక ద్వయం సచిన్- జిగర్ ఈ చిత్రానికి పాటలు స్వరపరుస్తున్నారు. ఈ చిత్రంలోని ‘మనా కీ హమ్ యార్ నహీ...’ అనే పాటను పరిణీతితో పాడించాలనుకున్నారట. ఈ బ్యూటీని అడగ్గానే.. ఓకే చెప్పేశారు. వాస్తవానికి పరిణీతి గాయకురాలిగా శిక్షణ కూడా పొందారు. అయితే, ఇప్పటివరకూ ఆమె సినిమాలకు పాడలేదు. ‘‘పాడాలని చాలామంది దర్శకులు, సంగీత దర్శకులు అన్నారు. కానీ, ఎందుకనో కుదరలేదు. ఇప్పుడు కుదిరింది’’ అని పరిణీతి పేర్కొన్నారు. త్వరలో ఆమె పాడగా ఈ పాటను రికార్డ్ చేయనున్నారు. అంజలి నోట... తమిళ పాట... పదహారణాల తెలుగమ్మాయి అంజలి ఒకవైపు గ్లామరస్ రోల్స్ చేయడంతో పాటు మరోవైపు నటనకు అవకాశం ఉన్న ట్రెడిషనల్ రోల్స్ చేస్తూ దూసుకెళుతున్నారు. ప్రస్తుతం ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రాల్లో ‘చిత్రాంగద’ ఒకటి. ‘పిల్ల జమీందార్’ ఫేమ్ అశోక్ ఈ చిత్రానికి దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో గంగపట్నం శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ వెర్షన్‌కి ‘యార్ నీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి స్వామినాథన్ పాటలు స్వరపరుస్తున్నారు. ఓ పాటను అంజలితో పాడించాలనుకుంటున్నారట. అంజలి వాయిస్ ముద్దు ముద్దుగా ఉంటుంది. ఇక, పాడితే ఎంత ముద్దుగా ఉంటుందో? అంజలి పాడనున్న తొలి పాట ఇదే అవుతుంది. ఇది ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ. వివిధ ప్రాంతాలతో పాటు అమెరికాలోని ఎనిమిది నగరాల్లో కూడా ఈ సినిమా చిత్రీకరణ జరిపారట. హారర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అంజలి పాట కచ్చితంగా స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందని చిత్ర యూనిట్ భావన.