సెకండ్ వేవ్ అట. మల్లెలు పూసె వెన్నెల కాసే... హాస్పిటల్స్‌లో బెడ్స్ లేవట. నాగమల్లివో తీగమల్లివో నీవే రాజకుమారి... వాక్సిన్ నో స్టాక్. మల్లెపందిరి నీడలోనా జాబిల్లి... రాత్రిళ్లు కర్ఫ్యూ. మల్లెతీగకు పందిరివోలే.... మసక చీకటిలో ఎన్నెలవోలే... ఏం వింటాం చుట్టూ వార్తలు. హాయిగా పాటలు విందాం. మల్లెలు పూచే కాలం ఇది. ఈ ఆదివారం సినీ మల్లెలకు అర్పితం చేద్దాం.
‘మనసున మల్లెల మాలలూగెనే’... అని రాశారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ‘మల్లీశ్వరి’ కోసం. అసలు మల్లెల మాలలను చూడటమే మనోహరం. మరి అవి మనసున ఊగితే? ప్రేమికులకు అలా ఉంటుందట. భానుమతి, ఎన్.టి.ఆర్‌లకు అలా ఉందో లేదో కాని మనకు ఉంటుంది విన్న ప్రతిసారీ. మనసు ఊగినట్టు. కాసింత మైమరిచినట్టు. చాలదూ. పాట ఇంతకు మించి ఏం చేయాలి?
సుశీలమ్మ గొంతు మరుమల్లెల గుత్తి. పలికిన చాలు పరిమళమే. ‘ఇది మల్లెల వేళయనీ... ఇది వెన్నెల మాసమనీ’... ‘సుఖదుఃఖాలు’లో ఆమె పాడుతుంటే ఏదో ఒక తెలియని వేదన కూడా పరిమళభరితమే అనిపిస్తుంది. ఏం మాటాడబుద్ధి కాదు. కూచున్నచోట నుంచి లేవబుద్ధి కాదు. మనమూ పాటా.. అవి మాత్రమే ఉంటాయి.
మరి సి.నారాయణరెడ్డి గారు రాకుండా ఉంటారా? మల్లెల అత్తరును కలంలో పోసుకోకుండా ఉంటారా? ‘అడుగుజాడలు’ సినిమాలో ఎన్.టి.ఆర్, జమునలకు మంచి డ్యూయెట్ రాయలేదూ? దానిని ఘంటసాలతో కలిసి జానకమ్మ పలకలేదూ? ‘మల్లెలు కురిసే చల్లని వేళలో మనసే పలికెను నేడేలనో’... వాహ్. ఎంత హాయి. ఈ సినారేనే ఆ తర్వాత కలర్ సినిమాలు వచ్చాక ‘ఇంటింటి రామాయణం’ కోసం ‘మల్లెలు పూసె వెన్నెల కాసే ఈ రేయి హాయిగా’ అన్నారు. ఆ ఒక్కపాటలో ఉన్నందుకు రంగనాథ్, ప్రభల సినిమా సౌందర్యం శాశ్వతం అయ్యింది.
రొమాంటిక్ హీరో అక్కినేని ‘తెల్లచీర కట్టుకున్నదెవరి కోసము... మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసమూ’ అని తరచి అడుగుతారు కృష్ణకుమారిని ‘అంతస్తులు’ సినిమాలో. ఆయనకు తెలియదా.. ఆయన కోసమేనని. అక్కినేనే ‘అమరజీవి’లో ‘మల్లెపూల మారాణికి బంతిపూల పారాణి’ పాడారు. జయప్రద ఆ పాటలో అచ్చు మల్లెపూవులానే ఉంటుంది. అసలు అక్కినేనికి మంచి హిట్టునిచ్చింది ఆ తర్వాత మల్లెలే ‘అనుబంధం’లో. ఆయన అందులో రాధికతో కలిసి ‘మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోన’ పాటను అదరగొట్టేశారు.
వేటూరి మల్లెల సుగంధాన్ని తన పాటల్లో వదిలిపెట్టలేదు. ‘పదహారేళ్ల వయసు’లో ‘సిరిమల్లె పువ్వా’ ఆయన పదాలకు పరికిణీ కట్టి గెంతించింది. ‘జ్యోతి’లో ఆయన రాసిన ‘సిరిమల్లెపువ్వల్లే నవ్వు’ నిత్యహాసితం.
సూపర్‌స్టార్ కృష్ణకు సూపర్ మల్లెలు దక్కాయి. ‘మాయదారి మల్లిగాడు’లో కృష్ణకు, మంజులకు పెళ్లయినప్పుడు జయంతి పాడే ‘మల్లెపందిరి నీడలోన జాబిల్లి’ నేటికీ హిట్. ‘బంగారుబావ’లో కృష్ణ స్టేజీ ఎక్కి ‘మల్లికా నవ మల్లికా’ పాడతారు. బాలూ సూపర్బ్ ఆలాపన. ‘అల్లరి బుల్లోడు’లో ‘చుక్కలతోటలో ఎక్కడున్నావో పక్కకు రావే సిరిమల్లె పువ్వా’ పాట ఎంత బాగుంటుంది. ఇక ఆయనకు మాస్ హిట్ ఇచ్చిన ‘ఊరికి మొనగాడు’ పాట అందరికీ తెలిసిందే. ‘ఇదిగో తెల్లచీర... ఇవిగో మల్లెపూలు’.
మల్లెలే కాదు మల్లెతీగ కూడా పాటల్లో తన వాటా తీసుకుంది. ‘మల్లెతీగ వాడిపోగ మరల పూలు పూయునా’ పాట ‘పూజ’లో హిట్. ‘మీనా’లో ‘మల్లెతీగ వంటిది మగువ జీవితం’ పాట కూడా హిట్టే. ‘ఒరేయ్ రిక్షా’లో ‘మల్లెతీగకు పందిరివోలే’ అని చెల్లెలి సెంటిమెంట్ పాట ఊరువాడ మోగిపోయింది.
ఆ తర్వాతి రోజుల్లో కొత్త సినీ సంగీకారులు, గేయకర్తలు కూడా తెలుగు సినిమాల్లో మల్లెపూలకు చోటిచ్చారు. ‘తీగనై మల్లెలు పూచిన వేళ’ (చిరంజీవి– ఆరాధన), ‘మల్లెల వాన మల్లెల వాన’ (రాజా), ‘మల్లెపూల వాన’ (వినోదం)... ఇక ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ టైటిల్ సాంగ్ ఉండనే ఉంది. డబ్బింగ్ పాటల్లో కూడా ‘మౌనరాగం’లో ‘మల్లెపూల చల్లగాలి మంట రేపె సందెవేళలో’, ‘అమృత’లో ‘మరుమల్లెల్లో ఈ జగమంతా విరియగా’... ఇవన్నీ పరిమళం చిందినవే.
పాట ఎప్పుడూ ఒక స్ట్రెస్ బస్టరే. పాటను వినగలిగే ఆస్వాదించే హృదయం కాపాడుకుంటే ఆందోళనలను దూరం పెట్టినవారమవుతాము.
పాట ఆహ్లాదం. పాట ఆరోగ్యం. పాట... ఈ కరోనా కాలాన ఒక అవసరమైన ఆస్వాదన. ఆస్వాదించండి.
– సాక్షి ఫ్యామిలీ
Jasmine Telugu Songs: పాటతో సేద తీరండి
Published Sun, Apr 11 2021 3:48 AM | Last Updated on Thu, Apr 15 2021 8:05 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment