‘లోకంలో ఇన్ని చెట్లు, లతలు, తీవెలు ఉన్నాయి. కొన్నింటికి పండ్లు, కొన్నింటికి పూలు, కొన్నింటి పత్రాలు వర్ణభరితం... కాని ఈ వెదురు పొదను చూడండి. నిరాడంబరమైన ఈ వెదురులోని ప్రతి చిన్న భాగానికి అమృతమయమైన నాదాన్ని వెలువరించే శక్తి ఉంది... వేణుగానాన్ని వినిపించే జీవం ఉంది’ అంటాడు హరిప్రసాద్ చౌరాసియా. ‘మా నాన్న అలహాబాద్‌లో పహిల్వాన్. ఆరేళ్ల వయసులో నేను తల్లిని కోల్పోతే ఆయన తిరిగి పెళ్లి చేసుకోలేదు. తల్లి లేని పిల్లాడు క్రమశిక్షణలో ఉండాలంటే అఖాడాలో దించి కుస్తీ లడాయిస్తూ ఉండాలని భావించాడాయన.
నాకేమో చెవిన సరిగమలు పడితే ఆత్మ ఆగదు. గాత్రం నేర్చుకోవాలనుకున్నాను. తొలి రోజుల్లో పాఠాలు చెప్పిన గురువు... హరిప్రసాద్... నీకు పైస్వరం పలకదు. కాని దమ్ము చాలాసేపు నిలబెట్టగలవు. దమ్ము నిలిపే వాద్యం నేర్చుకో పైకి వస్తావు అన్నాడు. నాకు వేణువు గుర్తుకు వచ్చింది. అది ఖరీదైన వాద్యం కాదు. తీగలు ఉండవు. చర్మ వాద్యం కాదు పాడవడానికి. ఏ సంతలోనైనా దొరుకుతుంది. ఎక్కడికైనా తీసుకెళ్లడం సులభం. పెదాలతో గాలి నింపితే శబ్దాన్ని వెలువరిస్తుంది. అందుకని వేణువును ఎంచుకున్నాను’ అంటాడాయన.
ఇక్కడ మీరు చదవడం ఆపి తలత్ మెహమూద్ ప్రఖ్యాత గీతం ‘ఫిర్ వహీ షామ్...’ వినండి. అందులో ఎంతో మృదువైన తలత్ గొంతును అనుసరిస్తూ మరింత మృదువైన వేణుగానం వినిపిస్తుంది. అది హరిప్రసాద్ చౌరాసియా తొలి సినీ పాట వాద్యకారుడిగా. ఇంకా అర్థం కావాలంటే ‘విధాత తలపున ప్రభవించినది’ వినండి... అందులో పాటంతా కొనసాగే వేణువును అంత అద్భుతంగా ఎవరు పలికిస్తారు చౌరాసియా తప్ప. ‘సిరివెన్నెల’లో హీరో పాత్ర పేరు అదే– హరిప్రసాద్.
ఇప్పుడు దేశంలో రెండు గురుకులాలను వేణుగాన ఉపాసకుల కోసం నిర్వహిస్తున్నాడు హరిప్రసాద్ చౌరాసియా. ఒకటి భువనేశ్వర్‌లో ఉంది. ఒకటి ముంబైలో. ‘పిల్లలకు వేణువు నేర్పిస్తాను’ అని చౌరాసియా అడిగిందే తడవు నాటి ఒరిస్సా ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ స్థలం కేటాయించాడు. ముంబైలో కూడా ప్రభుత్వమే స్థలం ఇచ్చింది. ‘ముంబైలో గురుకులం కట్టడానికి డబ్బు లేదు. రతన్ టాటాను వెళ్లి అడిగాను. సంగీతం కోసం ఇబ్బందులా... అని రెండు కోట్లు ఇచ్చాడు. రెండు చోట్లా పిల్లలకు ఉచితంగానే నేర్పిస్తాను. నిజానికి వాళ్ల నుంచి నేను నేర్చుకుంటాను... నా నుంచి వాళ్లు... తుది శ్వాస వరకూ నేర్చుకుంటూ ఉండటమే నాకు ఇష్టం’ అంటాడు చౌరాసియా. నేర్చుకోవడాన్ని ఒక దశలో కొందరు మానేస్తారు.
ఒక దశ నుంచి కొందరు అక్కర్లేదనుకుంటారు. వేణువులో పాండిత్యం గడించాక, కటక్ రేడియో స్టేషన్ లో ఆ తర్వాత ముంబై రేడియో స్టేషన్‌లో పని చేశాక, వందల సినిమా పాటలకు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లకు వేణువు పలికించాక, విపరీతంగా డబ్బు గడించాక ‘నేనింకా నేర్చుకోవాలి’ అనుకున్నాడు తప్ప చాలు అనుకోలేదు చౌరాసియా. ‘సినిమాలో వాయించే ఆ కాసేపుతో నా ఆత్మ ఆకలి తీరడం లేదు... నేను శాస్త్రీయ సంగీతపు కెరటాలలో మునకలు వేయాలి..’ అనుకున్నాడు చౌరాసియా. కాని గురువు ఎవరు? శిష్యుల్ని ఎంచుకోవడంలో అతి కఠినంగా, అతి పరిమితంగా ఉండే అన్నపూర్ణా దేవి దగ్గర నేర్చుకోవాలని సంకల్పించాడు.
అన్నపూర్ణా దేవి మహామహుడైన ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ కుమార్తె. సితార్ మేస్ట్రో పండిట్ రవిశంకర్ భార్య. కాని ఆమె ఇతడికి కనీసం తలుపు కూడా తీయలేదు. ఒకటి కాదు.. రెండు కాదు... మూడేళ్లు ఆమె ఇంటి చుట్టూ తిరిగి చివరకు శిష్యుడిగా స్వీకరించబడ్డాడు. ‘నువ్వు నేర్చుకున్నదంతా మర్చిపోవాలి’ అనేది ఆమె చెప్పిన మొదటి పాఠం. అంతవరకూ చౌరాసియా అందరిలా కుడివైపు వేణువు ధరించేవాడు. ఇప్పుడు ఎడమవైపున. నవ శిశువుగా మళ్లీ జన్మించాడు.
ఒకప్పుడు ఆల్ ఇండియా రేడియోలో బి గ్రేడ్ అర్టిస్ట్‌గా సెలెక్ట్ అయిన హరిప్రసాద్ చౌరాసియా ఇవాళ ప్రపంచానికి వేణునాద గురువు. ఒక నెల నెదర్లాండ్స్‌లో పాఠాలు చెప్తాడు. ఒక నెల కెనడాలో చెప్తాడు. ఒక రోజు అచట కచ్చేరి. మరోరోజు ఏదో దేశ ఔన్నత్య పురస్కార స్వీకరణ. అలహాబాద్‌లో రణగొణ ధ్వనుల మధ్య ఏకాంత సాధన కోసం స్థలాన్ని వెతుక్కుంటూ తిరిగిన హరిప్రసాద్ చౌరాసియాకు ఇవాళ ప్రపంచ దేశాలన్నీ స్వాగతం చెప్పి తమ దగ్గర ఉండిపొమ్మంటాయి. ఆ గౌరవం అతనిలోని కళకా? దాని పట్ల అతని అర్పణకా? నిరంతర అభ్యాసం, వినమ్రత, లోపలి ఎదుగుదలపట్ల తపన, పంచేగుణం, స్వీకరించే తత్త్వం, స్థిరాభిప్రాయాలను త్యజించగలిగే నిరహంభావం, ఎదుటి వారిని గుర్తించి ప్రోత్సహించే గుణం.. ఇవి లేకుంటే మనిషి మహనీయుడు ఎలా అవుతాడు? మహనీయుడే కానక్కర్లేదు... ప్రేమాస్పదుడు ఎలా అవుతాడు? ఇవాళ సంఘంలో ప్రతి రంగంలో ఎందరో పెద్దలు. కాని కొందరే గౌరవనీయులు.
అతికొద్దిమందే ప్రేమాస్పదులు. చౌరాసియా నుంచి నేర్చుకోవచ్చా మనం ఏదైనా? తాజాగా వెలువడ్డ హరిప్రసాద్ చౌరాసియా అఫిషియల్ బయోగ్రఫీ ‘బ్రెత్ ఆఫ్ గోల్డ్’ చదువుతున్నప్పుడు వెదురు పొదల మధ్య తిరుగాడినట్టు ఉంటుంది. త్రివేణీ సంగమంలో దేహాన్ని కడిగినట్టు ఉంటుంది. ముంబైలో మదన్ మోహన్ పాట రికార్డింగ్‌ను చూస్తున్నట్టు ఉంటుంది. శివ్‌తో కలిసి హరి చేస్తున్న జుగల్‌బందీకి ముందు వరుస సీటు దొరికినట్టు ఉంటుంది. మన జీవిత పాఠాలు మనల్ని చేరే దరులు, దారులు పరిమితం. ఇదిగో ఇలాంటి మహనీయులే చరిత్రలే మున్ముందుకు నడిపే ప్రభాత నాదం.
Comments
Please login to add a commentAdd a comment