
ఓ మత బోధకుడి దగ్గర ఓ వేణువు ఉంది. దాన్ని వాయించడానికి అతను కొన్నిసార్లు ఓ పర్వతం మీదకు వెళ్లేవారు. అప్పుడా దార్లో వెళ్ళేవారందరూ ఆ వేణునాదాన్ని విని మైమరచిపోతారు. అంతెందుకు ఆ వేణునాదానికి జింకలు ఆగిపోతాయి. ఎగురుతున్న పక్షులు ఆయన దగ్గరకు వచ్చి వాలుతాయి. కొన్నేళ్ళకు అతను చనిపోయారు. ఆ వేణువును చెట్టుకింద ఉంచి దాన్ని పూజించడం మొదలుపెట్టారు. ఒకటి రెండు తరాల తర్వాత ప్రజలు ఈ వెదురు వేణువులో ఏముంది దీన్ని ఇలాగే ఓ కొయ్యలాగా ఆరాధించడమేంటీ... దీన్ని మరింత గొప్పగా ఆరాధించాలి అనుకుని దాన్ని బంగారంతో అలంకరించారు. కొన్నేళ్ళు గడిచాయి. ఒకసారి కొందరు సంగీత కళాకారులు ఆ దారిలో వచ్చారు. ఆ వేణువు గురించి ఆ నోటా ఈనోటా విన్నారు. దాన్ని చూడడం కోసమే అక్కడికి వచ్చారు. బంగారంతోనూ వజ్రాలతోనూ అలంకరించిన ఆ వేణువును చూశారు.
ఆ వేణువును ఆ సంగీత బృంద నాయకుడు తీసి చూశారు. ఆ తర్వాత దానిని వాయించి చూసారు. కానీ రవ్వంత నాదం కూడా రావడం లేదు. వేణువు రంధ్రాలన్నీ కప్పేసి ఉన్నాయి. దాన్నో అలంకారప్రాయమైన వస్తువుగా మార్చడం బాధాకరమని నొచ్చుకున్నారు. అంతెందుకు మహావీరుడి మాటలను, బుద్ధుడి మాటలను, ఏసు ప్రభువు మాటలనూ ఇలాగే కొందరు ఓ అలంకారప్రాయ వస్తువులుగా మార్చేసి ఫ్రేము కట్టి చూస్తున్నారే తప్ప వాటిలోని మంచిని నలుగురికీ చెప్పి ఉపయోగపడేలా చేయడం లేదన్నదే వాస్తవం. మహాత్ముల మాటలను ఆచరించడానికే తప్ప వొట్టినే పూజించడానికి కాదు అని తెలుసుకునే వరకూ ఎవరెన్ని ఆణిముత్యాలు చెప్పినా బూడిదలో పోసిన పన్నీరే...
– యామిజాల జగదీశ్
Comments
Please login to add a commentAdd a comment