చాలాకాలం తరువాత దర్శనమిచ్చిన ఇండియన్ స్కిమ్మర్
రష్యా నుంచి ఎగిరొచ్చిన గ్రేట్‌నాట్.. యూరప్ నుంచి యురేసియన్ ఆయుష్ క్యాచర్
విభిన్న ప్రాంతాల నుంచి 106 జాతుల పక్షుల రాక
కోరంగి అభయారణ్యానికి 39,725 పక్షులు
గతంతో పోలిస్తే పక్షుల రాక తగ్గినా.. అంతరించిపోయే జాబితా పక్షులు ప్రత్యక్షం
గ్రేటర్ ఫ్లెమింగో, లెసర్‌సెండ్‌ఫ్లోవర్, పసిఫిక్ గోల్డెన్ ఫ్లోవర్..
కోరంగి అభయారణ్యంలో ముగిసిన పక్షుల గణన
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆకాశ వీధిలో రెక్కల్ని రెపరెపలాడిస్తూ వేలాది కిలోమీటర్లు ప్రయాణించి వచ్చే వేలాది పక్షులు కాకినాడ–అంబేడ్కర్ కోనసీమ జిల్లాల నడుమ గల కోరంగి అభయారణ్యంలో విడిది చేస్తున్నాయి. రష్యా, చైనా, మంగోలియా, సైబీరియా, యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి అనేక రకాల జాతి పక్షులు ఏటా అక్టోబర్, నవంబర్ మధ్య కాకినాడ తీరానికి వస్తుంటాయి. కోరింగ అభయారణ్యం, సముద్ర మొగ ప్రాంతాల్లో మూడు నెలలపాటు మకాం వేసి తిరుగు పయనమవుతాయి.
ఇలా వలస వచ్చే పక్షుల్లో ఏ దేశాల నుంచి.. ఏయే జాతి పక్షులు ఎన్ని వచ్చాయి, వాటిలో అరుదైన జాతి పక్షులు ఏవైనా ఉన్నాయా వంటి లెక్కలు అటవీ శాఖలోని వివిధ విభాగాల పర్యవేక్షణలో శాస్త్రవేత్తలు, బర్డ్ వాచర్స్ బృందాలుగా ఏర్పడి ఏసియన్ వాటర్ బర్డ్ కౌంట్ (అంతర్జాతీయ నీటిపక్షుల గణన) చేస్తుంటారు. కోరంగి అభయారణ్యం, కోనసీమ ప్రాంతాలకు వివిధ దేశాల నుంచి వచ్చిన వలస పక్షుల సర్వే ఈ నెలలో ముగిసింది.
ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలైన బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ (బీఎన్‌హెచ్‌ఎస్), వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నేషనల్ బయోడైవర్సిటీ సొసైటీ, యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీలకు చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు, సీనియర్ రీసెర్చ్ స్కాలర్స్ డాక్టర్ శివకుమార్, పాల్ ఆంథోనీ, శ్రీరామరెడ్డి తదితరుల సంయుక్త భాగస్వామ్యంతో వివిధ దేశాల నుంచి రెక్కలు కట్టుకుని వలస వచ్చిన పక్షులను లెక్కించారు.
ఆ పక్షుల రాక సంతోషకరం
ఈ ఏడాది పక్షుల రాక కొంతమేర తగ్గినప్పటికీ.. అంతరించిపోయే పక్షి జాతుల జాబితాలో ఉన్న ఇండియన్ స్కిమ్మర్, గ్రేట్‌నాట్, రెడ్‌నాట్, యురేసియన్ ఆయుష్ క్యాచర్ జాతి పక్షులు ఈ సీజన్‌లో కోరంగి అభయారణ్యంలో ప్రత్యక్షం కావడం సంతోషం కలిగించే అంశంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రేట్‌నాట్ జాతి పక్షులు రష్యా, మంగోలియా, చైనా తదితర దేశాల నుంచి నాలుగైదేళ్ల తరువాత ఇక్కడ ప్రత్యక్షమయ్యాయి.
ఈ జాతి పక్షి ఇక అంతరించిపోయినట్టేనని అనుకుంటున్న తరుణంలో రష్యా దేశపు ట్యాగ్‌తో ఈ సర్వేలో కెమెరాలకు చిక్కాయి. ఈ రెండు జాతుల పక్షులు కోరంగి అభయారణ్యంలోని భైరవపాలెం, హోప్ ఐలాండ్, ఏటిమొగ తదితర ప్రాంతాల్లో సర్వే బృందాల కెమెరాలకు కంటపడ్డాయి. యూరోపియన్ దేశాల నుంచి అరుదైన యురేసియన్ అయిస్ట్ క్యాచర్ జాతి పక్షులు కూడా ఈసారి అభయారణ్యంలో దర్శనమిచ్చాయి.
సైబీరియన్ పక్షులదే మొదటిస్థానం
కాకినాడ తీరానికి వచ్చిన మొత్తం విదేశీ విహంగాల్లో 5,144 పక్షులతో ‘లెసర్ సేండ్ ప్లోవర్’ అనే సైబీరియన్లు మొదటి స్థానంలో నిలిచాయి. 3,545 పసిఫిక్ గోల్డెన్ ఫ్లోవర్ జాతి పక్షులు రాగా.. వలస వచ్చిన పక్షుల్లో ఇవి ద్వితీయ స్థానాన్ని ఆక్రమించాయి. ఈ జాతి పక్షులు రష్యా, మంగోలియా, చైనా వంటి దేశాల నుంచి వలస వచ్చాయి.
ఇవికాకుండా పులికాట్, కొల్లేరు ప్రాంతాలకు పెద్దఎత్తున వచ్చే గ్రేటర్ ఫ్లెమింగో జాతి పక్షులను కూడా గతం కంటే ఈ సీజన్‌లోనే ఎక్కువగా ఇక్కడ గుర్తించారు. ఈ పక్షులన్నీ కోరంగి అభయారణ్యంతో పాటు కోనసీమలోని మగసానితిప్ప, శాంక్రిమెంట్ ఐలాండ్, గచ్చకాయలపోర, పండి, పల్లం, ఎస్.యానాం, గాడిమొగ సముద్ర తీర గ్రామాల్లో సందడి చేస్తున్నట్టు గుర్తించారు.
కడుపు నింపుకునేందుకే..
వివిధ దేశాల్లోని పక్షుల ఆవాస ప్రాంతాలు మంచుతో కప్పివేయబడటంతో కడుపు నింపుకునేందుకు వేలాది కిలోమీటర్లు ప్రయాణించి వివిధ దేశాల నుంచి కోరంగి అభయారణ్యానికి విదేశీ పక్షులు వచ్చాయి. అరుదైన జాతి పక్షులను కూడా గుర్తించాం. ఇందులో అంతరించిపోయే జాతులకు చెందిన పక్షులు రావడం చాలా సంతోషకరం. – డి.మహేష్‌బాబు, రీసెర్చ్ సైంటిస్ట్, రాష్ట్ర కో–ఆర్డినేటర్, ఇండియన్ బర్డ్ కన్జర్వేషన్ నెట్‌వర్క్
106 జాతులకు చెందిన 39,725 పక్షుల రాక
ఏటా వివిధ దేశాల నుంచి సీజనల్‌గా వచ్చే వలస పక్షులు ఈ సారి కాస్త వెనకడుగు వేశాయి. వరుస ప్రకృతి విపత్తులు ఇందుకు ఒక ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు విశ్లేషించి నివేదించారు. ఈ సీజన్‌లో వివిధ ఖండాల నుండి 106 జాతులకు చెందిన 39,725 పక్షులు వలస వచ్చాయని లెక్కలు కట్టారు.
అరుదైన పక్షులొచ్చాయి
కోరంగి అభయారణ్యం పరిసర ప్రాంతాల్లో పక్షుల గణన కోసం 12 బృందాలు పనిచేశాయి. ఒక్కో బృందంలోశాస్త్రవేత్తలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రతినిధులు, బర్డ్‌వాచర్స్, విద్యార్థులతో కలిసి ఐదుగురున్నారు. జిల్లాఅటవీశాఖాధికారి రవీంద్రనాథ్‌రెడ్డి పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన బృందాల్లోని 60 మంది ఏకకాలంలో ఈ సర్వే నిర్వహించారు. అరుదైన జాతి పక్షులను కూడా ఈ సర్వేలో గుర్తించారు.– ఎస్‌ఎస్‌ఆర్ వరప్రసాద్, అటవీ రేంజర్, వైల్డ్‌లైఫ్, కోరింగ
Comments
Please login to add a commentAdd a comment