నంద్యాల జిల్లాలో 230 రకాల పక్షులు
యూరప్, అమెరికా, మధ్య ఆసియా నుంచి నల్లమలకు
అన్ని రకాల వాతావరణ పరిస్థితులు ఉండటమే కారణం
ఆహారం, ఆవాసం తేలికగా లభిస్తుండటంతో భారీగా వలసలు
నల్లమల అంటేనే ఎన్నో వింతలు, విశేషాలకు పుట్టినిల్లు. జాతీయ జంతువైన పెద్దపులి నుంచి అరుదైన వన్యప్రాణులు, ఆయుర్వేద ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, ఆధ్యాతి్మక కేంద్రాలైన ప్రముఖ పుణ్యక్షేత్రాలు, అద్భుత జలపాతాలు, పచ్చటి పర్వత సానువులు, దట్టమైన అడవుల అందాలు...ఇలా నల్లమల ఎన్నో అద్భుతాలకు ఆలవాలం.
జీవ వైవిధ్యానికి పెట్టింది పేరైన నల్లమల తాజాగా దేశ, విదేశీ పక్షులకు స్థావరంగా మారింది. వేల కిలోమీటర్లు దాటుకుంటూ వలస పక్షులు నల్లమలకు చేరుకుని ఆవాసాలు ఏర్పరచుకుంటున్నాయి. నల్లమలలో పచ్చని చెట్లు, గలగల పారే సెలయేటి సవ్వడులు వలస పక్షులను మరింత ఆకర్షిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. – మహానంది
బార్ హెడెడ్ గూస్
ప్రపంచంలోనే అత్యంత ఎత్తుకు ఎగిరే పక్షి బార్ హెడెడ్ గూస్ అని చెబుతారు. ఇవి సంతానోత్పత్తి కోసం మ«ధ్య ఆసియాలోని పర్వత ప్రాంతాల నుంచి దక్షిణాసియాలోని ద్వీపకల్ప ప్రాంతానికి వస్తాయి. ఈ పక్షులు ఒకేసారి మూడు నుంచి పది గుడ్లు పెడతాయి. ఇవి అత్యంత ఎత్తయిన హిమాలయాల మీదుగా ఎగురుకుంటూ వలస వస్తాయి.
ఎల్లో థ్రోటెడ్ బుల్‌బుల్
ఎంతో అందంగా కనిపించే అరుదైన పక్షిజాతుల్లో ఎల్లో థ్రోటెడ్ బుల్‌బుల్ ఒకటి. అంతరించిపోతున్న పక్షి జాతుల్లో ఇది ఒకటని ఆరి్నథాలజిస్టులు చెబుతున్నారు. ఇవి తాము సంచరించే ప్రాంతాలను చిన్న చిన్న సర్కిల్స్‌గా ఏర్పాటు చేసుకుంటాయి. కీటకాలను తింటాయి. భారత ద్వీపకల్పానికి చెందిన పక్షిజాతుల్లో ఇది ఒకటి. నిటారుగా ఉండే కొండ ప్రాంతాల్లో ఇవి నివసిస్తాయి.
పక్షులనే ఆహారం తీసుకునే ‘‘హారియర్స్’’:
విదేశీ పక్షిజాతుల్లో రకరకాల పక్షులు ఉంటాయి. వాటిలో పక్షులనే ఆహారంగా తీసుకునే హ్యారియర్స్ జాతి ఒకటి. ఇది ఆక్సిపిట్రిడి అనే వేటాడే పక్షి కుటుంబానికి చెందిన సర్కస్ జాతి. ఇవి మైదాన ప్రాంతాల్లో తిరుగుతూ పక్షులు, చిన్నచిన్న క్షీరదాలను ఆహారంగా తీసుకుంటాయి. యూరప్, పశ్చిమాసియా నుంచి నల్లమలకు వలస వస్తాయి.
గ్రేటర్ ఫ్లెమింగోలు
ఫ్లెమింగో కుటుంబానికి చెందిన అతి పెద్ద జాతి గ్రేటర్ ఫ్లెమింగో. ఇవి ఉత్తర తీర ప్రాంతాలు, దక్షిణ ఐరోపా, హిమాలయ ప్రాంతాల్లో ఉంటాయి. తల, మెడ, రంగుల ఆధారంగా గ్రేటర్ ఫ్లెమింగో, అమెరికన్ ఫ్లెమింగోలుగా వర్గీకరిస్తారు. వీటి ఈకలు గులాబీ రంగులో ఉంటాయి.
ఇండియన్ పిట్ట
చిన్న మొండితోకను కలిగి ఎంతో అందంగా కనిపించే పక్షి ఇండియన్ పిట్ట. ఇది దట్టమైన అడవుల్లోని నేలలపై, పొదల్లో ఉంటుంది. ఆకులు, చెత్తలో ఉండే క్రిమికీటకాలను ఆహారంగా తీసుకుంటుంది. గతంలో ఓ ఆంగ్లేయుడు ఈ పిట్ట(పక్షి)ని చూసి దీని పేరేంటి అని అడిగితే మన భారతీయులు ఇండియన్ పిట్ట అన్నారని, అందుకే ఇండియన్ పిట్టగా పేరు పడిపోయిందని పలువురు శాస్త్రవేత్తల అభిప్రాయం.
ఊలి నెక్డ్ స్టార్క్(ఉన్ని మెడ కొంగ)
కొంగల్లో ఊలి నెక్డ్ స్టార్క్ ఒకటి. దీని మెడ వద్ద ఉన్నిలాగా ఉండటంతో దీన్ని ఉన్ని మెడ కొంగ అని పిలుస్తారు. వీటిలో ఆసియా, ఆఫ్రికన్ జాతులు అని రెండు రకాలు ఉంటాయి. నల్లమల ప్రాంతంలో ఆసియా జాతికి చెందినవి ఎక్కువగా సంచరిస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది.
నంద్యాల జిల్లాలో అరుదైన పక్షులు
పెద్దపులి, చిరుతపులులతో పాటు ఎన్నో అరుదైన వన్యప్రాణులు, వింతలు, విశేషాలకు నల్లమల నిలయం. నంద్యాల జిల్లాలోని నల్లమల, అహోబిలం ప్రాంతాల్లోని అడవుల్లో అరుదైన దేశీయ, విదేశీ వలస పక్షులు ఉన్నాయి. మేము చేసిన పరిశోధనల్లో 230 రకాల పక్షులను గుర్తించాము. ఒకే జిల్లాలో ఇన్ని రకాల పక్షులు ఉండటం ఎంతో విశేషమనే చెప్పాలి. – తరుణ్‌కుమార్ సింగ్, జూనియర్ సైంటిస్ట్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ
వలసపక్షులకు కేంద్రం
నల్లమలలో పెద్దపులులే కాదు. అరుదైన వన్యప్రాణులు, క్రిమికీటకాలు ఎన్నో ఉన్నాయి. పక్షుల్లో అనేక రకాల జాతులకు నంద్యాల జిల్లా పరిధిలోని నేలలు ఎంతో అనువైనవి. కొన్ని రకాల పక్షులు చిత్తడి నేలలంటే ఇష్టపడతాయి. ఎక్కడ తడినేలలు కనిపిస్తే అక్కడికి అన్నీ చేరి ఆహారాన్వేషణ చేస్తూ రైతులకు తెలియకుండా రైతు నేస్తాలుగా మారిపోతున్నాయి. – దూపాడు శ్రీధర్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ
నంద్యాల జిల్లాలో 230 రకాల పక్షులు
నంద్యాల జిల్లాలో 230 రకాల పక్షిజాతులు ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. మనం నిత్యం చూసే చిలుకలు, కింగ్ ఫిషర్, కొంగలు, బాతులు, వడ్రంగిపిట్టలు, పిచ్చుకలు, పావురాలతో పాటు దేశ, విదేశాల నుంచి వచ్చే వలస పక్షులు సైతం ఈ ప్రాంత వాతావరణాన్ని ఇష్టపడుతున్నాయి. గడ్డిభూములు, కొండలు, చిత్తడి నేలలు ఇలా అన్ని రకాల నేలలు ఉండటంతో వివిధ రకాల పక్షులకు ఆహారం కూడా తేలికగా లభిస్తోంది.
మనం నిత్యం చూసే పక్షి జాతులతో పాటు బార్ హెడెడ్ గూస్, హ్యారియర్స్, టరŠన్స్, ఎల్లో త్రోటెడ్ బుల్‌బుల్, ఇండియన్ పిట్ట, స్వాంపెన్, గ్రేటర్ ఫ్లెమింగోస్, డార్టర్ కార్మోరెంట్, స్పాట్ బిల్డ్ పెలికాన్, పాండ్ హెరాన్, రెడ్ నాప్డ్ హైబిస్, పర్పుల్ సన్ బర్డ్స్, వెయిట్ త్రోటెడ్ కింగ్ ఫిషర్, మార్స్ హారియర్, శాండ్ పైపర్, స్పాటెడ్ ఓలెట్, కాంబ్ డక్, బ్లూ టెయిల్డ్ బీ ఈటర్ లాంటి వాటితో పాటు రాత్రుళ్లు మాత్రమే కనిపించే నైట్‌జార్స్ వంటి అనేక రకాల పక్షులు నల్లమల పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment