
నంద్యాల జిల్లాలో పచ్చమూక అరాచకం
దేవాలయంలో కత్తులు, గొడ్డళ్లతో దాడి
ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ఇందూరు ప్రతాపరెడ్డిపై ఆయన సొంత గ్రామం గోవిందపల్లెలో శనివారం హత్యాయత్నం జరిగింది. ప్రతి శనివారం తన ఇంటి సమీపంలోని దేవాలయానికి వెళ్లి పూజలు నిర్వహించడం ప్రతాపరెడ్డికి ఆనవాయితీ. ఇది గమనించిన టీడీపీ మూకలు ఉదయం నుంచి దేవాలయం సమీపంలో కాపుకాసారు. ప్రతాపరెడ్డి దేవాలయంలో పూజ చేస్తుండగా వెనక వైపు నుంచి కత్తులు, గొడ్డళ్లతో నరికారు.
అక్కడే ఉన్న ప్రతాపరెడ్డి మనువరాలుసహా సమీపంలో ఉన్న వారు భయంతో పరుగులు తీయగా ప్రతాపరెడ్డి దేవాలయంలోనే కుప్పకూలి పోయారు. దీంతో ఆయన మృతిచెందారని భావించిన దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కుటుంబీకులు పరుగున అక్కడకు వచ్చి గ్రామస్థుల సహాయంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆయనను నంద్యాల వైద్యశాలకు తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను అడిగి సమాచారం తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ ఘటనలో ఇద్దరు పాల్గొన్నట్లు నిర్ధారణ అవుతోందని పేర్కొన్నారు. వారిలో ఒకరు గ్రామానికి చెందిన రవిచంద్రారెడ్డి కాగా మరొకరు కొత్త వ్యక్తిగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. గతంలో జరిగిన జంట హత్యల కేసులో రవిచంద్రారెడ్డి ప్రధాన నిందితుడు కాగా.. ఈ కేసులో ప్రతాపరెడ్డి ప్రధాన సాక్షిగా ఉన్నారన్నారు. ఈ కేసు విచారణ తుది దశకు చేరుకోవడంతో ప్రతాపరెడ్డిని హతమార్చేందుకు యత్నించినట్లు కేసు నమోదు చేస్తున్నామని తెలిపారు.
నాడు ప్రతాపరెడ్డి అన్న ప్రభాకర్‌రెడ్డి హత్య
గత టీడీపీ ప్రభుత్వంలో అఖిలప్రియ మంత్రిగా ఉన్న సమయంలో ఆధిపత్యం కోసం 2017 మే 6వ తేదీన వైఎస్సార్‌సీపీ నాయకుడు ప్రతాపరెడ్డి అన్న ఇందూరు ప్రభాకర్‌రెడ్డి హత్యకు గురయ్యాడు. టీడీపీ నాయకులు నిందితులుగా ఉన్న ఈ కేసు విచారణ జరుగుతోంది. ఈ కేసులో ప్రధాన సాక్షి ప్రతాపరెడ్డి.
రాజీకి రావాలని ప్రయత్నించినప్పటికీ ఒప్పుకోకపోవడంతో ఆయనను కూడా అంతమొందిస్తే, సాక్ష్యంతో పాటు గ్రామంలో ఆదిపత్యం చెలాయించవచ్చని భావించే హత్య చేసేందుకు యత్నించినట్లు గ్రామంలో చర్చించుకుంటున్నారు. కాగా,హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉండటంతో ప్రతాపరెడ్డికి ప్రాణహాని ఉంటుందని భావించిన గత ప్రభుత్వం, పోలీస్ శాఖ గన్‌మెన్‌ను కేటాయించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గన్‌మెన్‌ను తొలగించింది.