విమాన ప్రమాదాలకు కారణమవుతున్న పక్షుల కదలికలు
ఒక్క ఢిల్లీలోనే 2023లో 169 విమానాల్ని ఢీకొట్టిన విహంగాలు
కొరియా ప్రమాదంతో అప్రమత్తమైన డీజీసీఏ
ఎయిర్‌పోర్టుకు 10 కి.మీ. పరిధిలో పక్షుల కదలికలపై ప్రత్యేక నిఘా
ఎయిర్‌ఫీల్డ్ పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం లేకుండా చర్యలు
దేశంలోని అన్ని విమానాశ్రయాల్ని అప్రమత్తం చేసిన డీజీసీఏ
విమానం భారీగా ఉంటుంది. కానీ.. పక్షి మాత్రం చిన్నగా ఉంటుంది. అంతపెద్ద విమానానికి దీనివల్ల ఎందుకు ముప్పు వస్తుందని అంతా అనుకుంటారు. కానీ.. ఒక్కసారి విమానానికి పక్షి తగిలితే ఊహించని ఘోర ప్రమాదాలు సంభవిస్తాయి. రెక్కలు కట్టుకుని ఎగురుతున్న లోహ విహంగాలను చిన్న చిన్న పక్షులు ముప్పులోకి నెట్టేస్తున్నాయి.
దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదానికి పక్షులే ప్రధాన కారణమని తెలియడంతో భారత్‌లోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అప్రమత్తమైంది. ఎయిర్ ఫీల్డ్ పరిసర ప్రాంతాలపై ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది.
సాక్షి, విశాఖపట్నం: రెక్కలు కట్టుకుని ఎగురుతున్న లోహ విహంగాలను చిన్న చిన్న పక్షులు ముప్పులోకి నెట్టేస్తున్నాయి. రివ్వున ఎగిరేలోపు.. వాటికి ఎగిరే స్వేచ్ఛ లేదన్నట్టుగా పక్షులు వార్నింగ్ ఇస్తున్నాయి. ఎయిర్ పోర్టుల సమీపంలో పక్షుల కదలికలు విమాన ప్రమాదా లకు కారణమవుతున్నాయి. దక్షిణ కొరియాలో విమాన ఘోర ప్రమాదంలో 179 మృత్యువాత పడటానికి పక్షులే ప్రధాన కారణమని.. తెలిసిన తర్వాత భారత్‌లోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అప్రమత్తమైంది.
దేశంలో ఇప్పటికే పక్షుల కారణంగా టేకాఫ్ తీసుకున్న కొన్ని నిమిషాలకే విమానాలు తిరిగి ల్యాండ్ అవుతున్న ఘటనలు పెరుగుతున్న తరుణంలో.. ఎయిర్ ఫీల్డ్ పరిసర ప్రాంతాలపై ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసే దిశగా డీజీసీఏ అడుగులు వేస్తోంది. ఓ వైపు వన్యప్రాణి సంరక్షణకు చర్యలు తీసుకుంటూ.. మరోవైపు విమాన ప్రమాదాలు జరగకుండా రక్షణ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
పే..ద్ద విమానానికి పక్షితో ముప్పా!
విమానం భారీగా ఉంటుంది. కానీ.. పక్షి మాత్రం చిన్నగా ఉంటుంది. అంతపెద్ద విమానానికి దీనివల్ల ఎందుకు ముప్పు వస్తుందని అంతా అనుకుంటారు. కానీ.. ఒక్కసారి విమానానికి పక్షి తగిలితే ఊహించని ఘోర ప్రమాదాలు సంభవిస్తాయి. విమానాల ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో పక్షుల కారణంగా అధిక ప్రమాదాలు జరుగుతుంటాయి. విమాన క్యాబిన్, ఇంజన్‌ను పక్షులు ఢీకొడితే అత్యంత ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయి.
విమానం పైకి ఎగిరినప్పుడు లేదా దిగుతున్నప్పుడు దాని ఇంజన్లు బలంగా లోపలికి గాలిని తీసుకుని బయటికి వదులుతుంటాయి. జా ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఆ గాలికి సమీపంలోకి పక్షులు వస్తే అత్యంత వేగంగా తిరిగే ఎయిర్ క్రాఫ్డ్ ఇంజన్లు లోపలికి లాగేసుకుంటాయి. దాంతో ఇంజన్లు పాడైపోతుంటాయి. విమానం ఎగిరే సమయంలో ఇంజన్ లోపలికి పక్షులు వెళ్లిపోతే ఇంజన్ తిరగడం కొన్నిసార్లు ఆగిపోయి ఊహకందని ప్రమాదాలు సంభవిస్తుంటాయి.
ఫ్యాన్ థ్రస్ట్ ఆగిపోయినట్టు గుర్తిస్తే పైలట్ వెంటనే సమీపంలోని ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేసేస్తుంటారు. అంతేకాదు.. ఫ్లైట్ క్యాబిన్‌లో ఉన్న పైలట్ విండ్ షీల్డ్‌ను బలంగా పక్షులు ఢీ కొట్టినప్పుడు కూడా ప్రమాదాల తీవ్రత అధికంగా ఉంటుందని విమానాశ్రయ అధికారులు చెబుతున్నారు. బలంగా కొట్టినప్పుడు పొరపాటున విండ్ షీల్డ్‌కి పగుళ్లు ఏర్పడితే విమానం ప్రమాదంలో పడినట్టేనని అంటున్నారు.
అప్రమత్తమైన డీజీసీఏ
భారత్‌లోనూ ఇటీవల పక్షుల కారణంగా విమానాలను అత్యవసర ల్యాండింగ్ చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. గతేడాది ఆగస్ట్‌లో గోవాలోని దబోలి ఎయిర్‌పోర్ట్‌లో పక్షి ఢీకొన్న తర్వాత విమానం ఇంజన్ నుంచి పొగలు రావడంతో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్‌ను హఠాత్తుగా నిలిపేసింది. ఒక్క ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనే 2023లో 169 విమానాలకు పక్షుల కారణంగా స్వల్ప ప్రమాదాలు సంభవించడం గమనార్హం. విహంగాలతో లోహపు విహంగాలకు ప్రమాదాలు పెరుగుతుండటంతో డీజీసీఏ అప్రమత్తమైంది.
ఎయిర్‌పోర్టు సమీపంలో ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో విహంగాల ఉనికిని తప్పించే మార్గాలపై దృష్టి సారించింది. రన్‌వేల వెంట బిగ్గరగా శబ్దాలు వచ్చే బాణసంచా కాల్చడం, జోన్ గన్స్ ద్వారా భారీ శబ్దాలతో పక్షుల రాకను నియంత్రించడం, ఎయిర్ ఫీల్డ్ సమీపంలో వేప నూనె స్ప్రే చేయడం వంటి భిన్నమైన విధానాలను వినియోగించడంపై చర్చలు జరుపుతోంది.
అంతేకాకుండా ఎయిర్‌పోర్టుకి 10 కి.మీ. పరిధిలో పక్షులు, వన్యప్రాణుల్ని ఆకర్షించే చెత్తా చెదారాలతో కూడిన ఆహారం, జంతు కళేబరాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎయిర్‌పోర్టు వర్గాలకు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా కోళ్లు, మేకలు, ఇతర జంతు వధ జరగకుండా దృష్టి సారించాలని కూడా సూచించింది. అంతేకాకుండా ఈ సమస్యని శాస్త్రీయంగా పరిష్కరించేందుకు ఎయిర్‌పోర్టులు ప్రయత్నిస్తున్నాయి.
నౌకాదళ సాయంతో చర్యలు
పక్షుల అంతరాయం కలగకుండా వైజాగ్ ఎయిర్‌పోర్టులో నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నాం. ఎయిర్‌పోర్టు చుట్టూ కెనాల్ ఉంది. వేస్టేజ్ లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చెయ్యాలని కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్‌తో సమీక్షలు నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా తూర్పు నౌకాదళ వైమానిక బృందం సహాయంతోనూ వినూత్న విధానాల్ని అమల్లోకి తీసుకొచ్చాం.
ఎందుకంటే విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం, నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్‌ఎస్ డేగా పక్కç³క్కనే ఉన్నాయి. వీటిపక్కనే మడ అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి పక్షుల రాకపోకలు పెరుగుతుండటంతో విమాన సర్వసులకు అంతరాయం ఏర్పడుతోంది. నేవల్ ఫ్లైట్స్ కూడా ఎగిరేందుకు అంతరాయం కలుగుతున్న తరుణంలో ఈ సమస్యల్ని పరిష్కరించేందుకు నేవల్ ఏవియేషన్ అధికారుల స్ప్రే డ్రోన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఐఎన్‌ఎస్ డేగా నుంచి వీటి ఆపరేషన్స్ నిర్వహించి.. పక్షులు ఎగరకుండా నియంత్రించే చర్యలు చేపడుతున్నాం. ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న చెట్లపై నీటిని స్ప్రే చేయడం ద్వారా రన్‌వే సమీపంలోకి పక్షులు రాకుండా నిలువరించగలం. – రాజారెడ్డి, వైజాగ్ ఎయిర్‌పోర్టు డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment