
Photo Credits: Eha Rayalaseema
ఏవీ అనాటి పక్షుల కిలకిలలు
రండి.. మన ఇళ్లలోనే వాటికో గూడు కడదాం
అనంతపురంలో హోమ్ ఫర్ బర్డ్స్ సొసైటీ వినూత్న ప్రక్రియ
కాలనీల్లో పక్షుల ఆవాసాలు ఏర్పాటు...
ఇంటింటికీ గూళ్ళ పంపిణీ
గతంలో పల్లెలు అంటే చాలు ఠక్కున పక్షుల కిలకిలలు స్ఫురణకు వచ్చేవి. ఏ ఇంటి పెరట్లో అయినా ఒక జామ చెట్టు దానిమీద నిత్యం పారాడుతూ జామకాయలు కొరుకుతూ ఉండే చిలుకలు.. పొలంలో కల్లంలో.. ఇంటి ముందున్న కరెంటి వైర్ల మీద చిలుకలతోబాటు కోయిలలు.. లెక్కకుమిక్కిలిగా ఊరపిచ్చుకలు.. కత్తెర పిట్టలు.. పాలపిట్టల.. ఒకటేమిటి.. ఊరు అంటేనే మనుషుల కన్నా పక్షులే ఎక్కువగా ఉండేవి.. కానీ కాలం మారింది.. మారుతోంది.. వేలాది పక్షి జాతులు అంతరించిపోతున్నాయి. మనిషి తాను బతకడం కోసం పక్షులను పొట్టనబెట్టుకుంటున్నాడు. ఎక్కడికక్కడ ఏర్పాటయ్యే సెల్ ఫోన్ టవర్ల కారణంగా పిచ్చుకలవంటి జీవాలు కనుమరుగైపోతున్నాయి.
ఈ భూమి మనుషులకోసమే కాదు.. పశుపక్ష్యాదులు వంటి ఎన్నో జీవులకు ఆలవాలం.. కానీ మనిషి తన తెలివిని అతితెలివిగా మార్చి మిగతా జీవులన్నింటినీ మింగేస్తూ తానొక్కడే భూగోళాన్ని ఏలాలని చూస్తున్నాడు. ఆ క్రమంలోనే తూనీగలు.. నత్తగుల్లలు.. పలు రకాల చేపలు.. పిచుకలు వంటివి అంతరించిపోతున్నాయి. అయితే అందరూ ఇలా దారుణాలు చేస్తూ పోతుంటే ఎలా.. దిక్కులేనివాళ్లకు దేవుడే దిక్కు అన్నట్లుగా ఈ జీవాల రక్షణ కోసం ఎవరో ఒకరు ఉండే ఉంటారు.. దేవుడే ఎవరోఒకరికి బాధ్యత అప్పగించి ఉంటారు.. వాళ్ళే ఈ చిరు జీవుల రక్షణ బాధ్యతలు భుజానికి ఎత్తుకుంటారు.
అనంతపురం పట్టణ యువత పక్షులను సంరక్షించేందుకు హోమ్ ఫర్ బర్డ్స్(Home For Birds) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. అనిల్ కుమార్(Anil Kumar) అనే యువకుడి సారథ్యంలోనే ఈ బర్డ్స్ సొసైటీ పక్షులకు ఇళ్ళు నిర్మిస్తోంది.. అవును.. పక్షుల కోసం గూళ్ళు కడుతూ వాటిని చెట్లకు వేలాడతీస్తోంది. అంతేకాకుండా ఔత్సాహికులకు వాటిని ఉచితంగా ఇస్తోంది.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వినూత్నమైన కార్యక్రమం చేపట్టాలని ఎలా అనిపించింది అనే ప్రశ్నకు అయన నా బాల్యంలో మా ఊళ్ళో... ఇంట్లో.. పొలంలో పెరట్లో ఎన్నో మొక్కలు చెట్లు ఉండేవి.. వాటిమీద రకరకాల పిచ్చుకలు.. పక్షులు సందడి చేసేవి.. వాటిని చూస్తూ ఆడుకునేవాళ్ళం .. ఇప్పుడు పట్టణాల్లో పారిశ్రామికీకరణ పెరిగింది.. ఎక్కడ చూసినా సెల్ ఫోన్ టవర్లు.. విద్యుత్ స్తంభాలు ఉంటున్నాయి తప్ప పక్షులు వాలెందుకు.. అవి గూళ్ళు కట్టుకునేందుకు చెట్లే కరువయ్యాయి.
దీంతో అవి తమ సంతతిని వృద్ధి చెందించుకోలేక క్రమేణా తగ్గిపోతున్నాయి. వాటికి మళ్ళీ మనం గూళ్ళు కల్పించి.. ఆహారం అందిస్తే మళ్ళీ మనచుట్టూ తిరుగుతూ సందడి చేస్తాయి. అందుకే వాటిని మళ్ళీ ఆహ్వానించాలని భావించి అనంతపురం చుట్టుపక్కల ప్రతి ఇంటికి ఇలా గూళ్ళు అందిస్తున్నాం. రకరకాల పక్షులు తమ గూళ్ళను ఎలా రూపొందిస్తాయో. మేమూ అచ్చం అలాగే వాటిని తయారు చేసి పంచుతున్నాం. వీటిలో ఇప్పుడు పిచ్చుకలు.. పక్షులు నివాసం ఉంటున్నాయి.. ఇది చాలా సంతోషకరమైన అంశం అని అయన చెబుతున్నారు.
హోమ్ ఫర్ బర్డ్స్ సొసైటీ సభ్యులు వీధుల్లో తిరుగుతూ పక్షుల అలికిడిని బట్టి.. ఏయే ప్రాంతాల్లో ఎలాంటి పక్షులు ఉంటున్నాయనేది ఒక సర్వే మాదిరి చేసి ఆయా ప్రాంతాల్లో అలంటి గూళ్ళు ఏర్పాటు చేస్తున్నారు.. స్కూళ్ళు.. విద్యాసంస్థలు.. కాలేజీలు.. పార్కులు.. పెద్దపెద్ద చెట్లు ఉన్న చోట్ల ఈ గూళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అంతే కాకుండా వాటికీ నీళ్లు ఆహారం కూడా అందిస్తూ వాటి మనుగడకు ఎంతో దోహదం చేస్తున్నారు. పక్షి నిపుణులతో మాట్లాడి.. ఏయే జాతి పక్షులు ఎలాంటి గూళ్ళు కడతాయనేది తెలుసుకుని ఆమేరకు నాలుగు రకాల గూళ్ళు తయారు చేసి అందజేస్తున్నారు. ఈ సంస్థ పుణ్యాన ఇప్పుడు అనంతపురం చుట్టుపక్కల పక్షుల సంతతి పెరిగింది.. వాటి సందడి సైతం పెరిగింది.
మనం బతుకుదాం.. చిరు జీవులను బతికిద్దాం
:::సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment