వీరాపురానికి వచ్చిన విదేశీ పక్షులు
ఏటా ఫిబ్రవరి మొదటివారంలో ఎంట్రీ
ఈసారి నెల ముందుగానే రాక
3 శతాబ్దాలుగా గ్రామంతో పక్షులకు విడదీయరాని బంధం
సాక్షి, పుట్టపర్తి: ఏటా ఫిబ్రవరిలో వీరాపురానికి వచ్చే విదేశీ పక్షులు ఈ ఏడాది నెల ముందుగానే వచ్చేశాయి. దీంతో శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో కర్ణాటక సరిహద్దున వీరాపురం ఇప్పుడు పక్షులతో కోలాహలంగా కనిపిస్తోంది. అరుదైన జాతిగా భావించే పెయింటెడ్ స్టార్క్ పక్షులు ఎక్కువగా వస్తాయి.
ఈ పక్షులకు వీరాపురంతో 3 శతాబ్దాల అనుంబంధం ఉంది. ఏటా జనవరి చివర్లో సైబీరియా, రష్యా నుంచి ఇక్కడికి వలస వచ్చి చెరువు సమీపంలోని చెట్లపై గూళ్లు కట్టుకొని 6 నెలలు మకాం వేస్తాయి. సంతానోత్పత్తి చేసుకొని పిల్లలతో సహా వెళ్లిపోతాయి. వీటిని ఎర్రమూతి కొంగలంటారు.
వాకబు చేసి వెళ్లి గుంపులుగా వస్తాయి..
సైబీరియాలో శీతాకాలం ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో సైబీరియా పక్షులు వేడిని వెతుక్కుంటూ భారత్, శ్రీలంక, థాయ్‌లాండ్, వియత్నాం, చైనా తదితర దేశాలకు పయనం అవుతాయి. ఆ క్రమంలోనే జనవరి చివరి వారంలో వీరాపురానికి వస్తాయి. ముందుగా కొన్ని పక్షులు ఇక్కడికి వచ్చి, చెరువులో నీరు, ఆహారాన్ని పరిశీలించి వెళ్లిపోతాయి. తర్వాత గుంపులు గుంపులుగా వస్తాయి. చెరువు చుట్టూ ఉన్న వందలాది చెట్లు ఈ పక్షులతో నిండిపోతాయి.
సాగు ఆపి.. ఆదరిస్తూ..
ఈ కొంగల రాకతో ఊరికి మేలు జరుగుతుందని వీరాపురంవాసులు నమ్ముతారు. వాటిని బంధువుల్లా ఆదరిస్తారు. ఎవరైనా వాటికి హాని తలపెడితే అందరూ ఒక్కటై, పెద్దల సమక్షంలో పంచాయితీ చేస్తారు. జరిమానా విధిస్తారు. కేసులు పెడతారు. చెరువును చారిత్రక సంపదగా ప్రకటించారు. చెరువు కింద 80 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువు నీటితో సాగుచేస్తే నీరు తగ్గిపోయి మత్స్యసంపద అంతరించి పక్షులు రాకుండా పోతాయనే భయంతో గ్రామస్తులు చెరువు నీటితో సాగునే నిలిపివేశారు.
ఎత్తు 3.5 అడుగులు
సికొనిడే జాతికి చెంది పెయింటెడ్ స్టార్క్ శాస్త్రీయ పేరు ’మిక్టీరియాలూకోసిఫల’. ఎత్తు 3 అడుగుల నుంచి 3.5 అడుగుల వరకూ ఉంటాయి. ఎగరడానికి రెక్కలు విప్పినప్పుడు ఐదు అడుగుల వెడల్పు ఉంటుంది. బరువు 3.5 కిలోల నుంచి 4 కిలోల వరకు ఉంటుంది. పెయింటెడ్ స్టార్క్ నీళ్లు గొంతు వరకు నింపుకొని పిల్ల పక్షులకు అందించేందుకు మళ్లీ మొత్తం నీరు బయటకు తీసి ఇవ్వడం ఆశ్చర్యం గొలుపుతుంది.
ఆహారం కోసం ఊరికి 50 కిలోమీటర్ల దూరంలో ఉండే చెరువులు, పంట పొలాలకు వెళ్లి తిరిగి సాయంత్రం గూటికి చేరతాయి. ఒక గూడులో జంట పక్షులుంటాయి. గుడ్లు పెట్టి పిల్లలను చేసిన తర్వాత వాటి సంరక్షణ మగపక్షి చూసుకుంటే ఆడకొంగలు బయటకు వెళ్లి చెరువుల్లో వేటాడి చేపలు, నీళ్లు తీసుకొచ్చి పిల్లలకు అందిస్తాయి.
అతిథుల్లా భావిస్తాం
సైబీరియాతో పోలిస్తే వీరాపురంలో వేడి వాతావరణం ఉండటం, వేసవిలోనూ దగ్గరలోని చెరువుల్లో నీళ్లుండటంతో పక్షులు మా ఊరికే వస్తుంటాయి. కేవలం చేపలనే ఆహారంగా తీసుకుంటాయి. వాటిని మేం అతిథుల్లా భావిస్తాం. వాటికి ఎవరైనా హాని తలపెడితే శిక్ష తప్పదు. – ఎల్.లక్ష్మీపతి, వీరాపురం గ్రామ సర్పంచ్
సీజన్‌కు ముందే వచ్చేస్తున్నాయి
నాలుగేళ్ల క్రితం వర్షాలు లేక చెరువులో నీళ్లు లేకపోవడంతో ఎర్ర కొంగలు రాలేదు. మూడేళ్ల నుంచి యథావిధిగా వస్తున్నాయి. ఈసారి సీజన్‌కు ముందే కొన్ని పక్షులు వచ్చి సర్వే చేసుకొని వెళ్లాయి. ఇప్పుడు గుంపులుగా వచ్చేస్తున్నాయి. – పురుషోత్తమ్‌రెడ్డి, ఎంపీపీ, చిలమత్తూరు
వీరాపురం ఇలా చేరుకోవచ్చు
వీరాపురం చిలమత్తూరు నుంచి 11 కిలోమీటర్లు, హిందూపురం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలులో హిందూపురం చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వెళ్లవచ్చు. బెంగళూరు – హైదరాబాద్ జాతీయ రహదారి మీదుగా కొడికొండ చెక్ పోస్టు చేరుకుని, అక్కడి నుంచి చిలమత్తూరు మీదుగా వీరాపురం చేరుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment