పెద్దొడ్డి మాటే పెదరాయుడి తీర్పు.. పోలీస్ ఠాణా గడప తొక్కని కొల్లేరు వాసులు
ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఐకమత్యమే మహాబలం
150 ఏళ్లకుపైగా ఒకే మాట..ఒకే బాట
కొల్లేరులో అ‘సామాన్యుల’ బతుకు చిత్రం
⇒ పొద్దు పొడవక ముందే భుజాన వెదురు గెడకు మావులు, సల్దికూడు (సద్దన్నం) క్యారేజీ తగిలించుకుని గోచీ పెట్టుకుని నడిచి వెళ్లి కొల్లేరులో తాటి దోనెలపై తిరిగి సహజసిద్ధంగా చేపలను వేటాడి మార్కెట్‌కు పోయి అయినకాడికి అమ్ముకుని బతుకు నెట్టుకొచ్చిన మట్టి మనుషులు ఒకనాడు.
⇒ సమాజంలో మిగిలిన వారిలాగానే కాలానికి అనుగుణంగా ఆధునికతను అందిపుచ్చుకుని చేపల చెరువులతో ఆదాయం ఆర్జించి అభివృద్ధివైపు అడుగులు వేసిన గట్టి మనుషులు నేడు.
⇒ రాష్ట్రంలోని ఏలూరు–పశ్చిమ గోదావరి జిల్లాల నడుమ విస్తరించిన కొల్లేరు ప్రాంతంలో నివసించే ప్రజల జీవన గమనాన్ని పరిశీలిస్తే గొప్ప సందేశాన్ని బాహ్య ప్రపంచానికి పంచుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా కొల్లేరులో ఎదిరీదే బతుకుచిత్రమిదీ. జీవన విధానంలో మార్పులు వచ్చినా కొల్లేరులో మనిషి మారలేదు. వారి మనసూ మారలేదు. కార్పొరేట్ కల్చర్, కుట్రలు, కుతంత్రాలు వారిని ఏమాత్రం ప్రభావితం చేయలేదు.
ఎన్ని కష్టాలొచ్చినా ఐక్యమత్యమే మహాబలం అనేదానికి కొల్లేరువాసులు నిలువెత్తు సాక్ష్యం. ఇది ఒకటి రెండేళ్లు కాదు. ఏకంగా 150 ఏళ్ల క్రితం నుంచి వారంతా ఒకే మాట, ఒకే బాట అనే తీరుతో ముందుకు సాగుతున్నారు. పరస్పర సహకారం, గ్రామాభివృద్ధికి తోడ్పాటు, వ్యక్తిగత తగాదాలు, కుటుంబంలోని పేచీలు ఇలా విషయం ఏదైనా సరే వారంతా గ్రామంలోనే నిర్ణయం తీసుకునే కట్టుబాటు ఇప్పటికీ కొనసాగుతోంది. – సాక్షి, అమరావతి
ఆకాశంలో విహరించే పక్షుల సమూహాలు...నీటిలో జలపుష్పాల పరుగులు ..చుట్టూ నీటి మధ్యలో దీవుల్లాంటి భువిపై వెలిసిన గ్రామాల్లో జీవనం సాగించే అ‘సామాన్యులు’. ఇది మంచినీటి సరస్సుగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ‘కొల్లేరు’తో పెనవేసుకున్న జీవరాశులతో సహజీవనం.
కాంటూరు కుదింపునకు వైఎస్ సర్కారు తీర్మానం
కొల్లేరు ఐదో కాంటూరు వరకు 77,138 ఎకరాల విస్తీర్ణాన్ని అభయారణ్యంగా ప్రకటించారు. దీన్ని మూడో కాంటూరుకు కుదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ 2008లో వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. కాంటూరు పరిధి తగ్గించడం వల్ల 43,072 ఎకరాలు అభయారణ్యం పరిధి నుంచి బయటపడతాయి. వాటిలో పట్టా భూములు 14,932 ఎకరాలు, జిరాయితీ భూములు 5,510 ఎకరాలను వాటి హక్కుదారులకు అప్పగించగా మిగిలిన భూమిని పేదలకు పంచాలన్నది అప్పటి వైఎస్ ప్రభుత్వ సంకల్పం. కానీ పర్యావరణ, న్యాయపరమైన అంశాలు ముడిపడి ఉండటంతో కాంటూరు కుదింపు జరగలేదు.వైఎస్ హయాంలో రూ.1300 కోట్లతో
కొల్లేరులో ప్రత్యేక పునరావాస ప్యాకేజీని అమలు చేశారు. వైఎస్సార్ హయాంలో ప్రతిపాదించిన రెగ్యులేటర్ నిర్మాణ ప్రతిపాదనకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో కదలిక వచ్చింది. కొల్లేరులోని సర్కారు కాలువపై కీలకమైన వంతెన నిర్మాణానికి వైఎస్సార్ హయాంలో నిధులు మంజూరు చేసినప్పటికీ ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం దాన్ని చేపట్టలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఆ వంతెన నిర్మాణం పూర్తి చేయడం గమనార్హం.
పెద్దొడ్డి మాటేశిరోధార్యం..
కొల్లేరులో భిన్నమైన మనస్తత్వాలు కలిగిన వారు జీవించొచ్చు కానీ వారిలో భిన్నమైన మాటలు మాత్రం ఉండవు. వ్యక్తిగత, సామాజిక, రాజకీయ అంశాలైనా అక్కడ ఊరి పెద్దగా చెలామణి అయ్యే పెద్దొడ్డి (పెద వడ్డి) మాటే శిరోధార్యం. రెండు జిల్లాల్లోని 122 గ్రామాల్లోను ప్రజలందరూ కలిసి కొందరికి పెద్దరికం కట్టబెడతారు. తొలినాళ్లలో బయట వారి నుంచి రక్షణ కల్పించుకునేందుకు, వ్యక్తిగత ఇబ్బందుల నుంచి బయట పడేందుకు తమకు తాముగా సంఘాలు పెట్టుకుని నాయకులను (పెద్దొడ్డి) పెట్టుకునే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.
గ్రామ పంచాయతీల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు అతీతంగా ఒక్కో గ్రామంలో నలుగురి నుంచి 12 మంది వరకు పెద్దొడ్డిలుంటారు. ఏ సమస్య వచ్చినా గ్రామం నడిబొడ్డున ఉండే చావిడి, ఆలయంలో పెద్దొడ్డిలను ఆశ్రయిస్తారు. సాధారణంగా అందరూ పనులు పూర్తి చేసుకుని ఇళ్లకు వచ్చాక సాయంత్రం సమయంలో ఈ పంచాయతీలు నడుస్తుంటాయి. రెండు వైపులా వాదనలు విని స్థానిక న్యాయస్థానాలు మాదిరిగా వారిచ్చే తీర్పును ప్రజలు ఆచరిస్తారు. చిత్రం ఏమిటంటే పేచీలు పెట్టుకుని వారు పోలీస్ ఠాణాలు, బయటి వారి గడప తొక్కరు. దశాబ్దాలు గడిచినా అదే కట్టుబాటు ఇప్పటికీ కొనసాగుతుండటం విశేషం.
ఒడిశా నుంచి వలసొచ్చి...విస్తరించి
పొట్ట చేతపట్టుకుని రాష్ట్ర సరిహద్దులు దాటి ఒడిశా నుంచి వలసొచ్చిన 50 కుటుంబాలు శాఖోపశాఖలుగా విస్తరించి కొల్లేరులో గ్రామాలను నిర్మించాయి. దాదాపు 150 ఏళ్ల కిందట వచ్చిన వడ్డెర (వడ్డీలు) కులానికి చెందిన వలస జనం ప్రధానంగా చేపల వేటపైనే ఆధారపడి బతికేవారు. ఎటుచూసినా నీరు, మధ్య దిబ్బలాంటి ప్రాంతాల్లో దట్టమైన పొదలతో అడవికంటే భయంకరంగా ఉండే ఆ ప్రాంతంలో మానవమాత్రుడు ఉండటం కష్టంగా ఉండే రోజుల్లోనూ నాగరికతకు దూరంగా బతకడం మొదలైంది. పొదలు, తుప్పలను బాగుచేసి కొల్లేరులో దొరికే కిక్కిసకర్రలతో చిన్నపాటి గుడిసె (పాకలు) వేసుకుని జీవించేవారు.
కొల్లేరు నీటి అడుగు దొరికే అలిపిరి కాయలు, కాలువ దుంపలను ఆహారంగా తినేవారు. కొల్లేరులో సహజసిద్ధంగా పెరిగే నల్లజాతి చేపలు పుష్కలంగా ఉండటంతో వాటిని వేటాడి బయట ప్రాంతాల్లో విక్రయించి కుటుంబాలను పొషించుకునే వారు. వడ్డీలతోపాటు సమీప ప్రాంతాల్లోని ఎస్సీలు కూడా కొల్లేరులో స్థిరపడి చేపల వేటపై జీవనం సాగిస్తున్నారు.
జీవన చిత్రాన్ని మార్చేసిన చెరువులు
కొల్లేరులో చేపల చెరువులు ఆ ప్రాంత వాసుల జీవన చిత్రాన్ని మార్చేశాయి. చిత్రం ఏమిటంటే కొల్లేరు వాసులు బతకడం కోసం గతంలో కొల్లేరులో చేపల చెరువులు తవ్వకపోతే ప్రభుత్వం కేసులు పెడితే...జనజీవనానికి ప్రమాదంగా పరిణమించిన కాలుష్యకారక చేపల చెరువులను తొలగించకపోతే కేసులు పెట్టాల్సిన పరిస్థితి వరకూ వచ్చింది. కొల్లేరులో చేపల వేటపైనే ఆధారపడిన వారికి మేలు చేసేలా సొసైటీలుగా ఏర్పడి ప్రభుత్వ భూముల్లో చెరువులు తవ్వుకునేలా 1976లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నిర్ణయం తీసుకున్నారు.
కొల్లేరు వాసులకు దానిపై అవగాహన కల్పిస్తూ శృంగవరప్పాడు గ్రామంలో తొలి సొసైటీ చెరువు తవ్వకానికి శంఖుస్థాపన చేశారు. సహజసిద్ధంగా చేపల వేటపై ఆధారపడి బతికే తమ పొట్ట కొట్టేందుకు ప్రభుత్వం సొసైటీ చెరువులు తవ్విస్తోందంటూ కొల్లేరు వాసులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు. వారిని కట్టడి చేసేలా కేసులు పెట్టి, నిర్బంధంగా చెరువులు తవ్వేలా అప్పట్లో ప్రభుత్వం వ్యహరించింది. క్రమంగా సొసైటీల పేరుతో కొల్లేరులో ప్రాంతాలు విభజించుకుని కొల్లేరు వాసులు చేపలను వేటాడుకుని మెరుగైన జీవనానికి అలవాటు పడ్డారు.
కొల్లేరుపై కన్నేసిన పొరుగు ప్రాంతాల వాళ్లు రంగంలోకి సొసైటీలకు డబ్బులు (లీజు)ఇచ్చి చెరువులు తవ్వి పెద్ద ఎత్తున చేపలసాగు చేపట్టడంతో పర్యావరణ సమస్య ఉత్పన్నమైంది. దీంతో పర్యావరణ సంస్థలు పోరాటంతో న్యాయస్థానాల ఆదేశాలతో ప్రభుత్వం కొల్లేరు పరిరక్షణకు 120 జీవో జారీచేయడం, చేపల చెరువుల తొలగింపునకు(కొల్లేరు ఆపరేషన్) నిర్వహించడం చకచకా జరిగిపోయింది.
మగ బిడ్డకూ వాటా..
రెండు జిల్లాల్లో తొమ్మిది మండలాల్లో విస్తరించిన కొల్లేరు ప్రాంతంలో ఇప్పుడు 80 వేల కుటుంబాల్లో మూడు లక్షల 30 వేల మంది జీవిస్తున్నారు. రెండు లక్షల పది వేల మంది ఓటర్లున్న కొల్లేరులో ఉన్న సొసైటీలు, గ్రామాలు వారీగా ఉన్న చెరువుల ఆదాయం (లీజు)లో ప్రతీ కుటుంబంలోను పెద్దకు వాటాలు ఇస్తారు. పుట్టిన మగ బిడ్డకు కూడా వాటాలు వేస్తారు. కొల్లేరుకు అక్కడివారు వలసరాక ముందే కొల్లేటి కోటలో వెలసిన పెద్దింట్లమ్మ అమ్మవారే ఆయా ప్రాంత వాసులకు పెద్దదిక్కు. ప్రతీఏటా అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. పెద్దయ్యాక వాటా ఇస్తారు.
Comments
Please login to add a commentAdd a comment