
ఎన్టీఆర్, సాక్షి: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ వ్యవహారంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ క్రమంలో ఆయన భార్య పంకజ శ్రీ(Pankaja Sri) సైతం ఇబ్బందికి గురయ్యారు. అడుగడుగునా పోలీసులు ఆమెను అడ్డుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
గురువారం ఉదయం వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)ని విజయవాడ పడమట పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని అప్పటికప్పుడు ఆయన భార్య చేతిలో నోటీసులు పెట్టి తెలియజేశారు. ఆ పరిణామంతో ఆమె కంగారుపడిపోయారు. భర్త కోసం పోలీసుల వెనకాలే హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరారు.
ఈ క్రమంలో నందిగామ(Nandigama) వై జంక్షన్ వద్ద ఆమె కారును పోలీసులు అడ్డుకున్నారు. కారు ముందు సీటులో ఉన్న వ్యక్తిని బలవంతంగా దించేసి.. కంచికచర్ల సీఐ ఆ వాహనంలో కూర్చున్నారు. ఇదేమిటని అడిగితే.. వాళ్ల నుంచి స్పందన లేదు. ఆపై వంశీ భార్య ఉన్న ఆ కారుని పోలీసులు దారి మళ్లించి ముందుకు తీసుకెళ్లారు.

మునగచర్ల వద్ద పర్వతనేని సుభాష్ చంద్రబోస్ మెమోరియల్ ట్రస్ట్ డ్రైవింగ్ స్కూల్ వద్ద ఆమెను, డ్రైవర్‌ను పోలీసులు కాసేపు అదుపులోకి తీసుకుని.. ఆపై విడిచిపెట్టారు. అక్కడి నుంచి ఆమె నేరుగా కృష్ణలంక పీఎస్‌కు చేరుకోగా.. అక్కడా ఆమెను వంశీని చూసేందుకు అనుమతించకపోవడం గమనార్హం.
ఇదీ చదవండి: వల్లభనేని వంశీ అరెస్ట్.. అసలు జరిగింది ఇదే..!