తీవ్ర దుర్భాషలు.. అనుచిత ప్రవర్తన
ఇంట్లోకి చొరపడి ఆమె కుమారుడిపై విచక్షణా రహితంగా దాడి
రామవరప్పాడు: కూటమి ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు కావస్తున్నా టీడీపీ గూండాల దాడులకు అడ్డుకట్ట పడటం లేదు. వైఎస్సార్‌సీపీ నాయకులు, అభిమానులను టార్గెట్ చేస్తూ దౌర్జన్యకాండ సాగిస్తున్నారు. టీడీపీ నాయకుల ప్రోద్బలంతో పోలీసులు వీధి రౌడీల్లా ప్రవర్తించి మహిళ అని కూడా చూడకుండా దుర్బాషలాడుతూ అనుచితంగా ప్రవర్తించడం తీవ్ర దూమారం రేపింది. విజయవాడరూరల్ మండలం ప్రసాదంపాడు కొమ్మా రాము వీధిలో నివాసం ఉంటున్న గంధం వెంకటలక్ష్మికు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు గంధం సంతోష్, రెండో కుమారుడు రవి.
సంతోష్ వైఎస్సార్‌సీపీలో యువ నేత. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ గెలుపు కోసం అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రంగా కృషి చేశాడు. ఓ కేసు నిమిత్తం వంశీమోహన్ విజయవాడ కోర్టులో వాయిదాకు వచ్చిన సమయంలో సంతోష్ కలవడానికి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని ప్రసాదంపాడుకు చెందిన టీడీపీ నాయకుడు, ఉపసర్పంచ్ గూడవల్లి నరసయ్య టీడీపీ నాయకులను, పోలీసులను ఉసికొల్పాడు. దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంతోష్ నివాసం ఉంటున్న ఇంట్లోకి మంగళవారం చొరపడి ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. తొలుత సంతోష్ తల్లి తలుపు తీయగా.. దౌర్జన్యంగా నెట్టుకుంటూ ఇంట్లోకి చొరబడి ఆమెతో అనుచితంగా ప్రవర్తిస్తూ ఆమెను వెనక్కి నెట్టేశారు.
వైఎస్సార్‌సీపీ నాయకులను చూసుకుని మిడిసిపడుతున్నారని.. మీ పెద్ద కుమారుడిని అరెస్టు చేయాలంటూ హడావుడి చేశారు. సంతోష్ నిద్రిస్తున్నాడని చెబుతున్నా వినకుండా దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించి సంతోష్‌పై దాడి చేస్తూ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జరుగుతుండగానే చిన్న కుమారుడు రవి తన సెల్‌ఫోన్‌లో ఈ ఘాతుకాన్ని వీడియో తీస్తుండగా బలవంతంగా ఫోన్ లాక్కుని దుర్భాషలాడారు. తన కుమారుడిని ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ వెంకటలక్ష్మి పోలీసులను ప్రశ్నించగా.. ‘నీకు చెప్పాల్సిన అవసరం లేదు.. టీడీపీ నాయకులకు ఎదురెళితే ఇలానే ఉంటుంది’ అంటూ పోలీసులు సంతోష్‌ను ఈడ్చుకెళ్లారు.
స్టేషన్‌లో విచక్షణా రహితంగా దాడి
టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంతోష్‌ను బలవంతంగా పటమట పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం అక్కడి పోలీసులు.. వంశీని ఎందుకు కలవడానికి ప్రయత్నించావని ప్రశ్నించారు. తన అభిమాన నేతను కలవడంలో తప్పేముందని సంతోష్ బదులిచ్చాడు. దీనికి ఆగ్రహించిన ఎస్‌ఐ హరికృష్ణ సంతోష్‌పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. కాగా, తన కుమారుడిపై అకారణంగా దాడి చేశారని సీసీ ఫుటేజ్‌ను ఆధారంగా చూపుతూ సంతోష్ తల్లి వెంకటలక్ష్మి పటమట పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేసింది. సమస్యను సీపీ, ఏసీపీ, పడమట సీఐ దృష్టికి తీసుకొచ్చినా స్పందించలేదని వాపోయింది. కాగా బాధితుడు సంతోష్ పోలీసులు పాల్పడిన దుశ్చర్యపై ప్రైవేట్ కేసు కూడా పెట్టడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment