అతిథి పక్షులకు పుట్టినిల్లు పులికాట్ సరస్సు
ప్రకృతి అందాల హరివిల్లు ‘ప్రళయ కావేరి’
పర్యాటకులకు కనువిందు
సూళ్లూరుపేట: నిండా నీళ్లతో కళకళలాడుతున్న పులికాట్ సరస్సులో అతిథి పక్షులు సందడి చేస్తున్నాయి. దేశంలోనే రెండో అతి పెద్ద సరస్సుగా పేరొందిన పులికాట్ సరస్సు అసలు పేరు ప్రళయ కావేరి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సరస్సు జలకళ సంతరించుకున్న వేళ.. ఎవరో పిలిచినట్టుగా రంగు రంగుల విహంగాలు సుదూర తీరాల నుంచి వచ్చి వాలిపోతున్నాయి.
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నడుమ దాదాపు 250 చ.కి.మీ. వైశాల్యంలో సరస్సు వ్యాపించి ఉంది. వర్షాకాలంలో ఇది 460 చ.కి.మీ. వరకు పెరుగుతుంది. ప్రస్తుతం స్వర్ణముఖి, కాళంగి నదులతోపాటు పాముల కాలువ, కరిపేటి కాలువ, దొండ కాలువ, నెర్రి కాలువలు జోరుగా ప్రవహిస్తుండడంతో పులికాట్ సరస్సులోకి భారీగా నీరు చేరుతోంది.
అతిథి పక్షుల ఆవాసాలుగా గ్రామాలు
సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నేలపట్టు, వెదురుపట్టు, శ్రీహరికోట, తడ తదితర ప్రాంతాల్లోని గ్రామాలన్నీ అతిథి పక్షులకు ఆవాసాలుగా మారాయి. ఇక్కడి చెట్లపై వలస పక్షులు గూళ్లు కట్టుకుని శీతాకాలమంతా ఇక్కడే ఉండిపోతాయి. గుడ్లుపెట్టి.. పిల్లలను పొదిగి.. అవి పెద్దవయ్యాక మార్చి, ఏప్రిల్ నెలల్లో తిరిగి విదేశాలకు పయనమవుతాయి. పక్షులు ఇక్కడ ఉన్నన్ని రోజులు పులికాట్ సరస్సును ఆహార కేంద్రంగా వినియోగించుకుంటాయి.
సందర్శకుల సందడి
పులికాట్ సరస్సుకు వలస పక్షుల రాక మొదలవడంతో సూళ్లూరుపేట–శ్రీహరికోట రోడ్డు వెంబడిగల చెట్లన్నీ కళకళలాడుతున్నాయి. వీటిని వీక్షించేందుకు పర్యాటకుల తాకిడి మొదలైంది. పక్షులను తమ కెమెరాల్లో బంధించేందుకు సందర్శకులు, బర్డ్ వాచర్స్ ఈ ప్రాంతంలోనే విడిది చేస్తున్నారు.
152 రకాల పక్షుల రాక
ఏటా పులికాట్ సరస్సుకు సుమారు 152 రకాల విహంగాలు సైబీరియా, నైజీరియా, రష్యా, పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనాతో పాటు పలు యూరోపియన్ దేశాల నుంచి వలస వస్తుంటాయి. ఆ దేశాల్లో మంచు, చలి ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడికి వలస వస్తుంటాయి. శీతాకాలంలో ఇక్కడి వాతావరణం సమశీతోష్ణ స్థితి ఉండటంతో పులికాట్‌కు సరస్సుకు నీళ్లు చేరగానే పక్షులు వాలిపోతుంటాయి.
పులికాట్ సరస్సుకు ఫ్లెమింగోలతో పాటు పెలికాన్స్, ఎర్రకాళ్ల కొంగలు, నారాయణ పక్షులు, నత్తగుల్ల కొంగలు, నీటికాకులు, తెల్ల కంకణాయిలు, నల్ల కంకణాయిలు, శబరి కొంగలు, నీల»ొల్లి కోడి, బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్, పాము మెడ పక్షి, తెల్ల పరజలు భారీగా వస్తుంటాయి.
చుక్కమూతి బాతులు, తెడ్డుముక్కు బాతులు వంటి బాతు జాతులే 20 రకాల వరకు ఇక్కడకు వస్తుంటాయి. సీగల్స్, ఇంకా పేరు తెలియని కొన్ని పక్షి జాతులు సైతం ఇక్కడకు వస్తున్నాయి. స్వదేశీ పక్షులు, స్వాతి కొంగలతోపాటు పలు కొంగజాతులు ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాయి.
ఉప్పలపాడులో కిలకిల
రకరకాల విదేశీ పక్షుల రాకతో గుంటూరు జిల్లా, పెదకాకాని మండలం, ఉప్పలపాడులోని వలస పక్షుల విడిది కేంద్రం సందడిగా మారింది. ఈ కేంద్రంలో గూడ బాతులు (పెలికాన్స్), ఎర్రకాళ్ల కొంగలు (పెయిడెంట్ స్టార్స్), నత్తగుల్ల కొంగలు (ఓపెన్‌బిల్) పచ్చటి చెట్లపై గుంపులు గుంపులుగా సేదతీరుతూ చూపురులను ఆకట్టుకుంటున్నాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు.
Comments
Please login to add a commentAdd a comment