pulicat lake
-
చిత్తడి నేలలో పుత్తడి పక్షులు
సూళ్లూరుపేట: నిండా నీళ్లతో కళకళలాడుతున్న పులికాట్ సరస్సులో అతిథి పక్షులు సందడి చేస్తున్నాయి. దేశంలోనే రెండో అతి పెద్ద సరస్సుగా పేరొందిన పులికాట్ సరస్సు అసలు పేరు ప్రళయ కావేరి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సరస్సు జలకళ సంతరించుకున్న వేళ.. ఎవరో పిలిచినట్టుగా రంగు రంగుల విహంగాలు సుదూర తీరాల నుంచి వచ్చి వాలిపోతున్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నడుమ దాదాపు 250 చ.కి.మీ. వైశాల్యంలో సరస్సు వ్యాపించి ఉంది. వర్షాకాలంలో ఇది 460 చ.కి.మీ. వరకు పెరుగుతుంది. ప్రస్తుతం స్వర్ణముఖి, కాళంగి నదులతోపాటు పాముల కాలువ, కరిపేటి కాలువ, దొండ కాలువ, నెర్రి కాలువలు జోరుగా ప్రవహిస్తుండడంతో పులికాట్ సరస్సులోకి భారీగా నీరు చేరుతోంది. అతిథి పక్షుల ఆవాసాలుగా గ్రామాలు సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నేలపట్టు, వెదురుపట్టు, శ్రీహరికోట, తడ తదితర ప్రాంతాల్లోని గ్రామాలన్నీ అతిథి పక్షులకు ఆవాసాలుగా మారాయి. ఇక్కడి చెట్లపై వలస పక్షులు గూళ్లు కట్టుకుని శీతాకాలమంతా ఇక్కడే ఉండిపోతాయి. గుడ్లుపెట్టి.. పిల్లలను పొదిగి.. అవి పెద్దవయ్యాక మార్చి, ఏప్రిల్ నెలల్లో తిరిగి విదేశాలకు పయనమవుతాయి. పక్షులు ఇక్కడ ఉన్నన్ని రోజులు పులికాట్ సరస్సును ఆహార కేంద్రంగా వినియోగించుకుంటాయి. సందర్శకుల సందడి పులికాట్ సరస్సుకు వలస పక్షుల రాక మొదలవడంతో సూళ్లూరుపేట–శ్రీహరికోట రోడ్డు వెంబడిగల చెట్లన్నీ కళకళలాడుతున్నాయి. వీటిని వీక్షించేందుకు పర్యాటకుల తాకిడి మొదలైంది. పక్షులను తమ కెమెరాల్లో బంధించేందుకు సందర్శకులు, బర్డ్ వాచర్స్ ఈ ప్రాంతంలోనే విడిది చేస్తున్నారు.152 రకాల పక్షుల రాక ఏటా పులికాట్ సరస్సుకు సుమారు 152 రకాల విహంగాలు సైబీరియా, నైజీరియా, రష్యా, పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనాతో పాటు పలు యూరోపియన్ దేశాల నుంచి వలస వస్తుంటాయి. ఆ దేశాల్లో మంచు, చలి ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడికి వలస వస్తుంటాయి. శీతాకాలంలో ఇక్కడి వాతావరణం సమశీతోష్ణ స్థితి ఉండటంతో పులికాట్‌కు సరస్సుకు నీళ్లు చేరగానే పక్షులు వాలిపోతుంటాయి. పులికాట్ సరస్సుకు ఫ్లెమింగోలతో పాటు పెలికాన్స్, ఎర్రకాళ్ల కొంగలు, నారాయణ పక్షులు, నత్తగుల్ల కొంగలు, నీటికాకులు, తెల్ల కంకణాయిలు, నల్ల కంకణాయిలు, శబరి కొంగలు, నీల»ొల్లి కోడి, బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్, పాము మెడ పక్షి, తెల్ల పరజలు భారీగా వస్తుంటాయి. చుక్కమూతి బాతులు, తెడ్డుముక్కు బాతులు వంటి బాతు జాతులే 20 రకాల వరకు ఇక్కడకు వస్తుంటాయి. సీగల్స్, ఇంకా పేరు తెలియని కొన్ని పక్షి జాతులు సైతం ఇక్కడకు వస్తున్నాయి. స్వదేశీ పక్షులు, స్వాతి కొంగలతోపాటు పలు కొంగజాతులు ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాయి. ఉప్పలపాడులో కిలకిలరకరకాల విదేశీ పక్షుల రాకతో గుంటూరు జిల్లా, పెదకాకాని మండలం, ఉప్పలపాడులోని వలస పక్షుల విడిది కేంద్రం సందడిగా మారింది. ఈ కేంద్రంలో గూడ బాతులు (పెలికాన్స్), ఎర్రకాళ్ల కొంగలు (పెయిడెంట్ స్టార్స్), నత్తగుల్ల కొంగలు (ఓపెన్‌బిల్) పచ్చటి చెట్లపై గుంపులు గుంపులుగా సేదతీరుతూ చూపురులను ఆకట్టుకుంటున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు. -
ప్రకృతి ప్రియులకు స్వర్గధామం.. చుట్టూ నీరు, మధ్యలో ఊరు
చిత్తూరు నుంచి తిరుపతి ప్రత్యేక జిల్లాగా వేరుపడ్డాక ఈ ప్రాంతానికి సముద్రంతో పాటూ ఒక దీవి వచ్చి చేరింది. ఆ దీవి పేరు ఇరకం. ఇది తడ మండలంలోని పులికాట్ సరస్సు మధ్యలో ఉంది. చుట్టూ నీరు.. మధ్యలో ఊరు. ఈ దీవిలో పర్యాటకులను ఆకట్టుకునే ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అక్కడి ప్రయాణం ఓ మధురానుభూతిని మిగుల్చుతుంది. చల్లటి గాలులు.. తేలికపాటి అలల మధ్య సాగే పడవ ప్రయాణం.. గాలివాటున దూసుకెళ్లే తెరచాప పడవలు.. ఓవైపు ఎగురుతూ కనిపించే విదేశీ పక్షులు.. ఈ దృశ్యాలు ఎంతో ఆహ్లాదంగా.. అద్భుతంగా కనిపిస్తాయి. మరో విశేషమేమంటే.. చుట్టూ ఉప్పునీరున్నా.. రెండు గ్రామాలున్న ఈ దీవిలో తాగేందుకు మంచినీరు పుష్కలంగా లభించడం ఇక్కడ ప్రత్యేకత. ఈ ప్రాంతానికి పర్యాటక శోభ తేవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. తడ(తిరుపతి జిల్లా): కొత్తగా ఏర్పడ్డ తిరుపతి జిల్లాకి నెల్లూరు జిలాల్లోని సముద్రం (బంగాళాఖాతం) తడ మండలం పరిధిలోని పులికాట్ సరస్సు, సరస్సు నడుమ ఉన్న అందాల ఇరకం దీవి సొంతమయింది. 4,486 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ దీవిలోని ఇరకం గ్రామంలో మొదలియార్లు, హరిజనులు, గిరిజనులతోపాటు తిరువెంకటానగర్ కుప్పంలో సుమారు రెండు వేల మంది కలిగిన మత్స్యకారులు 580 ఇళ్లల్లో జీవిస్తూ ఉన్నారు. ఈ దీవిలో 2200 ఎకరాల వ్యవసాయభూమి ఉండగా ఇందులో వరిసాగు చేస్తారు. దీవిలో నుంచి 200 మంది విద్యార్థులు ఆరంబాకం, సున్నపుగుంట గ్రామాలకు చదువు కోసం పడవల్లో పులికాట్ సరస్సు మీదుగా రాకపోకలు సాగిస్తూ ఉంటారు. పడవలో షికారు మరో వైపు ఈ దీవి వైపు పర్యాటకుల చూపు పడింది. ఆహ్లాదంగా కనిపించే సరస్సుపై పడవలో షికారు తిరగాలంటే మక్కువ చూపుతున్నారు. పండగలు, సెలవు దినాల్లో ప్రకృతి ప్రియులు బీవీపాళెం గ్రామానికి చేరుకుని అక్కడి నుంచి పడవల ద్వారా ఇరకం వెళతారు. అక్కడ సాయంత్రం వరకు సేదతీరి ప్రకృతి అందాలను ఆస్వాదించి తిరిగి వస్తున్నారు. బీవీపాళెం నుంచి పడవ ద్వారా 11 కిలో మీటర్ల దూరం ఉన్న ఇరకం దీవికి వెళ్లాలంటే పట్టే 40–45 నిమిషాల ప్రయాణం మంచి అనుభూతిని ఇస్తుంది. సరస్సులో చేపల వేట సాగించే తెరచాప పడవలు, అక్కడక్కడ చేపల కోసం కాచుకు కూర్చున్న విహంగాలు, పడవల పక్కనే ఎగిరెగిరి పడుతూ చేపలు చేసే విన్యాసాలు పర్యాటకులకు మంచి ఆహ్లాదాన్ని అందిస్తాయి. ఇరకం తెల్లటి ఇసుకతో నిండిన గ్రామం. నీటి కోసం అక్కడక్కడ తవ్విన దొరువులు, దొరువుల చుట్టూ మొలిచిన మొగలి పొదలు, వెదురు చెట్లు సరికొత్త అనుభవాన్ని అందిస్తాయి. దెబ్బతీసిన ఉప్పునీరు దశాబ్దాలుగా బంగాళాఖాతం నుంచి పులికాట్ సరస్సుకి నీటిని అందించే ముఖద్వారాలు పూడిపోతూ రావడం, సరస్సుకి సముద్రంద్వారా వచ్చే నీటికి అడ్డుకట్ట పడడంతో సముద్రం, సరస్సు మధ్య నీటితోపాటు రాకపోకలు సాగించే చేపలు, రొయ్యల కదలికలు తగ్గి పోయాయి. దీంతో మత్స్యకారులకు వేట కష్టతరమైంది. కొందరు అత్యాశ పరులు తమ స్వార్థం కోసం సరస్సు చుట్టూ ఉన్న పొర్లుకట్టను ధ్వంసం చేయడంతో ఉప్పునీళ్లు పొలాల్లోకి చేరి పంటలు దెబ్బతిన్నాయి. ఇక్కడ చదువుకైనా, కాన్పుకైనా, పాముకరిచినా, అత్యవసర పరిస్థితిలో అయినా పడవ ప్రయాణం తప్ప మరో దారిలేదు. పర్యాటక అభివృద్ధికి చర్యలు ఇరకం దీవిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. సీఎం ఆదేశాల మేరకు సూళ్లూరుపేట శాసన సభ్యులు కిలివేటి సంజీవయ్య ఇరకం దీవితోపాటు బీవీపాళెం, వేనాడు ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆంధ్రా, తమిళనాడు పర్యాటకులు సేద తీరేందుకు బీవీపాళెంలో నిర్మించిన రిసార్టులను టెండర్ల ద్వారా సమర్థులైన వారికి అప్పగించడంతోపాటు ఇరకం దీవిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి పర్యాటకులకు వసతులు కల్పిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే ఇరకం దీవిలోని ప్రజలకు స్థానికంగానే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించడంతోపాటు వారికి సంబంధించిన భూములకు మంచి గిరాకీ లభించనుంది. -
వలస విహంగాల సందడి
సూళ్లూరుపేట: విదేశీ వలస విహంగాల సందడితో.. ప్రకృతి అందాలకు హరివిల్లుగా పేరుగాంచిన పులికాట్ సరస్సు మరింత శోభను సంతరించుకుంటుంది. సుదూర ప్రాంతాల నుంచి శీతాకాలంలో మాత్రమే ఈ ప్రాంతానికి విచ్చేసే విదేశీ వలస పక్షులు నేలపట్టు, వెదురుపట్టు, శ్రీహరికోట తదితర ప్రాంతాల్లోని చెట్లపై గూళ్లు కట్టుకుని సంతానోత్పత్తి చేసుకుని తిరిగి వెళుతుంటాయి. అక్టోబర్ నుంచి మార్చి దాకా ఈ ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకుని నేలపట్టును బ్రీడింగ్ సెంటర్‌గా, పులికాట్ సరస్సును ఫీడింగ్ సెంటర్‌గా ఉపయోగించుకుని వెళుతుంటాయి. సంతానోత్పత్తి నేలపట్టులో, ఆహారం కోసం పులికాట్ సరస్సులో ఉంటూ.. పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. శ్రీహరికోట–సూళ్లూరుపేట రోడ్డుకు పక్కన వలస విహంగాలు వేల సంఖ్యలో దర్శనమిస్తున్నాయి. ఈ సారి సరస్సులో నీళ్లు సమృద్ధిగా ఉండడంతో వేల సంఖ్యలో ఫ్లెమింగోలు, ఫెలికాన్స్, పెయింటెడ్ స్టార్క్స్, ఇతర కొంగజాతులు గుంపులు గుంపులుగా చేరుకుంటున్నాయి. -
ప్రారంభమైన ఫ్లెమింగోల సందడి..
విహంగాల్లో రారాజైన గూడబాతులు (పెలికాన్).. ప్రపంచంలోనే అతి అందమైన పక్షులు ఫ్లెమింగోలు.. ఆహార వేటలో ఆకట్టుకునే విన్యాసాలు చేసే నారాయణ పక్షి.. జపం చేసే పెయింటెడ్ స్టార్క్స్.. చూపరులను ఆకట్టుకునే ఎర్రకాళ్ల కొంగలతో పాటు వందల రకాల అరుదైన పక్షి జాతులు జిల్లాలోని పక్షుల కేంద్రంలో సందడి చేస్తున్నాయి. జీవ వైవిధ్యానికి ప్రతీకగా నిలిచే పులికాట్ సరస్సు వేల విదేశీ పక్షుల ఆహార భాండాగారంగా విలసిల్లుతోంది. ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురవడంతో నెల రోజుల ముందు నుంచే జిల్లాలో ఫ్లెమింగోల సందడి ప్రారంభమైంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పక్షుల విడిది కేంద్రం నేలపట్టు. జీవ వైవిధ్యానికి నెలవైన ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు పులికాట్ విదేశీ వలస విహంగాల విహారంతో అరుదైన ప్రపంచంగా కనిపిస్తోంది. చెరువు నీటిలోని కడప చెట్లపై విడిది చేస్తున్న అతిథుల కిలకిలరావాలు, ఆహార వేటలో సాగించే విన్యాసాలు పక్షి ప్రేమికులను కనువిందు చేస్తున్నాయి. దశాబ్దాలుగా నేలపట్టు విదేశీ పక్షుల సంతనోత్పత్తి కేంద్రంగా భాసిల్లుతోంది. అక్టోబరు మాసం వచ్చిందంటే.. రంగు రంగుల పక్షులు వచ్చి వాలుతుంటాయి. సుమారు ఆరు నెలల పాటు ఇక్కడ విడిది చేసి సంతానోత్పత్తిని పెంచుకుని తిరిగి స్వస్థలాలకు పయనమవుతాయి. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురవడంతో నేలపట్టు చెరువులతో పాటు పులికాట్‌కు నీళ్లు రా వడంతో వలస పక్షులు నెల ముందుగానే చేరు కుని సందడి చేస్తున్నాయి. ►ఒక వైపు నేలపట్టు చెరువులో విదేశీ వలస విహంగాలు గుడ్లుపెట్టి పొదుగుతుంటే పులికాట్ సరస్సులో విహంగాలు ఆహార వేట సాగిస్తూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ►సూళ్లూరుపేట–శ్రీహరికోట రోడ్డులో పులికాట్ సరస్సులో నీళ్లు పుష్కలంగా చేరడంతో ఫ్లెమింగోలు, పెలికాన్స్, పెయింటెడ్ స్టార్క్స్ గుంపులు గుంపులుగా ఆహార వేటలో దర్శనమిస్తున్నాయి. ►సీగల్స్, చిలువలు, నీటికాకులు, నారాయణ పక్షులతో పాటు వివిధ రకాలకు చెందిన కొంగ జాతులు విపరీతంగా విడిది చేసి ఉన్నాయి. ►నేలపట్టును సంతానోత్పత్తి కేంద్రంగా, పులికాట్ సరస్సును ఆహార కేంద్రంగా చేసుకుని పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. హంసను పోలిన ఫ్లెమింగో ప్రపంచంలోనే అందమైన పక్షి ఫ్లెమింగో. ఈ పక్షి హంసను పోలి ఉంటుంది. శాఖాహారి. ఈ రకం పక్షులు అత్యంత అరుదుగా ఉన్నాయి. పులికాట్ సరస్సు మీద ఆçహార వేటలో గుంపులు గుంపులుగా చేరి పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తాయి. ►ఈ పక్షులు ఆ్రస్టేలియా, రష్యా, సైబీరియా నుంచి వలస వచ్చి గుజరాత్‌లోని రాణాఫ్కచ్ అనే ప్రాంతంలో సంతానోత్పత్తి చేసుకుంటూ పులికాట్ సరస్సును ఆహార కేంద్రంగా ఉపయోగించుకుంటున్నాయి. ►ఈ పక్షులు పులికాట్ సరస్సులో రోజుల తరబడి ఉంటాయని దీనిపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు చెప్పారు. ►పులికాట్ సరస్సులో ఉండే నాచును మాత్రమే తింటుంది. ►ఈ పక్షి చెట్ల మీద గూళ్లు కట్టుకోకుండా నేలమీద రంధ్రం చేసుకుని గుడ్లు పెట్టి పొదుగుతాయి. ►హంసలు పాలను నీళ్లును వేరు చేసినట్టు ఈ పక్షి నాచు తినేటప్పుడు బురదను నాచును వేరు చేసి ఆహారంగా తీసుకోవడం దీని ప్రత్యేకత. ఎర్రకాళ్ల కొంగల కేంద్రం వెదురుపట్టు, శ్రీహరికోట ఎర్రకాళ్ల కొంగలు (పెయింటెడ్ స్టార్క్స్) పక్షులు వెదురుపట్టు చెరువు, శ్రీహరికోట లోని బేరిపేట ప్రాంతాల్లో గూళ్లు కట్టు కు ని నివాసం ఉంటాయి. ఆహార వేటకు మాత్రం పులికాట్ సరస్సుకే వస్తాయి. ►రష్యా, సైబీరియా వంటి దేశాల నుంచి ఇక్కడికి వలస వచ్చి సంతానోత్పత్తిని చేసుకుని వెళ్తుంటాయి. ►ఇవి పులికాట్లో గుంపు గుంపులుగా విహరిస్తుంటాయి. అయితే వెదురుపట్టు చెరువు అనువుగా లేకపోవడంతో ఈ పక్షులు శ్రీహరికోటకు మకాం మార్చుకున్నాయి. ►ప్రస్తుతం శ్రీహరికోటను సంతానోత్పత్తి కేంద్రంగా చేసుకున్నాయి. ఇవి కూడా సరస్సులోని చేపలు, రొయ్యలు, పీతలను తింటుంది. అతి పెద్ద సంతానోత్పత్తి కేంద్రం ఆసియా ఖండంలోనే విదేశీ శీతాకాలపు వలస విహంగాల సంతానోత్పత్తి కేంద్రంగా, నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంగా భాసిల్లుతుంది. 1976లో నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రంగా వన్యప్రాణి విభాగం అధికారులు గుర్తించారు. ఈ కేంద్రం 458.92 హెక్టార్లలో విస్తరించి ఉంది. ప్రస్తుతం పక్షుల కేంద్రంలో 11 రకాల పక్షులు 4 వేలకు పైబడి విడిది చేశాయి. ఇందులో గూడబాతులు (పెలికాన్) 850, నత్తగుల్ల కొంగలు (ఓపెన్‌బిల్ స్టార్క్స్) 2015, తెల్లకంకణాయిలు (వైట్‌ఐబీస్) 600, తెడ్డుముక్కు కొంగలు (స్పూన్ బిల్స్) 100, నారాయణ పక్షులు (నైట్హేరాన్) 250, నీటికాకులు (కార్మోరెంట్స్)300, చిన్న,పెద్ద స్వాతికొంగలు150 (ఈ గ్రేడ్స్), వీటితో పాటు పదుల సంఖ్యలో పాముమెడ పక్షులు (డాటర్), చుక్కకోళ్లు (కూట్స్), ఊలబాతులు (లేజర్ విజిలింగ్ డక్స్) సందడి చేస్తున్నాయి. సందడిగా పులికాట్ ప్రాంతం దొరవారిసత్రం, నేలపట్టులో గూడబాతులు, నత్తగుల్ల కొంగలు, నీటికాకులు, తెల్లకంకణాయిలు, శబరి కొంగలు వంటి పక్షులు కనిపిస్తున్నాయి. ఇక్కడకొచ్చే విదేశీ వలస పక్షుల్లో అతి అందమైన పక్షి ఫ్లెమింగో కావడంతో ఆ పక్షి పేరుతో ఏటా పండగను నిర్వహిస్తున్నారు. ► పులికాట్ సరస్సు, నేలపట్టులో కలిపి సుమారు 50 వేల విదేశీ వలస విహంగాలు ఇప్పటికే విచ్చేసినట్లు పులికాట్ వన్యప్రాణి సంరక్షణాధికారులు వెల్లడించారు. ►కుదిరి–అటకానితిప్ప గ్రామాల మధ్య సరస్సులో పర్యాటకులు విహంగాలను వీక్షించేందుకు రెండు, మూడు చోట్ల వ్యూ పాయింట్స్ ఏర్పాట్లు చేశారు. గూళ్లలో నివశించే పెలికాన్ పక్షుల్లో రారాజు గూడబాతులు (పెలికాన్). నైజీరియా, సైబీరియా, ఆ్రస్టేలియా నుంచి నేలపట్టు చెరువులోని చెట్ల మీద విడిది చేస్తున్నాయి. గూళ్లు కట్టుకుని అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు నేలపట్టులోనే ఉండి సంతానోత్పత్తిని చేసుకుని వెళ్తుంటాయి. ►ఈ రకం పక్షులు ప్రపంచ వ్యాప్తంగా ఏడు వేలు మాత్రమే ఉన్నాయని, ఇందులో నేలపట్టుకు సుమారు 2 వేలకు పైగా వస్తున్నాయని వీటిపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ►ఈ పక్షులు మనుషుల్లో ఉండే గుణాన్ని కలిగి ఉంటాయి. ఆడపక్షి గుడ్లు పెట్టి పొదుగులో ఉంటే మగపక్షి ఆహార వేటకు వెళ్లి తను తిని, తెడ్డులాంటి ముక్కు కింద ఉన్న సంచిలో ఆహారాన్ని తీసుకొచ్చి ఆడపక్షికి, పిల్లలకు అందిస్తుంది. ►నేలపట్టులో సంధ్య వేళ ఇలాంటి మనోహర దృశ్యాలు పర్యాటకులను ఆహ్లాద పరుస్తాయి. ►ఆడ పక్షి పిల్లలను పొదిగి అవి ఎగిరే దాకా మగపక్షే పోషించడం ఈ పక్షుల్లో ప్రత్యేకత. పులికాట్ సరస్సులో దొరికే చేపలు, పీతలు, రొయ్యలు దీని ఆహారం. నారాయణపక్షి నారాయణ పక్షులు తడ మండలం బోడిలింగాలపాడు, చింతవక్కలు, నీటికాకులు చిల్లకూరు మండలం చింతవరం వద్ద గూళ్లు కట్టుకుని నివాసం ఉంటున్నాయి. వాకాడు మండలం మొనపాళెం వద్ద చిన్నస్వాతి కొంగలు, పెద్ద స్వాతి కొంగలు కాకులతో కలిసి గూళ్లు కట్టుకుని ఉంటాయి. మనుబోలు చెరువులో ఐదారు రకాలు బాతులు ఉన్నాయి. మిగిలిన చాలా పక్షులు సమీప ప్రాంతాల్లో చెట్ల మీద గూళ్లు కట్టుకుని ఉంటూ శీతాకాలం అంతా ఇక్కడే ఉండి వెళ్తున్నాయని బాంబే బర్డ్స్ నేచరల్ సొసైటీ రీసెర్చ్‌లో వెల్లడైంది. రాత్రి గూటికి వెళ్లి తిరిగి వేకువ జాము నుంచి సరస్సుపై ఆహారం వేటలో విహరిస్తున్నపుడు అవి చేసే విన్యాసాలు పక్షి ప్రియులను అలరిస్తాయి. -
ఆహ్లాదం.. ఆనందం
నెల్లూరు, దొరవారిసత్రం: మండల పరిధిలోని తీర గ్రామాల సమీపంలో పులికాట్ సరస్సులోకి వర్షపునీరు కలిసిపోకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో చెక్‌డ్యాంల వద్ద వర్షపునీరు నిల్వ చేరి ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.మీజూరు, వేలికాడు గ్రామాల వద్ద మూడు చెక్‌డ్యాంల నిర్మాణానికి గతంలో శ్రీకారం చుట్టారు. అయితే ఈ పనులు పూర్తి కాలేదు. దీంతో దొరవారిసత్రం, సూళ్లూరుపేట, నాయుడుపేట తదితర మండల ప్రాంతాల్లో కురిసిన వర్షపునీరు పులికాట్ సరస్సులో కలిసిపోయేది. ఈక్రమంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీయ్య చొరవ తీసుకున్నారు. ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. కొంతకాలం క్రితం మీజూరు, వేలికాడు ప్రాంతాల్లో అసంపూర్తిగా ఆగిపోయి ఉన్న చెక్‌డ్యాంల వద్ద ఇసుక బస్తాలతో రింగ్ బడ్లను వేసేవిధంగా చర్యలు తీసుకున్నారు. అధికారులు రింగ్ బడ్లు వేయించడంతో వర్షపునీరు పులికాట్ సరస్సులో పూర్తిస్థాయిలో కలిసిపోకుండా నిల్వ చేరింది. దీంతో దొరవారిసత్రం, సూళ్లూరుపేట మండల ప్రాంతాల్లో పలువురు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిల్వ చేరిన నీటిలో పశువులు సేద తీరుతున్నాయి. వాటికి తాగునీటి సమస్య తీరిందని చెబుతున్నారు. కాగా విదేశీ విహంగాలు నీటిలో చేపలను వేటాడుతూ చూపరులకు కనువిందు చేస్తున్నాయి. అనేకమంది చెక్‌డ్యాంల వద్దకు వచ్చి పరిసరాలను చూసి ఆనందిస్తున్నారు. ఓ వైపు మంచినీరు తీర గ్రామాల రోడ్డుకు పడమర వైపున మంచినీరు, తూర్పున పులికాట్ సరుస్సులో ఉప్పునీరు ఉంది. దొరవారిసత్రం, సూళ్లూరుపేట మండల తీర ప్రాంతాల్లో విస్తరించి ఉన్న పులికాట్ సరస్సుకు ఆనుకుని ఆర్అండ్బీ రోడ్డు సుమారు 18 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ రోడ్డే పులికాట్ సరస్సులోకి వర్షపునీరు కలిసిపోకుండా ఆనకట్టలా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మీజూరు, వేలికాడు గ్రామాల సమీపంలోని రోడ్డుపై మూడు చెక్‌డ్యాంలను నిర్మించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ చెక్‌డ్యాంలు పూర్తయితే తీర ప్రాంతాల్లో సాగు, తాగునీటి కష్టాలకు శాస్వత పరిష్కారం లభిస్తుంది. చెక్‌డ్యాం పనులు పూర్తి చేయించేందుకు ఎమ్మెల్యే కిలివేటి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అన్ని అనుమతుల తీసుకుని పనులు మొదలు పెట్టించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం చెక్‌డ్యాంలో ఉన్న నీరు తగ్గితే ఏప్రిల్, మే నెలల్లో పనులు మొదలు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇరిగేషన్ అధికారులు చెప్పారు. -
36 ఏళ్ల వివాదం.. ఏపీ ప్రభుత్వం చొరవతో చర్చలు
నడి సంద్రంలో సినిమాటిక్‌ను తలపించేలా ఫైట్లు.. మారణాయుధాలతో.. పెద్ద బోట్లతో దాడులు.. ఆస్తుల ధ్వంసం.. మత్స్య సంపదను కొల్లగొట్టడం.. ఇది దశాబ్దాలుగా తమిళ జాలర్లు ఆంధ్రా మత్స్యకారులపై సాగిస్తున్న యుద్ధకాండ.. కొన్ని సందర్భాల్లో మన జాలర్లు వారిని ఎదుర్కొని నిర్బంధించి పోలీసులకు అప్పగించడం.. సాగరంలో సమరం నిత్యకృత్యంగా మారింది. మత్స్య సంపద కోసం వేటకు వెళ్లేందుకు సైతం భయపడే పరిస్థితి. సంద్రంలో సరిహద్దు వివాదానికి ముగింపు పలకడానికి ఏపీ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. మత్స్యకారుల ప్రయోజనాలను పరిరక్షించడమే లక్ష్యంగా ముందడుగేస్తోంది. 13 ఏళ్ల క్రితం అసంపూర్తిగా మిగిలిన చర్చలను మళ్లీ మొదలుపెట్టి సమస్య పరిష్కారం కోసం కార్యాచరణను సిద్ధం చేసింది. పులికాట్ సరస్సులో ఆంధ్రా– తమిళనాడు రాష్ట్రాల మధ్య 1983 నుంచి కొనసాగుతున్న సరిహద్దు వివాద పరిష్కారానికి తమిళనాడు ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18న భేటీ కానుంది. చెన్నై సైదాపేటలోని పనగల్ బిల్డింగ్‌లోని ఫిషరీస్ కమిషనరేట్ సమావేశానికి వేదిక కానుంది. ఇందుకూరుపేట మండలం రాముడుపాళెం తీరంలో చిక్కుకున్న తమిళ స్టీల్బోటు సాక్షి, నెల్లూరు: జిల్లాలో 169 కిలో మీటర్ల మేర సముద్రం విస్తరించి ఉంది. 12 మండలాల్లోని 118 గ్రామాల్లో దాదాపు 59 వేల మంది మత్స్యకారులు ఉన్నారు. వీరిలో 45 వేల మంది పూర్తిగా చేపల వేటనే ప్రధానంగా చేసుకొని జీవనం సాగిస్తున్నారు. తమిళనాడు జాలర్లతో వివాదాలు, దాడుల ఘటనలు జిల్లాలో నిత్యకృత్యంగా మారాయి. పులికాట్ సరస్సు ఆంధ్రా–తవిుళనాడు రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. 620 చదరపు కిలో మీటర్ల పరిధిలో విస్తరించిన సరస్సు ఆంధ్రాలో 480 చదరపు కిలో మీటర్లు, తమిళనాడు పరిధిలో 140 చదరపు కిలో మీటర్ల మేర ఉంది. పులికాట్ సరస్సులో చేపల వేటను ఆధారంగా చేసుకుని అనేక కుప్పాల్లో జాలర్లు ఉన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర పరిధిలోని పులికాట్‌కు పూడిక తీత తీయకపోవడంతో ముఖ ద్వారాలు పూర్తిగా మూసుకుపోయి వేసవిలో నీరు ఉండని పరిస్థితి. ఇదే సమయంలో ఏటా క్రమం తప్పకుండా తమిళనాడు వైపు ఉన్న పులికాట్లో ఆ రాష్ట్రం పూడిక తీయడం వల్ల 365 రోజులు నీరు ప్రవాహం ఉండడంతో చేపల వేట కొనసాగే పరిస్థితి ఉంది. తమిళ జాలర్ల దాడిలో దెబ్బతిన్న వలను చూపుతున్న కొండూరుపాళెం మత్స్యకారుడు ఇవీ వివాదాలు 1983 నుంచి పులికాట్ సరస్సులో రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతోంది. ఆంధ్రా పరిధిలోని ఇరకం దీవికి సమీపంలో ఉన్న కురివితెట్టు, తెట్టు పేట ప్రాంతాల తమదనేది తమిళనాడు వాదన. అయితే ఆ ప్రాంతం పూర్తిగా భౌగోళికంగా ఆంధ్రాలో సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోనే ఉంది. 1985లో ఆంధ్రా జాలర్ల సంఘం పులికాట్లో సర్వే నిర్వహించేందుకు వీలుగా రూ.లక్ష ప్రభుత్వానికి చెల్లించారు. అయితే తమిళనాడు ప్రభుత్వం సహకరించకపోవడంతో అది పూర్తిగా జరగలేదు. ఈ క్రమంలో తమిళనాడు జాలర్లు సముద్రంలో తాటిచెట్లు నాటి సరిహద్దును వారికి వారే ఏర్పాటు చేసుకున్నారు. ఏటా మార్చిలో పులికాట్లో ఉత్తరం వైపు నీరు పూర్తిగా తగ్గిపోయి దక్షిణం వైపు ఉన్న కురివితెట్టు, తెట్టుపేటలో బాగా నిలిచి ఉంటుంది. సముద్రం నుంచి వచ్చేది కావడంతో పాటు ఇక్కడ నీరు బాగా చల్లగా ఉండటంతో చేపలు ఎక్కువగా దొరికే పరిస్థితి. దీంతో ఏటా మార్చి నుంచి జూన్ వరకు తమిళనాడు జాలర్లు ఈ ప్రాంతంలోకి వచ్చి మన జాలర్ల పడవలు తగులబెట్టడం, దాడులు చేయడం పరిపాటిగా మారింది. తమిళనాడులోని పులికాట్ పరిధిలోని చినకనమాంగాడు కుప్పం, పెద్ద మాంగాడు కుప్పం, కీరపాకపొదు కుప్పం, మెదుకుప్పం, సునానంబుభోళం, తదితర కుప్పాలకు చెందిన జాలర్లు మన వైపు ఉన్న కురివితెట్టు, తెట్టుపేటకు వచ్చి చేపలు పట్టుకుంటారు. అడ్డుకోవడానికి యత్నించే జాలర్లపై భౌతిక దాడులకు దిగుతుంటారు. జిల్లాలో సుమారు 5 వేల వరకు లైసెన్స్ బోట్లు ఉన్నాయి. రాష్ట్ర మత్స్యకారులవి 10, 30 హెచ్‌పీ సామర్థ్యం ఉన్న మోటార్ బోట్లు కాగా, తమిళనాడు మత్స్యకారులవి హైస్పీడ్ బోట్లు. ఈ క్రమంలో తరచూ మన మత్స్యకారులపై దాడి చేసి బోటు ధ్వంసం చేసి మత్స్యసంపదను తమిళనాడు బోట్ల ద్వారా అక్కడి జాలర్లు కొల్లగొడుతున్నారు. గతంలో ఇక్కడి జాలర్లపై దాడి చేసి, 30 పడవలు, 200 వలలను సముద్రంలో తగులబెట్టారు. బాట కుప్పం గ్రామంపై రాత్రి వేళ విరుచుకుపడి జాలర్ల ఇళ్లు తగులబెట్టిన ఘటనలు చాలా ఉన్నాయి. 13 ఏళ్ల తర్వాత తొలి అడుగు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో 13 ఏళ్ల క్రితం అప్పటి మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, అధికారుల బృందం, తమిళనాడు మత్స్య శాఖ మంత్రి, అధికారుల బృందం హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నంలో మూడు సార్లు సమావేశాలు నిర్వహించి చర్చలు జరిపారు. అనంతరం ప్రభుత్వాలు దీన్ని పూర్తిగా విస్మరించడంతో సమస్య అలాగే మిగిలిపోయింది. ఈ క్రమంలో ఈ సమస్యపై కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి శాసనసభలో ప్రస్తావించారు. ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య ప్రభుత్వానికి విన్నవించడంతో మళ్లీ చర్చల దిశగా అడుగులు పడ్డాయి. కలెక్టర్ శేషగిరిబాబు, ఆఫ్కాఫ్ చైర్మన్ కొండూరు అనిల్‌బాబు చర్చల దిశగా కసరత్తు చేయటంతో ఈ నెల 18న చెన్నైలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలకు సిద్ధమయ్యాయి. తమిళనాడు జాలర్లు చేస్తున్న దాడులు, సరిహద్దు వివాద పరిష్కారమే లక్ష్యంగా సమావేశాన్ని నిర్వహించనున్నారు. -
పులి‘సాల్ట్’ సరస్సు
సాక్షి, సూళ్లూరుపేట: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సుగా పేరు ప్రఖ్యాతులున్న పులికాట్ సరస్సు కరువు కాటకాలు, ముఖద్వారాల పూడికతో నీళ్లు రాకపోవడంతో ఉప్పుతో నిండిపోయి శ్వేతవర్ణ సరస్సులా గోచరిస్తోంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట–శ్రీహరికోటకు వెళ్లే రోడ్డులో సరస్సు ఎటువైపు చూసినా తెల్లటి ఉప్పుతో నిండిపోయి మంచు దుప్పటి పరుచుకున్నట్టుగా కనిపించడంతో పర్యాటకులు తమ కెమెరాల్లో బంధిస్తున్నారు. గడచిన రెండేళ్లుగా సరస్సుకు తగినంత వరద నీరు చేరకపోవడంతో పాటు సముద్ర ముఖద్వారాలనుంచి కూడా నీళ్లు రాకపోవడంతో ఇలా మారింది. ఇందులో శ్రీహరికోట రోడ్డుకు దక్షిణం వైపు సరస్సు లోతుగా ఉండడం, తమిళనాడులోని పల్వేరికాడ్ ముఖద్వారం నుంచి నీళ్లు రావడంతో అక్కడ ఓ మోస్తరు నీళ్లున్నాయి. ఉత్తరం వైపు రాయదొరువు ముఖద్వారం నుంచి నీళ్లు రాకుండా ఆగిపోవడంతో సరస్సు ఉప్పు మయంగా మారింది. దీంతో సరస్సు అంతా ఎటువైపు చూసినా శ్వేతవర్ణంగా మారింది. వేసవిలో ఇలా సహజ సిద్ధంగా ఏర్పడిన ఉప్పును తీరప్రాంత గ్రామాలకు చెందిన వారు తీసుకెళ్లి వాడుకుంటుంటారు. -
ఉప్పు ధార
సూళ్లూరుపేట సుజలస్రవంతి పథకం ద్వారా అన్ని వార్డుల్లో ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందిస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక అన్నీ మర్చిపోయారు. పాలకులకు ముందుచూపు కరువవడంతో ప్రజలకు ఉప్పునీరే గతైంది. భూ గర్భజలాలు ఉప్పు మయమయ్యాయి. రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన నీటి పథకాలు నిరుపయోగంగా మారాయి. పట్టణ జనాభాకు సరిపడా నీరు సరఫరా చేయడంలో మున్సిపల్ యంత్రాంగంవిఫలమైంది. శివారు ప్రాంతాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బిందెడు నీళ్లు కూడా కష్టమయ్యాయి. చిత్రమేమిటంటే ప్రజలకు తాగునీరు దొరకదు కానీ వ్యాపారస్తులు పుష్కలంగా లభ్యమతున్నాయి. వారు మంచినీటితో రూ.కోట్లు గడిస్తున్నారు.ప్రజలను దోచేస్తున్నారు. నెల్లూరు, సూళ్లూరుపేట: పట్టణ ప్రజలు మంచినీటి కోసం దాహంతో తపిస్తున్నారు. మంచినీళ్లు దొరకడం గగనంగా మారింది. సుమారు 48 వేల మంది జనాభా అవసరాలకు తగినట్టుగా తాగునీటి వనరుల్లేవు. ఎటుచూసినా ఉప్పునీళ్లే లభిస్తుండడంతో గుక్కెడు మంచినీటికి గుటకలేస్తున్నారు. పులికాట్ సరస్సులోని ఉప్పునీళ్లు కాళంగి నదిలోకి ఎగబాకడంతో భూగర్భ జలాలు పూర్తిగా ఉప్పునీళ్లుగా మారిపోయాయి. సాధారణంగానే సూళ్లూరుపేట పట్టణ పరిధిలో భూగర్భంలో ఉప్పునీళ్లు లభ్యమవుతున్నాయి. పట్టణంలో పది ఓవర్‌హెడ్ ట్యాంకులు ఉన్నాయి. ఇందులో మన్నారుపోలూరు న్యూకాలనీ, ఇందిరానగర్, సూళ్లూరు, బాపూజీకాలనీల్లోని ఓవర్‌హెడ్‌ట్యాంకులు శిథిలమై ప్రమాదకరంగా మారడంతో కూల్చేశారు. సమ్మర్ స్టోరేజీ, ఇతర వనరుల నుంచి రోజుకు 16 లక్షల లీటర్ల నీటిని మాత్రమే అందిస్తున్నామని మున్సిపల్ అధికారులు లెక్కలు చెబుతున్నా.. ఆ స్థాయిలో నీటి సరఫరా జరడం లేదు. మున్సిపాలిటీ పరిధిలో ఒక మనిషికి రోజుకు 70 లీటర్ల వంతున నీరు సరఫరా చేయాల్సి ఉంది. ఈ లెక్కన పట్టణ జనాభా లెక్కల ప్రకారం 34 లక్షల లీటర్ల నీరు ఇవ్వాల్సి ఉంది. కానీ అందుబాటులో ఉన్న నీటి వనరుల నుంచి సరఫరా చేస్తున్న నీటి లెక్కలు చూస్తే కేవలం 10 లక్షల లీటర్ల నీటిని కూడా అందించడం లేదని తెలుస్తుంది. ప్రస్తుతం మున్సిపాలిటీలో నీళ్లు కేవలం 30 శాతం మందికి కూడా సరఫరా కావడం లేదు. పట్టణ శివారు ప్రాంతాల వారికి బిందెడు నీళ్లు అందడం కూడా గగనమవుతోంది. తాగునీటికి నెలకు రూ.కోటి వెచ్చింపు పట్టణ ప్రజలకు మంచినీళ్లు అందకపోవడంతో నెలకు రూ.కోటి వెచ్చించి మంచినీళ్లు కొనుగోలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. తాగునీటి పథకాల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కొందరు నీటిని దోచేస్తున్నారు. అక్రమంగా కుళాయిలు, సంప్‌లు నిర్మించుకుని వాటికి మోటార్లు ఏర్పాటు చేసుకుని తోడేయడంతో పట్టణ శివారు ప్రాంతాల్లో కుళాయిల్లో నీళ్లు రావడం గగనమైపోయింది. మన్నారుపోలూరు కేంద్రంగా తాగునీటి వ్యాపారం చేసే కంపెనీలు కోట్లాది రూపాయలు గడిస్తుంటే చెంతనే ఉన్న పట్టణ ప్రజలకు మాత్రం చుక్క నీరు అందాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. మున్సిపల్ లెక్కల ప్రకారం పట్టణంలో సుమారు 15 వేలు కుటుంబాలు ఉన్నాయి. కుటుంబానికి రోజుకు రూ.20 లెక్కన నీళ్లు కొంటే రోజుకు రూ.3 లక్షలు అవుతుంది. అంటే నెలకు సుమారు కోటి రూపాయలు నీళ్ల కోసం ఖర్చు చేస్తున్నారు. ఉప్పు నీళ్లుగా మారిన భూగర్భ జలాలు కాళంగి నదిలోకి పులికాట్ సరస్సు నుంచి ఉప్పు నీళ్లు రాకుండా నిర్మించిన గ్రాయిన్ శిథిలమైపోవడంతో నదిలో ఉన్న మంచినీళ్లు ఉప్పునీళ్లుగా మారిపోయాయి. దీంతో చుట్టు పక్కల బోర్లు, బావుల్లోని మంచినీళ్లు కూడా ఉప్పు నీళ్లుగా మారిపోయి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయని పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బావుల్లో, బోరుల్లో వచ్చే నీటిని మామూలుగా ఉపయోగించుకుంటూ తాగడానికి మాత్రం రోజువారీగా నీళ్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ పరిస్థితి ఏటా తలెత్తుతున్నా.. కాళంగి నదిలోకి ఉప్పు నీళ్లు ఎగబాకకుండా గ్రాయిన్ నిర్మాణాన్ని పటిష్టం చేయాల్సిన పాలకులు నాలుగేళ్లుగా పట్టించుకోవడం మానేశారు. షార్ నిధులతో నిర్మిస్తామని ముందుకొస్తే వారికి అనుమతులు ఇవ్వకుండా కాలయాపన చేశారు. నిరుపయోగంగా మారిన సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ సూళ్లూరుపేట దాహార్తిని తీర్చేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ రాజీవ్ పల్లెబాటకు వచ్చినప్పుడు స్థానిక ప్రజల బాధలను తెలుసుకుని సమ్మర్ స్టోరేజీ ట్యాంక్‌కు రూ.6 కోట్లు మంజూరు చేశారు. కోటపోలూరు పెద్దన్నగారి చెరువులో ఎస్ఎస్ ట్యాంక్‌ను నిర్మించారు. వైఎస్సార్ ఉన్నంత కాలం వర్షాలు పుష్కలంగా పడడంతో నీటికి ఇబ్బంది లేకుండాపోయింది. ఎస్ఎస్ ట్యాంక్‌కు నీళ్లు చేరేందుకు తెలుగుగంగ బ్రాంచ్ కాలువను తీసుకువస్తున్నామని, వైఎస్సార్ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, టీడీపీ పాలకులు ఏళ్లకు ఏళ్లే కాలయాపన చేస్తున్నారు. సూళ్లూరుపేట మేజర్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా రూపాంతరం చెందడంతో తాగునీటి పథకాలను ఆర్డబ్ల్యూఎస్ శాఖ నుంచి మున్సిపాలిటీకి అప్పగించారు. షార్ నిధులతో పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.117 కోట్లతో 7.50 లక్షల లీటర్లు కెపాసిటీ కలిగిన ఐదు ఓవర్ హెడ్‌ట్యాంకులు, 18 కిలో మీటర్లు పైపులైన్లు విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ఈ ప్రతిపాదనలు పైళ్లకే పరిమితమైపోయింది. 2013 ఏప్రిల్‌లో సూళ్లూరుపేటకు వచ్చిన అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.75 కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. పడమటికండ్రిగ చెరువులోని ఆక్రమిత స్థలాన్ని, మంగళంపాడు చెరువులో స్థల పరిశీలన కూడా చేశారు. ఈ ప్రతిపాదన కూడా సీఎం కార్యాలయం నుంచి బయటకు రాలేదు. తాజాగా ఏషియన్ ఇన్వెస్టిమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ అనే సంస్థ నుంచి రూ.183 కోట్లు మంజూరు చేస్తారని, దీనికి కూడా అంచనాలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించి ఏఐఐబీ సంస్థ ప్రతినిధులు ఇటీవల సూళ్లూరుపేటకు వచ్చి మంగళంపాడు చెరువును, పట్టణంలోని పలు ప్రాంతాలను పరిశీలించి వెళ్లారు. ఆ తర్వాత ప్రస్తావనే లేకుండా పోయింది. ఇది కూడా కొండెక్కినట్టేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జోరుగా నీళ్లు వ్యాపారం పట్టణంలోని కళాక్షేత్రంలో స్వజల ధార కింద మున్సిపాలిటీ స్థలంలో ఏర్పాటు చేసిన డాక్టర్స్ వాటర్ అనే సంస్థ మున్సిపాలిటీ నీళ్లను అమ్ముకుంటూ వ్యాపారం చేస్తోంది. అన్ని సౌకర్యాలు మున్సిపాలిటీకి సంబంధించినవి వాడుకుంటూ బిందెనీళ్లు రూ. 4, 20 లీటర్ల క్యాన్ రూ.15లకు విక్రయిస్తున్నారు. మున్సిపాలిటీ వనరులను వాడుకుని పట్టణ ప్రజలకు నామమాత్రపు ధరలకు ఇవ్వాల్సింది పోయి అధికంగా విక్రయిస్తున్నా.. అడిగే నాథుడు లేకుండా పోయారు. -
పులికాట్ సరస్సులో మునిగిపోయిన పడవ
-
ఆంధ్రాలో వెలవెల.. తమిళనాడులో జలకళ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు, సూళ్లూరుపేట: ఆంధ్రా, తమిళనాడుల్లో విస్తరించిన పులికాట్ సరస్సు సహజసిద్ధంగా ఏర్పడింది. వేసవికి ముందే ఏటా ఈ సరస్సు ఎండిపోతోంది. పాలకులు పులికాట్ అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో ఏటా ఇదే పరిస్థితి ఉంటోంది. మార్చికే ఉత్తరంవైపు సరస్సు ఎడారిలా మారింది. ముఖద్వారాలు పూడికతో మూసుకుపోవడంతో సరస్సు ఎడారిగా మారి జాలర్లకు జీవనోపాధి తగ్గిపోయింది. కాగా, తమిళనాడులో ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో జలకళతో ఉట్టిపడుతోంది. తమిళనాడు ఏటా రూ.30 లక్షలు కేటాయించి పల్వేరికాడ్ ముఖద్వారంలో వేసవిలో ఇసుకమేటలు తొలగించి పూడిక తీయిస్తోంది. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇక్కడ ప్రభుత్వానికి లేకుండా పోయింది. పూడిపోయిన ముఖద్వారాలు మన రాష్ట్రంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాల పరిధిలో పులికాట్ సరస్సు సుమారు 620 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఇందులో 500 చదరపు కిలోమీటర్లు నెల్లూరు జిల్లా తడ, సూళ్లూరుపేట, దొరవారిసత్రం, వాకాడు, చిట్టమూరు మండలాల్లో వ్యాపించింది. మిగిలిన 120 చదరపు కిలోమీటర్లు తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి, పొన్నేరి తాలూకా పరిధిలో విస్తరించింది. బంగాళాఖాతం నుంచి పులికాట్ సరస్సుకు తమిళనాడు పరిధిలోని పల్వేరికాడ్ వద్ద ఒక ముఖద్వారం, నెల్లూరు జిల్లా వాకాడు మండలం కొండూరుపాళెం, రాయదొరువు వద్ద ఒక్కో ముఖద్వారం ఉన్నాయి. సముద్రంలో ఆటుపోట్లు వచ్చి అలల ఉ«ధృతి పెరిగినప్పుడు ఉప్పునీరు పులికాట్‌లోకి ప్రవేశిస్తుంది. వర్షాకాలంలో మంచినీరు, ఉప్పునీరు కలగలసి సరస్సు నిండుకుండలా ఉంటుంది. వేసవి కాలంలో సముద్రం నుంచి ఉన్న ముఖద్వారాల గుండా ఉప్పునీరు మాత్రమే సరస్సుకు చేరుతుంది. దక్షిణం వైపు పల్వేరికాడ్ ముఖద్వారంలో తమిళనాడు ఏటా వేసవిలో పూడిక తీయిస్తుండటంతో ఆ వైపు నీళ్లు ఉంటున్నాయి. ఉత్తరం వైపు రాయదొరువు ముఖద్వారం పూడికతో ఇసుక మేటలు పడి మూసుకుపోయింది. పూడిక తీయిస్తే ఈ వైపు కూడా ఎప్పుడూ నీళ్లు ఉండి, మత్స్యసంపద చేరి జాలర్లకు జీవనోపాధి కలుగుతుంది. ముఖద్వారాల పూడికతీత పనులు జరిగేనా! తమిళనాడు తరహాలో రాయదొరువు, కొండూరుపాళెం ముఖద్వారాలను పూడిక తీయించాలని గతంలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) రెండు ముఖద్వారాల పూడికతీతకు సుమారు రూ.12 కోట్లుతో అంచనాలు రూపొందించి ఆ ప్రతిపాదనలను 2010లోనే కేంద్ర ప్రభుత్వానికి పంపింది. అయితే దీనికి సుమారు రూ.10 కోట్లు దాకా వచ్చే అవకాశం ఉందని, మొదట విడతగా కంపా అనే సంస్థ నుంచి రూ.3 కోట్లు విడుదల చేస్తున్నామని 2013 మేలో స్థానిక పులికాట్ వన్యప్రాణి సంరక్షణా విభాగం అధికారులకు ఉత్తర్వులు అందాయి. తర్వాత దుగరాజపట్నం ఓడరేవు తెరమీదకు రావడంతో ముఖద్వారాల పూడిక విషయం మసకబారింది. అప్పటి ప్రభుత్వం కొద్దిగా దృష్టి సారించి ఉంటే ఈ పాటికి సరస్సు కళకళలాడుతూ కనిపించేదేమో! ఇప్పుడు పాలకుల నిర్లక్ష్యంతో రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. కారణం.. దుగరాజపట్నం ఓడరేవుకు ముడిపెట్టి ముఖద్వారాల పనులను గాలికి వదిలేశారు. చివరకు అటు ఓడరేవు లేదు.. ఇటు ముఖద్వారాల పూడికతీతకు మంజూరుచేసిన నిధులూ మురిగిపోయాయి. ఇదిలా ఉండగా పూడికతీత పనులకు రూ.48 కోట్లు కేటాయిస్తున్నానని ఈ ఏడాది జనవరిలో జరిగిన ఫ్లెమింగో ఫెస్టివల్ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు నిధులు మంజూరుకాలేదు. -
‘హద్దు’ దాటిన వివాదం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు,సూళ్లూరుపేట : పులికాట్ సరస్సుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఆంధ్రా మత్స్యకారుల నోటికాడ కూడును ఏటా తమిళనాడు జాలర్లు తన్నుకుపోతున్నారు. ఇదేమని అడిగితే దాడులకు తెగబడుతున్నారు. పట్టించుకోండి మహప్రభో అంటూ ఇక్కడి మత్స్యకారులు నెత్తీనోరు బాదుకుంటూ పాలకులకు గోడు వెళ్లబోసుకుంటున్నా పట్టించుకోవడం లేదు. ఈ తరుణంలో ప్రజాసంకల్ప పాదయాత్ర చేపట్టి జిల్లాకు వస్తున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి తమ బాధలు చెప్పుకునేందుకు ఈ ప్రాంత మత్స్యకారులు సన్నద్ధమయ్యారు. ఇదీ అసలు సమస్య ఆంధ్రా–తమిళనాడు రాష్ట్రాల పరిధిలో విస్తరించి ఉన్న పులికాట్ సరస్సులో చేపల వేట విషయమై రెండు రాష్ట్రాల్లోని జాలర్ల మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో స్థానిక మత్స్యకారులు తమిళ మత్స్యకారుల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారు. నెల్లూరు, తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాల మధ్య సుమారు 620 చదరపు కిలోమీటర్ల మేర పులికాట్ సరస్సు విస్తరించి ఉంది. ఇందులో 500 చదరపు కిలోమీటర్లు నెల్లూరు జిల్లాలోను, 120 చదరపు కిలోమీటర్లు తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పరిధిలో ఉంది. బంగాళాఖాతం నుంచి పులికాట్ సరస్సుకు తమిళనాడు పరిధిలోని పలవేరికాడ్ వద్ద, వాకాడు మండలం కొండూరుపాళెం, రాయదొరువు వద్ద ముఖద్వారాలు ఉన్నాయి. వర్షాకాలంలో స్వర్ణముఖి, కాళంగి, తమిళనాడులో ఆరణియార్ నదులతోపాటు సాముల కాలువ, దొండ కాలువ, కరిపేటి తదితర కాలువల నుంచి మంచినీరు పులికాట్ సరస్సులోకి చేరుతుంది. సముద్రంలో ఆటుపోట్ల సమయంలో అలల ఉ«ధృతి పెరిగినప్పుడు అందులోని ఉప్పునీరు కూడా పులికాట్‌లోకి ప్రవేశిస్తుంది. మంచినీరు, ఉప్పునీరు కలగలసిన సంగమం కాబట్టి దీన్ని జీవి వైవిధ్యం కలిగిన సరస్సుగా గుర్తించారు. ఈ సరస్సుపై ఆధారపడి మన జిల్లాలో 17 గ్రామాలకు చెందిన 20 వేల మంది, తమిళనాడు వైపు 10 కుప్పాలకు చెందిన మరో 7, 8 వేల మంది మత్స్యకారులు చేపల వేటే ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. వర్షాకాలంలో పులి కాట్ సరస్సు నిండా నీళ్లు వచ్చినపుడు తమిళనాడు వైపు చేపలు దొరకవు. ఆ కాలంలో అక్కడి జాలర్లు సరిహద్దులు దాటి ఇక్కడకొచ్చి చేపల్లి వేటాడి వెళుతున్నారు. ఫిబ్రవరి నుంచి సరస్సులో నీళ్లు తగ్గిపోవడం వల్ల ఇక్కడి జాలర్లకు మత్స్య సంపద దొరకదు. ఆ కాలంలో తమిళనాడు వైపు వేటకు వెళ్లే ఇక్కడి మత్స్యకారుల వలలను తమిళ జాలర్లు లాక్కోవడం, పడవలు తీసుకెళ్లడం, ఘర్షణలకు దిగటం, కవ్వింపు చర్యలకు పాల్పడం చేస్తున్నారు. దీంతో ›ఏటా ఎండాకాలం ప్రారంభం కాగానే రెండు రాష్ట్రాల జాలర్ల మధ్య ఏ క్షణంలో ఎలాంటి వివాదం తలెత్తుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. తరచూ తప్పని వివాదాలు పులికాట్ సరస్సుకున్న మూడు సముద్ర ముఖద్వారాల్లో తమిళనాడు పరిధిలో వున్న పల్వేరికాడ్ ముఖద్వారాన్ని అక్కడి ఫ్రభుత్వం ఏటా రూ.30 లక్షలు వెచ్చించి పూడిక తీయిస్తోంది. ఇదిలావుంటే.. ఆంధ్రా వైపు వాకాడు మండలం కొండూరు పాళెం వద్ద వున్న ముఖద్వారం పూర్తిగా పూడిపోయింది. రాయదొరువు ముఖద్వారం మాత్రమే అంతో ఇంతో ఆదుకుంటూ వస్తోంది. ఈ ముఖద్వారం ఎండాకాలంలో పూడిపోతుండటంతో సరస్సులో నీళ్లు లేక ఆంధ్రాకు చెందిన 17 కుప్పాల జాలర్లు దక్షిణంవైపు సరస్సులో ఆంధ్రా పరిధిలోనే ఉండే కురివి తెట్టు, తెత్తుపేట ప్రాంతాల్లో వేటకు వెళుతుంటారు. కురివితెట్టు, తెత్తుపేట ప్రాంతాలు తమిళనాడు పరిధి లో ఉన్నాయంటూ చిన్నమాంగోడు కుప్పం, పెద్ద మాం గోడు కుప్పం, కీరపాకపుదు కుప్పానికి చెందిన వారు వాదిస్తున్నారు. ఇక్కడి జాలర్లను అటువైపు రానివ్వకుండా ఆంక్షలు విధిస్తున్నారు. అక్కడ చేపలవేట చేస్తే ఆంధ్రా జాలర్లకు చెందిన వలల్ని ధ్వంసం చేయడం, పడవలను లాక్కోవడం వంటి కవ్వింపు చర్యలకు పాల్ప డుతున్నారు. దీంతో జాలర్ల కుప్పాల్లో వివాదాలు రావణ కాష్టంలా రగులుతూనే వున్నాయి. హద్దులు తేల్చమన్నా పట్టించుకోరు పులికాట్ సరస్సులో ఆంధ్రా, తమిళనాడు సరిహద్దుల్ని తేల్చాల్సిందిగా మత్స్యశాఖ అధికారులు, మంత్రుల చుట్టూ మత్స్యకారులు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. 1989లో రెండు రాష్ట్రాల జాలర్ల మధ్య భారీ ఎత్తున దాడులు జరిగి పడవలను సైతం కాల్చివేశారు. తరువాత 1992లో సరస్సు పరిధి ఏ రాష్ట్రంలో ఎంత ఉంది, ఎక్కడ నుంచి ఎక్కడి వరకు ఉందనే దానిపై రెండు రాష్ట్రాల అధికారులు సర్వే చేయించాలని ఇక్కడి జాలర్లు ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించారు. దీనికి సంబంధించి కొంతమేర నగదు కూడా ప్రభుత్వానికి చెల్లించారు. అయినా, ప్రయోజనం లేకపోయింది. శ్రీహరికోట దీవిలోని తెత్తుపేట వద్ద కొత్త ముఖద్వారాన్ని తెరిస్తే సమస్య సమసిపోతుందని జిల్లా జాలర్లు ప్రభుత్వానికి విన్నవించారు. అప్పడే కాకినాడ, బెంగళూరు, చెన్నైలాంటి నగరాలనుంచి మత్స్యశాఖకు చెందిన శాస్త్రవేత్తలతో అధ్యయనం చేయించారు. అది కూడా కార్యరూపంలోకి రాకపోవడంతో ఈ సమస్య అపరిష్కృతంగానే మిగిలిపోయింది. ఎండాకాలం సమీపిస్తుందంటే పులికాట్ సరస్సులో తాటి దుంగలను నాటి.. అక్కడి వరకు తమిళనాడు సరిహద్దులు ఉన్నాయంటూ అక్కడి జాలర్లు ఆంధ్రా మత్స్యకారలు రాకూడదని హెచ్చరిం చడం అనవాయితీగా మారింది. ప్రభుత్వం స్పందిస్తే తప్ప ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చేకూరదు. మహిళలపై ఆధారపడ్డాం పులికాట్ సరస్సులో మత్స్యసంపద తగ్గిపోయింది. మూడు రోజుల పాటు వేట సాగించినా పూట గడవటం లేదు. ఆడవాళ్లు తమిళనాడులోని పల్వేరికాడ్ నుంచి పచ్చి చేపలు, చెన్నైనుంచి ఎండుచేపలు తీసుకొచ్చి గ్రామాల్లో తిరిగి విక్రయించి మా కుటుంబాల్ని పోషిస్తున్నారు. పులికాట్ సరస్సుకు ఆంధ్రా పరిధిలోని తెత్తుపేట–పుళింజేరి మధ్యలో కొత్తగా ముఖద్వారం తెరిపిస్తే మత్స్య సంపద పెరిగే అవకాశం వుంది. సరస్సులో సరిహద్దు వివాదాలను పరిష్కరించేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పట్టించుకోవాలి. సోదరుల్లా మెలగాల్సిన మేం బ్రతుకుదెరువు కోసం శత్రువులుగా మారుతున్నాం. – కేసీ రమేష్, మత్స్యకారుడు, భీములవారిపాళెం కొత్తకుప్పం -
ప్రశ్నార్థకంగా పులికట్ సరస్సు మనుగడ
-
పులికాట్‌కు రొయ్య కాటు
సూళ్లూరుపేట: సహజసిద్ధంగా ఏర్పడి ప్రకృతి వరప్రసాదమైన పులికాట్ సరస్సును ఇప్పుడు రొయ్యల సాగు రూపంలో కాలుష్య భూతం కాటేస్తోంది. ఒకనాడు అందాల తీరంగా పడవ ప్రయాణాలతో అలరారిన ఈ సరస్సు.. ఇప్పుడు తమిళనాడులో విచ్చలవిడిగా సాగిస్తున్న రొయ్యల సాగుతో దెబ్బతింటోంది. ఫలితంగా మత్స్య సంపద నశిస్తుండగా.. మత్స్యకారులు ఉపాథి లేకుండాపోతున్నారు. ఆంధ్రా–తమిళనాడు సరిహద్దుల్లో సుమారు 620 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పులికాట్ సరస్సు విస్తరించి ఉంది. ఆంధ్రా పరిధిలో 500 చ.కి.మీటర్లలో.. తమిళనాడులో 120 చ.కి.మీటర్ల పరిధిలో ఉంది. దీనికి సుమారు ఐదు కిలోమీటర్లు వరకు కోస్టల్ రెగ్యులేటరీ జోన్ ఉంటుంది. దీని పరిధిలో ఎక్కడా రొయ్యలు సాగు చేపట్టకూడదనే నిబంధనలు ఉన్నాయి. ఇవి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే అమలవుతుండగా.. తమిళనాడులో పట్టించు కునే దిక్కులేదు. దీంతో ఆంధ్రా–తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన పన్నంగాడు గ్రామానికి సమీపంలోని తమిళనాడు భూభాగంలో సుమారు 100 ఎకరాలకు పైగా అక్కడి వ్యాపారులు రొయ్యల సాగుచేస్తున్నారు. ఇందులో నుంచి వచ్చే వ్యర్థ జలాలన్నీ పులికాట్ సరస్సులో నేరుగా వదిలేస్తున్నారు. అంతేకాదు.. పులికాట్ వన్యప్రాణి సంరక్షణ విభాగ చట్టాన్ని సైతం అతిక్రమించి సున్నపుగుల్ల కంపెనీలను ఏర్పాటుచేశారు. సున్నాంబుగోళం కేంద్రంగా సరస్సు గర్భంలో లభించే సున్నపుగుల్లను తీసేసి తరలిస్తున్నా పులికాట్ వన్యప్రాణి సంరక్షణ విభాగం వారు పట్టించుకోవడం మానేశారు. ముఖ్యంగా తమిళనాడు సరిహద్దులో రొయ్యల సాగుచేస్తూ అందులో నుంచి వచ్చే విషపూరిత వ్యర్థ జలాలు ఆంధ్రా ప్రాంతం సరిహద్దులో కలుస్తున్నాయి. దీనిపై సూళ్లూరుపేట వైల్డ్‌లైఫ్ అధికారులూ ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తు న్నారు. ఈ వ్యర్థ జలాలవల్ల సరస్సులోని మత్స్య సంపదకు ప్రమాదం వాటిల్లుతోంది. ఫలితంగా ఈ సరస్సుపై 17 గ్రామాలకు చెందిన 10వేల మందికి పైగా ఆంధ్రా మత్స్యకారుల ఉపాధికి గండి పడుతోంది. తగ్గిన చేపల ఉత్పత్తి పులికాట్ సరస్సులో 2001 సంవత్సరం నుంచి చేపల ఉత్పత్తి కూడా తగ్గిపోతూ వస్తోంది. 2001 వరకు సుమారు 3 వేల టన్నులు చేపలు పట్టేవారు. కానీ, నేడు కేవలం రెండు వేల టన్నుల చేపలు మాత్రమే దొరుకుతున్నట్టు జాలర్లు చెబుతున్నారు. పక్షుల పండుగకే పరిమితం ఇదిలా ఉంటే.. పక్షుల పేరుతో ఫ్లెమింగో ఫెస్టి వల్‌ను 16ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏటా జరిగే పక్షుల పండుగను 2013 టూరి జం క్యాలెండర్లో చేర్చారు. 2014లో స్టేట్ మెగా ఫెస్టివల్‌గా మార్చారు. కేవలం సాం స్కృతిక కార్యక్రమాలతో రూ.కోట్లు ఖర్చుచేసి సరిపెట్టే స్తున్నారు కానీ, పక్షులు నివసించేం దుకు చెట్లు పెంచడం, సరస్సులో నీళ్లు ఎప్పు డూ ఉండేలా ముఖద్వారాలు పూడిక తీయిం చడం వంటి పనులకు మాత్రం అడుగులు పడటంలేదు. ఈ ఏడాది కూడా పండుగ నిర్వహణకు రూ.3 కోట్లు, పలు అభివృద్ధి పనులు పేరుతో మరో రూ.2.10 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని సరస్సు అభివృద్ధికి ఖర్చుచేసి వుంటే బాగుండేదని పర్యాటక ప్రియులు అభిప్రాయపడుతున్నారు. సరస్సు అభివృద్ధి సంస్థను ఏర్పాటుచేయాలి రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో విస్తరించి ఉండటమే పులికాట్ చేసుకున్న పాపం. ఆ సరిహద్దుల విషయమే ఇప్పటికీ తేల్చలేదు. ఈ రెండు ప్రభుత్వాలు సంయుక్తంగా దీని అభివృద్ధికి కృషి చేయకపోవడంవల్లే జాలర్లు కూడా తరచూ ఘర్షణ పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పులికాట్ లేక్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటుచేయాలి. – గరిక ఈశ్వరయ్య, పర్యావరణవేత్త పులికాట్‌కు రొయ్య కాటు -
మూగబోయిన కిలకిలరావాలు
సూళ్లూరుపేట: బంగాళాఖాతంలో పలుమార్లు తుపాన్లు, అల్పపీడనాలు వచ్చినా సరైన వర్షాల్లేకపోవడంతో ఆశించిన రీతిలో విదేశీ వలస విహంగాలు రాలేదు. సరస్సులో నీళ్లు తక్కువగా ఉండటంతో ఫ్లెమింగోలు మాత్రమే గుంపులు గుంపులుగా చేరి దర్శనమిస్తున్నాయి. సాధారణంగా వర్షాలు సమృద్ధిగా కురిసి పులికాట్ సరస్సు, నేలపట్టు చెరువు నిండా నీళ్లు చేరితే సుమారు 158 రకాల విదేశీ వలస విహంగాలు సుమారు ఆర్నెల్ల పాటు విడిది చేసి సంతానోత్పత్తి చేసుకొని వెళ్లేవి. ఈ ప్రాంతంలో వర్షాలు కురిసి నీళ్లు సమృద్ధిగా చేరాయా.. లేదానని రెండు పక్షులు పైలెట్లుగా వచ్చి చూసి వెళ్లి అంతా బాగుంటే మిగిలిన పక్షులను పిలుచుకొని వస్తాయని వీటిపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు గతంలో వెల్లడించారు. ప్రస్తుతం ఫ్లెమింగోలు, పెయింటెడ్ స్టార్క్స్ మాత్రమే అక్కడక్కడా కనిపిస్తున్నాయి. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రాన్ని స్థావరంగా చేసుకొని సంతానోత్పత్తి చేసే పెలికాన్ పక్షులు నేలపట్టులో కనిపించకపోగా, పులికాట్ సరస్సులో వేళ్లమీద లెక్కపెట్టే పక్షులు మాత్రమే దర్శనమిస్తున్నాయి. మొత్తానికి వర్షాభావంతో ఈ సారి పక్షులు లేకుండానే ఫ్లెమింగో ఫెస్టివల్‌ను నిర్వహిస్తుండటం విశేషం. జాలర్ల ఆందోళన ఫ్లెమింగో పండగ వల్ల పులికాట్ సరస్సుకు గానీ, పక్షులు నివసించేందుకు గానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనప్పుడు పండగ ఎందుకని పులికాట్ జాలర్ల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. పార్టీలకతీతంగా మత్స్యకారులు అందరూ పండగను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. గతంలో పులికాట్ జాలర్లను కూడా భాగస్వాములను చేసి సరస్సులో పడవ పందేలను నిర్వహించి వారికి నగదు బహుమతులను అందజేసేవారు. అయితే వీరి మధ్య వివాదాలు వస్తున్నాయనే కారణంగా పడవ పందేలను రద్దు చేశారు. తడ మండలంలోని తడ, భీములవారిపాళెం పడవల రేవు వద్ద బోట్ షికారును ఏర్పాటు చేసేవారు. ఆ తర్వాత బోట్‌షికార్ తడ పడవల రేవులో రద్దు చేసి బీవీపాళెంలోనే ఏర్పాటు చేశారు. బీవీపాళెం పడవల రేవులో బోట్ షికారుకు తప్ప మత్స్యకారులను ఎక్కడా భాగస్వామ్యులను చేయకపోవడంతో పండగను బహిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. -
కళతప్పిన పులికాట్!
సరస్సు నిండా ఉప్పునీరు వర్షం నీళ్లు కలవక పెరగని మత్స్య సంపద వేటలేక దిక్కుతోచని స్థితిలో మత్స్యకారులు నవంబర్ వచ్చినా కనిపించని పక్షుల ఆందాలు విదేశీ పక్షుల విన్యాసాలు.. వాటికి అందాలు అద్దుతూ సాయంత్ర సమయంలో సరస్సుపై ప్రసరించే భానుడి కిరణాలు.. పరవశింపచేసే ప్రకృతి.. హలెస్సా.. అంటూ మత్స్యకారులు సాగించే చేపటల వేట దృశ్యాలు.. ఇవన్నీ పులికాట్లో సాక్ష్యాత్కారమయ్యే కమనీయ దృశ్యాలు.. అంతటి అందమైన సరస్సు కళతప్పుతోంది.. వెరసి మత్స్యకారులు.. పర్యాటలకు నిరాశను నింపుతోంది. తడ: తడ మండలానికి తలమానికంగా, వేలాది మంది మత్స్యకారులకు అన్నదాతగా, దేశ విదేశీ పక్షులకు ఆహార భాండాగారంగా ఉండే పులికాట్ సరస్సు ప్రస్తుతం కళతప్పుతోంది. తన రూపు రేఖలని కోల్పోతూ ఆందోళన కలిగిస్తోంది. పాలకుల నిర్లక్ష్యం, ప్రకృతి కన్నెర్ర చేయడంతో తన సహజ గుణాన్ని కోల్పోతూ నిర్జీవంగా మారే పరిస్థితికి చేరుకుంది. భిన్నమైన పరిస్థితుల్లో పెరిగే మత్స్యసంపద పులికాట్ సరస్సులో పెరిగే చేపలు, రొయ్యలు, పీతలు భిన్నమైన వాతావరణంలో పెరుగుతాయి. ఉప్పునీరు, మంచి నీరు కలగలిసి ఉండే వాతావరణంలో మాత్రమే ఇవి వేగంగా వృద్ధి చెందుతాయి. పులికాట్లో మాత్రమే లభించే మొయ్యలు, తుళ్లులు, కోలాసులు వంటి చేపలతోపాటు రొయ్యలు, పీతలు కూడా ఎంతో రుచికరంగా ఉంటాయి. ఉప్పు శాతం 30కి పైగా ఉండే అచ్చం ఉప్పు నీళ్లు మాత్రమే ఉంటే ఈ చేపలు, రొయ్యలు వృద్ధి చెందవు. ఉప్పు నీటితోపాటు వర్షాల వల్ల వచ్చే నీటి పారుదల కూడా కలిసినప్పుడే గుడ్లు పిగిలి కొత్త పిల్లలు వృద్ధి చెందుతాయి. ఈ కారణంతోనే ప్రస్తుతం సముద్రపు నీళ్లు పులికాట్ నిండా చేరినా వర్షపు నీళ్లు లేకపోవడంతో చేపలు, రొయ్యలు వృద్ధి చెందలేదు. పూడిపోయిన ముఖద్వారాలు సముద్రపు నీటిని పులికాట్ సరస్సుతో కలిపి సముద్రం, సరస్సు మధ్య నీటితోపాటు మత్స్య సంపద రాకపోకలకు అనువుగా ఉండే ముఖద్వారాలు చాలా కాలంగా పూడిపోతూ వస్తున్నాయి. వీటిని తెరిపించేందుకు చేసిన విన్నపాల మేరకు అధికారులు కాస్త హడావుడి చేసినా ప్రస్తుతం అది మరుగున పడిపోయింది. దీంతో సముద్రం నుంచి పులికాట్‌కి ఉన్న సంబంధం చెడుతూ వస్తోంది. దీని వల్ల మత్స్యసంపదకు అనువైన మడచెట్లు అంతరించిపోయి, వాతావరణం దెబ్బతిని పిల్లల ఉత్పత్తికి వాతావరణం అనుకూలంగా లేకుండా పోయింది. దీంతో పలు రకాల మత్స్య జాతులు పునరుత్పత్తి లేక అంతరించిపోయే ప్రమాదంలో పడ్డాయి. ఉపాధి కోల్పోతున్న జాలర్లు నవంబర్ మాసంలో ఎక్కడ వల వేసినా చేపలు, రొయ్యలు పుష్కలంగా లభించేవి. చేతినిండా సొమ్ము చేసుకోవాల్సిన సమయంలో కనీసం బువ్వకు కూడా చేపలు దొరకని పరిస్థితి మత్స్యకారులను ఆందోళనకు గురిచేస్తోంది. సరస్సుని నమ్ముకుని మండలంలోని 17 కుప్పాలకు చెందిన వేలాది మంది జాలర్లు జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. నవంబర్ వచ్చినా కనిపించని పక్షుల జాడ అక్టోబర్ వచ్చిందంటే ఫ్లెమింగోలు, ఇతర బాతు జాతి పక్షులు పులికాట్లో సందడి చేస్తూ పర్యాటకులను ఆకట్టుకోవడం ఆనవాయితీ. కానీ ఈ ఏడాది నవంబర్ మొదటి వారం ముగుస్తున్నా ఇంతవరకు ఒక్క పిట్టకూడా ఇక్కడ వాలలేదు. దేశ విదేశాల నుంచి ఆహారం కోసం అక్టోబర్‌లో పులికాట్ వచ్చి నేలపట్టులో సంతాన ఉత్పత్తి చేసుకుని మార్చి నెలకల్లా పిల్లలతో కలిసి తమ స్వస్థలాలలకు పయనమవుతాయి. కానీ పక్షులు అన్నీ ఒకేసారి రాకుండా తమ రాకకు ముందే కొన్ని పైలెట్ పక్షులను ఇక్కడికి పంపి అవి సంకేతాలు ఇస్తేనే మిగిలినవి ఇక్కడకు చేరుకుంటాయి. కానీ ప్రస్తుతం ఇక్కడ ఆహారం అదుబాటులో లేకపోవడంతో పక్షులు ఒక్కటి కూడా ఇక్కడ కనిపించడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే అందమైన విహంగాల విన్యాసాలు చూసే భాగ్యం కోల్పోవడం జరుగుతుంది. ఫ్లెమింగోల కోసం ఏర్పాటు చేసే పండగను ఆనందంగా కాకుండా విషాదంగా జరుపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. -
రక్షకులే..భక్షకులు
వానపాముల అక్రమ రవాణాలో ఇంటి దొంగలు పడవల్లో తమిళనాడుకు తరలింపు తల్లి రొయ్యలకు ఆహారం సూళ్లూరుపేట: పులికాట్ సరస్సును రక్షించాల్సిన సిబ్బందే భక్షకులుగా మారారు. వానపాముల తరలించే వారితో వైల్డ్‌లైప్ కిందిస్థాయి సిబ్బంది సత్సంబంధాలు ఏర్పరచుకుని ఈ వ్యాపారంలో భాగస్తులుగా మారారు. గుర్తు తెలియని వ్యక్తులు వానపాములు వస్తున్నాయని సమాచారం ఇస్తే తప్ప దాడులు చేసే పరిస్థితి లేదు. దీంతో వానపాముల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. వేనాడు, ఇరకం దీవుల్లో తీసిన వానపాములను పడవల ద్వారా తమిళనాడుకు తరలించి అక్కడ నుంచి కార్లలో విజయవాడ, ఒంగోలు, గుంటూరు, నెల్లూరులోని రొయ్యల హేచరీలకు తరలిస్తున్నారు. వానపాములను తల్లి రొయ్యలకు ఆహారంగా ఉపయోగిస్తున్నారు. కేసుల నమోదు లేదు వన్యప్రాణి విభాగ శాఖ సిబ్బంది అక్రమసంపాదనకు అలవాటు పడి కేసులు నమోదు చేయకుండా కాంపౌండ్ ఫీజు మాటు న లక్షల రూపాయలు అపరాధం విధించి స్మగ్లర్లను వదిలేస్తున్నారు. దీంతో ఈ వ్యాపారాన్ని అదుపు చేయలేని పరిస్థితి నెలకొంది. పులికాట్లో సహజసిద్ధంగా ఏర్పడే మత్స్యసంపద అభివృద్ధికి మేలు చేసే వానపాములను ఇబ్బడి ముబ్బడిగా అక్రమ రవాణా చేసే వారికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. వానపాము తవ్వకాలకు వేనాడు, వాటంబేడు, ఇరకం కేంద్రాలుగా ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో వైల్డ్‌లైప్ బీట్ ఆఫీసర్ సెక్షన్ ఉంది. పులికాట్సరస్సును రక్షించాల్సిన సిబ్బందే భక్షిస్తున్నారు. పట్టుబడిన స్మగ్లర్లే మళ్లీ అక్రమ రవాణా పులికాట్ వన్యప్రాణి సంరక్షణ విభాగంలో వానపాములకు సంబంధించి ఎలాంటి చట్టం లేకపోవడంతో పట్టుబడిన స్మగ్లర్లే మళ్లీ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. దీనికి ప్రత్యేక చట్టం చేయాలని సూళ్లూరుపేట కార్యాలయం నుంచి లేఖ పంపించినా జిల్లా అటవీశాఖ కార్యాలయంలో ఎలాంటి స్పందనా లేదు. కాగా సరస్సు గర్భాన్ని తవ్వి తీస్తున్న వానపాములకు ప్రత్యేక చట్టమేదీ అవసరం లేదని, పులికాట్ సరస్సులో తవ్వకం జరిపినా, అందులోని జీవజాలాన్ని అక్రమంగా తరలించినా నేరమే అయినప్పటికీ చట్టం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని పర్యావరణవేత్తలు అంటున్నారు. వెనామీ రాకతో.. టైగర్ రొయ్యలు పెంపకం ఉన్నపుడు వానపాముల అవసరం ఉండేది కాదని, ఇప్పుడు వెనామీ రొయ్యల పెంపకం రాగానే వానపాముల అవసరాన్ని గుర్తించారు. వీటిని ఎంతకైనా కొనుగోలు చేసేందుకు హాచరీల యాజమాన్యాలు ముందుకొస్తుండడంతో వీటిని తరలించే వారి సంఖ్య ఎక్కువైంది. ఫారెస్ట్ యాక్ట్‌ను ప్రవేశపెట్టాం –చంద్రశేఖర్, డీఎఫ్ఓ పులికాట్ సరస్సునుంచి వానపాములు తీసి తరలించే వారి సంఖ్య ఎక్కువగా ఉన్న విషయం వాస్తవమే. బీట్ సిబ్బంది దాడులు చేసేలోపు వానపాములు తీసేవారు తప్పించుకుని వెళుతున్నారు. అందుకే తీసేవారిపై దృష్టి మానేసి తరలించే వారిని అదుపు చేసేందుకు ఫారెస్ట్ యాక్ట్‌ను ప్రవేశపెట్టాం. అక్రమ రవాణా చేసేవారి పట్టుబడితే కిలో వానపాములకు రూ.వెయ్యి కాంపౌండ్ ఫీజు, దీనికి ఐదు రెట్లు అపరాధ రుసుం వసూలు చేస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో రూ.6.5 లక్షలు, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా రూ.3.5 లక్షలు వసూలు చేశాం. పట్టుబడినవారిపై కేసులు నమోదు చేసేందుకు ప్రభుత్వానికి రెకమెండ్ చేసి ఉన్నాం. ఈ రవాణాలో మా శాఖలో కిందస్థాయి సిబ్బంది ప్రమేయంపై కూడా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాం. -
పులికాట్ కేంద్రంగా... ఎర్రల దందా!
ప్రతి రోజూ రూ.500 కేజీల అక్రమ రవాణా రూ.లక్షలు సంపాదిస్తున్న దళారులు చిల్లకూరు: పులికాట్ కేంద్రంగా వానపాముల అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. ప్రతి రోజూ సుమారు 500 కేజీల వరకు తరలిపోతున్నాయి. భూమిని తొలిచి పంటలకు ఆక్సిజన్ అందించడంలో వానపాములు(ఎర్ర లు) రైతుల కీలకపాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో గిరాకీ పెరిగింది. ఇది ఎక్కవ శాతం పులికాట్‌ను ఆధారం చేసుకుని దాందా సాగుతోంది. ఎందుకు వినియోగిస్తారంటే: వానపాములు ఎక్కువగా రొయ్యలకు మేతగా వినియోగి స్తారు. ఇవి ఎంత తింటే అంత బలంగా రొయ్యలు పెరుగుతాయి. రొయ్యల గుంతలు సాగు చేసే వారు ఎర్రల కోసం దళారులను ఆశ్రయిస్తున్నారు. పులికాట్ ప్రాంతంలో దోరికే వాటికి మండి డిమాండ్ ఉండటంతో ప్రకాశం, తూర్పుగోదావరి ప్రాంతాల్లోని రొయ్య పిల్లలు ఉత్పత్తి చేసేవారు పోటీ పడిమరీ కొనుగోలు చేస్తుండటంతో వాటికి మంచి గిరాకి ఏర్పడింది. తల్లి రొయ్యకు వానపామును ఆహారంగా వేస్తే లక్ష గుడ్లు పెట్టే రొయ్య అంతకు మించి గుడ్లు పెడుతుంది. వివిధ మార్గాల్లో: సాధారణంగా దొరికే వానపాముల కంటే పులికాట్లో దొరికేవి పుష్టిగా ఉండటమే కాకుండా రొ య్యలకు మంచి బలం చేకూర్చుతుండటంతో ఆ ప్రాం తంలోనే వాటి కోసం అన్వేషణ ఎక్కువైంది. దీంతో దళారులు ఆ ప్రాంతలోని గిరిజనులను మచ్చిక చేసుకుని వారికి డబ్బు ఆశచూపి ప్రతిరోజూ వానపాములను తవ్వి తరలిస్తున్నారు. వీటిని కొంత మంది కుండల్లో, టిఫిన్ బాక్సులు, ప్లాస్టిక్ కవర్లలో ఉంచి బస్సు, లారీలు, ప్రైవేట్ వాహనాల్లో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కేజీ రూ.3 వేలు పలుకుతున్న ధర: పులికాట్ ప్రాంతంలో సేకరించిన ఎర్రలకు కేజీ రూ.3 నుంచి రూ.5 వేల ధర పలుకుతోంది. పులికాట్లో గిరిజనులు సేకరించే వాటికి మాత్రం కేజీకి రూ.40 ఇచ్చి, దళారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. -
రావణకాష్టం
♦ పులికాట్ సరిహద్దుల్లో మరోమారు సరిహద్దుల వివాదం ♦ కత్తులు దూస్తున్న ఇరు రాష్ట్రాల జాలర్లు ♦ పట్టించుకోని ప్రభుత్వాలు సూళ్లూరుపేట... ఆంధ్రా-తమిళనాడు రాష్ట్రాల పరిధిలో సుమారు 640 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన పులికాట్ సరస్సులో చేపలవేట సాగించే ఇరు రాష్ట్రాల జాలర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సరిహద్దుల వివాదంతో కక్షలు పెంచుకుంటూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. అయితే రెండు రాష్ట్రాల జాలర్ల మధ్య తరచూ సరిహద్దుల వివాదం పదే పదే తలెత్తడానికి రెండు రాష్ర్ట ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరే కారణంగా కనిపిస్తోంది. వర్షాభావ పరిస్థితులతో సరస్సులో నీటిమట్టం తగ్గినపుడల్లా ఈ వివాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తమిళనాడులోని పెద్ద మాంగోడు, చిన్నమాంగోడు, కీరపాకపుదుకుప్పాలకు చెందిన జాలర్లు ఈ సరిహద్దు వివాదానికి కారకులవుతున్నారు. సరస్సుకు ఉత్తరంవైపు మత్స్య సంపద లేకపోవడంతో దక్షిణంవైపు సరస్సుకు వేటకు వెళుతున్నారు. పులికాట్ సరస్సులో ఆంధ్రా పరిధిలోని కురివితెట్టు, తెత్తుపేట ఏరియాలో మత్స్యసంపద దొరుకుతుండడంతో అక్కడికి వెళుతున్నారు. ఆ ప్రాంతం తమిళనాడు పరిధిలోనికి వస్తుందని పైన తెలిపిన మూడు కుప్పాలకు చెందిన జాలర్లు మీరు ఇక్కడికి వేటకు రాకూడదని ఆంక్షలు విధిస్తున్నారు. వాళ్లకు వాళ్లే సరస్సులో తాటిచెట్లు గుర్తులుగా నాటి హద్దు దాటకూడదని నిబంధనలు విధిస్తున్నారు. ఆంధ్రా, తమిళనాడు రాష్ట్రాల్లోని నెల్లూరుజిల్లా, తిరువళ్లూరు జిల్లాల పరిధిలో సుమారు 600 చదరపు కిలోమీటర్లు పరిధిలో పులికాట్ విస్తరించి ఉంది. పులికాట్లో 16 దీవిగ్రామాలు, 30 తీరప్రాంత గ్రామాలున్నాయి. ఇందులో ఆంధ్రా పరిధిలో 17 కుప్పాలకు చెందిన 20 వేల మందికి పైగా చేపలవేటే ప్రధానవృత్తిగా జీవనం సాగిస్తున్నారు. పరోక్షంగా మరో పది వేల మంది గిరిజనులు దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు. చేపలవేట తప్ప మిగిలిన ఏ పని చేయలేని జాలర్లు గత 30 ఏళ్ల నుంచి ప్రతి ఏటా సరిహద్దు వివాదాలతో జీవనం కోల్పోతున్నారు. సరిహద్దు సమస్య తీరేనా..? 1989 నుంచి సరిహద్దు వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇరు రాష్ట్రాల జాలర్లు భారీ దాడులు చేసుకున్న సంఘటనలు కూడా లేకపోలేదు. దీనిపై రెండు రాష్ట్రాల అధికారులతో సర్వే చేయించాలని ఇక్కడ జాలర్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీనికి సంబంధించి కొంతమేర నగదు కూడా ప్రభుత్వానికి చెల్లించారు. 1994లో సర్వే చేసేందుకు అధికారులు సిద్ధమైనప్పటికీ తమిళనాడు అధికారులు సహకరించకపోవడంతో సర్వే ఆగిపోయింది. 2007లో రాష్ట్ర మత్స్యశాఖామంత్రి మండలి బుద్ధప్రసాద్, తమిళనాడు మత్య్సశాఖ మంత్రి కేపీపీ స్వామిలతో రెండు రాష్ట్రాల మత్స్యశాఖాధికారులతో హైదరాబాద్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ చర్చలు విఫలమవడంతో సమస్య ప్రతి ఏటా ఉత్పన్నమవుతూనే ఉంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చలు జరిగితే మినహా సమస్య పరిష్కారమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. -
ప్రమాదపుటంచున పులికాట్
ఆంధ్రా, తమిళనాడు రాష్ట్రాల పరిధిలో ప్రకృతి వరప్రసాదంగా ఏర్పడిన పులికాట్ సరస్సు ప్రమాదపుటంచులో ఉంది. సరస్సు గర్భంలో సహజసిద్ధంగా ఉన్న సున్నపు గుల్ల, వానపాములను ఇబ్బడి ముబ్బడిగా తవ్వేయడంతో భవిష్యత్తులో సరస్సు ఉనికి కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. సూళ్లూరుపేట : అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొందరు తీరప్రాంత గ్రామాల్లోని కూలీలను ప్రోత్సహించి సరస్సు ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నారు. సున్నపుగుల్ల తీసేయడం వల్ల సరస్సు ఉత్తరంవైపు ఎడారిని తలపిస్తోంది. మరోవైపు వానపాముల తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. తడమండలం వేనాడు, ఇరకం దీవుల చుట్టూ గుల్ల, వానపాములను తవ్వేస్తున్నా పట్టించుకునే నాథుడే లేకపోవడం దురదృష్టకరం. దీనికి తోడు కొండూరు, గ్రద్దగుంట, చేనిగుంట గ్రామాల్లోని కొందరు కాళంగినది లో కలిసేచోట ఉన్న ఇసుక దిబ్బలను తవ్వి ట్రాక్టర్లతో రాత్రివేళల్లో తమిళనాడుకు తరలిస్తున్నారు. వేనాడు, ఇరకం దీవులే కేంద్రాలు.. వేనాడు ఇరకం దీవుల్లోని కూలీలు ఎక్కువగా వానపాములను పట్టే పనికి వెళుతున్నట్టు తెలుస్తోంది. కూలీలు తవ్వి తీసిన వానపాములను మట్టికుండలు, ప్లాస్టిక్ బకెట్లు, పాలిథిన్ కవర్లలో అనుమానం రాకుండా తరలిస్తున్నారు. పులికాట్ సరస్సులో దొరికే వానపాములకు రొయ్యల హేచరీల్లో మంచి డిమాండ్ ఉండడంతో చాలామంది ఈ అక్రమ వ్యాపారాన్ని నడుపుతున్నారు. కిలో వానపాములు పడితే కూలీకి రూ.500 నుంచి రూ.750 వరకు ఇస్తున్నారు. వీటిని హేచరీలకు తరలించి కిలో సుమారుగా రూ.5 వేల నుంచి రూ.6 వేలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు తమిళనాడు తీరప్రాంతంలో నిత్యం టన్నుల కొద్దీ సున్నపుగుల్లను తీసేసి సరస్సును గుల్ల చేస్తున్నారు. దీంతో మత్స్యసంపద తగ్గిపోవడం, సరస్సు గుంతల గుంతలుగా మారి ఎడారిగా మారుతోంది. తమిళనాడులోని కవరైపేటై నియోజకవర్గం పరిధిలోని సున్నాంబుగోళం (సున్నపుగుంట) గ్రామం వద్ద సరస్సుకు అతి దగ్గరలో నాలుగైదు సున్నపు గుల్ల కంపెనీలున్నాయి. వాస్తవంగా పులికాట్ సరస్సుకు వందమీటర్ల పరిధిలో ఎలాంటి పరిశ్రమలు, హోటళ్లు, రిసార్ట్స్ లాంటివి ఉండకూడదని చట్టం ఉంది. ఈ చట్టాన్ని తుంగలోతొక్కి తమిళనాడులో ఇప్పటికీ సున్నపుగుల్ల కంపెనీలు నడుస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో సూళ్లూరుపేట వన్యప్రాణి సంరక్షణ విభాగం కిందిస్థాయి సిబ్బందికి నెల మామూళ్లు అందుతుండడంతో చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పులికాట్ సరస్సును భవిష్యత్తు తరాల వారికి మ్యాప్‌లో చూపించాల్సిన పరిస్థితులు తలెత్తినా ఆశ్చర్యం లేదు. దాడులేవీ..? పులికాట్ సరస్సును అన్ని రకాలుగా కుళ్లబొడిచేస్తున్నా పులికాట్ వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారులు, సిబ్బంది దాడులు చేస్తున్న దాఖలాల్లేవు. ప్రభుత్వం ఇచ్చే జీతాలతో పాటు పులికాట్లో జరిగే అక్రమాలను కూడా సొమ్ముచేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. పులికాట్ సరస్సు పరిధిలో ఒక్కొక్కరికి ఒక్కో ప్రాంతాన్ని కేటాయిస్తూ బీట్ ఆఫీసర్లను ఏర్పాటు చేశారు. అందిన కాడికి దండుకుని వారు కార్యాలయానికి పరిమితమవుతున్నారు. దాడుల విషయమై అధికారులను అడిగితే సిబ్బంది కొరత కారణంగా దాడులు చేయలేకపోతున్నామని చెబుతున్నారు. -
తడ సమీపంలో భారీ సినీ స్టూడియో నిర్మాణం!
-
తడ సమీపంలో భారీ సినీ స్టూడియో నిర్మాణం!
నెల్లూరు: శ్రీపొట్టిశ్రీరామలు నెల్లూరు జిల్లా సినిమా నిర్మాణ కేంద్రంగా మారే అవకాశాలున్నాయి. కొంతమంది నిర్మాతలు నెల్లూరు జిల్లాలో స్టూడియో నిర్మాణాలు చేపట్టడానికి సిద్ధపడుతున్నట్లు తెలిసింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీ ఫిలిం స్టూడియోలు ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనలో టాలీవుడ్ ఉన్న విషయం తెలిసిందే. కొంతమంది విశాఖపట్నం వెళ్లాలని భావించినా, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో సినీ పరిశ్రమను నెలకొల్పాలనే ఆలోచనలో కొందరు తెలుగు సినీ నిర్మాతలు ఉన్నారు. తడ సమీపంలో భారీ స్టూడియోను నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఒక పెద్ద నిర్మాత ఈ స్టూడియో నిర్మాణం చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీనికిగాను ఆయన మూడు వేల ఎకరాల స్థలాన్ని సేకరిస్తున్నారని సమాచారం. తడ సమీపంలో ప్రకృతి సౌందర్యాలు కూడా ఉండటంతో పాటు చెన్నైకు దగ్గరగా ఉండటం కలిసివస్తోంది. తెలుగు సినిమాలే కాకుండా, చెన్నైలో నిర్మించే ఇతర భాషా చిత్రాలు కూడా ఇక్కడ షూటింగ్ చేసుకునే విధంగా స్టూడియో నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిసింది. సమీపంలో పులికాట్ సరస్సు, నేలపట్టు, అతిపొడవైన సముద్ర తీరంతో పాటు మైపాడు బీచ్ కూడా ఉండటంతో సినిమా షూటింగ్‌లకు ఈ ప్రాంతం అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. హైదరాబాద్‌లో షూటింగ్‌లు జరుపుకోవాలంటే అనుమతులు ఇబ్బందిగా ఉందని ఆ నిర్మాత అభిప్రాయపడుతున్నారని సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో కూడా స్టూడియో నిర్మాణాలు జరగడం వల్ల ఈ ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. ఇప్పటికీ కొంతమంది ఆర్టిస్టులను, సంగీత కళాకారులను, ఫైట్ మాస్టర్లను చెన్నై నుంచి హైదరాబాద్‌కు తీసుకుని వెళుతున్నామని, అటువంటి అవసరం లేకుండా నెల్లూరు జిల్లాలో స్టూడియోలు నిర్మించుకుంటే, చెన్నై నుంచి రావడానికి సులువుగా ఉంటుందని భావిస్తున్నారు. విశాఖపట్నంలో స్టూడియో నిర్మాణం చేపడితే కళాకారులను చెన్నై, హైదరాబాద్‌ల నుంచి తీసుకెళ్లడానికి ప్రయాణ ఖర్చులు పెరుగుతాయని కూడా భావిస్తున్నట్లు తెలిసింది. పులికాట్ నుంచి సముద్రంలో 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరకం దీవిలో ఒక రిసార్టును నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. అటు చిత్తూరు జిల్లా కూడా సమీపంలోనే ఉండటంతో, రెండు జిల్లాల్లోనూ షూటింగ్‌లు జరుపుకోవచ్చునని భావిస్తున్నట్లు తెలిసింది. గతంలో అనేక షూటింగ్‌లు చిత్తూరు జిల్లాలో జరుపుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. స్టూడియో నిర్మాణం ఇప్పటినుంచి ప్రారంభిస్తే, మరో 18 నుంచి 20 నెలల్లో షూటింగ్‌లు జరుపుకోవచ్చునని భావిస్తున్నట్లు సమాచారం. -
మళ్లీ తెరపైకి రామాయపట్నం పోర్టు
ఒంగోలు: రాజకీయ కారణాల నేపథ్యంలో ప్రకాశం జిల్లా నుంచి చేజారిపోయిందనుకున్న రామాయపట్నం పోర్టు తాజాగా తెరమీదికొచ్చింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పులికాట్ సరస్సు గుర్తింపు రద్దుకు వన్యప్రాణి, పర్యావరణ శాఖలు అభ్యంతరం పెట్టడం దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణానికి ప్రతికూలతగా మారింది. ఈ నేపథ్యంలో రామాయపట్నం పోర్టుకు సంబంధించి వనరులు, అనుకూలతలపై కేంద్రం సమాలోచనలు చేస్తోందనే సమాచారం జిల్లా ప్రజల్లో ఆశల్ని చిగురింపజేస్తోంది. గతంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి భారీ ఓడరేవును మంజూరు చేసింది. పోర్టు నిర్మాణానికి అవసరమైన ప్రదేశం కోసం సుదీర్ఘ పరిశీలన చేసింది. వాటిల్లో ప్రధానంగా ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు మండలంలో రామాయపట్నం, నెల్లూరు జిల్లాలోని దుగ్గరాజపట్నం ప్రాంతాల మధ్య తీవ్ర పోటీ తలెత్తింది. రెండు ప్రాంతాల్లో భూముల లభ్యత, అనుకూలతలు, ప్రతికూలాంశాలను పరిశీలించిన అప్పటి అధికారులు రామాయపట్నంలోనే పోర్టు నిర్మాణానికి అవసరమైన అన్ని వసతులున్నట్టు తేల్చారు. దీనికి అనుగుణంగా నివేదికను తయారు చేసి కేంద్రానికి సమర్పించారు. రామాయపట్నంలో పోర్టు నిర్మాణం దాదాపు ఖాయమైనట్లేనని అంతా భావించారు. కేంద్ర మంత్రివర్గం సైతం ఇక్కడ పోర్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, అప్పట్లో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా నెల్లూరు జిల్లా నేతలు కేంద్రం వద్ద చేసిన లాబీయింగ్‌తో పోర్టు దుగ్గరాజపట్నానికి తరలిపోయింది. అక్కడ పోర్టు నిర్మాణానికి సంబంధించి రూ.8 వేల కోట్లు నిధులు కేటాయిస్తున్నట్లు కేంద్రంప్రకటించింది. కానీ పులికాట్ సరస్సు ఏరియాలో ఉండడం, ‘షార్’ నుంచి వ్యతిరేకత వ్యక్తమవడం తదితర అంశాలతో అక్కడ పోర్టు నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. పులికాట్ సరస్సుకు పక్షుల రక్షితకేంద్రంగా ఉన్న గుర్తింపును రద్దుచేయడానికి వణ్యప్రాణి సంరక్షణ శాఖ ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించే దాఖలాలు కనిపించడం లేదు. వనరులు అపారం జిల్లాకు వరంగా మారనున్న పోర్టు నిర్మాణానికి అవసరమైన అన్ని వనరులు రామాయపట్నంలో కేంద్రీకృతమై ఉన్నాయి. భారీ అసైన్డ్ భూములు ఈ ప్రాంతంలో ఉండటంతో పాటు, సమీప గ్రామాల మత్య్సకార ప్రజలు తమ భూములు ఇచ్చేందుకు అనుకూలంగా ఉన్నారు. రామాయపట్నానికి దగ్గరలోనే నేషనల్ హైవే ఉంది. గతంలో ఇక్కడ పర్యటించిన నిపుణుల బృందం పోర్టు నిర్మాణానికి రామాయపట్నాన్నే ఎంపిక చేసింది. దీంతో పోర్టు తిరిగి వస్తుందనే ఆశలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం లోపించడం, కేంద్రంతో పోరాడి పోర్టును సాధించగలిగే బలమైన నాయకుడు ఇక్కడ లేకపోవడమే పోర్టు తరలిపోవడానికి కారణమైందనే వాదన ఉంది. ప్రస్తుతం కేంద్రంలో ప్రభుత్వం మారడం, దుగ్గరాజపట్నంలో పోర్టు నిర్మాణానికి ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ఈసారైనా ప్రకాశం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేసి పోర్టును సాధిస్తారా లేదా అనేది వేచిచూడాలి. -
ఫ్లెమింగోలు ఎంత పిరికివో!
అరణ్యం ఫ్లెమింగోలు నీరు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మాత్రమే నివసిస్తాయి. ఆఫ్రికా, దక్షిణ అమెరికా, యూరోప్‌లలో వీటి సంఖ్య అధికం! ఫ్లెమింగోలు పుట్టినప్పుడు బూడిదరంగులో ఉంటాయి. కానీ వాతావరణంలోని మార్పులు, కెరోటిన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం వంటి కారణాల వల్ల వాటి శరీరం ముదురు ఆరెంజ్, గులాబి రంగుల్లోకి మారుతుంది! ఇవి నీటిలో ఎప్పుడూ ఒంటికాలి మీదే నిలబడతాయి. ఎక్కువసేపు నీటిలో ఉండటం వల్ల తమ శరీరంలోని ఉష్ణత బయటకు పోకూడదని అలా చేస్తాయి! ఇవి అద్భుతంగా ఈత కొడతాయి. కాకపోతే నీరు బాగా లోతుగా ఉండాలి. లేదంటే ఈదలేవు. కానీ ఎగరడంలో ఇవి దిట్టలు. గంటకు ముప్ఫై అయిదు కిలోమీటర్లు ఎగరగలవు! ఫ్లెమింగోల గుంపును ఫ్లాక్ అంటారు. ఎప్పుడూ గుంపులు గుంపులుగానే ఉంటాయి. దానికి కారణం... భయమే. ఇవి నీటిలో వేటాడేటప్పుడు గంటలపాటు తమ తలను నీటిలోపల పెట్టి ఉంచుతాయి. ఆ సమయంలో శత్రువులు దాడి చేస్తుంటాయి. అందుకే కొన్ని వేటాడుతూ ఉంటే, కొన్ని కాపలా కాస్తుంటాయి! ఇవి చాలా పిరికివి. ఇవి శత్రువులతో పోరాడవు, పోరాడలేవు. భయంతో ఎగిరిపోయి తమను తాము కాపాడుకుంటాయి... అంతే! వీటి మెడ నిర్మాణం చాలా విచిత్రంగా ఉంటుంది. పొడవుగా, పాములాగా ఉండే ఈ మెడలో మొత్తం 19 ఎముకలు ఉంటాయి! ఆడ ఫ్లెమింగోలు సంవత్సరానికి ఒకే ఒక్క గుడ్డు పెడతాయి. పొరపాటున ఈ గుడ్డుకు ఏదైనా అయినా కూడా మరో గుడ్డు పెట్టేందుకు ప్రయత్నించవు! వీటికి పరిశుభ్రత చాలా ఎక్కువ. రోజులో ఎక్కువభాగం ఇవి తమ శరీరాన్ని శుభ్రపరచుకోవడానికే ఉపయోగిస్తాయి! ఇవి తమ కాళ్లను వెనక్కి మడిచి, మనుషుల మాదిరి మోకాళ్ల మీద కూర్చోగలవట! మూగజీవే... కానీ మనసున్న జీవి! మే 18, 2003. యూకే. ఓ నది ఒడ్డున షెరిల్ స్మిత్ తన వీల్ చెయిర్లో కూర్చుని ఉంది. సాయంత్రపు చల్లదనాన్ని ఆస్వాదిస్తోంది. ఆమె పెంపుడు కుక్క ఓర్కా అటూ ఇటూ పరుగులు తీస్తూ అల్లరి చేస్తోంది. దాని తుంటరి వేషాలు చూస్తూ నవ్వుతోంది షెరిల్. తన వీల్ చెయిర్ని అటూ ఇటూ తిప్పుతూ ఓర్కాని పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. అంతలోనే జరిగింది ఓ ఊహించని సంఘటన. షెరిల్ వీల్ చెయిర్ చక్రం బలంగా ఓ రాయిని ఢీకొని పట్టు తప్పింది. షెరిల్ అంతెత్తున ఎగిరి నదిలోకి పడిపోయింది. ఈదలేదు. నీరు చల్లగా గడ్డ కట్టించేలా ఉంది. అందులోనే కొట్టుమిట్టాడసాగింది షెరిల్. ఎవరైనా వచ్చి కాపాడితే బాగుణ్ను అనుకుంది కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. ఇక తన పని అయిపోయింది అనుకుంది. కానీ ఆమెనలా చూసిన ఓర్కా ఆగలేకపోయింది. పరుగు పరుగున వెళ్లింది. ఆ చుట్టుపక్కలంతా తిరిగింది. ఆ దారిన పోతున్న ఓ వ్యక్తిని అడ్డగించింది. అతడి ప్యాంటు పట్టుకుని లాగి, తనతో రమ్మంటూ మారాం చేసింది. ఏదో జరిగిందని అర్థమై ఆ వ్యక్తి దాన్ని అనుసరించాడు. ప్రమాదం నుంచి షెరిల్ని కాపాడాడు. తన జీవితం ఓర్కా పెట్టిన భిక్ష అని ఇప్పటికీ అంటూ ఉంటుంది షెరిల్!