తమిళ జాలర్ల దాడుల్లో దెబ్బతిన్న బోటును బయటకు లాగుతున్న శ్రీనివాసపురం మత్స్యకారులు
నడి సంద్రంలో సినిమాటిక్‌ను తలపించేలా ఫైట్లు.. మారణాయుధాలతో.. పెద్ద బోట్లతో దాడులు.. ఆస్తుల ధ్వంసం.. మత్స్య సంపదను కొల్లగొట్టడం.. ఇది దశాబ్దాలుగా తమిళ జాలర్లు ఆంధ్రా మత్స్యకారులపై సాగిస్తున్న యుద్ధకాండ.. కొన్ని సందర్భాల్లో మన జాలర్లు వారిని ఎదుర్కొని నిర్బంధించి పోలీసులకు అప్పగించడం.. సాగరంలో సమరం నిత్యకృత్యంగా మారింది. మత్స్య సంపద కోసం వేటకు వెళ్లేందుకు సైతం భయపడే పరిస్థితి. సంద్రంలో సరిహద్దు వివాదానికి ముగింపు పలకడానికి ఏపీ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. మత్స్యకారుల ప్రయోజనాలను పరిరక్షించడమే లక్ష్యంగా ముందడుగేస్తోంది. 13 ఏళ్ల క్రితం అసంపూర్తిగా మిగిలిన చర్చలను మళ్లీ మొదలుపెట్టి సమస్య పరిష్కారం కోసం కార్యాచరణను సిద్ధం చేసింది. పులికాట్ సరస్సులో ఆంధ్రా– తమిళనాడు రాష్ట్రాల మధ్య 1983 నుంచి కొనసాగుతున్న సరిహద్దు వివాద పరిష్కారానికి తమిళనాడు ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18న భేటీ కానుంది. చెన్నై సైదాపేటలోని పనగల్ బిల్డింగ్‌లోని ఫిషరీస్ కమిషనరేట్ సమావేశానికి వేదిక కానుంది.
ఇందుకూరుపేట మండలం రాముడుపాళెం తీరంలో చిక్కుకున్న తమిళ స్టీల్‌బోటు
సాక్షి, నెల్లూరు: జిల్లాలో 169 కిలో మీటర్ల మేర సముద్రం విస్తరించి ఉంది. 12 మండలాల్లోని 118 గ్రామాల్లో దాదాపు 59 వేల మంది మత్స్యకారులు ఉన్నారు. వీరిలో 45 వేల మంది పూర్తిగా చేపల వేటనే ప్రధానంగా చేసుకొని జీవనం సాగిస్తున్నారు. తమిళనాడు జాలర్లతో వివాదాలు, దాడుల ఘటనలు జిల్లాలో నిత్యకృత్యంగా మారాయి. పులికాట్ సరస్సు ఆంధ్రా–తవిుళనాడు రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. 620 చదరపు కిలో మీటర్ల పరిధిలో విస్తరించిన సరస్సు ఆంధ్రాలో 480 చదరపు కిలో మీటర్లు, తమిళనాడు పరిధిలో 140 చదరపు కిలో మీటర్ల మేర ఉంది.
పులికాట్ సరస్సులో చేపల వేటను ఆధారంగా చేసుకుని అనేక కుప్పాల్లో జాలర్లు ఉన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర పరిధిలోని పులికాట్‌కు పూడిక తీత తీయకపోవడంతో ముఖ ద్వారాలు పూర్తిగా మూసుకుపోయి వేసవిలో నీరు ఉండని పరిస్థితి. ఇదే సమయంలో ఏటా క్రమం తప్పకుండా తమిళనాడు వైపు ఉన్న పులికాట్‌లో ఆ రాష్ట్రం పూడిక తీయడం వల్ల 365 రోజులు నీరు ప్రవాహం ఉండడంతో చేపల వేట కొనసాగే పరిస్థితి ఉంది.
తమిళ జాలర్ల దాడిలో దెబ్బతిన్న వలను చూపుతున్న కొండూరుపాళెం మత్స్యకారుడు
ఇవీ వివాదాలు
1983 నుంచి పులికాట్ సరస్సులో రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతోంది. ఆంధ్రా పరిధిలోని ఇరకం దీవికి సమీపంలో ఉన్న కురివితెట్టు, తెట్టు పేట ప్రాంతాల తమదనేది తమిళనాడు వాదన. అయితే ఆ ప్రాంతం పూర్తిగా భౌగోళికంగా ఆంధ్రాలో సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోనే ఉంది. 1985లో ఆంధ్రా జాలర్ల సంఘం పులికాట్‌లో సర్వే నిర్వహించేందుకు వీలుగా రూ.లక్ష ప్రభుత్వానికి చెల్లించారు. అయితే తమిళనాడు ప్రభుత్వం సహకరించకపోవడంతో అది పూర్తిగా జరగలేదు. ఈ క్రమంలో తమిళనాడు జాలర్లు సముద్రంలో తాటిచెట్లు నాటి సరిహద్దును వారికి వారే ఏర్పాటు చేసుకున్నారు.
ఏటా మార్చిలో పులికాట్‌లో ఉత్తరం వైపు నీరు పూర్తిగా తగ్గిపోయి దక్షిణం వైపు ఉన్న కురివితెట్టు, తెట్టుపేటలో బాగా నిలిచి ఉంటుంది. సముద్రం నుంచి వచ్చేది కావడంతో పాటు ఇక్కడ నీరు బాగా చల్లగా ఉండటంతో చేపలు ఎక్కువగా దొరికే పరిస్థితి. దీంతో ఏటా మార్చి నుంచి జూన్ వరకు తమిళనాడు జాలర్లు ఈ ప్రాంతంలోకి వచ్చి మన జాలర్ల పడవలు తగులబెట్టడం, దాడులు చేయడం పరిపాటిగా మారింది. తమిళనాడులోని పులికాట్ పరిధిలోని చినకనమాంగాడు కుప్పం, పెద్ద మాంగాడు కుప్పం, కీరపాకపొదు కుప్పం, మెదుకుప్పం, సునానంబుభోళం, తదితర కుప్పాలకు చెందిన జాలర్లు మన వైపు ఉన్న కురివితెట్టు, తెట్టుపేటకు వచ్చి చేపలు పట్టుకుంటారు. అడ్డుకోవడానికి యత్నించే జాలర్లపై భౌతిక దాడులకు దిగుతుంటారు.
జిల్లాలో సుమారు 5 వేల వరకు లైసెన్స్ బోట్లు ఉన్నాయి. రాష్ట్ర మత్స్యకారులవి 10, 30 హెచ్‌పీ సామర్థ్యం ఉన్న మోటార్ బోట్లు కాగా, తమిళనాడు మత్స్యకారులవి హైస్పీడ్ బోట్లు. ఈ క్రమంలో తరచూ మన మత్స్యకారులపై దాడి చేసి బోటు ధ్వంసం చేసి మత్స్యసంపదను తమిళనాడు బోట్ల ద్వారా అక్కడి జాలర్లు కొల్లగొడుతున్నారు. గతంలో ఇక్కడి జాలర్లపై దాడి చేసి, 30 పడవలు, 200 వలలను సముద్రంలో తగులబెట్టారు. బాట కుప్పం గ్రామంపై రాత్రి వేళ విరుచుకుపడి జాలర్ల ఇళ్లు తగులబెట్టిన ఘటనలు చాలా ఉన్నాయి.
13 ఏళ్ల తర్వాత తొలి అడుగు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో 13 ఏళ్ల క్రితం అప్పటి మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, అధికారుల బృందం, తమిళనాడు మత్స్య శాఖ మంత్రి, అధికారుల బృందం హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నంలో మూడు సార్లు సమావేశాలు నిర్వహించి చర్చలు జరిపారు. అనంతరం ప్రభుత్వాలు దీన్ని పూర్తిగా విస్మరించడంతో సమస్య అలాగే మిగిలిపోయింది. ఈ క్రమంలో ఈ సమస్యపై కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి శాసనసభలో ప్రస్తావించారు. ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య ప్రభుత్వానికి విన్నవించడంతో మళ్లీ చర్చల దిశగా అడుగులు పడ్డాయి. కలెక్టర్ శేషగిరిబాబు, ఆఫ్కాఫ్ చైర్మన్ కొండూరు అనిల్‌బాబు చర్చల దిశగా కసరత్తు చేయటంతో ఈ నెల 18న చెన్నైలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలకు సిద్ధమయ్యాయి. తమిళనాడు జాలర్లు చేస్తున్న దాడులు, సరిహద్దు వివాద పరిష్కారమే లక్ష్యంగా సమావేశాన్ని నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment