తడ సమీపంలో భారీ సినీ స్టూడియో నిర్మాణం!
తడ సమీపంలో భారీ సినీ స్టూడియో నిర్మాణం!
Published Thu, Jul 17 2014 9:26 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
నెల్లూరు: శ్రీపొట్టిశ్రీరామలు నెల్లూరు జిల్లా సినిమా నిర్మాణ కేంద్రంగా మారే అవకాశాలున్నాయి. కొంతమంది నిర్మాతలు నెల్లూరు జిల్లాలో స్టూడియో నిర్మాణాలు చేపట్టడానికి సిద్ధపడుతున్నట్లు తెలిసింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీ ఫిలిం స్టూడియోలు ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనలో టాలీవుడ్ ఉన్న విషయం తెలిసిందే. కొంతమంది విశాఖపట్నం వెళ్లాలని భావించినా, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో సినీ పరిశ్రమను నెలకొల్పాలనే ఆలోచనలో కొందరు తెలుగు సినీ నిర్మాతలు ఉన్నారు. తడ సమీపంలో భారీ స్టూడియోను నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఒక పెద్ద నిర్మాత ఈ స్టూడియో నిర్మాణం చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
దీనికిగాను ఆయన మూడు వేల ఎకరాల స్థలాన్ని సేకరిస్తున్నారని సమాచారం. తడ సమీపంలో ప్రకృతి సౌందర్యాలు కూడా ఉండటంతో పాటు చెన్నైకు దగ్గరగా ఉండటం కలిసివస్తోంది. తెలుగు సినిమాలే కాకుండా, చెన్నైలో నిర్మించే ఇతర భాషా చిత్రాలు కూడా ఇక్కడ షూటింగ్ చేసుకునే విధంగా స్టూడియో నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిసింది. సమీపంలో పులికాట్ సరస్సు, నేలపట్టు, అతిపొడవైన సముద్ర తీరంతో పాటు మైపాడు బీచ్ కూడా ఉండటంతో సినిమా షూటింగ్‌లకు ఈ ప్రాంతం అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. హైదరాబాద్‌లో షూటింగ్‌లు జరుపుకోవాలంటే అనుమతులు ఇబ్బందిగా ఉందని ఆ నిర్మాత అభిప్రాయపడుతున్నారని సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా స్టూడియో నిర్మాణాలు జరగడం వల్ల ఈ ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. ఇప్పటికీ కొంతమంది ఆర్టిస్టులను, సంగీత కళాకారులను, ఫైట్ మాస్టర్లను చెన్నై నుంచి హైదరాబాద్‌కు తీసుకుని వెళుతున్నామని, అటువంటి అవసరం లేకుండా నెల్లూరు జిల్లాలో స్టూడియోలు నిర్మించుకుంటే, చెన్నై నుంచి రావడానికి సులువుగా ఉంటుందని భావిస్తున్నారు. విశాఖపట్నంలో స్టూడియో నిర్మాణం చేపడితే కళాకారులను చెన్నై, హైదరాబాద్‌ల నుంచి తీసుకెళ్లడానికి ప్రయాణ ఖర్చులు పెరుగుతాయని కూడా భావిస్తున్నట్లు తెలిసింది. పులికాట్ నుంచి సముద్రంలో 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరకం దీవిలో ఒక రిసార్టును నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది.
అటు చిత్తూరు జిల్లా కూడా సమీపంలోనే ఉండటంతో, రెండు జిల్లాల్లోనూ షూటింగ్‌లు జరుపుకోవచ్చునని భావిస్తున్నట్లు తెలిసింది. గతంలో అనేక షూటింగ్‌లు చిత్తూరు జిల్లాలో జరుపుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. స్టూడియో నిర్మాణం ఇప్పటినుంచి ప్రారంభిస్తే, మరో 18 నుంచి 20 నెలల్లో షూటింగ్‌లు జరుపుకోవచ్చునని భావిస్తున్నట్లు సమాచారం.
Advertisement
Advertisement