Tada
-
రైల్లోంచి పడి యువకుడు మృతి
తీవ్రగాయాలతో కొద్ది దూరం కలయతిరిగిన వైనం చేనిగుంట (తడ) : రైల్లోంచి జారిపడి జార్కండ్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు మృతి చెందాడు.ఈ సంఘటన మండలంలోని చేనిగుంట వద్ద గురువారం జరిగింది. అయితే ఆ యువకుడు రైల్లోంచి జారి తీవ్ర గాయాలతో సాయం కోసం వచ్చేందుకు అటూ ఇటూ కొద్ది దూరం కలయతిరిగినట్లు తెలుస్తోంది. రైల్వే ట్రాక్‌కు 150 మీటర్ల దూరంలో పొలం గట్టుపై మృతి చెంది ఉండగా స్థానికులు హత్యగా అనుమానించి రెవెన్యూ, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ టీ విజయకృష్ణ, తడ ఎస్ఐ ఏ సురేష్‌బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి ఒంటిపై ఎలాంటి ఎలాంటి దుస్తులు లేవు. మృతుడికి సమీపంలో ఫ్యాంట్, టీ షర్ట్, పర్సు పడి ఉన్నాయి. చెన్నై వైపు వెళ్లే మార్గంలో 73వ కిలోమీటరు వద్ద రక్తపు మరకలు ఉన్నాయి. అక్కడ చెప్పులు పడి ఉండగా, ట్రాక్‌కు సుమారు 150 మీటర్ల దూరంలో టీ షర్ట్ పడి ఉంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మతిస్థిమితం కోల్పోయి సాయం అటూ ఇటూ కలయతిరిగినట్లు ఉంది. మృతుడికి సంబంధించి దుస్తుల వద్ద లభించిన పర్సులో హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా అతన్ని వివరాలు గుర్తించారు. జార్కండ్ రాష్టం రాంచీలోని రోయిరోడ్డుకి చెందిన హనుమంత మెహతా కుమారుడు షాంబు మెహతా(25)గా నిర్ధారించారు. మృతదేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి, శీతల గదిలో భద్రపరిచారు. బంధువులకు సమాచారం అందించారు.వారు వచ్చాక పోస్టుమార్టం అనంతరం అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. -
మాంబట్టులో ఇసుక డంపుల స్వాధీనం
మాంబట్టు(తడ): తమిళనాడుకు తరలించేందుకు నిల్వ చేసిన ఐదు ఇసుక డంపులను రెవెన్యూ, పోలీస్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. సేకరించిన సమాచారం మేరకు మాంబట్టుకు చెందిన ఓ రాజకీయ నాయకుడు మాంబట్టు, గుర్రాలమిట్ట మధ్యలో చెరువు కట్ట సమీపంలో భారీ ఎత్తున ఇసుక నిల్వ చేసినట్టు జిల్లా ఎస్పీకి సమాచారం అందింది. ఈ మేరకు ఎస్పీ ఆదేశాలతో ఎస్ఐ సురేష్‌బాబు, వీఆర్ఓ రాజగోపాల్ దాడులు నిర్వహించడంతో భారీ నిల్వలు వెలుగులోకి వచ్చాయి. ఐదు డంపుల్లో దాదాపు 300 ట్రిప్పుల వరకు ఇసుక ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. పట్టుబడ్డ ఇసుకను అధికారులు సీజ్ చేశారు. స్థానికంగా పాములకాలువలో లభించే ఇసుకతోపాటు సూళ్లూరుపేట తదితర ప్రాంతాల నుంచి తీసుకు వచ్చే ఇసుకను గతంలో మాంబట్టు ప్రాంతంలో నిల్వ చేసి స్థానిక పరిశ్రమలకు విక్రయించే సాకుతో చిత్తూరు జిల్లా సరిహద్దుల మీదుగా తమిళనాడుకు తరలించేవారు. నాయకులు కావడంతో అధికారులు సైతం వీరికి సహకరించేవారు. దీనిపై స్థానికులు నాలుగు నెలల క్రితం సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు ఫిర్యాదు చెయ్యడంతో అప్పట్లో ఆయన గ్రామానికి చేరుకుని నిల్వలను తహసీల్దార్‌కి పట్టించారు. అప్పటి నుంచి కొంత అప్రమత్తం అయిన నాయకులు నిల్వ చేసే ప్రాంతాన్ని వేరే చోటుకి మార్చి అక్కడి నుంచి తరలిస్తూ వస్తున్నారు. ఈ అక్రమ రవాణాపై స్థానిక అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం పట్టుబడ్డ నిల్వలను కూడా భారీగా తగ్గించి చూపే ప్రయత్నం సాగిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
స్మగ్లింగ్ గుట్టు.. విభేదాలతో రట్టు
– పక్కా సమాచారంతో అధికారులకు ఫిర్యాదులు – భారీ స్థాయిలో పట్టుబడుతున్న రేషన్ బియ్యం – శాంతిభద్రతల సమస్యగా మారే పరిస్థితులు – నివురుగప్పిన నిప్పులా స్పర్థలు స్మగర్ల మధ్య విభేదాలు రేషన్ బియ్యం అక్రమ రవాణా గుట్టు రట్టు అవుతోంది. అధికారుల మధ్య సమన్వయలోపాన్ని..నిర్లక్ష్యాన్ని, పోలీస్, విజిలెన్స్ నిఘా కొరవడాన్ని ఆసరాగా చేసుకుని తమిళ, ఆంధ్ర రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి స్మగ్లర్లు రూ.కోట్లు గడించారు. తాజా పరిణామాలు ఇందుకు భిన్నంగా మారాయి. స్మగ్లర్ల మధ్య విభేదాల నేపథ్యంలో బియ్యం అక్రమ రవాణా, నిల్వలపై ఏకంగా విజిలెన్స్, సివిల్ ఎస్పీలకు, కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు ఫోన్‌చేసి ఉప్పందిస్తున్నారు. కింది స్థాయి అధికారులకు చెబితే వ్యవహారం మారిపోతుందని భావించి ప్రతీకారేచ్ఛలకు పాల్పడుతున్నారు. తడ : జిల్లా, తమిళ రాష్ట్రం సరిహద్దు మండలాల్లో కొన్నేళ్లుగా రేషన్ బియ్యం స్మగ్లింగ్ గుట్టుగా సాగుతుంది. రేషన్ స్మగ్లర్ల మధ్య తలెత్తిన విభేదాలు తారా స్థాయికి చేరుకోవడంతో బియ్యం అక్రమ రవాణా బట్టబయలవుతుంది. ఇప్పటికే ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ 9 లారీల బియ్యం వివిధ ప్రాంతాల్లో అధికారులకు పట్టించారు. స్థానిక అధికారులకు సమాచారం ఇస్తే వెంటనే స్మగ్లర్లకు సమాచారం చేరవేసి ఉత్తుత్తి దాడులతో సరిపుచ్చే అవకాశం ఉండటంతో నేరుగా ఎస్పీలు, కలెక్టర్లకు ఫోన్లు చేసి మరీ ఒకరి లారీలు మరొకరు పట్టించుకుంటున్నారు. వాహనాల నంబర్లు, ఎప్పుడు, ఎక్కడ వస్తున్నది, ఏఏ ఇంట్లో బియ్యం నిల్వలు ఉన్నాయి వంటి విషయాలన్ని పక్కాగా సమాచారం అందిస్తుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో తప్పని సరి పరిస్థితుల్లో దాడులు చేసి పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంటోంది. గతంలోనూ.. గతంలో ఇంతకంటే ఎక్కువ స్థాయిలో స్మగ్లింగ్ జరిగేది. అప్పట్లోనూ ఇదే తరహాలో స్మగ్లర్లు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుని పట్టించారు. దీంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే స్థాయికి దిగారు. ఈ క్రమంలో తమిళనాడు పోలీసులు రంగ ప్రవేశం చేసి కేసులు నమోదు చేశారు. స్మగ్లర్లను అదుపులోకి తీసుకునేందుకు తమిళ పోలీసులు ప్రయత్నించిన సందర్భంలో స్మగ్లర్లు తమకు అనుకూలమైన వ్యక్తులతో తడ పోలీస్‌స్టేషన్ వద్దే తమిళ పోలీసులపై రాళ్లతో దాడులు చేసేందుకు కూడా వెనుకాడలేదు. దీంతో తమిళ పోలీసులు తీవ్రంగా పరిగణించి స్మగ్లర్లపై పీడీ యాక్ట్ పెట్టేలా సమాయత్తం కావడంతో ఈ వ్యాపారులు కొంత కాలం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం గత పరిస్థితులు ఉత్పన్నమవుతాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వాటాలాపై స్పర్థలే కారణం కొంత కాలం వెనుకడుగు వేసిన స్మగ్లర్లు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించేందుకు అవకాశం ఉన్న వ్యాపారాన్ని వదులుకునేందుకు ఇష్టపడక తిరిగి వ్యాపారాన్ని మొదలు పెట్టారు. గతంలో చక్రం తిప్పిన వారు కొద్ది మంది మాత్రమే ప్రస్తుత వ్యాపార ంలో ఉండగా కొత్త వారు అధిక మంది ఉన్నారు. వ్యాపారం పెరిగే కొద్దీ శత్రువులు పెరిగారు. కొందరు ఇందులో వాటాల కోసం కోరగా స్మగ్లర్లు నిరాకరించడంతో వివాదాలు మొదలయ్యాయి. స్మగ్లింగ్ ఇలా.. ఈ వ్యాపారంలో వాటంబేడుకు చెందిన వ్యక్తులు ఆరితేరిన స్మగ్లర్లుగా పేరు తెచ్చుకున్నారు. పడవల ద్వారా రేషన్‌డీలర్ నుంచి గోతాలు సైతం సీల్ తీయకుండా బియ్యం బస్తాలు వాటంబేడు, తడ, పూడి, ఖాశింగాడు కుప్పం తదితర రేవులకు చేరుస్తారు. తడ, పూడికుప్పం, సెల్వకుప్పం గ్రామాల్లో చిల్లరగా బియ్యం కొనుగోలు చేసి సేకరించిన బియ్యాన్ని నిల్వ చేస్తారు. రాత్రి సమయంలో లారీకి లోడింగ్ చేసి తరలిస్తూ ఉంటారు. తమిళనాడులో ఉచితంగా ఇచ్చే ఈ ఉప్పుడు బియ్యం అక్కడ సేకరించేవారు రూ.5 నుంచి రూ.7 వరకు కొనుగోలు చేస్తారు. అక్కడి నుంచి దళారుల వద్దకు రూ.10 నుంచి రూ.12లకు విక్రయిస్తున్నారు. దారి పొడవునా ఉన్న అడ్డంకులను డబ్బుతో తొలగించుకుంటూ స్మగ్లర్లు ఈ బియ్యాన్ని గమ్యస్థానం చేర్చడం ద్వారా కిలో రూ.24లకు విక్రయిస్తారు. ఎన్ని ఖర్చులు పోయినా ఒక్కో లోడుపై భారీగా ఆదాయం మిగులుతూ ఉండటంతో స్మగ్లర్లు ఈ వ్యాపారం ద్వారా లక్షాధికారులు అవుతున్నారు. సూళ్లూరుపేటలోని ఒకరిద్దరు బియ్యం వ్యాపారులు దళారులుగా రేషన్‌బియ్యం కొనుగోలు చేస్తూ కోట్లకు పడగలెత్తడం చూస్తే ఇందులో ఉన్న ఆదాయం ఎంతో ఇట్టే అర్థం అవుతుంది. -
పట్టుబడిన జాక్‌పాట్ లారీ
బీవీపాళెం (తడ) : అధికారుల కళ్లుగప్పి సరుకు తరలించేందుకు యత్నించిన జాక్‌పాట్ లారీని శనివారం బీవీపాళెం చెక్‌పోస్టులో పట్టుకున్నారు. చెన్నై నుంచి సూళ్లూరుపేటకు సరైన బిల్లులు లేకుండా వెళ్తున్న పార్శిల్ లారీ చెక్‌పోస్టు సమీపంలోకి వచ్చింది. లారీకి ముందు వస్తున్న పైలెట్ చెక్‌పోస్టులో అధికారుల కదలికలను గమనిస్తూ అనువైన సమయం కోసం వేచి చూస్తున్నారు. పైలెట్ ఇచ్చిన సూచనతో లారీ చెక్‌పోస్టు సమీపంలోకి వచ్చింది. ఇంతలో చెక్‌పోస్టు ఏఓ రవికుమార్ కారు సూళ్లూరుపేట నుంచి రావడం గమనించిన పైలెట్ లారీ డ్రైవర్ని వెనక్కి వెళ్లమని చెప్పడంతో డ్రైవర్ లారీని చెన్నై వైపు మళ్లించే ప్రయత్నం చేశాడు. గమినించిన ఏఓ లారీ వద్దకు వెళ్లి రికార్డులు పరిశీలించి లారీని చెక్‌పోస్టుకు తీసుకు వచ్చి నోటీసులు జారీ చేశారు. -
రేషన్ బియ్యం పట్టివేత
తడ : తడ పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోని సెల్వకుప్పంలో శనివారం రెవెన్యూ, సివిల్ సప్లయీస్ అధికారులు పోలీసుల సాయంతో దాడులు నిర్వహించి ఐదు ఇళ్లల్లో అక్రమంగా దాచి ఉంచిన 175 బస్తాల తమిళ, ఆంధ్రా రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొంత కాలంగా పూడికుప్పం, సెల్వకుప్పం కేంద్రంగా ఈ వ్యాపారం సాగుతుంది. చిన్నచిన్న వ్యాపారుల వద్ద నుంచి తమిళ, ఆంధ్రా రేషన్ బియ్యం కొనుగోలు చేసి గ్రామంలోని ఇళ్లల్లో నిల్వ చేసి రాత్రి సమయాల్లో లారీల్లో తమకు అనుకూలమైన రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో స్మగ్లర్ల మధ్య వాటాల విషయంలో ఇటీవల విభేదాలు తలెత్తడంతో గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారం రచ్చకెక్కింది. ఇటీవల సెల్వకుప్పం నుంచి ఓ లారీలో తమిళ రేషన్‌బియ్యం తీసుకు వెళ్తుండగా ఓ వర్గం అడ్డుకుని పోలీసులు ఫిర్యాదు చేశాడు. తడలో తప్పించుకున్న ఆ లారీని సూళ్లూరుపేట ఎస్ఐ గంగాధరం టోల్‌ప్లాజా వద్ద పట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గ్రామంలో బియ్యం నిల్వ ఉన్నట్టు ప్రత్యర్థి వర్గం స్మగ్లర్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్కే ఇంతియాజ్‌క్ ఫోన్లో సమాచారం అందించారు. ఆయన ఆదేశాలతో తడ తహసీల్దార్ ఏడుకొండలు, సూళ్లూరుపేట సివిల్ సప్లయీస్ డీటీ వెంకటేశ్వర్లు, ఎస్ఐ సురేష్‌బాబు సహకారంతో గ్రామంలో తనిఖీలు చేవారు. ఐదు ఇళ్లల్లో దాచి ఉంచిన 175 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కొండూరు వద్ద ఉన్న సివిల్ సప్లయీస్ గోదాముకు తరలించారు. అయితే బియ్యం ఉన్న ఇళ్లల్లో ఎవరూ కాపురం లేకపోగా, ఆ సరుకు తమదంటూ ఎవరూ ముందుకు రాకపోవడంతో ప్రస్తుతానికి ఎవరిపైనా కేసులు నమోదు చేయలేదని తహసీల్దార్ తెలిపారు. -
కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం
అక్కంపేట (తడ) : బైక్‌పై రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన మండలంలోని అక్కంపేట వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. ఎస్ఐ సురేష్‌బాబు సమాచారం మేరకు.. మధ్యప్రదేశ్ మురానా జిల్లా గడియా గ్రామానికి చెందిన శశికాంత్ శర్మ(40) అక్కంపేట సమీపంలో అండగుండాల మార్గంలో నిర్మిస్తున్న జైన్ మందిరం వద్ద పనికి వచ్చాడు. మందిరంపై బొమ్మలు చెక్కడంలో సిద్ధహస్తుడైన శర్మ ఏడాది క్రితం ఇక్కడే ఉంటూ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం తన సహచరుడితో కలిసి బైక్‌పైS కూరగాయలు, ఇతర సామగ్రి కొనుగోలు కోసం అక్కంపేటకు వచ్చాడు. అక్కంపేట మలుపు వద్ద మధ్యలో చెన్నై వైపు వెళ్తున్న వాహనాలను చూసి ఓ మారుతి కారు నిలిచి ఉంది. అవతల వచ్చే వాహనాలను గమనించని బైక్ నడుపుతున్న వ్యక్తి రోడ్డుపై కొంత ముందుకు వెళ్లాడు. గూడూరు నుంచి చెన్నై వైపు వెళ్తున్న స్కార్పియో కారు వేగంగా రావడం చూసి వెనుక కూర్చున్న శర్మ ఆందోళనతో కిందకు దిగి ముందుకు, వెనక్కు ఒకటి రెండు అడుగు వేసే క్రమంలో శర్మను ఢీకొంది. దీంతో శర్మ కారు బానెట్‌పై పడిపోయాడు. స్కార్పియో రోడ్డు మలుపు మధ్యలో ఆగి ఉన్న మరో కారు ముందు భాగం ఢీకొని డివైడర్ ఎక్కి కొంత దూరం వెళ్లి నిలిచింది. కారు ఢీకొనడంతో శర్మ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్టు తోటి సిబ్బంది తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఐదు గ్రావెల్ టిప్పర్ల సీజ్
తడ: రవాణా శాఖ ప్రత్యేక అధికారుల బందం శనివారం రాత్రి తడలో తనిఖీలు నిర్వహించి ఐదు గ్రావెల్ టిప్పర్లను సీజ్ చేశారు. సరైన పత్రాలు లేకుండా ఓవర్‌లోడ్‌తో పొరుగు రాష్ట్రానికి వెళుతున్న ఈ టిప్పర్లకు రూ.16 వేలు చొప్పున జరిమానా విధించి తడ పోలీసులకు అప్పగించారు. నిత్యం చిత్లూరు జిల్లా నుంచి పదుల సంఖ్యలో టిప్పర్లు తడ మీదుగా తమిళనాడుకు గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తుంటాయి. తమిళనాడులో గ్రావెల్‌కు డిమాండ్ ఉండటంతో అధికార పార్టీ అండదండలున్న పలువురు యథచ్ఛేగా గ్రావెల్‌ను సరిహద్దు దాటించేస్తున్నారు. చెక్‌పోస్టులో మైనింగ్ శాఖకు సంబంధించి ఒక్కరే విధుల్లో ఉండటం వీరికి వరంగా మారింది. రోడ్డుపైకి వచ్చి వాహనాలను తనిఖీ చేసే పరిస్థితి లేకపోవడంతో తేలికగా తప్పించుకెళ్లిపోతున్నారు. ప్రత్యేక తనిఖీ బందాలు వచ్చిన సమయంలోనే ఈ అక్రమ రవాణా వ్యవహారం వెలుగులోకి వస్తోంది. -
ఇండస్ కాఫీ ఫ్యాక్టరీలో ప్రమాదం
-
ఇండస్ కాఫీ ఫ్యాక్టరీలో ప్రమాదం
నెల్లూరు : నెల్లూరు జిల్లా తడ మండలం మాంభట్టు సెజ్‌లోని ఇండస్ కాఫీ ఫ్యాక్టరీలో మంగళవారం ప్రమాదం సంభవించింది. ట్రయిల్ రన్లో భాగంగా బాయిలర్ క్లీన్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం. రసాయనాలు ఒక్కసారిగా వెలువడటంతో మరో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం చెన్నైకి తరలించారు. కాగా మృతులు తడ మండలానికి చెందిన రవి, రవీంద్ర కుమార్, ఈశ్వర్‌గా గుర్తించారు. అస్వస్థతకు గురైన వారిలో పోలయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తేనెటీగల దాడిలో 26 మందికి గాయాలు
నెల్లూరు (తడ) : నెల్లూరు జిల్లా తడ మండలం మాంబట్టు సెజ్‌లోని అపాచీ కంపెనీ ఉద్యోగులపై సోమవారం మధ్యాహ్నం సమయంలో తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో 26 మంది ఉద్యోగులు గాయపడ్డారు. గాయపడిన వారిని సూళ్లూరుపేట గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. -
తడలో ఉగ్రవాదుల షెల్టర్?
నల్లగొండ: పోలీసు ఎన్కౌంటర్లో మృతి చెందిన వ్యక్తులు గతంలో నెల్లూరు జిల్లా తడలో షెల్టర్ తీసుకున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతులు అస్లం అయూబ్, జాకీర్ హుస్సేన్‌లకు చెన్నై పేలుళ్లతో కూడా సంబధం ఉందా అన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుల ఫోటోలను నెల్లూరు పోలీసులకు పంపి వారి నుంచి మరింత సమాచారం సేకరించే పనిలో తెలంగాణ పోలీసు యంత్రాంగం ఉంది. సిమీ ఉగ్రవాదులు సంచరిస్తున్నారని నిఘా వర్గాల సమాచారం మేరకు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట, శ్రీసిటీ, తడ ప్రాంతాల్లో పోలీసులు జనవరిలోనే హై అలర్ట్ ప్రకటించారు. చెన్నై బాంబు పేలుళ్ల కేసులో కీలక నిందితులు తమిళనాడు నుంచి తప్పించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తున్నారని నిఘావర్గాలు అప్పుడే సమాచారం అందించాయి. దీంతో జనవరిలోనే ఏపీ, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తప్పించుకున్న ఉగ్రవాదులు జాకీర్ హుస్సేన్, అంజాద్, అస్లాం, ఫయాజుద్దీన్, మహబూబ్ఉద్దు ఫోటోలను తమిళనాడు పోలీసులు అప్పుడే తడ పోలీసులకు పంపారు. దాంతో శ్రీహరికోట, శ్రీసిటీ, తడ ప్రాంతాల్లోని పారిశ్రామికవాడల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. దీంతో జనవరిలోనే శ్రీహరికోటలో అంతరిక్ష పరిశోధన కేంద్రం భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా.. తాజాగా నల్లగొండ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో వీరిలో ఇద్దరు మరణించడం సంచలనం సృష్టించింది. -
మామూళ్ల కోసం అధికారులు, సిబ్బంది బాహాబాహీ
నెల్లూరు : కాసుల కోసం స్థాయిని మరిచి అధికారులు, సిబ్బంది కొట్టుకున్నారు. నెల్లూరు జిల్లా తడ మండలం బీవీ పాలెంలోని ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌లో అధికారులు, సిబ్బంది బాహాబాహీకి దిగారు. మామూళ్ల కోసం ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటనలో పలువురు గాయపడ్డారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
శ్రీసిటీ సెజ్ ప్రగతి హర్షణీయం...
తడ: అనతి కాలంలోనే శ్రీసిటీ సెజ్ సాధించిన ప్రగతి అభినందనీయుమని కేంద్ర ఆహార శుద్ధి, పరిశ్రవుల శాఖ వుంత్రి హర్ సివ్రుత్ కౌర్ బాదల్ అన్నారు. శనివారం ఆమె చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సెజ్‌లో పర్యటించారు. సెజ్‌లో నెలకొల్పిన కాడ్బరీ, పెప్సికో, కెల్లాగ్స్ తదితర ఆహార, పానీయు ఉత్పాదక సంస్థల ప్రతినిధులతో సవూవేశమై పలు అంశాలను చర్చించారు. ఆహార, పానీయు ఉత్పాదనలకు ప్రత్యేక ప్రాంగణం ఏర్పాటు చేయుడం, ఈ తరహా ఉత్పాదక సంస్థలకు అనుకూలంగా వసతులు కల్పించడంతో శ్రీసిటీ ప్రత్యేకతను సంతరించుకుందన్నారు. శ్రీసిటీ సెజ్‌లో మౌలిక వసతులు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయని పేర్కొన్నారు. అందుకే ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వివిధ దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు ఉత్సాహం చూపుతున్నారన్నారు. నిపుణులైన సిబ్బంది లభ్యం కావాలంటే ఇందుకు అనుగుణంగా ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేసి స్థానికులకు శిక్షణ ఇప్పించాలని సూచించారు. అంతకువుుందు వుంత్రికి శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి సెజ్ సాధించిన ప్రగతిని వివరించారు. ఆహార,పానీయు పరిశ్రవులు శ్రీసిటీలో ఏర్పాటవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయున్నారు. వూమిడి, చెరుకు,టమాట, డెయిరీ రైతులకు వురింత ఆదాయుం సవుకూరుతుందన్నారు. వుంత్రి పర్యటనలో తిరుపతి పార్లమెంట్ సభ్యుడు వరప్రసాద్, సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య, రాష్ట్ర పరిశ్రవుల శాఖ వుుఖ్య కార్యదర్శి జేవీఎస్ ప్రసాద్, ఆహార శుద్ధి పరిశ్రవుల సహాయు కార్యదర్శి వెంకటేశ్వరులు తదితర అధికారులు ఉన్నారు. శ్రీసిటీ సెజ్‌లో పర్యటించిన తొలి కేంద్ర వుంత్రి హర్ సివ్రుత్ కౌర్ బాదల్. -
సినిమా పరిశ్రమ విశాఖ తరలిపోతుందా?
రాష్ట్రం విడిపోయిన తరువాత తెలుగు సినిమా పరిశ్రమపై భిన్నకథనాలు వినవస్తున్నాయి. రాష్ట్రం విడిపోయిన ప్రభావం సినిమా పరిశ్రమ మీదకూడా పడింది. తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఫిల్మ్ ఇండస్ట్రీ దారి ఎటు? అనే ప్రశ్న తలెత్తింది. ఈ పరిశ్రమ విశాఖ తరలిపోతుందని - నెల్లూరు వెళుతుందని - ఎక్కడికి వెళ్లదు, ఇక్కడే ఉంటుందని ఒక్కొక్కళ్లు ఒక రకంగా చెబుతూ వస్తున్నారు. అన్ని విధాల ఇక్కడ స్థిరపడిన వారు కదిలే అవకాశం లేదు. ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలపై కూడా పరిశ్రమ కదలిక ఆధారపడి ఉంటుంది. వైజాగ్‌ని సినిమా ఇండస్ట్రీ హబ్ చేస్తానని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. భీమిలి ప్రాంతంలో 316 ఎకరాలు కేటాయిస్తామని మంత్రి గంటా శ్రీనివాస రావు చెప్పారు. సినిమా పరిశ్రమకు రెండు వేల ఎకరాలు ఇస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రకటించారు. ఈ పరిస్థితులలో కొందరు తెలుగు సినిమా నిర్మాతలు సందిగ్ధంలో పడ్డారు. ఇక్కడే ఉందామా? అటు వెళదామా? అన్న ఆలోచన చేస్తున్నారు. కొందరు నిర్మాతలు నెల్లూరు జిల్లా తడ ప్రాంతంలో భారీ స్టుడియోల నిర్మాణాలకు పథకాలు సిద్ధం చేస్తున్నారు. తడకు చెన్నై దగ్గరగా ఉండటం వల్ల అన్నీ కలిసి వస్తాయని వారి ఆలోచన. ఫైట్ మాస్టర్లు, కొరియోగ్రాఫర్లు వంటి తెర వెనుక పనిచేసేవారు, సినిమాకు కావలసిన సామాగ్రి అందుబాటులో ఉంటాయన్నది వారి భావన. కొందరు తెలంగాణలోనే స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. ఎందరో సినీ ప్రముఖుల కృషి వల్ల తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చెన్నై నుంచి హైద్రాబాద్‌కు తరలివచ్చింది. హైద్రాబాద్‌లో చాలా అందమైన ప్రాంతాలున్నాయి. షూటింగ్‌కు అనువైన ప్లేస్ కాబట్టి చాలా సినిమాలు హైద్రాబాద్‌లోనే తెరకెక్కుతున్నాయి. హైద్రాబాద్‌లో చారిత్రక కట్టడాలున్నాయి. అవికూడా తెలుగు సినిమాకు వరంగా మారాయి. చార్మినార్, గోల్కొండ లాంటి కట్టడాలు తెలుగు సినిమాకు బ్యాక్ బోన్‌గా నిలిచాయి. గోల్కొండ పోర్ట్ తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పాటలే కాకుండా ముఖ్యమైన సన్నివేశాలు కూడా అక్కడే తెరకెక్కుతుంటాయి. హైద్రాబాద్‌లో చాలా ఫేమస్ ప్లేస్లున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్ధీ తక్కువగా ఉంటుంది కాబట్టి షూటింగ్‌కు అనువుగా ఉంటాయి. పాతబస్తీ నేపథ్యంలో కూడా చాలా సినిమాలు తెరకెక్కుతుంటాయి. ఇదిలా ఉంటే, తెలుగు సినిమా ప్రస్థానం మొదలైన దగ్గరనుంచీ వైజాగ్‌లో సినిమా షూటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. అక్కడ కూడా అందమైన ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రీ వైజాగ్‌పై దృష్టి పెట్టింది. ఆర్.కె బీచ్ తెలుగు సినిమాలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. వైజాగ్ లొకేషన్స్‌లో సినిమా తీస్తే హిట్టే అన్న భావన కూడా చాలామంది దర్శకులకు ఉంది. అదో సెంటిమెంట్‌గా కూడా మారింది. భీమిలి బీచ్‌లో ఎన్నో పాటలు అందంగా తెరకెక్కాయి. కొందరు హీరోలు, దర్శకుల చూపు విశాఖ వైపు ఉంది. మరి కొందరు అక్కడ, ఇక్కడ రెండు చోట్ల మార్కెట్ చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. కొందరు విశాఖ ప్రాంతంలో భూములు కూడా కొనుగోలు చేశారు.విశాఖ వెళితే లాభనష్టాలు ఏంటి అని అంచనా వేసుకుంటున్నారు. ఎక్కడైనా హైదరాబాద్‌లో ఉన్నన్ని సదుపాయాలు సమకూరడానికి చాలా కాలం పడుతుంది. పయనం మొదలు పెడితే కాల క్రమంలో సదుపాయాలు సమకూరుతూ ఉంటాయి. కొందరు రిస్కులు ఎందుకని భావిస్తుంటే, మరి కొందరు రాజధాని మద్రాసు నుంచి హైదరాబాదుకు మారింది. హైదరాబాద్‌లో అభివృద్ధి చేసుకున్నాం. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ వదల వలసి వచ్చింది. భవిష్యత్‌లోనైనా మరో చోటుకు తరలక తప్పదని, అభివృద్ధి చేసుకోక తప్పదని అంటున్నారు. అదేదో ఇప్పటి నుంచే మొదలుపెడితే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా ఏపి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాకాలపై సినిమా పరిశ్రమ తరలింపు ఆధారపడి ఉంటుంది. అయితే భాష ఒకటే అయినందున రెండు ప్రాంతాలలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందుతూ, సమన్వయంతో కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరికి ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ స్థిరపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ** -
తడ సమీపంలో భారీ సినీ స్టూడియో నిర్మాణం!
-
తడ సమీపంలో భారీ సినీ స్టూడియో నిర్మాణం!
నెల్లూరు: శ్రీపొట్టిశ్రీరామలు నెల్లూరు జిల్లా సినిమా నిర్మాణ కేంద్రంగా మారే అవకాశాలున్నాయి. కొంతమంది నిర్మాతలు నెల్లూరు జిల్లాలో స్టూడియో నిర్మాణాలు చేపట్టడానికి సిద్ధపడుతున్నట్లు తెలిసింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీ ఫిలిం స్టూడియోలు ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనలో టాలీవుడ్ ఉన్న విషయం తెలిసిందే. కొంతమంది విశాఖపట్నం వెళ్లాలని భావించినా, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో సినీ పరిశ్రమను నెలకొల్పాలనే ఆలోచనలో కొందరు తెలుగు సినీ నిర్మాతలు ఉన్నారు. తడ సమీపంలో భారీ స్టూడియోను నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఒక పెద్ద నిర్మాత ఈ స్టూడియో నిర్మాణం చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీనికిగాను ఆయన మూడు వేల ఎకరాల స్థలాన్ని సేకరిస్తున్నారని సమాచారం. తడ సమీపంలో ప్రకృతి సౌందర్యాలు కూడా ఉండటంతో పాటు చెన్నైకు దగ్గరగా ఉండటం కలిసివస్తోంది. తెలుగు సినిమాలే కాకుండా, చెన్నైలో నిర్మించే ఇతర భాషా చిత్రాలు కూడా ఇక్కడ షూటింగ్ చేసుకునే విధంగా స్టూడియో నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిసింది. సమీపంలో పులికాట్ సరస్సు, నేలపట్టు, అతిపొడవైన సముద్ర తీరంతో పాటు మైపాడు బీచ్ కూడా ఉండటంతో సినిమా షూటింగ్‌లకు ఈ ప్రాంతం అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. హైదరాబాద్‌లో షూటింగ్‌లు జరుపుకోవాలంటే అనుమతులు ఇబ్బందిగా ఉందని ఆ నిర్మాత అభిప్రాయపడుతున్నారని సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో కూడా స్టూడియో నిర్మాణాలు జరగడం వల్ల ఈ ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. ఇప్పటికీ కొంతమంది ఆర్టిస్టులను, సంగీత కళాకారులను, ఫైట్ మాస్టర్లను చెన్నై నుంచి హైదరాబాద్‌కు తీసుకుని వెళుతున్నామని, అటువంటి అవసరం లేకుండా నెల్లూరు జిల్లాలో స్టూడియోలు నిర్మించుకుంటే, చెన్నై నుంచి రావడానికి సులువుగా ఉంటుందని భావిస్తున్నారు. విశాఖపట్నంలో స్టూడియో నిర్మాణం చేపడితే కళాకారులను చెన్నై, హైదరాబాద్‌ల నుంచి తీసుకెళ్లడానికి ప్రయాణ ఖర్చులు పెరుగుతాయని కూడా భావిస్తున్నట్లు తెలిసింది. పులికాట్ నుంచి సముద్రంలో 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరకం దీవిలో ఒక రిసార్టును నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. అటు చిత్తూరు జిల్లా కూడా సమీపంలోనే ఉండటంతో, రెండు జిల్లాల్లోనూ షూటింగ్‌లు జరుపుకోవచ్చునని భావిస్తున్నట్లు తెలిసింది. గతంలో అనేక షూటింగ్‌లు చిత్తూరు జిల్లాలో జరుపుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. స్టూడియో నిర్మాణం ఇప్పటినుంచి ప్రారంభిస్తే, మరో 18 నుంచి 20 నెలల్లో షూటింగ్‌లు జరుపుకోవచ్చునని భావిస్తున్నట్లు సమాచారం.