
సినిమా పరిశ్రమ విశాఖ తరలిపోతుందా?
రాష్ట్రం విడిపోయిన తరువాత తెలుగు సినిమా పరిశ్రమపై భిన్నకథనాలు వినవస్తున్నాయి. రాష్ట్రం విడిపోయిన ప్రభావం సినిమా పరిశ్రమ మీదకూడా పడింది. తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఫిల్మ్ ఇండస్ట్రీ దారి ఎటు? అనే ప్రశ్న తలెత్తింది. ఈ పరిశ్రమ విశాఖ తరలిపోతుందని - నెల్లూరు వెళుతుందని - ఎక్కడికి వెళ్లదు, ఇక్కడే ఉంటుందని ఒక్కొక్కళ్లు ఒక రకంగా చెబుతూ వస్తున్నారు. అన్ని విధాల ఇక్కడ స్థిరపడిన వారు కదిలే అవకాశం లేదు. ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలపై కూడా పరిశ్రమ కదలిక ఆధారపడి ఉంటుంది.
వైజాగ్ని సినిమా ఇండస్ట్రీ హబ్ చేస్తానని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. భీమిలి ప్రాంతంలో 316 ఎకరాలు కేటాయిస్తామని మంత్రి గంటా శ్రీనివాస రావు చెప్పారు. సినిమా పరిశ్రమకు రెండు వేల ఎకరాలు ఇస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రకటించారు. ఈ పరిస్థితులలో కొందరు తెలుగు సినిమా నిర్మాతలు సందిగ్ధంలో పడ్డారు. ఇక్కడే ఉందామా? అటు వెళదామా? అన్న ఆలోచన చేస్తున్నారు. కొందరు నిర్మాతలు నెల్లూరు జిల్లా తడ ప్రాంతంలో భారీ స్టుడియోల నిర్మాణాలకు పథకాలు సిద్ధం చేస్తున్నారు. తడకు చెన్నై దగ్గరగా ఉండటం వల్ల అన్నీ కలిసి వస్తాయని వారి ఆలోచన. ఫైట్ మాస్టర్లు, కొరియోగ్రాఫర్లు వంటి తెర వెనుక పనిచేసేవారు, సినిమాకు కావలసిన సామాగ్రి అందుబాటులో ఉంటాయన్నది వారి భావన. కొందరు తెలంగాణలోనే స్థిరపడాలని నిర్ణయించుకున్నారు.
ఎందరో సినీ ప్రముఖుల కృషి వల్ల తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చెన్నై నుంచి హైద్రాబాద్కు తరలివచ్చింది. హైద్రాబాద్లో చాలా అందమైన ప్రాంతాలున్నాయి. షూటింగ్కు అనువైన ప్లేస్ కాబట్టి చాలా సినిమాలు హైద్రాబాద్లోనే తెరకెక్కుతున్నాయి. హైద్రాబాద్లో చారిత్రక కట్టడాలున్నాయి. అవికూడా తెలుగు సినిమాకు వరంగా మారాయి. చార్మినార్, గోల్కొండ లాంటి కట్టడాలు తెలుగు సినిమాకు బ్యాక్ బోన్గా నిలిచాయి. గోల్కొండ పోర్ట్ తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పాటలే కాకుండా ముఖ్యమైన సన్నివేశాలు కూడా అక్కడే తెరకెక్కుతుంటాయి. హైద్రాబాద్లో చాలా ఫేమస్ ప్లేస్లున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్ధీ తక్కువగా ఉంటుంది కాబట్టి షూటింగ్కు అనువుగా ఉంటాయి. పాతబస్తీ నేపథ్యంలో కూడా చాలా సినిమాలు తెరకెక్కుతుంటాయి.
ఇదిలా ఉంటే, తెలుగు సినిమా ప్రస్థానం మొదలైన దగ్గరనుంచీ వైజాగ్లో సినిమా షూటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. అక్కడ కూడా అందమైన ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రీ వైజాగ్పై దృష్టి పెట్టింది. ఆర్.కె బీచ్ తెలుగు సినిమాలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. వైజాగ్ లొకేషన్స్లో సినిమా తీస్తే హిట్టే అన్న భావన కూడా చాలామంది దర్శకులకు ఉంది. అదో సెంటిమెంట్గా కూడా మారింది. భీమిలి బీచ్లో ఎన్నో పాటలు అందంగా తెరకెక్కాయి.
కొందరు హీరోలు, దర్శకుల చూపు విశాఖ వైపు ఉంది. మరి కొందరు అక్కడ, ఇక్కడ రెండు చోట్ల మార్కెట్ చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. కొందరు విశాఖ ప్రాంతంలో భూములు కూడా కొనుగోలు చేశారు.విశాఖ వెళితే లాభనష్టాలు ఏంటి అని అంచనా వేసుకుంటున్నారు. ఎక్కడైనా హైదరాబాద్లో ఉన్నన్ని సదుపాయాలు సమకూరడానికి చాలా కాలం పడుతుంది. పయనం మొదలు పెడితే కాల క్రమంలో సదుపాయాలు సమకూరుతూ ఉంటాయి.
కొందరు రిస్కులు ఎందుకని భావిస్తుంటే, మరి కొందరు రాజధాని మద్రాసు నుంచి హైదరాబాదుకు మారింది. హైదరాబాద్లో అభివృద్ధి చేసుకున్నాం. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ వదల వలసి వచ్చింది. భవిష్యత్లోనైనా మరో చోటుకు తరలక తప్పదని, అభివృద్ధి చేసుకోక తప్పదని అంటున్నారు. అదేదో ఇప్పటి నుంచే మొదలుపెడితే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా ఏపి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాకాలపై సినిమా పరిశ్రమ తరలింపు ఆధారపడి ఉంటుంది. అయితే భాష ఒకటే అయినందున రెండు ప్రాంతాలలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందుతూ, సమన్వయంతో కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరికి ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ స్థిరపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
**