ఇక్కడి నుంచే సినిమా రంగానికి వెళ్లా..
► నేను ఇక్కడే ఉండేవాడిని
► గాజువాకలో రాజమౌళి సందడి
► బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభించిన జక్కన్న
► చిన్నారులతో మాటామంతి
► సెల్ఫీలు, ఆటో గ్రాఫ్‌లతో హుషారు
గాజువాక : బాహుబలి చిత్రం విడుదల తరువాత తొలిసారిగా విశాఖ వచ్చిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి గాజువాకలో సందడి చేశారు. తన చిరకాల మిత్రుడు, బ్యాడ్మింటన్ కోచ్ మురళీ కృష్ణ గాజువాకలో ఏర్పాటు చేసిన లక్ష్య బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభోత్సవానికి సతీమణి రమా రాజమౌళి, సోదరుడు, సంగీత దర్శకుడు కీరవాణి సతీమణి శ్రీవల్లీతో కలిసి శుక్రవారం హాజరైన రాజమౌళికి ఇక్కడ ఘన స్వాగతం లభించింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ కోచ్ మురళీ కృష్ణతో తన పరిచయాన్ని, స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. తాను 23 ఏళ్ల క్రితం విశాఖలోని సాగర్‌నగర్‌లో నివాసముండేవాడినని చెప్పారు. చాలా ఏళ్లు అక్కడే ఉన్నానని, విశాఖనుంచే సినిమా రంగానికి వెళ్లానని చెప్పారు. సభ అనంతరం తనను కలిసిన విలేకరులతో సినిమా విషయాలు మాట్లాడటానికి ఆయన నిరాకరించారు. ప్రస్తుతానికి సినిమాల ప్రస్తావన తేవద్దని పేర్కొన్నారు.
సరదాగా.. స్ఫూర్తిదాయకంగా
ఈ సందర్భంగా రాజమౌళి, రమా రాజమౌళి, శ్రీవల్లీ ఇక్కడి చిన్నారులతో కొద్దిసేపు సరదాగా గడిపారు. చిన్నారులతో ఫొటోలు, సెల్ఫీలు దిగడంతోపాటు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. అంతకుముందు ఏర్పాటు చేసిన సభలో రాజమౌళి ప్రసంగం స్ఫూర్తిదాయకంగా సాగింది. వేదికకు వెనుక భాగంలో ఉన్న చిన్నారులను ముందు వరుసలోకి పిలిచి కూర్చోబెట్టారు. సభలో వారినుద్దేశించే ప్రసంగించారు. లక్ష్యంపై గురి ఏ విధంగా ఉండాలో ద్రోణాచార్య, అర్జునుల మధ్య సంభాషణను వివరిస్తూ స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు.
అందరినోటా బాహుబలి
సభలో ప్రతి ఒక్కరినోటా బాహుబలి సినిమానే కీర్తించారు. తెలుగు సినిమాను కీర్తి శిఖరాలకు తీసుకెళ్లిన ఘనత రాజమౌళికే దక్కుతుందని ఈ సందర్భంగా ప్రసంగించిన పలువురు క్రీడాకారులు, కోచ్‌లు, రాజకీయ నాయకులు పేర్కొన్నారు. క్రీడల్లో కోచ్‌లకు ద్రోణాచార్య, ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు అర్జున అవార్డులను ప్రభుత్వం ఇస్తోందని, ఇకపై బాహుబలి అవార్డును కూడా ప్రభుత్వాలు ప్రకటించే అవకాశం ఉందని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు సహా పలువురు ప్రముఖులు పేర్కొన్నారు.
ఇక్కడ ప్రారంభించిన లక్ష్య బ్యాడ్మింటన్ అకాడమీ వరల్డ్ ఛాంపియన్‌ను తయారు చేసి బాహుబలి బ్యాడ్మింటన్ అకాడమీగా మారాలని తాము కోరుకొంటున్నట్టు మరికొందరు ఆకాంక్షించారు. తాము సాధిస్తున్న చిన్న చిన్న విజయాలతో తమ ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ‘అదిగోరా బాహుబలి వస్తున్నా’డంటూ తమను పొగుడుతుంటే చాలా ఆనందంగా ఉంటోందని ఇంకొంతమంది తెలిపారు. విశాఖ శాఖ అ«ధ్యక్షుడు టిఎస్‌ఆర్ ప్రసాద్, అకాడమీ నిర్మాణంలో సహకరించిన అధికారులు ఎంఎం నాయక్, రాజేష్ పటేల్, వివేక్ యాదవ్, సురేష్, కోచ్ గంగూలిప్రసాద్, బ్యాడ్మింటన్ సంఘం ప్రతినిధులు శ్రీనివాస్,జగదీష్ పాల్గొన్నారు.
శ్రమిస్తేనే ఫలితం
విశాఖపట్నం స్పోర్ట్స్ : చిత్రపరిశ్రమలో కలక్షన్ల వర్షంతో రికార్డులు నమోదు చేస్తున్న బహుబలి దర్శకుడు రాజమౌళి తనకు బ్యాడ్మింటన్ ఆటలోనూ ప్రావీణ్యం ఉందని విశాఖలోని వడ్డపూడి గ్రీన్ సిటీలోని అకాడమిలో ఔత్సాహిక ఆటగాళ్లకు చూపించారు. ఏపీలోనే తొలి బ్యాడ్మింటన్ అకాడమినీ ఆయన ప్రారంభించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే రాజమౌళి.... అర్జునిలా లక్ష్యాన్ని నిర్ధేశించుకుని దాన్ని సాఫల్యం చేసుకునేందుకు ఎంతగా శ్రమిస్తే అంత ఫలితం వస్తుందంటున్నారు...అవి ఆయన మాటల్లోనే... ఏర్పరుచుకున్న లక్ష్యాన్ని నిరంతరం గుర్తు చేసుకుంటూనే దాన్ని సాకారం చేసుకునేందుకు కష్టపడటమే నాలక్ష్యం.
లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు ఎన్నో ఆడ్డంకులు వస్తాయి. వాటిని అధిగమించితేనే ఫలితం వస్తుంది. అదే విజయానికి దారి చూపెడుతుంది. కష్టాలు రావాలి అప్పుడే మనలోని నిజమైన టాలెంట్ బయటికి వస్తుంది. సింగిల్ పాయింట్ మీదే దృష్టాంతా కేంద్రీకరించాలి.
చిన్నతనంలో: ఇక్కడి సాగరనగర్‌లోనే ఎక్కువ కాలం ఉన్నాను. అప్పుడు అంతా సినిమాలు చూడటం. పిక్నిక్‌లకు వెళ్లడం లాంటి విషయాలతో సరదాగానే గడిచిపోయింది. పనిపాటా లేకుండా ఖాళీగానే ఇక్కడ తిరిగినా 1983నుంచే మనసులో ఓ లక్ష్యం మాత్రం ఉండేది. కేంద్రీకృతమైన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు పడ్డ శ్రమకు ఫలితాన్ని నేడు మీరు చూస్తున్నారు. ఆటలో విజయం ముఖ్యం. పరాజయం అంతే, కాని పాటాలు నేర్పుతుంది.