Bangarammapalem Villagers Creating Wonders With Their Talent In TFI - Sakshi
Sakshi News home page

వెండితెరకు ‘బంగారు’ నగిషీలు.. సినిమాయే ప్రపంచం.. ఏకంగా 150 మంది

Published Sun, Feb 6 2022 3:11 PM | Last Updated on Sun, Feb 6 2022 11:32 PM

Bangarammapalem Villagers Settled In The Film Industry - Sakshi

సబ్బవరం(పెందుర్తి)\విశాఖపట్నం: బంగారమ్మపాలెం గ్రామం.. సబ్బవరం మండలంలోని అందమైన పల్లెటూరు. ఉద్యానపంటలకు చిరునామా. ఆధ్యాత్మికంగా ఈ గ్రామానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇక్కడ స్వయం భూ సోమలింగేశ్వరస్వామి కొలువై ఉండటంతో ఈ గ్రామం జిల్లాలోనే ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. స్వామి పేరు మీద గ్రామాన్ని లింగాల తిరుగుడు అని కూడా పిలుస్తారు.

గ్రామ జనాభా 1925. ఈ గ్రామం ఆధ్యాత్మికంగానే కాకుండా ఎన్నో అంశాల్లో ప్రత్యేకతను చాటుకుంటోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు, ఈ గ్రామానికి ఎంతో అనుబంధం ఉంది. ఎంతో మందికి వినోదం పంచే సినీ రంగంలో గ్రామానికి చెందిన దాదాపు 150 మంది వరకు వివిధ విభాగాల్లో పనిచేస్తూ గుర్తింపు పొందారు. వీరిలో కొందరు హైదరాబాద్‌లోనే స్థిరపడగా.. మరికొందరు అక్కడ తాత్కాలికంగా నివాసం ఉంటూ గ్రామానికి వచ్చి పోతుంటారు. లైట్‌మెన్‌గా, ఆర్ట్‌ డైరెక్టర్లుగా, మేకప్‌మెన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు.


చిరంజీవితో వెంకట్‌.. 

1994లో గ్రామానికి చెందిన దొడ్డి రాము హైదరాబాద్‌ వలస వెళ్లాడు. సినీ పరిశ్రమలోని ప్రొడక్షన్‌ డిపార్ట్‌మెంట్, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించాడు. కొన్నాళ్లు్ల తర్వాత స్వగ్రామం వచ్చిన రాము.. తన స్నేహితులతో సినిమా కబుర్లు చెప్పేవాడు. దీంతో సినీ రంగంపై వారికి ఆసక్తి పెరిగింది. ఒకరిద్దరినీ వెంట తీసుకెళ్తానని చెప్పడంతో బయలుదేరారు. అలా కొన్నాళ్లు సినీ పరిశ్రమలో వారంతా కలిసి పనిచేశారు. ఆ తర్వాత రాము గ్రామానికి తిరిగి వచ్చేశాడు. ఎల్‌ఐసీ ఏజెంట్‌గా, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ స్థిరపడ్డాడు. ఈ ప్రాంతంలో వ్యవసాయమే జీవనాధారం. వ్యవసాయం, వ్యవసాయ కూలి పనులు చేసుకునే వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ నేపథ్యంలో చాలా మంది ఉపాధి కోసం సినీ పరిశ్రమకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే అక్కడ స్థిరపడిన వారి ద్వారా తమ ప్రయత్నాలు కొనసాగించారు.

అల్లు అర్జున్‌తో బంగారమ్మపాలెం వాసులు 

ముందుగా దొడ్డి రాము.. ఆ తర్వాత గ్రామానికి చెందిన దాడి వెంకట సూర్యనారాయణ వెళ్లారు. అతను కొంతకాలం పనిచేసిన తర్వాత దొడ్డి రమేష్, సూరిశెట్టి అర్జున్, దాడి శంకర్‌లను తీసుకుని వెళ్లారు. కిల్లి చిన సత్యనారాయణ లైట్‌మన్‌గా, ఆడారి చంద్రరావు లైట్‌మన్‌గా, సూరిశెట్టి ఉత్తరకుమార్‌ ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో, బొడ్డేటి శివ ప్రొడక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో, కిల్లి నాగర వెంకట అప్పారావు లైట్‌మన్‌గా, దొడ్డి కామేష్‌ ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో హెల్పర్‌గా, దాడి గోవింద్‌ ప్రొడక్షన్‌ ఇన్‌చార్జిగా పనిచేస్తున్నారు. ఆర్ట్‌ డైరెక్టర్‌గా గ్రామానికి చెందిన సూరిశెట్టి ఉత్తర కుమార్, సూరిశెట్టి అర్జున్‌ తదితరులు మంచిస్థాయిలో స్థిరపడ్డారు. అనంతరం వీరి ద్వారా గ్రామం నుంచి యువకులు సినీ పరిశ్రమకు తరలివెళ్లారు. అక్కడ లైట్‌బాయ్స్, కెమెరా అసిస్టెంట్లు, ప్రొడక్షన్‌ అసిస్టెంట్లు, మేకప్‌మెన్‌ తదితర విభాగాల్లో రాణిస్తున్నారు. ఈ గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాలకు చెందిన వీరి బంధువులు, స్నేహితులు కూడా ఈ రంగం వైపు అడుగులు వేస్తున్నారు.  

సినీ పరిశ్రమలో ప్రాతినిథ్యం ఇలా..
ఆర్ట్‌ డైరెక్టర్లుగా సూరిశెట్టి ఉత్తర కుమార్, సూరిశెట్టి అర్జున్, అసిస్టెంట్‌ ఆర్ట్‌ డైరెక్టర్లుగా ఎస్‌.బాలకృష్ణ, దొడ్డి కామేష్, ఎస్‌.పరమేష్, ఎస్‌.వి.కె అప్పారావు పనిచేస్తున్నారు. దాడి లక్ష్మణ్, భీశెట్టి గోపాల్, ఆడారి సోమునాయుడు, దొడ్డి ఉమ, ఎస్‌.చంటి, కోరుబిల్లి శ్రీను, దొడ్డి తేజ, పి.పవన్‌ ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌లో సహాయకులుగా ఉన్నారు.
హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌కు దాడి శంకర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.
హీరో బాలకృష్ణకు దొడ్డి నిరంజన్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.
లైట్‌మెన్లుగా 20 మంది, సెట్, ప్రొడక్షన్‌లో 110 మంది, మేకప్‌ డిపార్ట్‌మెంట్‌లో 15, కెమెరా అసిస్టెంట్లుగా నలుగురు పనిచేస్తున్నారు.

సంతోషంగా ఉంది 
గ్రామంలో సుమారు 1,925 మంది జనాభా ఉంటారు. అధిక సంఖ్యలో గ్రామస్తులు సినీ పరిశ్రమలో పని చేస్తుండటం సంతోషంగా ఉంది. వీరంతా పండగలు, శుభకార్యాలకు గ్రామానికి వస్తుంటారు. ఆ సమయంలో గ్రామం ఎంతో సందడిగా ఉంటుంది. మా అన్నయ్య వెంకట కోటి సూర్యనారాయణ 1998లో చిత్ర పరిశ్రమలో పని చేసేందుకు హైదరాబాద్‌ వెళ్లారు. ఆయన ఎంతో మందిని సినీ ఇండస్ట్రీకి తీసుకెళ్లి ప్రోత్సహించారు. అనారోగ్యంతో ఎనిమిదేళ్ల కిందట ఆయన మృతి చెందారు.  
– దాడి కన్నంనాయుడు, గ్రామ పెద్ద, బంగారమ్మపాలెం

బతికున్నంత కాలం సినీ పరిశ్రమలోనే..  
నేను, నా కుమారుడు పోలమరశెట్టి రామకృష్ణ సినీ రంగంలో ఉన్నాం. నేను లైటింగ్‌ విభాగంతో పాటు కెమెరామెన్‌ క్రేన్‌ సహాయకుడిగా పనిచేస్తుంటాను. 2002లో రూ.11 వేలు చెల్లించి యూనియన్‌లో చేరాను. మా అబ్బాయి రామకృష్ణకు ఏడాది కిందట రూ.4లక్షలతో కార్డు చేయించాం. ప్రొడక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నాడు. నాకు బాబు, పాప ఉన్నారు. ఇద్దరికీ వివాహాలు జరిగాయి. నిజం, నాగ, ఒక్కడు, అతడు, సైనికుడు, అతిథి, పౌర్ణమి, పుష్ప, సీతయ్య, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, లక్ష్మీ నరసింహ, మిత్రుడు, ఒక్క మగాడు, గోపాల గోపాల, లక్ష్మీ తదితర 250కి పైగా చిత్రాలకు పనిచేశాను. గ్రామంలో 30 సెంట్ల వరకు భూమి, సొంత ఇల్లు ఉంది. గతంలో వ్యవసాయంతో పాటు వ్యవసాయ కూలి పనులు చేసుకునేవాళ్లం. ఇక్కడ కష్టానికి తగ్గ ఫలితం రాలేదు. ప్రస్తుతం సినిమాలకు పనిచేయడం అలవాటుగా మారిపోయింది. బయట ఏ పని చేసుకోలేను. బతికి ఉన్నంత కాలం ఇదే పరిశ్రమలో కొనసాగుతాను.  
– పొలమర శెట్టి రాము

‘ఇడియట్‌’తో కెరీర్‌ ప్రారంభం 
గ్రామానికి చెందిన దాడి వెంకట సూర్యనారాయణతో 1999లో దొడ్డి రమేష్, సూరిశెట్టి అర్జున్, దాడి శంకర్‌లు వెళ్లారు. వీరు ముగ్గురూ హెల్పర్లుగా పనిచేస్తూ.. యూనియన్‌లో చేరారు. 2000లో నేను సినీ పరిశ్రమకు వెళ్లాను. ఆర్ట్‌ డైరెక్టర్‌ సత్య శ్రీనివాస్‌ దగ్గర అప్రెంటీస్‌గా చేరాను. అప్పట్లో నాకు రోజుకు రూ.100 ఇచ్చేవారు. 2002లో పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఇడియట్‌ సినిమాతో అసిస్టెంట్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌గా నా కెరీర్‌ ప్రారంభమైంది.

గౌరమ్మ(నువ్వు నాకు నచ్చావ్‌ కన్నడ రీమేక్‌), విష్ణు సేన(ఠాగూర్‌ కన్నడ రీమేక్‌), అడుగు, మంజీర, వీలైతే ప్రేమిద్దాం, వానవిల్లు, మామ చందమామ, బైలంపూడి సినిమాలకు ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేశాను. ఇడియట్, ఇందిరమ్మ, శివరాం, ఒట్టేసి చెబుతున్నా, అనుమానాస్పదం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, తులసి, జోష్, ఆకాశమంత, వసూల్‌ రాజా, గబ్బర్‌ సింగ్, బాద్‌షా, జనతా గ్యారేజ్, స్పైడర్‌ తదితర చిత్రాలకు అసిస్టెంట్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేశాను. ప్రస్తుతం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా సెట్స్‌పై ఉంది. డార్లింగ్‌ సినిమాకు అరుకులో ఒక పెద్ద సెట్‌ వేశాం. 32 రోజుల పాటు రోజుకు 150 మందితో పని చేశాం. ఇక్కడ 28 రోజుల పాటు షూటింగ్‌ జరిగింది. గబ్బర్‌సింగ్‌కు ఒక బజార్‌ స్ట్రీట్‌ మొత్తం రామోజీ ఫిల్మ్‌ సిటీలో సెట్‌ వేశాం. జనతా గ్యారేజ్‌కు గ్యారేజ్, హౌస్‌ సెట్‌ వేశాం.  
– సూరిశెట్టి ఉత్తర కుమార్‌ 

2000లో సినీ పరిశ్రమకు వెళ్లాను
సినీ పరిశ్రమలో లైట్‌మన్‌గా పనిచేసేవాడిని. తర్వాత కొంత యువకులను సినీ పరిశ్రమకు తీసుకెళ్లాను. ప్రస్తుతం గ్రామం నుంచి చాలా మంది యువకులు సినీ రంగానికి వెళ్లి.. అక్కడే స్థిరపడ్డారు. నేను సినీ పరిశ్రమ నుంచి తిరిగి వచ్చేసి గ్రామంలోనే ఉంటున్నాను. నాకు ఇప్పటికీ లైటింగ్‌ యూనియన్‌ గుర్తింపు కార్డు ఉంది.  
– కిల్లి చినసత్యనారాయణ  

తొలిరోజుల్లో నా జీతం రూ.170
నేను, నా తమ్ముడు భాస్కరరావు సినీ రంగంలోనే ఉన్నాం. 2002 ఆగస్టులో గ్రామంలో తెలిసిన వారు సినీ పరిశ్రమకు వెళ్తుండటంతో.. వారితో కలసి వెళ్లాం. ప్రస్తుతం నేను లైటింగ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాను. అప్పట్లో యూనియన్‌లో చేరేందుకు కార్డు కోసం రూ.10 వేలు కట్టాను. ప్రస్తుతం యూనియన్‌లో చేరాలంటే రూ.లక్ష చెల్లించాలి. మొదటిసారి జూనియర్‌ ఎన్టీఆర్‌ నాగ సినిమాకు పనిచేశాను. ఆ సినిమా కోసం కేరళలో ఓ పాట చిత్రీకరించారు. యూనిట్‌ సభ్యులతో కలిసి అక్కడకు వెళ్లడం ఎంతో అనుభూతిని మిగిల్చింది. సినిమాలో పనిచేసిన కొత్తలో రోజుకు రూ.170 ఇచ్చేవారు. ప్రస్తుతం రూ.1,100 ఇస్తున్నారు. హైదరాబాద్‌లో స్థిరపడి.. అద్దె ఇంట్లోనే నెట్టుకొస్తున్నాను. పిల్లలు రామచరణ్‌ 6వ తరగతి, లక్షయ్‌ కుమార్‌ 5వ తరగతి చదువుతున్నారు. పుష్ప, సైరా, సరిలేరు నీకెవ్వరు, బ్రహ్మోత్సవం, అర్జున్‌ సురవరం, ఒక్కడు, నిజం తదితర 200 చిత్రాలకు పైగా పనిచేశాను. గ్రామంలో భూమి లేదు. సొంత ఇల్లు ఉంది. పండగలు, శుభకార్యాలకు కుటుంబ సభ్యులమంతా గ్రామానికి వస్తుంటాం. కొన్ని రోజులు ఇక్కడ గడిపి మళ్లీ హైదరాబాద్‌ వెళ్లిపోతాం.  
– బత్తిన నాగసూరి అప్పారావు   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement