జరిగిన ఘోరంతో కుప్పకూలిన తోటి స్నేహితులు
విశాఖపట్నం, ఎస్.రాయవరం (పాయకరావుపేట): కేరింతలు కెరటాల్లా ఎగసిపడ్డాయి.. ఉల్లాసం వెల్లువ కాగా మిత్రులంతా ఆనంద తాండవం చేశారు.. స్నేహితుడి ఊరిలో ఉత్సవం చూద్దామని వేరే జిల్లాల నుంచి వచ్చిన అతని సహ విద్యార్థుల ఉత్సాహం ఎంతో సేపు నిలవలేదు. అంతవరకు తమతో జలకాలాడిన ఇద్దరు సహచరులు అంతలోనే గల్లంతు కావడం వారిని తీవ్ర విషాదంలో ముంచింది. రాత్రికి సంఘటన స్థలానికి చేరుకున్న యువకుల కుటుంబ సభ్యుల శోకానికి అంతేలేదు. తమ పిల్లలు క్షేమంగా తిరిగొస్తారో లేదోనన్న బెంగ వారిని కుంగదీస్తోంది.
రాజమండ్రిలో ఫార్మడీ (డాక్టర్ ఆఫ్ ఆర్గనేషన్) ఫైనల్ ఇయర్ చదువుతున్న 12 మంది విద్యార్థులు బంగారమ్మపాలెంలో వల్లభేశ్వరస్వామి తీర్థ మహోత్సవాన్ని చూద్దామని వచ్చారు. రాజమండ్రిలో చదువుతున్న ఈ గ్రామానికి చెందిన సూరాడ నూకరాజు మిత్రులు వారు. వీరంతా ఆదివారం గ్రామానికి సమీపంలో ఉన్న బీచ్‌కు వెళ్లారు. వీరి లో ఎస్.కె.హిమా మ్, జి.అవినాష్, ప్రసన్న అనే విద్యార్థులు స్నానానికి దిగా రు. పెద్ద కెరటం రావడంతో తూ ర్పుగోదావరి జి ల్లా కొవ్వూరుకు చెందిన హిమా మ్ (20), పిఠాపురానికి చెందిన అవినాష్ (24) మునిగిపోయా రు. ఇది గమనించిన గుంటూరు జిల్లా నరసారావుపేటకు చెందిన ప్రసన్న వెనక్కి వచ్చి ఒడ్డున ఉన్న తోటి స్నేహితులకు సమాచారం అందించేలోపే వారు గల్లంతయ్యారు. హుటాహుటిన వచ్చిన గ్రామస్తులు తెప్పల్లో గాలించినా ప్రయోజనం లేకపోయింది. ఎస్‌ఐ కుమార్‌స్వామి తీరం వెంబడి సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడటంతో సోమవారం ఉదయం మళ్లీ గాలింపు చర్యలు ప్రారంభిస్తామని చెప్పారు.
ఉలిక్కిపడ్డ బంగారమ్మపాలెం
బంధువులు, స్నేహితులలో ఆనందంగా పండగ జరుపుకుంటున్న బంగారమ్మపాలెం గ్రామస్తులు ఈ ఘటనతో విషాదంలో మునిగిపోయారు. దశాబ్దాలుగా పండగ రోజున ఎలాంటి అపశ్రుతి దొర్లలేదని, ఇలా ఎందుకు జరిగిందని మధనపడుతున్నారు. విషయం తెలిసిన వెంటనే ఇక ఉత్సవంలో ఉత్సాహంగా గడపలేకపోయారు. నాలుగున్నరేళ్లుగా రాజమండ్రిలో హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న వివిధ ప్రాంతాలకు చెందిన మిత్రులు వచ్చి ఇలా విషాదంలో చిక్కుకోవడం వారిని కలచివేసింది.
ఇంటికి పెద్ద కొడుకు అవినాష్
ఈ దుర్ఘటనలో గల్లంతైన అవినాష్ కుటుంబానికి పెద్ద కుమారుడు. ఇటీవల ఆయన తండ్రి గుండెపోటుతో మృతి చెందారు. అవినాష్‌కు ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు అక్క చెల్లెళ్లు ఉన్నారు. మరికొద్ది నెలల్లో చదువు పూర్తి చేసుకొని అండగా ఉంటాడనుకున్న అతని కుటుంబ సభ్యులు ఈ ప్రమాదంతో కుప్పకూలిపోయారు. గల్లంతైన మరో యువకుడు హిమామ్ ఫార్మడీ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఇతను కుటుంబంలో రెండో కుమారుడని తోటి స్నేహితులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment