సాక్షి, డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): ‘మా కోసం వెతక్కండి.. మేము మా కాళ్ల మీద బతకాలని దూరంగా వెళ్లిపోతున్నాం.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు.. మా బతుకు కోసం వెళ్తున్నాం.. అలా అని అబ్బాయిలతో వెళ్తున్నాం అని ఎక్కువగా అనేసుకోకండి. కేవలం మేము పైకి ఎదగడానికి మాత్రమే వెళ్తున్నాం. మమ్మల్ని వెతక్కండి. మేము ఎక్కడున్నా సరే మీ గురించే ఆలోచిస్తాం. మేము మంచి పొజిషన్‌కు వచ్చాక మేమే మీ దగ్గరకు వస్తాం..’అంటూ ఓ లేఖ రాసి నలుగురు పదో తరగతి విద్యార్థినులు బుధవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన ఘటన నగరంలో కలకలం రేపింది.
ఆ బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి.. నగరమంతా గాలించారు. చివరకు గాజువాకలో నలుగురు బాలికలను గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చడంతో కథ సుఖాంతమైంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పాత నగరంలోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న నలుగురు బాలికలు బుధవారం సాయంత్రం పాఠశాల నుంచి నేరుగా ఇంటికి వెళ్లారు.
చదవండి: (Vizag: మా కోసం వెతకొద్దు.. నలుగురు టెన్త్ క్లాస్ అమ్మాయిలు మిస్సింగ్..)
యూనిఫాం మార్చుకుని, సివిల్ డ్రెస్‌లో ట్యూషన్‌కు వెళ్తున్నామని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చి నలుగురూ కలిసి వెళ్లిపోయారు. ట్యూషన్‌కు వెళ్లిన పిల్లలు రాత్రి 10 గంటలు దాటినా ఇళ్లకు చేరుకోకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయం నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ దృష్టికి వెళ్లింది. వెంటనే సీపీ స్పందించి ఏడీసీపీ శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఐదు బృందాలుగా పోలీసులను నియమించి గాలింపు చర్యలు చేపట్టారు.
అర్ధరాత్రి వేళ వెళ్లిన నలుగురు విద్యార్థినులను సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. దీని ఆధారంగా వివరాలు సేకరించారు. మరో వైపు ఆ నలుగురి బాలికల ఫొటోలను వలంటీర్ల గ్రూపులో పెట్టారు. బాలికలు నలుగురూ గురువారం మధ్యాహ్నం గాజువాకలో ఓ బంగారు దుకాణం వద్దకు వెళ్లారు. వారి వద్ద ఉన్న బంగారు వస్తువులు అమ్మి, వచ్చిన డబ్బులతో ఎక్కడికైనా వెళ్లిపోదాం అనుకున్నారు. వివిధ వాట్సప్ గ్రూపుల్లో వారి ఫొటోలను గమనించిన ఆ దుకాణ యజమాని.. పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు అక్కడికి వెళ్లి విద్యార్థినులకు కౌన్సిలింగ్ నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment