అయ్యో తల్లీ.. అదితీ..
- 8 రోజుల నిరీక్షణ విషాదాంతం
- దిబ్బలపాలెం తీరంలో చిన్నారి మృతదేహం గుర్తింపు
సాక్షి, విశాఖపట్నం/పూసపాటిరేగ: తమ కంటిపాప క్షేమంగా తిరిగొస్తుందన్న ఆ కుటుంబం ఆశ అడియాస అయ్యింది. ఎనిమిది రోజులుగా నిరీక్షించిన వారికి నిస్పృహే మిగిలింది. చిన్నారి అదితి విగతజీవిగా కనిపించింది. అందరిలోనూ విషాదాన్ని నింపింది. విశాఖపట్నంలో సెప్టెంబర్ 24న ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడి గల్లంతైన ఆరేళ్ల చిన్నారి అదితి విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బలపాలెం తీరంలో విగతజీవిగా కనిపించింది.
తీరంలో ఓ చిన్నారి మృతదేహాన్ని స్థానికులు గురువారం సాయంత్రం గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అదితి తండ్రి శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శవం తమ పాపదేనని గుర్తించి తండ్రి బావురుమన్నారు. తమ గారాల బిడ్డ మృతి చెందిందని తెలియడంతో ఆయన కుప్పకూలిపోయారు.
ప్రార్థనలు ఫలించలేదు...: డ్రైనేజీలో పడి అదితి గల్లంతు కావడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఆ చిన్నారి సజీవంగా తిరిగిరావాలని అందరూ కోరుకున్నారు. ఆమె ఆచూకీ కోసం జీవీఎంసీ, పోలీసు, నేవీ సిబ్బంది ఎనిమిది రోజుల పాటు అహరహం గాలించారు. కానీ అదితి సజీవంగా లేదన్న చేదు నిజంతో ఆ గాలింపు చర్యలకు ముగింపుపడటం అందర్నీ కలచివేసింది. ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడిపోయిన ప్రాంతం నుంచి 40 కి.మీ. దూరంలో మృతదేహం కనిపించింది. అల్పపీడనం ప్రభావంతో ఈశాన్యగాలులు బలంగా వీయడం వల్ల పాప శరీరం భోగాపురం తీరం వరకూ నీటిలో కొట్టుకుపోయి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
గుర్తుపట్టలేని రీతిలో మృతదేహం... :పాప శరీరం గుర్తుపట్టలేని రీతిలో ఉండటంతో దుస్తులు, చెవిదుద్దుల ఆధారంగా గుర్తించారు. సీఐ విద్యాసాగర్, ఎస్‌ఐ నాగేశ్వరరావులు ఆ మృతదేహం అదితిదేనని ఆమె తండ్రి శ్రీనివాసరావు గుర్తించినట్లు ప్రకటించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. కానీ అదితి ఇక లేదన్న దుర్వార్త ఆమె కుటుంబ సభ్యులకు తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది. ఆ కుటుంబం విషాదంలో కూరుకుపోయింది. అదితి తాత, నాయనమ్మలు స్పృహ తప్పి పడిపోయారు. దాంతో వారిని గురువారం రాత్రి అంబులెన్స్‌లో కేర్ ఆసుపత్రికి తరలించారు.