మాంబట్టులో ఇసుక డంపుల స్వాధీనం
మాంబట్టులో ఇసుక డంపుల స్వాధీనం
Published Mon, Oct 10 2016 1:44 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
మాంబట్టు(తడ): తమిళనాడుకు తరలించేందుకు నిల్వ చేసిన ఐదు ఇసుక డంపులను రెవెన్యూ, పోలీస్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. సేకరించిన సమాచారం మేరకు మాంబట్టుకు చెందిన ఓ రాజకీయ నాయకుడు మాంబట్టు, గుర్రాలమిట్ట మధ్యలో చెరువు కట్ట సమీపంలో భారీ ఎత్తున ఇసుక నిల్వ చేసినట్టు జిల్లా ఎస్‌పీకి సమాచారం అందింది. ఈ మేరకు ఎస్‌పీ ఆదేశాలతో ఎస్‌ఐ సురేష్‌బాబు, వీఆర్‌ఓ రాజగోపాల్ దాడులు నిర్వహించడంతో భారీ నిల్వలు వెలుగులోకి వచ్చాయి. ఐదు డంపుల్లో దాదాపు 300 ట్రిప్పుల వరకు ఇసుక ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. పట్టుబడ్డ ఇసుకను అధికారులు సీజ్ చేశారు. స్థానికంగా పాములకాలువలో లభించే ఇసుకతోపాటు సూళ్లూరుపేట తదితర ప్రాంతాల నుంచి తీసుకు వచ్చే ఇసుకను గతంలో మాంబట్టు ప్రాంతంలో నిల్వ చేసి స్థానిక పరిశ్రమలకు విక్రయించే సాకుతో చిత్తూరు జిల్లా సరిహద్దుల మీదుగా తమిళనాడుకు తరలించేవారు. నాయకులు కావడంతో అధికారులు సైతం వీరికి సహకరించేవారు. దీనిపై స్థానికులు నాలుగు నెలల క్రితం సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు ఫిర్యాదు చెయ్యడంతో అప్పట్లో ఆయన గ్రామానికి చేరుకుని నిల్వలను తహసీల్దార్‌కి పట్టించారు. అప్పటి నుంచి కొంత అప్రమత్తం అయిన నాయకులు నిల్వ చేసే ప్రాంతాన్ని వేరే చోటుకి మార్చి అక్కడి నుంచి తరలిస్తూ వస్తున్నారు. ఈ అక్రమ రవాణాపై స్థానిక అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో విషయాన్ని ఎస్‌పీ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం పట్టుబడ్డ నిల్వలను కూడా భారీగా తగ్గించి చూపే ప్రయత్నం సాగిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Advertisement