కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం
అక్కంపేట (తడ) : బైక్‌పై రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన మండలంలోని అక్కంపేట వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. ఎస్‌ఐ సురేష్‌బాబు సమాచారం మేరకు.. మధ్యప్రదేశ్ మురానా జిల్లా గడియా గ్రామానికి చెందిన శశికాంత్ శర్మ(40) అక్కంపేట సమీపంలో అండగుండాల మార్గంలో నిర్మిస్తున్న జైన్ మందిరం వద్ద పనికి వచ్చాడు. మందిరంపై బొమ్మలు చెక్కడంలో సిద్ధహస్తుడైన శర్మ ఏడాది క్రితం ఇక్కడే ఉంటూ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం తన సహచరుడితో కలిసి బైక్‌పైS కూరగాయలు, ఇతర సామగ్రి కొనుగోలు కోసం అక్కంపేటకు వచ్చాడు. అక్కంపేట మలుపు వద్ద మధ్యలో చెన్నై వైపు వెళ్తున్న వాహనాలను చూసి ఓ మారుతి కారు నిలిచి ఉంది. అవతల వచ్చే వాహనాలను గమనించని బైక్ నడుపుతున్న వ్యక్తి రోడ్డుపై కొంత ముందుకు వెళ్లాడు. గూడూరు నుంచి చెన్నై వైపు వెళ్తున్న స్కార్పియో కారు వేగంగా రావడం చూసి వెనుక కూర్చున్న శర్మ ఆందోళనతో కిందకు దిగి ముందుకు, వెనక్కు ఒకటి రెండు అడుగు వేసే క్రమంలో శర్మను ఢీకొంది. దీంతో శర్మ కారు బానెట్‌పై పడిపోయాడు. స్కార్పియో రోడ్డు మలుపు మధ్యలో ఆగి ఉన్న మరో కారు ముందు భాగం ఢీకొని డివైడర్ ఎక్కి కొంత దూరం వెళ్లి నిలిచింది. కారు ఢీకొనడంతో శర్మ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్టు తోటి సిబ్బంది తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.