కళతప్పిన పులికాట్!
-
సరస్సు నిండా ఉప్పునీరు
-
వర్షం నీళ్లు కలవక పెరగని మత్స్య సంపద
-
వేటలేక దిక్కుతోచని స్థితిలో మత్స్యకారులు
-
నవంబర్ వచ్చినా కనిపించని పక్షుల ఆందాలు
విదేశీ పక్షుల విన్యాసాలు.. వాటికి అందాలు అద్దుతూ సాయంత్ర సమయంలో సరస్సుపై ప్రసరించే భానుడి కిరణాలు.. పరవశింపచేసే ప్రకృతి.. హలెస్సా.. అంటూ మత్స్యకారులు సాగించే చేపటల వేట దృశ్యాలు.. ఇవన్నీ పులికాట్‌లో సాక్ష్యాత్కారమయ్యే కమనీయ దృశ్యాలు.. అంతటి అందమైన సరస్సు కళతప్పుతోంది.. వెరసి మత్స్యకారులు.. పర్యాటలకు నిరాశను నింపుతోంది.
తడ:
తడ మండలానికి తలమానికంగా, వేలాది మంది మత్స్యకారులకు అన్నదాతగా, దేశ విదేశీ పక్షులకు ఆహార భాండాగారంగా ఉండే పులికాట్ సరస్సు ప్రస్తుతం కళతప్పుతోంది. తన రూపు రేఖలని కోల్పోతూ ఆందోళన కలిగిస్తోంది. పాలకుల నిర్లక్ష్యం, ప్రకృతి కన్నెర్ర చేయడంతో తన సహజ గుణాన్ని కోల్పోతూ నిర్జీవంగా మారే పరిస్థితికి చేరుకుంది.
భిన్నమైన పరిస్థితుల్లో పెరిగే మత్స్యసంపద
పులికాట్ సరస్సులో పెరిగే చేపలు, రొయ్యలు, పీతలు భిన్నమైన వాతావరణంలో పెరుగుతాయి. ఉప్పునీరు, మంచి నీరు కలగలిసి ఉండే వాతావరణంలో మాత్రమే ఇవి వేగంగా వృద్ధి చెందుతాయి. పులికాట్‌లో మాత్రమే లభించే మొయ్యలు, తుళ్లులు, కోలాసులు వంటి చేపలతోపాటు రొయ్యలు, పీతలు కూడా ఎంతో రుచికరంగా ఉంటాయి. ఉప్పు శాతం 30కి పైగా ఉండే అచ్చం ఉప్పు నీళ్లు మాత్రమే ఉంటే ఈ చేపలు, రొయ్యలు వృద్ధి చెందవు. ఉప్పు నీటితోపాటు వర్షాల వల్ల వచ్చే నీటి పారుదల కూడా కలిసినప్పుడే గుడ్లు పిగిలి కొత్త పిల్లలు వృద్ధి చెందుతాయి. ఈ కారణంతోనే ప్రస్తుతం సముద్రపు నీళ్లు పులికాట్ నిండా చేరినా వర్షపు నీళ్లు లేకపోవడంతో చేపలు, రొయ్యలు వృద్ధి చెందలేదు.
పూడిపోయిన ముఖద్వారాలు
సముద్రపు నీటిని పులికాట్ సరస్సుతో కలిపి సముద్రం, సరస్సు మధ్య నీటితోపాటు మత్స్య సంపద రాకపోకలకు అనువుగా ఉండే ముఖద్వారాలు చాలా కాలంగా పూడిపోతూ వస్తున్నాయి. వీటిని తెరిపించేందుకు చేసిన విన్నపాల మేరకు అధికారులు కాస్త హడావుడి చేసినా ప్రస్తుతం అది మరుగున పడిపోయింది. దీంతో సముద్రం నుంచి పులికాట్‌కి ఉన్న సంబంధం చెడుతూ వస్తోంది. దీని వల్ల మత్స్యసంపదకు అనువైన మడచెట్లు అంతరించిపోయి, వాతావరణం దెబ్బతిని పిల్లల ఉత్పత్తికి వాతావరణం అనుకూలంగా లేకుండా పోయింది. దీంతో పలు రకాల మత్స్య జాతులు పునరుత్పత్తి లేక అంతరించిపోయే ప్రమాదంలో పడ్డాయి.
ఉపాధి కోల్పోతున్న జాలర్లు
నవంబర్ మాసంలో ఎక్కడ వల వేసినా చేపలు, రొయ్యలు పుష్కలంగా లభించేవి. చేతినిండా సొమ్ము చేసుకోవాల్సిన సమయంలో కనీసం బువ్వకు కూడా చేపలు దొరకని పరిస్థితి మత్స్యకారులను ఆందోళనకు గురిచేస్తోంది. సరస్సుని నమ్ముకుని మండలంలోని 17 కుప్పాలకు చెందిన వేలాది మంది జాలర్లు జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.
నవంబర్ వచ్చినా కనిపించని పక్షుల జాడ
అక్టోబర్ వచ్చిందంటే ఫ్లెమింగోలు, ఇతర బాతు జాతి పక్షులు పులికాట్‌లో సందడి చేస్తూ పర్యాటకులను ఆకట్టుకోవడం ఆనవాయితీ. కానీ ఈ ఏడాది నవంబర్ మొదటి వారం ముగుస్తున్నా ఇంతవరకు ఒక్క పిట్టకూడా ఇక్కడ వాలలేదు. దేశ విదేశాల నుంచి ఆహారం కోసం అక్టోబర్‌లో పులికాట్ వచ్చి నేలపట్టులో సంతాన ఉత్పత్తి చేసుకుని మార్చి నెలకల్లా పిల్లలతో కలిసి తమ స్వస్థలాలలకు పయనమవుతాయి. కానీ పక్షులు అన్నీ ఒకేసారి రాకుండా తమ రాకకు ముందే కొన్ని పైలెట్ పక్షులను ఇక్కడికి పంపి అవి సంకేతాలు ఇస్తేనే మిగిలినవి ఇక్కడకు చేరుకుంటాయి. కానీ ప్రస్తుతం ఇక్కడ ఆహారం అదుబాటులో లేకపోవడంతో పక్షులు ఒక్కటి కూడా ఇక్కడ కనిపించడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే అందమైన విహంగాల విన్యాసాలు చూసే భాగ్యం కోల్పోవడం జరుగుతుంది. ఫ్లెమింగోల కోసం ఏర్పాటు చేసే పండగను ఆనందంగా కాకుండా విషాదంగా జరుపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.