రక్షకులే..భక్షకులు
-
వానపాముల అక్రమ రవాణాలో ఇంటి దొంగలు
-
పడవల్లో తమిళనాడుకు తరలింపు
-
తల్లి రొయ్యలకు ఆహారం
సూళ్లూరుపేట: పులికాట్ సరస్సును రక్షించాల్సిన సిబ్బందే భక్షకులుగా మారారు. వానపాముల తరలించే వారితో వైల్డ్‌లైప్ కిందిస్థాయి సిబ్బంది సత్సంబంధాలు ఏర్పరచుకుని ఈ వ్యాపారంలో భాగస్తులుగా మారారు. గుర్తు తెలియని వ్యక్తులు వానపాములు వస్తున్నాయని సమాచారం ఇస్తే తప్ప దాడులు చేసే పరిస్థితి లేదు. దీంతో వానపాముల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. వేనాడు, ఇరకం దీవుల్లో తీసిన వానపాములను పడవల ద్వారా తమిళనాడుకు తరలించి అక్కడ నుంచి కార్లలో విజయవాడ, ఒంగోలు, గుంటూరు, నెల్లూరులోని రొయ్యల హేచరీలకు తరలిస్తున్నారు. వానపాములను తల్లి రొయ్యలకు ఆహారంగా ఉపయోగిస్తున్నారు.
కేసుల నమోదు లేదు
వన్యప్రాణి విభాగ శాఖ సిబ్బంది అక్రమసంపాదనకు అలవాటు పడి కేసులు నమోదు చేయకుండా కాంపౌండ్ ఫీజు మాటు న లక్షల రూపాయలు అపరాధం విధించి స్మగ్లర్లను వదిలేస్తున్నారు. దీంతో ఈ వ్యాపారాన్ని అదుపు చేయలేని పరిస్థితి నెలకొంది. పులికాట్‌లో సహజసిద్ధంగా ఏర్పడే మత్స్యసంపద అభివృద్ధికి మేలు చేసే వానపాములను ఇబ్బడి ముబ్బడిగా అక్రమ రవాణా చేసే వారికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. వానపాము తవ్వకాలకు వేనాడు, వాటంబేడు, ఇరకం కేంద్రాలుగా ఉన్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో వైల్డ్‌లైప్ బీట్ ఆఫీసర్ సెక్షన్ ఉంది. పులికాట్‌సరస్సును రక్షించాల్సిన సిబ్బందే భక్షిస్తున్నారు.
పట్టుబడిన స్మగ్లర్లే మళ్లీ అక్రమ రవాణా
పులికాట్ వన్యప్రాణి సంరక్షణ విభాగంలో వానపాములకు సంబంధించి ఎలాంటి చట్టం లేకపోవడంతో పట్టుబడిన స్మగ్లర్లే మళ్లీ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. దీనికి ప్రత్యేక చట్టం చేయాలని సూళ్లూరుపేట కార్యాలయం నుంచి లేఖ పంపించినా జిల్లా అటవీశాఖ కార్యాలయంలో ఎలాంటి స్పందనా లేదు. కాగా సరస్సు గర్భాన్ని తవ్వి తీస్తున్న వానపాములకు ప్రత్యేక చట్టమేదీ అవసరం లేదని, పులికాట్ సరస్సులో తవ్వకం జరిపినా, అందులోని జీవజాలాన్ని అక్రమంగా తరలించినా నేరమే అయినప్పటికీ చట్టం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని పర్యావరణవేత్తలు అంటున్నారు.
వెనామీ రాకతో..
టైగర్ రొయ్యలు పెంపకం ఉన్నపుడు వానపాముల అవసరం ఉండేది కాదని, ఇప్పుడు వెనామీ రొయ్యల పెంపకం రాగానే వానపాముల అవసరాన్ని గుర్తించారు. వీటిని ఎంతకైనా కొనుగోలు చేసేందుకు హాచరీల యాజమాన్యాలు ముందుకొస్తుండడంతో వీటిని తరలించే వారి సంఖ్య ఎక్కువైంది.
ఫారెస్ట్ యాక్ట్‌ను ప్రవేశపెట్టాం –చంద్రశేఖర్, డీఎఫ్‌ఓ
పులికాట్ సరస్సునుంచి వానపాములు తీసి తరలించే వారి సంఖ్య ఎక్కువగా ఉన్న విషయం వాస్తవమే. బీట్ సిబ్బంది దాడులు చేసేలోపు వానపాములు తీసేవారు తప్పించుకుని వెళుతున్నారు. అందుకే తీసేవారిపై దృష్టి మానేసి తరలించే వారిని అదుపు చేసేందుకు ఫారెస్ట్ యాక్ట్‌ను ప్రవేశపెట్టాం. అక్రమ రవాణా చేసేవారి పట్టుబడితే కిలో వానపాములకు రూ.వెయ్యి కాంపౌండ్ ఫీజు, దీనికి ఐదు రెట్లు అపరాధ రుసుం వసూలు చేస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో రూ.6.5 లక్షలు, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా రూ.3.5 లక్షలు వసూలు చేశాం. పట్టుబడినవారిపై కేసులు నమోదు చేసేందుకు ప్రభుత్వానికి రెకమెండ్ చేసి ఉన్నాం. ఈ రవాణాలో మా శాఖలో కిందస్థాయి సిబ్బంది ప్రమేయంపై కూడా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాం.