
భర్త, ఇద్దరు స్మగ్లర్లు, బంగారం
వ్యాపారులు, ఓ మంత్రి !
బనశంకరి: నటి రన్య రావు పెంపుడు తండ్రి, రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్థ డీజీపీ రామచంద్రరావు చిక్కుల్లో పడ్డారు. రన్యకు బెంగళూరు విమానాశ్రయంలో ప్రోటోకాల్ ఇవ్వడం గురించి విచారణ చేపట్టి వారంలోగా నివేదిక అందించాలని హోంశాఖను సర్కారు ఆదేశించింది. బంగారం స్మగ్లింగ్ లో ఆయన కుమ్మక్కయ్యారా, ప్రోటోకాల్ దుర్వినియోగానికి పాల్పడడం వెనుక ఆయన హస్తం ఉందా అనే దానిపై వారంలోగా విచారణ చేపట్టి నివేదిక అందించాలని ఆదేశించింది. నటి రన్య తన ప్రయాణాల్లో రామచంద్రరావు పేరును విరివిగా వాడుకున్నారు. రన్య కేసు శాసనసభ సమావేశాల్లో తీవ్ర చర్చకు రావడం తెలిసిందే. ప్రభుత్వం ఏం చేస్తోందంటూ ప్రతిపక్ష బీజేపీ మండిపడడంతో ప్రభుత్వం ఇరుకునపడింది.
రన్య ప్రోటోకాల్‌పై నివేదిక
మరోపక్క రన్య రావు ప్రోటోకాల్ దుర్వినియోగం పట్ల పోలీస్ కమిషనర్ దయానంద్‌కు డీసీపీ నివేదిక అందజేశారు. రన్య రావ్ అరెస్టైనరోజు ప్రోటోకాల్‌లో ఉన్న కానిస్టేబుల్ బసవరాజుకు ఆమె కాల్ చేసి విమానాశ్రయంలో టెరి్మనల్ వన్ వద్దకు రావాలని తెలిపింది. ఇప్పుడు రాలేను మేడం, వేరే ఆఫీసర్ వస్తున్నారు, రిసీవ్ చేసుకోవాలి అని బసవరాజు చెప్పాడు. నువ్వే రావాలి లేకపోతే, అప్పాజీ కి చెబుతానని రన్య హెచ్చరించినట్లు నివేదికలో ప్రస్తావించారు.
పోలీస్ స్టిక్కర్ వాడొద్దు: హోంమంత్రి
దొడ్డబళ్లాపురం: పోలీసులు, వారి కుటుంబ సభ్యులు సొంత వాహనాలపై పోలీస్ అనే స్టిక్కర్లు వేసుకోవడం మామూలే. ఇది ఏ మాత్రం మంచిది కాదని, ఇది కచ్చితంగా చట్టాన్ని , నిబంధనలను ఉల్లంఘించడమేనని హోంమంత్రి పరమేశ్వర్ చెప్పారు. 2022 ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇలా స్టిక్కర్‌లు వేసుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని మంగళవారం అసెంబ్లీలో చెప్పారు. శ్రవణబెళగోళ ఎమెల్యే సీఎస్ బాలక్రిష్ణ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు తెలిపారు.
రన్య అరెస్టు వెనుక...
బనశంకరి: బంగారం దొంగరవాణా కేసులో నటి రన్య రావు పట్టుబడటం వెనుక ఆమె భర్త, ఢిల్లీలో అరెస్టైన ఇద్దరు స్మగ్లర్లు, పలువురు పెద్దలు ఉన్నట్లు తెలిసింది. ఇటీవల జతిన్ హుక్కేరి అనే వ్యక్తితో రన్యకు బెంగళూరులో ఆర్భాటంగా వివాహం జరిగింది. కానీ వారి మధ్య గొడవలు వచ్చాయి. రన్య పదేపదే విదేశాలకు వెళ్లడం గురించి భర్త ప్రశ్నించేవాడు. ఆయనే డీఆర్‌ఐకి సమాచారం ఇచ్చాడని తెలుస్తోంది. కొన్నిరోజుల కిందట ఢిల్లీలో డీఆర్‌ఐ అధికారులకు ఇద్దరు స్మగ్లర్లు దొరికారు. రన్య అనే యువతి కూడా బంగారం దొంగ రవాణా చేస్తోందని ఉప్పందించారు. దీంతో ఢిల్లీ నుంచి బెంగళూరు డీఆర్‌ఐ విభాగానికి అలర్ట్ వచ్చింది. 3వ తేదీ రాత్రి రన్య బెంగళూరు విమానాశ్రయంలో దిగగానే అదుపులో తీసుకున్నారు. రన్య అంటే పడని బంగారు వ్యాపారులు, ఓ మంత్రి కూడా సమాచారం ఇచ్చారని ప్రచారం సాగుతోంది.
28 సార్లు విదేశీ ప్రయాణం
నటి రన్య కేసులో తరుణ్‌రాజు అనే వ్యక్తి అరెస్టు కావడం బెంగళూరులో చర్చనీయాంశమైంది. రన్య వెనుక తరుణ్‌రాజు ఉన్నాడని తెలుస్తోంది. బెంగళూరు కు బంగారం తెప్పించి హవాలా ద్వారా దుబాయికి డబ్బు పంపించేవారు. రన్య ఖర్చులన్నింటినీ తరుణ్‌రాజు చూసుకునేవాడు. ఐపీఎస్ అధికారి కూతురు కావడంతో రన్య ద్వారా సులభంగా బంగరాన్ని తెప్పించవచ్చని గుర్తించాడు. రన్య ఒక ఏడాదిలో 28 సార్లు విదేశీ పర్యటనలు చేసింది. గత 15 రోజుల్లో నాలుగుసార్లు దుబాయ్‌కి వెళ్లి వచ్చింది. ఐదోసారి దుబాయ్‌కి వెళ్లి వస్తుండగా జాతకం మారిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment