ఆహ్లాదం.. ఆనందం | Safety Sand Bags For Pulicat Lake SPSR Nellore | Sakshi
Sakshi News home page

ఆహ్లాదం.. ఆనందం

Published Sat, Feb 22 2020 12:04 PM | Last Updated on Sat, Feb 22 2020 12:04 PM

Safety Sand Bags For Pulicat Lake SPSR Nellore - Sakshi

మీజూరు చెక్‌డ్యాం వద్ద విదేశీ విహంగాలు

నెల్లూరు, దొరవారిసత్రం: మండల పరిధిలోని తీర గ్రామాల సమీపంలో పులికాట్‌ సరస్సులోకి వర్షపునీరు కలిసిపోకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో చెక్‌డ్యాంల వద్ద వర్షపునీరు నిల్వ చేరి ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.మీజూరు, వేలికాడు గ్రామాల వద్ద మూడు చెక్‌డ్యాంల నిర్మాణానికి గతంలో శ్రీకారం చుట్టారు. అయితే ఈ పనులు పూర్తి కాలేదు. దీంతో దొరవారిసత్రం, సూళ్లూరుపేట, నాయుడుపేట తదితర మండల ప్రాంతాల్లో కురిసిన వర్షపునీరు పులికాట్‌ సరస్సులో కలిసిపోయేది. ఈక్రమంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీయ్య చొరవ తీసుకున్నారు. ఇరిగేషన్‌ అధికారులతో మాట్లాడారు. కొంతకాలం క్రితం మీజూరు, వేలికాడు ప్రాంతాల్లో అసంపూర్తిగా ఆగిపోయి ఉన్న చెక్‌డ్యాంల వద్ద ఇసుక బస్తాలతో రింగ్‌ బడ్‌లను వేసేవిధంగా చర్యలు తీసుకున్నారు. అధికారులు రింగ్‌ బడ్‌లు వేయించడంతో వర్షపునీరు పులికాట్‌ సరస్సులో పూర్తిస్థాయిలో కలిసిపోకుండా నిల్వ చేరింది. దీంతో దొరవారిసత్రం, సూళ్లూరుపేట మండల ప్రాంతాల్లో పలువురు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిల్వ చేరిన నీటిలో పశువులు సేద తీరుతున్నాయి. వాటికి తాగునీటి సమస్య తీరిందని చెబుతున్నారు. కాగా విదేశీ విహంగాలు నీటిలో చేపలను వేటాడుతూ చూపరులకు కనువిందు చేస్తున్నాయి. అనేకమంది చెక్‌డ్యాంల వద్దకు వచ్చి పరిసరాలను చూసి ఆనందిస్తున్నారు.

ఓ వైపు మంచినీరు
తీర గ్రామాల రోడ్డుకు పడమర వైపున మంచినీరు, తూర్పున పులికాట్‌ సరుస్సులో ఉప్పునీరు ఉంది. దొరవారిసత్రం, సూళ్లూరుపేట మండల తీర ప్రాంతాల్లో విస్తరించి ఉన్న పులికాట్‌ సరస్సుకు ఆనుకుని ఆర్‌అండ్‌బీ రోడ్డు సుమారు 18 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ రోడ్డే పులికాట్‌ సరస్సులోకి వర్షపునీరు కలిసిపోకుండా ఆనకట్టలా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మీజూరు, వేలికాడు గ్రామాల సమీపంలోని రోడ్డుపై మూడు చెక్‌డ్యాంలను నిర్మించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ చెక్‌డ్యాంలు పూర్తయితే తీర ప్రాంతాల్లో సాగు, తాగునీటి కష్టాలకు శాస్వత పరిష్కారం లభిస్తుంది. చెక్‌డ్యాం పనులు పూర్తి చేయించేందుకు ఎమ్మెల్యే కిలివేటి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అన్ని అనుమతుల తీసుకుని పనులు మొదలు పెట్టించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం చెక్‌డ్యాంలో ఉన్న నీరు తగ్గితే ఏప్రిల్, మే నెలల్లో పనులు మొదలు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఇరిగేషన్‌ అధికారులు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement