ప్రారంభమైన ఫ్లెమింగోల సందడి.. | AP Government Is Gearing Up For The Flamingo Festival In January | Sakshi
Sakshi News home page

పక్షి లోకంలో విహరిద్దాం.. 

Published Thu, Nov 5 2020 10:20 AM | Last Updated on Thu, Nov 5 2020 10:20 AM

AP Government Is Gearing Up For The Flamingo Festival In January - Sakshi

పులికాట్‌ సరస్సుపై ఆహార వేటలో విహరిస్తున్న ఫ్లెమింగోలు

విహంగాల్లో రారాజైన గూడబాతులు (పెలికాన్‌).. ప్రపంచంలోనే అతి అందమైన పక్షులు ఫ్లెమింగోలు.. ఆహార వేటలో ఆకట్టుకునే విన్యాసాలు చేసే నారాయణ పక్షి.. జపం చేసే పెయింటెడ్‌ స్టార్క్స్‌.. చూపరులను ఆకట్టుకునే ఎర్రకాళ్ల కొంగలతో పాటు వందల రకాల అరుదైన పక్షి జాతులు జిల్లాలోని పక్షుల కేంద్రంలో సందడి చేస్తున్నాయి. జీవ వైవిధ్యానికి ప్రతీకగా నిలిచే పులికాట్‌ సరస్సు వేల విదేశీ పక్షుల ఆహార భాండాగారంగా విలసిల్లుతోంది. ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురవడంతో నెల రోజుల ముందు నుంచే జిల్లాలో ఫ్లెమింగోల సందడి ప్రారంభమైంది.  

సాక్షి ప్రతినిధి, నెల్లూరు:  పక్షుల విడిది కేంద్రం నేలపట్టు. జీవ వైవిధ్యానికి నెలవైన ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు పులికాట్‌ విదేశీ వలస విహంగాల విహారంతో అరుదైన ప్రపంచంగా కనిపిస్తోంది. చెరువు నీటిలోని కడప చెట్లపై విడిది చేస్తున్న అతిథుల కిలకిలరావాలు, ఆహార వేటలో సాగించే విన్యాసాలు పక్షి ప్రేమికులను కనువిందు చేస్తున్నాయి. దశాబ్దాలుగా నేలపట్టు విదేశీ పక్షుల సంతనోత్పత్తి కేంద్రంగా భాసిల్లుతోంది. అక్టోబరు మాసం వచ్చిందంటే.. రంగు రంగుల పక్షులు వచ్చి వాలుతుంటాయి. సుమారు ఆరు నెలల పాటు ఇక్కడ విడిది చేసి సంతానోత్పత్తిని పెంచుకుని తిరిగి స్వస్థలాలకు పయనమవుతాయి. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురవడంతో నేలపట్టు చెరువులతో పాటు పులికాట్‌కు నీళ్లు రా వడంతో వలస పక్షులు నెల ముందుగానే చేరు కుని సందడి చేస్తున్నాయి. 

ఒక వైపు నేలపట్టు  చెరువులో విదేశీ వలస విహంగాలు గుడ్లుపెట్టి పొదుగుతుంటే పులికాట్‌ సరస్సులో విహంగాలు ఆహార వేట సాగిస్తూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. 
సూళ్లూరుపేట–శ్రీహరికోట రోడ్డులో పులికాట్‌ సరస్సులో నీళ్లు పుష్కలంగా చేరడంతో ఫ్లెమింగోలు, పెలికాన్స్, పెయింటెడ్‌ స్టార్క్స్‌ గుంపులు గుంపులుగా ఆహార వేటలో దర్శనమిస్తున్నాయి. 
సీగల్స్, చిలువలు, నీటికాకులు, నారాయణ పక్షులతో పాటు వివిధ రకాలకు చెందిన కొంగ జాతులు విపరీతంగా విడిది చేసి ఉన్నాయి.  
నేలపట్టును సంతానోత్పత్తి కేంద్రంగా, పులికాట్‌ సరస్సును ఆహార కేంద్రంగా చేసుకుని పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి.
 

హంసను పోలిన ఫ్లెమింగో  
ప్రపంచంలోనే అందమైన పక్షి ఫ్లెమింగో. ఈ పక్షి హంసను పోలి ఉంటుంది. శాఖాహారి. ఈ రకం పక్షులు అత్యంత అరుదుగా ఉన్నాయి. పులికాట్‌ సరస్సు మీద ఆçహార వేటలో గుంపులు గుంపులుగా చేరి పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తాయి.  
ఈ పక్షులు ఆ్రస్టేలియా, రష్యా, సైబీరియా నుంచి వలస వచ్చి గుజరాత్‌లోని రాణాఫ్‌కచ్‌ అనే ప్రాంతంలో సంతానోత్పత్తి చేసుకుంటూ పులికాట్‌ సరస్సును ఆహార కేంద్రంగా ఉపయోగించుకుంటున్నాయి.  
ఈ పక్షులు పులికాట్‌ సరస్సులో రోజుల తరబడి ఉంటాయని దీనిపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు చెప్పారు.   
పులికాట్‌ సరస్సులో ఉండే నాచును మాత్రమే తింటుంది.  
ఈ పక్షి చెట్ల మీద గూళ్లు కట్టుకోకుండా నేలమీద రంధ్రం చేసుకుని గుడ్లు పెట్టి పొదుగుతాయి.  
హంసలు పాలను నీళ్లును వేరు చేసినట్టు ఈ పక్షి నాచు తినేటప్పుడు బురదను నాచును వేరు చేసి ఆహారంగా తీసుకోవడం దీని ప్రత్యేకత.
 

ఎర్రకాళ్ల కొంగల కేంద్రం వెదురుపట్టు, శ్రీహరికోట  
ఎర్రకాళ్ల కొంగలు (పెయింటెడ్‌ స్టార్క్స్‌) పక్షులు వెదురుపట్టు చెరువు, శ్రీహరికోట లోని బేరిపేట ప్రాంతాల్లో గూళ్లు కట్టు కు ని నివాసం ఉంటాయి. ఆహార వేటకు మాత్రం పులికాట్‌ సరస్సుకే వస్తాయి. 
రష్యా, సైబీరియా వంటి దేశాల నుంచి ఇక్కడికి వలస వచ్చి సంతానోత్పత్తిని చేసుకుని వెళ్తుంటాయి.  
ఇవి పులికాట్‌లో గుంపు గుంపులుగా విహరిస్తుంటాయి. అయితే వెదురుపట్టు చెరువు అనువుగా లేకపోవడంతో ఈ పక్షులు శ్రీహరికోటకు మకాం మార్చుకున్నాయి.  
ప్రస్తుతం శ్రీహరికోటను సంతానోత్పత్తి కేంద్రంగా చేసుకున్నాయి. ఇవి కూడా సరస్సులోని చేపలు, రొయ్యలు, పీతలను తింటుంది.  

అతి పెద్ద సంతానోత్పత్తి కేంద్రం  
ఆసియా ఖండంలోనే విదేశీ శీతాకాలపు వలస విహంగాల సంతానోత్పత్తి కేంద్రంగా, నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంగా భాసిల్లుతుంది. 1976లో నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రంగా వన్యప్రాణి విభాగం అధికారులు గుర్తించారు. ఈ కేంద్రం 458.92 హెక్టార్లలో విస్తరించి ఉంది. ప్రస్తుతం పక్షుల కేంద్రంలో 11 రకాల పక్షులు 4 వేలకు పైబడి విడిది చేశాయి. ఇందులో గూడబాతులు (పెలికాన్‌) 850, నత్తగుల్ల కొంగలు (ఓపెన్‌బిల్‌ స్టార్క్స్‌) 2015, తెల్లకంకణాయిలు (వైట్‌ఐబీస్‌) 600, తెడ్డుముక్కు కొంగలు (స్పూన్‌ బిల్స్‌) 100, నారాయణ పక్షులు (నైట్‌హేరాన్‌) 250, నీటికాకులు (కార్మోరెంట్స్‌)300, చిన్న,పెద్ద స్వాతికొంగలు150 (ఈ గ్రేడ్స్‌), వీటితో పాటు పదుల సంఖ్యలో పాముమెడ పక్షులు (డాటర్‌), చుక్కకోళ్లు (కూట్స్‌), ఊలబాతులు (లేజర్‌ విజిలింగ్‌ డక్స్‌) సందడి చేస్తున్నాయి. 

సందడిగా పులికాట్‌ ప్రాంతం  
దొరవారిసత్రం, నేలపట్టులో గూడబాతులు, నత్తగుల్ల కొంగలు, నీటికాకులు, తెల్లకంకణాయిలు, శబరి కొంగలు వంటి పక్షులు కనిపిస్తున్నాయి. ఇక్కడకొచ్చే విదేశీ వలస పక్షుల్లో అతి అందమైన పక్షి ఫ్లెమింగో కావడంతో ఆ పక్షి పేరుతో ఏటా పండగను నిర్వహిస్తున్నారు. 
 పులికాట్‌ సరస్సు, నేలపట్టులో కలిపి సుమారు 50 వేల విదేశీ వలస విహంగాలు ఇప్పటికే విచ్చేసినట్లు పులికాట్‌ వన్యప్రాణి సంరక్షణాధికారులు వెల్లడించారు.   
కుదిరి–అటకానితిప్ప గ్రామాల మధ్య సరస్సులో పర్యాటకులు విహంగాలను వీక్షించేందుకు రెండు, మూడు చోట్ల వ్యూ పాయింట్స్‌ ఏర్పాట్లు చేశారు.     

గూళ్లలో నివశించే పెలికాన్‌  
పక్షుల్లో రారాజు గూడబాతులు (పెలికాన్‌). నైజీరియా, సైబీరియా, ఆ్రస్టేలియా నుంచి నేలపట్టు చెరువులోని చెట్ల మీద విడిది చేస్తున్నాయి. గూళ్లు కట్టుకుని అక్టోబర్‌ నుంచి ఏప్రిల్‌ వరకు నేలపట్టులోనే ఉండి సంతానోత్పత్తిని చేసుకుని వెళ్తుంటాయి.   
ఈ రకం పక్షులు ప్రపంచ వ్యాప్తంగా ఏడు వేలు మాత్రమే ఉన్నాయని, ఇందులో నేలపట్టుకు సుమారు 2 వేలకు పైగా వస్తున్నాయని వీటిపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  
ఈ పక్షులు మనుషుల్లో ఉండే గుణాన్ని కలిగి ఉంటాయి. ఆడపక్షి గుడ్లు పెట్టి పొదుగులో ఉంటే మగపక్షి  ఆహార వేటకు వెళ్లి తను తిని, తెడ్డులాంటి ముక్కు కింద ఉన్న సంచిలో ఆహారాన్ని తీసుకొచ్చి ఆడపక్షికి, పిల్లలకు అందిస్తుంది. 
నేలపట్టులో సంధ్య వేళ ఇలాంటి మనోహర దృశ్యాలు పర్యాటకులను ఆహ్లాద పరుస్తాయి. 
ఆడ పక్షి పిల్లలను పొదిగి అవి ఎగిరే దాకా మగపక్షే పోషించడం ఈ పక్షుల్లో ప్రత్యేకత. పులికాట్‌ సరస్సులో దొరికే చేపలు, పీతలు, రొయ్యలు దీని ఆహారం. 

నారాయణపక్షి 
నారాయణ పక్షులు తడ మండలం బోడిలింగాలపాడు, చింతవక్కలు, నీటికాకులు చిల్లకూరు మండలం చింతవరం వద్ద గూళ్లు కట్టుకుని నివాసం ఉంటున్నాయి. వాకాడు మండలం మొనపాళెం వద్ద చిన్నస్వాతి కొంగలు, పెద్ద స్వాతి కొంగలు కాకులతో కలిసి గూళ్లు కట్టుకుని ఉంటాయి.  మనుబోలు చెరువులో ఐదారు రకాలు బాతులు ఉన్నాయి.  మిగిలిన చాలా పక్షులు సమీప ప్రాంతాల్లో చెట్ల మీద గూళ్లు కట్టుకుని ఉంటూ శీతాకాలం అంతా ఇక్కడే ఉండి వెళ్తున్నాయని బాంబే బర్డ్స్‌ నేచరల్‌ సొసైటీ రీసెర్చ్‌లో వెల్లడైంది. రాత్రి గూటికి వెళ్లి తిరిగి వేకువ జాము నుంచి సరస్సుపై ఆహారం వేటలో విహరిస్తున్నపుడు అవి చేసే విన్యాసాలు పక్షి ప్రియులను అలరిస్తాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement