Nelapattu
-
నేలపట్టు! ‘మామయ్యా.. ఒక్క విషయం'..
జీవితం జీవించటానికి కాదు. జీవితం నిర్వహించాల్సిన కర్తవ్యమని భావించే వ్యక్తి చంద్రశేఖరం. ఉదయ సంధ్య వేళ. చుట్టూ స్వచ్ఛమైన ప్రాణవాయువు ఆవరించిన స్పృహ. ప్రాణం నిలకడగా ఉచ్ఛ్వాసనిశ్వాసాల్లో డోలలూగుతున్న భావన. ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంతో హాయి పొందుతున్నాడు చంద్రశేఖరం. ఎప్పుడో వెళ్లిపోయిన యవ్వనం తిరిగి వచ్చినంత ఉత్సాహంగా ఉంది. సూర్యోదయం అయ్యేంత వరకు పొలం గట్ల మీద అలా తిరుగుతూనే ఉండిపోయాడు. అది అలవాటు. దినచర్యలో మొదటి ప్రస్థానం.తెల్లటి ఖద్దరు జుబ్బా, ఎగ కట్టిన పంచెతో తదేకంగా నడుస్తున్నాడు. అప్పుడే పొలంలోకి కూలీలు దిగుతున్నారు. ఆ పక్క చెరువులో కడప చెట్ల మీద పక్షుల కిలకిలరావాలు. వీనులవిందుగా ప్రతిధ్వనిస్తూ ఉంది ఆ ప్రాంతమంతా. చంద్రశేఖరాన్ని చూస్తే మరింత అల్లరి వాటిది. రోజూ టిఫిన్ తెచ్చి ఫామ్‌హౌస్‌లో పెట్టి వెళ్లే మాణిక్యం హడావుడిగా పొలం గట్ల మీద ఎదురు రావడం కొద్దిగా గాబరా పడ్డాడు. పడమర పొలం వెళ్లటం మానుకొని ఎదురు నడిచాడు.‘టిఫిన్ తెచ్చి టేబుల్ మీద పెట్టాను అయ్యా.. మధ్యాహ్నం అన్నం వండాలా?’ కొత్తగా అడగటంతో అర్థం కాలేదు. అదే ప్రశ్నించాడు చంద్రశేఖరం. ‘ఆ యశోదమ్మ వచ్చి అయ్యగారికి భోజనం పంపిస్తాము నీవేమీ వండొద్దు, మేం చెప్పామని అయ్యగారికి చెప్పు అని చెప్పి వెళ్ళారయ్యా’ వినయంగా బిడియంగా చెప్పింది మాణిక్యం. ‘ఏమిటి విషయం ఈరోజు?’ చంద్రశేఖరం ప్రశ్న పూర్తిగా వినకుండానే ‘అయ్యా పక్షుల కొరకు చెరువు గట్టు మీద మన ఊరోళ్ళు పొంగళ్ళు పెట్టేది ఈ రోజే కదయ్యా’ మాణిక్యం జవాబుతో గుర్తుకు వచ్చిన వాడిలా ‘అవును కదూ సరే ఆ పొంగలి పులిహోరతో ఈ పూట ఇక్కడే గడిపేస్తానులే. రాత్రికి వచ్చి, మామూలుగానే చపాతీ చేసి వెళ్ళు.. సరేనా’ అంటూనే ఇక నీవెళ్ళచ్చు అని తల ఆడిస్తూ మాణిక్యాన్ని పంపేశాడు.‘నాన్న నువ్వు ఎప్పటికీ ఊర్లో వాళ్ళు పంపిన అన్నం తినవద్దు. ఇంట్లోనే చేయించుకో. పొలం వెళితే వారితో కలసి అన్నం తినొద్దు’ కూతురు రోహిణి మాటలు గుర్తుకు వచ్చాయి. కళ్ళలో సన్నటి నీటి చెమ్మ. రోహిణిని చూసి ఐదేళ్లయ్యింది. ఫోన్లోనే కులాసాలు, కబుర్లు. ఆడబిడ్డ మేలు.. ప్రతివారం ‘ఏం నాన్నా..’ అని నోటినిండా అరగంట మాట్లాడుతుంది. ప్రశాంతు, సుమన్‌లు అయితే పలకరింపు క్కూడా అందడం లేదు. పిల్లలు సరే, కట్టుకొని, నాలుగు పదుల కాలం కాపురం చేసిన తాళికి ఏమైంది.. ఎక్కడ నుంచి వచ్చాము, ఏ మట్టి తల్లి బిడ్డలం అనేది మర్చిపోతే ఎలా? మూలాలు దాచేసే జీవితాలా? జన్మనిచ్చిన పల్లెను, జీవితాన్ని పంచిన నేల పరిమళాలు తుడిచేస్తే పోయేవేనా?‘పల్లె నచ్చక, పల్లె జీవితం చిన్నతనంగా భావించి పిల్లలకు తోడు, వారి బాగోగులు అంటూ వాళ్ళు దేశాలు పట్టుకుని తిరుగుతుంటే కంటికి రెప్పలా మనమేగా కాసుక్కూర్చోవాలి’ అనేది శకుంతల. నిజానికి పల్లెలో ఉండలేక తన పాత జీవితాన్ని, పునాదుల్ని గుర్తు చేసుకోను ఇష్టంలేక పిల్లలకు తోడుగా ముగ్గురు బిడ్డలతో విలాస జీవితం గడుపుతూ ఉంది శ్రీమతి చంద్రశేఖరం. ఒకప్పుడు ఇంట్లో అందరూ ఉన్నా ఉద్యోగ బాధ్యతలు మధ్య బతికేవాడు. కుటుంబాన్ని.. వారి బాగోగులను ఎక్కడా నిర్లక్ష్యం చేయలేదు. ఇప్పుడు ఎవరికి వారు ఉద్యోగాల్లో, సొంత కాపురాల్లో ఎక్కడో ఎక్కడెక్కడో విడిపోయారు. తను ఒంటరిగా బతుకుతున్నాడు రిటైర్డ్ ఏఎస్పీ చంద్రశేఖరం.నేలపట్టు సముద్ర తీరాన దట్టమైన చెట్లు, అడవుల మధ్య రస్తాల వాసన సోకనంత దూరంగా విసిరేసినట్టున్న కుగ్రామం. నాగరికులు అనేదానికి వీల్లేదు. పల్లెలకు పట్నాలకు దూరంగా ఉంది. నాగరికత నీడ పడని ఊరు. ఆ చిన్న పల్లెటూరే నేలపట్టు. యాబై గడప దాటని కుగ్రామం. దొరవారి సత్రం వెళ్లే తారు రోడ్డు కోసం ఏడు కిలోమీటర్లు అడ్డంగా నడవాలి. అక్కడ అందరి జీవనం ఒక్కటే. నీళ్ల కాలంలో పులికాట్ సరస్సులో చేపల వేట. మిగిలిన రోజుల్లో చెరువు, దొరువుల్లో వేట. ఇదే వారి జీవనాధారం.నేలపట్టులో మూడు నాలుగు తరగతుల వరకు చదివినవారే అంతా. అదీ సుదూరం నడిచి వెళ్లి. ఆ ఊర్లో తొలి డిగ్రీ పట్టా పొందిన వ్యక్తి చంద్రశేఖరం. దాని వెనుక సుబ్బయ్య, పిచ్చమ్మ పట్టుదల బోలెడంత. వారి ఒక్కగానొక్క కొడుకు చంద్రశేఖరం. చదివించాలనే మూర్ఖత్వం వారిది. మూర్ఖత్వం అని అప్పట్లో ఆ ఊరి వారి నింద లేదా బిరుదు. ఈ జీవితం నుండి వెలుగు చూడాలనే ఓ కిరణం కోసం వెతుకులాట సుబ్బయ్య – పిచ్చమ్మ దంపతులది. నేలపట్టులో అది ఎనిమిదో వింత. శిక్షణ పూర్తిచేసుకుని ఇందుకూరుపేట పోలీస్ సబ్ ఇన్స్పెక్టరుగా చార్జి తీసుకొని గ్రామానికి చేరుకున్నాడు చంద్రశేఖరం. ఒక్క క్షణం ఆ పల్లె గడప, పోలీసు జీపు దుమ్ముకు, ఖాకీ బట్టల వాసనకు సన్నగా వణికింది. నేలతల్లికి ముద్దు పెట్టుకొని నడిచి వస్తున్న ఎస్ఐని చూసి ‘పోలీసు కాదురా మన చంద్రుడే!’ అని సన్నటి చిరు జల్లుల సందడిలో పల్లె అంతా సరదాల చిత్తడి అయింది.‘మా చంద్రుడు బీఏ అంట’ నేలపట్టు వాళ్ళు ఘనంగా చెప్పుకునే వారు. వారికి తెలియని అందని ఎన్నో విషయాలు చాలానే ఉన్నాయి. బీఏ కాదు పీజీ చేశాడని, నెల్లూరు చరిత్ర మీద తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో పీహెచ్డీ కూడా చేశాడని ఇప్పటికీ తెలియదు. కానీ ఆ చందురూడే కాల చక్రభ్రమణంలో ఎస్సై మాత్రమే కాదు సీఐ, డి.ఎస్.పి, ఏఎస్పీ కూడా అయినాడని ఎనిమిది జిల్లాల్లో పనిచేసి రిటైర్మెంట్కు చివరి రెండేళ్లు నెల్లూరు వచ్చారు.రాష్ట్రస్థాయిలో పొందిన గుర్తింపు గౌరవంతో సొంత జిల్లాలోని బాధ్యతలు నెరవేరుస్తున్న విషయం ఇప్పటికి అందరూ తెలుసుకున్నారు. నేలతల్లిని ముద్దాడి ఉద్యోగ ప్రయాణాన్ని మొదలెట్టిన నేలపట్టు చంద్రుడు ఊరిని మరవలేదు. వంద గడప ఉన్న తన తల్లిలాంటి ఊరి కోసం పాతికేళ్ల కృషిని నాలుగైదు ఏళ్ళలో పూర్తి చేయగలిగాడు. సొంత ఊరు నుండి నాయుడుపేట, దొరవారి సత్రానికి తారు రోడ్లు మొదలు పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య సబ్‌సెంటర్, పక్కా ఇళ్లు.. అన్ని ప్రభుత్వ పథకాలు గ్రామానికి అందేలా కృషి చేయడమే కాక ప్రతి నెల సొంత ఊరిలో రెండు రోజులు ప్రజలను చైతన్య పరచడం తన విధులలో ఒకటిగా భావించాడు చంద్రశేఖరం. నాటు పడవలు, వలల వద్ద నుంచి చెరువుకు రెండు వైపులా ఉన్న పోరంబోకు భూములను గ్రామçస్థులకు కేటాయించేలా కృషిచేసి డి ఫారములు అందేలా చేశాడు. ఊరికి ఒక్కడిలా చంద్రుడు గ్రామానికి వెన్నెల వెలుగయ్యాడు.మూడు పదుల ఏళ్ల కృషి – ఆ నేల వైభవం ఆ ప్రాంతాలలో ప్రవచనంలా మారుమోగుతుంది. దానికి అనేకానేక కారణాలు. అభివృద్ధి మాత్రమే కాదు, ప్రతి ఇంట చదువుకున్న వారే. గ్రామం నుంచే ఇప్పుడు రైల్వే, పోలీసు, బడి పంతుళ్లు, ఇంజినీర్లుగా ఎదిగిన పిల్లలతో పల్లె స్వరూపమే మారింది. నేలపట్టు.. ఆకాశమంత సముద్రాన్ని ఇక్కడ భూమిపైన జల తివాచీగా పరచినట్టు ఉంటుంది. చెట్లకి ప్రాణమిచ్చే మట్టి, మట్టిని మెత్తగా మలచిన చెట్లు. చెట్లుకీ మట్టికీ ఉనికినిచ్చిన పులికాట్ సరస్సు. చెట్టు, మట్టి, సముద్రం, పులికాట్‌లకు స్థానమిచ్చినదే నేలపట్టు. ఒకప్పుడు మురుగు కూపం – నేడు ఆదర్శగ్రామం. తైల సంస్కారమెరగని పల్లెసీమ – నేడు ఉత్తమ పల్లె. పోరంబోకు పొలాలు పంట పొలాలు అయ్యాయి.చెరువు ఆయకట్టు కింద రెండు కార్లు జీలకర్ర మసూర్లకు వేదికైంది. ఆ డివిజనులోనే అభివృద్ధికి దర్వాజా అయింది. ప్రతి పిల్లోడు చదువుకున్న యువత కాగలిగింది. ప్రతి గడప ప్రభుత్వ ఉద్యోగి కాపురంగా నిలిచింది. దానితో పాటు ఎర్ర చెరువు.. నేలపట్టుకు కలసొచ్చిన మరో ఆయువుపట్టు అయింది. అదే వలస పక్షులు. చెరువులోనే ప్రత్యేకంగా ఉన్న కడప చెట్లు వీటికి ఆసరా.ఈశాధాన్యుల హిమాలయ యాత్రలా, కాశీతీర్థ ప్రయాణంలో వలసపక్షులు చేరుతుంటాయి. విశ్వసుందరి పోటీలకు పయనమైన సోయగాల్లా, విశ్వశాంతి చాటే ఆత్మీయ అతిథుల రాయబారుల్లా, పులికాట్ సరస్సు ఒడ్డున వాలుతాయి ఈ తారా పక్షులు. ప్రేమయాత్రో, ఆత్మీయ సంగమ ప్రయాణమో, తను పుట్టిన మట్టిని ముద్దాడుతుంటాయి ఈ ఫెలికాన్లు. సుదూర తీర ప్రయాణ ప్రయాస తీర్చుకుంటూ ఫ్లెమింగోలు, దండయాత్రకు తరలివచ్చిన సముద్ర సైన్యంలా, పెలికాన్లు, ఫ్లెమింగోలు, నారాయణ పక్షి, నీటి కాకి, పాలపిట్ట, కళ్లకంకణాయి, ఎర్రకాళ్ల కొంగ, నీటి కొంగ, చెకుముకి పిట్ట, ఇక్కడ ఆవాసాలతో బృందావనంలా మలచుకుంటాయి ఈ నేలపట్టుని. ఒకనాడు అలెగ్జాండరు జయించాడు జంబూ ద్వీపాన్ని, ఈనాడు విదేశీ పక్షులు ముద్దాడుతున్నాయి ఈ నేలపాదాల్ని. వేల పక్షులు ఆరు నెలలు పాటు ప్రేమమయ భక్తి భావనలే. రాధా మాధవ ప్రణయ వేద వేదనా స్వనాలే. కొత్త సృష్టి రచనా రీతికి అనుక్రమణికలు ఈ చెరువు చిరునామాగా మారుతుంది. సృష్టియాగం మదనభంగిమ అందుకేనేమో పరువపు ఘుమఘుమలు – రేగడి నేలల్లో రెట్టల పరిమళం.రేపటి పంటలకు శుభోదయం అవుతుంటాయి. చెరువు, పొలాల గట్లలో నిండిన చెట్లు పక్షుల ఎరువుతో కలసి పదిరెట్లు పండించే పంటలు హరిత దుప్పట్లు. నేలపట్టు మహిళలు జాతర చేసుకునేది ఈ పక్షుల కోసమే. గుళ్లు, గోపురాలు, దేవుళ్లు, దేవతలకు కాదు, చెరువుకు కడప చెట్లకు మొక్కులు తీర్చుకుంటారు. దేశ విదేశీ పక్షులకు ఇవే ఆసరాలు. పక్షులకు స్వాగతం పలకటం ఇక్కడ జరిగే అతి పెద్ద జాతర. అదే తిరణాల. అందుకే సవినయ సాదర స్వాగతం పలుకుతూ, నేలపట్టు నాగేటి చాళ్లతో ఆహ్వాన గీతం పలుకుతుండటం రెండు దశాబ్దాలుగా ఇక్కడ సాగుతున్న పక్షుల పండుగ. ఎక్కడున్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, చదువుల్లో ఉన్నా అందరూ ఈ పక్షుల జాతరకు, ఈ పొంగళ్లు, ఉత్సవాలకు హాజరవటం ఈ నేలపట్టు పుణ్యస్థలిగా మారుతుంది.వేడుకల్లో పాల్గొనడమే కాదు వచ్చే ఏడాది ప్రణాళికలను రూపొందించుకోవటం. అన్ని తరగతుల వారికి, అన్ని వర్గాల వారికి, ఎవరి పనులు వారికి, ఎవరి బాధ్యతలు, కర్తవ్యాలను అందరూ ఒక్కమాటగా పంచుకుంటుంటారు. అవన్నీ అమలు జరగాల్సిందే. ఈ పాతికేళ్లుగా అదే కట్టుబాటు, ప్రతిఒక్కరిలో అదే కసి, అందుకే నేలపట్టుకు గుర్తింపు, గౌరవం. దీనికి కర్త, కర్మ, క్రియ ఒక్కరే.. చంద్రశేఖరం.ప్రతికదలికలోనూ ఓ రాజసం. ఎక్కడివో, ఏ ప్రాంతానివో, మరే దేశానివో సరిగ్గా ఈ సీజనులో వస్తాయి. ఐదారు నెలలు కాపురం చేస్తాయి. సంతతి వృద్ధి చేసుకొని వెళతాయి. మంచుకాలంలో ఉండలేవు. మంచు తగలక ముందే వెళ్లిపోతాయి. పెలికాన్ లు.. వాటి కదలికలను చూసి చంద్రశేఖరం పెదాలు చిరునవ్వుల సందడి చేస్తున్నాయి. దరహాసాల నాట్యమాడుతున్నాయి. ఈ నేల మీద ఎంత ప్రేమ..నమ్మకం..! ఠంచనుగా ప్రతి ఏడాది వేల కి.మీ. దాటుకొని సముద్రాలు దాటుకొని ఈ నేలతల్లి ఒడిలో సేద తీరుతాయి. ఎక్కడిదో ఈ విశ్వాసం.. ఏమిటో.. ఈ నేలతో ఆత్మీయ అనురాగ సంగమం! ఈ విదేశీ పక్షులకు ఉన్న ప్రేమాభిమానాలు ఈ నేల మీద పురుడు పోసుకున్న మనుషులకు ఎందుకు లేకుండా పోయింది! చంద్రశేఖరం మనసు బాధగా మూలిగింది. ఇక్కడ పునాదులతోనే గదా ఎదిగింది. ఈ నేలతల్లి ఒడి ఎందుకు గిట్టడం లేదు. నేలపట్టు పొడ ఎందుకు పడటం లేదు. పదవీ విరమణ జరిగి, ఒక్కడే నేలపట్టు గ్రామానికి చేరుకోవటం వెనుక నిర్మించుకొన్న ఆశల సౌధం బీటలు వారినంత వ్యథ..‘డాడీ.. మీరెన్నయినా చెప్పండి చెన్నై, లేదా హైద్రాబాదులలో సెటిల్ అవ్వండి. మీరు నెల్లూరు నేలపట్టు అనటం మాత్రం మాకు మింగుడు పడటం లేదు’ పెద్ద కొడుకు ప్రశాంత్. ‘సొంత ఊరంటే అభిమానం కాదనం డాడీ. అంతా ట్రాష్, మేమేమో ముగ్గురం మూడు దేశాల్లో స్థిరపడ్డాం. మేము రావాలన్నా పోవాలన్నా మా వసతి కూడా గమనించండి’ చిన్న కొడుకు సుమంత్. ‘అక్కడ పొలాలు, ఇళ్లు మీ పేరుతో ఊరి అభివృద్ధికి కేటాయించండి డాడీ. అంతేకానీ మీరిద్దరూ ఆ పల్లెలో ఉంటే మేమెలా ఇక్కడ స్థిరంగా ఉండగలం! మమ్మల్ని అర్థం చేసుకో డాడీ..’ తన ఆలోచనలను పుణికి పుచ్చుకున్న రోహిణి ఆలోచనలు కూడా గాడి తప్పాయి.‘మామయ్యా.. ఒక్క విషయం. ఒకటో తరగతిలో అక్షరాలు దిద్దామని, ఐదవ తరగతిలో గుణింతాలు దిద్దామని, డిగ్రీ పాసైనా అక్కడే ఉండి చదువుకుంటాను డిగ్రీలో కూడా ఆ టీచరే పాఠాలు చెప్పాలంటే కుదరుతుందా? అంతే మామయ్యా. ఊరి నుండి ఎదిగారు. ఎంతో చేశారు మీ వంతు.. ఆ గౌరవంతోనే మనం తప్పుకుంటే గొప్పగా నిలిచిపోతాం గదా మామయ్యా’ అల్లుడు చైతన్య అనునయించే ప్రయత్నం. చంద్రశేఖరంలో అప్పుడే ఓ మెరుపు మెరిసింది. నిజమే .. గౌరవంగా తప్పుకోవాలి. శాశ్వతంగా తప్పుకోవాలి. ఎక్కడ నుండి.. ఊరునుండే తప్పుకోవాలి! ఎలా తప్పుకోవాలి.. ఊరు ఖాళీ చేసికాదు.. ‘బొందిలో జీవం వెళ్లిన తర్వాతనే’ అప్పటికే ఓ నిశ్చయ నిర్ణయానికి చేరువయ్యాడు. ‘పిల్లలు లేకుండా, మనవళ్లు, మనవరాళ్లను చూడకుండా వారితో ఆడుకోకుండా జీవితాన్ని చూడకుండా, ఆస్వాదించకుండా ఆ పల్లెలో బిక్కుబిక్కుమంటూ నేనుండలేను. మీరు కావాలంటే వెళ్లండి’ జీవిత భాగస్వామి శకుంతల తెగేసి చెప్పింది. పదవీ విరమణ తర్వాత కూడా రెండు మూడు నెలలు ఇదే యుద్ధం.ఇదే చర్చ, ఇవే సమస్యలు. శకుంతల వైభోగం.. చంద్రశేఖరం ఆశయం పోటీ పడ్డాయి. కదులుతున్న కాలమే మన గురువు.. ఎంతటి సమస్య వచ్చినా ముందుకు కదలమనే చెబుతుంది తప్ప అక్కడే ఆగిపొమ్మని చెప్పదనే చంద్రశేఖరం విశ్వాసం. లగేజీ వాహనం పల్లెకు చేరుకుంది. వెనుక కారులో చంద్రశేఖరం ఒంటరిగా నేలపట్టుకు చేరి అప్పడే ఏడేళ్లు దాటింది. చందురూడూ ఒక్కడే. తారలేదని గుండెలు బోరుమన్నా, ఇప్పడు అంతా సర్దుకుపోయారు. చందురూడే.. నేలపట్టుకు వెలుగయ్యాడు. చెరువు ఒడ్డున పక్షులకోసం పొంగళ్లు పెడుతున్న గ్రామ మహిళలు, పిల్లలు, గ్రామానికి చేరుకొన్న కొత్త సందడి చప్పుళ్లతో చంద్రశేఖరం హృదయం కోటి వెలుగులతో కాంతిపుంజం అయింది.అయినా ఒక్కడే.. ఆ భావన లేదు. ఊరంతా తనది. అన్నీ మన మంచికే అనుకుంటే ఆపదలో కూడా ఆత్మవిశ్వాసం పోదు. ఒక వ్యక్తి విజయం సాధించాలంటే అతని సంకల్పం గొప్పదై ఉండాలి. అతని గురి లక్ష్యం వైపు ఉండాలి. శ్రద్ధ.. చేసే పనిపై ఉండాలి! ఫోన్ లో పలకరింపులు, కుశలాలు సాగుతూ, సాగుతూ పలచబడ్డాయి. అప్పుడప్పుడు చేసే రోహిణి కూడా పిల్లల వ్యాపకాలు, చదువు సంధ్యల ఒత్తిడి వలనేమో ఫోన్ లో కూడా పలకరించి చాలా కాలమయింది. పిల్లలు, కోడళ్ళు, కట్టుకున్న తాళి అందరూ ఎవరికి వారు యంత్రాలైపోయారు. కానీ చంద్రశేఖరం మాత్రం ప్రేమానురాగాలు ఆత్మీయత అనుబంధాలు అన్నీ గుండె నిండా ఆస్వాదిస్తున్నాడు. ఎందుకంటే అక్కడ అతను ప్రతి ఇంటిలోనూ దీపం వెలిగించిన మకరజ్యోతిగా నిలిచాడు. పిల్లా జెల్లా ఆ ఊరే కాదు, పక్క ఊరు వాళ్ళ అభిమానాన్ని కూడా పొందిన చంద్రశేఖరానికి ఏ లోటూ లేదు. కాని కాలం కదా! అయినా ఇప్పటికీ లోటు లేదు.ప్రతి ఒక్కరూ.. నమస్కారం బాబయ్యా.. పెద్దయ్యా దండాలు.. గుడ్‌మార్నింగ్ తాతయ్యా.. పెదనాన్నా ఊరెళుతున్నాం శెలవులకు వస్తాం! నాకు తాశిల్దారుగా ప్రమోషన్ వచ్చింది. వీసా కన్ ఫర్మ్ అయ్యింది తాతయ్యా!ఆ ఊరి వాళ్ళకే కాదు, పక్క ఊరి వాళ్ళకూ ఆదర్శనీయుడే! ఎందుకంటే నేలపట్టుకు వసతులు ఏర్పడటంతో పక్క దీవులు కూడా చైతన్యవంతమయ్యాయి. అందుకే అందరకీ పూజ్యనీయుడు! ప్రతి ఏడాది వచ్చే విదేశీ పక్షులు, వలస పక్షులు రావటం ఆగలేదు. నాలుగైదు నెలలు కాపురం చేయటమూ ఆగలేదు. ఆ ఊర్లో ఏం జరిగినా.. ఎవరు వెళ్ళినా, వచ్చినా చంద్రశేఖరానికి నమస్కరించాల్సిందే. చివరకు పక్షులు కూడా ఆ ఊరిలో బాగమే. పక్షులు తిరిగి వెళుతూ గ్రామం చుట్టూ చక్కర్లు కొట్టి వెళుతుంటాయి. ఆ ఊరి ప్రజలూ అంతే. ఊరి వారంతా చంద్రశేఖరానికి చెప్పి వెళ్లాల్సిందే. దండాలు పెట్టి వెళ్ళాల్సిందే. ఆ ఊరుకి ఏర్పడిన సంస్కారం అది. అదే ఆ ఊరి సంప్రదాయంగా మారిపోయింది. కాని ఒక్కటే లోటు. అవన్నీ కూడా గ్రామం నడిబొట్టున నిర్మించిన చంద్రశేఖరం విగ్రహానికి. ఎందుకంటే కాలం గొప్పది కదా! – ఈత కోట సుబ్బారావు -
‘నేలపట్టు’కు విదేశీ విహంగాలు.. మొదలైన సందర్శకుల తాకిడి
దొరవారిసత్రం : ఖండాంతరాలు దాటి వేల కిలోమీటర్లు ఆకాశమార్గంలో ప్రయాణించి నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రానికి విచ్చేసే విదేశీ శీతాకాలపు వలస విహంగాలు స్థానికంగా కేంద్రం పరిధిలో ఉన్న నేరేడు, మారేడు, అత్తిగుంట చెరువుల్లోని కడప చెట్లపై గుడ్లు పెట్టి పిల్లలను పొదిగి విడిది చేస్తూ సమీపంలోని పులికాట్ సరస్సులో చేపలను వేటాడి జీవనం సాగిస్తాయి. సీజన్‌కు ముందే (అక్టోబరు నుంచి ఏప్రిల్ వరకు) సెప్టెంబరు నెలలోనే వందల సంఖ్యలో నత్తగుళ్ల కొంగలు (ఓపెన్‌బిల్‌స్టార్క్స్) విచ్చేశాయి. స్థానికంగా ప్రసిద్ధి చెందిన విహంగాలు, పక్షుల్లోనే రారాజుగా పిలిచే గూడబాతులు (పెలికాన్స్) వారం కిందటే కేంద్రంలో తిష్టవేసి ఆడ, మగ పక్షులు స్నేహం కుదుర్చుకుని కడప చెట్లపై పుల్లలతో గూళ్లు కట్టుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ప్రస్తుతం పక్షుల కేంద్రంలో గూడబాతులు200కి పైగా, నత్తగుళ్లకొంగలు 500, నీటికాకులు (కార్మోరెంట్స్) 200, తెల్లకంకణాయిలు(వైట్‌ఐబీస్) 200, తెడ్డుముక్కుకొంగలు (స్పూన్‌బిల్స్) పాముమెడ పక్షులు (డాటర్స్), స్వాతి కొంగలు, బాతు జాతికి చెందిన పలు రకాల పక్షులు పదుల సంఖ్యలో విడిది చేస్తున్నాయి. రైతులకు పరోక్షంగా.. ప్రత్యక్షంగా.. పక్షుల కేంద్రంలో విడిది చేసే విహంగాలు రక్షిత కేంద్రానికి చుట్టు పక్కల గ్రామాల్లోని రైతులకు పరోక్షంగా, ప్రత్యక్షంగా ఎంతగానో మేలు చేస్తున్నాయి. వీటి రాక మొదలైతే ఈ ప్రాంతంలో వర్షాలు కురుస్తాయి. దీంతో విహంగాలను దేవత పక్షులుగా రైతులు పిలుస్తారు. ముఖ్యంగా నేలపట్టు పక్షుల కేంద్రంలో విడిది చేయడం వల్ల అవి వేసే రెట్ట చెరువు నీటిలో కలుస్తుంది. ఈ నీటినే నేలపట్టు, మైలాంగం గ్రామాల్లోని రైతులు పంటల సాగుకు నీళ్లు వినియోగిస్తారు. ఈ నీళ్లలో గంధకం, పొటాష్ వంటివి పుష్కలంగా ఉండడంతో రైతులు వేసిన పంట ఏపుగా పెరిగి అధిక దిగుబడులు వచ్చేందుకు పక్షులు పరోక్షంగా దోహదపడుతున్నాయి. అదే విధంగా దుక్కులు దున్నినప్పటి నుంచి పంటలు కోత వచ్చే వరకు కేంద్రంలోని విహంగాలు పంటలపై గుంపులు గుంపులుగా వాలిపోయి పంటకు నష్టం కలిగించే క్రిమికీటకాలను తిని రైతులకు ప్రత్యేక్షంగా మేలు చేస్తాయి. పక్షుల కేంద్రం ఇలా ఏర్పడింది.. నేలపట్టు పక్షుల కేంద్రం 458.92 హెక్టార్లలో విస్తరించి ఉంది. 1970లో పక్షి శాస్త్రజ్ఞుడు డాక్టర్ సలీంఅలీ కేంద్రాన్ని కనుగొన్నారు. 1976లో పక్షుల రక్షిత కేంద్రంగా గుర్తించి, వన్యప్రాణి విభాగం అధికారులు పరిరక్షిస్తున్నారు. తొలుత పక్షుల కేంద్రం నెల్లూరు సబ్ డివిజన్ పరిధిలో ఉండేది. 1984–85లో సూళ్లూరుపేట సబ్ డివిజన్‌గా ఏర్పాటు చేశారు. 30ఏళ్ల కిందట పక్షుల కేంద్రంలో 36 రకాల విదేశీ పక్షులు వచ్చి విడిది చేసేవి. క్రమేపి పక్షి జాతుల సంఖ్య తగ్గుతూ ప్రస్తుతం సుమారు 16 జాతుల పక్షులు కేంద్రంలో విడిది చేసి సంతానం అభివృద్ధి చేసుకుంటున్నాయి. విహంగాల రాక వ్యవసాయ సూచిక.. పక్షుల కేంద్రానికి వలస విహంగాల రాక మొదలైతే ఇక్కడ వర్షాలు కురవడం మొదలవుతుందని రైతుల నమ్మకం. రైతులు చెబుతున్న ప్రకారం కార్తీక మాసంలో పక్షులు విచ్చేసి జత కట్టి గూళ్లు కట్టుకుంటాయి. మార్గశిరంలో గుడ్లు పెట్టి పుష్య మాసంలో పిల్లలను పొదిగి మాఘ, ఫాల్గుణ, చైత్ర మాసాల్లో పెంచి పెద్ద చేస్తాయి. వైశాఖంలో ఆయా దేశాలకు వెళ్లిపోతాయి. ఇదే తరహాలో ఈ ప్రాంతంలో కార్తీక మాసంతో వరి సాగు పనులు మొదలై విహంగాల సంతానం అభివృద్ధి పూర్తయ్యేసరికి కోతలు పూర్తవుతాయి. -
విదేశీ వలస విహంగాలొచ్చేశాయ్....
దొరవారిసత్రం: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రానికి అతిథులు వచ్చేశాయ్. ప్రస్తుతం వందల సంఖ్యలో వలస విహంగాలు ఇక్కడ విడిది చేస్తున్నాయి. విదేశీ వలస పక్షుల్లో రారాజుగా ప్రసిద్ధి చెందిన గూడబాతులు (పెలికాన్స్) గత మూడు రోజులుగా సందడి చేస్తున్నాయి. కేంద్రంలో ప్రస్తుతం 200కి పైగా గూడబాతులు విడిది చేస్తున్నట్లు వన్యప్రాణి విభాగం సిబ్బంది తెలిపారు. వీటితోపాటు సీజన్‌కు ముందే ఇక్కడకు విచ్చేసిన నత్తగుళ్ల కొంగలు (ఓపెన్ బిల్‌స్టార్క్స్) 500, తెల్లకంకణాయిలు (వైట్‌ఐబీస్) 200, పెద్ద నీటికాకులు (కార్మోరెంట్స్) 100కి పైగా విడిది చేస్తున్నట్లు తెలిపారు. (చదవండి: నాణేనికి మరోవైపు.. ‘అట్టర్’లతో అసలుకే ఎసరు!) ఇంకా తెడ్డుముక్కు కొంగలు, నారాయణ పక్షులు, పాముమెడ కొంగలు వంటి పక్షులు రావాల్సి ఉంది. అయితే.. ప్రసిద్ధి చెందిన గూడబాతులకు స్థానికంగా వాతావరణం అనుకూలించకపోతే మాత్రం అవి వెనుతిరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు కురిసిన వానలకు అత్తిగుంట, నేరేడుగుంట, మారేడుగుంట చెరువుల్లోకి అరకొరగా మాత్రమే నీళ్లు చేరుకున్నాయి. విడిది కోసం వచ్చిన విహంగాలు అడుగంటిన నీళ్లలోనే జలకాలాడుతూ సంచరిస్తున్నాయి. పుష్కలంగా వర్షాలు కురిసి చెరువుల్లో çపూర్తి స్థాయిలో నీళ్లు ఉంటే ఇప్పటికే వేల సంఖ్యలో వలస విహంగాలు ఇక్కడ విడిది చేస్తూ ఉండేవి. చదవండి: ప్రారంభమైన ఫ్లెమింగోల సందడి.. -
AP Special: పక్షుల ప్రేమాయణ కేంద్రం నేలపట్టు..!
నాయుడుపేట: నెల్లూరుజిల్లా నేలపట్టు గ్రామం పక్షుల ప్రేమాయణ కేంద్రంగా పిలవబడుతోంది. నాయుడుపేటకు 12 కిలోమీటర్లు దూరంలో దొరవారిసత్రం మండల పరిధిలోని ఈ గ్రామం ఉంది. క్రమేపీ ఈ గ్రామం విదేశీ పక్షులకు కేంద్ర బిందువుగా మారింది. 40–50 ఏళ్లు క్రితం నుండి పక్షుల నేలపట్టు, మైలింగం గ్రామాల చెరువులు, అటవీ ప్రాంతం వైపు సంచరించేవి. దట్టమైన చిట్టడివి కావడం పక్షులు విడిది చేసేందుకు వీలుగా వుండడం, జన సంచారంలేని ప్రాంతంగా వుండేది. పగలంతా అటవీ ప్రాంతంలో పురుగులు, చేపలను వేటాడి ఆహారంగా తీసుకునేవి. సందగూకల (సాయింత్రంవేళ) నేలపట్టు గ్రామంలో చెట్లుపై కిలకిలరావాలతో సందడి చేసేవి. దేవతా పక్షులుగా పూజలు... మెట్ట ప్రాంతంగా పేరున్న నేలపట్టు, మైలాంగి గ్రామాలు వర్షాలు పడేవి కావు. జీవనోపాధి కోసం గ్రామస్థులు కూలీ పనులకు ఇతర మండలాలలకు వలస వెళ్లేవారు. విదేశీ పక్షులు రావడం ఆరంభించాక, సకాలంలో వర్షాలు రావడంతో గ్రామస్థులు శుభ సూచికంగా భావించారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా వర్షాలు రావడం పంట పండించుకోవడంతో వలసలకు పుల్‌స్టాఫ్ పడింది. ఆనాటి నుండి వీటిని దేవత పక్షులుగా నేలపట్టు, మైలాంగం రైతులు పక్షులకు పూజలు చేయడం కొనసాగించారు. పక్షులపై దాడులు, పక్షులను వేటాడనివ్వకుండా సంరక్షించే బాధ్యత రైతులే తీసుకున్నారు. రైతులకు కావాల్సిన వర్షాలు సంవృద్దిగా కురవడంతో పాటు పంటల దిగుబడి బాగా వుండేది. 1976లో అటవీశాఖ, వన్యప్రాణి సంరక్షణ శాఖల అధికారులు పక్షులను సంరక్షించే బాధ్యత తీసుకున్నారు. నేటపట్టులో చెరువులకు నీటిని నింపడం, బలహీనంగా వున్న చెరువు కట్టలను బాగు చేయడం, చెట్లు పెంచడం, పక్షులకు మేతను ఇచ్చే మొక్కలు పెంచడం, చెరువుల్లో చేప పిల్లలను వృద్ది చేయడం వంటి పలు సంరక్షణ చర్యలు చేపట్టారు. పైగా పక్షులకు ఆసియా కండంలోనే అతి పెద్ద రెండవ ఉప్పునీటి పులికాట్ సరస్సు వుండడం పక్షులకు అనువైన ఆవాసయోగ్యమైన ప్రాంతంగా నిలుస్తోంది. సంతానోత్పత్తి ఇక్కడే.... విహంగాల్లో ప్రసిద్ధి చెందిన రారాజులుగా పిలువబడే గూడబాతులు (పెలికాన్స్), తెల్లకంకణాయిలు, తెడ్డు ముక్కుకొంగలు, నత్తగుళ్లకొంగలు (ఓపెన్‌బిల్‌స్టార్క్స్), నీటి కాకులు, స్వాతికొంగలు, పాముమెడకొంగలతో పాటు బాతు జాతీకి చెందిన పలు రకాల పక్షులు సైబీరియా, నైజీరియా, ఖజికిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బర్మ, నేపాల్ తదితర దేశాల నుంచి తరలివస్తాయి. ఇలాంటి విదేశీ పక్షులకు వాతావరణ సమతుల్యత, విశాలమైన భూభాగం కలిగివుండడం వీటి సతానోత్పత్తికి అనువైన ప్రాంతంగా నిలుస్తోంది. విదేశాల నుండి వచ్చిన పక్షులు స్నేహభావంతో మెలగడం, సహజీవనం చేయడం, ప్రేమాయణంలోపడి సంతానోత్పత్తిని వృద్ది చేసుకుంటాయి. సమీపంలోని చెరువులు, సరస్సుల్లో చేపలను పిల్లలకు ఆహారంగా అందించి తమ స్వస్థలాలకు తిరిగి ఏప్రిల్ నెలలో పయనమవుతాయి పక్షులు. నేలపట్టు పక్షుల కేంద్రాన్ని విదేశీ పక్షుల ప్రేమాయణ కేంద్రంగా స్థానికులు చర్చించుకోవడం విశేషం. -
లాగ్ లాగ్ కొత్త అతిథులు వస్తున్నాయి
నేలపట్టు... శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓ గ్రామం. ఒకప్పుడుఆ జిల్లా వాళ్లకు కూడా పెద్దగా పరిచయం లేని గ్రామమే కానీ ఆస్ట్రేలియా ఉండే పెలికాన్ పక్షులకు ఇక్కడి వాతావరణం తెలుసు. రివ్వున గాల్లోకి ఎగురుతూ వచ్చేస్తాయి. ఈ రావడం ఏటా జరుగుతుంది. అక్టోబర్ నుంచి రాక మొదలవుతుంది, మార్చి– ఏప్రిల్ వరకు నేలపట్టులో ఉంటాయి. ఈ పక్షులు నేలపట్టులో గుడ్లు పెట్టి, పిల్లల్ని పొదిగి, వాటికి రెక్కలు వచ్చిన తర్వాత తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోతాయి. ఇలా నేలపట్టు ప్రపంచ ప్రఖ్యాతమైంది. ఆసియాలోని అతిపెద్ద బర్డ్ సాంక్చురీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఎప్పుడూ ఉండే ఈ విశేషాలతోపాటు ఈ ఏడాది రెండు విశేషాలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో చెరువులు నిండు కుండల్లా కళకళలాడాయి. దాంతో వలస పక్షులు ఒక నెల ముందుగానే వచ్చేశాయి. ఆస్ట్రేలియా నుంచి వచ్చే పెలికాన్, ఫ్లెమింగో, చుక్కల బాతు, గూడ కొంగలు, పొడుగు కాళ్ల కొంగలు, పొట్టి కాళ్లు పొడవు ముక్కున్న తెల్ల కొంగలు, తెడ్డు ముక్కు కొంగలు, ముదరు గోధుమరంగు కొంగలు... ఇలా రకరకాల పక్షులు ఏటా వచ్చినట్లే ఈ ఏడాది కూడా వచ్చాయి. ఈ పక్షులతోపాటు ఈ సారి సౌత్ అమెరికా నుంచి మరో అతిథి వచ్చింది. ఈ అతిథికి ఆర్నిథాలిస్టులు పెట్టిన పేరు ఊలీ నెక్ట్ స్టార్క్. కష్టపడి ఈ పేరు పలకడానికి ఇష్టపడని మన వాళ్లు లాగ్ లాగ్ అని పిలుస్తున్నారు. ఐదు వేల పక్షులు నేలపట్టు గ్రామానికి ఈ ఏడాది వలస పక్షులు ముందుగా రావడమే కాదు, ఎక్కువ సంఖ్యలో కూడా వచ్చాయి. దాదాపుగా ఐదు వేల పక్షులు ఉండవచ్చని అంచనా. అవి మరో మూడు వేల పిల్లలకు జన్మనిచ్చాయి. ఇవన్నీ మరో రెండు నెలల్లో తిరిగి వెళ్లి పోతాయి. అందుకే ఈ ఐదారు నెలల కాలం ఇక్కడ పర్యాటకుల రాక కూడా ఎక్కువగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు... కేరళ, కర్నాటక, తమిళనాడు నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. ఆదివారాలు ఇతర సాధారణ సెలవు రోజుల్లో రోజుకు వెయ్యి మంది వస్తారు. సంక్రాంతి సెలవులప్పుడు ఊహించనంత మంది పర్యాటకులతో నేలపట్టు కళకళలాడింది. ఏటా ఈ పక్షులు వచ్చిన సందర్భంగా ప్రభుత్వం ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహిస్తుంది. కరోనా కారణంగా ఈ ఏడాది ప్రభుత్వం వేడుకలు జరపలేదు. కానీ పర్యాటకులు మాత్రం వేడుకకు వచ్చినట్లే వచ్చారు. ప్రకృతి ఊయల నేలపట్టు బర్డ్ సాంక్చురీ 456 హెక్టార్లు ఉంటుంది. ఇందులో మూడు చెరువుల విస్తీర్ణం 80 హెక్టార్లకు పైగా ఉంటుంది. ఇక్కడ ఉండే కడప చెట్లు పక్షులు గూళ్లు కట్టుకోవడానికి అనువుగా ఉంటాయి. ఒక్కో చెట్టు మీద పాతిక – ముప్పై గూళ్ల వరకు ఉంటాయి. దట్టంగా విస్తరించిన ఈ చెట్ల కొమ్మలు, నిండుగా పక్షి గూళ్లతో గాలికి మంద్రంగా ఊగుతుంటాయి. బుజ్జి పక్షులకు ప్రకృతిమాత స్వయంగా ఊయల ఊపుతున్నట్లు ఉంటుంది. – ఫొటో సహకారం: శిఖాపల్లి శివకుమార్, దొరవారి సత్రం, సాక్షి నేలపట్టులో వలస పక్షులు నేలపట్టు గ్రామం... నెల్లూరు నగరం నుంచి 90 కి.మీ.లు, చెన్నై నుంచి 100, దొరవారి సత్రం మండల కేంద్రం నుంచి రెండు కిలోమీటర్ల దూరాన ఉంది. ప్రసిద్ధ ఆర్నిథాలజిస్ట్ డాక్టర్ సలీం అలీ 1970లో రైల్లో నెల్లూరు, గూడూరు మీదుగా చెన్నైకు వెళ్లేటప్పుడు ఈ పక్షులను గమనించాడు. ఆసక్తి కొద్దీ ఇక్కడ పర్యటించి పక్షులు ఎందుకు వస్తున్నాయో పరిశోధించి పుస్తకం రాశాడు. -
ప్రారంభమైన ఫ్లెమింగోల సందడి..
విహంగాల్లో రారాజైన గూడబాతులు (పెలికాన్).. ప్రపంచంలోనే అతి అందమైన పక్షులు ఫ్లెమింగోలు.. ఆహార వేటలో ఆకట్టుకునే విన్యాసాలు చేసే నారాయణ పక్షి.. జపం చేసే పెయింటెడ్ స్టార్క్స్.. చూపరులను ఆకట్టుకునే ఎర్రకాళ్ల కొంగలతో పాటు వందల రకాల అరుదైన పక్షి జాతులు జిల్లాలోని పక్షుల కేంద్రంలో సందడి చేస్తున్నాయి. జీవ వైవిధ్యానికి ప్రతీకగా నిలిచే పులికాట్ సరస్సు వేల విదేశీ పక్షుల ఆహార భాండాగారంగా విలసిల్లుతోంది. ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురవడంతో నెల రోజుల ముందు నుంచే జిల్లాలో ఫ్లెమింగోల సందడి ప్రారంభమైంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పక్షుల విడిది కేంద్రం నేలపట్టు. జీవ వైవిధ్యానికి నెలవైన ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు పులికాట్ విదేశీ వలస విహంగాల విహారంతో అరుదైన ప్రపంచంగా కనిపిస్తోంది. చెరువు నీటిలోని కడప చెట్లపై విడిది చేస్తున్న అతిథుల కిలకిలరావాలు, ఆహార వేటలో సాగించే విన్యాసాలు పక్షి ప్రేమికులను కనువిందు చేస్తున్నాయి. దశాబ్దాలుగా నేలపట్టు విదేశీ పక్షుల సంతనోత్పత్తి కేంద్రంగా భాసిల్లుతోంది. అక్టోబరు మాసం వచ్చిందంటే.. రంగు రంగుల పక్షులు వచ్చి వాలుతుంటాయి. సుమారు ఆరు నెలల పాటు ఇక్కడ విడిది చేసి సంతానోత్పత్తిని పెంచుకుని తిరిగి స్వస్థలాలకు పయనమవుతాయి. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురవడంతో నేలపట్టు చెరువులతో పాటు పులికాట్‌కు నీళ్లు రా వడంతో వలస పక్షులు నెల ముందుగానే చేరు కుని సందడి చేస్తున్నాయి. ►ఒక వైపు నేలపట్టు చెరువులో విదేశీ వలస విహంగాలు గుడ్లుపెట్టి పొదుగుతుంటే పులికాట్ సరస్సులో విహంగాలు ఆహార వేట సాగిస్తూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ►సూళ్లూరుపేట–శ్రీహరికోట రోడ్డులో పులికాట్ సరస్సులో నీళ్లు పుష్కలంగా చేరడంతో ఫ్లెమింగోలు, పెలికాన్స్, పెయింటెడ్ స్టార్క్స్ గుంపులు గుంపులుగా ఆహార వేటలో దర్శనమిస్తున్నాయి. ►సీగల్స్, చిలువలు, నీటికాకులు, నారాయణ పక్షులతో పాటు వివిధ రకాలకు చెందిన కొంగ జాతులు విపరీతంగా విడిది చేసి ఉన్నాయి. ►నేలపట్టును సంతానోత్పత్తి కేంద్రంగా, పులికాట్ సరస్సును ఆహార కేంద్రంగా చేసుకుని పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. హంసను పోలిన ఫ్లెమింగో ప్రపంచంలోనే అందమైన పక్షి ఫ్లెమింగో. ఈ పక్షి హంసను పోలి ఉంటుంది. శాఖాహారి. ఈ రకం పక్షులు అత్యంత అరుదుగా ఉన్నాయి. పులికాట్ సరస్సు మీద ఆçహార వేటలో గుంపులు గుంపులుగా చేరి పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తాయి. ►ఈ పక్షులు ఆ్రస్టేలియా, రష్యా, సైబీరియా నుంచి వలస వచ్చి గుజరాత్‌లోని రాణాఫ్కచ్ అనే ప్రాంతంలో సంతానోత్పత్తి చేసుకుంటూ పులికాట్ సరస్సును ఆహార కేంద్రంగా ఉపయోగించుకుంటున్నాయి. ►ఈ పక్షులు పులికాట్ సరస్సులో రోజుల తరబడి ఉంటాయని దీనిపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు చెప్పారు. ►పులికాట్ సరస్సులో ఉండే నాచును మాత్రమే తింటుంది. ►ఈ పక్షి చెట్ల మీద గూళ్లు కట్టుకోకుండా నేలమీద రంధ్రం చేసుకుని గుడ్లు పెట్టి పొదుగుతాయి. ►హంసలు పాలను నీళ్లును వేరు చేసినట్టు ఈ పక్షి నాచు తినేటప్పుడు బురదను నాచును వేరు చేసి ఆహారంగా తీసుకోవడం దీని ప్రత్యేకత. ఎర్రకాళ్ల కొంగల కేంద్రం వెదురుపట్టు, శ్రీహరికోట ఎర్రకాళ్ల కొంగలు (పెయింటెడ్ స్టార్క్స్) పక్షులు వెదురుపట్టు చెరువు, శ్రీహరికోట లోని బేరిపేట ప్రాంతాల్లో గూళ్లు కట్టు కు ని నివాసం ఉంటాయి. ఆహార వేటకు మాత్రం పులికాట్ సరస్సుకే వస్తాయి. ►రష్యా, సైబీరియా వంటి దేశాల నుంచి ఇక్కడికి వలస వచ్చి సంతానోత్పత్తిని చేసుకుని వెళ్తుంటాయి. ►ఇవి పులికాట్లో గుంపు గుంపులుగా విహరిస్తుంటాయి. అయితే వెదురుపట్టు చెరువు అనువుగా లేకపోవడంతో ఈ పక్షులు శ్రీహరికోటకు మకాం మార్చుకున్నాయి. ►ప్రస్తుతం శ్రీహరికోటను సంతానోత్పత్తి కేంద్రంగా చేసుకున్నాయి. ఇవి కూడా సరస్సులోని చేపలు, రొయ్యలు, పీతలను తింటుంది. అతి పెద్ద సంతానోత్పత్తి కేంద్రం ఆసియా ఖండంలోనే విదేశీ శీతాకాలపు వలస విహంగాల సంతానోత్పత్తి కేంద్రంగా, నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రంగా భాసిల్లుతుంది. 1976లో నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రంగా వన్యప్రాణి విభాగం అధికారులు గుర్తించారు. ఈ కేంద్రం 458.92 హెక్టార్లలో విస్తరించి ఉంది. ప్రస్తుతం పక్షుల కేంద్రంలో 11 రకాల పక్షులు 4 వేలకు పైబడి విడిది చేశాయి. ఇందులో గూడబాతులు (పెలికాన్) 850, నత్తగుల్ల కొంగలు (ఓపెన్‌బిల్ స్టార్క్స్) 2015, తెల్లకంకణాయిలు (వైట్‌ఐబీస్) 600, తెడ్డుముక్కు కొంగలు (స్పూన్ బిల్స్) 100, నారాయణ పక్షులు (నైట్హేరాన్) 250, నీటికాకులు (కార్మోరెంట్స్)300, చిన్న,పెద్ద స్వాతికొంగలు150 (ఈ గ్రేడ్స్), వీటితో పాటు పదుల సంఖ్యలో పాముమెడ పక్షులు (డాటర్), చుక్కకోళ్లు (కూట్స్), ఊలబాతులు (లేజర్ విజిలింగ్ డక్స్) సందడి చేస్తున్నాయి. సందడిగా పులికాట్ ప్రాంతం దొరవారిసత్రం, నేలపట్టులో గూడబాతులు, నత్తగుల్ల కొంగలు, నీటికాకులు, తెల్లకంకణాయిలు, శబరి కొంగలు వంటి పక్షులు కనిపిస్తున్నాయి. ఇక్కడకొచ్చే విదేశీ వలస పక్షుల్లో అతి అందమైన పక్షి ఫ్లెమింగో కావడంతో ఆ పక్షి పేరుతో ఏటా పండగను నిర్వహిస్తున్నారు. ► పులికాట్ సరస్సు, నేలపట్టులో కలిపి సుమారు 50 వేల విదేశీ వలస విహంగాలు ఇప్పటికే విచ్చేసినట్లు పులికాట్ వన్యప్రాణి సంరక్షణాధికారులు వెల్లడించారు. ►కుదిరి–అటకానితిప్ప గ్రామాల మధ్య సరస్సులో పర్యాటకులు విహంగాలను వీక్షించేందుకు రెండు, మూడు చోట్ల వ్యూ పాయింట్స్ ఏర్పాట్లు చేశారు. గూళ్లలో నివశించే పెలికాన్ పక్షుల్లో రారాజు గూడబాతులు (పెలికాన్). నైజీరియా, సైబీరియా, ఆ్రస్టేలియా నుంచి నేలపట్టు చెరువులోని చెట్ల మీద విడిది చేస్తున్నాయి. గూళ్లు కట్టుకుని అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు నేలపట్టులోనే ఉండి సంతానోత్పత్తిని చేసుకుని వెళ్తుంటాయి. ►ఈ రకం పక్షులు ప్రపంచ వ్యాప్తంగా ఏడు వేలు మాత్రమే ఉన్నాయని, ఇందులో నేలపట్టుకు సుమారు 2 వేలకు పైగా వస్తున్నాయని వీటిపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ►ఈ పక్షులు మనుషుల్లో ఉండే గుణాన్ని కలిగి ఉంటాయి. ఆడపక్షి గుడ్లు పెట్టి పొదుగులో ఉంటే మగపక్షి ఆహార వేటకు వెళ్లి తను తిని, తెడ్డులాంటి ముక్కు కింద ఉన్న సంచిలో ఆహారాన్ని తీసుకొచ్చి ఆడపక్షికి, పిల్లలకు అందిస్తుంది. ►నేలపట్టులో సంధ్య వేళ ఇలాంటి మనోహర దృశ్యాలు పర్యాటకులను ఆహ్లాద పరుస్తాయి. ►ఆడ పక్షి పిల్లలను పొదిగి అవి ఎగిరే దాకా మగపక్షే పోషించడం ఈ పక్షుల్లో ప్రత్యేకత. పులికాట్ సరస్సులో దొరికే చేపలు, పీతలు, రొయ్యలు దీని ఆహారం. నారాయణపక్షి నారాయణ పక్షులు తడ మండలం బోడిలింగాలపాడు, చింతవక్కలు, నీటికాకులు చిల్లకూరు మండలం చింతవరం వద్ద గూళ్లు కట్టుకుని నివాసం ఉంటున్నాయి. వాకాడు మండలం మొనపాళెం వద్ద చిన్నస్వాతి కొంగలు, పెద్ద స్వాతి కొంగలు కాకులతో కలిసి గూళ్లు కట్టుకుని ఉంటాయి. మనుబోలు చెరువులో ఐదారు రకాలు బాతులు ఉన్నాయి. మిగిలిన చాలా పక్షులు సమీప ప్రాంతాల్లో చెట్ల మీద గూళ్లు కట్టుకుని ఉంటూ శీతాకాలం అంతా ఇక్కడే ఉండి వెళ్తున్నాయని బాంబే బర్డ్స్ నేచరల్ సొసైటీ రీసెర్చ్‌లో వెల్లడైంది. రాత్రి గూటికి వెళ్లి తిరిగి వేకువ జాము నుంచి సరస్సుపై ఆహారం వేటలో విహరిస్తున్నపుడు అవి చేసే విన్యాసాలు పక్షి ప్రియులను అలరిస్తాయి. -
నేలపట్టుకు .. విదేశీ విహంగాలు!
ఆకాశంలో చక్కర్లు కొట్టుతున్న గూడబాతులు, తెల్లకంకణాయిలు దొరవారిసత్రం: నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రానికి విదేశీ వలస విహంగాల రాక మొదలైంది. మొన్నటి వరకు వెలవెలబోయిన పక్షుల కేంద్రం వాతవరణంలో మార్పు రావడంతో పాటు ఓ మోస్తరు వర్షం కురవడంతో చెరువుల్లోకి నీళ్లు చేరాయి. బుధవారం వందకు పైబడి నత్తగుళ్ల కొంగలు కడప చెట్లపై దర్శనమిచ్చాయి. బాతు జాతీకి చెందిన బుడ్డకోడి పక్షులు చెరువు నీటిలో ఈదుతూ కనిపించాయి. దీంతో విహంగాలు పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం ఉందని వన్యప్రాణి విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు. వాలని గూడబాతులు, తెల్లకంకణాయి వాతవరణంలో మార్పు వచ్చినప్పటికి కేంద్రంలో పరిస్థితులు అనుకూలించకపోవడంతో ప్రసిద్ధి చెందిన గూడబాతులు, తెల్లకంకణాయిలు ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయే తప్ప కిందకు దిగడంలేదు. ఇవి కేంద్రంలో విడిది చేయ్యందే పక్షుల కేంద్రంలో కిలకిలరావలు కనిపించవు. తెడ్డుముక్కు కొంగలు, స్వాతికొంగలు, నీటికాకులు, పాముమెడకొంగలు తదితర పక్షులు కేంద్రానికి విచ్చేసి సందడి చేయాల్సి ఉంది. సంతాన వృద్ధికి తప్పిన అదును సుదూరు ప్రాంతాల నుంచి పక్షుల కేంద్రంకి వచ్చే వేలాది వలస విహంగాల సంతాన వృద్ధి అదును ఈదఫా తప్పినట్లే. నేలపట్టు పక్షుల కేంద్రానికి కేవలం విహంగాలు వాటి వాటి సంతానాన్ని అభివృద్ధి చేసుకునేందుకు క్రమం తప్పకుండా వచ్చి వెళుతాయి. కానీ ఈసారి వాతవరణం అనుకూలించకపోవడంతో చెరువుల్లో నీళ్లు లేకుండాపోయాయి. ఇప్పుడు వర్షాలు పడి చెరువుల్లో పూర్తిస్థాయిలో నీళ్లు చేరినా వలస విహంగాలు ముందుగా ఆడ మగ స్నేహం కుదుర్చుకన్న తరువాత కడప చెట్లపై గూళ్లు కట్టాలి. అవి జత కట్టి గుడ్లు పెట్టి పొదగాలి. పిల్లలు చేసిన తరువాత అవి పెద్దవి అయ్యాక తిరిగి వాటి దేశాలకు వెళ్లిపోవాలి. ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే సుమారు ఏడు నెలలు పడుతుంది. పక్షుల సీజన్ సాధారంగా అక్టోబరు మాసంలో మొదలై ఏప్రిల్‌కు ముగిసిపోతుంది. ప్రస్తుతం వీటి సంతాన అభివృద్ధి చాలా కష్టమని వన్యప్రాణి అధికారులు, అటు సందర్శకుల పేర్కొంటున్నారు.