నేలపట్టు... శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓ గ్రామం. ఒకప్పుడుఆ జిల్లా వాళ్లకు కూడా పెద్దగా పరిచయం లేని గ్రామమే కానీ ఆస్ట్రేలియా ఉండే పెలికాన్ పక్షులకు ఇక్కడి వాతావరణం తెలుసు. రివ్వున గాల్లోకి ఎగురుతూ వచ్చేస్తాయి. ఈ రావడం ఏటా జరుగుతుంది. అక్టోబర్ నుంచి రాక మొదలవుతుంది, మార్చి– ఏప్రిల్ వరకు నేలపట్టులో ఉంటాయి. ఈ పక్షులు నేలపట్టులో గుడ్లు పెట్టి, పిల్లల్ని పొదిగి, వాటికి రెక్కలు వచ్చిన తర్వాత తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోతాయి. ఇలా నేలపట్టు ప్రపంచ ప్రఖ్యాతమైంది. ఆసియాలోని అతిపెద్ద బర్డ్ సాంక్చురీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
ఎప్పుడూ ఉండే ఈ విశేషాలతోపాటు ఈ ఏడాది రెండు విశేషాలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో చెరువులు నిండు కుండల్లా కళకళలాడాయి. దాంతో వలస పక్షులు ఒక నెల ముందుగానే వచ్చేశాయి. ఆస్ట్రేలియా నుంచి వచ్చే పెలికాన్, ఫ్లెమింగో, చుక్కల బాతు, గూడ కొంగలు, పొడుగు కాళ్ల కొంగలు, పొట్టి కాళ్లు పొడవు ముక్కున్న తెల్ల కొంగలు, తెడ్డు ముక్కు కొంగలు, ముదరు గోధుమరంగు కొంగలు... ఇలా రకరకాల పక్షులు ఏటా వచ్చినట్లే ఈ ఏడాది కూడా వచ్చాయి. ఈ పక్షులతోపాటు ఈ సారి సౌత్ అమెరికా నుంచి మరో అతిథి వచ్చింది. ఈ అతిథికి ఆర్నిథాలిస్టులు పెట్టిన పేరు ఊలీ నెక్ట్ స్టార్క్. కష్టపడి ఈ పేరు పలకడానికి ఇష్టపడని మన వాళ్లు లాగ్ లాగ్ అని పిలుస్తున్నారు.
ఐదు వేల పక్షులు
నేలపట్టు గ్రామానికి ఈ ఏడాది వలస పక్షులు ముందుగా రావడమే కాదు, ఎక్కువ సంఖ్యలో కూడా వచ్చాయి. దాదాపుగా ఐదు వేల పక్షులు ఉండవచ్చని అంచనా. అవి మరో మూడు వేల పిల్లలకు జన్మనిచ్చాయి. ఇవన్నీ మరో రెండు నెలల్లో తిరిగి వెళ్లి పోతాయి. అందుకే ఈ ఐదారు నెలల కాలం ఇక్కడ పర్యాటకుల రాక కూడా ఎక్కువగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు... కేరళ, కర్నాటక, తమిళనాడు నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. ఆదివారాలు ఇతర సాధారణ సెలవు రోజుల్లో రోజుకు వెయ్యి మంది వస్తారు. సంక్రాంతి సెలవులప్పుడు ఊహించనంత మంది పర్యాటకులతో నేలపట్టు కళకళలాడింది. ఏటా ఈ పక్షులు వచ్చిన సందర్భంగా ప్రభుత్వం ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహిస్తుంది. కరోనా కారణంగా ఈ ఏడాది ప్రభుత్వం వేడుకలు జరపలేదు. కానీ పర్యాటకులు మాత్రం వేడుకకు వచ్చినట్లే వచ్చారు.
ప్రకృతి ఊయల
నేలపట్టు బర్డ్ సాంక్చురీ 456 హెక్టార్లు ఉంటుంది. ఇందులో మూడు చెరువుల విస్తీర్ణం 80 హెక్టార్లకు పైగా ఉంటుంది. ఇక్కడ ఉండే కడప చెట్లు పక్షులు గూళ్లు కట్టుకోవడానికి అనువుగా ఉంటాయి. ఒక్కో చెట్టు మీద పాతిక – ముప్పై గూళ్ల వరకు ఉంటాయి. దట్టంగా విస్తరించిన ఈ చెట్ల కొమ్మలు, నిండుగా పక్షి గూళ్లతో గాలికి మంద్రంగా ఊగుతుంటాయి. బుజ్జి పక్షులకు ప్రకృతిమాత స్వయంగా ఊయల ఊపుతున్నట్లు ఉంటుంది.
– ఫొటో సహకారం: శిఖాపల్లి శివకుమార్,
దొరవారి సత్రం, సాక్షి
నేలపట్టులో వలస పక్షులు
- నేలపట్టు గ్రామం... నెల్లూరు నగరం నుంచి 90 కి.మీ.లు, చెన్నై నుంచి 100, దొరవారి సత్రం మండల కేంద్రం నుంచి రెండు కిలోమీటర్ల దూరాన ఉంది.
- ప్రసిద్ధ ఆర్నిథాలజిస్ట్ డాక్టర్ సలీం అలీ 1970లో రైల్లో నెల్లూరు, గూడూరు మీదుగా చెన్నైకు వెళ్లేటప్పుడు ఈ పక్షులను గమనించాడు. ఆసక్తి కొద్దీ ఇక్కడ పర్యటించి పక్షులు ఎందుకు వస్తున్నాయో పరిశోధించి పుస్తకం రాశాడు.
Comments
Please login to add a commentAdd a comment