migratory birds
-
‘అతిథులు’ ఆగయా..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రానికి విదేశీ వలస పక్షుల రాక మొదలైంది. ఇప్పటికే సంగారెడ్డి సమీపంలోని అభయారణ్యంతోపాటు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని పాకాల సరస్సుకు విదేశీ పక్షులు వచ్చి సందడి చేస్తున్నాయి. వాటిలో నార్తర్న్ షావెలర్.. నార్తర్న్ పిన్‌టైల్.. రెడ్ హెడ్ బంటింగ్.. బ్లాక్ హెడ్ బంటింగ్.. బ్లూత్రోట్.. రోజీ స్టార్లింగ్.. అ్రల్టామెరైన్ ఫ్లైక్యాచర్.. బ్లూథ్రోట్ బర్డ్, వెస్టర్న్ మార్‡్ష హారియర్, లిటిల్ కంఫర్ట్ బర్డ్, కామన్ పోచార్డ్ తదితర పక్షులు ఉన్నాయి. వెచ్చని వాతావరణం ఉండటంతో.. యూరప్, రష్యా, పశ్చిమాసియా దేశాల్లో మంచుచలికాలం నుంచి తప్పించుకోవడం కోసం వేల కిలోమీటర్లు ప్రయాణించి ఏటా నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య తెలంగాణ ప్రాంతానికి విదేశీ పక్షులు వస్తున్నాయి. అక్కడితో పోలిస్తే వెచ్చని వాతావరణం ఉండటంతోపాటు తగినంత ఆహారం లభిస్తుండటం, సంతానోత్పత్తికి అనువైన పరిస్థితులు ఉండటంతో రాష్ట్రంలోని అభయారణ్యాలు, సరస్సులకు విచ్చేస్తున్నాయి.చిత్తడి నేలలు.. స్వచ్ఛమైన నీరు..మంజీరా వన్యప్రాణుల అభయారణ్యంలో జీవవైవిధ్యమున్న చిత్తడి నేతలు, గడ్డి భూములున్నాయి. మంజీరా డ్యాం ఎగువన.. సింగూరు ప్రాజెక్టు దిగువన ఉన్న ఈ జలాశయంలో సుమారు 20 వరకు చిన్న దీవులున్నాయి. అవి స్థానిక పక్షులతోపాటు విదేశీ పక్షులకు గమ్యస్థానంగా మారాయి. మరోవైపు పాకాల సరస్సు వద్ద లిటిల్ కోర్మోరెంట్, మైక్రో కార్బోనైజర్, ఇండియన్ కోర్మోరెంట్, ఫలక్రోకోరాక్స్, ఇండియన్ పాండ్ హెరాన్, ఏర్డియోలాగ్రై, గ్లోసీఇబీస్, ప్లెగడీస్ ఫాల్సినీలియస్ తదితర విదేశీ పక్షులు సంచరిస్తున్నాయి. ఈ సరస్సు కాలుష్యరహితం కావడంతో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. దీనిచుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం ఉండటంతో పచ్చని చెట్లు విదేశీ పక్షుల విడిదికి నిలయంగా మారాయి. పాకాల అభయారణ్యంలో ఎత్తయిన చెట్లతోపాటు సరస్సులో స్వచ్ఛమైన నీరు ఉండటం వల్ల ఈ ప్రాంతానికి విదేశీ పక్షులు వస్తున్నాయని ప్రకృతి ప్రేమికులు చెబుతున్నారు. వలసపక్షుల సంఖ్య తగ్గిపోతోంది.. మంజీరా అభయారణ్యంతోపాటు అమీన్పూర్ చెరువు, కిష్టారెడ్డిపేట్ చెరువు, పోచా రం అభయారణ్యానికి విదేశీ పక్షులు వచ్చా యి. ఏటా సైబీరియా, చైనా, రష్యా వంటి దేశాల నుంచి ఈ పక్షులు వస్తుంటా యి. పట్టణీకరణ కారణంగా చెరువులు అన్యాక్రాంతం అవుతుండటంతో విదేశీ వలసపక్షుల సంఖ్య తగ్గిపోతోంది. వా తావరణంలో వస్తున్న మార్పులు కూడా ఇందుకు కొంత కారణమవుతున్నాయి. -
అముర్ ఫాల్కన్ సూపర్ర్...బర్డ్..
సాక్షి, అమరావతి: అలుపెరుగని బాటసారిలా... వేలాది కిలోమీటర్లు ఎగురుతూ అత్యంత సుదీర్ఘ ప్రయాణాలు చేసే అముర్ ఫాల్కన్ వలస పక్షుల్లో ఓ పక్షి తాజా పయనం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. భారత్ నుంచి బయలుదేరిన అముర్ ఫాల్కన్ 5 రోజుల 17 గంటల్లో సోమాలియా చేరుకుని, అక్కడ నుంచి కెన్యాలోకి ప్రవేశించింది. మధ్యలో ఎక్కడా ఆగకుండా పలు దేశాలతో పాటు, ఏకంగా అరేబియా సముద్రాన్ని కూడా దాటుకుని తన గమ్యస్థానం చేరుకుంది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు, స్థానిక వలంటీర్లు సైబీరియా నుంచి వచి్చన రెండు పక్షులను మణిపూర్‌లో పట్టుకుని వాటికి స్థానిక గ్రామాలైన చిలువాన్, గ్యాంగ్‌రామ్ పేర్లు పెట్టారు. ఈనెల 8వ తేదీన చిలువాన్–2 పక్షికి శాటిలైట్ రేడియో ట్యాగ్ అమర్చారు. మహారాష్ట్రలోని రత్నగిరిలో ఉన్న గుహగర్ నుంచి 10వ తేదీన నాన్‌స్టాప్ జర్నీ మొదలుపెట్టిన చిలువాన్–2, 15వ తేదీ నాటికి సోమాలియాలోని మొదటి గమ్యానికి చేరుకున్నట్లు రేడియో ట్యాగ్ ద్వారా పక్షి గమనాన్ని పర్యవేక్షించిన సైంటిస్టు సురేశ్ కుమార్ తెలిపారు. అయితే గ్వాంగ్రామ్ పేరు పెట్టిన మరో పక్షి మాత్రం తమెంగ్‌లాంగ్‌లోని చిలువాన్ రూస్టింగ్ సైట్లోనే ఉన్నట్లు గుర్తించారు. చిలువాన్–2 గ్రేట్ హార్న్ ఆఫ్ ఆఫ్రికాలోని స్కోటోరా ద్వీపం సమీపంలోని ఓ విమాన మార్గంలో ఉందని తెలిపారు. లక్షల సంఖ్యలో పక్షులు ‘ఆర్కిటిక్ టర్న్’ అనే పక్షి తర్వాత అత్యంత సుదీర్ఘ ప్రయాణాలు చేసే పక్షులుగా అముర్ ఫాల్కన్కు పేరుంది. 2018 నుంచి మణిపూర్‌లో ఈ పక్షుల వలస ప్రయాణాలు, మార్గాలను తెలుసుకునేందుకు రేడియో ట్యాగింగ్ చేసి అధ్యయనం చేస్తున్నారు. రేడియో ట్యాగ్లు అమర్చిన అన్ని పక్షులు గమ్యాలను చేరుకోలేకపోవడంతో వాటి గురించి పూర్తి వివరాలు తెలియలేదు. లక్షల సంఖ్యలో వెళ్లే పక్షుల్లో కేవలం రెండు, మూడు పక్షులకు మాత్రమే రేడియో ట్యాగ్లు అమర్చడం వల్ల వాటికి ఏమైనా హాని జరిగితే వాటి వలసల గురించి పూర్తి వివరాలు తెలుసుకోలేకపోతున్నారు. 2019లో ఒక అముర్ ఫాల్కన్ పక్షి సుదీర్ఘంగా ప్రయాణించి 26 వేల కిలోమీటర్లు వెళ్లడాన్ని గుర్తించారు. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా మళ్లీ చిలువాన్–2 ద్వారా కొన్ని వివరాలు సేకరించగలిగారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే పక్షుల వలస మార్గాన్ని అధ్యయనం చేయడం ఈ పరిశోధన లక్ష్యమని వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) సైంటిస్టు సురేశ్‌కుమార్ తెలిపారు. వాతావరణంలో జరిగే మార్పులను తెలుసుకోవడానికి ఈ పరిశోధన ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ పక్షులు పొలంలోని పురుగులు, క్రిములు, కీటకాలను తినడం ద్వారా రైతులకు ఎంతో మేలు చేస్తాయని, అవి రాకపోతే పంట దిగుబడులు కూడా అనూహ్యంగా తగ్గిపోయే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు.సైబీరియా టు ఆఫ్రికా... వయా ఇండియా ఫాల్కన్ కుటుంబానికి చెందిన పక్షుల్లో చిన్నవైన అముర్ ఫాల్కన్ పక్షులు ఆగ్నేయ సైబీరియా, ఉత్తర చైనాలో సంతానోత్పత్తి చేస్తాయి. వేసవికాలం అక్కడే ఉండే ఈ పక్షులు తీవ్రమైన శీతాకాలం నుంచి తప్పించుకోవడానికి ఆఫ్రికా తీర ప్రాంతాల్లోని శీతాకాలపు మైదానాలకు వెళతాయి. ఈ క్రమంలో 15 నుంచి 20 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. సైబీరియా నుంచి ఆఫ్రికాకు వెళ్లే మార్గ మధ్యంలో నాగాలాండ్, మణిపూర్ ఇతర ఈశాన్య రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాల్లో ఆగిపోతాయి. వీటిని నాగాలాండ్, మణిపూర్‌లో ‘అఖుయిపుయినా’ అని పిలుస్తారు. సగటున 45 రోజులు అవి ఇక్కడే ఉండి ఆహారాన్ని సమకూర్చుకుని సుదీర్ఘ ప్రయాణానికి అనువుగా సన్నద్ధమవుతాయి. నిరంతరాయంగా ఎగిరేందుకు వీలుగా బరువును తగ్గించుకుంటాయి. ఆఫ్రికాలో శీతాకాలం ముగిశాక ఏప్రిల్, మే నెలల్లో ఇవి తిరుగు ప్రయాణమై మళ్లీ సైబీరియా వెళతాయి. తిరిగి వెళ్లేటప్పుడు కూడా ఇవి మన దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఆగుతాయి. -
వలస విహంగాల సందడి
సూళ్లూరుపేట: విదేశీ వలస విహంగాల సందడితో.. ప్రకృతి అందాలకు హరివిల్లుగా పేరుగాంచిన పులికాట్ సరస్సు మరింత శోభను సంతరించుకుంటుంది. సుదూర ప్రాంతాల నుంచి శీతాకాలంలో మాత్రమే ఈ ప్రాంతానికి విచ్చేసే విదేశీ వలస పక్షులు నేలపట్టు, వెదురుపట్టు, శ్రీహరికోట తదితర ప్రాంతాల్లోని చెట్లపై గూళ్లు కట్టుకుని సంతానోత్పత్తి చేసుకుని తిరిగి వెళుతుంటాయి. అక్టోబర్ నుంచి మార్చి దాకా ఈ ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకుని నేలపట్టును బ్రీడింగ్ సెంటర్‌గా, పులికాట్ సరస్సును ఫీడింగ్ సెంటర్‌గా ఉపయోగించుకుని వెళుతుంటాయి. సంతానోత్పత్తి నేలపట్టులో, ఆహారం కోసం పులికాట్ సరస్సులో ఉంటూ.. పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. శ్రీహరికోట–సూళ్లూరుపేట రోడ్డుకు పక్కన వలస విహంగాలు వేల సంఖ్యలో దర్శనమిస్తున్నాయి. ఈ సారి సరస్సులో నీళ్లు సమృద్ధిగా ఉండడంతో వేల సంఖ్యలో ఫ్లెమింగోలు, ఫెలికాన్స్, పెయింటెడ్ స్టార్క్స్, ఇతర కొంగజాతులు గుంపులు గుంపులుగా చేరుకుంటున్నాయి. -
శీతాకాల అతిథులొచ్చేశాయ్!
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి శీతాకాల వలస పక్షుల రాక మొదలైంది. గ్రే వాగ్టైల్ (బూడిద రంగు జిట్టంగి) పక్షుల జత ఈ నెల 24న విశాఖ మన్యంలోని పాడేరు సమీపంలో కనువిందు చేశాయి. ఐఐఎస్ఈఆర్ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) బృందం వీటిని రికార్డు చేసింది. గ్రే వాగ్టైల్ పక్షులు శీతాకాలంలో ఏపీ అంతటా విస్తృతంగా కనిపిస్తాయి. ఈ పక్షులు ప్రధానంగా కీటకాలను తింటాయి. 18–19 సెంటీమీటర్ల పొడవు, 20 గ్రాముల బరువున్న ఈ పక్షులను ఎవరైనా సులభంగా గుర్తించవచ్చు. ఈ పక్షులు తోకను పైకి కిందకు కదిలిస్తుంటాయి. ఇవి ప్రతి ఏడాదీ వేసవిలో హిమాలయాలు, ఇంకా ఎత్తయిన ప్రాంతాల్లో సంతానోత్పత్తి చేస్తాయి. ఆ తర్వాత భారత్‌లో దక్షిణ ప్రాంతాలకు వలస వెళతాయి. అలా మన రాష్ట్రంలోకి పెద్ద సంఖ్యలో వస్తాయి. పంటలపై కీటకాలను తింటాయి.. పంటలపై ఉండే కీటకాలను ఎక్కువగా తినడం ద్వారా మన పర్యావరణ వ్యవస్థకు ఈ పక్షులు ఎంతో దోహదం చేస్తాయి. వీటికి అద్భుతమైన నావిగేషన్ (ప్రయాణ మార్గం) నైపుణ్యం ఉంటుంది. ఇవి శీతాకాలంలో ఒక ప్రదేశాన్ని సందర్శించిన తరువాత మరుసటి ఏడాది అదే ప్రదేశానికి వస్తుంటాయి. భారత్ వెలుపల మంగోలియా, సైబీరియా, రష్యా, చైనాలో ఈ పక్షులు సంతానోత్పత్తి చేస్తాయి. సెప్టెంబర్ నుంచి మార్చి వరకు రాష్ట్రంలో ఇక్కడ గడిపి మళ్లీ సంతానోత్పత్తి కోసం హిమాలయాలు, ఎత్తయిన ప్రాంతాలకు ఇవి వెళ్లిపోతాయి. శ్రావణమాసంలో వరలక్ష్మీదేవి వ్రతం తర్వాత ఈ పక్షులు తమ ఇంటికి లక్ష్మీదేవిలా వస్తాయని కొన్ని ప్రాంతాల్లో భావిస్తారు. తమిళనాడులోని వల్పరై హిల్ స్టేషన్ వాసులు ఈ పక్షుల రాకను వేడుకలా జరుపుతారు. 150 జాతుల వలస పక్షులు ప్రతి ఏడాది శీతాకాలంలో ఇతర రాష్ట్రాలు, దేశాలు, ఖండాల నుండి 150 కంటే ఎక్కువ జాతుల వలస పక్షులు ఏపీని సందర్శిస్తాయి. హిమాలయ పర్వత ప్రాంతాలు, యూరప్, రష్యా, చైనా, సైబీరియా, ఆర్కిటిక్, అట్లాంటిక్ నుండి ఇవి వస్తాయి. ఆగస్ట్, సెప్టెంబర్ చివరి నుంచి వీటి ఆగమనం ప్రారంభమవుతుంది. ఈ పక్షుల తరువాత వార్బ్లర్స్ (పాటల పిట్టలు), థ్రష్‌లు (గంటెపిట్టలు), ఫ్లై క్యాచర్లు (ఈగపట్టు పిట్టలు), హరియర్స్ (గద్దలు), కెస్ట్రెల్స్ (డేగల్స్) వంటి పెద్ద పక్షులు చిత్తడినేలలు, సాగు భూములకు వచ్చి ఎక్కువగా ఎలుకలను తింటుంటాయి. – బండి రాజశేఖర్, సిటిజన్ సైంటిస్ట్, ఐఐఎస్ఈఆర్, తిరుపతి -
లాగ్ లాగ్ కొత్త అతిథులు వస్తున్నాయి
నేలపట్టు... శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓ గ్రామం. ఒకప్పుడుఆ జిల్లా వాళ్లకు కూడా పెద్దగా పరిచయం లేని గ్రామమే కానీ ఆస్ట్రేలియా ఉండే పెలికాన్ పక్షులకు ఇక్కడి వాతావరణం తెలుసు. రివ్వున గాల్లోకి ఎగురుతూ వచ్చేస్తాయి. ఈ రావడం ఏటా జరుగుతుంది. అక్టోబర్ నుంచి రాక మొదలవుతుంది, మార్చి– ఏప్రిల్ వరకు నేలపట్టులో ఉంటాయి. ఈ పక్షులు నేలపట్టులో గుడ్లు పెట్టి, పిల్లల్ని పొదిగి, వాటికి రెక్కలు వచ్చిన తర్వాత తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోతాయి. ఇలా నేలపట్టు ప్రపంచ ప్రఖ్యాతమైంది. ఆసియాలోని అతిపెద్ద బర్డ్ సాంక్చురీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఎప్పుడూ ఉండే ఈ విశేషాలతోపాటు ఈ ఏడాది రెండు విశేషాలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో చెరువులు నిండు కుండల్లా కళకళలాడాయి. దాంతో వలస పక్షులు ఒక నెల ముందుగానే వచ్చేశాయి. ఆస్ట్రేలియా నుంచి వచ్చే పెలికాన్, ఫ్లెమింగో, చుక్కల బాతు, గూడ కొంగలు, పొడుగు కాళ్ల కొంగలు, పొట్టి కాళ్లు పొడవు ముక్కున్న తెల్ల కొంగలు, తెడ్డు ముక్కు కొంగలు, ముదరు గోధుమరంగు కొంగలు... ఇలా రకరకాల పక్షులు ఏటా వచ్చినట్లే ఈ ఏడాది కూడా వచ్చాయి. ఈ పక్షులతోపాటు ఈ సారి సౌత్ అమెరికా నుంచి మరో అతిథి వచ్చింది. ఈ అతిథికి ఆర్నిథాలిస్టులు పెట్టిన పేరు ఊలీ నెక్ట్ స్టార్క్. కష్టపడి ఈ పేరు పలకడానికి ఇష్టపడని మన వాళ్లు లాగ్ లాగ్ అని పిలుస్తున్నారు. ఐదు వేల పక్షులు నేలపట్టు గ్రామానికి ఈ ఏడాది వలస పక్షులు ముందుగా రావడమే కాదు, ఎక్కువ సంఖ్యలో కూడా వచ్చాయి. దాదాపుగా ఐదు వేల పక్షులు ఉండవచ్చని అంచనా. అవి మరో మూడు వేల పిల్లలకు జన్మనిచ్చాయి. ఇవన్నీ మరో రెండు నెలల్లో తిరిగి వెళ్లి పోతాయి. అందుకే ఈ ఐదారు నెలల కాలం ఇక్కడ పర్యాటకుల రాక కూడా ఎక్కువగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు... కేరళ, కర్నాటక, తమిళనాడు నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. ఆదివారాలు ఇతర సాధారణ సెలవు రోజుల్లో రోజుకు వెయ్యి మంది వస్తారు. సంక్రాంతి సెలవులప్పుడు ఊహించనంత మంది పర్యాటకులతో నేలపట్టు కళకళలాడింది. ఏటా ఈ పక్షులు వచ్చిన సందర్భంగా ప్రభుత్వం ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహిస్తుంది. కరోనా కారణంగా ఈ ఏడాది ప్రభుత్వం వేడుకలు జరపలేదు. కానీ పర్యాటకులు మాత్రం వేడుకకు వచ్చినట్లే వచ్చారు. ప్రకృతి ఊయల నేలపట్టు బర్డ్ సాంక్చురీ 456 హెక్టార్లు ఉంటుంది. ఇందులో మూడు చెరువుల విస్తీర్ణం 80 హెక్టార్లకు పైగా ఉంటుంది. ఇక్కడ ఉండే కడప చెట్లు పక్షులు గూళ్లు కట్టుకోవడానికి అనువుగా ఉంటాయి. ఒక్కో చెట్టు మీద పాతిక – ముప్పై గూళ్ల వరకు ఉంటాయి. దట్టంగా విస్తరించిన ఈ చెట్ల కొమ్మలు, నిండుగా పక్షి గూళ్లతో గాలికి మంద్రంగా ఊగుతుంటాయి. బుజ్జి పక్షులకు ప్రకృతిమాత స్వయంగా ఊయల ఊపుతున్నట్లు ఉంటుంది. – ఫొటో సహకారం: శిఖాపల్లి శివకుమార్, దొరవారి సత్రం, సాక్షి నేలపట్టులో వలస పక్షులు నేలపట్టు గ్రామం... నెల్లూరు నగరం నుంచి 90 కి.మీ.లు, చెన్నై నుంచి 100, దొరవారి సత్రం మండల కేంద్రం నుంచి రెండు కిలోమీటర్ల దూరాన ఉంది. ప్రసిద్ధ ఆర్నిథాలజిస్ట్ డాక్టర్ సలీం అలీ 1970లో రైల్లో నెల్లూరు, గూడూరు మీదుగా చెన్నైకు వెళ్లేటప్పుడు ఈ పక్షులను గమనించాడు. ఆసక్తి కొద్దీ ఇక్కడ పర్యటించి పక్షులు ఎందుకు వస్తున్నాయో పరిశోధించి పుస్తకం రాశాడు. -
కొత్తగా.. రెక్కలొచ్చెనా!
విజయవాడ పరిసర ప్రాంతాల్లో కొత్త పక్షి జాతులు పక్షి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. వలస వచ్చే పక్షి జాతులు, నీటి బాతులు ఆకర్షిస్తున్నాయి. మనదేశంలోని పలు ప్రాంతాల నుంచే కాక, విదేశాల నుంచి ఇక్కడికి తరలివస్తున్న మొత్తం 156 రకాల పక్షి జాతులు వెలుగుచూశాయి. విజయవాడ నేచర్ క్లబ్ ఆధ్వర్యంలో కొందరు ఔత్సాహికులు తాజాగా పక్షుల గణన చేపట్టారు. ఆ వివరాలు ఈ కథనంలో మీకోసం.. సాక్షి, అమరావతి: కొల్లేరు, ఉప్పలపాడు, కొండకర్ల.. మన రాష్ట్రంలో పక్షులు, వలస పక్షులకు స్థావరాలివి. పక్షి ప్రేమికులు మన రాష్ట్రంలో ఎక్కువగా ఈ ప్రాంతాలనే సందర్శిస్తుంటారు. లేదంటే రాజస్తాన్, గుజరాత్ వంటి చిత్తడి నేలలు ఎక్కువ ఉండే ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇప్పుడు విజయవాడ పరిసరాల్లోని చిత్తడి నేలల్లోనూ కొత్త పక్షులు కనువిందు చేస్తున్నాయి. కృష్ణా జిల్లాలో ఇప్పటి వరకు రికార్డుల్లో నమోదుకాని ఏడు రకాల కొత్త పక్షి జాతులు కనిపించాయి. సుదూర ప్రాంతాల నుంచి వలస వస్తున్న 25 విదేశీ పక్షి జాతులు దర్శనమిచ్చాయి. వీటితో కలిపి మొత్తం 156 రకాల పక్షి జాతులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయి. విజయవాడ నేచర్ క్లబ్ ఆధ్వర్యంలో నగర పరిసరాల్లోని చెరువులు, పంట పొలాల్లో చేపట్టిన తొలి విడత పక్షుల గణనలో వీటిని గుర్తించారు. కోకిల డేగ.. నామం బాతు.. విజయవాడ సమీపంలోని వెలగలేరు, కొండపావులూరు, నున్న, కవులూరు, పైడూరుపాడు, ఈడుపుగల్లు, ముస్తాబాద సహా 15 మంచినీటి చెరువులు, వాటి పరిసర ప్రాంతాలు, వాటి చుట్టుపక్కల పొలాల్లో ఇప్పటి వరకు పక్షుల గణన చేశారు. జిట్టంగి (బ్లైత్స్ పిపిట్), పెద్ద కంప జిట్ట (ఈస్టర్న్ ఓర్ఫియన్ వార్బ్లెర్), మెడను లింగాడు (యురేసియన్ వ్రైనెక్), కోకిల డేగ (క్రెస్టెడ్ గోషాక్), ఉడతల గెద్ద (పాలిడ్ హారియర్), నీలి ఈగపట్టు పిట్ట (వెర్డిటర్ ఫ్లైకాచర్), నూనె బుడ్డిగాడు (బ్లాక్ రెడ్‌స్టార్ట్) పక్షులను కొత్తగా కనుగొన్నారు. నీటి పక్షులు–బాతులు (మైగ్రేటరీ వాటర్‌ఫౌల్), నామం బాతు (స్పాటెడ్ యురేసియన్ వైజన్), సూదితోక బాతు (నార్తర్న్ పిన్‌టైల్), చెంచామూతి బాతు (నార్తర్న్ షోవెలర్) వంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన 25 రకాల వలస పక్షులను గుర్తించారు. వీటిలో ఎక్కువ పక్షులు యూరోప్, రష్యా, మంగోలియా, సైబీరియా, చైనా నుంచి వలస వస్తున్నాయి. కొన్ని పక్షులు హిమాలయాలు, రాజస్తాన్, గుజరాత్ రాష్ట్రాల నుంచి వలస వస్తున్నాయి. గుర్తించిన 152 పక్షుల్లో 14 రకాల జాతులు 1972 వన్యప్రాణ రక్షణ చట్టం షెడ్యూల్–1 పరిధిలో ఉన్నాయి. ఈ చట్టం ప్రకారం వీటిని వేటాడితే శిక్షార్హులే. 30 రకాల జాతులు తగ్గిపోతున్న పక్షుల జాబితాలో ఉన్నాయి. అటవీ శాఖ సహకారం అటవీ శాఖ మూడు, నాలుగు సంవత్సరాలకోసారి నిర్వహించే సర్వే తప్ప నిర్దేశించిన ప్రాంతంలో ఇప్పటి వరకు పక్షుల గణన ఏ జిల్లాలోనూ జరగలేదు. విజయవాడ నేచర్ క్లబ్ పేరుతో బండి రాజశేఖర్, దాసి రాజేష్‌వర్మ, డాక్టర్ కిశోర్‌నాథ్ మరికొందరు ఔత్సాహికులు ఐఐఎస్ఈఆర్, మథాయ్ నేచర్ కన్జర్వేషన్ ట్రస్ట్ సహకారంతో తొలిసారిగా ఈ గణన చేపట్టారు. అటవీ శాఖ సైతం ఇందులో పాలుపంచుకుంది. 28 మంది వలంటీర్లు వారాంతాలు, సెలవు రోజుల్లో 40 గంటలపాటు ఈ గణనలో పాల్గొన్నారు. రెండో విడత గణన ఈనెల నేటి నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు జరగనుంది. పక్షుల ఆవాసాలను రక్షించాలి విజయవాడ పరిసరాల్లో వలస పక్షులు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. ఎంతో దూరం నుంచి వస్తున్న వలస పక్షుల ఆవాసాలను రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. తొలిసారి చేపట్టిన పక్షుల గణనకు మంచి ఆదరణ వచ్చింది. రెండో విడత గణనలో మరిన్ని కొత్త పక్షులు కనిపిస్తాయని ఆశిస్తున్నాం. – బండి రాజశేఖర్, ఐఐఎస్ఈఆర్, సిటిజన్ సైన్స్ కో–ఆర్డినేటర్ -
బర్డ్‌ఫ్లూ కల్లోలం: 381 వలస పక్షులు బలి
న్యూఢిల్లీ: భారత్‌లో బర్డ్‌ఫ్లూ (హెచ్5ఎన్8) పంజా విసురుతోంది. పలు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో పక్షులు మృత్యువాత పడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో గురువారం 381 వలస పక్షులు ప్రాణాలు విడిచాయి. కర్ణాటకలో 6, గుజరాత్లో 4 కాకులు మరణించాయి. కేరళలో వేల సంఖ్యలో కోళ్లు, బాతులు మృతిచెందాయి. కేంద్ర బృందం కొట్టాయం, అలప్పుజా జిల్లాలో పర్యటిస్తోంది. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో 9 కాకులు మరణించాయి. బర్డ్‌ఫ్లూ వ్యాప్తి పెరుగుతుండడంతో పలు ఉత్తరాది రాష్ట్రాల్లో హైఅలర్ట్ విధించారు. ఇతర రాష్ట్రాల నుంచి కోళ్ల దిగుమతులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఢిల్లీ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇప్పటివరకు కేరళ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌లో మాత్రమే బర్డ్‌ఫ్లూ నిర్ధారణ అయినట్లు కేంద్రం స్పష్టం చేసింది. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. బర్డ్‌ఫ్లూతో మరణించిన పక్షులను దహనం చేసేందుకు పీపీఈ కిట్లు, ఇతర పరికరాలు సిద్ధం చేసుకోవాలని వెల్లడించింది. ఈ వ్యాధిపై, నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన కలి్పంచాలని కోరింది. పక్షులు, జంతు మాంసం తినేవారు బాగా ఉడికించిన తర్వాతే తినాలంది. కేరళలో రైతులకు నష్ట పరిహారం కేరళలోని అలప్పుజా, కొట్టాయం జిల్లాల్లో ఇప్పటిదాకా 69 వేలకు పైగా కోళ్లు, బాతులు మరణించాయి. వాటిని పెంచుతున్న రైతులకు నష్టపరిహారం అందజేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో బర్డ్‌ఫ్లూతో మరణించిన వలస పక్షుల సంఖ్య 3,409కు చేరింది. చత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ జిల్లాలోనూ కాకులు ప్రాణాలు కోల్పోయాయి. కర్ణాటకలో మృతిచెందిన కాకుల నమూనాలను పరీక్షల కోసం పంపినట్లు మంత్రి చెప్పారు. గుజరాత్ రాష్ట్రం మెహసానా జిల్లాలోని ప్రఖ్యాత సూర్య దేవాలయంలో 4 కాకులు మరణించినట్లు అధికారులు చెప్పారు. ఒడిశాలో బర్డ్‌ఫ్లూ అడుగు పెట్టకుండా కఠిన చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది. -
మృత్యు దారం!
ఇదే పొజిషన్లో మనం ఉంటే. తినలేక.. తీయడానికి రాక.. రోజురోజుకీ కృశించిపోయి.. నరకయాతన పడుతూ.. చనిపోవడం ఖాయం. ఎంత దారుణం ఇది.. ఈ పాపం ఎవరిది? అచ్చంగా మనదే.. మన నిర్లక్ష్యానిదే.. సాక్షి, హైదరాబాద్: బీహెచ్ఈఎల్ సమీపంలోని అమీన్పూర్ మున్సిపాలిటీలోని అమీన్పూర్ చెరువు వద్ద ప్రస్తుత పరిస్థితి ఇదీ.. పట్టణ ప్రాంతంలో ఉన్నప్పటికీ జీవవైవిధ్య వారసత్వ జలాశయంగా గుర్తింపు దక్కించుకున్న తొలి చెరువు ఇది.. ఎందుకంటే అక్కడ 364 రకాల జాతుల ప్రాణులు జీవనం సాగిస్తున్నాయి. అందులో 166 రకాల పక్షులున్నాయి. ఇటు ఏటా 60 జాతుల వరకు విదేశీ పక్షులు వలస వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి పిల్లలను పొదిగి తిరిగి సొంత ప్రాంతాలకు వెళ్తుంటాయి. ఇక 16 రకాల పాములు, 10 రకాల చేపలు, 10 రకాల బల్లి, తొండ జాతులు, మూడు రకాల ఊసరవెల్లులు, 41 రకాల సీతాకోకచిలుకలు, 7 రకాల తూనీగలు, 26 రకాల కీటకాలు.. ఒకటేమిటి అదో అద్భుత జీవవైవిధ్యం.. చుట్టూ జనావాసాలే.. అయినా ఆకట్టుకునే జీవవైవిధ్యం దాని సొంతం.. దేశంలోనే అలాంటి ప్రత్యేకత పొందిన ఆ అద్భుతాన్ని మనమెలా చూసుకోవాలి.. కంటికి రెప్పలా కాపాడుకుంటూ భావితరాలకు దాన్ని అందించాలి.. కానీ అధికారులు పట్టించుకోవట్లేదు. ప్రజలైనా పరిరక్షిస్తున్నారా అంటే అదీ లేదు.. ఏంటా ప్రమాదం.. అమీన్పూర్ చెరువుకు ఏటా ఫ్లెమింగో లు, స్పాట్ బిల్డ్ పెలికాన్స్, గ్రే హెరాన్స్, బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్స్, కింగ్ ఫిషర్, ఆ్రస్పే.. ఇలా దాదాపు 60 రకాల జాతుల వరకు విదేశీ వలస పక్షులు వస్తుంటాయి. ప్రాణాధారమై న ఆ చెరువే ఇప్పుడు పక్షుల మరణ శాసనం లిఖిస్తోంది. దారాల రూపంలో ఉరితాళ్లు చెరువులోని పక్షులను కబలిస్తున్నాయి. ఇళ్లల్లో పూజలు చేసిన తర్వాత దేవుడికి సమరి్పంచిన పూలను చాలామంది నీటిలో వేస్తుంటారు. చాలా చెరువుల్లో డ్రైనేజీ నీరు కలుస్తుండటంతో వాటిలో వేయటాన్ని అపవిత్రంగా భావిస్తున్నారు. దీంతో వారి దృష్టి అమీన్పూర్ చెరువుపై పడింది. చాలా ప్రాంతాల నుంచి జనం పూలమాలలను తెచ్చి ఈ చెరువులో వేస్తున్నారు. కొంతకాలానికి పూలు కుళ్లి నీటిలో కలిసి వాటి దారాలు మాత్రం తేలుతున్నాయి. ఆహార వేటలో భాగంగా తలభాగాన్ని నీటిలో ముంచిన సమయంలో ఆ దారాలు పక్షుల ముక్కులకు చుట్టుకుంటున్నాయి. కొన్నింటికి రెక్కలు, కాళ్లకు చిక్కుకుంటున్నాయి. దీంతో వాటిని విడిపించుకోలేక క్రమంగా నీరసించి అవి చనిపోతున్నాయి. గతంలో ఉస్మాన్‌సాగర్, హిమాయత్సాగర్లలో పాత వలల భాగాలు పక్షుల ముక్కులకు చుట్టుకుని మృత్యువాత పడుతుండేవి. తాజాగా యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యులు అమీన్పూర్ చెరువు వద్ద పరిశుభ్రత చర్యలు చేపట్టారు. అమీన్పూర్ చెరువు వద్ద పరిశుభ్రత చర్యలు చేపడుతున్న యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యులు కొత్తగా మాస్కులు.. ప్రస్తుతం కరోనా భయంతో వాడిన మాస్కులు కూడా పెద్ద మొత్తంలో చెరువు తీరంలో కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. వాడిన మాస్కుల వల్ల ఇక్కడి జీవజాతులకు ముప్పు పొంచి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ జీవవైవిధ్య ప్రాంతాన్ని జీహెచ్ఎంసీ లేదా ఇతర పెద్ద సంస్థలు తమ అ«దీనంలోకి తీసుకొని పూర్తి స్థాయిలో సరిదిద్దాల్సిన అవసరముందని ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. ఇదీ చరిత్ర ఈ చెరువును ఇబ్రహీం కుతుబ్‌షా హయాంలో 1560 ప్రాంతంలో నిర్మించారు. దివానంలో నవాబు సలహాదారుగా ఉన్న ఖాదిర్ అమీన్ ఖాన్ పటాన్చెరు ప్రాంతంలో ఉన్న తన వ్యవసాయ భూములకు సాగునీటి కోసం దీన్ని నిర్మించారట.. 300 ఎకరాల్లో ఉన్న చెరువు కాస్తా రానురాను 93 ఎకరాలకు కుంచించుకుపోయింది. అద్భుతాన్ని పాడుచేస్తున్నారు.. ‘నగరంలో ఇలా గొప్ప జీవవైవిధ్య జలాశయం ఉండటం అరుదు. ఇప్పుడు వలస పక్షుల రాక మొదలైంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు అవి కనువిందు చేస్తాయి. అలాంటి అద్భుత వనరును ప్రజలే పాడుచేస్తుండటం దారుణం. ప్రజల్లో అవగాహన తేవటంతోపాటు దాని పరిరక్షణకు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముంది’ – సంజీవ్‌వర్మ, యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ గతేడాది కొత్త అతిథి ఆస్ప్రే.. అంతెత్తు నుంచి వేగంగా నీటి మీదకు దూసుకొచ్చి రెండు కాళ్లతో చేపను ఒడిసిపట్టుకుని రివ్వున ఎగిరిపోయే తెలుపు–గోధుమ వర్ణం గద్ద గతేడాది ఇక్కడ కనిపించింది. ఆ్రస్పేగా పిలిచే ఈ పక్షి మనదేశంలో కొన్ని ప్రాంతాల్లోనే ఉంది. మనవద్ద కనిపించదు. గతేడాది వలస పక్షిగా అది ఇక్కడ కనిపించినట్టు బర్డ్ వాచర్స్ చెబుతున్నారు. -
361 రోజులు.. 29 వేల కిలోమీటర్లు
సాక్షి, అమరావతి: వలస పక్షుల సుదీర్ఘ ప్రయాణాలు సాధారణ విషయమే. కానీ రెండు అమూర్ డేగలు (అమూర్ ఫాల్కన్స్) ఏకంగా రెండు మహా సముద్రాలను దాటి, పదికిపైగా దేశాలను చుట్టి 29 వేల కిలోమీటర్లు ప్రయాణించి రికార్డు సృష్టించాయి. వాటికి అమర్చిన శాటిలైట్ రేడియో ట్రాన్స్మీటర్ల ద్వారా పరిశోధకులు ఆ పక్షుల రూట్, ప్రయాణించిన దూరాన్ని తెలుసుకున్నారు. ఆర్కిటిక్ టెర్న్ తర్వాత ప్రపంచంలోనే ఎక్కువ దూరం ప్రయాణించిన పక్షులుగా ఇవి ఇప్పుడు గుర్తింపు పొందినట్లు చెబుతున్నారు. అమూర్ డేగల వలస మార్గం, ప్రయాణం గురించి అధ్యయనం చేయడానికి సైబీరియాలోని అమూర్ నుంచి మణిపూర్ వచ్చిన ఐదు పక్షులకు గతేడాది నవంబర్ 2న వైల్డ్ లైఫ్ సొసైటీ ఆఫ్ ఇండియా, మణిపూర్ ఫారెస్ట్ శాఖ సంయుక్తంగా శాటిలైట్ రేడియో ట్రాన్స్మిటర్లు అమర్చింది. వాటికి చ్యులాన్, ఇరాంగ్, బారక్, ఫలాంగ్, పుచింగ్ అని పేర్లు పెట్టారు. బారక్, ఫలాంగ్, ఫుచింగ్‌ల నుంచి సిగ్నల్ రావడం చాలా కాలం క్రితమే ఆగిపోవడంతో అవి చనిపోయినట్లు భావించారు. కానీ చ్యులాన్, ఇరాంగ్ నుంచి నిరంతరం సిగ్నల్స్ వచ్చాయి. ఆడ పక్షి చ్యులాన్ 29 వేల కి.మీ. ప్రయాణించి తన వలస మార్గాన్ని (361 రోజుల్లో) పూర్తిచేసి ఇటీవలే మణిపూర్‌లో తన తాత్కాలిక స్థావరానికి చేరుకుంది. మగ పక్షి ఇరాంగ్ 33 వేల కి.మీ. ప్రయాణించి తర్వాత అక్కడకు చేరింది. డేగల రూట్ ఇదే.. ► చైనా నుంచి బయలుదేరి థాయ్‌లాండ్, మయన్మార్ మీదుగా మన దేశంలోని మణిపూర్‌లోకి వచ్చాక వాటికి జియో ట్యాగ్లు అమర్చారు. వాటి సిగ్నల్ ఆధారంగా బంగాళాఖాతం తీరంలో మన దేశంలోని ఏపీ, కర్ణాటక పలు ప్రాంతాల నుంచి అరేబియా సముద్రం దాటి ఆఫ్రికా ఖండంలోని సోమాలియా, కెన్యా, టాంజానియా, జాంబియా, జింబాబ్వే, బొట్స్వానా మీదుగా దక్షిణాఫ్రికా వెళ్లి అక్కడ శీతాకాల విడిది చేశాయి. మళ్లీ తిరిగి ఇదే రూట్లో మణిపూర్ చేరుకున్నాయి. తర్వాత ఇవి చైనా, రష్యా ప్రాంతానికి వెళ్లిపోయాయి. ► అమూర్ డేగలు నాగాలాండ్ ప్రాంతానికి లక్షల్లో వలస వస్తాయి. శీతాకాలంలో ఆ ప్రాంతంలోని అడవులు, పంటల్లో చెదలు, క్రిమి కీటకాలను ఇవి తినేవి. అయితే స్థానికులు పెద్దఎత్తున వేటాడడంతో వాటి రాక తగ్గిపోయింది. దీనివల్ల పంటలు, అడవులు క్రిమి కీటకాలతో నాశనమవుతున్నట్లు గుర్తించి వేటాడడం నిలిపివేశారు. ► అప్పటి నుంచి మళ్లీ అమూర్ డేగలు వస్తుండడంతో వారికి క్రిమి సంహారక మందులు వాడాల్సిన అవసరం ఉండడంలేదని చెబుతున్నారు. ఇప్పుడు నాగాలాండ్‌కు అమూర్ డేగలు వచ్చే సమయంలో పండుగ నిర్వహిస్తున్నారు. వాటిని చూడ్డానికి పెద్దఎత్తున పర్యాటకులు వస్తున్నారు. గుంపులుగానే ప్రయాణం ► కంటి పాచ్ నల్లగా ఉంటుంది. కంటి చుట్టూ ఆరెంజ్ రంగు వలయం ఆకర్షణీయంగా ఉంటుంది. ► గుండ్రని వంపు గల రెక్కలు ఉంటాయి. అత్యంత స్నేహశీలి. సంధ్యా సమయంలో చాలా చురుగ్గా ఉంటుంది. ► కాళ్లు, పాదాలు.. ఎరుపు, ఆరెంజ్ రంగుల మేళవింపుతో ఉంటాయి. చిన్నపాటి తోక కలిగి ఉంటాయి. ► మధ్య, తూర్పు హిమాలయాల్లో.. దక్షిణ అస్సాం కొండలు, శ్రీలంక,భారతదేశంలోని సముద్రతీరం, మాల్దీవులు, ఈశాన్య ఆసియా,ఆగ్నేయ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ► గుంపులుగా కలిసి వలస వెళ్తాయి. ఒక్కో సారి ఇతర జాతుల పక్షులతో కలిసి కూడా ప్రయాణిస్తాయి. చెట్ల పొదలను ఇష్టపడతాయి. ► గడ్డిభూములు, చిత్తడి నేలలు, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువగా ఆవాసాలు ఏర్పరచుకుంటాయి. చెట్ల రంధ్రాలు, పాత గూళ్లలో విశ్రాంతి తీసుకుంటాయి. ఎరుపు రంగును చూస్తే ఆందోళనకు గురవుతాయి. మగ డేగ ముదురు బూడిద, ఎరుపు రంగులో ఉంటుంది. రెక్కల వెనుక భాగం తెల్లగా ఉంటుంది. తొడల భాగం గోధుమ వర్ణంలో ఉంటుంది. కడుపు భాగంలో నల్లటి మచ్చలు ఉంటాయి. ఆడ డేగ పై భాగం లేత బూడిద రంగులో ఉంటుంది. నుదుటి భాగం క్రీమ్ కలర్లో ఉంటుంది. ఛాతీ భాగంలో తెలుపు, బూడిద రంగులో పెద్ద మచ్చలు ఉంటాయి. తోక, ఈకలు కొంచెం నలుపు రంగులో ఉంటాయి. పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి అమూర్ డేగలు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి. క్రిములను తిని బతికే పక్షుల్లో అత్యధిక దూరం ప్రయాణించేవి ఇవే. ఆగకుండా నాలుగైదు వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. మన రాష్ట్రం ఈ పక్షుల వలస మార్గం. తిరుపతి, విశాఖలో గతంలో కనిపించాయి. మచిలీపట్నంలోనూ దీన్ని గుర్తించారు. నైరుతి రుతు పవనాలు, సముద్రంలో ఏర్పడే అల్ప పీడనాలను ఉపయోగించుకుని ఇవి ప్రయాణిస్తున్నట్లు ప్రాథమికంగా తేలింది. వీటిపై ఇంకా పరిశోధనలు చేయాల్సి ఉంది. – రాజశేఖర్ బండి,సిటిజన్ సైన్స్ కో–ఆర్డినేటర్, ఐఐఎస్ఈఆర్ -
బెజవాడ పరిసరాల్లో అరుదైన వన్యప్రాణులు
సాక్షి, అమరావతి: విజయవాడ పరిసర ప్రాంతాల్లో పలు కొత్త వన్యప్రాణుల ఉనికి పర్యావరణవేత్తల్లో ఆశలు చిగురింపజేస్తోంది. వాతావరణ మార్పులు, కరువవుతున్న పచ్చదనంతో జీవవైవిధ్యం దెబ్బతిన్న పరిస్థితుల్లోనూ కృష్ణా జిల్లాలో కొండపల్లి అటవీ ప్రాంతం, మరికొన్నిచోట్ల అరుదైన వన్యప్రాణుల్ని గుర్తించారు. ఇంతవరకు ఈ ప్రాంతంలో ఎప్పుడూ చూడని కొత్త రకం చుంచు (మద్రాస్ ట్రీష్రూ), ఐదు చారల తాటి ఉడత, పెద్ద రెక్కల గద్ద (స్టెప్పీ ఈగిల్)ను ఐఐఎస్ఈఆర్ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) కనుగొంది. కొన్నేళ్ల నుంచి కొండపల్లి రిజర్వు ఫారెస్టులోని మూలపాడు అటవీ ప్రాంతంలో జీవవైవిధ్యం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ ఉన్న చెట్లు, వాతావరణం వల్ల అటవీ ప్రాంతం అభివృద్ధి చెందడంతో వన్యప్రాణుల మనుగడ పెరిగింది. ఈ నేపథ్యంలోనే పలు కొత్త వన్యప్రాణుల ఉనికి బయటపడినట్లు ఐఐఎస్ఈఆర్ అంచనా వేస్తోంది. పెద్ద రెక్కల గద్ద (స్టెప్పీ ఈగిల్) శీతాకాలంలో భారత ఉపఖండంలో అరుదుగా కనిపించే అతిపెద్ద గద్ద ఇది. మధ్య ఆసియా, మంగోలియా నుంచి చలికాలంలో ఈ పెద్ద రెక్కల గద్దలు మనదేశానికి వస్తాయి. అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉంది ఈ గద్ద. ఇటీవల విజయవాడ రూరల్ మండలం అంబాపురంలో ఒక వ్యక్తి పొలంలో దీన్ని ఫొటో తీయడంతో వీటి ఉనికి బయటపడింది. ఇవికాకుండా శీతాకాలంలో పలు వలస పక్షులు ఈ ప్రాంతానికి ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించారు. వాటిలో అరుదుగా ఉండే కోకిల, పలు రకాల గద్దలు కూడా ఉన్నాయి. కొత్త రకం చుంచు (మద్రాస్ ట్రీష్రూ) కృష్ణా జిల్లా మూలపాడు సీతాకోక చిలుకల పార్కులో సెప్టెంబర్ 10న దీన్ని గుర్తించారు. కీటకాలు, విత్తనాలు తిని జీవించే ఈ చుంచు జాతి ప్రాణులు రాతి ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. ఉడతల మాదిరిగా ఉండే ఇవి నడుస్తున్నప్పుడు తోకపైకి వంగి ఉంటుంది. 1850లో నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల మధ్య కొండల్లో మొదటిసారిగా వీటిని కనుగొన్నారు. అంతకుముందు విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లా అటవీ ప్రాంతాల్లోనూ సంచరించినట్లు గుర్తించారు. ఐదు చారల తాటి ఉడుత మన ఇళ్ల వద్ద కనిపించే సాధారణ ఉడుత శరీరంపై మూడు చారలు మాత్రమే ఉంటాయి. ఐదు చారల తాటి ఉడుతలున్నా అవి అంతరించిపోయినట్లు భావించారు. కానీ సెప్టెంబర్ 10న మూలపాడు అడవిలో, 11న విజయవాడ రూరల్ మండలం నున్న సమీపంలో వీటిని గుర్తించారు. ఈ ప్రాంతంలో వీటి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కొత్త జాతులు చాలా ఉన్నాయి మూలపాడు ప్రాంతంలో జీవవైవిధ్యం బాగుండటంతో కొత్త వన్యప్రాణులు ఇక్కడ కనిపిస్తున్నాయి. విజయవాడ పరిసరాల్లో ఇప్పటివరకు 630 జాతుల (పక్షులు, కీటకాలు, సాలె పురుగులు, క్షీరదాలు మొదలైనవి)ను రికార్డు చేశాం. 260కి పైగా పక్షి జాతుల సమాచారం మా వద్ద ఉంది. ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కువ జీవజాతులు ఉన్నాయని భావిస్తున్నాం. ఐఐఎస్ఈఆర్ బయాలజీ విభాగం, దులీప్ మాథై నేచర్ కన్జర్వేషన్ ట్రస్ట్ సహకారంతో తిరుపతి, విజయవాడలో సర్వే చేస్తున్నాం. – రాజశేఖర్ బండి, సిటిజన్ సైన్స్ కో–ఆర్డినేటర్, ఐఐఎస్ఈఆర్ -
పెలికాన్ @ తెలినీల్లాపురం
సాక్షి, హైదరాబాద్: కొన్ని పక్షులు ప్రపంచమంతా ప్రయాణం చేస్తాయి. కొందరు పక్షి ప్రేమికులు పక్షుల కోసం ప్రపంచం అంతా ప్రయాణాలు చేస్తారు. టూర్లందు బర్డ్ వాచింగ్ టూర్లు వేరయా.. అన్నట్టుగా వీరి అనుభవాలు ఉంటాయి. నగరానికి చెందిన జయలక్ష్మి.. తాను చేసిన ఓ టూర్ గురించి చెప్పిన విశేషాలు వింటే.. పక్షుల కిలకిలరావాలు మదిలో ప్రతిధ్వనిస్తాయి. తాను వెళ్లిన వలస పక్షుల కేంద్రం గురించి జయలక్ష్మి పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే.. సైబీరియా నుంచి వచ్చే చుట్టాలు.. ఏటా మన దగ్గరకు వచ్చి పిల్లలకు రెక్కలు వచ్చాక తీసుకు వెళ్లిపోతాయి. పుట్టింటికి ఆడపిల్ల వచ్చినట్లు, పుట్టింటి వాళ్లను సంతోషపెట్టినట్లు ఊరంతటినీ అలరిస్తాయి పెలికాన్(గూడబాతు), పెయింటెడ్ స్టార్క్(ఎర్ర జడ పిట్ట). ఈ వలస పక్షులు సైబీరియా నుంచి తెలుగు రాష్ట్రానికి వస్తాయి. ఆ రావడం ఊరికే రావు. ఏరియల్ సర్వే చేస్తాయి. నీటి చెరువులు, దట్టమైన చెట్లు ఉన్న ప్రదేశాన్ని ఎంచుకుని మరీ విడిదికి సిద్ధమవుతాయి. అలా పదిహేనేళ్ల నుంచి శ్రీకాకుళంలోని తేలినీలాపురాన్ని కొత్త విడిదిగా మార్చుకున్నాయి వలస పక్షులు. తేలి నీలాపురం శ్రీకాకుళం జిల్లా, టెక్కలి మండల కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరాన ఉంది. వైజాగ్– కోల్‌కతా రైల్వే లైన్లో నైపడ స్టేషన్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరం. పెద్దగా ప్రచారానికి నోచుకుని ఈ అందమైన ప్రదేశం.. పక్షి ప్రేమికుల పాలిట స్వర్గధామం అనే చెప్పాలి. టెక్కలి పట్టణంలో బస చేసి తెల్లవారు జామునే బయలుదేరి తేలినీలాపురం బర్డ్ సాంక్చురీకి బయలు దేరితే గూడు వదిలి ఆహారానికి బయలుదేరే పక్షులు కనువిందు చేస్తాయి. ఆకాశంలో రెక్కలు విచ్చుకున్న పక్షుల తోరణాలను చూడాల్సిందే తప్ప వర్ణించలేం. ఆరు నెలల ఆవాసం.. చేపలే ఆహారం.. ఈ పక్షుల రాక ఏటా సెప్టెంబర్ నెలలో మొదలవుతుంది. అక్టోబర్ ఆఖరుకి పూర్తిగా వచ్చేస్తాయి. చెట్ల కొమ్మల మీద దట్టమైన గూళ్లు కట్టుకుని ఆరు నెలల ఆవాసానికి సిద్ధమైపోతాయి. గుడ్లు పెట్టి, పొదిగి, మార్చి నాటికి తిరుగు ప్రయాణమవుతాయి. ఏప్రిల్ ఆఖరుకి అన్ని పక్షులూ వెళ్లిపోతాయి. ‘ఈ పక్షులు ఇక్కడికే ఎందుకు వస్తున్నాయి’ అని ఓ స్థానికుడిని అడిగినప్పుడు అతడు చెప్పిన విషయాలు చాలా ఆశ్చర్యం కలిగించాయి. వాతావరణంతోపాటు ఆహారం సమృద్ధిగా ఉన్న చోటుకే తొలి ప్రాధాన్యం. మంచి చేపలు దొరికే ప్రదేశాన్ని ఎంపిక చేసుకుంటాయి. ఇవి ఇతర పక్షుల్లా గింజలను తినవు. పెద్ద పక్షులు ఒక్కోటి రోజుకు నాలుగు నుంచి ఆరు కిలోల చేపలను తింటాయి. తేలినీలాపురానికి చుట్టు పక్కల రెండున్న కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎనిమిది చెరువులు ఉన్నాయి. ఇక ఇక్కడ చింతచెట్లు ఎక్కువ. దాంతో పెద్ద గూళ్లు కట్టుకోవడానికి అనువుగా ఉంటాయి. అందుకే ఈ పక్షులు ఈ గ్రామానికి వస్తున్నాయని చెప్పాడు. ఎంపిక ఆడపక్షిదే ఏ పక్షితో జతకట్టాలనే నిర్ణయం ఆడపక్షిదే. ఒకసారి జత కట్టి గూడులో నివసించడం మొదలైన తర్వాత గుడ్లు పెట్టి, పొదిగి, పిల్లలను పోషించే వరకు ఆ పక్షుల సహచర్యం కొనసాగుతుంది. ఒక సీజన్‌కి అవి నాలుగు గుడ్ల వరకు పెడతాయి. అయితే వాటిలో పొదిగి పిల్లలయ్యేది సగం గుడ్లే. ఈ గుడ్లు పొదగడానికి పాతిక నుంచి ముప్పై రోజులు పడుతుంది. పెలికాన్లు గుడ్లను పొదగడంలో మగ–ఆడ పక్షులు రెండూ భాగం పంచుకుంటాయి. ఒక పక్షి గుడ్ల మీద ఉంటే మరో పక్షి ఆహారం తెస్తుంది. ఇవి ఆహారం కోసం ఉదయం ఏడు గంటలకే బయలుదేరి పది గంటలకు తిరిగి గూటికి చేరతాయి. మరో విడత మూడు గంటలకు వెళ్లి ఐదు గంటలకు గూళ్లను చేరతాయి. సూర్యుడి కిరణాలు నిట్టనిలువుగా పడుతున్నప్పుడు చూపు చెదురుతుంది. నీటిలో కదలాడే చేపల ఆనవాళ్లు దొరకడం కష్టం. అందుకే ఇలా టైమింగ్స్ సెట్ చేసుకున్నాయవి. వాచ్ టవర్ తేలినీలాపురం చిన్న గ్రామం. వలస పక్షుల సీజన్లో ఇళ్లకంటే పక్షుల గూళ్లే ఎక్కువగా కనిపిస్తాయి. నాలుగు వందలకు పైగా గూళ్లు ఉంటాయి. ఏడాదికి 500లకు పైగా పిల్ల పక్షులు ఇక్కడ పుట్టి సైబీరియాకు ప్రయాణమవుతాయని అంచనా. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కట్టిన 40 అడుగుల వాచ్ టవర్ ఉంది. ఈ టవర్ మీద నుంచి చూస్తే మన చుట్టూ పక్షులే. వాటి కువకువలు రకరకాలుగా ఉంటాయి. అవి చేసే శబ్దాల్లో తేడాలుంటాయి. పక్షుల కలయిక సందర్భంలో ఒక రకంగా, గుడ్లను పొదిగేటప్పుడు ఒక రకమైన శబ్దం, పిల్లలకు ఆహారం పెట్టేటప్పుడు మరో రకమైన శబ్దం చేస్తాయి. అవి వెళ్లిపోతుంటే తమ పిల్లలు వదిలిపోతున్నట్లు బాధగా ఉంటుందని చెప్పారు గ్రామస్తులు. ముక్కు పొడవు పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ పక్షులకు ముక్కు పొడవుగా ఉంటుంది. నీటి మీద ఎగురుతూ నీటి లోపలున్న చేపల జాడ పడతాయి. ఒక్కసారిగా నీటిలోకి దూరి ఈదుతూ వెళ్లి ముక్కుతో చేపలను పట్టుకొస్తాయి. చేపలతోపాటుగా వచ్చిన నీటిని వదిలేసి చేపలను మాత్రం గొంతుకు ఉన్న సంచిలో వేసుకుంటాయి. ఆ చేపలు గూటిలో ఉన్న పిల్లల కోసం. అలా పిల్ల పక్షులను 45 రోజులు పోషిస్తాయి. పెలికాన్ కానీ పెయింటెడ్ స్టార్క్ కానీ పేరుకు పక్షులే కానీ ఎంత బలంగా ఉంటాయంటే.. గుడ్ల మీద దాడి చేసిన ఒక మోస్తరు జంతువులను కూడా ముక్కుతో పొడిచి, కాళ్లతో తన్ని తరిమేస్తాయి. ఈ పక్షులు తొమ్మిది కిలోల బరువుంటాయి. రెక్కలు చాచాయంటే... ఆ చాచిన రెక్కల పొడవు రెండు నుంచి మూడున్నర మీటర్లు ఉంటుంది. పెద్ద పక్షులకు నీటిపాము దొరికిందంటే చాలు.. మనం కళ్లు మూసి తెరిచేలోపు ఒక్క గుటకలో మింగేస్తాయి. వీటి జీవితకాలం పదిహేను నుంచి పాతికేళ్లు. త్రేతాయుగపు శివలింగం తేలినీలాపురం టూర్లో భాగంగా ‘రావి వలస’ను కూడా కలుపుకోవచ్చు. ఇక్కడ ఉన్న శివలింగం ఇరవై రెండు అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక్కడ స్వామి స్వయంభువుగా వెలిశాడని చెబుతారు. ఆ శివుడికి గుడి కట్టాలని టెక్కలి రాజు ముందుకొచ్చాడని, అప్పుడు శివుడు తనను గుడిలో బంధించవద్దని, తనను తాకిన గాలి గ్రామమంతటా వ్యాపించాలని చెప్పాడంటారు. ఇప్పుడు కూడా అక్కడ గుడి లేదు. కానీ శివలింగంపై భాగాన్ని చూడడానికి వీలుగు మెట్ల నిర్మాణం ఉంది. పై నుంచి పూజాదిక్రతువులు నిర్వహించుకోవచ్చు. రాముడు ఇక్కడ పర్యటించాడని, ఇక్కడి ఔషధ వృక్షాల గురించి అధ్యయనం చేయడానికి రాముడి ఆస్థాన వైద్యుడు ఇక్కడే ఉండిపోయాడని కూడా చెబుతారు. -
అతిథులకు ఆవాసం.. వలస పక్షులు కోలాహలం
సాక్షి, ఖానాపురం(వరంగల్) : వలస పక్షులకు ఉమ్మడి వరంగల్ జిల్లా నిలయంగా నిలుస్తుంది. ఆతిథ్య కేంద్రంగా, విహార స్థలంగా విరసిల్లుతున్న ఈ ప్రాంతంలో పక్షుల ఆవాసాలకు, జీవ మనుగడకు అనువైన ప్రదేశాలు ఉండడంతో ఆయా కాలాలను అనుసరించి పక్షులు వలస వస్తున్నాయి. శీతాకాలం వచ్చిందంటే ప్రతి ఏటా వరంగల్‌లోని పలు చెరువులు, కుంటలు, మడుగుల వద్ద పక్షుల సందడి కనిపిస్తుంది. ముఖ్యంగా సైబీరియా, ఆస్ట్రేలియా, రష్యా, హిమాలయాల నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి పక్షులు దక్షిణ భారతదేశంలోని తెలంగాణకు నవంబర్‌లో చేరుకుంటాయి. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్‌లోని పాకాల, కేశవాపూర్, మేచరాజుపల్లి, పరకాల, ఉర్సుముచ్చర్లనాగారం, గణపురం, శాయంపేట చెరువు ప్రాంతాల్లో వలస పక్షులు ఆకట్టుకుంటున్నాయి. ఒక్క పాకాల సరస్సులోనే ఇప్పటికి 15 రకాల పక్షులు సందడి చేస్తున్నాయి. ఇక్కడ డిసెంబర్, జనవరిలో దాదాపు 40 నుంచి 50 రకాల పక్షులు కనిపిస్తాయి. వలస పక్షులు ఎదుర్కొంటున్న సమస్యలు గడిచిన కొన్ని సంవత్సరాలతో పోల్చుకుంటే ఇటీవలి కాలంలో వలస పక్షుల రాక గణనీయంగా పడిపోయినట్లు తెలుస్తోంది. చెరువులు, కుంటలను కృత్రిమ పద్ధతిలో రిజర్వాయర్లుగా మార్చడం లేదా మరమ్మతులు చేయడం వల్ల జలచర జీవుల కొరత ఏర్పడి ఆహారం దొరక్క పక్షుల వలసలు తగ్గిపోతున్నట్లు సమాచారం. దీనికి తోడు ప్లాస్టిక్ వ్యర్థాలు, బయో వ్యర్థాలను చెరువుల్లో వేయడం, ఫ్యాక్టరీల వ్యర్థాలను సమీప చెరువుల్లోకి, చిత్తడి నేలల్లోకి వదలడం ద్వారా నీరంతా కలుషితమవడం వల్ల పక్షులు రకరకాల వ్యాధుల బారిన పడి చనిపోతున్నాయని వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్లు పేర్కొంటున్నారు. పంట పొలాల్లో చల్లే విష గుళికల ప్రభావానికి మృత్యువాత పడటం, అటవీ విస్తీర్ణం తగ్గిపోవడం, పక్షుల వేట పెరగడం వలసలు తగ్గడానికి కారణమని అంటున్నారు. విడిది పాకాల.. వరంగల్ రూరల్ జిల్లాలోని పాకాల వలస పక్షుల విడిది ప్రాంతంగా నిలుస్తుంది. ఇక్కడ 160 రకాల స్థానిక పక్షులు, 50 రకాల వసల పక్షుల మనుగడ సాగిస్తున్నట్లు తమ పరిశోధనలో తేలినట్లు వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్లు మున్నా, చెల్పూరి శ్యాంసుందర్, నాగేశ్వర్రావు పేర్కొన్నారు. పాకాలలో పక్షులకు అనువైన జీవవైవిధ్యం, పరిసర ప్రాంతాల్లో చెరువులు, కుంటలు ఉండడం వల్ల ఏటా 50 నుంచి 60 రకాల పక్షులు వలస వస్తాయని తెలిపారు. వలస పక్షుల సంరక్షణకు ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ పనిచేస్తోందని వివరించారు. వలస పక్షులు ఎంచుకునే ప్రదేశాలు.. సాధారణంగా వలస పక్షులు నీటి ఆధారిత ప్రాంతాలు, ఆహారం సమృద్ధిగా ఉండే చెరువులు, కుంటలు, మడుగులను ఎంచుకుంటాయి. ఆయా ప్రాంతాల సమీపంలోనే అవి నివసిస్తాయి. కొన్ని రకాల పక్షులు మాత్రం వ్యవసాయ మైదానాలను ఆధానం చేసుకుని సమీపంలోని చెట్లపై గూళ్లను నిర్మించుకుంటాయి. ఆహార అన్వేషణ వలస పక్షులు అన్ని దాదాపు మాంసాహారులే. కొంగ జాతికి చెందిన పక్షులు చేపలు, నత్తలు, కప్పలను ఎక్కువగా తింటాయి. బాతు జాతికి చెందిన రెడ్‌క్రెస్టెడ్ పోచర్డ్, నార్తర్న్ పిన్ టేయిల్స్, గ్రిబు, విజిలింగ్ డక్స్ లాంటివి చేపలు, ఎండ్రికాయలను, ఇతర పురుగులను ఆహారం తీసుకుంటాయి. కూట్సు లాంటి పక్షులు నాచును తీసుకుంటాయి. వలస పక్షులు సంతానోత్పత్తి కాలం డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది. వలస పక్షుల సంరక్షణకు కృషి వలస పక్షుల సంరక్షణ కోసం ఔల్స్ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నాం. అటవీశాఖ అధికారుల సహకారంతో పాకాల వంటి ప్రాంతాల్లో పక్షుల విడిదికి అవసరమైన నిర్మాణాలు చేపడుతున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రతి ఏడాది వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్లతో బర్డ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం. – చెల్పూరి శ్యాంసుందర్, వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ -
పాకాలకు ‘విదేశీ చుట్టాలు’
ఖానాపురం: వరంగల్ రూరల్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన పాకాలకు వేసవి కాలంలో అనేక రకాల విదేశీ పక్షులు వలస వస్తున్నాయి. గతంలో అంతంత మాత్రంగానే ఉన్న పక్షుల వలసలు ప్రస్తుతం పెరిగాయి. వాటిని గుర్తించడానికి ప్రత్యేకంగా వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌ను ఏర్పాటు చేయించడంతోపాటు పక్షులు సేదదీరడానికి అవసరమైన ఏర్పాట్లను ఖాజీపేట డీఎఫ్ఓ పురుషోత్తం ఆధ్వర్యంలో చేపట్టారు. వెరి డైట్ఫ్లై, క్యాచర్, పిగ్నిఉలిడక్, ఎల్లో వాట్ లెడ్, ల్యాప్వింగ్, రెడ్ అవైడవిట్, బార్ హెడ్ గీస్, ఆస్ప్రే, కామన్ ప్రొటైన్ కోల్, రెడ్ క్రాస్టెడ్, పోచార్ట్స్, బ్లూ టేబిల్డ్ బీ ఈటర్, విస్టింగ్ డక్స్, రోసే స్టార్లింగ్, చెస్ట నట్ హెడ్ బీ ఈటర్, రెడ్ నాఫ్ట్ ఇబస్, రివర్ టెర్న్, తిక్ బిల్డ్ గ్రీన్, నార్తర్న్ షోవ్లర్, కామన్ పోచర్డ్స్, కామన్ పిన్ టేల్స్, నార్తర్న్తోపాటు పలు ఇతర రకాల పక్షులు వేసవిలో ఇక్కడ సేదతీరుతున్నాయి. -
నేలపట్టుకు .. విదేశీ విహంగాలు!
ఆకాశంలో చక్కర్లు కొట్టుతున్న గూడబాతులు, తెల్లకంకణాయిలు దొరవారిసత్రం: నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రానికి విదేశీ వలస విహంగాల రాక మొదలైంది. మొన్నటి వరకు వెలవెలబోయిన పక్షుల కేంద్రం వాతవరణంలో మార్పు రావడంతో పాటు ఓ మోస్తరు వర్షం కురవడంతో చెరువుల్లోకి నీళ్లు చేరాయి. బుధవారం వందకు పైబడి నత్తగుళ్ల కొంగలు కడప చెట్లపై దర్శనమిచ్చాయి. బాతు జాతీకి చెందిన బుడ్డకోడి పక్షులు చెరువు నీటిలో ఈదుతూ కనిపించాయి. దీంతో విహంగాలు పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం ఉందని వన్యప్రాణి విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు. వాలని గూడబాతులు, తెల్లకంకణాయి వాతవరణంలో మార్పు వచ్చినప్పటికి కేంద్రంలో పరిస్థితులు అనుకూలించకపోవడంతో ప్రసిద్ధి చెందిన గూడబాతులు, తెల్లకంకణాయిలు ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయే తప్ప కిందకు దిగడంలేదు. ఇవి కేంద్రంలో విడిది చేయ్యందే పక్షుల కేంద్రంలో కిలకిలరావలు కనిపించవు. తెడ్డుముక్కు కొంగలు, స్వాతికొంగలు, నీటికాకులు, పాముమెడకొంగలు తదితర పక్షులు కేంద్రానికి విచ్చేసి సందడి చేయాల్సి ఉంది. సంతాన వృద్ధికి తప్పిన అదును సుదూరు ప్రాంతాల నుంచి పక్షుల కేంద్రంకి వచ్చే వేలాది వలస విహంగాల సంతాన వృద్ధి అదును ఈదఫా తప్పినట్లే. నేలపట్టు పక్షుల కేంద్రానికి కేవలం విహంగాలు వాటి వాటి సంతానాన్ని అభివృద్ధి చేసుకునేందుకు క్రమం తప్పకుండా వచ్చి వెళుతాయి. కానీ ఈసారి వాతవరణం అనుకూలించకపోవడంతో చెరువుల్లో నీళ్లు లేకుండాపోయాయి. ఇప్పుడు వర్షాలు పడి చెరువుల్లో పూర్తిస్థాయిలో నీళ్లు చేరినా వలస విహంగాలు ముందుగా ఆడ మగ స్నేహం కుదుర్చుకన్న తరువాత కడప చెట్లపై గూళ్లు కట్టాలి. అవి జత కట్టి గుడ్లు పెట్టి పొదగాలి. పిల్లలు చేసిన తరువాత అవి పెద్దవి అయ్యాక తిరిగి వాటి దేశాలకు వెళ్లిపోవాలి. ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే సుమారు ఏడు నెలలు పడుతుంది. పక్షుల సీజన్ సాధారంగా అక్టోబరు మాసంలో మొదలై ఏప్రిల్‌కు ముగిసిపోతుంది. ప్రస్తుతం వీటి సంతాన అభివృద్ధి చాలా కష్టమని వన్యప్రాణి అధికారులు, అటు సందర్శకుల పేర్కొంటున్నారు. -
‘వలస’ పక్షులదే వర్తమానం
- డేట్లైన్ హైదరాబాద్ ఇక్కడ కమ్యూనిస్టులను గురించి కూడా మాట్లాడుకోవాలి. బీజేపీ మినహా ఈ దేశంలో దాదాపు అన్ని పార్టీలు కచ్చితమైన సిద్ధాంతం మీద పనిచెయ్యవు. ఒకప్పుడు తెలంగాణలో నల్లగొండ, ఖమ్మం జిల్లాలలో కామ్రేడ్లు పట్టు కలిగి ఉండేవారు. చివరికి రెండు జిల్లాలలో చెరొక్క స్థానానికి పరిమితయ్యాయి సీపీఐ, సీపీఎం. ఎన్నికల ఖర్చు కోట్లకు చేరుకున్నాక చట్టసభలకు పోటీ పడటం కమ్యూనిస్టుల వల్ల అయ్యేదికాదు. అయితే నాటి చెన్నమనేని నుంచి నేటి రవీంద్రకుమార్ నాయక్ దాకా ఎందుకు ఈ దిగజారుడు అన్నదే ప్రశ్న. తెలంగాణలో మరో జట్టు అధికారపక్షంలో చేరిపోవడానికి సిద్ధమైంది. నల్లగొండ జిల్లా నుంచి ఒక ఎంపీ; కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఈరోజు టీఆర్ఎస్లో చేరుతున్నారు. అందరూ ఒకేసారి కాకుండా అప్పుడు కొందరు ఇప్పుడు కొందరు అధికార పార్టీలోకి వలసపోతే మీడియాకు కూడా వార్తలు ఉంటాయని కాబోలు కొంత కొంత విరామం ఇచ్చి వెళుతున్నారు. ఎమ్మెల్యేలు పోయినా, ఎంపీలు పోయినా, మాజీలు పోయినా పలుకుతున్నది రెండు పలుకులే. మొదటిది, నియోజకవర్గాల అభివృద్ధి! రెండవది, తమని గెలిపించిన ప్రజలలో మెజారిటీ కోరుకుంటు న్నారు కాబట్టి! ఇట్లా గోడ దూకినవారు ఒక సంవత్సరం తరువాతో, రెండే ళ్లకో మేం అధికారపక్షానికి వలసరావడం వల్ల మా నియోజకవర్గాలకు ఇంత మొత్తం లాభం జరిగింది అనే లెక్కలు ఏమైనా చెబుతారా అంటే, అలాంటి దేమీ ఉండదు. పోనీ, ప్రజలు కోరుతున్నారని మీరే చెబుతున్నారు కదా, చట్టసభల సభ్యత్వానికి రాజీనామా చేసి కొత్త పార్టీ తరఫున ప్రజల మెప్పు పొంది రండి అంటే, అదీ చేతకాదు. తెలుగు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాక ప్రతిపక్ష సభ్యులను అధికారపక్షం తనవైపు లాక్కోవడం తెలంగాణ తోనే మొదలైనా, నిజానికి ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడుకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన తొలిసారి ముఖ్యమంత్రి కావడానికి పునాదే ఫిరాయింపు రాజకీయాలు. ఆ విషయం దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సహా, ఆయన కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు, నందమూరి హరికృష్ణకు, వలస పక్షులని వైస్రాయ్ గూట్లో వదిలిపెట్టిన కొందరు మీడియా పెద్దలకు బాగా తెలుసు. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఈ విద్య అక్కడే నేర్చుకున్నారు. ఇది ఆయన కొత్తగా చేస్తున్న ప్రయోగం కాదు. అయితే, ఇదేదో ప్రపంచంలోనే మొదటిసారి జరిగినట్టూ, తెలంగాణ రాష్ర్ట సమితే మొదటిసారిగా ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టినట్టూ చంద్రబాబునాయుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి ఆక్రోశిం చడం హాస్యాస్పదం. ఆంధ్రప్రదేశ్‌లో తన అపూర్వ సహోదరుడు చంద్రబాబు చేస్తున్న నిర్వాకం చూస్తూ పెదవి విప్పే సాహసం చెయ్యని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అక్కడెక్కడో ఉత్తరాఖండ్‌లో వలసపోయిన ఎమ్మెల్యే లను తలుచుకుని రాజకీయాలు భ్రష్టుపట్టాయని ఆవేదన చెందుతుంటారు. అందరిదీ గురవింద న్యాయమే ప్రజాస్వామ్య స్ఫూర్తిని బుగ్గిపాలు చేసే విధంగా సాగుతున్న ఈ అత్యంత నీతి మాలిన, ఏహ్యమైన కార్యక్రమం తెలంగాణ రాష్ర్ట సమితితోనే మొదలు కాలేదు, ఇక్కడితో ఆగిపోయేదీ కాదు. 1995 నుంచి మొదలు పెట్టి ఇప్పటి దాకా ఇటువంటి దుర్మార్గాలు అనేకం చేసి, తెలంగాణ లో తమ పార్టీ వారిని లాక్కుని టీఆర్ఎస్ నీతి తప్పిందని రంకెలు వేసి ఆరునెలలు తిరక్కుండానే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎడా పెడా కోట్లు గుమ్మరించి కొనుగోలు చేసిన చంద్రబాబునాయుడు, వలస కార్యక్రమంలో తానే పాత్ర దారి కూడా అయిన జానారెడ్డి ఇప్పుడు సుఖేందర్‌రెడ్డి, భాస్కరరావు ఇంకో ఎల్లయ్య మల్లయ్య వలస పోతున్నారని వాపోవడం విచిత్రం. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రస్తుత తెలంగాణ సీఎల్పీ నాయకుడు కుందూరు జానారెడ్డి నిఖార్సయిన కాంగ్రెస్ నాయకుడా? కాదుకదా! తెలుగుదేశం ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పలు మంత్రిత్వశాఖలను నిర్వహించిన నాయకుడు. ఆ విషయం ఆయనే సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూ ఉంటారు. ఎన్టీఆర్ అంత పెద్ద పీట వేస్తే, 1989లో కేఈ కృష్ణమూర్తి, వసంత నాగేశ్వరరావులతో కలసి ఎందుకు తెలుగుదేశాన్ని విడిచిపెట్టిన ట్టు? అప్పట్లో ఈ ముగ్గురూ తెలుగుదేశంలో చంద్రబాబు వర్గం. దగ్గుబాటి వర్గానికి వ్యతిరేకులు. పార్టీ ఫిరాయింపుల సమయాలలో తేడాలు ఉండవచ్చు కానీ, అన్నీ ఆ తాను ముక్కలే. ఆ గూటి పక్షులే. 2015, ఏప్రిల్ 30న ఢిల్లీ విమానంలో పక్కన కూర్చున్న ఒక పెద్దమనిషి నన్ను గుర్తుపట్టి పలకరించారు. ఆయన నల్లగొండ జిల్లా వాస్తవ్యులు, మదర్ డైరీ అధ్యక్షులు. నల్లగొండ పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డికి స్వయానా సోదరుడు. ఢిల్లీ వరకు రెండుగంటల ప్రయాణంలో చాలా రాజకీయాలు మాట్లాడుకున్నాం. పాడి పరిశ్రమకు సంబంధించిన సమస్యలు చాలా చెప్పారాయన. నిజానికి అటువంటి ఓ పని మీదే ఢిల్లీ బయలుదేరారు కూడా. తెలంగాణ కొత్త రాష్ర్టం, చాలా ఉత్సాహంగా ముందుకు దూసుకు వెళుతున్న ప్రభుత్వం కదా, మీ సమస్యలు చెప్పుకోకపోయారా అంటే ఆయన చెప్పిన సమాధానం.. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డిని ఎన్నిమార్లు కలిసినా ఒకే పాట పాడుతున్నారు- ‘ముందు అందరూ మా పార్టీలో చేరండి, అప్పుడు చూద్దాం!’ అని. ‘చూస్తూ చూస్తూ టీఆర్ఎస్లో ఎలా చేరడం? మా అన్నగారు కాంగ్రెస్ నాయకులు, ఎంపీ కూడా. ఆయన ప్రతిష్ట దెబ్బతినదా?’ అన్నారాయన. నేను నవ్వి ఊరుకున్నానో, బయటికే అన్నానో గుర్తు లేదు కానీ, సుఖేందర్‌రెడ్డి ఏమన్నా అసలు సిసలు కాంగ్రెస్ నాయకుడా? అని. అంతకుముందు ఆయన రాజకీయాలు ఏమైనా, రాజకీయాలలో ఎవరి శాశ్వత శిష్యుడైనా తెలుగుదేశం వీడి కాంగ్రెస్‌లో చేరి ఎంపీ అయ్యాడన్న విషయం అందరికీ తెలుసు. తెలుగుదేశాన్ని వీడి రాగలిగిన నాయకుడు కాంగ్రెస్‌ను వీడి ప్రస్తుత అధికారపక్షంలోకి వెళ్ళడనీ, అక్కడ లేని విలువలు ఇక్కడికొచ్చాక హఠాత్తుగా పుట్టుకొస్తాయనీ కాంగ్రెస్ పెద్దలు ఎందుకు అనుకుంటున్నారో? ఆ ఢిల్లీ విమానంలో కలిసిన పెద్దాయన నేను అటు నుంచి పాకిస్తాన్ వెళ్లి, వారం పదిరోజులలో తిరిగి వచ్చేసరికే అధికార పక్షం తీర్థం పుచ్చేసుకున్నారు. అది ఆయన వ్యాపార అవసరం కావచ్చు. సరిగ్గా ఒక సంవత్సరం తరువాత ఆయన సోదరుడు సుఖేందర్‌రెడ్డి కూడా తమ్ముడి బాట పట్టారు. సిద్ధాంతమూ లేదు, విశ్వాసమూ లేదు తాజాగా సుఖేందర్‌రెడ్డి, భాస్కరరావు టీఆర్ఎస్లో చేరడంతో కాంగ్రెస్ బలం నల్లగొండ జిల్లాలో నాలుగుకు పడిపోయింది. అందులో కోదాడ శాసన సభ్యురాలు మినహా మిగిలిన ముగ్గురూ కాంగ్రెస్‌లో పెద్ద నాయకులు. ముగ్గురిలో ఒకరు సాక్షాత్తూ తెలంగాణ పీసీసీ అధ్యక్షులు, ఇంకొకరు శాసనసభా పక్ష నాయకులు, మూడో ఆయన శాసనసభా పక్ష ఉప నాయకుడు. కాంగ్రెస్ నుంచి అధికారపక్షానికి వలస పోయిన ఎంపీ సుఖేం దర్‌రెడ్డి సహా వీరంతా రాజకీయాలలో బలమైన ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లా రాజకీయాలను అత్యంత ప్రభా వితం చేసిన సామాజిక వర్గం. దక్షిణ తెలంగాణలో అధికారపక్షం రాజ కీయంగా బలహీనంగా ఉన్నదన్న అభిప్రాయాన్ని ఈ జట్టును చేర్చుకోవడం ద్వారా చంద్రశేఖరరావు పటాపంచలు చేశారు. కాంగ్రెస్‌లోకి ఎవరైనా, ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడైనా పోవచ్చు. ఇది దేశవ్యాప్తంగా ఎన్నోసార్లు రుజువైంది. బ్రహ్మానందరెడ్డి, చెన్నారెడ్డి, విజయ భాస్కరరెడ్డి- ఇట్లా అనేక మందిని ఉదాహరించవచ్చు. మాజీ ఎంపీ గడ్డం వివేక్, మాజీమంత్రి వినోద్ సోదరులూ అదే కోవకు చెందుతారు. ఒకసారి కేశవరావుతో కలసి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి దూకి, తిరిగొచ్చినా తమకు టికెట్లు ఇచ్చారన్న విశ్వాసం కాంగ్రెస్ పార్టీ పట్ల, సోనియాగాంధీ పట్ల వీరికి ఎందుకు ఉండాలి, అవతల బంగారు భవిష్యత్తు కళ్ల ముందు ఉంటె! విభజన పుణ్యమా అని అవతల ఆంధ్రప్రదేశ్‌లో అడ్రస్సే లేకుండా పోయిన కాంగ్రెస్, తెలంగాణ ఇచ్చి కూడా ఇక్కడ డీలా పడిపోవడానికీ, వలసలు ఆపలేకపోడానికీ ఎవరు బాధ్యత వహించాలి? అది కాంగ్రెస్‌లో సోషల్ఇంజనీరింగ్ పేరిట గందరగోళం చేస్తున్న కాంగ్రెస్ మేధావులు చెప్పాలి. లేదా వాస్తవ పరిస్థితులు తెలియకుండా పెత్తనాలు చేసే పరిశీల కులు చెప్పాలి. ఏదేమైనా కాంగ్రెస్ ప్రస్తుతానికి తెలంగాణ మీద ఆశలు వదిలేసినట్టే! కమ్యూనిస్టుల మూలాలు కదులుతున్నాయి ఇక్కడ కమ్యూనిస్టులను గురించి కూడా మాట్లాడుకోవాలి. బీజేపీ మినహా ఈ దేశంలో దాదాపు అన్ని పార్టీలు కచ్చితమైన సిద్ధాంతం మీద పనిచెయ్యవు. కమ్యూనిస్టులు దానికి మినహాయింపు. కమ్యూనిస్టులు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవారు. ఒకప్పుడు తెలంగాణలో, ముఖ్యంగా నల్లగొండ, ఖమ్మం జిల్లాలలో మంచి పట్టు కలిగి ఉండేవారు. చివరికి రెండు జిల్లాలలో చెరొక్క స్థానానికి పరిమితయ్యాయి సీపీఐ, సీపీఎం. ఎన్నికల ఖర్చు కోట్లకు చేరుకున్నాక చట్టసభలకు పోటీ పడటం కమ్యూనిస్టు పార్టీల వల్ల అయ్యే పనికాదు. అయితే నాటి చెన్నమనేని రాజేశ్వరరావు నుంచి నేటి రవీంద్ర కుమార్ నాయక్ దాకా ఎందుకు ఈ దిగజారుడు అన్నది సమీక్షించు కోవాలి. నల్లగొండ జిల్లా దేవరకొండ గిరిజన నియోజకవర్గం నుంచి కమ్యూ నిస్ట్ పార్టీ అభ్యర్థిగా గెలిచినా, అధికారపక్షానికి వలస పోవడానికి రవీంద్ర కుమార్ కూడా నియోజకవర్గ అభివృద్ధినే సాకుగా చూపుతున్నారు. చెన్నమ నేని రాజేశ్వరరావు వంటి యోధానుయోధుడైనకమ్యూనిస్టు నాయకుడిని పుత్ర ప్రేమ అధికారపక్షం వైపు లాగగా లేనిది, పుట్టుక నుంచి కమ్యూనిస్ట్ ఉద్య మంలో భాగం అయిన అజయ్‌కుమార్ కాంగ్రెస్‌కు అక్కడి నుంచి అధికార పక్షం టీఆర్ఎస్కు వలస పోతే ఆయన తండ్రి, మరో కమ్యూనిస్ట్ దిగ్గజం పువ్వాడ నాగేశ్వరరావు పుత్రపేమ దానిని అనుమతించగా లేనిది.. గిరిజన యువకుడు రవీంద్రకుమార్ నాయక్ వలసపోతే నిందించి ఏం లాభం? - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com