నేలపట్టుకు .. విదేశీ విహంగాలు!
-
ఆకాశంలో చక్కర్లు కొట్టుతున్న గూడబాతులు, తెల్లకంకణాయిలు
దొరవారిసత్రం:
నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రానికి విదేశీ వలస విహంగాల రాక మొదలైంది. మొన్నటి వరకు వెలవెలబోయిన పక్షుల కేంద్రం వాతవరణంలో మార్పు రావడంతో పాటు ఓ మోస్తరు వర్షం కురవడంతో చెరువుల్లోకి నీళ్లు చేరాయి. బుధవారం వందకు పైబడి నత్తగుళ్ల కొంగలు కడప చెట్లపై దర్శనమిచ్చాయి. బాతు జాతీకి చెందిన బుడ్డకోడి పక్షులు చెరువు నీటిలో ఈదుతూ కనిపించాయి. దీంతో విహంగాలు పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం ఉందని వన్యప్రాణి విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు.
వాలని గూడబాతులు, తెల్లకంకణాయి
వాతవరణంలో మార్పు వచ్చినప్పటికి కేంద్రంలో పరిస్థితులు అనుకూలించకపోవడంతో ప్రసిద్ధి చెందిన గూడబాతులు, తెల్లకంకణాయిలు ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయే తప్ప కిందకు దిగడంలేదు. ఇవి కేంద్రంలో విడిది చేయ్యందే పక్షుల కేంద్రంలో కిలకిలరావలు కనిపించవు. తెడ్డుముక్కు కొంగలు, స్వాతికొంగలు, నీటికాకులు, పాముమెడకొంగలు తదితర పక్షులు కేంద్రానికి విచ్చేసి సందడి చేయాల్సి ఉంది.
సంతాన వృద్ధికి తప్పిన అదును
సుదూరు ప్రాంతాల నుంచి పక్షుల కేంద్రంకి వచ్చే వేలాది వలస విహంగాల సంతాన వృద్ధి అదును ఈదఫా తప్పినట్లే. నేలపట్టు పక్షుల కేంద్రానికి కేవలం విహంగాలు వాటి వాటి సంతానాన్ని అభివృద్ధి చేసుకునేందుకు క్రమం తప్పకుండా వచ్చి వెళుతాయి. కానీ ఈసారి వాతవరణం అనుకూలించకపోవడంతో చెరువుల్లో నీళ్లు లేకుండాపోయాయి. ఇప్పుడు వర్షాలు పడి చెరువుల్లో పూర్తిస్థాయిలో నీళ్లు చేరినా వలస విహంగాలు ముందుగా ఆడ మగ స్నేహం కుదుర్చుకన్న తరువాత కడప చెట్లపై గూళ్లు కట్టాలి. అవి జత కట్టి గుడ్లు పెట్టి పొదగాలి. పిల్లలు చేసిన తరువాత అవి పెద్దవి అయ్యాక తిరిగి వాటి దేశాలకు వెళ్లిపోవాలి. ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే సుమారు ఏడు నెలలు పడుతుంది. పక్షుల సీజన్ సాధారంగా అక్టోబరు మాసంలో మొదలై ఏప్రిల్‌కు ముగిసిపోతుంది. ప్రస్తుతం వీటి సంతాన అభివృద్ధి చాలా కష్టమని వన్యప్రాణి అధికారులు, అటు సందర్శకుల పేర్కొంటున్నారు.