అముర్‌ ఫాల్కన్‌ సూపర్‌ర్‌...బర్డ్‌.. | The latest migration of the Amur Falcon is surprising scientists | Sakshi
Sakshi News home page

అముర్‌ ఫాల్కన్‌ సూపర్‌ర్‌...బర్డ్‌..

Published Sat, Nov 30 2024 5:25 AM | Last Updated on Sat, Nov 30 2024 5:25 AM

The latest migration of the Amur Falcon is surprising scientists

మహారాష్ట్ర నుంచి ఐదు రోజుల్లో కెన్యా చేరుకున్న వైనం  

శాటిలైట్‌ రేడియో ట్యాగ్‌తో రూట్‌ను పర్యవేక్షించిన శాస్త్రవేత్తలు 

వేసవిలో రష్యా, చైనాలో బ్రీడింగ్‌ 

శీతాకాలంలో ఆఫ్రికాకు పయనం 

మధ్యలో నాగాలాండ్, మణిపూర్‌లో స్టాపింగ్‌ పాయింట్లు 

సాక్షి, అమరావతి: అలుపెరుగని బాటసారిలా... వేలాది కిలోమీటర్లు ఎగురుతూ అత్యంత సుదీర్ఘ ప్రయాణాలు చేసే అముర్‌ ఫాల్కన్‌ వలస పక్షుల్లో ఓ పక్షి తాజా పయనం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. భారత్‌ నుంచి బయలుదేరిన అముర్‌ ఫాల్కన్‌ 5 రోజుల 17 గంటల్లో సోమాలియా చేరుకుని, అక్కడ నుంచి కెన్యాలోకి ప్రవేశించింది. 

మధ్యలో ఎక్కడా ఆగకుండా పలు దేశాలతో పాటు, ఏకంగా అరేబియా సముద్రాన్ని కూడా దాటుకుని తన గమ్యస్థానం చేరుకుంది. వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా శాస్త్రవేత్తలు, స్థానిక వలంటీర్లు సైబీరియా నుంచి వచి్చన రెండు పక్షులను మణిపూర్‌లో పట్టుకుని వాటికి స్థానిక గ్రామాలైన చిలువాన్, గ్యాంగ్‌రామ్‌ పేర్లు పెట్టారు. ఈనెల 8వ తేదీన చిలువాన్‌–2 పక్షికి శాటిలైట్‌ రేడియో ట్యాగ్‌ అమర్చారు. 

మహారాష్ట్రలోని రత్నగిరిలో ఉన్న గుహగర్‌ నుంచి 10వ తేదీన నాన్‌స్టాప్‌ జర్నీ మొదలుపెట్టిన చిలువాన్‌–2, 15వ తేదీ నాటికి సోమాలియాలోని మొదటి గమ్యానికి చేరుకున్నట్లు రేడియో ట్యాగ్‌ ద్వారా పక్షి గమనాన్ని పర్యవేక్షించిన సైంటిస్టు సురేశ్‌ కుమార్‌ తెలిపారు. 

అయితే గ్వాంగ్‌రామ్‌ పేరు పెట్టిన మరో పక్షి మాత్రం తమెంగ్‌లాంగ్‌లోని చిలువాన్‌ రూస్టింగ్‌ సైట్‌లోనే ఉన్నట్లు గుర్తించారు. చిలువాన్‌–2 గ్రేట్‌ హార్న్‌ ఆఫ్‌ ఆఫ్రికాలోని స్కోటోరా ద్వీపం సమీపంలోని ఓ విమాన మార్గంలో ఉందని తెలిపారు.  

లక్షల సంఖ్యలో పక్షులు 
‘ఆర్కిటిక్‌ టర్న్‌’ అనే పక్షి తర్వాత అత్యంత సుదీర్ఘ ప్రయాణాలు చేసే పక్షులుగా అముర్‌ ఫాల్కన్‌కు పేరుంది. 2018 నుంచి మణిపూర్‌లో ఈ పక్షుల వలస ప్రయాణాలు, మార్గాలను తెలుసుకునేందుకు రేడియో ట్యాగింగ్‌ చేసి అధ్యయనం చేస్తున్నారు. రేడియో ట్యాగ్‌లు అమర్చిన అన్ని పక్షులు గమ్యాలను చేరుకోలేకపోవడంతో వాటి గురించి పూర్తి వివరాలు తెలియలేదు. 

లక్షల సంఖ్యలో వెళ్లే పక్షుల్లో కేవలం రెండు, మూడు పక్షులకు మాత్రమే రేడియో ట్యాగ్‌లు అమర్చడం వల్ల వాటికి ఏమైనా హాని జరిగితే వాటి వలసల గురించి పూర్తి వివరాలు తెలుసుకోలేకపోతున్నారు. 2019లో ఒక అముర్‌ ఫాల్కన్‌ పక్షి సుదీర్ఘంగా ప్రయాణించి 26 వేల కిలోమీటర్లు వెళ్లడాన్ని గుర్తించారు. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా మళ్లీ చిలువాన్‌–2 ద్వారా కొన్ని వివరాలు సేకరించగలిగారు. 

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే పక్షుల వలస మార్గాన్ని అధ్యయనం చేయడం ఈ పరిశోధన లక్ష్యమని వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఐఐ) సైంటిస్టు సురేశ్‌కుమార్‌ తెలిపారు. వాతావరణంలో జరిగే మార్పులను తెలుసుకోవడానికి ఈ పరిశోధన ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ పక్షులు పొలంలోని పురుగులు, క్రిములు, కీటకాలను తినడం ద్వారా రైతులకు ఎంతో మేలు చేస్తాయని, అవి రాకపోతే పంట దిగుబడులు కూడా అనూహ్యంగా తగ్గిపోయే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు.



సైబీరియా టు ఆఫ్రికా... వయా ఇండియా 
ఫాల్కన్‌ కుటుంబానికి చెందిన పక్షుల్లో చిన్నవైన అముర్‌ ఫాల్కన్‌ పక్షులు ఆగ్నేయ సైబీరియా, ఉత్తర చైనాలో సంతానోత్పత్తి చేస్తాయి. వేసవికాలం అక్కడే ఉండే ఈ పక్షులు తీవ్రమైన శీతాకాలం నుంచి తప్పించుకోవడానికి ఆఫ్రికా తీర ప్రాంతాల్లోని శీతాకాలపు మైదానాలకు వెళతాయి. 

ఈ క్రమంలో 15 నుంచి 20 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. సైబీరియా నుంచి ఆఫ్రికాకు వెళ్లే మార్గ మధ్యంలో నాగాలాండ్, మణిపూర్‌ ఇతర ఈశాన్య రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాల్లో ఆగిపోతాయి. వీటిని నాగాలాండ్, మణిపూర్‌లో ‘అఖుయిపుయినా’ అని పిలుస్తారు. సగటున 45 రోజులు అవి ఇక్కడే ఉండి ఆహారాన్ని సమకూర్చుకుని సుదీర్ఘ ప్రయాణానికి అనువుగా సన్నద్ధమవుతాయి. 

నిరంతరాయంగా ఎగిరేందుకు వీలుగా బరువును తగ్గించుకుంటాయి. ఆఫ్రికాలో శీతాకాలం ముగిశాక ఏప్రిల్, మే నెలల్లో ఇవి తిరుగు ప్రయాణమై మళ్లీ సైబీరియా వెళతాయి. తిరిగి వెళ్లేటప్పుడు కూడా ఇవి మన దేశ ఈశాన్య ప్రాంతాల్లో ఆగుతాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement