‘వలస’ పక్షులదే వర్తమానం | party leaders became like Migration birds | Sakshi
Sakshi News home page

‘వలస’ పక్షులదే వర్తమానం

Published Wed, Jun 15 2016 12:21 AM | Last Updated on Mon, Sep 4 2017 2:28 AM

party leaders became like Migration birds

- డేట్‌లైన్ హైదరాబాద్

ఇక్కడ కమ్యూనిస్టులను గురించి కూడా మాట్లాడుకోవాలి. బీజేపీ మినహా ఈ దేశంలో దాదాపు అన్ని పార్టీలు కచ్చితమైన సిద్ధాంతం మీద పనిచెయ్యవు. ఒకప్పుడు తెలంగాణలో నల్లగొండ, ఖమ్మం జిల్లాలలో కామ్రేడ్లు పట్టు కలిగి ఉండేవారు. చివరికి రెండు జిల్లాలలో చెరొక్క స్థానానికి పరిమితయ్యాయి సీపీఐ, సీపీఎం. ఎన్నికల ఖర్చు కోట్లకు చేరుకున్నాక చట్టసభలకు పోటీ పడటం కమ్యూనిస్టుల వల్ల అయ్యేదికాదు. అయితే నాటి చెన్నమనేని నుంచి నేటి రవీంద్రకుమార్ నాయక్ దాకా ఎందుకు ఈ దిగజారుడు అన్నదే ప్రశ్న.

 

తెలంగాణలో మరో జట్టు అధికారపక్షంలో చేరిపోవడానికి సిద్ధమైంది. నల్లగొండ జిల్లా నుంచి ఒక ఎంపీ; కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఈరోజు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. అందరూ ఒకేసారి కాకుండా అప్పుడు కొందరు ఇప్పుడు కొందరు అధికార పార్టీలోకి వలసపోతే మీడియాకు కూడా వార్తలు ఉంటాయని కాబోలు కొంత కొంత విరామం ఇచ్చి వెళుతున్నారు. ఎమ్మెల్యేలు పోయినా, ఎంపీలు  పోయినా, మాజీలు పోయినా పలుకుతున్నది రెండు పలుకులే. మొదటిది, నియోజకవర్గాల అభివృద్ధి! రెండవది, తమని గెలిపించిన ప్రజలలో మెజారిటీ కోరుకుంటు న్నారు కాబట్టి! ఇట్లా గోడ దూకినవారు ఒక సంవత్సరం తరువాతో, రెండే ళ్లకో మేం అధికారపక్షానికి వలసరావడం వల్ల మా నియోజకవర్గాలకు ఇంత మొత్తం లాభం జరిగింది అనే లెక్కలు ఏమైనా చెబుతారా అంటే, అలాంటి దేమీ ఉండదు.

పోనీ, ప్రజలు కోరుతున్నారని మీరే చెబుతున్నారు కదా, చట్టసభల సభ్యత్వానికి రాజీనామా చేసి కొత్త పార్టీ తరఫున ప్రజల మెప్పు పొంది రండి అంటే, అదీ చేతకాదు. తెలుగు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాక ప్రతిపక్ష సభ్యులను అధికారపక్షం తనవైపు లాక్కోవడం తెలంగాణ తోనే మొదలైనా, నిజానికి ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడుకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన తొలిసారి ముఖ్యమంత్రి కావడానికి పునాదే ఫిరాయింపు రాజకీయాలు. ఆ విషయం దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సహా, ఆయన కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు, నందమూరి హరికృష్ణకు, వలస పక్షులని వైస్రాయ్ గూట్లో వదిలిపెట్టిన కొందరు మీడియా పెద్దలకు బాగా తెలుసు.

ప్రస్తుత తెలంగాణ  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఈ విద్య అక్కడే నేర్చుకున్నారు. ఇది ఆయన కొత్తగా చేస్తున్న ప్రయోగం కాదు. అయితే, ఇదేదో ప్రపంచంలోనే మొదటిసారి జరిగినట్టూ, తెలంగాణ  రాష్ర్ట సమితే మొదటిసారిగా ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టినట్టూ చంద్రబాబునాయుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి ఆక్రోశిం చడం హాస్యాస్పదం. ఆంధ్రప్రదేశ్‌లో తన అపూర్వ సహోదరుడు చంద్రబాబు చేస్తున్న నిర్వాకం చూస్తూ పెదవి విప్పే సాహసం చెయ్యని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అక్కడెక్కడో ఉత్తరాఖండ్‌లో వలసపోయిన ఎమ్మెల్యే లను తలుచుకుని రాజకీయాలు భ్రష్టుపట్టాయని ఆవేదన చెందుతుంటారు.

 అందరిదీ గురవింద న్యాయమే
ప్రజాస్వామ్య స్ఫూర్తిని బుగ్గిపాలు చేసే విధంగా సాగుతున్న ఈ అత్యంత నీతి మాలిన, ఏహ్యమైన కార్యక్రమం తెలంగాణ  రాష్ర్ట సమితితోనే మొదలు కాలేదు, ఇక్కడితో ఆగిపోయేదీ కాదు. 1995 నుంచి మొదలు పెట్టి ఇప్పటి దాకా ఇటువంటి దుర్మార్గాలు అనేకం చేసి, తెలంగాణ లో తమ పార్టీ వారిని లాక్కుని టీఆర్‌ఎస్ నీతి తప్పిందని రంకెలు వేసి ఆరునెలలు తిరక్కుండానే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎడా పెడా కోట్లు గుమ్మరించి కొనుగోలు చేసిన  చంద్రబాబునాయుడు, వలస కార్యక్రమంలో తానే పాత్ర దారి కూడా అయిన జానారెడ్డి ఇప్పుడు సుఖేందర్‌రెడ్డి, భాస్కరరావు ఇంకో ఎల్లయ్య మల్లయ్య వలస పోతున్నారని వాపోవడం విచిత్రం.

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రస్తుత తెలంగాణ  సీఎల్‌పీ నాయకుడు కుందూరు జానారెడ్డి నిఖార్సయిన కాంగ్రెస్ నాయకుడా? కాదుకదా!  తెలుగుదేశం ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పలు మంత్రిత్వశాఖలను నిర్వహించిన నాయకుడు. ఆ విషయం ఆయనే సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూ ఉంటారు. ఎన్టీఆర్ అంత పెద్ద పీట వేస్తే, 1989లో కేఈ కృష్ణమూర్తి, వసంత నాగేశ్వరరావులతో కలసి ఎందుకు తెలుగుదేశాన్ని విడిచిపెట్టిన ట్టు? అప్పట్లో ఈ ముగ్గురూ తెలుగుదేశంలో చంద్రబాబు వర్గం. దగ్గుబాటి వర్గానికి వ్యతిరేకులు. పార్టీ ఫిరాయింపుల సమయాలలో తేడాలు ఉండవచ్చు కానీ, అన్నీ ఆ తాను ముక్కలే. ఆ గూటి పక్షులే.

 2015, ఏప్రిల్ 30న ఢిల్లీ విమానంలో పక్కన కూర్చున్న ఒక పెద్దమనిషి నన్ను గుర్తుపట్టి పలకరించారు. ఆయన నల్లగొండ జిల్లా వాస్తవ్యులు, మదర్ డైరీ అధ్యక్షులు. నల్లగొండ పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డికి స్వయానా సోదరుడు. ఢిల్లీ వరకు రెండుగంటల ప్రయాణంలో చాలా రాజకీయాలు మాట్లాడుకున్నాం. పాడి పరిశ్రమకు సంబంధించిన సమస్యలు చాలా చెప్పారాయన. నిజానికి అటువంటి ఓ పని మీదే ఢిల్లీ బయలుదేరారు కూడా. తెలంగాణ  కొత్త రాష్ర్టం, చాలా ఉత్సాహంగా ముందుకు దూసుకు వెళుతున్న ప్రభుత్వం కదా, మీ సమస్యలు చెప్పుకోకపోయారా అంటే ఆయన చెప్పిన సమాధానం.. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డిని ఎన్నిమార్లు కలిసినా ఒకే పాట పాడుతున్నారు- ‘ముందు అందరూ మా పార్టీలో చేరండి, అప్పుడు చూద్దాం!’ అని.

‘చూస్తూ చూస్తూ టీఆర్‌ఎస్‌లో ఎలా చేరడం? మా అన్నగారు కాంగ్రెస్ నాయకులు, ఎంపీ కూడా. ఆయన ప్రతిష్ట దెబ్బతినదా?’ అన్నారాయన. నేను నవ్వి ఊరుకున్నానో,  బయటికే అన్నానో గుర్తు లేదు కానీ, సుఖేందర్‌రెడ్డి ఏమన్నా అసలు సిసలు కాంగ్రెస్ నాయకుడా? అని. అంతకుముందు ఆయన రాజకీయాలు ఏమైనా, రాజకీయాలలో ఎవరి శాశ్వత శిష్యుడైనా తెలుగుదేశం వీడి కాంగ్రెస్‌లో చేరి ఎంపీ అయ్యాడన్న విషయం అందరికీ తెలుసు. తెలుగుదేశాన్ని వీడి రాగలిగిన నాయకుడు కాంగ్రెస్‌ను వీడి ప్రస్తుత అధికారపక్షంలోకి వెళ్ళడనీ, అక్కడ లేని విలువలు ఇక్కడికొచ్చాక హఠాత్తుగా పుట్టుకొస్తాయనీ కాంగ్రెస్ పెద్దలు ఎందుకు అనుకుంటున్నారో? ఆ ఢిల్లీ విమానంలో కలిసిన పెద్దాయన నేను అటు నుంచి పాకిస్తాన్ వెళ్లి, వారం పదిరోజులలో తిరిగి వచ్చేసరికే అధికార పక్షం తీర్థం పుచ్చేసుకున్నారు. అది ఆయన వ్యాపార అవసరం కావచ్చు. సరిగ్గా ఒక సంవత్సరం తరువాత ఆయన సోదరుడు సుఖేందర్‌రెడ్డి కూడా తమ్ముడి బాట పట్టారు.

 సిద్ధాంతమూ లేదు, విశ్వాసమూ లేదు
తాజాగా సుఖేందర్‌రెడ్డి, భాస్కరరావు టీఆర్‌ఎస్‌లో చేరడంతో కాంగ్రెస్ బలం నల్లగొండ జిల్లాలో నాలుగుకు పడిపోయింది. అందులో కోదాడ శాసన సభ్యురాలు మినహా మిగిలిన ముగ్గురూ కాంగ్రెస్‌లో పెద్ద నాయకులు. ముగ్గురిలో ఒకరు సాక్షాత్తూ తెలంగాణ  పీసీసీ అధ్యక్షులు, ఇంకొకరు శాసనసభా పక్ష నాయకులు, మూడో ఆయన శాసనసభా పక్ష ఉప నాయకుడు. కాంగ్రెస్ నుంచి అధికారపక్షానికి వలస పోయిన ఎంపీ సుఖేం దర్‌రెడ్డి సహా వీరంతా రాజకీయాలలో బలమైన ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లా రాజకీయాలను అత్యంత ప్రభా వితం చేసిన సామాజిక వర్గం. దక్షిణ తెలంగాణలో అధికారపక్షం రాజ కీయంగా బలహీనంగా ఉన్నదన్న అభిప్రాయాన్ని ఈ జట్టును చేర్చుకోవడం ద్వారా చంద్రశేఖరరావు పటాపంచలు చేశారు.

 కాంగ్రెస్‌లోకి ఎవరైనా, ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడైనా పోవచ్చు. ఇది దేశవ్యాప్తంగా ఎన్నోసార్లు రుజువైంది. బ్రహ్మానందరెడ్డి, చెన్నారెడ్డి, విజయ భాస్కరరెడ్డి- ఇట్లా అనేక మందిని ఉదాహరించవచ్చు. మాజీ ఎంపీ గడ్డం వివేక్, మాజీమంత్రి వినోద్ సోదరులూ అదే కోవకు చెందుతారు. ఒకసారి కేశవరావుతో కలసి కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి దూకి, తిరిగొచ్చినా తమకు టికెట్‌లు ఇచ్చారన్న విశ్వాసం కాంగ్రెస్ పార్టీ పట్ల, సోనియాగాంధీ పట్ల వీరికి ఎందుకు ఉండాలి, అవతల బంగారు భవిష్యత్తు కళ్ల ముందు ఉంటె! విభజన పుణ్యమా అని అవతల ఆంధ్రప్రదేశ్‌లో అడ్రస్సే లేకుండా పోయిన కాంగ్రెస్, తెలంగాణ  ఇచ్చి కూడా ఇక్కడ డీలా పడిపోవడానికీ, వలసలు ఆపలేకపోడానికీ ఎవరు బాధ్యత వహించాలి? అది కాంగ్రెస్‌లో సోషల్‌ఇంజనీరింగ్ పేరిట గందరగోళం చేస్తున్న కాంగ్రెస్ మేధావులు చెప్పాలి. లేదా వాస్తవ పరిస్థితులు తెలియకుండా పెత్తనాలు చేసే పరిశీల కులు చెప్పాలి. ఏదేమైనా కాంగ్రెస్ ప్రస్తుతానికి తెలంగాణ మీద ఆశలు వదిలేసినట్టే!

కమ్యూనిస్టుల మూలాలు కదులుతున్నాయి
ఇక్కడ కమ్యూనిస్టులను గురించి కూడా మాట్లాడుకోవాలి. బీజేపీ మినహా ఈ దేశంలో దాదాపు అన్ని పార్టీలు కచ్చితమైన సిద్ధాంతం మీద పనిచెయ్యవు. కమ్యూనిస్టులు దానికి మినహాయింపు. కమ్యూనిస్టులు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవారు. ఒకప్పుడు తెలంగాణలో, ముఖ్యంగా నల్లగొండ, ఖమ్మం జిల్లాలలో మంచి పట్టు కలిగి ఉండేవారు. చివరికి రెండు జిల్లాలలో చెరొక్క స్థానానికి పరిమితయ్యాయి సీపీఐ, సీపీఎం. ఎన్నికల ఖర్చు కోట్లకు

 చేరుకున్నాక చట్టసభలకు పోటీ పడటం కమ్యూనిస్టు పార్టీల వల్ల అయ్యే పనికాదు. అయితే నాటి చెన్నమనేని రాజేశ్వరరావు నుంచి నేటి రవీంద్ర కుమార్ నాయక్ దాకా ఎందుకు ఈ దిగజారుడు అన్నది సమీక్షించు కోవాలి. నల్లగొండ జిల్లా దేవరకొండ గిరిజన నియోజకవర్గం నుంచి కమ్యూ నిస్ట్ పార్టీ అభ్యర్థిగా గెలిచినా, అధికారపక్షానికి వలస పోవడానికి  రవీంద్ర కుమార్ కూడా నియోజకవర్గ అభివృద్ధినే సాకుగా చూపుతున్నారు. చెన్నమ నేని రాజేశ్వరరావు వంటి యోధానుయోధుడైనకమ్యూనిస్టు నాయకుడిని పుత్ర ప్రేమ అధికారపక్షం వైపు లాగగా లేనిది, పుట్టుక నుంచి కమ్యూనిస్ట్ ఉద్య మంలో భాగం అయిన అజయ్‌కుమార్ కాంగ్రెస్‌కు అక్కడి నుంచి అధికార పక్షం  టీఆర్‌ఎస్‌కు వలస పోతే ఆయన తండ్రి, మరో కమ్యూనిస్ట్ దిగ్గజం పువ్వాడ నాగేశ్వరరావు పుత్రపేమ దానిని అనుమతించగా లేనిది.. గిరిజన యువకుడు రవీంద్రకుమార్ నాయక్ వలసపోతే నిందించి ఏం లాభం?

- దేవులపల్లి అమర్

 datelinehyderabad@gmail.com

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement