Dateline Hyderabad
-
గాంభీర్యం మాటున ఓటమి భయం
ఎన్నికలలో గెలవడం కోసం ఏమయినా చెయ్యొచ్చు అని నమ్మే చంద్రబాబు తన మాటలు నమ్మి జనం మోసపోరని, ఈ ఎన్నికల్లో ఘోరపరాజయం తప్పదని అర్థం అయ్యాక కొత్త ఎత్తులు వేయడం మొదలు పెట్టారు. అటు కాంగ్రెస్‌తో, ఇటు పవన్ కల్యాణ్‌తో, వీరూ సరిపోరని కేఏ పాల్‌తో కూడా లోపాయికారీగా పొత్తు కుదుర్చుకుని రహస్య ఎజెండాలతో గట్టెక్కాలని విఫలయత్నం చేస్తున్నా తన విజయంపై నమ్మకం కలగడం లేదు. అందుకే పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా, ముఖంలో సంతోషం తెచ్చిపెట్టుకున్నా ఆయన మాటలు మాత్రం ఓటమి భయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దిక్కుతోచని స్థితిలో ఏదేదో మాట్లాడుతున్న బాబు చేస్తున్నది సంధిప్రేలాపనే. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ట్విట్టర్లో ఒక మంచి మాట చెప్పారు.. ‘ఓటమి తప్పనిసరి అని తెలిసిపోయినప్పుడు ఎంతటి అనుభవశాలి అయినా ఉలికిపడతాడు, వణికిపోతాడు, కాబట్టి చంద్రబాబునాయుడి ప్రస్తుత నిరాధార ప్రకటనల పట్ల నాకేమీ ఆశ్చర్యం కలగడం లేదు’ అని. ‘అయ్యా బిహార్ రాష్ట్రం పట్ల మీకున్న వ్యతిరేకతను చాటుకునే అభ్యంతరకర భాషను వాడటం కంటే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు మీకు మళ్ళీ ఎందుకు ఓట్లు వెయ్యాలి అనే అంశం మీద దృష్టి పెడితే బాగుంటుంది’ అని కూడా పీకే (ప్రశాంత్ కిశోర్) చంద్ర బాబుకు హితవు చెప్పారు. 40 ఏళ్ళ రాజకీయ అనుభవంతో 60 ఏళ్ళుగా కష్టపడుతున్నానని పదే పదే చెప్పుకునే చంద్రబాబుకు వచ్చే మూడు వారాల్లో జరగబోయే ఎన్నికలలో ఘోర పరాజయం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నట్టున్నది. అందుకే అర్థం పర్థంలేని మాటలు మాట్లాడుతు న్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నేర రాజకీయాలు చేస్తున్నాడని, ప్రశాంత్ కిషోర్ బిహార్ బందిపోటు అని మొన్న ఒంగోలులో మాట్లా డుతూ అన్నారు. ఇదే కేసీఆర్ పార్టీతో పొత్తు కోసం తాను స్వయంగా వెంపర్లాడిన విషయం, ఇదే ప్రశాంత్ కిశోర్ తన తాజా మిత్రులు కాంగ్రెస్ వారి కోసం ఇటీవలే పంజాబ్ ఎన్నికల్లో పని చేసిన విషయం, అక్కడ పీకే టీం చెప్పినట్టే కాంగ్రెస్ గెలిచిన విషయం మరిచిపోయి మాట్లాడుతారు బాబు. మరిచిపోతారు అనడం కంటే జనమే అన్నీ మరిచిపోతారులే అనుకుని మాట్లాడుతారు అనాలి. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా, ముఖంలో సంతోషం తెచ్చిపెట్టుకున్నా బాబు మాటలు మాత్రం ఓటమి భయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దిక్కుతోచని స్థితిలో ఏదేదో మాట్లాడుతున్నారు, ఏవేవో పనులు చేస్తున్నారు. సౌమ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబు కనీసం సంతాపం తెలపలేదు. పైగా తన ప్రభుత్వమే నియమించిన సిట్ ఇంకా దర్యాప్తు కొనసాగిస్తూ ఉండగానే వివేకానందరెడ్డిని జగన్మోహన్ రెడ్డే చంపేశాడని బహిరంగ సభలో ఆరోపణ చేసి, అది జనం నమ్మాలని అనుకునే మనిషి చంద్రబాబు. సాక్షాత్తు రాష్ట్ర సీఎం ఇట్లా మాట్లాడితే దర్యాప్తు చేస్తున్న ఆయన కింది అధికారుల మీద ఆ మాటల ప్రభావం ఎట్లా ఉంటుందో అందరికీ తెలుసు. ముద్రగడ ఆందోళన సందర్భంలో తునిలో రైలు తగలబెట్టిన సంఘటనలో, ఆ తరువాత విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్ మీద హత్యాప్రయత్నం సంఘటనలో కూడా ఆయన వాటిపట్ల కనీస విచారం వ్యక్తం చెయ్యక పోగా దర్యాప్తును ప్రభావితం చేసే విధంగా ప్రకటనలు చేశారు. తుని రైల్ ఘటనకు కడప రౌడీలు కారణం అని, విమానాశ్రయంలో దాడికి వైఎస్ఆర్సీపీ అభిమానే బాధ్యుడని, ఇప్పుడు వివేకానందరెడ్డిని జగన్ చంపేసాడని అలవోకగా అబద్ధాలు ఆడేస్తారు ఆయన. ఎన్ని అబద్ధాల యినా అది జనాన్ని నమ్మించాలి, అట్లాగే పదేపదే అవే అబద్ధాలు ఆడితే జనం నమ్మేస్తారు అన్నది ఆయన అభిప్రాయం. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది, జనం తనను నమ్మడం లేదు అని అర్థం అయి నట్టుంది బాబుకు. వియ్యంకుడు, ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణతో తన ఇమేజ్ను గొప్పగా చూపించేందుకు ఓ సినిమా తీయించి అది జనానికి ఎక్కకపోవడంతో తన అసలు స్వరూపం బయటపెట్టే రాంగోపాల్ వర్మ సినిమా బయటికి రాకుండా చూడటానికి సకల ప్రయత్నాలు చేస్తున్నా రాయన. ఎన్నికల సముద్రంలో మునిగిపోతూ ఈ గడ్డిపోచను ఆధా రంగా పట్టుకొని ఈదాలనుకున్నారు. ఎన్నికలలో గెలవడం కోసం ఏమయినా చెయ్యొచ్చు అని నమ్మే చంద్రబాబు తన మాటలు నమ్మి జనం మోసపోరని అర్థం అయ్యాక కొత్త ఎత్తులు వేయడం మొదలు పెట్టారు. రాజకీయ జీవితంలో ఎన్నడూ తాను ఒంటరిగా పోటీ చేసిన చరిత్ర లేదు. ఈసారి మాత్రం బయటకి కనిపించడానికి ఒంటరిగా పోటీ చెయ్యక తప్పని పరిస్థితి. తమకు వ్యతిరేకులు అనిపించిన వారందరి ఓట్లూ తొలగించే ప్రయ త్నంతో బాటు, వాళ్ళను బెదిరించి, భయపెట్టి ఓట్లు వెయ్యకుండా చూసేందుకు పోలీసుల సాయంతో చేస్తున్న ప్రయత్నాలు ఒకవైపు.. మరోవైపు రాజకీయ పక్షాలతో రహస్య ఒప్పందాలు. మొదటినుండి అన్ని ఎన్నికలలో స్నేహం చేసిన బీజేపీతో ఇప్పుడు కలిసిపోయే పరిస్థితి లేదు కాబట్టి బయటికి ఆ పార్టీతో తెగదెంపులు చేసుకున్నట్టు నమ్మిస్తూ లోపాయికారీగా ఢిల్లీలో కమలం పెద్దలతో దోస్తీ కొనసాగిస్తున్నారు. తెలంగాణ ప్రయోగం బెడిసికొట్టడంతో కాంగ్రెస్‌తో ప్రత్యక్ష సంబం ధాలు పెట్టుకుంటే ఏపీలో పుట్టి మునుగుతుంది కాబట్టి ఆ పార్టీతో రహస్య ఒప్పందం. ఆ ఒప్పందంలో భాగమే అరకు నుండి కిషోర్ చంద్ర దేవ్, కర్నూల్ నుండి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, తిరుపతి నుండి పనబాక లక్ష్మిని లోక్‌సభకు తెలుగు దేశం తరఫున పోటీ చేయించడం. ఇది కొత్త తరహా పొత్తు. బీజేపీ, కాంగ్రెస్ రెండింటికీ సమాన దూరం పాటిస్తున్నా నని జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఈ కొత్త తరహా పొత్తులు బహుశా చంద్రబాబు ఒక్కరికే సాధ్యం అనుకోవాలి. ఇక అన్నిటికన్నా ముఖ్యమైన ఎత్తుగడ పవన్ కల్యాణ్ జనసేన. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో యువ రాజ్యం బాధ్యుడిగా కాంగ్రెస్ వాళ్ళ పంచెలు ఊడదీస్తానని ప్రగల్భాలు పలికి పార్టీ ఘోర పరాజయం తరువాత కనుమరుగు అయిపోయిన పవన్ 2014లో మళ్ళీ మోదీ బాబుల మిత్రుడిగా ప్రత్యక్షం అయ్యాక నాలుగేళ్ల పాటు అక్కడ క్కడ, అప్పుడప్పుడు కనిపించి నాలుగు మాటలు మాట్లాడిపోయేవారు. రాష్ట్రాన్ని విడగొడితే పదకొండు రోజులు అన్నం తినలేదన్న దగ్గరి నుండి తన సినిమా పనుల కోసం కేసీఆర్ గొప్ప నాయకుడు, తెలం గాణ ఉద్యమం అద్భుతం అని పొగిడి, మళ్ళీ ’అయ్యా కేసీఆర్ మా ఆంధ్రప్రదేశ్‌ను వదిలెయ్యండి’ అనే వరకూ జనసేన నేత రాజకీయ విన్యాసాలు చూశాం. చంద్రబాబు, ఆయన సుపుత్రరత్నం అవినీతి పరులు అన్న నోటితోనే అయ్యో చంద్రబాబును ఒంటరిని చేసి అందరూ వేధిస్తారా అనేవరకూ పవన్ రహస్య ఎజెండా జనానికి అర్థం కాదను కున్నట్టున్నారు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరూ చూడటం లేదనుకుందట. 175 శాసనసభ స్థానాలకు, 25 లోక్‌సభ స్థానాలకూ ఒకేసారి ఇడుపులపాయ నుండి అభ్యర్థులను ప్రకటించేసి ప్రచార క్షేత్రంలోకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వెళ్లిపోతే తెలుగుదేశం, జనసేన తదితర పార్టీలు ఇంకా పూర్తి జాబితాలు ప్రకటించలేని స్థితిలో ఎందుకు ఉన్నాయి? ఇంకా ఎక్కడ ఎవరిని నిలబెడితే వైఎస్ఆర్ సీపీకి నష్టం చెయ్యగలమా అనే ఆలోచనల్లో ఉన్నట్టున్నారు. జనసేన, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి, తాజాగా ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి పార్టీ బీఎస్పీ వచ్చి ఆ కూటమిలో చేరింది. ఏపీకి సంబంధించినంత వరకు కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పుడు ఇంగువ కట్టిన గుడ్డలే అయినా ఒకప్పుడు బలమయిన శక్తి. మాయావతి పార్టీ ఉనికే ఏపీలో కానరాదు. అయినా పవన్ జనసేన పొత్తుల్లో భాగంగా కమ్యూనిస్ట్ పార్టీల కంటే ఎక్కువ స్థానాలు బీఎస్పీకి ఇచ్చారు. పాపం కమ్యూనిస్ట్‌లు కిక్కురుమనకుండా సర్దుకుపోయే స్థితి. జనసేన కూటమిలోకి మాయావతిని తన జాతీయ సంబంధాల ద్వారా చంద్ర బాబే తీసుకువచ్చారని చెపుతున్నారు. పవన్‌కల్యాణ్‌ను ప్రయోగించి కాపుల ఓట్లు, మాయావతిని ప్రయోగించి దళితుల ఓట్లు చీల్చి వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు నష్టం చెయ్యాలన్నది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తున్నది. ఆ వర్గాల ఓట్లు తనకు ఎట్లాగూ రావన్న విషయం ఆయనకు అర్థం అయిపోయింది మరి. మరో పక్క ప్రజాశాంతి పార్టీ పేరిట చంద్రబాబు మరో బినామీ మత ప్రచారకుడు కేఏపాల్‌ను క్రిస్టియన్ మైనారిటీల ఓట్లు వైఎస్సార్ కాంగ్రెస్‌కు పోకుండా నిరోధించేందుకు తెర మీదకు తెచ్చారు. ఇన్ని చేస్తున్నా బాబుకు ఎన్నికల అనంతర దృశ్యం కళ్లముందు సాక్షాత్కరిస్తున్నట్టున్నది, తాజాగా జేడీ లక్ష్మీనారాయణను తెర మీదకు తెచ్చారు. జేడీ ఆయన ఇంటి పేరు కాదు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి కుట్రపూరితంగా జగన్‌ని కేసులలో ఇరికించినప్పుడు ఆ కేసుల విచారణకు సీబీఐ అధికారిగా ఉన్న లక్ష్మీనారాయణది అందులో జాయింట్ డైరెక్టర్ హోదా. అందుకే జేడీ అంటారు. భారతదేశ పౌరులు ఎవరయినా రాజకీయాల్లోకి రావచ్చు, అట్లాగే జేడీ లక్ష్మీనారాయణ కూడా. కానీ ఆయన గురించి చర్చ ఎందుకంటే స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంసల బోధనలను గురించి మాట్లాడి సమాజానికి విలువలను గురించి ఉపన్యాసాలు ఇచ్చి, రాజకీయాల్లో అవినీతిని తూర్పారబట్టి సొంత పార్టీ పెడతానని చెప్పి చివరికి తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారు. చివరి నిమిషం దాకా టీడీపీలోనే చేర తారని ప్రచారం జరిగినా అది వ్యతిరేక ప్రభావం చూపేటట్టుంది కాబట్టి జనసేనలోకి పంపించి అక్కడి నుంచి పోటీకి దింపుతున్నారు అని అర్థం అయిపోయింది. చంద్రబాబు నాయకత్వంలో రాహుల్‌గాంధీ, పవన్ కల్యాణ్, కమ్యూనిస్ట్‌లు, కేఏ పాల్, జేడీ లక్ష్మీనారాయణలతో కూడిన కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగబోతున్నాయని అర్థం అవుతూనే ఉన్నది. ఏపీ ప్రజలకు ఈ విషయం అర్థం కాలేదనుకుందామా? ప్రజలకు అర్థం అయింది కాబట్టే ఎన్నికల వ్యుహకర్త ప్రశాంత్ కిశోర్ ఆ మాటలు అన్నాడు. ఎన్నో ఎన్నికలు చూసిన అనుభవం కదా ఆయనది కూడా. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
ఇక్కడ పుట్టుకైనా చావైనా అంతా రాజకీయమే!
కారు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ మరణిస్తే అంత హడావుడి చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ కొండగట్టు దగ్గర జరిగిన ఘోర బస్సు ప్రమాదాన్ని అసలు పట్టించు కోలేదు. తానేం చేసినా ప్రశ్నించే ధైర్యం ఎవరికుందనే అహంకారం కేసీఆర్‌ది కాగా, రాజకీయ లబ్ధికి దేన్నయినా వాడేసుకునే ఆరాటం చంద్రబాబుది. 2015 జూలై 15న గోదావరి పుష్కరాల ప్రారంభ ఘటనలో 29 మంది చనిపోతే దాన్ని కూడా ఒక ఈవెంట్‌గా మార్చేయ చూసిన నేత చంద్రబాబు. ఆ దుర్ఘటనపై బాబు ప్రభుత్వం వేసిన ఒక కంటి తుడుపు కమిషన్ సమర్పించిన నివేదిక ఒక న్యాయ విచారణ నివేదికలా లేదు. ఇక్కడ పుట్టుకైనా చావైనా, మంచైనా చెడైనా అంతా రాజకీయమే. జనం అంటే తమకు అధికారం తెచ్చిపెట్టే ఓట్లు, తాము అధికార పీఠం చేరుకోడానికి నిచ్చెన మెట్లు, డబ్బు పారేస్తే కొనడానికి దొరికే వస్తువులు. వాళ్ళు మనుషులు కాదు. మనుషులు ఎందుకు? ఓట్ల మిషన్ మీద తమకు ఓటేయడానికి నొక్కే వేలు ఉంటే సరిపోదా? దానికి ఆకలి ఉండదు, ఆలోచనా ఉండదు. అప్పుడు మనుషుల ఆకలి తీర్చడానికి నయా పైసా ఖర్చుండదు. తమను అధికారం నుంచి దింపి వేస్తారేమో ననే భయం ఉండదు. చాలామంది రాజకీయ నాయకుల ఆలోచన ఇలా ఉంటుంది. అలాంటి నాయకులకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, నారా చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఈ కాలపు ప్రతినిధులు. ఇంకే రాజకీయ నాయకుడయినా వారిని చూసి నేర్చుకోవాల్సిందే. అధికారం దీర్ఘకాలం.. మళ్లీ మాట్లాడితే శాశ్వతంగా తమ వద్దనే ఉండిపోవడం కోసం ఏమైనా చేస్తారు. కొడు కులూ ఇంకా మనుమలకు అధికారాన్ని వారెంత సామర్ధ్యం లేనివారైనా, బదలాయించడానికి వెనకాడరు. పుట్టుకైనా చావైనా, మంచైనా చెడైనా అంతా రాజకీయం. కేసీఆర్, చంద్రబాబు గురించి ఇంత తీవ్రంగా మాట్లాడుకోడానికి కారణాలు చాలా ఉన్నాయి. మొన్ననే తెలంగాణ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కొండగట్టు దగ్గర గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీసీ సంస్థ బస్సు ప్రమాదం జరిగి 60 మంది గ్రామీణులు మరణించారు. వారంతా పేదలు. అంతకు కొద్ది రోజుల ముందే తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కుమారుడు, రాజ్యసభ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ట రోడ్డు ప్రమాదంలో మరణించారు. తెలం గాణ ఏర్పడిన కొద్ది మాసాలకే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే పట్టాలు దాటుతున్న బస్సును రైలు ఢీకొన్న ఘటనలో అమా యక పసిపిల్లలు చనిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో 2015 గోదావరి పుష్క రాల సందర్భంగా రాజమండ్రిలో తొక్కిసలాట కారణంగా 29 మంది అమాయకులు ప్రాణాలు విడిచారు. నేరాలకు శిక్షలుండవా? నందమూరి హరికృష్ణ తెల్లవారుజామునే కారు స్వయంగా నడిపి ప్రమా దంలో చనిపోయారు. ముఖ్యమంత్రి హుటాహుటిన హరికృçష్ణ ఇంటికి వెళ్లి, పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు ఆదేశాలు జారీ చేశారు. అంత్యక్రియలు జరిగిన మహా ప్రస్థానంలో 450 గజాల స్థలంలో స్మృతిచిహ్నం నిర్మాణానికి నిర్ణయిం చారు. ఇదంతా హరికృష్ణ మీద గౌరవమో ప్రేమో అనుకుంటే పొర పాటు. ఎన్నికలు వస్తున్నాయి. హైదరాబాద్ నగరం చుట్టుపక్కల కనీసం 25–30 నియోజకవర్గాల్లో ఎన్నికలను ప్రభావితం చేసే ఆంధ్ర ప్రాంత ప్రజల ఓట్ల మీద ప్రేమతోనే ఇదంతా. హరికృష్ణ మరణంతో పోలిస్తే కొండగట్టు దగ్గర జరిగిన బస్సు ప్రమాదం పెను విపత్తు. అది ప్రభుత్వం చేసిన సామూహిక హత్య. విశ్రాంతి లేకుండా నాలుగు రోజులుగా ఆ డొక్కు బస్సు నడుపుతూ అలసిపోయిన డ్రైవర్, ఏమాత్రం ప్రయాణా నికి పనికిరాని రోడ్డు, లాభాపేక్షతో కెపాసిటీకి మించి బస్సులో కుక్కిన 110 మంది ప్రయాణికులు... ప్రమాదానికి ఇవీ కారణాలు. ఆర్టీసీలో 6,000 డ్రైవర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 300 కొత్త బస్సుల అవ సరమున్నా పట్టిం చుకునే నాథుడు లేడు. హరికృష్ణ మరణిస్తే అంత హడావుడి చేసిన ముఖ్యమంత్రి జాడే లేదెందుకు కొండగట్టు దగ్గర? వారంతా ఓటర్లు మాత్రమే కాదు, తెలం గాణ పోరాటంలో సమరశీల పాత్ర పోషించిన జగిత్యాల ప్రాంత ప్రజలు. కానీ, అక్కడ చనిపోయిన ఓటర్ల సంఖ్య 60 మాత్రమే. వారేమీ 25–30 స్థానాల్లో గెలుపోటములు ప్రభావితంచేసే వారు కాదు అనుకుని ఉండొచ్చు. 100 నియోజకవర్గాల ప్రజలు ఇది గమనిస్తున్నారన్న విషయం సీఎం మరిచిపోయినట్టున్నారు. ఈ దుర్ఘటనకు ప్రభుత్వ నిర్ల క్ష్యమే కారణమైనప్పుడు నైతిక బాధ్యత వహించి సీఎం రాజీనామా చేయాలి. కనీసం రవాణా మంత్రి లేదా ఆర్టీసీ అధిపతికైనా ఉద్వాసన జరగాలి. డిపో మేనేజర్‌ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. ఏపీ సీఎంకు అన్నీ ఈవెంట్లే! ఇక ఏపీ సీఎం చంద్రబాబు తీరు మరో రకం. ప్రతిదీ రాజకీయ లబ్ధికి వాడుకునే అలవాటు ఆయనది. ప్రతి సంక్షోభాన్నీ వాడుకుంటారు. ఆయనకు అన్నీ ‘ఈవెంట్లే’. జనం మరణాలను కూడా తనకు అను కూలమైన ఈవెంట్‌గా మార్చుకొనే ప్రయత్నం చేయడంలో దిట్ట. నేనేం చేసినా ప్రశ్నించే ధైర్యం ఎవరికుందనే అహంకారం కేసీఆర్‌ది. రాజకీయ లబ్ధికి దేన్నయినా వాడేసుకునే ఆరాటం చంద్రబాబుది. 2015 జూలై 15న గోదావరి పుష్కరాల ప్రారంభ ఘటనలో 29 మంది చనిపోతే దాన్ని కూడా ఒక ఈవెంట్‌గా మార్చేయ చూసిన నేత చంద్రబాబు. ఆ దుర్ఘటన తరువాత చంద్రబాబు ప్రభుత్వం వేసిన ఒక కంటి తుడుపు కమిషన్ నిన్న కాక మొన్న తన నివేదికను సమర్పించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అధికారపక్షం ఆమోదం పొందిన ఆ నివేదిక గతంలో ఎంతో ప్రతిష్ట కలిగి ఉండిన జస్టిస్ సీవై సోమయాజులు రాసి నట్టుగా లేదం టున్నారు. అసలు అది ఒక న్యాయ విచారణ నివేదికలా లేదనే అభి ప్రాయం వ్యక్తమైంది. పన్నెండేళ్లకోసారి వచ్చే గోదావరి పుష్కరాలు ప్రజల విశ్వాసాలకు సంబంధించినవి. ప్రభుత్వాలకు వాటితో ఏ సంబంధమూ ఉండకూ డదు. పుష్కర స్నానాలు చేసే భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పిం చడం, పెద్ద సంఖ్యలో జనం వస్తారు కాబట్టి నేరాలూ, ప్రమాదాలూ జర గకుండా చూడటం, శాంతి భద్రతలను పరిరక్షణ–ఇంత వరకే ప్రభు త్వాల పాత్ర పరిమితం కావాలి. కానీ చంద్రబాబుకు ప్రతిదీ ఈవెంట్‌గా మలచుకునే అలవాటు కాబట్టి గోదావరి పుష్కరాలను ఒక అంతర్జా తీయ ఈవెంట్ చేయాలనుకున్నారు. దాని ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం పొందడానికి చేసిన పనే 29 మంది అమాయక భక్తుల దుర్మ రణానికి కారణమైంది. ఒక విదేశీ టీవీ చానల్లో ప్రదర్శన కోసం ఆయన నిర్మించిన ప్రచార చిత్రం కారణంగానే తొక్కిసలాట జరిగింది. జనం పెద్ద సంఖ్యలో కనపడేట్టు సినిమా తీయాలన్న కీర్తి కండూతి కారణంగా వీఐసీ ఘాట్‌లో కాకుండా మామూలు భక్తులు స్నానం చేసే ఘట్టాల దగ్గర చంద్రబాబు కుటుంబం పుణ్యస్నానాలు చేసినందువల్ల, ఆయన రక్షణ కోసం, అప్పటి దాకా ఆపి ఉంచిన జనాన్ని ఒక్క సారిగా వదిలేసరికి తొక్కిసలాట జరిగి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. న్యాయ విచారణ జరపాల్సింది ఈ అంశంపైనే. అయితే ఇది తప్ప చాలా అనవ సరపు విషయాలు జస్టిస్ సోమయాజులు న్యాయ విచారణ కమిషన్ నివేదికలో ప్రస్తావించారు. మీడియాలో ప్రచారమే కొంప ముంచింది! పుష్కరాల ప్రారంభ దినాన ఉదయం ఒక ముహూర్తంలోనే స్నానాలు చేయడం వల్ల ఎంత పుణ్యం వస్తుందో ప్రభుత్వమే మీడియాకు విడుదల చేసిన వ్యాపార ప్రకటనల్లో ఊదర గొట్టింది. ఆ విషయం పక్కన పెట్టి సోమయాజులు గారు తన నివేదికలో ‘అసలే పిచ్చి నమ్మకం. ఆపై ప్రసార మాధ్యమాలలో అతిశయోక్తులతో కూడిన సిద్ధాంత రాద్దాంతం. ఇవన్నీ కలిస్తే ఏమవుతుంది?’ అని దుర్ఘటన కారణాలను భక్తుల నమ్మకం మీదా, మీడియా మీదా నెట్టేశారు. ‘ఫలానా ముహూర్తంలోనే స్నానం చెయ్యండి, పుణ్యం వస్తుంది’’ అని ప్రభుత్వం చేసిన ప్రచారాన్ని పక్కన పెట్టి ‘స్నానాలు ఎప్పుడు చేసినా పుణ్యం వస్తుందన్న విషయాన్ని సరిగా చెప్పలేక చానళ్లు ప్రజల్లో గుడ్డి నమ్మకాన్ని కలిగించాయి’ అని బాధ్యతను మీడియా మీదకు నెట్టేశారు జస్టిస్ సోమయాజులు. మరో పక్క గోదావరిని ఒక బ్రాండ్‌గా ప్రమోట్ చెయ్యడానికి సంవత్సరం ముందు నుంచే రూ.1500 కోట్ల ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వం ఎంత గొప్పగా ప్రణాళికలు రచించిందోనని కొనియాడారు న్యాయమూర్తి. ‘కోటగుమ్మం దగ్గర ఉన్న పుష్కర ఘాట్ మార్గం ఇరుకుగా ఉండటం వల్ల ముఖ్యమంత్రి, తదితర ప్రముఖులు స్నానాలు ముగించుకు వెళ్ళే దాకా జనాన్ని ఆపి ఉంచడం వల్ల ఇబ్బంది అయింది’ అని చెపుతూనే ప్రభుత్వం తప్పేమీ లేదని, అంతా ప్రతిపక్షాల ఓర్వలేనితనమేనని తేల్చేశారు తన నివేదికలో. ఇది జస్టిస్ సోమయాజులు న్యాయ విచారణ కమిషన్ నివేదికలా లేదని చెప్పడానికి సాక్ష్యాధారాలుగా ఈ కింది పంక్తులు చాలు. ‘సమ కాలీన పరిస్థితులు ఏం చెపుతున్నాయంటే అధికారంలో లేని పార్టీలు, లేదా అధికార పక్షానికి వ్యతిరేకులయిన, అంత స్నేహంగా లేకపోయిన పార్టీలు, వాటి నాయకులూ అధికార పక్షం మీద బురద చల్లడానికి ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా విడిచి పెట్టవు. చిన్న సంఘటనను, ఉప ద్రవాన్ని కూడా సొమ్ము చేసుకో జూస్తాయి’. ఈ నివేదికలో ఇంతకంటే దుర్మార్గమైన వ్యాఖ్యానం ఏమిటంటే, సీఎం బాబు పన్నెండు రోజులూ రాజమండ్రిలోనే బస చేసి ఎంతో అద్భుతమైన ఏర్పాట్లు చేశారని కొని యాడుతూ ‘అన్య మతస్తులు కూడా అనేకులు పుణ్య స్నానాలు ఆచరిం చడం ఆనవాయితీ. అందులో భాగంగానే వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తండ్రి వైఎస్సార్‌కి తీర్థ విధి నిర్వహించారు. ఆ విషయం మీడియాలో ప్రసారం కూడా అయింది’ అని. ఒక దుర్ఘటనకు సంబంధించి నిజాని జాలు విచారణ జరిపి, న్యాయబద్ధంగా నివేదిక ఇవ్వాల్సిన న్యాయ మూర్తి వ్యాఖ్యలు ఇలాగే ఉంటాయా? ఈ నివేదికలో జగన్మోహన్రెడ్డి ప్రస్తావన ఔచిత్యం ఏమిటో సోమయాజులు గారే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ప్రకటన లాంటి ఇలాంటి వ్యాఖ్యలు ఇంకా ఈ నివేదికలో చాలా ఉన్నాయి. స్థలాభావం వల్ల వాటన్నిటినీ ఇక్కడ పేర్కొనడం లేదు. వ్యాసకర్త దేవలపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
‘చంద్రుల’ కల నెరవేరేనా?
బీజేపీతో తెగతెంపులు చేసుకున్న దగ్గరి నుంచీ చంద్రబాబు నిద్రలేని రాత్రులే గడుపుతున్నారు. రాత్రంతా కన్న పీడ కలలనే రోజంతా ఉపన్యాసాలలో ‘కేసులు పెడతారేమో, వేధిస్తారేమో’ అన్న మాటలతో తిరిగి జనానికి చెపుతున్నారు. మరోవైపున ఎన్ని సర్వేలు చేయించుకున్నా తెలంగాణలో పరిస్థితి అంత ఆశాజనకంగా లేదని అధికారపక్షానికి అర్థమవుతోంది. అందుకే కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక కూటమి సక్సెస్ కోసం కేసీఆర్ పడరాని పాట్లు పడుతున్నారు. ఎవరి వల్లనయితే లాభం పొందారో, వారినే ఓడించాలన్న స్థితి తెలుగు సీఎంలది. రెండు తెలుగు రాష్ట్రాలు , ఇద్దరు ముఖ్యమంత్రులు, రెండు బలమైన కోరి కలు. ఇద్దరు చంద్రుల రెండు వేర్వేరు కోరికల్లో ఏదో ఒక కోరికే తీరే అవకాశం ఉంది. ఎవరి వల్లనయితే లాభం పొందారో, ఎవరి నిర్ణయాల కారణంగా తాము అధికారంలోకి వచ్చారో వారినే ఓడించాలన్న కోరిక ఆ ఇద్దరు ముఖ్యమంత్రులదీ. వచ్చే నెల 12వ తేదీన జరగనున్న కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీ పోరాడుతున్నాయి. అక్కడి ఎన్నికలు రెండు జాతీయ పార్టీలకూ జీవన్మరణ సమస్యే. 2014లో లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసి ఈ నాలుగేళ్ల కాలంలో కొంతమేరకు పుంజుకున్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవడం ఆ పార్టీ నైతిక స్థయిర్యానికి అత్యంత అవసరం కాగా, మసకబారుతున్న ప్రతిష్టను నిలబెట్టుకోడానికి కర్ణాటకలో గెలవడం బీజేపీకి అంతకన్నా ఎక్కువ అవసరం. సర్వేలు కర్ణాటక ఫలితం హంగ్ అవుతుందని చెపుతున్నా ఎవరి ఆశలు వాళ్ళవి, ఎవరి ప్రయత్నాలు వాళ్ళవి. పోటీదారులకంటే ‘చంద్రు’లకే టెన్షన్ ప్రత్యక్షంగా పోటీ పడుతున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీల కంటే కర్ణాటక ఎన్నికల ఫలితం కోసం అత్యంత ఉద్విగ్న క్షణాలు గడుపుతున్నది చంద్రబాబునాయుడు, చంద్రశేఖర్రావులే. రెండుసార్లూ బీజేపీ సహాయంతోనే అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు కర్ణాటకలో బీజేపీ ఓడిపోవాలని కోరిక. తెలం గాణ రాష్ట్రం ఇచ్చిన, రాష్ట్ర సాధన కారణంగా ప్రజలు తనను గెలిపించిన చంద్రశేఖరరావుకు అదే కాంగ్రెస్ ఓడిపోవాలన్న కోరిక. (కాంగ్రెస్ నిర్ణయం కారణంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న విషయాన్ని ఒప్పుకోను అంటే కుటుంబ సమేతంగా ఎందుకు సోనియాగాంధీ ఇంటికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపి వచ్చారో కేసీఆర్ వివరణ ఇచ్చుకోవాలి). చంద్రబాబు గత ఏడాది గుజరాత్ శాసనసభ ఎన్నికల సమయంలోనే బీజేపీ ఓడిపోవాలని చాలా కోరుకున్నారు. తన శక్తి మేరకు ప్రయత్నం కూడా చేశారు. అయినా అత్తెసరు మార్కులతో బీజేపీ అక్కడ బయటపడటం బాబుకు మింగుడు పడని విషయమే. గుజరాత్ ఎన్నికలకూ, కర్ణాటక ఎన్నికలకూ మధ్య బీజేపీతో తెగతెంపులు చేసుకున్న దగ్గరి నుంచీ చంద్రబాబు నిద్రలేని రాత్రులే గడుపుతున్నారు. రాత్రంతా కన్న పీడ కలలనే రోజంతా ఉపన్యాసాలలో ‘కేసులు పెడతారేమో, వేధిస్తారేమో’ అన్న మాటలతో తిరిగి జనానికి చెపుతున్నారు. ఓడించాలి.. అయినా రాజీ చేసుకోవాలి మనం తప్పులు చెయ్యకపోతే భయపడటం ఎందుకు అని చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం ఆయన చుట్టూ ఉన్నవాళ్ళలో ఒక్కరికయినా లేదాయె. కర్ణాటకలో ఓడిపోతే తప్ప బీజేపీ దూకుడును అడ్డుకోవడం సాధ్యం కాదన్న ఆలోచన కారణంగానే బాబులో ఆ కోరిక రోజురోజుకూ మరింత బలపడుతున్నది. బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటూనే మరో పక్క అదే పార్టీతో మళ్లీ సర్దుబాటు చేసుకునే ప్రయత్నాలు ఆయన మానలేదు. ఏ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నా ఒక ‘సేఫ్ ప్యాసేజ్’ ఏర్పాటు చేసుకోవడం ఆయనకు అలవాటే. 2004–2014 మధ్యకాలంలో కూడా ఆయన యూపీఏ హయాంలో కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తున్నానని చెపుతూనే కేంద్రంలో కొందరు పెద్దలతో సంబంధాలు నెరపిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడూ ఎన్డీయేలో ఆ ‘సేఫ్ ప్యాసేజ్’ ఏర్పాటు చేసుకునే మరోవైపు పోరాటం చేస్తున్న పోజులు మీడియాకి ఇస్తున్నారు. కర్ణాటకలో బీజేపీ ఓడిపోతే ఇక విజృభించవచ్చు అన్నది ఆయన ఆలోచన. ఆయన కల నెరవేరుతుందో లేదో కానీ పీడకలలు మాత్రం ఆయనను వదలడం లేదు. నిన్నటికి నిన్న ద్వారపూడిలో మాట్లాడుతూ మీరంతా నా చుట్టూ ఉండి నన్ను రక్షించుకోవాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు. శాసనసభలో మాట్లాడుతూ కూడా నన్ను వేధిస్తారేమో అన్నారు. ఒకరోజు దీక్షలో వచ్చిన వాళ్ళందరి చేతా కాళ్లు మొక్కించుకున్న ఉదంతం ఆయనలో పెరిగిపోయిన లేదా పేరుకుపోయిన ఆత్మన్యూనతకు నిదర్శనం. కాళ్ళు మొక్కుతున్న వాళ్ళను కనీసం వారించే ప్రయత్నం కూడా చెయ్యని చంద్రబాబు తన బావమరిది, శాసనసభ్యుడు బాలకృష్ణ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీని వచ్చీరాని పిచ్చి హిందీలో దుర్భాషలాడుతుంటే తన్మయంగా వింటూ ఉండిపోయారు. పొంచివున్న ప్రమాదంతో కలవరం కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ ఇటీవలి రెండు తెలుగు రాష్ట్రాల పర్యటన, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో భేటీ, రెండు రాష్ట్రాల పోలీసు డైరెక్టర్ జనరల్‌లతో సమావేశం వంటివి చూసిన వాళ్లకు, ఈ మధ్య బీజేపీ వారు ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగేళ్లలో జరిగిన అవినీతి మీద సీబీఐ విచారణ జరిపించాలని పదే పదే డిమాండ్ చెయ్యడం తప్పకుండా గుర్తుకొస్తుంది. ఆ వెనువెంటనే రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ విజయవాడ వెళ్లి ముఖ్యమంత్రితో భేటీ కావడం తరువాత మంగళవారం నాడు ప్రధానమంత్రినీ, కేంద్ర హోంమంత్రిని కలిసి రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితుల మీద నివేదిక సమర్పించనున్నట్టు వార్తలు రావడం ఏం సూచిస్తున్నట్టు? కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ దగ్గర, రాష్ట్ర గవర్నర్ దగ్గర చంద్రబాబు ఏం మొరపెట్టుకున్నారు? వారు కేంద్రానికి ఎటువంటి సమాచారంతో కూడిన నివేదికలు ఇవ్వనున్నారు? అన్న ప్రశ్నలకు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగే పరిణామాలే జవాబు చెపుతాయి. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే ఇప్పటికే బలం పుంజుకుని తన మీదికి దూసుకొస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నైతిక శక్తి మరింత పెరుగుతుందని చంద్రశేఖర్‌రావు ఆందోళన. ఎన్ని సర్వేలు చేయించుకున్నా వచ్చే శాసనసభ ఎన్నికల్లో అధికార పక్షం 40 నుండి 45 స్థానాలు మించి గెలవదనే తేలుతుండటం టీఆర్ఎస్ అధినేతను కలవరపెడుతున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. అందుకే తాను ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ రాజకీయ కూటమికి మద్దతు సాధించే నెపంతో ఆయన బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడను కలిసి చర్చలు జరిపివచ్చారు. ఆయన వెనకే ఆయన ప్రియ మిత్రుడు, మజ్లిస్ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా బెంగళూరు వెళ్లి కర్ణాటక ఎన్నికల్లో తన పార్టీ పోటీ చెయ్యకుండా దేవెగౌడ పార్టీ జేడీఎస్‌కు మద్దతు ఇస్తుందని చెప్పి వచ్చారు. మజ్లిస్, బీజేపీల మధ్య పరోక్ష సంబంధాలను గురించి గతంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో కూడా చర్చ పెద్ద ఎత్తునే జరిగింది. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్‌ను బలహీనపరిచి, వీలైతే జేడీఎస్ మద్దతుతో బీజేపీ ప్రభుత్వం వచ్చేట్టు చూడాలన్నది చంద్రశేఖర్‌రావు ఆలోచన. ప్రథమ శత్రువే ప్రధాన లక్ష్యం బీజేపీ, కాంగ్రెస్‌ల నాయకత్వంలోని యూపీఏ, ఎన్డీఏలకు వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ కూటమిని తానే ఏర్పాటు చేసి నాయకత్వం కూడా వహిస్తానని బయలుదేరిన చంద్రశేఖర్‌రావు బీజేపీని గెలిపించే ప్రయత్నాలు ఎందుకు చేస్తారు అన్న సందేహం రావచ్చు ఎవరికైనా. తెలంగాణలో ఇవ్వాళ ఆయన ప్రథమ శత్రువు కాంగ్రెస్ పార్టీనే కానీ బీజేపీ కాదు కాబట్టి. అసలు ఆయన ఆలోచిస్తున్న ప్రత్యామ్నాయ కూటమి ఆలోచన వెనక రెండు కారణాలు ఉన్నాయని ప్రచారం. ఒకటి వివిధ రాజకీయ పక్షాలు కాంగ్రెస్ వెనక చేరకుండా చూడటం ద్వారా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏకి సహాయపడటం అయితే మరొకటి రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు కుమారుడికి అప్పగించే క్రమాన్ని సులభతరం, వేగవంతం చెయ్యడం. ఎవరినీ సంప్రదించకుండా, ఎవరితోనూ చర్చించకుండా చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్లో మీడియా ముందు ప్రకటించడం బెంగాల్ వెళ్లి మమతా బెనర్జీని, బెంగళూరు వెళ్లి దేవెగౌడను కలిసి రావడం జార్ఖండ్ నేత హేమంత్ సోరెన్, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి తదితరులు ఆయన ప్రయత్నానికి మద్దతు ప్రకటించడం అయ్యాక ఇప్పుడు ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేసే విషయంలో ఎల్లుండి జరగనున్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీలో నిర్ణయిస్తారని ప్రకటించడం వెనక ఉన్న మర్మం ఏమిటి? ముందు ఇల్లు చక్కబెట్టుకుని ఆ తరువాత ఇండియాను మార్చవచ్చునన్న ఆలోచనే కావచ్చు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడమే కీలకం తెలంగాణ ప్రజలు ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన, అమలు చేస్తున్న కార్యక్రమాలపట్ల పెద్దగా వ్యతిరేకంగా లేరు. కానీ జనంలోకి బలంగా వెళ్లిన ప్రతికూల అంశాలు స్వయంగా ముఖ్యమంత్రి ధోరణి. సచివాలయం ముఖం చూడకపోవడం నుంచి ప్రగతి భవన్ నిర్మాణం దాకా, మంత్రుల నుంచి మొదలుకుని కార్యకర్తలకూ, ప్రజలకూ అందుబాటులో లేకుండా పోవడం దాకా, భిన్నాభిప్రాయాన్ని సహించని అప్రజాస్వామిక వైఖరితో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల గొంతులు నొక్కడం వరకూ అన్నది సత్యం. ఏది ఏమైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉంటుందా అన్నది వచ్చే ఏడాది కాలంలో తెలియాల్సి ఉంది. ఇంకో నాలుగు రోజుల్లో అధికారికంగా అస్తిత్వంలోకి రానున్న ప్రొఫెసర్ కోడండరాం నాయకత్వాన ఏర్పడిన తెలంగాణ జన సమితి ఒకవైపు, మార్క్సిస్ట్ పార్టీ చొరవతో ఏర్పడ్డ దళిత లెఫ్ట్‌ఫ్రంట్, భారత కమ్యూనిస్ట్ పార్టీలను కలుపుకుని ముందుకు పోగలిగితే తెలంగాణలో 2019లో నిస్సందేహంగా గెలుపు కాంగ్రెస్ పార్టీదే. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
వాస్తవాలు చెబితే అదే పదివేలు!
తెలంగాణలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిజాం రాజును వేనోళ్ల పొగడినా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్టీ రామారావుకు బ్రహ్మరథం పట్టినా, ఆయన జీవితం మీద సినిమాలు నిర్మించేటట్టు చూస్తున్నా ఎన్నికల రాజకీయాల కోసమేనని అందరికీ తెలుసు. ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించబోతున్న కేసీఆర్‌కు నిజాం పాలనలో తెలుగు భాషాసంస్కృతులు ఎంత నిర్వీర్యం అయ్యాయో ఆయన చుట్టూ చేరిన మేధావులు చెప్పరెందుకు? జాతీయ స్థాయిలో పద్మావతి సినిమా గొడవ, ఆంధ్రప్రదేశ్ స్థాయిలో నంది పురస్కారాల రగడ పక్కన పెడితే రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు చర్చనీయాంశంగా ఉన్నవారు ఇద్దరు– ఏడవ నిజాం, ఎన్టీ రామారావు. తెలంగాణలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిజాం రాజును వేనోళ్ల పొగడినా, ఆయనను మహానీయుడిగా చిత్రించడానికి చరిత్ర తిరగరాస్తానని చెప్పినా; ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్టీ రామారావుకు బ్రహ్మరథం పట్టినా, ఆయన జీవితం మీద సినిమాలు నిర్మించేటట్టు చూస్తున్నా ఎన్నికల రాజకీయాల కోసమేనని అందరికీ తెలుసు. ఎన్టీ రామారావు జీవితం మీద ఎవరో సినిమాలు తీస్తే చంద్రబాబునాయుడుకు ఏం సంబంధం అని ప్రశ్నించేవాళ్లూ ఉండొచ్చు. ప్రత్యక్షంగా చంద్రబాబునాయుడుకు ఆ సినిమాలతో ఏమీ సంబంధం లేకపోయినా ఆ సిని మాలు తీస్తున్న వాళ్లు ఎవరు, దాని వెనక వాళ్ల ప్రయోజనాలు ఏమిటి, అంతి మంగా అవి ఎవరికి ప్రయోజనకరంగా మారతాయి? అన్న విషయాలు కొంచెం ఆలోచిస్తే అర్థం అవుతుంది. ఎన్టీ రామారావు జీవితం మీద మూడు సినిమాలు రాబోతున్నట్టు వార్తలొచ్చాయి. అందులో ఒకటి స్వయానా ఎన్టీ రామారావు కుమారుడు, చంద్రబాబునాయుడి బావమరిది, వియ్యంకుడు, ఆయన పార్టీ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ నిర్మించబోతుంటే, మరొకటి ప్రముఖ దర్శక నిర్మాత రాంగోపాల్‌వర్మ తీయబోతున్నారు. మూడో సినిమా నిర్మిస్తున్నవారు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి. ఆయన ఎన్టీఆర్ అభిమాని. ఈ మూడు సినిమాలూ కూడా ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం, ముఖ్యంగా లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి ప్రవేశించడం, ఆయన మరణించే వరకు జరి గిన ఘట్టాల మీదనే ఎక్కువ దృష్టి పెట్టబోతున్నాయన్నది నిజం. ఎన్టీఆర్ అంటే భక్తితోనేనా! నటుడు బాలకృష్ణ తాను నిర్మించబోయే సినిమాకు సంబంధించి ఇంకా వివరాలు బయటపెట్టకపోయినా అది కచ్చితంగా లక్ష్మీపార్వతి పట్ల ప్రేక్షకులలో అంటే ప్రజలలో వ్యతిరేక భావాన్ని పెంచేదిగానే ఉంటుంది. అంతే తప్ప అధికారంలో లేనప్పుడు అందరూ ఎన్టీఆర్‌పై కనీసం జాలి లేకుండా గాలికి వది లేస్తే ఆమె చేరువయింది, సపర్యలు చేసింది, చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నది అన్న కోణంలో నుంచి మాత్రం తీయబోరనేది స్పష్టం. రాజకీయంగా చంద్రబాబునాయుడుకు తద్వారా తన సొంత అల్లుడికి నష్టం జరిగే విధంగా బాలకృష్ణ ఈ సినిమాలో వాస్తవాలు చిత్రీకరిస్తారని ఎవరయినా ఎందుకనుకుం టారు? ఇక రాంగోపాల్‌వర్మ సినిమా! ఆయన తీసే సినిమాలు ఎట్లా ఉంటాయో అందరికీ తెలుసు. ముఖ్యంగా రాయలసీమ ముఠా తగాదాల నేప«థ్యంలో పరిటాల రవి, మద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డి మధ్య కక్షలకు సంబంధించి రక్తచరిత్ర పేరిట ఆయన తీసిన రెండు సినిమాలలో వాస్తవాల వక్రీకరణ తెలిసిందే. అది వాస్తవాలకు కల్పన జోడించి తీసిన సినిమా అంటారాయన. ఇప్పుడు తీయబోయే సినిమా మాత్రం వాస్తవ జీవితచిత్రణేనని ఆయన కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పారు. ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒకరు నిర్మాత అంటూ వార్తలు వచ్చాయి కాబట్టి చంద్రబాబునాయుడి ప్రయోజనాలతో సంబంధం లేకుండా జరిగింది జరిగినట్టు చిత్రీకరిస్తారన్న భావన కొందరిలో ఉండొచ్చు. కానీ వర్మ సినిమా టైటిల్, దానికి సంబంధించి బయటికొచ్చిన ఒక పోస్టర్ చూస్తే ఈ సినిమాది కూడా బాలకృష్ణ సినిమా దారేనని అర్థం అవుతుంది. ఈ సినిమా పేరు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. రాజకీయ రంగంలోని వ్యక్తుల జీవితాల ఆధారంగా వర్మ తీసిన సినిమాలన్నీ వివాదాస్పదమే అయ్యాయి. ఇదేమవుతుందో చూడాలి! ఇక తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, సినిమా నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తీయబోయే మూడో సినిమా పేరు ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ (వెంకట సుబ్బారావు పేరు గుర్తుకొచ్చే విధంగా పెట్టిన పేరు). టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది లక్ష్మీపార్వతి పాత్రను అవమానకరంగా చిత్రించబోతున్నారని! సినిమా కథ ఏమిటో తెలియకుండా ఆ మాట ఎట్లా అంటారని అడగొచ్చు ఎవరయినా! ఎన్టీఆర్‌తో వివాహానికి ముందు లక్ష్మీపార్వతి వీరగంధం వెంకటసుబ్బారావు అనే ఆయన భార్య. కారణాలు ఏమయినా... అవి మనకు అనవసరం కూడా, ఆయన నుంచి విడాకులు తీసుకుని ఆమె ఎన్టీఆర్‌ను పెళ్లి చేసుకున్నారు. సినిమా పేరు వీరగంధం అని పెట్టడంలోనే చిత్రకథ ఏ వైపు వెళుతున్నదో అర్థమవుతుంది. ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఆమె మీద బురద చల్లడానికీ, తద్వారా ఎన్టీఆర్ ప్రతిష్టను దిగజార్చడానికీ అప్పటి కొందరు కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానూ, తెలుగుదేశం పార్టీ లోనే చంద్రబాబు నాయుడు వంటి నాయకులు రహస్యంగానూ వీరగంధం సుబ్బారావును పావుగా వాడుకోజూసిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిల పెళ్లి క్షమించరాని నేరంగా చిత్రీకరించే ప్రయత్నం ఆ రోజుల్లో జరిగింది. అనారోగ్యం పాలయి సేవలు చేసే దిక్కులేని పరిస్థితులలో తోడు అవసరం కాబట్టి పెళ్లి చేసుకుంటే మిన్ను విరిగి మీద పడ్డట్టు ఎన్టీ రామారావు మీద విరుచుకుపడ్డ వాళ్లే ఎక్కువ. అందులో తెలుగుదేశం నాయకులు తక్కువ తినలేదు. చంద్రబాబునాయుడు అందుకు మినహాయింపు కాదు. స్త్రీల పట్ల ఏమాత్రం గౌరవం లేని ఎంతో మంది చీకటి జీవితాల కంటే ఎన్టీఆర్ చాలా గొప్పవాడు. ఆయనను పెళ్లి చేసుకున్నాక తెలుగుదేశం రాజకీయాల్లో ఆమె జోక్యం కానీ, పరిపాలన విషయంలో ఎన్టీఆర్ ఆమె ప్రభావానికి లోనై నిర్ణయాలు తీసుకోబోయారన్న విషయంలో కచ్చితమైన సమాచారం ఉంటే ఎవరయినా విమర్శనాత్మకంగా చర్చించవచ్చు. కానీ దాదాపు 22 ఏళ్ల క్రితం మరణించిన ఎన్టీఆర్ జీవితం తెరకెక్కించే ప్రయత్నం చేసేవారు ఎవరయినా సంపూర్ణ సమాచారం సేకరించుకుని చేస్తే బాగుంటుంది. ఆత్మకథలు రాసే వారికి నిజాయితీ, జీవిత చరిత్రలు రాసే వారికి పరిశోధన చాలా ముఖ్యం అన్న విషయం సినిమాలకు కూడా వర్తిస్తుంది. ఎన్టీఆర్ పేరు ప్రతిష్టలను, ప్రజాభిమానాన్ని ఎన్నికల రాజకీయాల కోసం మాత్రమే వాడుకునే చంద్రబాబునాయుడి తెలుగుదేశం ఈ మూడు సినిమాల నుంచి లబ్ధి పొందే హడావుడిలో ఎన్టీఆర్‌ను నవ్వుల పాలు చేసే అవకాశాలే ఎక్కువ. నిజాం బూజును దులపాలి ఇక తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌ను పొగుడుతున్న తీరు జుగుప్సాకరంగా తయారయింది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో ఆంధ్రా వలస పాలకుల కంటే నిజాం రాజు పాలనే మెరుగ్గా ఉండేది అనేమాట ఉద్యమకారుల నుంచి తరచూ వినబడేది. మూర్ఖుడూ, ప్రజా కంటకుడూ అయిన నిజాం కంటే ఎక్కువ దుర్మార్గులు వలస పాలకులు అన్న అర్థం స్ఫురించే విధంగా ఉండేది ఆ పోలిక. నిజానికి అందులో వాస్తవం లేకపోయినా ఉద్యమ కాలంలో ఇటువంటివి సహజం అని సరిపెట్టుకునేవాళ్లం. నిజాం రాజు, ఆయన కిరాయి సైనికులు(రజాకార్లు) తెలంగాణ ప్రాంత ప్రజల మీద సాగించిన దమనకాండను మరచిపోయి, ఆయనో మహనీయుడు అని తాను కీర్తించడమే కాక భావితరాల వారికి తప్పుడు సమాచారాన్ని పంపే ప్రయత్నంలో భాగంగా చరిత్రను తిరగ రాస్తానని అంటున్నారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మలి దశ ఉద్యమంలో చంద్రశేఖరరావు, ఆయన నాయకత్వం వహించిన టీఆర్ఎస్ల పాత్ర విస్మరించడానికి వీలు లేనిదే అయినా, అందుకు ప్రతిఫలంగా రాష్ట్రాన్ని ఏలే అధికారం ప్రజలు ఆయన పార్టీకి కట్టబెట్టినా చరిత్రను వక్రీకరించి తిరగరాస్తానంటే కుదరదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు పన్నెండు శాతం ముస్లింలను ఆకర్షించడానికీ, మజ్లిస్ పార్టీ సహకారంతో వచ్చే ఎన్నికలలో గట్టెక్కడానికీ మైనారిటీ సంక్షేమం పేరిట ఎన్ని పథకాలయినా తీసుకురావచ్చు, ఎన్ని వందల, వేల కోట్ల రూపాయల నిధులయినా కేటాయించవచ్చు. ఎవరికీ అభ్యంతరం ఉండనక్కర లేదు. ముస్లింలు ఈ దేశ పౌరులు. తెలంగాణ సమాజంలో వాళ్లు భాగంగా ఉన్నారు. తెలంగాణలో ముస్లింలకు నిజాం ప్రతినిధి కాదు, మజ్లిస్ నాయకులు అంతకన్నా కాదు. తెలంగాణ ప్రజల ఆస్తులు కొల్లగొట్టి, స్త్రీల మాన ప్రాణాలను హరించి, వందలాది మందిని ఊచకోత కోసి సంపాదించిన నెత్తుటి బంగారాన్ని నిజాం రాజు ఆస్పత్రి కట్టించడానికి దానం చేశాడని పొంగిపోయి శాసనసభ సాక్షిగా ఆ క్రూరుడిని, అతడి పాలనను వేనోళ్ల కీర్తించిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రజాస్వామ్యాన్ని, ఆ అద్భుత పునాదుల మీద నిర్మించుకున్న విలువలను ధ్వంసం చేసేందుకు పూనుకున్నారు. మేధావులు వాస్తవాలు చెప్పాలి తెలుగుభాషను గొప్పగా కీర్తిస్తూ, ఆ కీర్తిని నేల నాలుగు చెరగులా వ్యాపింపచేసే ప్రయత్నంలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించబోతున్న ముఖ్యమంత్రికి నిజాం పాలనలో తెలుగు భాషాసంస్కృతులు ఎంత నిర్వీర్యం అయ్యాయో, ఉర్దూ రాజభాషగా వెలుగొందుతూ ఉంటే అజ్ఞాతంలో ఉండిపోయిన తెలుగు భాషకు మద్దతుగా ఉద్యమాలు సాగాయనీ, అందులో భాగంగానే గ్రంథాలయోద్యమం వేళ్లూనుకున్నదనీ ఆయన చుట్టూ చేరిన మేధావులు చెప్పరెందుకు? రావణాసురుడిని కొలిచే వాళ్లు ఉంటారు. అది వాళ్ల ఇష్టం. నిజాం రాజును కొలిచే వాళ్లూ ఉంటారు, అది కూడా వాళ్ల ఇష్టం. కానీ ప్రజలు ఎన్నుకున్న ఒక ముఖ్యమంత్రి కోట్లాది ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తూ రాజ కీయ ప్రయోజనాల కోసం ఆ పని చెయ్యడం తగదు. రామాయణ కాలంలో ఏం జరిగిందో మనకు తెలియదు. రావణుడు మంచివాడా, ప్రజాకంటకుడా అన్నదీ మనకు తెలియదు. కానీ నిజాం కాలంలో ఏం జరిగిందో మనకు తెలుసు, ఆయన దుష్పరిపాలనా మనకు తెలుసు. ఆయన రాజ్యంలో ప్రజల మీద జరిగిన దమనకాండ గురించి మనకు తెలుసు. తెలిసీ మౌనంగా ఉండటం నేరం. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
‘ప్రశ్న’కు దూరంగా ఉద్యమస్ఫూర్తి
డేట్లైన్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికార పక్షం కార్యాచరణ చూసిన ఎవరికైనా అర్థమ వుతుంది ప్రతిపక్ష రాజకీయ పార్టీల ఉనికిని కూడా అది సహించజాలదని. ఆ మేరకు ఇతర రాజకీయ పక్షాలను నిర్వీర్యం చేసే కార్యక్రమం కొనసాగుతుండగానే శత్రువు జేఏసీ రూపంలో వస్తున్నాడేమో అన్న సందేహం, ఆందోళన కారణంగానే ఇవాళ అధికారపక్షం కోదండరామ్ మీద కత్తి కట్టినట్టు కనిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రజలు పెద్ద ఎత్తున ఆదరించారు. 1980 దశకం తొలిరోజులు. ప్రతిష్టాత్మక హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యా లయంలో విద్యార్థినిని వేధించిన సంఘటనలో ఒక ప్రొఫెసర్‌ను సస్పెండ్ చెయ్యాలని కోరుతూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. యూనివ ర్సిటీ పాలకవర్గం దిగిరాలేదు. ఉద్యమంలో భాగంగా దశలవారీ ప్రదర్శ నలు, రిలే నిరాహార దీక్షలు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇక విద్యా ర్థులు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అప్ప టికి హైదరాబాద్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు ఏర్పడలేదు. విద్యా ర్థిని వేధింపు వ్యవహారంలో ప్రొఫెసర్ మీద చర్యలు తీసుకోవాలని ఉద్యమిం చిన విద్యార్థుల బృందమే అంతకు ముందు యూనివర్సిటీ పాలకవర్గానికి ఒక ముసాయిదా నియమావళిని తయారుచేసి సమర్పించింది. దాని మీద ఇంకా నిర్ణయం జరగక ముందే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో విద్యా ర్థులు ఉద్యమించారు. యాజమాన్యాన్ని దారికి తెచ్చేందుకు హైదరాబాద్ అబిడ్స్ గోల్డెన్ త్రెషోల్డ్లో ఒక విద్యార్థి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిం చాడు. ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నందున ముందుగా ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేసి విచారణ జరపాలన్నది విద్యార్థుల డిమాండ్. విచారణలో తేలితే కానీ సస్పెండ్ చేయబోమని యూనివర్సిటీ యాజమాన్యం మొండి కేసింది. చివరికి ప్రొఫెసర్ సస్పెన్షన్ జరిగాకే ఆ విద్యార్థి ఆమరణ నిరాహార దీక్ష విరమించాడు. ఆ సంఘటనతో చాలా మార్పు వచ్చింది. విద్యార్థి బృందం సమర్పించిన ముసాయిదా నియమావళిని మెజారిటీ విద్యార్థులు ఆమోదించి ఆనాటి నుంచి దాని ఆధారంగానే విద్యార్థి సంఘానికి ఎన్నికలు నిర్వహించుకుంటున్నారు. యూనివర్సిటీ యాజమాన్యం ప్రమేయం ఏ మాత్రం లేకుండా విద్యార్థులే ఈ ఎన్నికలు అత్యంత ప్రజాస్వామిక వాతా వరణంలో ఇప్పటికీ జరుపుకోవడం విశేషం. తోటి విద్యార్థినికి న్యాయం చేయడం కోసం ఆనాడు ఆమరణ నిరాహార దీక్షకు తెగించిన ఆ విద్యార్థి ఆ తరువాత కాలంలో ఒక మంచి అధ్యాపకుడిగా, పౌర హక్కుల ఉల్లంఘనను ప్రతిఘటించేందుకు జరిగిన ప్రతి ఆందోళనలోనూ అడుగు కలిపిన మానవ హక్కుల కార్యకర్తగా సుప్రసిద్ధుడైన ప్రొఫెసర్ కోదండరామ్. 2009 డిసెంబర్ 9 రాత్రి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించి 24 గంటలలోనే వెనక్కి పోయిన కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మళ్లీ దారికి తేవడం కోసం ఏర్పడిన తెలంగాణ సంయుక్త కార్యాచరణ సమితి (టీజేఏసీ) చైర్మన్. సెంట్రల్ యూని వర్సిటీలో విద్యార్థినికి న్యాయం చేయడం కోసం దీక్ష చేయడం మొదలు, తెలంగాణ సాధన కోసం జరిగిన మహోద్యమంలో జేఏసీ అధ్య క్షుడి బాధ్య తలు నిర్వహించే వరకూ కోదండరామ్ ప్రజాపక్షమే. పొలిటికల్ జేఏసీ ఎలా వచ్చింది? డిసెంబర్ 9 ప్రకటనతో ఆమరణ నిరాహార దీక్ష విరమించిన ఉద్యమ నేత, టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసు కోవడంతో హుటాహుటిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుందూరు జానా రెడ్డి ఇంటికి వెళ్లి చర్చించిన అనంతరం తీసుకున్న నిర్ణయం ఫలితమే ఇవాళ మనం పొలిటికల్ జేఏసీ అని చెప్పుకుంటున్న సంఘం. 2009 డిసెంబర్ 24న హైదరాబాద్ లోని కళింగభవన్‌లో జరిగిన ఒక సమావేశంలో ప్రొఫసర్ కొత్తపల్లి జయశంకర్ ప్రతిపాదన మేరకు ప్రొఫెసర్ కోదండరామ్ చైర్మన్‌గా రాజకీయాలకు అతీతంగా జేఏసీ ఏర్పాటైంది. తరువాత వాటి వాటి కార ణాల వల్ల కాంగ్రెస్ వంటి పార్టీలు బయటికి వెళ్లిపోయాయి. టీడీపీ వంటి పార్టీని పంపించేశారు. అన్ని రాజకీయ పక్షాలనూ ఒక్క తాటి మీదకు తెచ్చి రాష్ట్రాన్ని సాధించుకోవాలన్న ఆలోచనతో, కేసీఆర్ చొరవతో ఏర్పడిన ఈ జేఏసీ బహుశా ప్రపంచంలోనే ప్రజా ఉద్యమాలన్నిటికీ మార్గదర్శిగా, దిక్సూ చిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. తెలంగాణ ప్రజల్లో రాష్ట్ర విభజన కోసం బలంగా నాటుకుపోయిన ఆకాంక్ష కారణంగా రాజకీయాలను పక్కకు నెట్టేసి సబ్బండ వర్ణాలూ ఈ జేఏసీలో చేరిన కారణంగానే ఉద్యమం విజయం సాధించిందనడంలో సందేహం లేదు. జేఏసీ మొత్తం తెలంగాణ సమాజాన్ని ఎంత ప్రభావితం చేసిందంటే కుల, వృత్తి, ఉద్యోగ, విద్యార్థి సంఘాలన్నీ జేఏసీలుగా ఏర్పడి ప్రధాన జేఏసీ వెంట నడిచి ఉద్యమాన్ని విజయవంతం చేశాయి. మిలియన్ మార్చ్ చేసినా, సాగరహారం నిర్మించినా, సకల జనుల సమ్మెను చెదిరిపోకుండా బలంగా నిలబెట్టినా, రాష్ట్రమంతటా వంటావా ర్పులు చేసి వందల కిలోమీటర్ల రోడ్లను దిగ్బంధం చేసినా, ఒక్క పిలుపుతో రైళ్లు ఎక్కడివక్కడ నిలిచిపోయినా అది కోదండరామ్ నాయకత్వంలోని జేఏసీ కృషి, పట్టుదల, నిబద్దత కారణంగానే. ఉద్యమ సంస్థగా తెలంగాణ రాష్ట్ర సమితికీ, దానికి నాయకత్వం వహించి, అన్ని ఆటుపోట్లనూ తట్టుకుని ముందుకు నడిపిన చంద్రశేఖరరావుకు రాజకీయ నాయకత్వాన్ని ప్రభా వితం చేసి కేంద్రాన్ని రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం తీసుకునే వైపు అడుగులు వేయించిన ఘనత ఎంత దక్కుతుందో, క్షేత్ర స్థాయిలో ప్రజలను కదిలించి, వారిని ప్రభావితం చేసి ఉద్యమ సెగ పాలకవర్గాలకు తగిలేట్టు చేసి టీఆర్ఎస్కు అవసరమైన బలాన్ని సమకూర్చిన జేఏసీకి అంతే దక్కుతుంది. ఒకానొక దశలో జేఏసీ తెరాస కనుసన్నల్లో నడుస్తున్నదని ఇతర రాజకీయ పక్షాలు విమర్శించినా, తమ మాట వినడంలేదని కోదండరామ్ మీద టీఆర్ఎస్ పెద్దలు అలకబూని పరోక్ష సహాయ నిరాకరణకు దిగినా చలించకుండా ఉద్య మానికి జేఏసీని బాసటగా నిలిపింది కోదండరామ్ నాయకత్వ దక్షతే. జేఏసీ ఆవిర్భావ సభ చరిత్రాత్మకమే తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఆవిర్భవించి మొన్న 24వ తేదీకి ఏడేళ్లు నిండిన సందర్భంగా సభ జరిగింది. తెలంగాణ సాధన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టడానికి కూడా సిద్ద్ధమై చంద్రశేఖరరావు చేసిన ఆమరణ దీక్షను గుర్తుచేసుకోడానికి దీక్షా దివస్ నిర్వహించడం ఎంత సమంజసమో, జేఏసీ ఆవిర్భావ సభను జరుపుకోవడం అంతే సమంజసం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధానపాత్ర నిర్వహించిన జేఏసీని మరచిపోవడానికి వీలులేదు. అయితే లక్ష్యం నెరవేరిన తరువాత కూడా జేఏసీ అవసరం ఏముంది? అన్న ప్రశ్న వినిపిస్తున్నది. ఉద్యమ సంస్థగా ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర సమితి విషయంలో కూడా అప్పట్లో ఇటువంటి వాదనే వినిపించింది. అయితే టీఆర్ఎస్ ఉద్యమ సంస్థ నుంచి ఫక్తు రాజకీయ పార్టీగా రూపాంతరం చెంది ఎన్నికల బరిలో నిలిచి అధికారం చేజిక్కించుకుంది. నిజానికి ఇవాళ పేరుకే అది పొలిటికల్ జేఏసీ కానీ, అందులో టీఆర్ఎస్ సహా ఏ రాజకీయ పార్టీ భాగస్వామి కాదు. ఉద్యమకాలంలో ఉన్న ఉద్యోగ సంఘాలు కూడా ఇప్పుడు దూరమ య్యాయి. కొందరు ఉద్యోగ సంఘాల నాయకులకూ, జేఏసీలో క్రియాశీలక పాత్ర నిర్వహించిన ఇతర విద్యార్థి నాయకులకూ, మేధావులకూ కొన్ని ప్రభుత్వ పదవులు వచ్చాయి. అట్లా పదవులు పొందిన వారి అర్హతలను ప్రశ్నించాల్సిన అవసరం లేదు. కానీ జేఏసీని కొనసాగించడానికీ, దానిని మళ్లీ పునర్వ్యవస్థీకరించడానికీ సాగుతున్న ప్రయత్నం మీద ఎందుకు పెద్ద ఎత్తు్తన దాడి జరుగుతున్నది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మళ్లీ అన్యాయం జరగకుండా సచివాలయం ముందు కుర్చీ వేసుకుని కూర్చుని కాపలా కాస్తాను అన్న నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో పరిపాలనలో జరిగే పొరపాట్ల మీద విమర్శలు చేసే వారి పట్ల అసహనం సముచితమేనా? కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫారం తీసుకుని పోటీ చేసి గెలిచిన శాసన సభ్యులను రాజీనామా చేయించకుండా తమ బలాన్ని పెంచుకున్న టీఆర్ఎస్ పార్టీలోని ఏ నాయకుడికి అయినా కోదండరామ్ టీఆర్ఎస్ ఏజెంట్ అనే అర్హత ఎట్లా ఉంటుంది? జేఏసీ ఏర్పడే వరకూ కోదండరామ్ ఏ రాజకీయ పార్టీలోనూ సభ్యుడుకాదు. భవిష్యత్తులో ఆయన ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే ఎవరికీ ఆక్షేపణ ఉండాల్సిన పనిలేదు. ప్రభుత్వ కార్యక్రమాలూ, పథకాల మీద జేఏసీ కానీ, కోదండరామ్ కానీ చేసే విమర్శలు అవాస్తవాలు అయితే వివరణ ఇచ్చే అవకాశాన్ని, అవసరాన్ని వదిలేసి అసహనాన్ని వ్యక్తం చెయ్యడం, అందునా గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించిన చందంగా రాజ కీయాల్లో ఓనమాలు కూడా నేర్వని బాల్క సుమన్ వంటి వాళ్ల చేత దాడి చేయించడం ఆరోగ్యకరం కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికార పక్షం కార్యాచరణ చూసిన ఎవరికైనా అర్థమవుతుంది ప్రతిపక్ష రాజకీయ పార్టీల ఉనికిని కూడా అది సహించజాలదని. ఆ మేరకు ఇతర రాజకీయ పక్షాలను నిర్వీర్యం చేసే కార్యక్రమం కొనసాగుతుండగానే శత్రువు జేఏసీ రూపంలో వస్తున్నాడేమో అన్న సందేహం, ఆందోళన కారణంగానే ఇవాళ అధికారపక్షం కోదండరామ్ మీద కత్తి్త కట్టినట్టు కనిపిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రజలు పెద్ద ఎత్తున ఆదరించారు. ఇంకా ఆదరిస్తున్నారు. టీఆర్ఎస్కు ఆ విశ్వసనీయత రావడంలో జేఏసీ పాత్ర కూడా ఉంది. ఆ కారణం కూడా తోడై ఇతర రాజకీయపక్షాలు ఇవాళ నామ మాత్రంగా, నిష్క్రియాపరంగా కనిపిస్తున్నాయి. ఇటువంటి సమయంలో జేఏ సీని బలోపేతం చేసే ఆలోచన కోదండరామ్ వంటి వారికి రావడాన్ని సహ జంగానే అధికారపక్షం జీర్ణించుకోలేకపోతున్నది. కోదండరామ్ నాయకత్వంలో బలోపేతం కావాలనుకుంటున్న జేఏసీ భవిష్యత్తులో రాజకీయ స్వరూపం తీసుకుంటుందా లేదా అన్నది ఇప్పుడే నిర్ణయించలేం కానీ, నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ శూన్యం మాత్రం ప్రజాస్వామ్య వాతావరణాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తు న్నది. ప్రత్యామ్నాయ రాజకీయాలను ప్రజాస్వామ్యవాదులంతా ఆహ్వానిం చాల్సిందే. (వ్యాసకర్త : దేవులపల్లి అమర్, ఐజేయూ సెక్రటరీ జనరల్ datelinehyderabad@gmail.com) -
తిక్కెక్కిస్తున్న పవన్ లెక్క
డేట్లైన్ హైదరాబాద్ పవన్ కల్యాణ్ అనే సినీ హీరో ఈ రెండు అంశాలలో ఏ అంశం ప్రాతిపదికగా రాజకీయాల్లోకి వచ్చారు? ఏ కారణం చేత రాజకీయ పార్టీ జనసేన ప్రారంభించారు? ఆయన ఎవరి వైపు? ఎలాంటి రాజకీయాలను వ్యతిరేకిస్తున్నారు? ఆయన లక్ష్యం ఏమిటి? అన్న సందే హాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పలువురు వ్యక్తం చేస్తున్నారు. అటువంటి సందేహాలు కలగడానికి కారణం ఆయనే. ఆయన వ్యవహార శైలి, ఆలోచనలలో అస్పష్టత, అభిప్రాయాలలో గందరగోళం ఆ సందేహాలకు మూలం. అయిదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చెయ్యాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఇది జరిగిన కొన్ని నెలలకే ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసేసుకుని ఆకస్మికంగా పెద్ద నోట్లను రద్దు కూడా చేశారు. దీనితో ఏర్పడ్డ గందరగోళ పరిస్థితుల్లో జనం ఒక విషయం పట్టించుకోకుండా వదిలేసినట్టు కనిపిస్తున్నది. అది– వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఎన్డీఏ భాగస్వామిగా చంద్రబాబు నాయుడు ఇచ్చే సలహాలు కేంద్ర ప్రభుత్వానికి అచ్చిరావని ఇప్పటికే ఒకసారి తేలిపోయింది. 2003లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనే లక్ష్యంగా తిరుమల దారిలోని అలిపిరి వద్ద తీవ్రవాదులు మందుపాతర పేల్చారు. ఆ ఘటన ద్వారా వచ్చిన సానుభూతిని వాడుకుని మరోసారి అధికారంలోకి రావాలని చంద్రబాబు ఆనాడు ఆలోచించారు. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా ఆయన సలహా పాటించి ఆరునెలల ముందే ఎన్నికలకు (2004) వెళ్లింది. అప్పుడే ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం, ఢిల్లీలో వాజ్‌పేయి ప్రభుత్వం కూడా ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ పెద్ద నోట్ల రద్దు వ్యవహారం కూడా చంద్రబాబు లేఖకు స్పందించి, ఆయన సలహా మేరకే జరిగి ఉంటే మోదీ ప్రభుత్వానికి తగులుతున్న జనాగ్రహం వేడితో బీజేపీ నేతలకు పొరపాటు అర్థమయ్యే ఉంటుంది. అంటే రెండోసారి ఎన్డీఏని చంద్రబాబు ఇబ్బందుల్లో పడేశారు. కానీ ఆయన ఆ లేఖ రాసి నప్పుడు చేసుకున్నంత ప్రచారం, ఇప్పుడు చేసుకోవడానికి మాత్రం సాహసం చేయడం లేదు. కేంద్ర నిర్ణయం వికటించేసరికి ఇదంతా తన లేఖ ఘనతేనని ప్రకటించుకునేందుకు ముందుకు రావడం లేదు. పెద్దనోట్ల రద్దు.. మింగలేక, కక్కలేక.. నల్లధనాన్ని, నకిలీ నోట్లను అరికట్టే పద్ధతి ఇది కాదనీ, ఇది ఒక పరిణతి చెందిన ప్రభుత్వ నిర్ణయం మాదిరిగా కాకుండా, ఆకతాయి పనిగా ఉందనీ అత్యధిక సంఖ్యాకులయిన ప్రజలు ఇవాళ అభిప్రాయపడుతున్నారు. ఒకటి నిజం. పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఏ మాత్రం సానుకూల ప్రజాస్పందన పొందినా, చంద్రబాబునాయుడు వెంటనే ఇదంతా తన లేఖ ఘనతేనని కచ్చితంగా ప్రచారం చేసుకునేవారు. ఇప్పుడు ఆయన పరిస్థితి మింగలేక, కక్కలేక అన్నట్టు తయారయింది. కేంద్ర నిర్ణయం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలూ తీవ్రమయిన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాయి. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చే మాసాల్లో ఎదురుకానుంది. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు బహిరంగంగానే కేంద్రం నిర్ణయాన్ని విమర్శి స్తున్నారు. కేంద్రంలో భాగస్వామి కావడం వల్లా, పెద్ద నోట్ల రద్దును కోరుతూ స్వయంగా లేఖ రాసిన కారణం వల్లా చంద్రబాబు ఇప్పుడు ఏమీ మాట్లా డలేరు. కానీ మోదీతోపాటు జనాగ్రహాన్ని కొంత తానూ మూటకట్టుకోక తప్పదు. అదీ కాకుండా రద్దు నిర్ణయం చాలా ముందే తెలుసు కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన పార్టీ పెద్దలూ, వారి సమర్థకులూ ఇప్పటికే సర్దుకున్నారనే వాదన కూడా వినిపిస్తున్నది. మొత్తానికి ఈ వ్యవహారం ప్రత్యేక హోదా హామీని అటక ఎక్కించిన కారణంగా 2019 ఎన్నికల్లో తెలుగు దేశం, బీజేపీ కూటమికి ఎదురుకానున్న వ్యతిరేకతను మరింత తీవ్రం చేస్తుం దనడంలో సందేహం లేదు. నోట్ల రద్దు గందరగోళంలో పడి అందరూ పవన్ కల్యాణ్ గురించి మాట్లాడటమే మరిచిపోతున్నారు. ఇక ఆయన క్రియాశీలక రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. మొత్తానికి పోటీ చేస్తానన్నారు! 2019 ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేస్తానని పవన్ కల్యాణ్ ఎట్టకేలకు నిర్ధారించారు. గత వారం అనంతపురంలో జరిగిన బహిరంగ సభలో తన ప్రసంగం మధ్యలో ఈ ప్రకటన చేశారు. 2014 ఎన్నికలకు కొద్ది ముందుగా ఆయన తన సొంత పార్టీ జనసేన ప్రకటించినా పోటీ చెయ్యబోవడం లేదని స్పష్టంగా చెప్పి బీజేపీ, టీడీపీ కూటమికి మద్దతుగా ప్రచారం మాత్రం చేశారు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని తీవ్రమయిన సమస్యలు ప్రజలు ఎదుర్కొన్నా మిత్రధర్మం అనుకున్నారేమో, ఆయన తాను బలపరిచిన కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం ఎన్నడూ చెయ్యలేదు. ఆంధ్ర ప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా రెండున్నర సంవత్సరాలు గడిచాయి. అడుగడుగునా సమస్యలతో ప్రజలు సతమతమవుతుంటే శాసనసభలో ఉన్న ఒకే ఒక్క ప్రతిపక్షం ఆందోళన బాట పట్టి, దాదాపు రోజూ వీధుల్లోనే ఉంటున్న పరిస్థితిలో కూడా ప్రశ్నిస్తానూ, ప్రశ్నిస్తానూ అని పదే పదే చెప్పిన పవన్ ఒక్కమాట మాట్లాడకుండా ఇప్పుడు పెదవి విప్పారు. పవన్ వైఖరి ఏమిటి? ఎవరైనా రాజకీయాల్లోకి ప్రవేశించాలని అభిలషించినా, ఒక కొత్త రాజకీయ పార్టీ పెట్టాలనుకున్నా ఆ ఆలోచన వెనుక చాలా అంతర్మథనం జరగడం సహజం. కొన్ని సందర్భాలలో పరిస్థితుల ప్రభావం వల్ల రాజకీయాల వైపు బలవంతంగానే ప్రయాణం చెయ్యాల్సి వస్తుంది. పవన్ కల్యాణ్ అనే సినీ హీరో ఈ రెండు అంశాలలో ఏ అంశం ప్రాతిపదికగా రాజకీయాల్లోకి వచ్చారు? ఏ కారణం చేత రాజకీయ పార్టీ జనసేన ప్రారంభించారు? ఆయన ఎవరి వైపు? ఎలాంటి రాజకీయాలను వ్యతిరేకిస్తున్నారు? ఆయన లక్ష్యం ఏమిటి? అన్న సందేహాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పలువురు వ్యక్తం చేస్తున్నారు. అటువంటి సందేహాలు కలగడానికి కారణం ఆయనే. ఆయన వ్యవహార శైలి, ఆలోచనలలో అస్పష్టత, అభిప్రాయాలలో గందరగోళం ఆ సందేహాలకు మూలం. రాజకీయాల్లోకి వచ్చేవారు ఎన్నికల్లో పోటీ చేసేది గెలవడానికీ, ఆ తరువాత అధికారంలోకి రావడానికే. పవన్ కల్యాణ్ గత రెండు మాసాల కాలంలో తిరుపతి నుంచి మొదలు పెట్టి అనంతపురం దాకా మాట్లాడిన మూడు సభల్లో ఎక్కడా ఆయన అంతటి ఆత్మవిశ్వాసంతో ఉన్నట్టు కనిపించదు. తిరుపతి తరువాత ఆయన ప్రత్యేక హోదా పోరాటం కాకినాడ నుంచి ప్రారంభించారు. ఆ తరువాత అనంతపురం వచ్చేసరికి మాత్రం ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారన్న అంశంలో స్పష్టత వచ్చింది. ఈ మధ్యలో ఆయన ఏలూరులో ఇల్లు తీసుకోవడం, అక్కడే ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని నిర్ణయించుకోవడం ఆయనను అభిమానించే వారిలో కొంత నమ్మకం కలిగించిన మాట నిజమే కావచ్చు. అయినా ఎన్నికల్లో పోటీ విషయంలో పవన్ కల్యాణ్ మాటలు మాత్రం ఆయన అభిమానులను నిరుత్సాహపరిచేవిగానే ఉన్నాయి. ఎందుకంటే రాజకీయాల్లో తన శత్రువు ఎవరో ఆయనకు స్పష్టత లేదు. బలంగా నిలిచి శత్రువు మీద గెలుస్తాననే ఆత్మవిశ్వాసమూ ఆయన మాటల్లో వినిపించదు. ప్రజలు తనను నమ్ము తున్నారనీ, తనతో ఉంటారనీ కూడా ఆయనకు నమ్మకం లేదు. అదే వేదిక మీద ఆయన ‘‘మీరు నాతో ఉన్నా లేకున్నా నేను మీతో ఉంటాను’’అనడం, అలాగే పోటీ అయితే చేస్తాను, గెలిచినా ఓడినా సరే అనడంతోనూ ఆయనకు తాను ఏం చేయదలుచుకున్నారన్న విషయంలో స్పష్టత లేదన్న సంగతి అందరికీ అర్థం అయింది. తెలుగుదేశం పార్టీలో అవినీతిని గురించి ఆయన ప్రస్తావించారు. 20 మంది ప్రతిపక్ష శాసనసభ్యులను కొనడం తప్పు అనే మాట మాట్లాడరు. ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రాన్ని విమర్శిస్తారు. సన్మా నాలు చేయించుకున్న వెంకయ్యనాయుడును ఇతర బీజేపీ నాయకులనూ విమర్శిస్తారు. కానీ మొట్టమొదటి రోజు నుంచీ ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో ప్రతిపక్షం చేస్తున్న ఆందోళనతో భుజం కలపడానికి సిద్ధపడరు. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని తెలుగు దేశం, బీజేపీ కూటమి అంటుంటే నిరంతర పోరాటం చేస్తామని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఆందోళన చేస్తున్నాయి. 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పవన్ సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి బరిలోకి దిగినప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా ఆయన అనేక సభల్లో మాట్లాడారు. అప్పుడు ఉన్న స్పష్టత ఇప్పుడు సొంత పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయనలో కనిపించడం లేదు. అధికారంలో ఉన్న వారిని ఆయన చాలా మొహమాటంగా విమర్శిస్తున్నారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా విషయంలో లేదా రైతు రుణమాఫీ, కాపుల రిజర్వేషన్లు మొదలయిన సమస్యల మీద పోరాటం చేస్తే, నిలదీస్తే పెద్ద పెట్టున విరుచుకుపడి సంస్కారహీనమయిన భాషలో దూషించే అధికారపక్ష పెద్దలు కూడా పవన్ కల్యాణ్‌ను గట్టిగా విమర్శించడానికి సిద్ధపడటం లేదు. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అవినీతికి పాల్పడుతున్నారని పవన్ చేసిన విమర్శ మీద తెలుగుదేశం సీనియర్ నాయకుడొకరు, ‘అవును కొద్ది మాసాల క్రితం మా ముఖ్యమంత్రి కూడా పార్టీ మీటింగ్‌లో ఈ విషయం చెప్పారు, పవన్‌కు మెల్లగా నచ్చచెబుదాం అన్ని విషయాలు’ అన్న స్వరంలో మాట్లా డారంటే ఏమనుకోవాలి? కాపుల రిజర్వేషన్ల విషయంలో ముద్రగడ పద్మ నాభం పాదయాత్ర తలపెడితే అది శాంతిభద్రతల సమస్య అవుతుంది. దానిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తారు. అదే సమయంలో కాపు కార్పొరేషన్ అధ్యక్షుడు పాదయాత్ర చెయ్యడానికి మాత్రం అనుమతి ఉంటుంది. అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం దగ్గరుండి చూసుకుంటుంది. వీటిలో వేటి గురించి పవన్ నోరు మెదపరు. విపక్షాలతో కలవరేం? ఇదే ధోరణి కొనసాగితే పవన్ కల్యాణ్ చేస్తున్న పోరాటం కేంద్రం మీదనో, రాష్ట్ర ప్రభుత్వం మీదనో అని ఎవరూ అనుకోరు. ఈ సమస్యలన్నిటి మీదా రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటంతో కలసి నడిస్తేనే జనం నమ్ముతారు. అధికారపక్షాలతో పవన్ చేస్తున్నది లాలూచీ కుస్తీ అనే అపవాదు మూట కట్టుకోకుండా ఉండాలంటే, జనసేనను, సేనాధిపతినీ ప్రజలు నమ్మాలంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా సమస్యల మీద జరుగుతున్న పోరాటంలో నిజాయితీగా ఇతర పక్షాలతో భుజం కలిపి నడవటం ఒక్కటే మార్గం. datelinehyderabad@gmail.com దేవులపల్లి అమర్ -
అవినీతి అధినేతల మాటేమిటి?
డేట్లైన్ హైదరాబాద్ ఉక్రోషానికి పోరుు తెలంగాణ ప్రభుత్వం మీద విరుచుకుపడి నాకూ ఏసీబీ ఉంది, నాకూ పోలీసు శాఖ ఉంది, హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ పోలీస్స్టేషన్లు పెడతా అని స్థారుు మరచిన ప్రకటనలు చేశారు తప్ప, తనకు ఈ కేసుతో సంబంధం లేదని రుజువు చేసుకునే ప్రయత్నం చెయ్యలేదు. మండలికి సభ్యులు ఎన్నిక కావడం అన్నది ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ. దానికి విఘాతం కలిగించే విధంగా ఎంఎల్ఏలను కొనుక్కునే పథక రచన చేసి, ఆడియో టేప్‌లలో దొరికిన చంద్రబాబును కేసులో నిందితుడిగా ఎందుకు చేర్చలేదు? ‘ఈరోజుల్లో 30 ఏళ్లకే సుగర్, బీపీ, హార్ట్ ఎటాక్ వంటి జబ్బులొస్తున్నారుు. అలాంటప్పుడు లక్షలాది రూపాయలు అక్రమంగా సంపాదించి ఏం చేసు కుంటారు...?’ శిక్షణ పొందుతున్న పబ్లిక్ సర్వీస్ అధికారులను ఉద్దేశించి పదిరోజుల నాడు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్న మాటలివి. సెంట్రల్ సర్వీస్ అధికారులకు 91వ ఫౌండేషన్ కోర్స్ ప్రారంభిస్తూ గవర్నర్ ఈ మాటలు అన్నారు. ఆ సమయంలోనే, హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టు ఒక అవినీతి కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాత్ర మీద దర్యాప్తు జరిపి నెలరోజుల్లో నివేదిక సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖను ఆదేశించింది. అందరూ ఊహించినట్టుగానే చంద్రబాబునాయుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి ఎనిమిది వారాల స్టే తెచ్చుకున్నారు. ఆ గొంతు ఆయనదే అయినా.... ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే, పదిహేను మాసాల క్రితం తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఒక కేసులో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డిని, టీఆర్ఎస్ నామినేటెడ్ శాసనసభ్యుడు స్టీఫెన్సన్కు 50 లక్షల రూపాయలు బయానా ఇస్తూ, మరో మూడున్నర కోట్లు త్వరలో ఇస్తామని చెపుతూ ఆడియో వీడియో టేప్‌లలో దొరికిపోరుు జైలుకు పోయాడు. మరో శాసన సభ్యుడు సండ్ర వెంకటవీరయ్య కూడా ఈ కేసులో తరువాత అరెస్ట్ అయ్యాడు, జైలుకి వెళ్లి బెరుుల్ మీద తిరిగొచ్చాడు. మరో నిందితుడు మత్తయ్యను పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఆశ్రయం ఇచ్చి జైలుకు పోకుండా కాపాడారు. ఈ సంఘటనలో రేవంత్‌రెడ్డి, సంద్ర వెంకటవీరయ్య, మత్తయ్య వగైరా వగైరాలంతా పావులు మాత్రమే. ఎంఎల్ఏలను కోట్ల రూపాయల డబ్బు ఇచ్చి కొని ఎంఎల్సీ ఎన్నికలు గెలవాలని పథకం రచించినదీ, కార్యాచరణకు ఆదేశించినదీ సాక్షాత్తూ తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇది జగమెరిగిన సత్యం. సెబాస్టియన్ అనే మరో తెలుగుదేశం నాయకుడు కలిపి ఇచ్చిన ఫోన్లో చంద్రబాబునాయుడు స్టీఫెన్‌సన్‌తో మాట్లాడుతూ మనవాళ్లు నాకు అంతా చెప్పారు, నేను మీకు అండగా ఉన్నాను, భయంలేదు ముందుకు వెళ్లండి అని తనదైన శైలిలో, ఇంగ్లిష్‌లో చెప్పిన విషయం రికార్డు అరుుంది. ఆ గొంతు ఆయనదేనని అందరికీ తెలుసు. ఆయన కూడా ఎంతసేపూ నా ఫోన్ ట్యాప్ చేస్తారా అని హూంకరించారే తప్ప అది నా గొంతు కాదు అని ఒక్కసారి కూడా అనలేదు. ఉక్రోషానికి పోరుు తెలంగాణ ప్రభుత్వం మీదా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మీదా విరుచుకుపడి నాకూ ఏసీబీ ఉంది, నాకూ పోలీసు శాఖ ఉంది, హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ పోలీస్స్టేషన్లు పెడతా అని స్థారుు మరచిన ప్రకటనలు చేశారు తప్ప తనకు ఈ కేసుతో సంబంధం లేదని రుజువు చేసుకునే ప్రయత్నం ఒక్కటీ చెయ్యలేదు. శాసనసభ నుండి మండలికి సభ్యులు ఎన్నిక కావడం అన్నది ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ. ఆ ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగించే విధంగా కోట్లాది రూపాయలు విచ్చలవిడిగా వెదజల్లి ఎంఎల్ఏలను కొనుక్కునే పథక రచన చేసి, ఆడియో టేప్‌లలో దొరికిపోరుున చంద్రబాబునాయుడును కేసులో నిందితుడిగా ఎందుకు చేర్చ లేదన్నది ప్రశ్న. ఏమైపోయాయా గర్జనలు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంకో రాష్ట్రంలో జరిగిన వ్యవహారంలో నింది తుడిగా చేర్చడానికి ఏమరుునా విధివిధానాలు ఉంటే వాటిని అనుసరించే తెలంగాణ ఏసీబీ చంద్రబాబునాయుడును నిందితుల జాబితాలో చేర్చి ఉండాలి. ఈ సంఘటన జరిగిన తొలి రోజుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నల్లగొండ జిల్లాలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు జైలుకు వెళ్లకుండా బ్రహ్మదేవుడు కూడా రక్షించ లేడు అన్నారు. ఆ తరువాత అంతా నిశ్శబ్దం. ఓటుకు కోట్లు కేసు ప్రస్తావన వస్తే చాలు తెలంగాణలో అధికారపక్షం టీఆర్ఎస్ నాయకులు పైస్థాయి నుంచి కింది దాకా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని పక్కకు తప్పుకుంటున్నారు. ఏసీబీ దర్యాప్తులో కూడా మొదలుపెట్టినప్పుడు ఉన్న వేగం తగ్గి మందకొడిగా సాగింది. అంతేకాదు వీరి నుండి వారికి, వారి నుండి వీరికి ఆహ్వానాలు, వీరు అమరావతికి వెళ్లి స్నేహహస్తం చాచి వస్తే, వారు యాగాలకు హాజరై సుహృద్భావాన్ని ఆధ్యాత్మికంగా ప్రకటించిపోతారు. ఇదంతా చూస్తూ కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు రెండు తెలుగు రాష్ట్రాల అధినేతల మధ్య సత్సంబంధాలు చూసి మురిసి ముక్కలరుు పోతుంటారు. అంతేకాదు, ఇరువురు ముఖ్యమంత్రులు గవర్నర్‌గారి దగ్గర కూర్చుని సమస్యను పరిష్కరించుకున్నారు కదా ఇంకా దాని గురించి మనం ఎందుకు మాట్లాడటం అని కొందరు బీజేపీ నాయకులు అంటుంటే, నిన్నటికి నిన్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్వయంగా తన మిత్రుడు చంద్ర బాబునాయుడుకు క్లీన్చిట్ కూడా ఇచ్చేశారు. ‘‘చంద్రబాబు భయపడాల్సిన అవసరం లేదు, ఆయనకు సంబంధించిన విచారణ ప్రతిపాదనలు ఏవీ కేంద్రం వద్ద లేవు, ఇవన్నీ చౌకబారు రాజకీయాలు’’ అని ఒక దినపత్రిక, టీవీ చానల్‌కు ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడుగారి మరో ఆత్మబంధువు, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ గత వారం తిరుపతిలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ సీబీఐ అంటే భయపడుతున్నారా, ఏమన్నా లొసుగులు ఉంటే భయపడాలి, మీకేమన్నా లొసుగులున్నాయా అని బాబును ఉద్దేశించి అన్నారు. దానికి వెంకయ్య నాయుడు గారు జవాబు ఇచ్చేశారు. పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తారు, వెంకయ్య నాయుడు జవాబు ఇస్తారు. చంద్రబాబు సంతోషిస్తారు. సమాజం ప్రేక్షక పాత్ర వహించాలని ఆ ముగ్గురూ అనుకుంటారు. ఓటుకు కోట్లు ఆషామాషీ వ్యవహారమా? నిజమే, చంద్రబాబును విచారించడానికి కేంద్రం దగ్గర దరఖాస్తులేవీ పెండింగ్‌లో లేవు. అంతమాత్రాన ఓటుకు కోట్లు వ్యవహారం ఆషామాషీ విషయంగా భావించాలా? ఈ వ్యవహారాన్ని ఎవరో రోడ్డున పోయే జులా యిలు ఒక గొప్ప స్టేట్స్‌మన్ మీద చేసిన ఆకతారుు ఫిర్యాదుగా కేంద్రంలో పెద్దలు చూస్తున్నారా? వెంకయ్యనాయుడుగారి ప్రకటన వింటే అట్లాగే అనిపిస్తుంది. ముందే చెప్పినట్టుగా చంద్రబాబునాయుడు ఈ కేసుతో తనకు సంబంధం లేదని నిరూపించుకునే ప్రయత్నం ఎన్నడూ చెయ్యలేదు. ఇదే కాదు ఆయన ఏ కేసులోనూ ఆ ప్రయత్నం చెయ్యరు. ఆ కేసులు కొట్టేయా ల్సిందిగా కోర్టులను కోరతారు. స్టేలు తెచ్చుకుంటారు. ఏళ్ల తరబడి స్టేల మీద గడిపేస్తుంటారు. ప్రజాక్షేత్రంలో ఉన్న ఏ నాయకుడూ చెయ్యకూడని పని అది. ప్రజా బలం కలిగిన నాయకులు ఎవరరుునా ధైర్యంగా నిలబడి విచారణను ఆహ్వానించి తన నిర్దోషిత్వం నిరూపించుకుంటారు. చంద్రబాబు ఆ పని ఎందుకు చెయ్యరు? రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌గారు కేంద్ర సర్వీస్‌ల అధికారులకు నీతిమంతంగా ఉండండని సుద్దులు చెప్పి నట్టుగానే చంద్ర బాబును కూడా మీ నిర్దోషిత్వం నిరూపించుకోండి అని ఎందుకు హితవు చెప్పరో అర్థంకాదు. అవినీతి రహిత పాలన అందించడం మా లక్ష్యం ‘‘అచ్చే దిన్ వచ్చేశారుు’’ అని చెపుతున్న కేంద్రంలోని బీజేపీ నాయకత్వాన గల ఎన్డీఏ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఓటుకు కోట్లు వ్యవహారం అవినీతి కార్యక్రమంగా కనిపించడం లేదా? నీతివంతమైన పాలన ఇస్తామన్న కేంద్రం తన ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి మీద ఈగ వాలకుండా చూసుకుంటుంది సరే, మరి ప్రశ్నిస్తాను, ప్రశ్నిస్తాను అని పదే పదే మాట్లాడి ఆవేశపడే పవన్ కల్యాణ్ తిరుపతిలో బహిరంగ సభ పెట్టి ఒక్క ప్రత్యేక హోదా గురించి మాత్రమే ఎందుకు ప్రశ్నించారు? ఆవేశ పడిపోయారు? ఆయన రాజకీయాల్లో ఉన్నానని అంటున్నారు, జనసేన పార్టీని పూర్తి స్థారుు రాజకీయ పార్టీగా నడిపిస్తానని చెపుతున్నారు. అటు వంటి నాయకుడికి ఓటుకు కోట్లు వ్యవహారంతో సహా అన్ని విషయాల మీదా స్పష్టమరుున అవగాహన ఉండాలి కదా! తప్పులన్నిటినీ ఎత్తి చూపాలి కదా, వ్యతిరేకించాలి కదా! ఒక్క ప్రత్యేక హోదా కోసమే ఆయన రాజకీయాల్లోకి క్రియాశీలకంగా వచ్చి ఆ పని అరుుపోతే మళ్లీ వెనక్కి వెళ్ళిపోతారా? ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది ఇటువంటి చేష్టలు చూసినప్పుడు! చంద్రబాబు నాయుడును, టీడీపీ పార్టీని రక్షించడానికే పవన్ కల్యాణ్ రాజకీయ ధ్యేయ మైతే త్వరలోనే ఆయన పశ్చాత్తాపపడే రోజు వస్తుంది. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
‘వలస’ పక్షులదే వర్తమానం
- డేట్లైన్ హైదరాబాద్ ఇక్కడ కమ్యూనిస్టులను గురించి కూడా మాట్లాడుకోవాలి. బీజేపీ మినహా ఈ దేశంలో దాదాపు అన్ని పార్టీలు కచ్చితమైన సిద్ధాంతం మీద పనిచెయ్యవు. ఒకప్పుడు తెలంగాణలో నల్లగొండ, ఖమ్మం జిల్లాలలో కామ్రేడ్లు పట్టు కలిగి ఉండేవారు. చివరికి రెండు జిల్లాలలో చెరొక్క స్థానానికి పరిమితయ్యాయి సీపీఐ, సీపీఎం. ఎన్నికల ఖర్చు కోట్లకు చేరుకున్నాక చట్టసభలకు పోటీ పడటం కమ్యూనిస్టుల వల్ల అయ్యేదికాదు. అయితే నాటి చెన్నమనేని నుంచి నేటి రవీంద్రకుమార్ నాయక్ దాకా ఎందుకు ఈ దిగజారుడు అన్నదే ప్రశ్న. తెలంగాణలో మరో జట్టు అధికారపక్షంలో చేరిపోవడానికి సిద్ధమైంది. నల్లగొండ జిల్లా నుంచి ఒక ఎంపీ; కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఈరోజు టీఆర్ఎస్లో చేరుతున్నారు. అందరూ ఒకేసారి కాకుండా అప్పుడు కొందరు ఇప్పుడు కొందరు అధికార పార్టీలోకి వలసపోతే మీడియాకు కూడా వార్తలు ఉంటాయని కాబోలు కొంత కొంత విరామం ఇచ్చి వెళుతున్నారు. ఎమ్మెల్యేలు పోయినా, ఎంపీలు పోయినా, మాజీలు పోయినా పలుకుతున్నది రెండు పలుకులే. మొదటిది, నియోజకవర్గాల అభివృద్ధి! రెండవది, తమని గెలిపించిన ప్రజలలో మెజారిటీ కోరుకుంటు న్నారు కాబట్టి! ఇట్లా గోడ దూకినవారు ఒక సంవత్సరం తరువాతో, రెండే ళ్లకో మేం అధికారపక్షానికి వలసరావడం వల్ల మా నియోజకవర్గాలకు ఇంత మొత్తం లాభం జరిగింది అనే లెక్కలు ఏమైనా చెబుతారా అంటే, అలాంటి దేమీ ఉండదు. పోనీ, ప్రజలు కోరుతున్నారని మీరే చెబుతున్నారు కదా, చట్టసభల సభ్యత్వానికి రాజీనామా చేసి కొత్త పార్టీ తరఫున ప్రజల మెప్పు పొంది రండి అంటే, అదీ చేతకాదు. తెలుగు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాక ప్రతిపక్ష సభ్యులను అధికారపక్షం తనవైపు లాక్కోవడం తెలంగాణ తోనే మొదలైనా, నిజానికి ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడుకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన తొలిసారి ముఖ్యమంత్రి కావడానికి పునాదే ఫిరాయింపు రాజకీయాలు. ఆ విషయం దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సహా, ఆయన కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు, నందమూరి హరికృష్ణకు, వలస పక్షులని వైస్రాయ్ గూట్లో వదిలిపెట్టిన కొందరు మీడియా పెద్దలకు బాగా తెలుసు. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఈ విద్య అక్కడే నేర్చుకున్నారు. ఇది ఆయన కొత్తగా చేస్తున్న ప్రయోగం కాదు. అయితే, ఇదేదో ప్రపంచంలోనే మొదటిసారి జరిగినట్టూ, తెలంగాణ రాష్ర్ట సమితే మొదటిసారిగా ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టినట్టూ చంద్రబాబునాయుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి ఆక్రోశిం చడం హాస్యాస్పదం. ఆంధ్రప్రదేశ్‌లో తన అపూర్వ సహోదరుడు చంద్రబాబు చేస్తున్న నిర్వాకం చూస్తూ పెదవి విప్పే సాహసం చెయ్యని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అక్కడెక్కడో ఉత్తరాఖండ్‌లో వలసపోయిన ఎమ్మెల్యే లను తలుచుకుని రాజకీయాలు భ్రష్టుపట్టాయని ఆవేదన చెందుతుంటారు. అందరిదీ గురవింద న్యాయమే ప్రజాస్వామ్య స్ఫూర్తిని బుగ్గిపాలు చేసే విధంగా సాగుతున్న ఈ అత్యంత నీతి మాలిన, ఏహ్యమైన కార్యక్రమం తెలంగాణ రాష్ర్ట సమితితోనే మొదలు కాలేదు, ఇక్కడితో ఆగిపోయేదీ కాదు. 1995 నుంచి మొదలు పెట్టి ఇప్పటి దాకా ఇటువంటి దుర్మార్గాలు అనేకం చేసి, తెలంగాణ లో తమ పార్టీ వారిని లాక్కుని టీఆర్ఎస్ నీతి తప్పిందని రంకెలు వేసి ఆరునెలలు తిరక్కుండానే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎడా పెడా కోట్లు గుమ్మరించి కొనుగోలు చేసిన చంద్రబాబునాయుడు, వలస కార్యక్రమంలో తానే పాత్ర దారి కూడా అయిన జానారెడ్డి ఇప్పుడు సుఖేందర్‌రెడ్డి, భాస్కరరావు ఇంకో ఎల్లయ్య మల్లయ్య వలస పోతున్నారని వాపోవడం విచిత్రం. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రస్తుత తెలంగాణ సీఎల్పీ నాయకుడు కుందూరు జానారెడ్డి నిఖార్సయిన కాంగ్రెస్ నాయకుడా? కాదుకదా! తెలుగుదేశం ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పలు మంత్రిత్వశాఖలను నిర్వహించిన నాయకుడు. ఆ విషయం ఆయనే సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూ ఉంటారు. ఎన్టీఆర్ అంత పెద్ద పీట వేస్తే, 1989లో కేఈ కృష్ణమూర్తి, వసంత నాగేశ్వరరావులతో కలసి ఎందుకు తెలుగుదేశాన్ని విడిచిపెట్టిన ట్టు? అప్పట్లో ఈ ముగ్గురూ తెలుగుదేశంలో చంద్రబాబు వర్గం. దగ్గుబాటి వర్గానికి వ్యతిరేకులు. పార్టీ ఫిరాయింపుల సమయాలలో తేడాలు ఉండవచ్చు కానీ, అన్నీ ఆ తాను ముక్కలే. ఆ గూటి పక్షులే. 2015, ఏప్రిల్ 30న ఢిల్లీ విమానంలో పక్కన కూర్చున్న ఒక పెద్దమనిషి నన్ను గుర్తుపట్టి పలకరించారు. ఆయన నల్లగొండ జిల్లా వాస్తవ్యులు, మదర్ డైరీ అధ్యక్షులు. నల్లగొండ పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డికి స్వయానా సోదరుడు. ఢిల్లీ వరకు రెండుగంటల ప్రయాణంలో చాలా రాజకీయాలు మాట్లాడుకున్నాం. పాడి పరిశ్రమకు సంబంధించిన సమస్యలు చాలా చెప్పారాయన. నిజానికి అటువంటి ఓ పని మీదే ఢిల్లీ బయలుదేరారు కూడా. తెలంగాణ కొత్త రాష్ర్టం, చాలా ఉత్సాహంగా ముందుకు దూసుకు వెళుతున్న ప్రభుత్వం కదా, మీ సమస్యలు చెప్పుకోకపోయారా అంటే ఆయన చెప్పిన సమాధానం.. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డిని ఎన్నిమార్లు కలిసినా ఒకే పాట పాడుతున్నారు- ‘ముందు అందరూ మా పార్టీలో చేరండి, అప్పుడు చూద్దాం!’ అని. ‘చూస్తూ చూస్తూ టీఆర్ఎస్లో ఎలా చేరడం? మా అన్నగారు కాంగ్రెస్ నాయకులు, ఎంపీ కూడా. ఆయన ప్రతిష్ట దెబ్బతినదా?’ అన్నారాయన. నేను నవ్వి ఊరుకున్నానో, బయటికే అన్నానో గుర్తు లేదు కానీ, సుఖేందర్‌రెడ్డి ఏమన్నా అసలు సిసలు కాంగ్రెస్ నాయకుడా? అని. అంతకుముందు ఆయన రాజకీయాలు ఏమైనా, రాజకీయాలలో ఎవరి శాశ్వత శిష్యుడైనా తెలుగుదేశం వీడి కాంగ్రెస్‌లో చేరి ఎంపీ అయ్యాడన్న విషయం అందరికీ తెలుసు. తెలుగుదేశాన్ని వీడి రాగలిగిన నాయకుడు కాంగ్రెస్‌ను వీడి ప్రస్తుత అధికారపక్షంలోకి వెళ్ళడనీ, అక్కడ లేని విలువలు ఇక్కడికొచ్చాక హఠాత్తుగా పుట్టుకొస్తాయనీ కాంగ్రెస్ పెద్దలు ఎందుకు అనుకుంటున్నారో? ఆ ఢిల్లీ విమానంలో కలిసిన పెద్దాయన నేను అటు నుంచి పాకిస్తాన్ వెళ్లి, వారం పదిరోజులలో తిరిగి వచ్చేసరికే అధికార పక్షం తీర్థం పుచ్చేసుకున్నారు. అది ఆయన వ్యాపార అవసరం కావచ్చు. సరిగ్గా ఒక సంవత్సరం తరువాత ఆయన సోదరుడు సుఖేందర్‌రెడ్డి కూడా తమ్ముడి బాట పట్టారు. సిద్ధాంతమూ లేదు, విశ్వాసమూ లేదు తాజాగా సుఖేందర్‌రెడ్డి, భాస్కరరావు టీఆర్ఎస్లో చేరడంతో కాంగ్రెస్ బలం నల్లగొండ జిల్లాలో నాలుగుకు పడిపోయింది. అందులో కోదాడ శాసన సభ్యురాలు మినహా మిగిలిన ముగ్గురూ కాంగ్రెస్‌లో పెద్ద నాయకులు. ముగ్గురిలో ఒకరు సాక్షాత్తూ తెలంగాణ పీసీసీ అధ్యక్షులు, ఇంకొకరు శాసనసభా పక్ష నాయకులు, మూడో ఆయన శాసనసభా పక్ష ఉప నాయకుడు. కాంగ్రెస్ నుంచి అధికారపక్షానికి వలస పోయిన ఎంపీ సుఖేం దర్‌రెడ్డి సహా వీరంతా రాజకీయాలలో బలమైన ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లా రాజకీయాలను అత్యంత ప్రభా వితం చేసిన సామాజిక వర్గం. దక్షిణ తెలంగాణలో అధికారపక్షం రాజ కీయంగా బలహీనంగా ఉన్నదన్న అభిప్రాయాన్ని ఈ జట్టును చేర్చుకోవడం ద్వారా చంద్రశేఖరరావు పటాపంచలు చేశారు. కాంగ్రెస్‌లోకి ఎవరైనా, ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడైనా పోవచ్చు. ఇది దేశవ్యాప్తంగా ఎన్నోసార్లు రుజువైంది. బ్రహ్మానందరెడ్డి, చెన్నారెడ్డి, విజయ భాస్కరరెడ్డి- ఇట్లా అనేక మందిని ఉదాహరించవచ్చు. మాజీ ఎంపీ గడ్డం వివేక్, మాజీమంత్రి వినోద్ సోదరులూ అదే కోవకు చెందుతారు. ఒకసారి కేశవరావుతో కలసి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి దూకి, తిరిగొచ్చినా తమకు టికెట్లు ఇచ్చారన్న విశ్వాసం కాంగ్రెస్ పార్టీ పట్ల, సోనియాగాంధీ పట్ల వీరికి ఎందుకు ఉండాలి, అవతల బంగారు భవిష్యత్తు కళ్ల ముందు ఉంటె! విభజన పుణ్యమా అని అవతల ఆంధ్రప్రదేశ్‌లో అడ్రస్సే లేకుండా పోయిన కాంగ్రెస్, తెలంగాణ ఇచ్చి కూడా ఇక్కడ డీలా పడిపోవడానికీ, వలసలు ఆపలేకపోడానికీ ఎవరు బాధ్యత వహించాలి? అది కాంగ్రెస్‌లో సోషల్ఇంజనీరింగ్ పేరిట గందరగోళం చేస్తున్న కాంగ్రెస్ మేధావులు చెప్పాలి. లేదా వాస్తవ పరిస్థితులు తెలియకుండా పెత్తనాలు చేసే పరిశీల కులు చెప్పాలి. ఏదేమైనా కాంగ్రెస్ ప్రస్తుతానికి తెలంగాణ మీద ఆశలు వదిలేసినట్టే! కమ్యూనిస్టుల మూలాలు కదులుతున్నాయి ఇక్కడ కమ్యూనిస్టులను గురించి కూడా మాట్లాడుకోవాలి. బీజేపీ మినహా ఈ దేశంలో దాదాపు అన్ని పార్టీలు కచ్చితమైన సిద్ధాంతం మీద పనిచెయ్యవు. కమ్యూనిస్టులు దానికి మినహాయింపు. కమ్యూనిస్టులు సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవారు. ఒకప్పుడు తెలంగాణలో, ముఖ్యంగా నల్లగొండ, ఖమ్మం జిల్లాలలో మంచి పట్టు కలిగి ఉండేవారు. చివరికి రెండు జిల్లాలలో చెరొక్క స్థానానికి పరిమితయ్యాయి సీపీఐ, సీపీఎం. ఎన్నికల ఖర్చు కోట్లకు చేరుకున్నాక చట్టసభలకు పోటీ పడటం కమ్యూనిస్టు పార్టీల వల్ల అయ్యే పనికాదు. అయితే నాటి చెన్నమనేని రాజేశ్వరరావు నుంచి నేటి రవీంద్ర కుమార్ నాయక్ దాకా ఎందుకు ఈ దిగజారుడు అన్నది సమీక్షించు కోవాలి. నల్లగొండ జిల్లా దేవరకొండ గిరిజన నియోజకవర్గం నుంచి కమ్యూ నిస్ట్ పార్టీ అభ్యర్థిగా గెలిచినా, అధికారపక్షానికి వలస పోవడానికి రవీంద్ర కుమార్ కూడా నియోజకవర్గ అభివృద్ధినే సాకుగా చూపుతున్నారు. చెన్నమ నేని రాజేశ్వరరావు వంటి యోధానుయోధుడైనకమ్యూనిస్టు నాయకుడిని పుత్ర ప్రేమ అధికారపక్షం వైపు లాగగా లేనిది, పుట్టుక నుంచి కమ్యూనిస్ట్ ఉద్య మంలో భాగం అయిన అజయ్‌కుమార్ కాంగ్రెస్‌కు అక్కడి నుంచి అధికార పక్షం టీఆర్ఎస్కు వలస పోతే ఆయన తండ్రి, మరో కమ్యూనిస్ట్ దిగ్గజం పువ్వాడ నాగేశ్వరరావు పుత్రపేమ దానిని అనుమతించగా లేనిది.. గిరిజన యువకుడు రవీంద్రకుమార్ నాయక్ వలసపోతే నిందించి ఏం లాభం? - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
వసతులు వారికి-వెతలు వీరికి!
- డేట్లైన్ హైదరాబాద్ ‘నేను త్యాగం చేయలేదా? బస్సులో పడుకుంటున్నాను’ అని చంద్రబాబునాయుడు పదే పదే చెబుతుంటారు. ఉద్యోగులు నేరుగా ఆయనకే రాసిన ఒక లేఖలో, ‘పది కోట్లు ఖరీదు చేసే అటువంటి బెంజ్ బస్సు మాకూ ఏర్పాటు చేయండి, దివ్యంగా వచ్చి పనిచేస్తాం, సంసారాలు కూడా అందులోనే చేస్తాం’ అని తెలిపారు. కుటుంబాలను వదిలేసి వచ్చి కొత్త రాష్ర్టం కోసం త్యాగాలు చేయాలని, అద్దెలు తగ్గించి మీరూ త్యాగాలు చేయండి అని విజయవాడ, గుంటూరు పట్టణాల ఇళ్ల యజమానులను కోరతారు ముఖ్యమంత్రి. రాష్ర్టం విడిపోయాక ఆంధ్రప్రదేశ్‌కు మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన నారా చంద్రబాబునాయుడును అభినందించడానికి సచివాలయ ఆంధ్ర ప్రాంత ఉద్యోగుల సంఘం ఒక సమావేశం ఏర్పాటు చేసింది. రాష్ర్టం విడిపోయింది కాబట్టి వీలైనంత తొందరగా మన కొత్త రాజధాని ప్రాంతానికి వెళ్లి, కష్ట నష్టాలకు ఓర్చి అయినా పనిచెయ్యడానికి సిద్ధపడదామంటూ ఆ సంద ర్భంలో ఉద్యోగ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ‘చెట్ల కింద పనిచేయడాని కైనా మేం సిద్ధం’ అని ముఖ్యమంత్రికి భరోసా ఇచ్చారు. అప్పుడు ముఖ్య మంత్రి, ‘తమ్ముళ్లూ! ఆవేశపడొద్దు. మనకు తొందరలేదు. హైదరాబాద్ నుంచి పాలనా వ్యవహారాలు కొనసాగించడానికి విభజన చట్టం పదేళ్ల వెసులుబాటు కల్పించింది. కాబట్టి అన్ని సౌకర్యాలు సమకూర్చుకుని, సావ కాశంగా వెళదాం!’ అని ప్రకటించారు. నిజమే, పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చట్టం చెబుతున్నది. అది ఈ రోజుకు కూడా వర్తిస్తుంది. కానీ, రెండేళ్లు గడవగానే ముఖ్యమంత్రి స్వయంగా చేసిన ప్రకటన తారుమారై హైదరాబాద్ నుంచి శాశ్వతంగా బిచాణా ఎత్తేయా ల్సిందేనని ఉద్యోగుల మీద ఒత్తిడి తెచ్చే పరిస్థితి ఎందుకు ఏర్పడింది? వెళ్లక తప్పదు అయినా... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, కొత్త రాష్ర్టం ఏర్పడింది. కాబట్టి ఏనాటికైనా ఉద్యోగులూ, అధికారులూ, మంత్రివర్గం అందరు కొత్తగా ఏర్పడే రాజధానికి తరలిపోవాల్సిందే. మరి, చెట్లకిందయినా పనిచెయ్యడానికి సిద్ధ పడ్డ ఉద్యోగులు, ఇప్పుడే వెళ్లడానికి ఎందుకు నిరాకరిస్తున్నారు? తొందరేం లేదన్న ప్రభుత్వం, ముఖ్యమంత్రి రెండేళ్లు గడవక ముందే తాత్కాలిక రాజధానికి రావాల్సిందేనని ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు? ముఖ్యమంత్రి తన అభినందన సభలో చేసిన వ్యాఖ్యల మేరకు అప్పుడు ఊపిరి పీల్చుకున్న ఉద్యోగులు ఇప్పుడు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రజల ముంగిట్లో పరిపాలన ఉండడం న్యాయమే. ఉద్యోగులూ, అధికారులూ రాష్ట్రానికి దూరంగా ఎక్కడో హైదరాబాద్‌లో కూర్చుంటే తమ అవసరాల కోసం ప్రజలు సచివాలయాన్ని వెతుక్కుంటూ ఏ శ్రీకాకుళం నుంచో, అనంతపురం నుంచో, నెల్లూరు నుంచో రావాల్సిన అగత్యం ఉండకూడదు. రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం నడి మధ్యనే ఉండాలి, అక్కడి నుంచే పరిపాలన సాగాలి. అయితే దానికి అవసరమైన వాతావరణం, సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. రెండురోజుల క్రితం ముఖ్యమంత్రి మాట్లాడుతూ జూన్ 27 నాటికి ఉద్యోగులంతా తరలి రావాల్సిందేనని చెబుతూ, ‘ఇంకా ఏం సౌకర్యాలు కావాలి? టాయిలెట్స్ ఉన్నాయి, క్యాంటీన్ ఉంది, కంప్యూటర్స్ ఉన్నాయి. పని చేసుకోడానికి ఇంకా ఏం కావాలి?’ అని విసుక్కున్నారు. ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్‌లో స్థిరపడి పోయి, సర్వీస్‌లో ఆదా చేసుకున్న డబ్బుతో చిన్నదో పెద్దదో ఇల్లు కట్టుకుని, పిల్లల్ని చదివించుకుంటూ కుదురుగా కాలం వెళ్లబుచ్చుతున్న ఉద్యోగులను ఉన్నఫళంగా టాయిలెట్లూ, క్యాంటీన్లూ చూపించి తరలి రమ్మంటే ప్రభుత్వం ఎంత యాంత్రికంగా ఆలోచిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. మాన సికంగా ఒక బంధం ఏర్పడి ఉంటుంది, అది తెంచుకుని వెళ్లాలి. తప్పదు, కాబట్టి సిద్ధపడతారు. కానీ అటువంటి వారిని ఒకరినో ఇద్దరినో కాదు, వందలూ వేల సంఖ్యలో తరలిస్తున్నప్పుడు ప్రభుత్వం ఎంతగా మానవీయ కోణం నుంచి సమస్యను చూడాలి? సచివాలయ ఉద్యోగులూ, వివిధ శాఖల ఉద్యోగులూ నూతన రాజధానికి వెళ్లబోమని ఎప్పుడూ అనలేదు. ఒకటికి పదిసార్లు ముఖ్యమంత్రికీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికీ తాము వెంటనే తరలి వెళ్లమంటే ఎదురయ్యే ఇబ్బందులను గురించి విన్నవించుకున్నారు. అయినా ఎట్టి పరిస్థితులలో జూన్ 27కు వెళ్లాల్సిందే అన్నది ఈ పూటకు కచ్చితంగా చెబుతున్న మాట. రాజధాని ఇక్కట్లు నాడూ-నేడూ ‘‘ఉమ్మడి మద్రాస్ రాష్ర్టం నుంచి విడిపోయి కర్నూలును రాజధానిని చేసుకున్ననాడూ, అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిని హైదరాబాద్‌కు తరలించిననాడూ ఉద్యోగులు, అధికార యంత్రాంగం ఆ నగరాలకు తరలి వెళ్లడానికి పెద్దగా బాధపడలేదు. కర్నూలులో ఏ సౌకర్యాలూ లేకపోయినా గుడారాలలో కూడా పనిచేశారు. హైదరాబాద్‌కు తరలివచ్చినప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లో తెలంగాణ విలీనాన్ని ఇష్టపడని ఆనాటి హైదరాబాదీలు నిర సించినా, ఛీత్కరించినా బాధ పడలేదు, పనిచేశాం!’’ అని కర్నూలు నుంచి జీప్‌లో టైప్రైటర్లు పెట్టుకుని హైదరాబాద్ వచ్చి ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభించిన తొలి బృందంలోని ఒక రిటైర్డ్ అధికారి అఖ్తర్ హుస్సేన్ చెబుతూ ఉంటారు. ఉద్యోగులు కొత్త రాజధానికి తరలి వెళ్లాల్సి రావడం ఇది మూడోసారి. కానీ ఇవాళ్టి పరిస్థితి మొదటి రెండుసార్లు ఎదురైనటు వంటిది కాదు. దీర్ఘకాల పోరాటం ఫలించి తెలంగాణ ఏర్పడింది. ఆంధ్ర ప్రాంతం వారు బలవంతంగానే అయినా విడిపోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఉద్యో గులు రాష్ర్ట విభజనను వ్యతిరేకించారు. అటువంటి ఉద్యోగులను తరలి స్తున్నప్పుడు ప్రభుత్వం వాళ్ల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్త వహిం చాలి తప్ప, ‘వస్తారా చస్తారా’ అన్న పద్ధతిలో వ్యవహరించడం అన్యాయం. ‘నేను త్యాగం చేయలేదా? బస్సులో పడుకుంటున్నాను’ అని చంద్ర బాబునాయుడు పదే పదే చెబుతుంటారు. ఉద్యోగులు నేరుగా ఆయనకే రాసిన ఒక లేఖలో, ‘పది కోట్లు ఖరీదు చేసే అటువంటి బెంజ్ బస్సు మాకూ ఏర్పాటు చేయండి, దివ్యంగా వచ్చి పనిచేస్తాం, సంసారాలు కూడా అందు లోనే చేస్తాం’ అని తెలిపారు. కుటుంబాలను వదిలేసి వచ్చి కొత్త రాష్ర్టం కోసం త్యాగాలు చేయాలని ఉద్యోగులకు ఉద్బోధిస్తారు ముఖ్యమంత్రి. అద్దెలు తగ్గించి ఉద్యోగులకు ఇళ్లు ఇచ్చి మీరూ త్యాగాలు చేయండి అని విజయవాడ, గుంటూరు పట్టణాల ఇళ్ల యజమానులను కోరతారు ముఖ్య మంత్రి. తమ సామాజికవర్గం వారో, బంధువులో, మిత్రుల విష యానికో వచ్చేసరికి మాత్రం రాజధాని చుట్టూ భూముల బాగోతం గురించి ప్రశ్నిస్తే మా వాళ్లు వ్యాపారాలు చేసుకోవద్దా అని ఆగ్రహం ప్రదర్శిస్తారు. మరి విజయవాడ, గుంటూరు పట్టణాలలో ఇంటి యజమానులు మాత్రం డబ్బు సంపాదించుకోవద్దా? ఉద్యోగులు కొత్త చోటికి వెళుతున్నప్పుడు అద నపు ఆదాయాన్ని ఆశించడం తప్పా? ఖరీదైన బస్సులో బస చేసి, ప్రత్యేక విమానాలలో ప్రయాణించి, తాత్కాలిక కార్యాలయాలకు వందల కోట్లు ఖర్చు చేసే ముఖ్యమంత్రి ఉద్యోగుల విషయంలో నీతులు వల్లిస్తున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయంలో మార్పు ఎందుకు? పదేళ్లపాటు హైదరాబాద్ నుంచి పరిపాలన సాగించే వీలు ఉండి కూడా హడావుడిగా విజయవాడకు 20 కిలోమీటర్లు, గుంటూరుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెలగపూడి గ్రామంలో నిర్మిస్తున్న రెండు అంతస్తుల తాత్కాలిక భవంతికి వచ్చి పనిచేయవలసిందేనని ఉద్యోగులను ఎందుకు శాసిస్తున్నారు? ఓటుకు కోట్లు వ్యవహారంలో శృంగభంగమయ్యాక ముఖ్య మంత్రిలో ఈ మార్పు వచ్చిందనేది బహిరంగ రహస్యం. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల పోలింగ్ కూడా హైదరాబాద్ ఉమ్మడి శాసనసభా ప్రాంగణంలో కాకుండా విజయవాడకు మార్చాలని ఎన్నికల సంఘానికి విన్నవించుకుని కాదనిపించుకోవడం కూడా అధికార పక్షం దురుద్దేశానికి నిదర్శనమనే విమర్శ వచ్చింది. రాజధానిలో ప్రభుత్వ భవన సముదాయాల నిర్మాణం కోసం కేంద్రం ఇప్పటికే ఒక వెయ్యీ 50 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. రాష్ర్ట ప్రభుత్వం ఆ డబ్బు వెలగపూడిలో తాత్కాలిక భవనాల నిర్మాణానికి ఖర్చు చేసింది. మరి శాశ్వత రాజధానికి మళ్లీ నిధులు ఎట్లా? పైగా కొండవీటి వాగు పొంగితే ఈ తాత్కాలిక సచివాలయ సముదాయం రెండు అంతస్తుల భవంతి మునిగిపోతుందని వెలగపూడి గ్రామం చుట్టుపక్కల గోచీ పెట్టుకుని గోళీలు ఆడుకుంటున్న చిన్నపిల్లలు కూడా చెబుతున్నారు. ఏదో విధంగా ఉద్యో గులను తరలించాల్సిందే అన్న పట్టుదల తప్ప ప్రభుత్వానికి ఇవేం పట్టవా? హైదరాబాద్‌లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధీనంలో ఉన్న సచి వాలయ భాగాలను తెలంగాణ సర్కార్‌కు అప్పగించవలసిందిగా అధికారు లను ఆదేశించినట్టు కూడా తెలుస్తున్నది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణం ఇంకా మొదలే కాలేదు. తాత్కాలిక సచివాలయ నిర్మాణం కూడా ఒక కొలిక్కి రాలేదు. అక్కడికి వెళ్లి పనిచెయ్యడానికి ఇంకా ఉద్యోగులు మానసికంగా సిద్ధం కాలేదు. పరిష్కరించాల్సిన సమస్యలు బోలెడు ఉన్నాయి. నేను త్యాగాలు చేస్తున్నాను అని తన మీద తానే జాలి పడటం(సెల్ఫ్పిటీ) మానేసి, ముఖ్యమంత్రి వ్యవహర్త లాగా ఆలోచిస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. రాష్ట్రానికి మంచి జరుగుతుంది. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
బహుముఖ ప్రజ్ఞకు ప్రతీక అమర్ ‘డేట్లైన్’!
జర్నలిజం అనేది ఒక ‘ఆర్గనైజ్డ్ గాసిప్’ అంటాడు అమెరికాకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు-నవలా రచయిత ఎడ్వర్డ్ ఎగెల్స్టన్. ప్రజాస్వామ్య సౌథం లోని నాలుగు వ్యవస్థలను ‘వరల్డ్‌వైడ్ క్యాపిటలిస్ట్ సొసైటీ’ నడిపిస్తున్న నేపథ్యంలో పండితులలోనే కాదు పామర జనంలోనూ జర్నలిజం పట్ల, జర్నలి స్టుల పట్ల చులకనభావం పెరుగుతోంది. నిజానికి జర్నలిజం అర్ధం, పరమార్ధం మారిపోయి చాలా కాలమయ్యింది. ఎన్నో ఆంక్షలు, పరిమితుల మధ్య పెనుగులాడుతున్న పరిస్థితి. కార్యక్షేత్రంలో కనిపించని శత్రువుతో యుద్ధం చేయక తప్పనిస్థితి. ఎలాంటి కఠిన సమయాలలోనైనా నమ్మిన భావ జాలాన్ని-విలువలను విడనాడకుండా వృత్తిలో రాణిస్తూ సమాజం పట్ల నిబద్ధతను చాటుకుంటున్న జర్నలిస్టులను వేళ్లపై లెక్కించవచ్చు. అలాంటి వారిలో దేవులపల్లి అమర్ ఒకరు. ఆయన జగమె రిగిన జర్నలిస్టు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో విధులు నిర్వర్తిస్తూనే జర్నలిస్టు యూనియన్ జాతీయ బాధ్యతలలోనూ రాణిస్తున్న నేత. ‘ప్రజాతంత్ర’లో అమర్ చేసిన విశ్లేషణలు ‘డేట్లైన్ హైదరాబాద్’ పేరుతో పుస్తకరూపం సంతరించుకోవడం పాత్రికేయ మిత్రులందరికీ సంతోషం కలిగించింది. అది అత్యంత ప్రజాదరణ పొందిన కాలమ్ మాత్రమే కాదు.. నాలుగు దశా బ్దాల అమర్ పాత్రికేయ అనుభవానికి ప్రతీక. ఇది 1998 నుంచి 2004 వరకు ముఖ్యమైన పరిణా మాలపై విశ్లేషణల సమాహారం. ఆంధ్రప్రదేశ్ రాజకీ యాలలో అది అత్యంత కీలకమైన సమయం. తెలంగాణ మలిదశ పోరాటానికి అంకురార్పణ జరి గిందప్పుడే. నక్సలైట్ ఉద్యమ ఉత్థానపతనాలకూ ఆ కాలం అద్దం పడుతుంది. వీటన్నిటితోపాటు 2004లో తెలుగు ప్రజలు మార్పు కోరుకోవడానికి దారి తీసిన పరిణామాల గురించి విపులంగా తెలు సుకోవడానికి ఈ పుస్తకం ఉపకరిస్తుంది. వాస్తవాల విషయంలో ఎలాంటి రాజీ లేకుండా సమకాలీన రాజకీయాలపై సునిశితమైన వ్యాఖ్యలు చేయడం, ఆయనలోని సాహస లక్షణాన్ని కళ్లకు కడు తుంది. ఉన్నతస్థానాలలో ఉన్నవారిని అధిక్షేపించ డానికి ధైర్యం కావాలి. పోలీసుల ఆధిపత్యాన్ని, నక్సల్స్ హింసను ప్రశ్నించడానికి తెగువ కావాలి. అలాంటి ధైర్యం, తెగువ ఈ పుస్తకంలో అడుగడుగునా కనిపిస్తాయి. చంద్రబాబును అపరచాణక్యుడుగా పొగిడి నట్లు అక్కడక్కడా కనిపించినా జ్యోతిబసు, వాజ్ పేయిలకు సలహాలు ఇచ్చానంటూ ఆయన చెప్పు కోవడాన్ని ఎద్దేవా చేయడమూ కనిపిస్తుంది. మన ‘బాలచంద్రుడి’ నుంచి వారేం నేర్చుకుంటారో చూడాలి మరి.. అనడంలోనే వ్యంగ్యం తొంగి చూస్తుంది. సీఎంగారు రాష్ట్రాన్ని సింగప్రదేశ్గానో ఆంధ్రాపూర్ గానో చేయడానికి ప్రయత్నిస్తుంటే ప్రజాసమస్యలు పరిష్కరించాలని ప్రతిపక్షాలు కోరడమేమిటి? అంతతీరిక ఆయనకెక్కడిదంటూ విమర్శలు సంధించడమూ కనిపిస్తుంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద రావు మంత్రిగా ఉండగా ఎంత దూకుడుగా ఉండే వారో తెలుసుకోవాలంటే ‘దీన్ని ప్రజాస్వామ్యం అందామా?’ అనే వ్యాసం చదవాల్సిందే. కోడెల స్వయంగా మందీమార్బలాన్ని వెంటేసుకుని డాక్ట రైన ఓ బీజేపీ నాయకుడి క్లినిక్‌కు వెళ్లి ఆయన్ను చాచి చెంపదెబ్బ కొట్టారట. మంత్రి కాబట్టే, అధికారం తనకు అండగా ఉండబట్టే కదా కోడెల ఈ పని చెయ్యగలిగింది అని అమర్ ప్రశ్నించారు. అనేక సామాజిక అంశాలనూ విశ్లేషించారు. సినిమా వాళ్లనూ వదల్లేదు. దాసరి కొత్త పార్టీ ప్రయత్నాల పైనా, రామ్‌గోపాల్‌వర్మ సినిమాలపైనా, రజనీ కాంత్ అమాయకంగా రెండుకోట్ల రూపాయలు పోగొట్టుకోవడంపైనా అమర్ విశ్లేషణలున్నాయి. రాజకీయాల పట్ల ఆసక్తి, అనురక్తి ఉన్నవారికే కాదు జర్నలిజంలో ఉన్నవారికి, జర్నలిజంలోకి రావాలను కునే వారికి ఈ పుస్తకం రిఫరెన్స్ మెటీరియల్ అందిస్తుందనడంలో ఎలాంటి సందేహమూ అక్కర్లేదు. - పోతుకూరు శ్రీనివాసరావు -
రచనలు అపోహలు కలిగించేలా ఉండొద్దు
* రాష్ట్రాభివృద్ధికి దోహదం చేసేలా జర్నలిస్టుల రచనలు ఉండాలి: సీఎం * తెలంగాణ ఉద్యమానికి విద్యుత్ సమస్యే బీజం వేసింది * అమర్ ‘డేట్లైన్ హైదరాబాద్’ వ్యాసాల సంకలనాన్ని ఆవిష్కరించిన కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: బంగారు తెలంగాణ పురోభివృద్ధికి దోహదం చేసేలా జర్నలిస్టుల రచనలు సాగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. అపోహలు కలిగించే విధంగా రచనలు ఉండకూడదని, అభివృద్ధికి నిర్మాణాత్మకమైన సూచనలు, సలహాలు ఇచ్చే విధంగా ఉండాలన్నారు. కొన్ని వార్తలు బాధ కలిగిస్తున్నాయని, నిజాలు విశ్లేషిస్తే బాగుటుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై వచ్చిన విశ్లేషణలను ప్రస్తావిస్తూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. గురువారం రవీంద్రభారతిలో సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ ‘డేట్లైన్ హైదరాబాద్’ శీర్షికతో రాసిన వ్యాసాల సంకలనాన్ని సీఎం ఆవిష్కరించారు. జర్నలిజంలో 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ప్రజాతంత్ర’ పత్రిక 18వ వార్షికోత్సవ కార్యక్రమంలో అమర్ ఈ సంకలనాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం మాట్లాడుతూ.. అమర్ రాసిన పుస్తకం గొప్పగా ఉందని, తనను విమర్శిస్తూ రాసిన పుస్తకాన్ని తానే ఆవిష్కరించానని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి విద్యుత్ సమస్యే బీజం వేసిందని పేర్కొన్నారు. రైతులకు ఇచ్చే కరెంటు శ్లాబ్ రేటును రూ.18 నుంచి రూ.35కు పెంచటంపై అప్పటి సీఎం చంద్రబాబుకు లేఖ రాశానని, ఇదే ఉద్యమానికి నాంది ప్రస్తావన అయిందన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావానికి ఏడాది ముందు మూడున్నర వేల గంటలపాటు తెలంగాణ ఉద్యమంపై మేధోమథనం జరిపినట్లు సీఎం చెప్పారు. ఈ సందర్భంగా పలు ఛలోక్తులతో అప్పటి కరెంటు సమస్యతోపాటు ట్రాన్స్ఫార్మర్లు పొందటానికి రైతులు పడిన ఇబ్బందులను సీఎం వివరించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రతిరోజూ సీనియర్ పాత్రికేయులతోపాటు 100 నుంచి 150 మంది ప్రముఖలతో చర్చించిన పలు అంశాలను గుర్తుచేశారు. ఉద్యమ కాలంలో ప్రజాతంత్ర పత్రిక రాసిన పలు అంశాలను సీఎం ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ... ‘డేట్లైన్ హైదరాబాద్’ అందరూ చదవదగిన పుస్తకం అన్నారు. సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. పత్రిక, టీవీ, ఉద్యమం, ఆంగ్లంలో జర్నలిస్టుగా అమర్ విజయం సాధించారన్నారు. ప్రజాహితం కోరి అమర్ ముక్కుసూటిగా రచనలు చేశార న్నారు. ఏ వ్యాఖ్య చేసినా ధర్మబద్ధంగా, రాజ్యాంగానికి లోబడి చేయాల్సి ఉంటుందన్నారు. నిజాయితీ గల చరిత్రకారుడుగా చెప్పినట్లుగా అమర్ వ్యాసాలున్నాయని కొనియాడారు. మన తెలంగాణ ఎడిటర్ కె.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ పుస్తకం జర్నలిస్టులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అమర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో 2,500 మంది జర్నలిస్టుల ఇళ్ల కోసం సీఎం 100 ఎకరాలు ఇవ్వడాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రమణాచారి, పలువురు సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు. సభలో ముఖ్య అతిథులకు అమర్, ఆయన సోదరులు ఘనంగా సన్మానించారు. అనంతరం అమర్‌ను హైదరాబాద్‌తోపాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన జర్నలిస్టులు సత్కరించారు. -
అమర్ 'డేట్లైన్ హైదరాబాద్' ఆవిష్కరణ
హైదరాబాద్ : జర్నలిజంలో 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సీనియర్ పాత్రికేయుడు దేవులపల్లి అమర్ రాసిన 'డేట్ లైన్ హైదరాబాద్ ' వ్యాస సంకలనాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గురువారం ఆవిష్కరించారు. రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్, సాక్షి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు, పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాక్షి ఈడీ రామచంద్రమూర్తి మాట్లాడుతూ అమర్ ఎక్కడా రాజీ పడకుండా తన వృత్తిని నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ అమర్ సమాజంలోని వివిధ అంశాలపై నిశిత పరిశీలనతో ఈ వ్యాసాలు రాశాడని అన్నారు. -
దానాల్లో గొప్ప దానం ‘విలువ’
డేట్లైన్ హైదరాబాద్ ప్రస్తుతానికి దానం నాగేందర్ మరొక్కసారి పార్టీ ఫిరాయింపు వ్యవహారం ఆగినట్టే. మాటామంతీ అంతా అయిపోయింది.పోయిన సోమవారమే కాంగ్రెస్‌ను విడిచి తెలం గాణ రాష్ర్ట సమితిలో చేరడమే తరువాయి అనుకుంటుంటే ఆఖరి నిమిషంలో నాగేందర్ మనసు మార్చుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలంలో హైదరాబాద్ బ్రదర్స్‌లో ఒకడిగా ప్రసిద్ధి చెందిన దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి వలస పోతున్నాడంటే పెద్దగా ఎవరూ ఆశ్చర్యపోలేదు. తెలం గాణ రాష్ర్ట సమితి నాయకత్వం ఆయనను పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తున్నది అన్న అంశం కూడా ఎవరినీ ఆశ్చ ర్యపరచలేదు. అంతకు రెండు రోజుల ముందు టీఆర్ఎస్లో చేరిన టీడీపీ శాసనసభ్యుడు సాయన్న విలేకరులతో ఒక మాటన్నారు. టీఆర్ఎస్లో సర్దుకు పోయి పని చేయగలరా వంటి ప్రశ్న ఒకటి అడిగితే, ‘అస్సలు ఇబ్బందే ఉండదు’ అన్నారాయన. అదెలా అంటే, ‘ఏముంది? అంతా తెలిసిన వాళ్లే, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్లే. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కూడా తె లుగుదేశంలో మంత్రిగా ఉన్నారు కదా!’ అన్నారు సాయన్న. ఔను! ముఖ్యమంత్రి సహా పలు వురు మంత్రులు, నాయకులు పూర్వాశ్రమంలో తెలుగు దేశం వారే. అలాంటప్పుడు సాయన్నకు కొత్తగా ఎందు కుంటుంది? పార్టీ కార్యాలయం చిరునామా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి తెలంగాణ భవన్‌కు మారినంత తేలికైన విషయంగా అనిపించింది ఆయనకు. సాయన్న వెంటే టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్సీ ప్రభాకర్‌కు కూడా పెద్దగా ఇబ్బంది ఏమీ అనిపించదు. టీఆర్ఎస్ కార్యాల యం నిండా ఎక్కడ చూసినా కాంగ్రెస్ నాయకులే కనిపించి, ఆయనకు కూడా అది మరో గాంధీభవన్ లాగా కనిపించింది తప్ప, కొత్త చోటికి వచ్చినట్టేమీ లేదు. టీడీపీ నుంచి వచ్చిన వారికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లాగా, కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి గాంధీభవన్ లాగా కనిపించేంతగా ప్రజాస్వామ్యీకరణ చెందిందన్నమాట తెలంగాణ భవన్. ఎవరినైనా ఇముడ్చుకోగల సహనం, ఔదార్యం, విశాల హృదయం తెలంగాణ భవన్‌కు ఉండ డం గొప్ప విషయమే. ఇంకా వస్తారు, రావాలి కూడా. సాధించుకున్న తెలంగాణకు సంపూర్ణత్వం సిద్ధించా లంటే తెలంగాణ భవన్ తప్ప అన్ని పార్టీల కార్యాల యాలకూ తాళాలు పడాలి. అప్పుడుగాని, మనం సాధించుకున్న తెలంగాణ కు అర్థం ఉండదు. రాష్ర్టంలో ఒకే పార్టీ కార్యాలయం ఉండాలి. దాని మీద ఒకే జెండా ఎగరాలి. ఇదే లక్ష్యం. ఈ అడుగులన్నీ దాని సాధన దిశగానే పడుతున్నాయి. జనవరి మాసాంతంలో జరగ బోయే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో టీఆర్ఎస్ విజయం సాధిస్తే తప్ప తెలం గాణ రాష్ర్ట ఏర్పాటు సంపూర్ణం కాదు. తడబడిన అభిమానులు ఇదే లక్ష్యంగా పని చేస్తున్న టీఆర్ఎస్ కండువాలు కప్పు తూనే ఉన్నది. ఇతర పార్టీల నుంచి వచ్చే వారు కప్పిం చుకుంటూనే ఉన్నారు. అదే క్రమంలో దానం నాగేందర్ చేరిక కూడా దాదాపు ఖరారయింది. ఆయనకేవో డిమాండ్లు ఉన్నాయి. అవి కూడా దాదాపుగా ఒప్పు కున్నట్టే కాబట్టి సోమవారం ఆయన కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరతారని అంతా అనుకున్నారు. ఆయన అనుచరులు నగరమంతా దానం చేరికను ఆహ్వానిస్తూ, వెల్లడిస్తూ ఫ్లెక్సీలు కూడా కట్టారు. చివరి నిమిషంలో దానం పార్టీ మార్పిడి రద్దయింది. అనుచరులు యుద్ధ ప్రాతిపదికన ఫ్లెక్సీలను తొలగించేశారు. పార్టీ మారుడు వ్యవహారం ఇంత ఆషామాషీగా ఉంటుందా అని ఆశ్చర్యపోనక్కరలేదు. నాగేందర్ షరతులకు ముఖ్య మంత్రి అంగీకారం లభించలేదు. పైగా తన సమక్షంలో కాకుండా, పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు సమక్షంలో చేరమని కబురు పంపారట ముఖ్యమంత్రి. కేశవరావు సమక్షంలో చేరితే మరీ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్‌లోనే చేరినట్టే ఉంటుందని నాగేందర్, ఆయన అనుచరులూ భావించినట్టున్నారు. కేశవరావు నిన్నటి దాకా కాంగ్రెస్ నాయకుడు. పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అంత వేగంగా మరిచిపోవడం కష్టం కదా! ఆ మాటంటే ఎక్కడ డి. శ్రీనివాస్ సమక్షంలో చేరండి అంటారోనని ఈ పార్టీ మార్పిడి ఆలోచనను ప్రస్తుతానికి మానుకు న్నారట దానం నాగేందర్. కేశవరావు కన్నా తాజా మాజీ పీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్. ఈ మధ్యనే ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే ఒక తెలుగు దేశం బ్యాచ్ ఇంకో కాంగ్రెస్ బ్యాచ్ చేరిపోవడంతో, అసలు టీఆర్ఎస్ బ్యాచ్ తెలంగాణ భవన్లో తమ కెవరు దిక్కు అని దిక్కులు చూస్తున్నదట. మొత్తానికి నాగేందర్ తన పార్టీ మార్పిడి ఆలోచ నను కాసేపు పక్కన పెట్టి గ్రేటర్ హైదరాబాద్ మున్సి పల్ ఎన్నికలకు కాంగ్రెస్‌ను సమాయత్తం చేసే పనిలో పడ్డారు. అయితే ఇది చివరి దాకా నిలిచే నిర్ణయం అని భావించవలసిన పని లేదు. ఏ క్షణాన్నయినా, అర్ధరాత్రి అని కూడా చూడకుండా పార్టీ మారిపోయే, మళ్లీ అదే వేగంతో తిరిగొచ్చే చాకచక్యం దానం నాగేందర్ సొంతం. 2004 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నాగేం దర్‌కు ఆసిఫ్‌నగర్ టికెట్ నిరాకరించింది. అప్పటికి ఆయన సిట్టింగ్ సభ్యుడు. ఆ ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న డి. శ్రీనివాస్ నాగేందర్‌కు టికెట్ రాకుండా అడ్డుకున్నాడని ఆరోపించి నాగేందర్ రాత్రికి రాత్రి రాజకీయ బద్ధ శత్రువు చంద్రబాబునాయుడు ఇంటికి వెళ్లి పసుపుపచ్చ కండువా కప్పుకుని తెలుగు దేశంలో చేరిపోయి టికెట్ తెచ్చుకుని, అదే ఆసిఫ్‌నగర్ నుంచి టీడీపీ ఎమెల్యేగా గెలిచారు. ఎన్నికలలో తెలుగు దేశం ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కొద్ది నెలల్లోనే దానం టీడీపీని వదిలి కాంగ్రెస్ గూటికి చేరారు. శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్లీ అదే నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికలలో పోటీ చేసి ఓడి పోయారు. డాక్టర్ రాజశేఖరరెడ్డి ప్రజాకర్షణ శక్తి కూడా నాగేందర్‌ను గెలిపించలేకపోయింది. ఇప్పుడయితే ఆ సమస్యే లేదు. ఆయన శాసన సభ్యుడు కారు. కానీ 2004లో ఎవరి కారణంగా అయితే తనకు టికెట్ రాలేదో అదే శ్రీనివాస్‌తో టీఆర్ఎస్లో చేరే విషయంలో నాగేందర్ చర్చలు జరిపారని, ఆయనతో టచ్‌లో ఉన్నా రని వార్తలొచ్చాయి. రాజకీయాలు అంటే ఇట్లానే ఉంటాయి మరి. ఇలా ఇంకెందరో! ఇలా పార్టీలు మారుతున్న వారంతా ఘన చరిత్ర కలవారే. కంటోన్మెంట్ సాయన్నను చూడండి! మొన్ననే ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా నియమించారు. అంతకు ముందు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తేనే అన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇవేవీ లెక్కలోకి రావన్నమాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మరో శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్‌కు ఆ పదవి ఇచ్చారని వార్తలు వచ్చాయి. ఆయన కూడా టీఆర్ఎస్లో చేరతారని సాయన్న చేరికకు ముందే ప్రచారం జరిగింది. తన నియోజకవర్గం రాజేందర్‌నగర్ అభివృద్ధికి నిధులిస్తానంటే టీఆర్ఎస్లో చేరడానికి ఎప్పుడయినా సిద్ధమేనని ప్రకాష్ గౌడ్ బహిరంగంగానే చెప్పారు. త్వరలోనే చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి టీటీడీకి మరో సభ్యుడిని వెతుక్కోవలసిరావచ్చు. శాసనమండలికి స్థానిక సంస్థల నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు రాష్ర్ట వ్యాప్తంగా 12 మందిని ఎన్నుకోవలసి ఉన్న తరుణంలో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముంచు కొస్తున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ పార్టీ మార్పి డులను చూస్తే తెలంగాణ లో మరో రాజకీయ పార్టీ మిగులుతుందా లేదా అన్న సందేహం కలగక మానదు. కానీ ఇదంతా ఎక్కువ కాలం కొనసాగే బలం కాదనీ, తాత్కాలిక వాపేనని అందరికీ అర్థమయ్యే రోజు రాక తప్పదు. బలమైన ప్రతిపక్షం ఉంటేనే ప్రభుత్వాలు బాగా పనిచేయగలవనే ప్రజాస్వామ్య సూత్రం ఇప్పుడు అధికార పార్టీ చెవికి ఇంపుగా అనిపించదు. కానీ ఈ మొత్తం వ్యవహారం కప్పల తక్కెడగా మారాక తెలంగాణ రాష్ర్టసమితి తన సహజత్వాన్ని కోల్పోయిందన్న విష యం గుర్తిస్తే మంచిది. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
బాపూ బాటకు గ్రహణం పట్టిందా?
డేట్లైన్ హైదరాబాద్ పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష వల్ల ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నిరాహార దీక్ష పట్ల ప్రభుత్వం అనుసరించిన వైఖరి, చేసిన వ్యాఖ్యలు సత్యాగ్రహానికి కాలం చెల్లిందేమో అనిపించే విధంగా ఉన్నాయి. ప్రత్యేక హోదా కోరుతూ శాసన సభ చేసిన నిర్ణయాన్ని కేంద్రం ముందుంచి అమలు చేయించాల్సిన ముఖ్యమంత్రే ఆ డిమాండ్‌ను అపహాస్యం చేయడాన్ని ఏమనాలి? ప్రతిపక్ష నేత నిరాహార దీక్షను భగ్నం చేశారు సరే, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రత్యేక హోదా కోసం బలంగా పెరుగుతున్న కోర్కెను ఏం చేస్తారు? రాష్ట్ర విభజన సమయంలో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు రెండూ అంగీకరించిన విధంగానే, విభజనానంతర ఆంధ్రప్రదేశ్ శాసనసభ, రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అదే డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల ఏడవ తేదీన ప్రారంభించిన నిరవధిక నిరాహార దీక్షను ఆరు రోజుల తరవాత మంగళ వారం తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేశారు. ఆందోళనకరంగా మారిన ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా డాక్టర్ల సూచన మేరకు జగన్మోహన్రెడ్డిని ఆసుపత్రిలో చేర్పించామని పోలీసులు చెప్పారు. గత రెండేళ్ల కాలంలో జగన్మోహన్రెడ్డి నిరవధిక దీక్షను చేపట్టడం ఇది మూడవసారి. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య నినాదంతో ఒకసారి జైల్లో, మరోసారి హైదరాబాద్‌లోని తన ఇంటి వద్ద ఆయన దీక్షలు జరిపారు. రాష్ట్రం విడిపోయాక ఆయన ఇప్పుడు మళ్లీ నిరవధిక నిరాహార దీక్షకు దిగాల్సి వచ్చింది. ‘ఆంధ్ర రాష్ట్రం’లోనే దీక్షపై అపహాస్యాలా? నిరాహార దీక్ష, ప్రజాస్వామ్యంలో సత్యాగ్రహాన్ని, ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే బలమైన ఆయుధం. స్వాతంత్య్ర పోరాట కాలంలో మహాత్ముడు పలుమార్లు భిన్న కారణాలతో నిరాహార దీక్షలు చేశాడు. ప్రజల ప్రబలమైన ఆకాంక్షను నెరవేర్చాలని పాలకుల మీద ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమాలు ఎంచుకునే శాంతియుత పోరాట రూపం నిరాహారదీక్ష. దాదాపు ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో ఎన్నో వందల, వేల మంది నేతలు, కార్యకర్తలు వివిధ కారణాలతో ఈవిధ మైన నిరసనను ప్రదర్శించారు. కొన్ని సందర్భాల్లో సత్యాగ్రహానికి తలొగ్గి ప్రభుత్వాలు సమస్యలను పరిష్కరించడం, కొన్ని సందర్భాల్లో ఈ రకం ఉద్యమాలు విఫలం కావడమూ కూడా మనకు తెలుసు. పొట్టి శ్రీరాములు నిరాహారదీక్ష ఫలితంగానే మద్రాస్ నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. నిరాహార దీక్ష ద్వారా రాష్ట్రాన్ని సాధించుకున్న సీమాంధ్రలోనే నిన్నటి దాకా సాగిన జగన్మోహన్రెడ్డి నిరాహార దీక్ష పట్ల ప్రభుత్వం, పాలక పార్టీ పెద్దలు అనుసరించిన వైఖరి, చేసిన వ్యాఖ్యలు సత్యాగ్రహానికి కాలం చెల్లిందేమో అనిపించే విధంగా ఉన్నాయి. అంతే కాదు నేటి పాలకుల వెకిలితనాన్ని కూడా బయట పెట్టాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ఆ రాష్ట్రంలో ఒక ఉద్యమం సాగుతున్నది. ప్రతిపక్ష రాజకీయ పార్టీలన్నీ తమ తమ పద్ధతుల్లో అదే డిమాండుతో ఆందోళన చేస్తున్నాయి. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్రెడ్డి అన్ని మార్గాలూ అన్వేషించి, అన్ని దారులూ నడచి, చివరి అస్త్రంగా ఈ నిరాహార దీక్షను ఎంచుకున్నారు. అది కూడా అధికార, ప్రతిపక్ష పార్టీలన్నిటికీ ఏకాభిప్రాయం ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వాలనే కోరిక మీదనే చేపట్టిన దీక్ష. గత నెల జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో సభ్యులంతా చర్చించిన మీదట రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ ఒక ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులతో పాటూ, బీజేపీ, తెలుగుదేశం పార్టీల సభ్యులు కూడా ఆ తీర్మానాన్నిఆమోదించారు. చట్టసభ తీర్మానానికి విలువే లేదా? శాసనాలు చేసే చట్ట సభ తీసుకున్న నిర్ణయానికి ఉండే విలువ ప్రాముఖ్యత ఒక్క అధికార పక్షానికి, దాని మిత్ర పక్షంగా ఉన్న బీజేపీకి తప్ప అందరికీ తెలుసు. శాసన సభ నిర్ణయాన్ని కేంద్రం ముందుంచి, ఇది మా రాష్ర్ట ప్రజల నిర్ణయం దీన్ని అమలు చెయ్యండని పట్టుబట్టాల్సింది సభా నాయకుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. కానీ ఆయనే శాసనసభ తీర్మానించాక కూడా ప్రత్యేక హోదాను చులకన చేస్తూ మాట్లాడారు. అయనతోబాటు ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్‌కు పేటెంట్ తనదేనని చెప్పుకునే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పలుమార్లు ఈ అంశాన్ని ‘జిందా తిలిస్మాత్’, ‘అమృతాంజనం’ అంటూ హేళన చేయడం అంతా చూశారు. అటు శాసన సభలో తీర్మానం చేసి దానికి భిన్నంగా బయట ఎట్లా మాట్లాడతారో చంద్ర బాబే చెప్పాలి. ప్రతిపక్షంలో ఉండగా కొట్లాడి, ఒప్పించి తెచ్చుకున్న ప్రత్యేక హోదాను అధికారంలోకి వచ్చాక ఎందుకు ఇవ్వలేకపోతున్నారో స్పష్టం చెయ్యాల్సింది బీజేపీ పెద్దలే. పదేళ్లు చాలదు పదిహేనేళ్ల కావాలన్న తామే ప్రత్యేక హోదా కోసం ఎందుకు పట్ట్టుబట్టడం లేదో చెప్పాల్సింది చంద్రబాబే. ప్యాకేజీల గుట్టు ఎవరికి తెలియనిది? కావాల్సినన్ని నిధులు ప్యాకేజీల ద్వారా వస్తుంటే ఇంకా ప్రత్యేక హోదా రాద్ధాంతం దేనికని అధికార పక్షం, దానికి గుడ్డిగా వంత పాడుతున్న మీడియాలోని ఒక వర్గం వాదన. చట్టబద్ధంగా ప్రత్యేక హోదా ఇవ్వడానికి, తమ చిత్తం వచ్చిన రీతిలో ప్యాకేజీల పేరిట నిధులు ఇవ్వడానికి మధ్య ఎంత తేడా ఉందో కొందరు బీజేపీ నాయకుల మాటలే స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ శాసనసభ్యుడు సోమూ వీర్రాజు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు. అంతేకాదు ఆరెస్సెస్‌తో గాఢమైన అనుబంధం ఉన్నవారు. ప్రధాని మోదీతో ఆయనకున్న స్నేహానుబంధం కూడా జగమెరిగిన సత్యం. ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులు ఏమవుతున్నాయో తెలియడం లేదని ఆయనే పబ్లిగ్గా చెప్పారు. పోలవరానికి రూ. 700 కోట్లు ఇస్తే లెక్కలు చెప్పలేదు, నిధులిస్తే బ్యాంకులలో వేసుకుని వడ్డీ తింటున్నారు తప్ప అభివృద్ధి పనులు చేపట్టడం లేదు అని కూడా ఆయన విమర్శించారు. ఆయన ప్రతిపక్షంలో లేరు, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీ నేత. ప్యాకేజీలు ఎప్పుడయినా ఆగిపోవచ్చు, హోదా కచ్చితంగా నిర్ణీత కాలానికి కలగాల్సిన లాభాలన్నీ కలుగుతాయి. ప్యాకేజీల కంటే ప్రత్యేక హోదానే ముఖ్యం అంటున్న వారంతా ఇదే చెబుతున్నారు. ఇటువంటి ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టాల్సింది, అవసరమైతే నిరాహార దీక్షకు కూర్చోవాల్సింది చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, పవన్ కల్యాణ్. వారా పనిచేయకపోగా ప్రతిపక్ష నేత చేస్తున్న ఆందోళనకు అన్ని దశల్లోనూ అడ్డుతగిలే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ దీక్షలు చేస్తే ప్రజలకు ఇబ్బంది అనీ, చనిపోతామంటే అనుమతి ఇవ్వాలా? అనీ గుంటూరులో జగన్ దీక్ష గురించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆయన తానూ గతంలో ప్రతి పక్షంలో ఉన్నాననీ, అప్పుడు తానూ కొన్ని దీక్షలు చేశాననీ మరిచిపోయినట్టుంది. విదూషక మంత్రుల తీరు గర్హనీయం జగన్మోహన్రెడ్డి దీక్షను ఆపలేక పోవడంతో దాన్ని అపహాస్యం చెయ్యడానికి శతవిధాలా యత్నించారు. ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఆందోళన జగన్ దీక్షతో ప్రజల్లోకి మరింత బలంగా వెళుతున్న సంకేతాలు అందడంతో, ఆయన దాని మీంచి దృష్టి మళ్ళించడానికి తన కొలువులోని ఇద్దరు విదూషకులను ప్రయోగించారు. బీజేపీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, టీడీపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆస్థాన విదూషకులుగా జగన్ దీక్ష మీద అవాకులు చవాకుల మాట్లాడారు. కేబినెట్ మంత్రి స్థాయి ఉన్న ప్రతిపక్ష నాయకుడు, ఒక పార్టీ అధ్యక్షుడు నిరాహార దీక్ష చేస్తుంటే ఆరవ రోజు దాకా వైద్య నివేదిక విడుదల చెయ్యకపోవడమే ఆయన దీక్ష విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరించిన నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం. పైగా ఆయన ఆరోగ్య పరిస్థితి మీద, దీక్ష మీద ఇష్టానుసారం వ్యాఖ్యానించడం దుర్మార్గం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతాయుత స్థానంలో ఉండి, స్వయంగా డాక్టర్ కూడా అయిన కామినేని శ్రీనివాస్ మాట్లాడిన తీరు గర్హనీయం. ఇక గుంటూరు జనరల్ ఆస్పత్రి పరీక్షా పరికరాలను గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎలుకలను అరికట్టలేకపోయిన ఆ ఆసుపత్రిలో నాణ్యత గల పరికరాలు, పరీక్షా సదుపాయాలు ఉంటాయనుకోగలమా? ప్రజా ఉద్యమాలను పరిహసిస్తే భంగపాటే జగన్మోహన్రెడ్డి దీక్షను అపహాస్యం చేసిన 48 గంటలలోపే ఆయనను ఎందుకు ఆస్పత్రికి తరలించాల్సివచ్చింది? ఆరోగ్య వైద్యశాఖ మంత్రే సమాధానం చెప్పాలి. కేంద్రాన్ని ఒప్పించి, మెప్పించి లేదా బెదిరించి ప్రత్యేక హోదా సాధించుకోగలమా, లేదా? అనేది టీడీపీ, బీజేపీ పెద్దలు ఆలోచించుకోవాలి. కానీ ఆ డిమాండ్‌తో జరిగే ఉద్యమాలను పలుచన చెయ్యబోతే ఇటువంటి ఎదురుదెబ్బలే తగులుతాయి, నవ్వులపాలవ్వడమే జరుగుతుంది. ప్రతిపక్ష నాయకుడి నిరాహార దీక్షనయితే భగ్నం చెయ్యగలిగారుగానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రత్యేక హోదా కోసం బలంగా పెరుగుతున్న కోర్కెను ఏం చేస్తారు? ప్రజల్లో తమ పట్ల వ్యతిరేకత లేకుండా చూసుకోడానికి నాలుగు మంచి పనులు చెయ్యాలి కానీ, నాలుగు మంచి పనులు చెయ్యండని డిమాండ్ చేసే ప్రతిపక్షమే లేకుండా చెయ్యాలనుకుంటే ఇట్లాగే అవుతుంది. -దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
బలిపీఠం ఎక్కేది గవర్నరేనా?
డేట్లైన్ హైదరాబాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్‌ను మార్చబోతున్నట్టు ఒక ఆంగ్ల దినపత్రికలో రెండు రోజుల క్రితం వార్తా కథనం వెలువడింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తరువాత ఆయనకు స్థానచలనం లేదా ఉద్వాసన జరుగుతుం దని ఆ కథనం సారాంశం. ఒక తెలుగు దినపత్రిక గవర్నర్ నరసింహన్ మీద కత్తికట్టినట్టు కొంతకాలంగా ఆయన ఉద్వాసన గురించి రాస్తున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం నరసింహన్‌ను రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ బాధ్యతల నుంచి తప్పిస్తారనే అనిపిస్తున్నది. కొద్దిరోజు లుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ అంచనాకు ఊతం ఇస్తున్నాయి. భిన్నమైన నియామకం 2008లో ఛత్తీస్గడ్ గవర్నర్‌గా నరసింహన్ నియమితులయ్యారు. తరువాత 2010లో ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు చేపట్టిన నరసింహన్‌కు రెండవ దఫా కూడా అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇంకా దాదాపు రెండేళ్లు ఆయన పదవిలో ఉండవచ్చు. మామూలుగా కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాక పాత ప్రభుత్వం నియమించిన గవర్నర్లు స్వచ్ఛందంగా రాజీనామాలు చేయడం సంప్ర దాయం. వారు తప్పుకోకపోతే కేంద్రం ఉద్వాసన పలకడమూ మామూలే. ఏడాది క్రితం బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక ఒకటి రెండు రాష్ట్రాల గవర్నర్లకు అలా ఉద్వాసన చెప్పవలసి వచ్చింది కూడా. అయినా తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవ ర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ మాత్రం పదవులలో కొనసాగారు. ఈ లెక్కలో ఇంకా కొన్ని రాష్ట్రాలు ఉండవచ్చు. కానీ ఈ ఇద్దరు గవర్నర్ల ఉదాహరణే తీసుకోడం ఎందుకంటే ఆ రెండూ పూర్తి భిన్నమైన నియామకాలు. రోశయ్య నిలువెత్తు రాజకీయజీవి. ఆయన జీవితం మొత్తం కాంగ్రెస్ సేవలో గడిచింది. కార్యకర్త మొదలుకుని ముఖ్యమంత్రి దాకా అన్ని పదవులూ ఆయన ఆ పార్టీ ద్వారా సాధించారు. ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినందునే ఆయ నకు యూపీఏ ప్రభుత్వం గవర్నర్ పదవి ఇచ్చింది. ఎన్డీయే అధికారంలోకి రాగానే నిజానికి తొలగాల్సిన తొలి గవర్నర్ రోశయ్యే. కానీ ఎన్డీయే కొనసా గించింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆయననే కొనసాగించా లని కోరుకున్నారు కాబట్టే ఇది సాధ్యమైందని వార్తలు వచ్చాయి. గవ ర్నర్గా నరసింహన్ నియామకం పూర్తి భిన్నమైనది. ఆయన టాప్ కాప్. ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి. నిఘా విభాగం ైడెరైక్టర్గా పదవీ విరమణ చేశారు. ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదు. గవర్నర్ పదవులు రాజ కీయ పునరావాస కేంద్రాలన్న విమర్శ ఉన్నా, అక్కడో ఇక్కడో నరసింహన్ లాంటి వారు కూడా నియమితులవుతూంటారు. కాబట్టి నరసింహన్ గురించి బీజేపీ రాజకీయంగా ఆలోచించి ఉండకపోవచ్చు. వివాదాల గవర్నర్లు గవర్నర్లు కేంద్ర ప్రతినిధులు. కాబట్టి అక్కడ అధికారంలో ఉన్నవారు తమకు అనుకూలమైనవారినే గవర్నర్లుగా నియమించుకోవడం సహజం. కేంద్రంలో, రాష్ట్రాలలో వేర్వేరు పార్టీల ప్రభుత్వాలు ఉన్నప్పుడు గవర్నర్ల కార ణంగా ఘర్షణలు జరగడం అనేక సందర్భాలలో చూశాం. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా తొలగించిన గవర్నర్ రామ్‌లాల్, అదే ఎన్టీఆర్ హయాంలోనే గవర్నర్‌గా పనిచేసిన కుముద్‌బెన్ జోషి ఇద్దరూ వివాదాస్పదులుగా పేర్గాంచారు. వీరు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల సంబంధా లకు విఘాతం కలిగే విధంగా వ్యవహరించారన్న అపఖ్యాతి ఉంది. ఆ రెండు సందర్భాలలోనూ కేంద్రంలో కాంగ్రెస్, రాష్ర్టంలో తెలుగుదేశం పార్టీల ప్రభు త్వాలు ఉన్నాయి. రెండవసారి ఎన్టీఆర్ పదవీచ్యుతుడైన సందర్భంలో చంద్ర బాబునాయుడుకు అనుకూలంగా వ్యవహరించారన్న అపవాదును సోష లిస్ట్‌గా పేరుపొందిన కృష్ణకాంత్ భరించవలసి వచ్చింది. మార్పు ఈ దశలోనా? మళ్లీ ప్రస్తుత తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ విషయానికి వస్తే, ముం దే పేర్కొన్నట్టు ఆయన రాజకీయ నాయకుడు కాదు. గవర్నర్ బాధ్యతలూ, పరిమితులూ బాగా తెలిసినవారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తరువాత, సంక్లిష్ట పరిస్థితులలో ఆయనను యూపీఏ ప్రభుత్వం గవర్నర్‌గా ఉమ్మడి రాష్ట్రానికి పంపింది. అప్పుడు కేం ద్రంలోనూ, రాష్ర్టంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. నిజానికి ఒక యుద్ధ సమయంలో ఆ నియామకం జరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మహోధృతమైన సమయంలో గవర్నర్ బాధ్యతలు నిర్వహించడం మామూ లు విషయం కాదు. చాలామంది ఇతర గవర్నర్ల మాదిరిగా కాక నరసిం హన్ చాలా చురుకైన వ్యక్తి. రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ గట్టిగా నిర్ణ యించుకుని, విధివిధానాలను మొదలుపెట్టిన కాలంలో సీమాంధ్రలో మొద లైన సమైక్య ఉద్యమకాలంలోనూ ఆయన తన కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వ హించారు. కాబట్టే విభజన తరువాత రెండు రాష్ట్రాలకూ ఉమ్మడి గవర్నర్‌గా ఆయననే కొనసాగించారు. ఇందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచీ అభ్యంతరం వ్యక్తం కాలేదు కూడా. విభజనకు ముందూ, తరువాతా ఆయన కేంద్రానికి క్రమంతప్పకుండా నివేదికలు ఇస్త్తూనే ఉన్నారు. కేంద్రం కూడా సంతృప్తిగానే ఉంది. మరి మరో రెండేళ్ల పదవీకాలం మిగిలి ఉండగా ఇప్పుడు గవర్నర్‌ను మార్చాలని కేంద్రం ఎందుకు ఆలోచిస్తున్నది? నరసింహన్ వారసునిగా ఒక రాజకీయ నాయకుడిని పంపాలని కేంద్రం యోచిస్తు న్నట్టుగా కూడా ఆ ఆంగ్లపత్రిక వెల్లడించింది. విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు ఇంకా పరిష్కారం కావలసి ఉంది. ఈ తరుణంలో సమస్య మూలాలు తెలిసిన గవర్నర్‌కు స్థానచలనం కల్పించి, ఏ అవగాహనా లేని ఒక రాజకీయ జీవిని తెచ్చి పెడితే పరిస్థితి మరింత జటిలం అవుతుంది. నాడు లేని అభ్యంతరం నేడు ఎందుకు? ఇంతకూ కేంద్రానికి ఈ ఆలోచన ఎందుకు వచ్చినట్టు? ఎన్డీఏ భాగస్వామి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టుపట్టినందునే, సంకీర్ణ ధర్మాన్ని పాటించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టు వార్తలొచ్చాయి. రాష్ర్ట విభజన సమయంలో నరసింహన్‌ను కొనసాగించినప్పుడు లేని అభ్యం తరం చంద్రబాబుకు ఇప్పుడెందుకు? కారణం అందరికీ తెలిసిందే. తెలుగు దేశం పార్టీకి చెందిన శాసనసభ్యులు ఓటుకు కోట్లు వ్యవహారంలో పట్టుబ డడం, దానిని సెక్షన్ 8తో ముడి పెట్టజూసినా అందుకు సహకరించనందుకే గవర్నర్ మీద కినుక వహించి చంద్రబాబు ఆయనను తప్పించాలని పట్టు పట్టి ఉండవచ్చు. తెలుగుదేశం ప్రముఖులు, మంత్రులు కూడా గవర్నర్‌ను అవమానించే విధంగా విమర్శిస్తే చంద్రబాబు నోరు విప్పనప్పుడే గవర్నర్ బదిలీకి రంగం సిద్ధమైనట్టు అర్థమైంది. సెక్షన్ 8ని ప్రయోగించవలసిన పరిస్థితి హైదరాబాద్‌లో లేనప్పుడు గవర్నర్ మాత్రం ఏం చేస్తారు? హైదరా బాద్ లో ఒక్క తెలంగాణేతరుడి నుంచైనా ఫిర్యాదు వచ్చిందా? తప్పు చేస్తూ దొరికిన తెలుగుదేశం నాయకుల మీద కేసులుపెట్టడం, ఏసీబీ విచారణ జరపడం వంటివాటిని సెక్షన్ 8 ఉల్లంఘనగా గవర్నర్ పరిగణించనందుకే ఆయన బదిలీ కోరడం, కేంద్రం ఆ ఆలోచనను ప్రోత్సహించడం రాజకీ యంగా కూడా ఎంత తెలివిలేనితనం! గవర్నర్ పక్షపాతం చూపగలరా? తెలంగాణ ప్రభుత్వం పట్ల గవర్నర్ అనుకూలంగా ఉన్నారనే విమర్శను కూడా తెలుగుదేశం వారు విస్తృతంగా ప్రచారంలో పెట్టారు. అట్లా అనుకునే అవకాశం లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే తెలం గాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తరచూ గవర్నర్‌ను కలుస్తున్నారు. తెలంగాణలో చేపట్టే కార్యక్రమాలలో ఆయనను ఎక్కువగా భాగస్వామిని చేస్తున్నారు. ఆ విషయంలో చంద్రబాబు కొంచెం వెనుకబడ్డారు. గవర్నర్ తెలంగాణ పక్షపాతిగా చెబుతున్నప్పటికీ ఆయన కొత్త రాష్ట్రానికి అదనంగా చేసేదేముంది? ఏదైనా పునర్విభజన చట్టానికి లోబడి చేయవలసిందే. కానీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్ చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించిన దరి మిలా తన మీద వచ్చిన విమర్శకు గవర్నర్ జవాబు చెప్పుకోక తప్పదు. తెలు గుదేశం పార్టీ టికెట్ మీద గెలిచి, శాసన సభ్యత్వానికి రాజీనామా చెయ్యకుం డానే మంత్రివర్గంలో చేరడానికి వస్తే ఆయన చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించి ఉండాల్సింది కాదు. ఏది ఏమైనా ఈ పరిస్థితులలో గవర్నర్ మార్పు అంటే ఎన్డీయే మరిన్ని తలనొప్పులను కొనితెచ్చుకున్నట్టే. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
పంతం మాటున పగటికల
ఎన్.టి.రామారావును పదవి నుంచి దించేసి అధికారం చేజిక్కించుకున్న నాడు నారా చంద్రబాబునాయుడి లక్ష్యం 2020. ఆ మేరకు ఆయన 1996 లోనే 2020 పేరిట ఒక విజన్ డాక్యుమెంట్‌ను కూడా విడుదల చేశారు. పదవిలో కొనసాగినంత కాలం ఆయన అదే డాక్యుమెంట్‌ను పదే పదే వల్లె వేసే వారు. మామూలుగా అయితే 2020 సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్ చేరుకో వలసిన అభివృద్ధి లక్ష్యంగా దీనిని అర్థం చేసుకోవాలి. కానీ చంద్రబాబు ఆలో చనలో 2020కి మరో అర్థం ఉంది. అది- 2020 వరకూ ఆయన అధికారంలో కొనసాగడం. అయితే చంద్రబాబు లక్ష్యానికి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో 2004లోనే కాంగ్రెస్ పార్టీ గండి కొట్టేసింది. ఇలాంటి గండి 1999లోనే పడవలసి ఉంది. కానీ అటల్ బిహారీ వాజపేయి పట్ల దేశ వ్యాప్తంగా ఏర్పడ్డ సానుభూతి పవనాలూ, కార్గిల్‌యుద్ధ ప్రభావం, బీజేపీతో మిత్రత్వం చంద్రబాబుకు కలిసొచ్చింది. కాంగ్రెస్ చేసిన కొన్ని తప్పులు కూడా తోడై ఆ ఎన్నికలలో బతికి బయటపడింది తెలుగుదేశం. అట్లా కలిసొ చ్చిన అదృష్టాన్ని తన లక్ష్యం ‘2020’ వరకు నిలుపుకోడానికి ఆయన ప్రజా ప్రయోజన విధానాలను ఎన్నుకుంటే ఎలా ఉండేదో కానీ, ఇదంతా తన సొంతబలం అనుకున్నారు. తనకు ఎదురులేదన్నట్టే వ్యవహరించారు. ఇలా తీవ్ర ప్రజావ్యతిరేకతను కొనితెచ్చుకోవడంతో ఆయన లక్ష్యానికి 2004లో గండిపడింది. రాజశేఖరరెడ్డి మృతి, తెలంగాణ ఉద్యమ ఉధృతి, విభజనకు యూపీఏ అనుమతి లేకుంటే చంద్రబాబు 2020 లక్ష్యం కలగానే మిగిలేది. తర్కం లేని ఆలోచన ఈ సోది ఇప్పుడెందుకు అనిపిస్తుంది ఎవరికైనా. తాజా పరిణామాలకూ, చంద్రబాబు 2020 స్వప్నానికీ సంబంధం ఉంది. 2020 వరకూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో కొనసాగాలనుకున్న చంద్రబాబు పదేళ్ల పాటు ప్రతిపక్షంలో కూర్చోవలసి రావడమే కాక, 2014లో చేతికొచ్చిన అధికారం కూడా తన సొంత బలంతో కాక, పూర్తిబలంతో కాక అదీ అర్ధరాజ్యమే చేతికి రావడం, ఆ అర్ధ రాజ్యం కూడా 2019 వరకే కావడంతో తన కల నెరవేరదే మోనన్న అనుమానం కలిగింది. నిజానికి చంద్రబాబు కల నెరవేరాలంటే 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల వేళకు రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావాలి. నిజాయితీగా పనిచేసి రెండు రాష్ట్రాల ప్రజల మన్ననలు పొంది అధికారంలోకి వస్తే సంతోషమే. ఇక్కడ ఒక సినిమా డైలాగ్ గుర్తుకొస్తుంది. ముఖ్యమంత్రి కావడం కోసం తన పార్టీకే చెందిన శివా రెడ్డి అనే మరో నాయకుడిని హత్య చేయించిన ఒక రాజకీయ నాయకుడితో ఆ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి అంటాడు, ‘శివారెడ్డి చని పోతే మీరు ముఖ్యమంత్రి అవుతారు, శివారెడ్డిని హత్య చేస్తే మీరు హంతకుడ వుతారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మరిచిపోయారు?’ అని. ఇది చంద్రబాబు వైఖరికి అద్దం పట్టే ైడైలాగ్. ఎలాగంటే, తెలంగాణ లో ప్రజా సమస్యల మీద ఉద్యమాలు చేసి, వారి మన్ననలను పొంది పార్టీని బలోపేతం చేస్తే, ఆంధ్రప్రదేశ్‌లో చేజిక్కిన అధికా రాన్ని ప్రజాసంక్షేమానికీ, చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికీ ఉపయోగిస్తే మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకానీ, తెలంగాణలో ఎమ్మెల్యేలనూ, ఆంధ్రప్రదేశ్‌లో గ్రామస్థాయి నుంచి పార్లమెంట్ దాకా అన్ని స్థాయిలలో ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తే అధికారం రాదు. పట్టుబ డితే రేవంత్‌రెడ్డికి పడ్డట్టు అరదండాలు పడతాయి అన్న చిన్న లాజిక్ చంద్ర బాబు మరిచిపోవడం ఆశ్చర్యం. 2019లో తెలంగాణ లో మేమే అధికారంలోకి వస్తాం అని చంద్రబాబునాయుడు, ఆయన పార్టీ తెలంగాణ శాఖ నాయ కులూ ఈ సంవత్సర కాలంలో చాలాసార్లు ప్రకటించారు. ఆ దిశగా ప్రజలలో బలం పెంచుకునే పని మానేసి ఒక్క ఎమ్మెల్సీ స్థానం కోసం కక్కుర్తిపడి దొరికి పోయి ఇప్పుడింకా తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. నామినేటెడ్ శాసన సభ్యుడు ఎల్విస్ స్టీఫెన్సన్కు బయానాగా రూ.50 లక్షలు ఇస్తూ ఏసీబీకి దొరికి పోయిన రేవంత్‌రెడ్డి జైలుకు పోయి ఇవ్వాళ్టికి 24 రోజులు. ఈ 24 రోజుల్లో చంద్రబాబునాయుడు ఆయన పార్టీ, ప్రభుత్వ పెద్దలూ 10 తప్పులు చేశారు. రేవంత్‌రెడ్డిని సమర్థించడం, స్టీఫెన్‌సన్‌తో తాను స్వయంగా మాట్లాడిన ఆడియో బయటపడితే వివరణ ఇవ్వడానికి బదులు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నదంటూ అందరి దృష్టినీ మళ్లించే ప్రయత్నం నుం చిచివరికి తెలంగాణ న్యూస్ చానల్‌కు నోటీసులు ఇప్పించే వరకూ చంద్ర బాబునాయుడు తప్పులు చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి మీడియా సలహా దారు పరకాల ప్రభాకర్ తన విధుల పరిమితి దాటి చంద్రబాబు తరఫున తెలంగాణ ప్రభుత్వం మీద విరుచుకుపడిన విధానం, రాష్ర్ట మంత్రుల చేత గవర్నర్ మీద పరుష పదజాలంతో తీవ్ర ఆరోపణలు చేయించడం, పక్క రాష్ర్టంలో సొంత పోలీస్స్టేషన్లు పెట్టుకుంటాం అనడం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన నేరంలో నాల్గవ నిందితుడిగా ఉన్న మత్తయ్యకు, అదే కేసులో ఏసీబీ నోటీసులు ఇచ్చిన టీడీపీ శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్యకు ఆశ్రయం ఇవ్వడం వంటి తప్పులు చేస్తూనే ఉన్నారు. ఎదురుదాడికే మొగ్గు విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌కు బోలెడు సమస్యలున్నాయి. ఎన్నికల వాగ్దా నాలను నెరవేర్చడానికి నిధులు లేవు. రాజధాని నిర్మాణానికి డబ్బు కావాలి. కేంద్రం ఇస్తానన్న ప్రత్యేక హోదా పత్తాలేదు. ప్రతి పనికీ హుండీ పెట్టి చందాలు ఇవ్వండనే పరిస్థితి. చంద్రబాబునాయుడు హైదరాబాద్ నివాసి. ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, సొంత ఇల్లు అన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. పాత ఇంటిని కూల్చేసి కొత్త ఇల్లు కట్టడం మొదలు పెట్టారాయన. ఆయన మీద వచ్చిన ఒక నేరారోపణను దర్యాప్తు అధికారులు ఆ కోణం నుంచే చూడా లి తప్ప చంద్రబాబు కోరుకుంటున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద అభియోగంగా చూడటానికి వీలులేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఈ వ్యక్తిగత నేరారోపణ అంశాన్ని రెండు ప్రభుత్వాల మధ్య, రెండు రాష్ట్రాల ప్రజల మధ్య తగాదాగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారు. మంగళగిరి సంకల్పసభలో మాట్లాడినా, ఢిల్లీలో జాతీయ మీడియా ముందు మాట్లాడినా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల మధ్య అంతరాలను సృష్టించి, వాటిని పెంచే ధోరణిలోనే మాట్లాడుతున్నారు చంద్రబాబు. ఒక నేరం జరిగింది. నిందితులు జైల్లో ఉన్నారు. ఆ నేరాన్ని సమర్థించినట్టు మరొకరు మాట్లాడిన ఆడియో బయటపడింది. దర్యాప్తు జరుగుతున్నది. ఒక స్టేట్స్‌మన్‌గా (ఆ మాటను ఆయనే పలు సందర్భాలలో చెప్పారు) చంద్రబాబునాయుడు ఏం చేయాలి? పదవికి రాజీనామా చేసి మరొకరిని ముఖ్యమంత్రిగా నియమించి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. కనీసం చట్టం తన పని తను చేసుకుపోతుంది అనైనా అనాలి. అలా చెయ్యక పోగా, నా మీదే కేసులు పెడతారా అన్న ధోరణి సరైనది కాదు. పైగా మా శాసనసభ్యులను తెలంగాణ రాష్ర్ట సమితి ప్రలోభ పెట్టి తన వైపు తిప్పుకు న్నది, అది తప్పు కాదా అంటున్నారు. ఈ విషయంలో టీఆర్ఎస్ను ఎవరూ సమర్థించరు. దానికి బదులుగా మేం ఇది చేశాం అన్న టీడీపీ సమర్థింపునూ ఎవరూ హర్షించరు. ఉభయులూ ఈ బేరసారాలను ఆపాల్సిందే. దృష్టిని మళ్లించేందుకే సెక్షన్ 8 ఊసు ఈ వ్యవహారాన్నంతా పక్కదారి పట్టించేందుకు రాష్ర్ట పునర్విభజన చట్టం లోని సెక్షన్ 8ని ముందుకు తెస్తున్నారు చంద్రబాబునాయుడు. సెక్షన్ 8 చెబు తున్నది ఏమిటంటే, ఉమ్మడి రాజధాని ప్రాంతంలో ప్రజల ప్రాణాలనూ, ఆస్తులనూ, స్వేచ్ఛనూ రక్షించే ప్రత్యేక బాధ్యతలను రాష్ర్ట గవర్నర్ కలిగి ఉంటారనే. శాంతిభద్రతలకు, అంతర్గత భద్రతకు విఘాతం కలిగితే, ముఖ్య మైన కట్టడాలకు భద్రత లోపిస్తే, ఉమ్మడి రాజధాని ప్రాంతంలో కార్యాల యాల కేటాయింపులో సమస్యలొస్తే గవర్నర్ జోక్యం చేసుకుంటారు. ఈ అంశాలలో మంత్రిమండలి చేసే సూచనలు కాదని గవర్నర్ సొంత నిర్ణయం కూడా తీసుకోవచ్చు. ఈ ఏడాది కాలంలో ఎవరి ధన మాన ప్రాణాలకు భం గం కలిగిందో తెలుగుదేశం నాయకులే చెప్పాలి. ప్రముఖ జర్నలిస్ట్ సంజయ్ బారు చెప్పినట్టు హైదరాబాద్ (ఉమ్మడి రాజధాని) ప్రశాంతంగా ఉన్నది, హాయిగా ఆనందంగా ఉన్నది. శాసనసభ్యుడిని డబ్బుతో ప్రలోభపెట్టడానికి ప్రయత్నించిన రేవంత్‌రెడ్డి కేసు, దానిని ప్రోత్సహించే రీతిలో వినిపిస్తున్న చంద్రబాబు గొంతు గల టేప్‌ల మీద దర్యాప్తు ఇవేవీ సెక్షన్8 పరిధిలోకి రావు. ప్రస్తుతం తెలంగాణ అవినీతి నిరోధకశాఖ ఈ కేసులో జరుపుతున్న దర్యాప్తులో గవర్నర్‌గారే కాదు, న్యాయవ్యవస్థ కూడా జోక్యం చేసుకోజాలదు. ఇవన్నీ సుదీర్ఘ రాజకీయ, పరిపాలననుభవం కలిగిన చంద్రబాబుకు తెలియ వనుకోవాలా? 2020 లక్ష్యాన్ని అడ్డదారిలో చేరుకోవాలన్న ప్రయత్నమే తెలు గుదేశం అధినేతకు ఇన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. -దేవులపల్లి అమర్, datelinehyderabad@gmail.com -
ఇలాగైతే తెలంగాణ గెలిచేనా?
డేట్లైన్ హైదరాబాద్ ప్రభుత్వం ఏర్పాటుకు తగిన బలమున్నా ఇతర పార్టీల సభ్యులను చేర్చుకుని టీఆర్ఎస్ ఏర్పరచినది సంకీర్ణ ప్రభుత్వమే. ఇప్పుడున్నది టీఆర్ఎస్, బీఎస్పీ, టీడీపీల ప్రభుత్వం. కాదంటే టీడీపీ తరఫున గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా చేసి మళ్లీ గెలవాలి. బీఎస్పీకి చెందిన ఇంద్రకరణ్ రెడ్డి, కోనప్పలిద్దరూ టీఆర్ఎస్లో చేరిపోయారు. అయినా బీ ఫారం ఇచ్చిన పార్టీకి రాజీనామా చెయ్యడం న్యాయం కాదా? సూత్రబద్ధమైన, చట్టబద్ధమైన, నైతికమైన బాధ్యతలను నెరవేరిస్తేనే ప్రపంచం ముందు తెలంగాణ గెలుస్తుంది. లేకపోతే ఓడిపోతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం నాడు ఒక సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్రాభివృద్ధి కోసం అందరూ కలసికట్టు గా పనిచెయ్యాలి అన్నారు. ఇవి పైకి వినిపించేట్టుగా మాట్లాడిన మాటలు. ఆయనను సన్నిహితంగా గమనిస్తున్న వారికి ఆ మాటల అంతరార్థం మరోలా స్ఫురించింది. రాష్ట్రాభివృద్ధి కోసం అంతా కలసి పనిచే యడమంటే అందరూ టీఆర్ఎస్లో కలసిపోవడమేనని. వివిధ రాజకీయ పక్షాల నేతలంతా తమ తమ రాజకీయ అభిప్రాయాలూ, సిద్ధాంతాలూ ఒదిలేసి, వరుసలో నిలబడి ముఖ్యమంత్రి కేసీఆర్ చేత గులాబీ కండువా కప్పించు కుని, తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిపోవడమే తెలంగాణను అభివృద్ధి చేయడమని ప్రస్తుతార్థం. రాజకీయాల్లో పార్టీలు మారడం వింతేమీ కాదు. అలాంటప్పుడు ఒక్క టీఆర్ఎస్ పార్టీని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మాత్రమే ఎందుకు విమర్శించాలని ఎవరైనా అనొచ్చు. నిజమే, ఈ రుగ్మత ఒక్క తెలంగాణకే పరిమితమైనది కాదు. ఒక్క కేసీఆర్ మాత్రమే ఈ తరహా నీతి బాహ్యమైన వ్యవహారాన్ని ప్రోత్సహించడం లేదు. సందర్భాన్ని బట్టి అందరి గురించీ మాట్లాడుకోవాల్సిందే. అవతల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఏం తక్కువ తినలేదు. ఆయన ప్రయ త్నాలు ఆయనా చేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అధికార పక్షం ఎంత గొప్పగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నదో ఇప్పుడు జరుగుతున్న ఆ రాష్ట్ర శాసనసభా సమావేశాల తీరే చెబుతుంది. అయితే అక్కడి అధికార పార్టీ, టీఆర్ఎస్ స్థాయిలో ఫిరాయింపులను విజయవంతం చేసుకోలేకపోతు న్నది. దానికి ప్రధాన కారణం ఏపీలో ప్రతిపక్షం బలంగా ఉన్నది, ఒక్క మాట మీద నిలబడి ఉన్నది. కాగా తెలంగాణలో ప్రతిపక్షం పరిస్థితి అగమ్య గోచరంగా, అయోమయంగా ఉన్నది. అందుకే చంద్రశేఖరరావు నాయక త్వంలో టీఆర్ఎస్ ఏం చేసినా ప్రస్తుతానికి చెల్లిపోతున్నది. గెలుపునకు అర్థం ఫిరాయింపులేనా? రాష్ట్ర విభజన తదుపరి సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పా టు చెయ్యడానికి అవసరమైనన్ని స్థానాలు టీఆర్ఎస్కు లభించాయి. అయినా ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీల నుంచి కొంత మంది శాసన సభ్యులను తమ వైపు లాక్కున్నారు. తమకు అస్సలే బలంలేని శాసన మండలిలో ఏకంగా 14 మంది ప్రతిపక్ష టీడీపీ, కాంగ్రెస్ సభ్యులను చేర్చుకుని, మండలి చైర్మన్ స్థానాన్నే కైవసం చేసుకున్నారు. ఇవన్నీ మళ్లీ ఎందుకు గుర్త్తు చెయ్యడమంటే, సోమవారం ముఖ్యమంత్రి ఇంకో మాట కూడా అన్నారు... రాజకీయాలకు ఇది సమయం కాదు, ప్రపంచం ఎదుట తెలంగాణను గెలిపించాలని. నిజమే ఆరు దశాబ్దాల పోరాటం తరవాత సాధించుకున్న రాష్ట్రం కాబట్టి తెలంగా ణను అందరూ కలసి గెలిపించుకోవలసిందే. కానీ ప్రపంచం ముందు తెలం గాణ ఎప్పుడు గెలుస్తుంది? ఎట్లా గెలుస్తుంది? రాజకీయాలను కలగాపులగం చేసి, నీతిబాహ్యమైన పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తే గెలుస్త్తుందా? అధి కార పార్టీ అభిప్రాయం తప్ప మరే రాజకీయ అభిప్రాయం వినిపించకుండా చేసేస్తే తెలంగాణ గెలిచినట్టేనా? తెలంగాణ గెలవడమంటే చట్టవిరుద్ధంగా ఇతర పార్టీలను తమలో కలిపేసుకోవడమేనా? తెలంగాణ, ఏం చేస్తే ప్రపం చం ముందు గెలుస్త్తుందో, ఏం చెయ్యకపోతే ఓడిపోతుందో, నవ్వుల పాలవు తుందో బిగ్గరగా మాట్లాడుకోవాల్సిన సమయమిది. ఇప్పుడు మౌనం వహిం చడమంటే ప్రపంచం ముందు తెలంగాణ ఓడిపోవడానికి కారణం కావడమే. హోల్‌సేల్ ఫిరాయింపులతో టీఆర్ఎస్ శాసన మండలి అధ్యక్ష స్థానాన్ని దక్కించుకుంది సరే. రాజకీయాల్లో ఇలాంటివి మామూలేనని కాసేపు సరి పెట్టుకుందాం. గత వారం శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాస నమండలి ఒక బులెటిన్ విడుదల చేసింది. టీడీపీ లెజిస్లేచర్ పార్టీ టీఆర్ ఎస్‌లో విలీనమైందని తెలిపింది. కానీ ఇంకా మండలి సభ్యులు ఇద్దరు టీడీపీ లోనే కొనసాగుతున్నారు. పోనీ టీఆర్ఎస్లో చేరిన ఐదుగురైనా తామే మెజా రిటీ కాబట్టి లెజిస్లేచర్ పార్టీ మాదేనని ప్రకటించుకున్నారా? లేదు. అధికార పక్షం పంచన చేరి, గులాబీ కండువాలు కప్పించుకు కూర్చున్నారంతే. అలాంటప్పుడు టీడీపీ లెజిస్లేచర్ పార్టీ అధికార పార్టీలో విలీనమైనట్టు మం డలి అధ్యక్షులు ఎలా ప్రకటిస్తారు? ఒక పార్టీ మొత్తంగా ఇంకో పార్టీలో చేరా లంటే ఒక చట్టపరమైన తతంగం ఉంటుంది. శాసన మండలిలోని ఆ పార్టీ సభ్యులు నిర్ణయించుకుంటే సరిపోదు. పార్టీ విలీనానికి నిర్ణయం తీసుకుని సదరు రాజకీయ పార్టీయే స్వయంగా ఎన్నికల సంఘానికి రాయాలి. దాని అనుమతి పొందిన తర్వాత విలీనం చేసుకోవచ్చు. ఇక్కడ అదేమీ జరగలేదు. మండలి చైర్మన్ ఒక బులెటిన్‌ను విడుదల చేసి చేతులు దులుపుకున్నారంతే. ఇటువంటి చర్య ప్రపంచం ముందు తెలంగాణను గెలిపిస్తుందా? ఇది సంకీర్ణ ప్రభుత్వం కాదా? ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైనన్ని శాసనసభ స్థానాలున్నా ఇతర పార్టీల శాసన సభ్యులను చేర్చుకుని టీఆర్ఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అవును, ఇప్పుడు తెలంగాణలో ఉన్నది మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వమే. టీఆర్ఎస్, బహుజన సమాజ్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు కలసి ఏర్పాటు చేసిన ప్రభుత్వం. కాదని ఖండిస్తే టీడీపీ అభ్యర్థిగా గెలిచిన తలసాని శ్రీని వాస్ యాదవ్ చేత శాసన సభ్యత్వానికి రాజీనామా చేయించి మళ్లీ గెలిపిం చుకోవాలి. ఇంద్రకరణ్ రెడ్డితో పాటు బహుజన సమాజ్ పార్టీ తరఫున గెలి చిన మరో సభ్యుడు కోనప్ప కూడా టీఆర్ఎస్లో చేరారు. కాబట్టి మొత్తం ఆ పార్టీ విలీనమైందని వాదించవచ్చు. కానీ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చెయ్యడానికి బీ ఫారం ఇచ్చిన పార్టీకి రాజీనామా చెయ్యడం న్యాయ సమ్మతమూ, నైతిక విజ్ఞత కాదా? సూత్రబద్ధమైన, చట్టబద్ధమైన, నైతికమైన రాజకీయ బాధ్యతలను నెరవేరిస్తేనే ప్రపంచం ముందు తెలంగాణ గెలు స్తుంది. లేకపోతే ఓడిపోతుంది. కడియం శ్రీహరిని వరంగల్ ప్రజలు పార్ల మెంటుకు గెలిపించి పంపితే, ఆయనను రాష్ట్ర మంత్రిని చేశారు. ఆరు నెలల దాకా ఆయన ఏ సభ నుంచీ ఎన్నిక కాకుండానే మంత్రిగా కొనసాగే అవకాశం ఉంది. కానీ పార్లమెంటుకు రాజీనామా ఎందుకు చేయించరు? దీన్ని ప్రపం చం హర్షిస్తుందా? ఇతర పార్టీల నుంచి తమ పార్టీలో చేర్చుకున్న శాసనసభ, శాసన మండలి సభ్యులందరి చేతా రాజీనామాలు చేయించి, మళ్లీ ఎన్నికలు నిర్వహించి వారిని గెలిపించుకుంటేనే ప్రపంచం ముందు తెలంగాణ గెలిచేది. లేకపోతే దివాలాకోరు రాజకీయాలకు బలై ఓడిపోతుంది. నవ్వులపాలు చేస్తారా? తలెత్తి నిలిచేలా ప్రవర్తిస్తారా? ఒక దళిత నాయకుడిని ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి ఏ వివరణా ఇవ్వ కుండా తొలగించి మాసాలు గడుస్తున్నాయి. కనీస విచారణ లేకుండా, ప్రజ లకు వివరణ ఇవ్వకుండా ప్రభుత్వం మౌనం వహిస్తే ప్రపంచం ముందు తెలంగాణ గెలవదు. మాజీ ఉప ముఖ్యమంత్రిపై వచ్చిన అవే ఆరోపణలు మరో మంత్రి మీదా వచ్చి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా ముఖ్యమంత్రికి పట్టదు. ఆ మంత్రి అగ్రకులస్తుడు, తమ సింహాసనాలకే ఎసరు పెట్టగలిగిన వర్గాల నాయకుడు కాబట్టి నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం కూడా ప్రపంచం ముందు తెలంగాణను గెలిపించదు. ఆరోపణలను విచారించి నిజాలు నిగ్గుదేల్చి ఆ మంత్రి పులు కడిగిన ముత్యం అని తేల్చినప్పుడు తెలంగాణ గెలుస్తుంది. తెలంగాణలో టీఆర్ఎస్ తప్ప ఇంకొక రాజకీయ పార్టీ అస్తిత్వంలో ఉండ కూడదన్న ఆలోచన తెలంగాణను ప్రపంచం ముందు గెలిపించదు. నవ్వుల పాలు చేస్తుంది. తెలంగాణలో ప్రతిపక్షం మొత్తంగా నాయకత్వ లోపంతో నానాటికీ బలహీన పడటంవల్ల కూడా అధికార పార్టీ ఇలా ఇష్టానుసారం వ్యవహరించే అవకాశం కలిగింది. శాసనసభలో ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీలు రెండూ ఒకే రకమైన గందరగోళ స్థితిలో ఉన్నాయి. శాసనసభ నుంచి బహి ష్కృతులైన టీడీపీ సభ్యులు ఏకంగా భారత రాష్ట్రపతికి మొరపెట్టుకోడానికి వెళ్లడాన్ని అంతా వింతగా చెప్పుకుంటున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ దాష్టీ కాన్ని సమర్థవంతంగా ఎండగట్టలేని దుర్బలత్వం వారిది. పొరుగు రాష్ట్రం లోని అధినాయకుడి నుంచి ఆదేశాలు తీసుకోవాల్సిన స్థితిలోని ఆ పార్టీ అంత కంటే బలంగా పోరాడగలదని ఎవరు మాత్రం భావించగలరు? ఇక కాంగ్రెస్ ఎప్పటి మాదిరిగానే తలో దారి అన్నట్టు వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ శాసన సభా పక్ష నాయకుడిది ఒక దారైతే, ఆయన పార్టీ శాసన సభ్యులది మరో దారి. వీళ్ల దారులు ఎప్పటికీ ఒక్కటి కావు. అధికార పక్షం ఒక్కటే ఉంటే సరిపోదు, బలమైన ప్రతిపక్షం ఉంటేనే తెలంగాణ గెలుస్తుంది. నీతివంతమైన రాజకీయాలే తెలంగాణను ప్రపంచం ముందు తలెత్తుకు నిలిచేలా చేస్తాయని గుర్తించాలి. datelinehyderabad@gmail.com -
కాగల కార్యాన్ని తీర్చేది కమలమే
డేట్లైన్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం లోపభూయిష్టంగా ఉన్నదన్న విషయంలో ఎవరికీ సందేహాలు ఉండనవసరం లేదు. ఆ కారణంగానే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చాలా విషయాలలో స్పష్టత లోపించి ఉద్రిక్తతలు, ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. తొలిరోజులలో ఆంధ్రప్రదేశ్ అధికారులను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకోవడం నుంచి మొదలై, నాగార్జునసాగర్ డ్యాం మీద నీటి విడుదల కోసం ఇరు రాష్ట్రాల అధికారులూ, పోలీసులూ తన్నుకులాడిన పరువు తక్కువ ఘటన వరకూ నిందించవలసినది రెండు ప్రభుత్వాలనే! ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి మార్పులు తీసుకురావలసిన అవసరం చాలా ఉందని కేంద్రమంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఇటీవల తెలుగు రాష్ట్రాలలో పర్యటించిన ప్రతిసారీ చెబుతున్నారు. ఈ నెలాఖరులో ప్రారంభం కాబోతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో ఆ సవరణలు తీసుకురావచ్చు కూడా. ఇంతకూ విభజన చట్టంలో తీసుకురావలసిన మార్పు లేమిటి? ఎలాంటి మార్పులు అవసరమని కేంద్రం అనుకుంటున్నది? పోనీ ఈ మార్పులను గురించి పదే పదే మాట్లాడుతున్న వెంకయ్యనాయుడికైనా ఈ విషయంలో స్పష్టత ఉందా? మార్పులు సరే, అవి ఎలాంటివి? ఒకటి నిజం. వెంకయ్యనాయుడు ఇప్పటివరకు ఈ మార్పులకు సంబంధించి చెప్పిన వివరాలు పెద్దగా లేవు. శాసనమండలి, శాసనసభల స్థానాల హెచ్చింపు, రాజ్యసభ సభ్యులకు రాష్ట్రాల కేటాయింపులో జరిగిన మార్పులు వంటి అంశాలే అందులో వినిపిస్తున్నాయి. కానీ ఇవి ప్రజల ప్రయోజనాలు, అభివృద్ధిలో పెద్దగా సంబంధంలేనివే. అంతర్రాష్ర్ట సమస్యల మీద సరైన నిర్ణయాలు తీసుకోకుండానే హడావుడిగా విభజన బిల్లును పార్లమెం ట్లో ఆమోదింపచేసుకున్నారని విపక్షాలన్నీ కాంగ్రెస్ మీద విరుచుకుపడుతు న్నాయి. కానీ, అవే లోపాలను సవరిస్తానని చెబుతున్న వెంకయ్య నాయుడు గారి పాత్ర కూడా అందులో చాలా ఉందని ఎన్డీఏకు నాయకత్వం వహి స్తున్న బీజేపీ గుర్తించాలి. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి, పారదర్శకంగా వ్యవహరించి ఉంటే ఇవాళ ఈ వ్యవహారం ఇట్లాంటి మలుపు తిరిగి ఉండేది కాదు. ఎంతసేపూ రాష్ర్ట విభజన మీద ‘మీ వైఖరి స్పష్టం చెయ్యండి!’ అని ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టే ఎత్తుగడ తప్ప భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యల మీద కాంగ్రెస్ ఏనాడూ దృష్టి పెట్టలేదు. కాబట్టే అక్కడా, ఇక్కడా ఆ పార్టీ శిక్ష అనుభవిస్తోంది. ఇక బీజేపీ విషయం చూస్తే, ‘ఆనాడు మా వెంకయ్యనాయుడు గట్టిగా నిలబడి ఉండకపోతే విభజిత ఆంధ్రప్రదేశ్ అన్యాయమైపోయి ఉండేది!’ అని మాట్లాడుతున్నది. ఈ ఎనిమిది నెలల కాలంలో రెండు కేంద్ర మంత్రిపదవులు మినహాయిస్తే, ఆంధ్రప్రదేశ్‌కు ఆ పార్టీ చేసిందేమిటి? ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఐదు కాదు, పదేళ్లు ఉండా ల్సిందేనని రాజ్యసభలో అంత గట్టిగా మాట్లాడి, అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేత మౌఖిక హామీ పొందిన వెంకయ్యనాయుడు ఇప్పు డేమో ‘ప్రత్యేక హోదా చాలా కష్టం, అన్ని రాష్ట్రాలూ అంగీకరించాలి’ అని పదేపదే చెబుతున్నారు. మిత్రపక్షం తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నోటితో కూడా చెప్పిస్తున్నారు. చంద్రబాబునాయుడయితే ఇంకాస్త ముందుకు పోయి, కేంద్రం కష్టాల్లో ఉంది కాబట్టి మనం ఇప్పుడే ఒత్తిడి చేసి ఇబ్బంది పెట్టొద్దు అని మంత్రివర్గ సహచరులతో చెబుతున్నారు. దీనిలో మతలబు ఏమై ఉంటుంది? మెజారిటీ రాష్ట్రాలు బీజేపీ చేతుల్లోనో, దాని మిత్రపక్షాల చేతుల్లోనో ఉన్నాయి. ఇంకొన్ని కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. అలాంటప్పుడు ముఖ్యమంత్రులను ఒప్పించి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇప్పించడం వారికి ఎందుకు అంత దుస్సాధ్యమయింది? సాగర్‌లో కొట్టుకుపోయిన పరువు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం లోపభూయిష్టంగా ఉన్నదన్న విషయంలో ఎవరికీ సందేహాలు ఉండనవసరం లేదు. ఆ కారణంగానే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చాలా విషయాలలో స్పష్టత లోపించి ఉద్రిక్తతలు, ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. తమ తమ రాష్ట్రాలలో ప్రజల మెప్పు పొందడం కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ వీటికి పరోక్షంగానే అయినా మద్దతు పలుకుతున్నారు. తొలిరోజులలో ఆంధ్రప్రదేశ్ అధికారు లను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకోవడం నుంచి మొదలై, మొన్న శుక్రవారం నాగార్జునసాగర్ డ్యాం మీద నీటి విడుదల కోసం ఇరు రాష్ట్రాల అధికారులూ, పోలీసులూ తన్నుకులాడిన పరువు తక్కువ ఘటన వరకూ నిందించవలసినది రెండు ప్రభుత్వాలనూ, వాటి ముఖ్యమంత్రులనే. ఇద్దరు ముఖ్యమంత్రులకూ సమాచారం లేకుండానే ఈ ఘటనలన్నీ జరుగుతు న్నాయా? నాగార్జునసాగర్ డ్యాం దగ్గర జరిగిన సంఘటన ఎటువంటిది? యావత్ భారతదేశం ముందు రెండు తెలుగు రాష్ట్రాలకూ తలవంపులు తెచ్చిన సంఘటన. రెండు రాష్ట్రాల అధికారులూ, పోలీసులూ ఒకరినొకరు తిట్టుకున్నారు. తోసుకున్నారు, లాఠీ చార్జ్ చేసుకున్నారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. కంట్రోల్ రూం మీద దాడి చేసి, తలుపులూ, కిటికీలూ బద్దలుకొట్టుకున్నారు. ఇటువంటి చిల్లరమల్లర పనులకు పాల్పడే అల్లరి మూకలను నియంత్రించే నైతిక హక్కు ఇకపై ఈ రెండు రాష్ట్రాల పోలీసులకు ఏం మిగిలింది? ఆరంభంలోనే పరిస్థితిని చక్కబరచకపోగా, పరువంతా పోయాక ముఖ్యమంత్రులు ఇరువురూ గవర్నర్ సమక్షంలో సమస్యను పరి ష్కరించుకుందాం అని ఫోన్లో మాట్లాడుకున్నారు. మరునాడు ఉద యమే రాజభవన్లో గవర్నర్ నరసింహన్ సమక్షంలో మాట్లాడుకున్న ముఖ్య మంత్రులు అన్ని వివాదాలనూ శాశ్వతంగా పరిష్కరించుకోడానికి చర్చలు జరుపుకోవాలని నిర్ణయానికి రావడం ఆహ్వానించదగ్గ పరిణామమే. ఆ వెంటనే రెండు రాష్ట్రాల నీటి పారుదల మంత్రులు రెండు రాష్ట్రాల పంటలకు నష్టం జరగకుండా చూస్తామని మీడియా ముందు ప్రకటించడమూ సంతోషించదగ్గ పరిణామమే. అయితే, ఇది మొదట్లోనే ఎందుకు జరగలేదు? ఇంతకీ ఈ మాటకు ఇరువురూ కట్టుబడి ఉంటారా అన్నది కూడా సందేహం. శుక్రవారం నాగార్జునసాగర్ డ్యాం మీద జరిగిన ఘటన విషయంలో ఇరు రాష్ట్రాల పొలీస్ డెరైక్టర్స్ జనరల్ పట్ల గవర్నర్ నరసింహన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు, వివరణ కోరినట్టు మీడియాలో వార్తలొచ్చాయి. నిజంగా ఈ వ్యవహారం ఇరువురు ముఖ్యమంత్రులకు ఎప్పటికప్పుడు సమాచారం అంద కుండానే జరిగిపోయి ఉంటే, ఇద్దరు డీజీపీలను వివరణ కోరడం కాదు, బాధ్యతా రాహిత్యం కింద పదవుల నుంచి తొలగించాల్సి ఉంటుంది కదా! కాంగ్రెస్ తప్పిదాలు పునరావృతం కారాదు ఇదంతా ఉదహరించడానికి కారణం రాష్ర్ట విభజన చట్టం లోపభూయిష్టంగా ఉందని చెప్పడానికే. ఇక ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే కేంద్రం నోరు మెదపదు. ప్రధానమంత్రి మాట్లాడరు, కేంద్ర హోంమంత్రి పెదవి విప్పరు. వెంకయ్యనాయుడు మాత్రం విభజన బిల్లులో మార్పులు తేవలసి ఉంది అని గత నాలుగైదు మాసాలుగా పాడిన పాటే పాడుతున్నారు. కేంద్రం లో కీలక స్థానంలో ఉండి వెంకయ్యనాయుడు ఈ ఎనిమిది మాసాలలో రెండు మాటలు మాత్రమే మాటిమాటికీ చెబుతున్నారు. అందులో మొదటిదే - ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కష్టం. విభజన చట్టంలో సవరణలు అవసరం అన్నది రెండో మాట. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో మార్పులు రెండు రాష్ట్రాల మంచి కోసం చెయ్యదలిస్తే ఆహ్వానించవలసిందే. అయితే కాంగ్రెస్ హయాంలో జరిగిన తప్పు మళ్లీ చెయ్యకుండా రెండు రాష్ట్రాల ముఖ్యమం త్రులతో పాటు అన్ని ప్రతిపక్షాలను ఒకచోట కూర్చోపెట్టి సావధానంగా వారి వారి వాదనలు కూడా విని పారదర్శకంగా వ్యవహరిస్తే అందరికీ మంచిది. ఎలాగూ ఆంధ్రప్రదేశ్‌లో తన మిత్రపక్షమే అధికారంలో ఉంది. బీజేపీ తానూ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది కాబట్టి సమస్య లేదు. ఎన్డీఏ దిశగా టీఆర్ఎస్? ఇక మిగిలింది తెలంగాణ రాష్ర్టం. అక్కడి ప్రభుత్వాన్నీ తన దారికి తెచ్చుకునే ప్రయత్నంలో మోదీ - షా ద్వయం పడిందని జాతీయ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. ఆ మేరకు తెలంగాణ లోని అధికార పార్టీ టీఆర్ఎస్, భార తీయ జనతా పార్టీల నాయకుల స్వరాలలో మార్పు కూడా ప్రస్ఫుటమ వుతున్నది. వచ్చే ఏప్రిల్‌లో కేంద్ర మంత్రివర్గంలో జరిగే మార్పులలో టీఆర్ఎస్కు చెందిన ఇద్దరు పార్లమెంట్ సభ్యులకు స్థానం దక్కబోతున్నదనీ, ఇటు తెలంగాణ ప్రభుత్వంలో ఇద్దరు బీజేపీ సభ్యులు చేరబోతున్నారనీ వార్తలొస్తున్నాయి. పేర్లు కూడా దాదాపు ఖరారైనట్టే. తెలంగాణ జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత , టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె .కేశవరావు కేంద్రంలో చేరితే బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ రాష్ర్ట ప్రభుత్వంలో చేరవచ్చు. సమస్యలు పరిష్కరించడం సాధ్యం కానప్పుడు ఇది మంచి ఉపాయం కదా! రెండు తెలుగు రాష్ట్రాలలో మిత్రపక్షాలే కొలువై వుంటే ఇంకేం కావాలి! ఇదే జరిగితే త్వరలో మనం తెలంగాణ ముఖ్యమంత్రి కూడా తన పొరుగు రాష్ర్ట ముఖ్యమంత్రి వలెనే కేంద్రం కష్టాలలో ఉంది, మనం ఒత్తిడి చేయవద్దు, ఇబ్బంది పెట్టవద్దు అని సహచరులను కూర్చో బెట్టుకుని బోధలు చేయడం చూడవచ్చు! datelinehyderabadgmail.com -
దోషమంతా రాజయ్యదేనా?!
డేట్లైన్ హైదరాబాద్ మొదటి నుండీ రాజయ్య పట్ల ముఖ్యమంత్రి తీరు కొంత అభ్యంతరకరమే. కాళోజీ శత జయంతి వేడుకలలో వేదిక మీదనే ఆయనను అవమానించడం మరచిపోలేం. వరంగల్‌లో వైద్య విశ్వవిద్యాలయం ఎట్లా సాధ్యం? పనికిరాని ముచ్చట్లు చెప్పవొచ్చునా? అని రాజయ్యను ఆక్షేపించారు. ఆ తరువాత ముఖ్యమంత్రే స్వయంగా అదే విషయాన్ని ప్రకటించారు. అక్కడి నుండి మొదలైంది వ్యవహారమంతా. చివరికి ప్రజల ముందు పెట్టని అవినీతి ఆరోపణలకు, స్వైన్‌ఫ్లూను ఎదుర్కొనలేకపోయిన తీరును జోడించి రాజయ్యకు ఉద్వాసన పలికారు. రాష్ర్ట గవర్నర్లు శాసనసభల్లో ప్రసంగించినా, రిపబ్లిక్ డే సందర్భంగా జెండా వందనంలో మాట్లాడినా ‘నా ప్రభుత్వం’ అంటూ తమ ఉపన్యాసాలు మొదలు పెడతారు. మన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు మాత్రం ఒకేసారి రెండు రాష్ట్రాల్లో ‘నా ప్రభుత్వం’ అని సంబోధిస్తూ మాట్లాడే అవ కాశం లభించింది. జనవరి 26 ఉదయం ఆయన విజయవాడలో ఆంధ్ర ప్రదేశ్ రిపబ్లిక్ దినోత్సవాల్లో పాల్గొని, వెంటనే హైదరాబాద్ చేరుకొని అక్కడా తెలంగాణ రిపబ్లిక్ దినోత్సవాల్లో పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా ఆయనకు ఆ అరుదయిన అవకాశం లభించింది. శాసన సభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ చేసే ప్రసంగాలను రాష్ర్ట ప్రభుత్వమే తయారుచేసి మంత్రివర్గం ఆమోదం తీసుకుని మరీ ఖరారు చేస్తుంది. గవర్నర్ అదే ప్రసంగాన్ని శాసనసభలో చదువుతారు. రిపబ్లిక్ దినోత్సవం నాటి గవర్నర్ ప్రసంగాన్ని అట్లా ప్రభుత్వమే తయారు చేయక పోయినా, అది పంపిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాల ఆధారం గానే రాజభవన్లో రిపబ్లిక్ డే ప్రసంగం తయారవుతుంది. సాధారణంగా అది కూడా ఆ రాష్ర్ట ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతిని, ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించేదిగానే ఉంటుంది. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్ దినోత్సవ వేడుకల సందర్భంగా మాట్లాడుతూ గవర్నర్ నరసింహన్ తన ప్రభుత్వం అవినీతి రహిత బంగారు తెలంగాణను అందిస్తుందని చెప్పారు. అవినీతి అంశంపైనే ఉప ముఖ్య మంత్రి డాక్టర్ రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించిన మరునాడే గవర్నర్ రాజకీయ అవినీతి నిర్మూలన తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంగా ఉంటుందని చెప్పడం యాదృచ్ఛికమే కావచ్చు. కానీ అది తెలంగాణ సమాజంలోకి కొన్ని సంకేతాలు వెళ్లడానికి దోహదపడిందనే చెప్పాలి. రాజకీయ అవినీతిని కచ్చితంగా పట్టిపల్లార్చవలసిందే. అందులో రెండో అభిప్రాయం ఎవరికీ ఉండదు. పూర్తి అవినీతి రహిత పాలన నెలకొన్నప్పుడే దాన్ని సమర్థవంతమైన పాలనగా గుర్తించాల్సి ఉంటుంది. సమాధానం ఇచ్చుకునే అవకాశమైనా ఇవ్వరా? రాజకీయ అవినీతి రాజయ్యతోనే ఆరంభం అయిందా? ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించడంతోనే అంతమైపోబోతున్నదా? దేశంలో, రాష్ర్టం లో ఎంతో కాలంగా రాజకీయ అవినీతివేళ్లూనుకుని ఉన్నది కాబట్టి రాజయ్య వంటి నాయకులు అవినీతికి పాల్పడితే క్షమించెయ్యాలని ఎవరూ అనరు. కాకపోతే ఆయనపై ఉన్న ఆరోపణలు రుజువు కాకుండానే, కనీసం వాటికి సమాధానం ఇచ్చుకునే అవకాశమైనా ఇవ్వకుండానే నిర్దాక్షిణ్యంగా ఒక ఉపముఖ్యమంత్రిని హఠాత్తుగా బర్తరఫ్ చేశారు. కాబట్టే ఈ ప్రశ్నలు అడగవలసి వస్తున్నది. మంత్రివర్గంలోకి ఎవరిని చేర్చుకోవాలి, ఎవరిని తొలగించాలి అన్న విష యంలో ముఖ్యమంత్రికి ఉన్న పూర్తి అధికారాన్ని ఎవరూ ప్రశ్నించడానికి లేదు. అయితే మంత్రివర్గంలో ఉన్నవారంతా ముఖ్యమంత్రి అభీష్టం మేరకు ఉన్నవాళ్లే. కాబట్టి వారిపై తీసుకునే చర్యల గురించి చర్చించే హక్కు ప్రజలకు ఉంటుంది. రాజయ్యను తొలగించడం నిర్దాక్షిణ్యమని ఎందుకు అనాల్సివ స్తోందంటే మంత్రి వాదన వినడానికి సమయం కూడా ఇవ్వకుండా ముఖ్య మంత్రి ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రజా ప్రతినిధిని, ఉపముఖ్యమంత్రిని బర్తరఫ్ చేశారు. ఇదేమిటని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది, వారి తరఫున అడిగే హక్కు ప్రతిపక్షాల వారికీ ఉంది. అలా అని తెలంగాణ తెలుగుదేశం శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు లాగా ప్రతిపక్షాల వారు తలాతోకా లేని విమర్శలు చెయ్య కూడదు. 1999లో చంద్రబాబు నాయుడు అవినీతి ఆరోపణల కారణంగానే కే చంద్రశేఖరరావును మంత్రి పదవి నుంచి తొలగించారనడం దయాకర్‌రావు రాజకీయ అనుభవానికి తగ్గ మాట కాదు. ఒక వేళ కేసీఆర్ నాడు ఆ కారణం గానే మంత్రి పదవిని కోల్పోయి ఉంటే, ఇప్పుడు ముఖ్యమంత్రిగా తన మంత్రివర్గంలో ఎవరు అవినీతికి పాల్పడినా చూస్తూ ఊరుకోవాలని ఆయన చెప్పదల్చుకున్నారా? అదలా ఉంచితే, దయాకర్‌రావు మాటలు నిజమైతే అదే అవినీతిపరుడిని చంద్రబాబు తన ప్రభుత్వ డిప్యూటీ స్పీకర్‌గా ఎలా ఉంచుకున్నారు? 1999లో జరిగిందేమిటో అందరికీ తెలుసు. కేసీఆర్ సామా జిక వర్గానికే చెందిన ఐపీఎస్ అధికారి, ిసీబీఐ మాజీ ైడెరైక్టర్ విజయ రామారావును మంత్రివర్గంలో చేర్చుకోవడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ట పెరుగు తుందనేది నాటి చంద్రబాబు ఆలోచన. క్లిష్ట సమయంలో తన వెంట ఉన్న నాయకులను కాదని చంద్రబాబు ఆ రోజుల్లో తటస్థులను తెచ్చి అందలం ఎక్కించారన్నది జగమెరిగిన సత్యం. చంద్రబాబు వ్యవహార శైలి దయాకర్‌రావుకు తెలియదనుకోవాలా? రాజయ్య రాజకీయ భవిత ప్రశ్నార్థకమే ఇంతకూ రాజకీయ రాజకీయ భవిష్యత్తు ఏమిటి? వరంగల్ జిల్లాకు చెందిన డాక్టర్ రాజయ్యకు పిల్లల ైవైద్యుడిగా మంచి పేరు ఉండేది. రాజయ్య స్థానంలో వరంగల్ పార్లమెంట్ సభ్యులు కడియం శ్రీహరిని మంత్రివర్గంలోకి చేర్చుకున్నారు. స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గం నుంచి రాజయ్య కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీహరిని ఓడించి గెలుపొందారు. తరువాత టీఆర్ఎస్లో చేరి పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికలో కూడా శ్రీహరిపై గెలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా అదే నియోజకవర్గం నుంచి ఆయన 2014లో మూడోసారి గెలుపొందారు. అవినీతి ఆరోపణలు రుజువు కావడం కాదుగదా, కనీసం ఆయన వాదనైనా వినకుండా ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి రాజయ్యను తొలగించి, నిన్నటి దాకా ఆయనకు ప్రత్యర్థిగా ఉన్న నాయకుడినే ఆ స్థానంలో నియమించడం వల్ల ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థ్ధకంగా మారడం నిజం కాదా? అవినీతి ఆరోపణలపై తమ ప్రభుత్వం మంత్రివర్గం నుంచి తొలగింపునకు గురైన రాజయ్యకు 2019లో తెలంగాణ రాష్ర్ట సమితి అసెంబ్లీ టికెట్ ఇస్తుందా? లేక అదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన శ్రీహరికి టికెట్ ఇస్తుందా? ఇదేమీ లక్ష కోట్ల డాలర్ల ప్రశ్న కాదు. రాజీనామాలు, ఉప ఎన్నికలు అచ్చి వచ్చాయా? కడియం శ్రీహరి పరిపాలన అనుభవం ఉన్న నాయకుడే. ఆయన, ముఖ్య మంత్రి కేసీఆర్ తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రులుగా కలసి పనిచేసిన వారే. విద్య, భారీ నీటి పారుదల వంటి శాఖలను నిర్వహించిన అనుభవం శ్రీహరికి ఉంది. పైగా డాక్టర్ రాజయ్య సామాజిక వర్గానికే చెందిన దళిత నాయకుడు కూడా. కాబట్టి శ్రీహరిని తన మంత్రివర్గంలో ప్రధాన స్థానంలో చేర్చుకోవాలన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నిర్ణయాన్ని ఆక్షేపించవల సిన అవసరం లేదు . కాకపోతే ఇప్పుడు శ్రీహరికి శాసన మండలి సభ్యునిగా స్థానం కల్పించాలి. ఇప్పటికే ఒక ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీతో బాటు, హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి కూడా మండలి సభ్యులుగానే మంత్రి వర్గంలో ఉన్నారు. తెలుగుదేశం నుండి తీసుకొచ్చి నేరుగా మంత్రి పదవిలో కూర్చోపెట్టిన తుమ్మల నాగేశ్వర్రావు ఇప్పటికే శాసనమండలి సభ్య త్వం కోసం క్యూలో నిలబడి ఉన్నారు. ఇప్పుడు శ్రీహరి కూడా ఆ వరుసలో నిలబడాలి. శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ పార్లమెంటు స్థానానికి అనవసరపు ఖర్చుతో కూడుకున్న ఉప ఎన్నిక ఇప్పుడు అవసరమా? రాజీనామాలు, ఉప ఎన్నికలు మాకు కొత్తేమీ కావు, పైగా అచ్చివొచ్చా యని టీఆర్ఎస్ నేతలు వాదించవచ్చు. కానీ వీటన్నిటికీ కారణమయిన డాక్టర్ రాజయ్య ఉద్వాసన తీరు మాత్రం సమర్థనీయంగా లేదు. ఆయన వాదనా వినలేదు. ఆయన అవినీతిని ప్రజల ముందు పెట్టి తప్పు చేశాడని నిర్ధారించనూ లేదు. మొదటి నుండీ డాక్టర్ రాజయ్య పట్ల ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరు కొంత అభ్యంతరకరంగానే కొనసాగింది. కాళోజీ శత జయంతి వేడుకలలో వేదిక మీదనే ముఖ్యమంత్రి రాజయ్యను అవమానిం చిన సంఘటన మరచిపోలేం. వరంగల్‌లో వైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటు ఎట్లా సాధ్యం? అది అయ్యే పనేనా? పనికిరాని ముచ్చట్లు చెప్పవొచ్చునా? అని డాక్టర్ రాజయ్యను ఆయన ఆక్షేపించారు. ఆ తరువాత ముఖ్యమంత్రే స్వయంగా అదే విషయాన్ని ప్రకటించారు. అక్కడి నుంచి మొదలైంది వ్యవహారమంతా. చివరికి ప్రజల ముందు పెట్టని అవినీతి ఆరోపణలకు, స్వైన్‌ఫ్లూను సకాలంలో సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయిన తీరును జోడించి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య పదవిని ఊడగొట్టారు. ఈ ఉద్వాసనతో ముఖ్యమంత్రి అవినీతిని సహించని చండశాసనుడని కొద్ది రోజులు చెప్పుకోవచ్చు. కానీ బీరువాలో ఇంకెన్ని కంకాళాలు ఉన్నాయో! అవి బయటపడిన నాడు కింకర్తవ్యమ్. ఈ లోగా ఒక నాయకుడి రాజకీయ భవితవ్యాన్ని అగాధంలోకి నెట్టినట్టే కదా! datelinehyderabad@gmail.com -
ఒకటే పాట... ‘చంద్రుల’ నోట
డేట్లైన్ హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ హయాంలో ‘వారుణి వాహిని’ పేరిట ప్రభుత్వ సారాయిని ఆకర్షణీయమైన సీసాలలో అందించడం తెలిసిందే. అప్పుడు సైతం పల్లెల్లో, హైదరాబాద్ పాతబస్తీలో గుడుంబా పారలేదా? ప్రభుత్వ సారాయితో గుడుంబా దందా దానికదే మూతపడుతుందా? తెలంగాణలో ఎక్కడెక్కడ గుడుంబా స్థావరాలున్నాయో ఆబ్కారీ అధికారులకు తెలియదా? ఆ శాఖను సరిగా పనిచేయించి, గుడుంబాను నిర్మూలించాల్సింది పోయి... చట్టబద్ధంగా సారాయిని ప్రవహింపజేయాలని సీఎం కేసీఆర్ భావించడం దురదృష్టం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కొత్త ప్రభుత్వాలు రెండూ ఈ ఏడు మాసాల కాలంలో ప్రకటించిన కార్యక్రమాలు ఎటువంటివి? అవి అభివృద్ధి కార్యక్రమాలా? సంక్షేమ పథకాలా? అవన్నీ అమలు చెయ్యడానికి ఎంత కాలం పడుతుంది? ఎంత పెద్ద ఎత్తున నిధులు కావాలి? అనే చర్చ ఇప్పుడు అక్కడా, ఇక్కడా జోరందుకున్నది. అక్కడా ఇక్కడా ప్రతిపక్షాలు మాట్లాడు తూనే ఉన్నాయి. రెండు ప్రభుత్వాలు ప్రతిపక్షాలు చెప్పే మాటలు వినే స్థితిలో లేవు. అధికారంలోకి వచ్చిన ఊపులో వాళ్లు చేస్తున్న వాగ్దానాల అమలుకు లక్షల కోట్ల రూపాయల నిధుల అవసరం వారికి గుర్తుకు రావడం లేదు. తెలంగాణ రాష్ర్ట ఆదాయం అంతంత మాత్రంగా ఉంటే, ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్‌తో ప్రయాణం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎక్కడి నుండి వస్తాయో తెలియదు కానీ, మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. తెలంగాణలో అధికార పార్టీ ప్రతిపక్షాలను పట్టించుకునే స్థితిలో లేదు. ప్రజా తీర్పు ఆ పార్టీని నేల మీద నిలవనీయడం లేదు. దూకుడుగా ముందుకుపోతూ, ప్రతిపక్షాల దుకాణాలు ఖాళీచేసే పనిలో పడింది. ఇక మిగిలిన అరకొర నాయకుల మాట ఏం వింటుంది? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి భిన్నమయింది. అక్కడ ఉన్న ఏకైక ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చెయ్యాలనే ఆలోచనలో అధికార పక్షం ఉన్నా, సాధ్యపడక రాష్ర్టంలో ప్రతిపక్షమే లేదని కళ్ళు మూసుకుని, తనను తాను నమ్మించుకునే ప్రయ త్నంలో పడింది. వెరసి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు ఎవరి మాటా వినే స్థితిలోలేవు. ఎన్ని లక్షల కోట్ల విలువ చేసే వాగ్దానాలు చేస్తేనేం? వాటి అమలు కోసం అడిగే వాళ్లేరి? అన్న ధీమాతో ఉన్నాయి. ప్రభుత్వ సారా మూడు విధాల మేలు సుదీర్ఘ పోరాటం తరువాత సాధించుకున్న తెలంగాణ రాష్ర్టం విషయమే చూద్దాం. టీఆర్ఎస్ ప్రభుత్వ అధినేత చంద్రశేఖర్‌రావు కేవలం హైదరాబాద్ నగరానికి సంబంధించి ప్రకటించిన పథకాలకు రెండు లక్షల కోట్ల రూపా యలు అవసరమని అంచనా. నిజంగానే వాటిని అమలు చేయడం మొదల యితే ఈ మొత్తం ఇంకా పెరగవచ్చు. తెలంగాణ రాష్ర్ట బడ్జెట్ లక్ష కోట్ల రూపాయలు కాగా, అందులో ప్రణాళికా వ్యయం 48 వేల కోట్లు. వచ్చే నాలు గేళ్ల ప్రణాళికా నిధులన్నింటినీ హైదరాబాద్‌కే కేటాయించినా ప్రభుత్వం ప్రకటించిన పథకాల అమలుకే సరిపోవు. ఇక జిల్లాలను ఏం పెట్టి అభివృద్ధి చేస్తారన్న ప్రతిపక్షాల విమర్శను వినే స్థితిలో తెలంగాణ ప్రభుత్వం లేదు. నిధుల సమీకరణ కోసం ప్రభుత్వం కొన్ని ఆలోచనలు చేస్తున్నట్టు ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రకటనలు చెపుతున్నాయి. అలా యోచించాల్సిందే. అది ప్రభుత్వాల బాధ్యత కూడా. కానీ అలా ఆలోచించేటప్పుడు ప్రభుత్వాలు తమ సామాజిక బాధ్యతలను మరిచిపోకూడదని ఏలిన వారికి ఎవరు గుర్తు చెయ్యాలి? సారాయిని మళ్ళీ ప్రవేశ పెట్టాలనీ, మద్యం ఉత్పత్తికి సొంత డిస్టిలరీలను ఏర్పాటు చేసుకోవాలనీ తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. రాష్ర్టంలో అమ్ముడయ్యే చాలా బ్రాండ్ల మద్యాన్ని బయటి రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకోడంవల్ల రాష్ట్రానికి ఆ పన్నులు రాకుండా పోతున్నాయని సీఎం వ్యాఖ్యానించినట్టు తెలిసింది. సొంత డిస్టిలరీల వల్ల ఆ మేరకు ఆదాయం పెరుగుదలతో పాటు, స్థానికులకు ఉపాధి లభిస్తుందని, మద్యం ధర కొంత తగ్గి వినియోగదారులకు కూడా లబ్ధి కలుగుతుందని ఆయన మూడు లాభాలు చూపించారట. సింగపూర్, డాలస్లకు రహదారి సంపూర్ణ మద్య నిషేధం ఏ ప్రభుత్వం తరమూ కాదని, మన దేశంలోనే కాక, అమెరికా వంటి దేశాల్లో కూడా గతంలో తేలిపోయింది. అయితే, వీలైనంత మేరకు ఈ వ్యాపారాన్ని నిరుత్సాహపరచడానికి ప్రయత్నించడం పాలకుల బాధ్యత. అది మరిచి, మనుషుల బలహీనత మీద జరిగే ఈ వ్యాపారం ద్వారా ఆదాయం పెంచుకోవాలన్న దుర్మార్గపు ఆలోచన తెలంగాణ ప్రభుత్వా నికి రావడం విచారకరం. సీఎం కేసీఆర్ మొన్న ఆదివారం మీడియాతో మాట్లాడుతూ సర్కారీ సారాయి మళ్ళీ ప్రవేశపెట్టే ఆలోచన బయట పెట్టారు. అక్రమ సారాయి అంటే గుడుంబాను అరికట్టడం కోసమే ఈ ప్రతిపాదన విషయం యోచిస్తున్నామని ఆయన వివరణ. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ర్టంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రభుత్వ సారాయిని ‘వారుణి వాహిని’ పేరిట అందమైన, ఆకర్షణీయమైన సీసాలలో అందించి అమ్మకాలను పెంచడం తెలిసిందే. అప్పుడు సైతం తెలంగాణ పల్లెల్లో, హైదరాబాద్ పాత బస్తీలో, ముఖ్యంగా ధూల్‌పేట ప్రాంతంలో గుడుంబా తయారీ జరగలేదా? ప్రభుత్వ సారాయితో గుడుంబా దందా దానికదే మూత పడుతుందా? తెలంగాణలో ఎక్కడెక్కడ గుడుంబా స్థావరా లున్నాయో ఆబ్కారీ అధికారులకు తెలియదా? ఆ శాఖను సరిగా పని చేయించి, గుడుంబాను సమూలంగా నిర్మూలించాల్సింది పోయి...మళ్ళీ చట్ట బద్ధంగా సారాయిని ప్రవహింపజేయాలని ముఖ్యమంత్రి భావించడం దురదృష్టం. వరంగల్ జిల్లా గరీబ్‌నగర్‌లో మహిళలు మళ్ళీ ప్రభుత్వ సారాయి తేవాలని అడిగారనో, అక్రమ సారాయి, కల్తీ సారాయి తాగి ప్రజలు ఆరో గ్యాలు పాడు చేసుకుంటున్నారనో తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ సారాయి వ్యాపారంలోకి దిగబోతోందనుకుంటే పొరపాటు. సారాయిని ఒక ఆదాయ మార్గంగా చూస్తున్నందువల్లే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయనడంలో సందేహమే అక్కరలేదు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోకి కల్లు తిరిగి ప్రవేశించింది. సీఎం కేసీఆర్ చెప్పినట్టు కొన్ని రోజుల్లో ప్రభుత్వం ఒక చర్చ జరిపి, ఒక విధానాన్ని రూపొందించి ప్రభుత్వ సారాయిని ప్రవేశ పెట్టేస్తుంది. ప్రభుత్వమే స్వయంగా మద్యం ఉత్పత్తి చేపట్టబోతున్నది కాబట్టి ఇక తెలంగాణ ప్రజలకు తాగినోళ్లకు తాగినంత, ప్రభుత్వానికి హైదరాబాద్‌ను సింగపూర్, లండన్, డల్లాస్ నగరాల స్థాయికి చేర్చే ఆకాశ హర్మ్యాలను కట్టడానికి కావలసినంత ఆదాయం. దారి తప్పుతున్న ప్రాధాన్యాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 20 సంవత్సరాల క్రితమే సంపూర్ణ మద్యనిషేధం అమలు అసాధ్యం అని రుజువువైంది. రాష్ట్రమంతా సారాయిని పారించిన ఎన్టీఆర్ 1994లో మద్యనిషేధం నినాదాన్ని ఎవరి ప్రోద్బలంతో తలకెత్తుకు న్నాడో అందరికీ తెలుసు. ఆయనను గద్దెదించిన చంద్రబాబు నాయుడు మద్య నిషేధాన్ని ఎత్తెయ్యడం వెనక కూడా అవేశక్తులు పనిచేసాయనీ తెలి సిందే. సాధ్యమైనంతవరకు మద్యపానంపై నుంచి ప్రజల దృష్టిని మళ్ళించ డానికి ప్రయత్నించడం లేదా ఆ ప్రయత్నం చేస్తూనే మద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా చెయ్యడం ప్రభుత్వాల బాధ్యత. ఆదాయాలు పెంచుకుని ఆకాశహర్మ్యాలు నిర్మించాలి కాబట్టి మద్యం ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం ఆలోచించడం అన్యాయం. ప్రజలకు ఏం కావాలి? మనం ప్రజలకు ఏం ఇవ్వాలి? అనే విషయాలను గురించి ప్రభుత్వాలు జాగ్ర త్తగా ఆలోచించాలి. అక్కడే ప్రాధాన్యతల ప్రసక్తివస్తుంది. ప్రాధాన్యతలను నిర్ణయించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం దారి తప్పుతున్నదని పెద్దలంటున్నారు. మొన్న శని, ఆదివారాల్లో హైదరాబాద్‌లో తెలంగాణ విద్యావం తుల వేదిక (తెవివే) 5వ రాష్ర్ట మహాసభలు జరిగాయి. సభలను ప్రారం భిస్తూ ప్రఖ్యాత సామాజిక ఉద్యమనేత స్వామి అగ్నివేష్ ఫిలింసిటీలా, రైతుల ఆత్మహత్యలు ఆపడమా? ఏది ముఖ్యం? అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం దారి తప్పుతున్నదనడానికి ఆ మాటలు చాలు. తెవివే కూడా సభల ముగింపు సందర్భంగా ఫిలింసిటీలు, ఫార్మాసిటీలు వద్దని హితవు పలుకుతూ తీర్మానాలు చేసింది. తెవివే, స్వామి అగ్నివేష్‌లు తెలం గాణ రాష్ర్ట ఉద్యమంలో అధికార పార్టీ టీఆర్ఎస్ వెంట, దాని నాయకుడూ, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట వెన్నుదన్నుగా నిలిచిన వారేనని మరువ కూడదు. ప్రతిపక్షాల మాట వినకపోతే పోయారు కనీసం అగ్నివేష్ మాటల యినా ఆలకించండి. విద్యావంతుల వేదిక వినతి అయినా వినండి. datelinehyderabad@gmail.com -
గతం మిథ్య.. విపక్షం మిథ్య
డేట్లైన్ హైదరాబాద్ అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ప్రతిపక్షం అనే మాటకూ, ప్రజాస్వామ్యానికీ ఉన్న అర్ధాలను మార్చేస్తుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 294 స్థానాలు కలిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాన్ని గౌరవించడం లేదని, ఆయన మామగారు ఎన్.టి. రామారావు అసెంబ్లీలోకి అడుగుపెట్టనని భీషణ ప్రతిజ్ఞ చేసిన నాడు ఆ బాధ్యత తాను తీసుకుని అసెంబ్లీలో ఎన్నిసార్లు ప్రతిపక్షం అవసరం గురించి మాట్లాడారో చంద్రబాబు ఒక్కసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన సంవత్స రంలో ఒక కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇకైపైన ప్రతి శనివారం తమ పార్టీ శాసనసభ్యులను కలుసుకోవడానికే రోజంతా కేటాయించాలని నిర్ణయించారు. అందులో భాగంగా గత శనివారం ఆయన ఓ 30 మంది శాసనసభ్యులతో విడివిడిగా లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో సమావేశమై వారి సమస్యలు విన్నారు. పనిలో పనిగా కొంత మంది నాయకులతో కలసి మేధోమథనం కూడా చేశారు. ఈ మేధోమథనానికి ప్రాతిపదిక ఆరునెలల తన ప్రభుత్వ పనితీరు మీద చేయిం చిన సర్వేలో వెల్లడైన ఫలితాలు. ఇందులో విశేషం ఏమీ లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా తన పనితీరు మీద ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు ఇటువంటి సర్వేలు చేయించుకోవడం సహజం. అధికార పార్టీకి ఇది మరీ అవసరం. ఈ కార్యక్రమం అంతటినీ పత్రికలు నివేదించాయి. ఒకటి రెండు పత్రికలు ఈ సమావేశాల గురించి రిపోర్ట్ చేసిన తీరు, రాసిన వివరాలు చూసిన వారెవరయినా ప్రజాస్వామ్యం ఇట్లా ఉంటుందా లేక తెలుగు దేశం అధినేత, ఆయనను, ఆయన పార్టీని సమర్ధిస్తున్న మీడియా పెద్దలు ప్రజా స్వామ్యానికి కొత్త భాష్యం చెబుతున్నారా అని ఆశ్చర్యపోక మానరు. ఏపీలో ప్రతిపక్షం లేదట... ఇంతకూ ఆ పత్రిక ఏం రాసిందంటే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం లేదు, అట్లా అని మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు, స్వీయ సమీక్షలు చేసుకుందాం అని ముఖ్య మంత్రి తన పార్టీ నాయకులకు హితబోధ చేసినట్టుగా ఆ పత్రిక రాసింది. పైగా నేనట్లా అనలేదు అని ముఖ్యమంత్రి ఖండించలేదు కాబట్టి ఆయన అదే మాట అని ఉంటారన్నది ఖాయం. దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి అందులో ఎనిమిది సంవత్స రాలకు పైబడిన పరిపాలనానుభవం కలిగి, ఢిల్లీ పీఠం మీద ప్రధానమంత్రు లను ప్రతిష్టించి మరో పదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్షం అంటే ఏమిటో ఎవరూ చెప్పనక్కరలేదనుకుంటా. కానీ ఆయన అట్లానే మాట్లాడుతున్నారు. 67 మంది శాసనసభ్యులు, 8 మంది పార్ల మెంట్ సభ్యులతో ఏకైక బలమైన ప్రతిపక్షం శాసనసభలో తన కళ్లెదుట కనిపి స్తున్నా కూడా చంద్రబాబు నాయుడూ, ఆయనను గుడ్డిగా సమర్ధించడమే ధ్యేయంగా పెట్టుకున్న మీడియాలోని ఒక వర్గం కళ్లు మూసుకుని ఇదే నిజం, ఇక్కడ ప్రతిపక్షం లేదు అని పదే పదే జపం చేస్తే ప్రతిపక్షం లేకుండా పోతుం దా? తమను తాము నమ్మించుకునే ప్రయత్నంలో ఆత్మవంచన చేసుకోగలరేమో కాని ప్రజలను నమ్మించలేరు కదా! నిజానికి ఎక్కువ కాలం ప్రతిపక్షంలోనే ఉన్న అనుభవం కలిగిన చంద్రబాబునాయుడుకే బాగా తెలిసి ఉండాలి ప్రతి పక్షం అంటే ఏమిటో? ఆ పక్షం బాధ్యత ఏమిటో? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్ర ఏమిటో? గతాన్ని మరచిపోయారా? 1989 నుంచి 1994 వరకు, ఆ తరువాత 2004 నుంచి 2014 వరకూ అంటే పది హేను సంవత్సరాల పాటు శాసనసభలో ప్రతిపక్షంలో కూర్చున్న అనుభవా లను ఆయన, ఆయనను ఈ విషయంలో సమర్ధిస్తున్నవారు ఒక్కసారి నెమ రేసుకుంటే బాగుంటుంది. ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుభవం ఎంత? ఎన్ని సీట్లు గెలిచింది? చట్టసభలో దాని బలమెంత? అన్న విషయాలు పక్కన పెడితే, అసలు ప్రతిపక్షం అంటే తెలుగుదేశం పార్టీ, దాని అధినేత, ఆయన సమర్ధకుల నిఘంటువులో ఏం రాసి ఉందో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రజాస్వామ్యాన్ని గౌరవించే, అభిమానించే, దానినే జీవన విధానంగా ఎంచు కుని బతుకుతున్న వారిలో కలగడం సహజం. అవసరాన్ని బట్టి అర్థాలు మారతాయా? అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ప్రతిపక్షం అనే మాటకూ, ప్రజాస్వామ్యా నికీ ఉన్న అర్థాలను మార్చేస్తుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 294 స్థానాలు కలిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాన్ని గౌరవించడం లేదని ఆయన మామగారు ఎన్.టి.రామారావు అసెంబ్లీలోకి అడుగు పెట్టనని భీషణ ప్రతిజ్ఞ చేసిన నాడు ఆ బాధ్యత తాను తీసుకుని అసెంబ్లీలో ఎన్నిసార్లు ప్రతిపక్షం అవసరం గురించి మాట్లాడారో చంద్రబాబు ఒక్కసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది. చాలా ఏళ్లు గడిచాయి కాబట్టి అది ఆయనకు గుర్తుండక పోవచ్చు. తాజాగా ఏడుమాసాల క్రితం వరకు కూడా పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి ఎన్నిసార్లు ప్రతిపక్షం ప్రాధాన్యం గురించి, ప్రజాస్వామ్యంలో దాని అవసరాన్ని గురించి ఉపన్యాసాలు ఇచ్చారో అసెంబ్లీ రికార్డులు చూస్తే తెలుస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయనను సమర్ధించే వారు ముఖ్యంగా కొన్ని మీడియా సంస్థల పెద్దలు సమయానుకూలంగా నిర్వచనాలు మార్చేస్తూ ఉంటారనడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో 1980, 1990 దశ కాలలో జరిగిన రెండు ఆగస్టు సంక్షోభాలు, రెండు ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమాలు గొప్ప ఉదాహరణగా నిలుస్తాయి. 1984లో ఎన్.టి. రామారావు మీద తిరుగుబాటు చేసిన నాదెండ్ల భాస్కరరావు వీరి దృష్టిలో ప్రజాస్వామ్య హంతకుడు అవుతారు, అదే ఎన్.టి. రామారావును 1995 ఆగస్టులో పదవీచ్యు తుడిని చేసిన చంద్రబాబు ప్రజాస్వామ్య రక్షకుడు అవుతారు. ఇట్లా అవసరాన్ని బట్టి అర్థాలు, నిర్వచనాలు మారిపోతుంటాయి. ఇప్పుడు రాష్ర్టంలో ప్రతిపక్షం లేదన్నది కూడా అట్లాంటి అవసరం కోసమే వారు మాట్లాడుకుంటున్నారని వేరే చెప్పనక్కర లేదు. విపక్షనేతకు మాత్రం స్వేచ్ఛ లేదు రాష్ర్టంలో ప్రతిపక్షం లేదు అన్నమాటకు కొనసాగింపుగా ఆయన ఇంకేం మాట్లాడారో కూడా చూద్దాం. రాష్ర్టంలో ప్రతిపక్షం లేదనీ, కాంగ్రెస్‌కు ఉనికి లేదనీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉండదని ఆయన వ్యాఖ్యా నించడంతోపాటు, అలా అని మనం నిర్లక్ష్యంగా ఉండడం తగదని చంద్రబాబు హితవు పలికారు. సోమ వారం ప్రభు త్వం రాజధాని నిర్మిస్తానం టున్న గ్రామాల రైతులు ప్రతి పక్ష నాయకుడు జగన్మో హన్ రెడ్డిని కలుసుకుని వారి గోడు వినిపించినప్పుడు ఆయన ఈ ప్రభుత్వం రెండు మూడేళ్ల కంటే ఎక్కువ కాలం ఉండదని వ్యాఖ్యానించినం దుకు ఒక్క గంట కూడా గడ వకుండా రాద్ధాంతం మొద లు పెట్టిన తెలుగుదేశం పెద్దలు, వారిని సమర్ధిస్తున్న మీడియా మిత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉండదు అని చంద్రబాబు దిశానిర్దేశం చేసినప్పుడు అదెట్లా అని అడగలేదు ఎందుకని? ప్రతిపక్ష నాయకుడు చేసిన వ్యాఖ్య తప్పయిన ప్పుడు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్య ఒప్పు ఎట్లా అయింది? అంకెల ప్రకారమే మాట్లాడుకున్నా అధికార తెలుగుదేశం పార్టీకీ ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకీ మొన్నటి సార్వత్రిక ఎన్నికలలో వచ్చిన ఓట్ల తేడా 5 లక్షలు. అంటే రెండు శాతం మించలేదు. మరి ప్రతిపక్షం లేకుండాపోయింది ఎట్లాగో తెలుగుదేశం రాజకీయ పండితులు చెప్పాలి. ప్రజాస్వామ్యాన్ని అవమానించడం కాదా! ప్రతిపక్షాన్ని లెక్కచెయ్యక పోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించకపోవడ మన్న విషయం మన అధికార రాజకీయ నాయకులకూ, వారి పక్షం వహిస్తున్న పెద్దలకూ ఎన్నటికి అర్థం అవుతుందో? ఒక్క సీటు కూడా అసెంబ్లీలో గెలవ లేదు కాబట్టి కాంగ్రెస్‌కు ఉనికి లేదంటారు ముఖ్యమంత్రి. వామపక్షాల ఊసు లేనే లేదు. ఎన్నికల అవసరానికి వామపక్షాలతో స్నేహం చేసిననాడు వాటికి ప్రజలలో ఉండే ఆదరణ, ప్రజా సమస్యల మీద వారు చేసిన పోరాటాలు తమ అవసరానికి కావాలి, చట్ట సభలలో సీట్లు రాకపోతే మాత్రం ఆ పక్షాలు అస్తిత్వం లో లేనట్టే లెక్క. సీట్ల సంఖ్య మీద ఆధార పడి ప్రతిపక్ష పాత్ర ఉండదని, ప్రజల పక్షాన నిలబడి పోరాడే స్పృహ, దీక్ష మీద ఆధారపడి ఉంటుందని ఆయనకు అర్థం కాదు. 1999లో మొదటిసారి ఎన్నికలలో వాజపేయి, కార్గిల్ ఇమేజ్‌తో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాక శాసనసభలో భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ)కి ఒక్క స్థానం కూడా లేదని ప్రజా సమస్యల మీద అఖిలపక్షానికి పిలవని నాయ కుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. రాష్ర్ట విభజన జరిగి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక గత ఏడు మాసాలలో జరిగిన ఆ రాష్ర్ట శాసనసభ సమావేశమయిన మూడు పర్యాయాలు ప్రతిపక్షాన్ని గౌరవించే, అసలు దాని ఉనికిని భరించే స్థితిలో తెలుగుదేశం ప్రభుత్వం లేదని తేటతెల్లమయింది. ఇప్పుడు కొత్త రాజధాని నిర్మాణం కోసం జరుగుతున్న వ్యవహారం దాన్ని మరింత బలపరుస్తున్నది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని పట్టించుకోను అంటే ప్రజలే ప్రతిపక్ష మయ్యే పరిణామం చోటు చేసుకుంటుందని ఏలినవారు ఎవరయినా గుర్తిం చడం బాగుంటుంది. (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, మొబైల్: 98480 48536)